బలిచ్చేందుకు తీసుకెళ్తున్న పశువు చివరిసారిగా తాగడానికి నీళ్ళిస్తే, ఆ ఇచ్చే మనిషిని ఎంతో నమ్మేసి, తన మీద ప్రేమతోటే ఇదంతా అని నమ్మినట్టు శ్రీను తన కళ్ళముందు ఇన్ని రోజులుగా కుప్పకూలిపోయి ఈ వారమే కొద్దిగా ఊపిరి పీలుస్తున్న తన స్టాకు మార్కెట్ పోర్టుఫోలియోను నమ్మేసాడు.
ఆ రోజు సాయంత్రం ఇంటికెళ్తూ నాలుగేళ్ళుగా తననుభవించిన చెప్పుకోలేని నరకాన్నించి ఇక ఇప్పుడే విముక్తి లభించినట్టు, ఒక లిక్కర్ షాపులో ఆగి పొడుగాటిదే ఒక బ్లాక్ లేబుల్ కొనేసాడు కూడా.
చాలా రోజుల తర్వాత ఇహ తన లోపలే పెట్టుకున్న బాధంతా భార్య ముందు ఒలకబోసుకుంటూ చెప్పాడు ఫైనలుగా, ఈ ఒక్క సారి మళ్ళీ పైకొచ్చేసాక ఇహ స్టాకు మార్కెట్లో ప్లే చెయ్యకుండా బుద్ధిగా కష్ఠపడి సంపాదించిన దాన్ని ఒక స్పెషలిస్టు చేతిలోనో, ఒక ఇండెక్సు ఫండులోనో పెట్టి తన వర్కు, ఇల్లు తప్ప ఇంకేదీ పట్టించుకోనని, ఈ ఒక్కసారికీ నాలుగు పెగ్గులైనా వేస్తే క్షమించమని చెప్పి బిగించాడు ఆన్ ద రాక్స్ పెగ్గుల్ని.
రెండు లోపల పడ్డాక, ఇన్ని రోజులుగా ముభావంగా ఉంటూ వస్తున్న శ్రీనులో సడెన్‌గా ఇట్లా ఈ ఒక్క వారంలోనే వచ్చిన మార్పు చూసి ఉబ్బి తబ్బిబ్బయి తను కూడా మాంఛి చికెన్ వేపుడొకటి చేసి కంపెనీ ఇచ్చేసింది ఆ భార్యామణి. ఇట్లా ఒక దాని వెనకొకటి తన్నుకుంటూ వస్తున్న అదృష్టాలను ఒకవైపు తట్టుకోలేకపోతున్నా, గత ఏడాదిలో సెక్సు మీదక్కూడా మనసు పోక తను ఆరాట పడుతూ ఇంట్లో ఎంత కల్లోలాన్ని సృష్ఠించిందీ గుర్తుకొచ్చి, ఈ రోజు మాత్రం భార్యను సుఖపెట్టేస్తానంటూ బయల్దేరాడు కానీ పెగ్గులెక్కువయ్యాయేమో కళ్ళు త్వరగా మూతలు పడ్డాయి.
అట్లాగే కింద కార్పెటు మీద పడుకున్న శ్రీనుమీద వెచ్చగా ఉండేందుకు ఒక శాలువ కప్పు, తను ఫోనందుకుంది.
ఇంటికి ఫోను చేసి, అమ్మా నాన్నలతో ఈ శుభ పరిణామాన్ని పంచుకోవడానికి ఒక్క రోజుకూడా ఆగలేకపోతోంది మరి. ఎన్ని కష్ఠాల సుడిగిండాల్ని ఈదారు గత రెండేళ్ళుగా! ఎన్నో ఏళ్ళుగా దీక్షతో సంపాదించిన డబ్బంతా స్టాకుల్లో పెట్టి ఒక్క సారిగా అవి దిగిపోతూ ఉంటే చూడలేక, వాటిని తెగనమ్మలేక ఒకవైపు పనితో సతమతమైపోతూ, ఇంకోవైపు తమ కలలన్నీ రోజూ కొంత కరిగిపోతూ ఉంటే ఏడాది కింద ఇహ తట్టుకోలేక తల్లిదండ్రులకు చెప్పింది తను.
కూతురూ అల్లుడూ అలా నష్ఠపోతూ ఉంటే చూడలేక, చివరిగా ఒక సలహా ఇచ్చారు , ఒక సారి ఇండియా వచ్చిపొమ్మని, మరీ వత్తిడి ఎక్కువైతే ఇక్కడొకసారి తిరపతి వెళ్ళివస్తే అక్కడ అన్నీ చక్కబడతాయని.
వాళ్ళు చెప్పిందే ఆలస్యమన్నట్టు, ఇద్దరూ కలిసి సత్యనారాయణ వ్రతం చేసేసి, తిరుపతిలో తలనీలాలు ఇస్తామని మొక్కేసారు కూడా, ఈ స్టాకులు పడకుండా వుంటే.
అయినా అవి ఎవరో తరుముకొస్తున్నట్టు లోపలికి పోయ్యే వేగం ఏమాత్రం తగ్గించలేదు. తల్లిదండ్రులకు మళ్ళీ చెప్తే ఈ సారి మంత్రించిన కుంకుమ, ఆయనెవరో నాస్డాక్ బాబా గారి దగ్గర పూజ చేయించి పంపారు, ఆ రోజునించీ ఆ కుంకుమ ఇంట్లో కంప్యూటరుకు పెట్టడం మాత్రం మానలేదు. తను పూజలు చేస్తూ ఉంటే ఇదివరకు నవ్వేసే శ్రీను కూడా ఈ మధ్య నవ్వడం లేదు!
అందుకే వెంటనే ఫోనుచేసి చెప్పింది తను అమ్మా నాన్నలకు ఏ పూజల ఫలితమో కానీ మళ్ళీ మన స్టాకులు ఇప్పుడిప్పుడే పైకెక్కుతున్నాయి, ఈ సంవత్సరం తప్పక ఇండియాకు వస్తామని. వాళ్ళూ సంతోషం పట్టలేకపోయారు, తమ్ముడైతే మరీ తనక్కావలసిన వస్తువులు అప్పటికప్పుడే ఒక లిస్టు రాసి ఈ మెయిల్ చేస్తానన్నాడు.
తను ఇట్లా సంతోషాన్ని పంచుకున్నందువల్లే తన ఆనందం రెట్టింపు అయ్యిందని అమ్మకు, నాన్నకు, తమ్మునికి పేరు పేరునా కృతజ్ఞతలు చెప్పేసి ఇహ తనూ వాలింది కింద పడుకున్న శ్రీను పక్కనే.
* * * *
ఇదైన మూడు రోజులకు మంగళవారం ఆఫీసునుంచి వస్తూనే తల పట్టుకు కూర్చున్న శ్రీనును చూసి ఏమీ అర్ధం కాక కాఫీ ఇస్తూ అడిగింది, పనెక్కువైందా అని. తల అడ్డం తిప్పి, “పోయిన వారం పైకొచ్చిన స్టాకొకదాన్ని చూసి చూసి ఇంకొంత మార్జిన్ పెట్టి మళ్ళీ మళ్ళీ కొన్నాను, అది ఇవాళ ఒకే సారి పెద్ద నోస్ డైవు చేసింది ఇహ మళ్ళీ ఇంకో రెండేళ్ళైనా పడుతుంది మనం తేలేసరికి!” చావు కబురు చల్లగా చెప్పేడు.
మళ్ళీ ఇండియాకు ఫోను, తనేడ్వడం, వాళ్ళు కూడా ఓ ఏడుపు ఏడిచి ఈ సారి మేమే టిక్కెట్ కొనిపెడతాం ఒక సారి ఇద్దరినీ వచ్చి పొమ్మని చెప్పడం ఈ గొడవతో రాత్రెలా తెల్లవారిందో కూడా తెలియలేదు.
ఏ కళనున్నాడో శ్రీను ఇక సరేనన్నాడు, టికెట్లు ఇండియా నించే కొంటారని తెలిసి. వెంటనే ఆఫీసులో లీవప్లయి చెయ్యడం, టిక్కెట్లు రావడం ప్లేనెక్కడం చక చకా జరిగిపోయినయి.
* * * *
హైదరాబాదులో తమను రిసీవు చేసుకోడానికొచ్చిన తల్లి దండ్రులకు తమను చూడగానే తెలిసుండాలి ఎంతగా పీక్కు పోయారో.
వాళ్ళు పెట్టించిన ఇడ్లీ, దోశలు అయ్యాక, తనూ వాళ్ళు ఒక సారి ఏడుపు కార్యక్రమం కానిచ్చేసారు.
అమ్మే చెప్పింది, తల్లీ మనం శాంతి చేసుకోక తప్పదు, మనం ఒక యాగం చేస్తే ఈ కష్ఠాలన్నీ తీరిపోతయి అని. తనకెంత నమ్మకమున్నా ఎప్పుడూ దేవుడు, దయ్యాలు అంటే నమ్మకం లేనట్టు మాట్లాడే శ్రీనునెట్లా ఒప్పించాలో అర్ధం కాలేదు. నాన్నే అన్నాడు, ఇందులో పొయ్యేదేం లేదుగా ఒక రెండు గంటలు కళ్ళు మూసుకుంటే యాగమయిపోతుంది, మీరు వ్రతం చేసుకున్నంత టైము కూడా పట్టదు అని చెప్పు అని.
శ్రీనుతో చెప్తే ఏ కళనున్నాడో మరి, లేక ఇట్లానైనా ఆ మార్కెట్టేదో పెరగకపోతేమానె, మరీ కుప్పకూలకుండా తన వంటిమీద షర్ట్ అయినా మిగిలితే చాలుననుకున్నాడేమో వెంటనే ఒప్పేసుకున్నాడు.
* * * *
ఇక యజ్ఞం రోజు అందరికీ పట్టుబట్టలొచ్చేసినయి. తెల్లారినప్పటినించీ దగ్గర్లో ఉండే చుట్టాలతో పాటు, దూరాన్నించి దిగేవాళ్ళు ఇదీ ఒక పెళ్ళి లాగానే వచ్చేసారు. అంతకు ముందు రోజే వచ్చి వంట ఏర్పాట్లు చేసుకున్న వంటవాళ్ళతో పాటుగా, నలుగురు బ్రాహ్మలు కలిసి యజ్ఞానికి సరిపడే పదార్ధాలన్నీ చూసుకుంటూ తమని తొందర పెట్టేసారు.
ఇంత పెద్ద నగరంలో కూడా యజ్ఞమంటే ఉన్న ప్రీతి చూసి తను ముచ్చటపడిపోతూ ఉంటే, పెద్దవాళ్ళంతా ఈ పూజలూ వాటిమీద ఇంట్రస్టూ మీరు అమెరికా వెళ్ళినా తగ్గించుకోలేదంటే అసలు మిమ్మల్ని మెచ్చుకోవాలర్రా అంటూ వుంటే కొంచెం ఉబ్బి తబ్బిబ్బయిపోయింది కూడా. నాకన్నా మా ఆయనకే ఇండియా పద్ధతులంటే ఎంతో ఇష్టం. అక్కడ కూడ మేం క్రమం తప్పకుండా ప్రతి శనివారం గుడికెళ్తాం అని చెప్పింది, తను ఈ మధ్య మార్కెటు మళ్ళీ పైకెళ్తూ ఉంటే తాము వారం మధ్యలో కూడా ఎందుకైనా మంచిదని ఇంకోసారి ఎక్కువే గుడికెళ్తూన్న సంగతి కప్పి పెడుతూ.
అన్నీ అయ్యాయమ్మా, మీదే ఆలస్యం కంకణాలు కట్టుకోటానికి! అని పురమాయిస్తే శ్రీనుతో పాటు తనూ వీడియోలో అన్నీ సరిగ్గా పడేలా కూర్చుని యజ్ఞంలో నిమగ్నమైపోయింది.
అదవగానే తను ఇంట్లో పెద్దలకు నమస్కారం చేస్తూ ఉంటే, శ్రీను ఎక్కడికెళ్ళాడో తెలియక అడిగింది అమ్మను.
ఏం లేదే పూజ అయింది కదా అల్లుడుగారు క్రతువునివ్వడానికి ఇంటిముందుకు వెళ్ళాడు. అంటే అర్ధం కానట్టు చూసింది. ఏం లేదే మీ నాన్న మీకు పట్టిన ఈ మార్కెట్ శని పొయ్యేందుకు మన ఊరి నించి ఒక జీవాన్ని తెప్పించాడు, దాన్ని బలి ఇచ్చి, ఎరుపు చేస్తే మీకు పట్టిన ఈ శని విరగడవుతుంది. అమ్మ చెప్తూ ఉంటే నమ్మలేక పోయింది తను.
శ్రీను “అసలే ఈ మధ్య అమెరికాలో బీఫ్ ఎక్కువ తింటున్నారు, అది చేసిన పెనమ్మీదే చికెన్ కూడా చేస్తున్నారంటూ అసలు పూర్తిగా మాంసం మానేస్తే ఎలా వుంటుందీ” అని ఆలోచిస్తున్న వాడల్లా, తనే ఒక జంతువును బలిస్తాడంటే నమ్మలేకపోయింది. ఇంకో పది నిమిషాల్లో లోపలికొచ్చి బాత్రూములో కెళ్తున్న శ్రీను వెనకాలే నడిచి అడిగింది, మీరు నిజంగా చేసారా ఆ పని అని. తను పాలిపోయిన మొఖంలోకి నవ్వు తెచ్చుకుంటూ అన్నాడు, ఇది కూడా ఒక భాగమేనట మనం చేసిన యజ్ఞంలో, తప్పలేదు అయినా ఇవన్నీ చేస్తే మన అమెరికా మార్కెటు మారుతుందా మన పిచ్చిగానీ. మరి ఈ మాట ముందే ఎందుకు అనలేదు, అని తను అడగలేకపోయింది ఎట్లాగూ తనూ అందులో సగం భాగస్తురాలే కాబట్టి.
* * * *
అనుకున్న రెండువారాల వెకేషను చూస్తూండగానే అయిపోయింది, తిరపతి, శ్రీశైలం అని తిరగడంలో. ఇక రెండురోజుల్లో తము వస్తారనగా, నాన్న తముండే వీధిలోనే కొత్తగా అపార్టుమెంట్లు కట్టడానికి భూమిని చదును చేస్తున్న ఏరియా చూపించడానికి తీసుకెళ్ళాడు, తమిద్దరినీ. నాలుగు ఫ్లోర్లతో మంచి డిజైనుతో కడతారు ఇవి అని చెప్తూ ఎట్లాగూ మీకు స్టాకు మార్కెట్టు కలిసి రాలేదు, ఒకసారి ఇట్లాంటి అపార్టుమెంటొకటి కొనేస్తే అదైనా మిగిలిపోతుంది, చెప్పాడు. నిజమే అనిపించింది, శ్రీనుక్కూడా నచ్చినట్టుంది ఈ ఐడియా.
ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటే నాన్నే చెప్పాడు, మరీ ఇక్కడ వాస్తు పిచ్చి ఎక్కువైపోయింది కాబట్టి, మనం రెంటుకివ్వాలంటే వాస్తు ప్రకారమే ఉన్న అపార్టుమెంటు కొనాలి కాబట్టి అవన్నీ మాకొదిలేయండి అని.
* * * *
బయల్దేరే ముందురోజు నాన్న చెప్తూన్న వార్త విని నిర్ఘాంతపోయింది, తము నిన్నే చూసి కొందామని డిసైడ్ చేసుకున్న కాంప్లెక్సు ఇనాగరేట్ చేద్దామని భూమి పూజ చేసిన రెండో రోజు, ఆ కాంప్లెక్సు కట్టే లేబరు పనిచేసే వాళ్ళ పిల్లవాడొకడు తలా మొండెం వేరు చెయ్యబడి దొరికాడట. బలిచ్చారట. మొత్తం వీధి వీధంతా పోలీసులే.
నాన్న పేపరు చదువుతూంటే శ్రీను అంటున్నాడు, మరీ మన సమాజంలో మూఢనమ్మకాలు ఎక్కువయ్యయి. అసలు ఇండియా అంతా ఎడ్యుకేటు అయ్యి ఈ సమస్యలన్నీ తీరే రోజెప్పుడొస్తుందో అని.
* * * *
తామిద్దరూ బయల్దేరే ముందురోజు, నాన్న అపార్టుమెంటు బ్రోచరు తో పాటు కొన్ని పేపర్లు తెచ్చేడు తమ సంతకాల కోసం. ఫైనాన్సు బాగానే వర్కవుటయ్యేట్టుంది అని చెప్పి సంతకాలు పెడుతున్న శ్రీనును చూసి ఆ ఒక్క వారంలో ఏ నాలుగోసారో ఆశ్చర్యపోవడం తన వంతు అయ్యింది.