ఫిష్‌ దట్‌ గాట్‌ అవే

నాలుగేళ్ళుగా ప్రతి శుక్రవారం రాత్రీ, నేనూ నాకున్న ఒక్క కూతురూ చేసే పని మా ఫిషింగ్‌ రాడ్లకు లైను (వైరు) కట్టి వాటికి కావలసిన బెయిట్లు తయారు చేసుకుని జీపులోకి కావలసిన తినుబండారాలూ, తాగడానికి నీళ్ళూ చేరవేసుకోవటం. ఒక ప్రక్క నా భార్య కొద్ది సేపు నసుగుతూ, ఆ తర్వాత గొంతునొప్పి పుట్టి నొసలుతో వెక్కిరిస్తూనే ఉంటుంది. ఆవిడ బాధల్లా మేం చేసుకునే ఈ పనుల్లో ఆవిడ సాయం అడగడం లేదని, అంతే. అట్లా అంటే మళ్ళీ గొడవెక్కువవుతుందని మేమిద్దరం ఒకరి మొఖం ఒకరం చూసుకుని మాకు మాత్రమే అర్ధమయ్యేలా నవ్వుకుంటాం, అదేమో కళ్ళు చికిలించి తన పెద్ద రెప్పలతోటే నవ్వుతుంది.

అన్నట్టు, దానికి తొమ్మిదేళ్ళు నిండి నాలుగు నెలలు. మూడో క్లాసు. ఇండియాలో చెబితే నవ్వే వాళ్ళు. తన వయసు వాళ్ళే కజిన్‌లు తొమ్మిదేళ్ళకే అయిదో తరగతిలో ఉన్నారనుకుంటా, లెక్కలు ఎక్కాలు తప్పు పోకుండా అప్పజెప్పేస్తారు కూడా. దీనికి మాత్రం మనుషులంటే ఇష్టం. నీళ్ళంటే మరీ ఇష్టం. ఇన్నేళ్ళుగా ప్రతి శనివారం మేమిద్దరమే చేపలవేటకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాం. పొద్దున్నే అంటే అయిదింటికే బయల్దేరి ఆరున్నరా, ఏడుకల్లా దగ్గర్లో ఉన్న ఏదో ఒక లేక్‌ కు వెళ్ళడం పరిపాటై పోయింది. ఇన్ని వారాలుగా చేస్తున్నాం కనుక దగ్గర్లో ఉన్న కాలవలూ, చెరువులూ అన్నీ కవర్‌ చేసాం. ప్రతి గట్టూ కొట్టినపిండే. ఎటువంటి చేపలు ఎక్కడ దొరుకుతాయో నాకన్నా దానికే ఎక్కువ తెలుసు. బాస్‌ ఫిషింగ్‌ లో ఆరితేరుతానంటుంది, చదువు మానేసి. మా ఆవిడకు అదే కోపం. నా కూతురు నాతో మాత్రమే చెప్పిన సంగతి, “అమ్మకు మనం పట్టిన చేపలు ఇంటిదాకా తేం అని కోపం” సీరియస్‌ ఫేస్‌తో అనేది. మళ్ళీ ఫక్కున నవ్వేది కూడా తనే.

* * * * * *

ఇదిగో ఈ రోజూ శనివారం ఎప్పట్లాగే బయల్దేరి వచ్చాం సముద్రపుడొడ్డుకు. మేముండే ష్రీవ్‌పోర్టునుండి ఇది చాలా దూరం. ఈ రోజే దాని పదవ పుట్టినరోజు కూడా. ఇద్దరమూ కలిసి ఇంట్లో ఉండేకన్నా ఎక్కడికైనా దూరంగా వెళ్ళదామని అనుకుని సముద్రాన్ని వెతుక్కుంటూ రావడానికి పది గంటల పైనే పట్టింది. కత్రీనా వచ్చి పోయాక లూజియానా బయూలన్నీ చెత్తా చెదారంతో నిండిపోయినయి, ఏ గవర్నమెంటూ శుభ్రం చేయడం లేదు అని వార్తల్లో చెబితే మేమే సరిగ్గా పట్టించుకోలేదు. మరీ ఇంత ఇదిగా ఉంటుందని అనుకోలేదు. చేపలు పట్టే సంగతి పక్కకు పెట్టి ఒక చోటైనా సరిగ్గా కూర్చోవడానికి కూడా అనువుగా లేదు. తీరం చుట్టూ అక్కడక్కడా ఉండే చెక్కతో చేసిన డెక్‌లన్నీ మాయమయినట్టున్నయి కత్రీనా తర్వాత.అయినా సరే పట్టువదలకుండా కాస్త మంచిగా అగుపించే చోటు కోసం వెతికి, ఒక వంద మైళ్ళైనా అనుకున్నదానికంటే ఎక్కువే నడిపి, చివరికి తూర్పువైపు సముద్రానికి ఎదురుగా ఉన్న ఎత్తైన ఇసక గుట్ట కనిపిస్తే ఆగిపోయాం. దిగాక చూస్తే ఈ చోటు కొద్దిగా ఫర్వాలేదనిపించింది, ఒక డెక్‌ భాగం ఇంకా మిగిలే ఉంది. నీళ్ళల్లో చెత్త కూడా అంత లేదు. మాక్కావలసినట్టు కొద్దిగా ఎడంగా ఎత్తైన ప్రదేశంలో టెంటు కూడా వేసుకోవచ్చు. జనం అసలు లేరు. ఎంత ప్రొద్దున్నే బయల్దేరినా వచ్చేప్పటికే మధ్యాహ్నమైంది. అందుకే టెంట్‌ సంగతి ముందు చూసేసి, ఇక ఎండలో చేపల వేటకు దిగకుండా రాత్రికోసం ఎదురుచూస్తూ తెచ్చుకున్నవి తినేసాం.

రాత్రి క్యాంపులు ఏ ఆర్నెల్లకోసారో తప్ప సాధారణంగా చేయం. క్రితం సారి క్యాంపు చేసి ఎనిమిది నెల్లు దాటుతోంది. దాని తొమ్మిదో బర్త్‌ డే తరువాత ఒక సారి చేసిన జ్ఞాపకం. అదే చివరి సారికూడా. అదీ మాకు దగ్గరపట్లో ఉన్న లేక్‌ క్లైబార్న్‌ దగ్గర. ఇట్లా పది గంటలు డ్రైవ్‌ చేసుకుంటూ రావటం ఇంట్లో మా ఆవిడను వదిలి ఇద్దరమే సముద్రం దాకా వెళ్తాం అంటే ఇక మా ఫిషింగ్‌ ఎక్స్పెడిషన్స్ వదులుకోవలసిందే అని తెలుసు.

రాత్రిళ్ళు అక్కడే ఉండేలా క్యాంపింగుకు వెళ్ళినప్పుడు మాత్రం సాయంత్రం మొదలు పెట్టి రాత్రికి చుక్కలు లెక్కపెట్టేవేళవరకూ చేపలు పట్టి, ఆకలేసినప్పుడు తెచ్చుకున్నవి అంటే, డబ్బాల్లో నిలువుండేలా తయారుగా తినే ట్యూనా, చిప్స్‌ లాంటివి కానిచ్చేసి, స్ట్రాబెర్రీ మిల్క్‌ తాగి పడుకుంటాం. ఆదివారం పొద్దున్నే పళ్ళు తోముకోకుండా ఫిషింగ్‌ రాడ్స్ పట్టుకుని ఒకళ్ళ వెంట ఒకళ్ళం నీళ్ళ దగ్గరికి వెళ్ళటమంటే ఇద్దరికీ ఇష్ఠమే. అట్లా స్వచ్చమైన నీళ్ళలోకి ఫిషింగ్‌ లైను బెయిట్‌తో వేసి ఇక ప్రపంచంతో పనిలేనట్టు ఇంకా బయటకు రాని సూర్యునికోసం ఎదురుచూడ్డమంటే మా ఇద్దరికీ మరీ ఇష్టం. అట్లా ఎక్కువ సార్లు చేయలేకపోవడాన్ని ఇద్దర్లో ఎవరమూ హర్షించం.

* * * * * *

నీళ్ళలో కొద్దిగా కదలిక కనిపిస్తుంది. ఏదో ఒక చేపల గుంపు నా బెయిట్‌ ను వాసన పట్టినట్టుంది. ఏ చేపా పడకపోతే బాగుణ్ణు అనిపిస్తుంది అప్పుడప్పుడు, అనవసరంగా ఆ రీల్‌ ను తిప్పి చేపను బయటకు లాగి, కొక్కాన్ని చేప నోట్లోంచి తీసి మళ్ళీ ఆ చేపను నీళ్ళలొకి వదలడానికి బద్ధకం. ఆ తినే బెయిట్‌ ఏదో నెమ్మదిగా తిని వెళ్ళిపోతే వీటి సొమ్మేం పోతుంది, ఇక్కడ ఈ చేపలన్నీ పట్టి ఎవరికో వండి పెట్టాలని లేదు కదా. ఈ రోజు కూడా అదే బద్ధకం. నా కూతురైతే దానికో ఉపాయం కనిపెట్టింది, కొక్కేన్ని మొండిగా చేసి ఒక రింగులా చేసింది, ఎటువంటి తల తక్కువ, అంటే బుద్ధిలేని, చేప అయినా సరే ఆ రింగులోకి దూరి ఇరుక్కోవడం అనేది జరగదు, బెయిట్‌ను తినేసి వెళ్ళడం తప్ప. అట్లా అయితే తనకు వీలయినప్పుడే, చేయాలనిపించినప్పుడే బెయిట్‌ పెట్టొచ్చుగా అని తన ఆలోచన. చేపలు పట్టే కంటే నీళ్ళలో స్వేచ్ఛగా తిరిగే చేపల కదలికలూ, గాలికి ఎక్కడో మొదలయి తీరాన్ని తాకాలని వచ్చే చిన్న అల్లలూ, దూరంగా ఊగే చెట్లూ, ఆకాశం ఇవి చూడ్డమే ఇష్టంగా మారింది ఇన్నాళ్ళూ చేపల వేటకు వెళ్ళినా కూడా.కనిపించే వరకూ ఉన్న తీరాన్నీ, నీళ్ళనూ ఒక్కసారే ఆస్వాదిస్తున్నట్లుగా వెనక పక్కగా చేతుల మీద వాలి ఏదో ఆలోచిస్తున్న నా కూతురి వైపొకసారి చూసాను.

“చేపను పట్టడం కన్నా దాన్ని వదెలెయ్యడంలోనే ఆనందం ఎక్కువ. డాడ్‌, నువ్వెప్పుడు పట్టినా, యూ డూ లెట్ గో ఆఫ్‌ ఇట్‌” అనింది.

తనకు ఇట్లా ఏదో ఒకటి ఉన్నట్టుండి చెప్పటం ఈ మధ్యే అలవాటైంది.

మరోసారి “డాడ్‌, మమ్మీ చెప్పినట్టు విని స్కూలు, ఫిషింగ్‌ రెండూ మానేసి నువ్వూ నేనూ హాస్పిటల్లో గడిపితే ఆవిడకు నచ్చుతుందేమో?” అడిగింది. “మనం ఆవిడ మాట వినట్లేదని మమ్మీకి కోపం కదా, మీరిద్దరూ పోట్లాడ్డం నాకిష్టం లేదు”

“లుక్‌, మనకిష్టమైంది మనం చెయ్యాలి. ఎవరి జీవితం మీద వాళ్ళకు హక్కు ఉండాలి. అదే విషయం తనకు క్లియర్‌ గా చెప్పాను. నాకు హాస్పిటల్ లో ఉండటం ఇష్టం లేదు. కొద్దిగా అప్సెట్ అయింది తను అంతే, దాని గురించి నువ్వు మరీ ఎక్కువ ఆలోచించకు”.

“డాడ్‌ నువ్వే ఒక పెద్ద న్యూరాలజిస్టువు, మళ్ళీ మనం వేరే డాక్టర్ల దగ్గరికెందుకు వెళ్ళటం” అడిగేది, “మే బీ, యూ నీడ్‌ టు స్పెండ్‌ మోర్‌ టైం ఇన్ ద హాస్పిటల్‌”. తను నవ్వుతూ అంటుందో సీరియస్‌గా అంటుందో తెలుసుకోవడం కష్టం.

మాట మారుద్దామని, నాలుగు నెలల క్రితం తన తొమ్మిదో పుట్టిన రోజుకొరకు చేసిన కర్రలు జీపులోంచి బయటికి తీద్దామని అడిగాను.

“వాటిని ఇప్పుడే వాడవద్దు డాడ్‌, తొందరగా పాతవై పోతాయి”.

* * * * * *

రాడ్స్‌ నీళ్ళలోకి వేసి చాలా సేపయినట్టుంది. నా ఫిషింగ్ పోల్‌ కొద్దిగా కదిలింది, ఇంతసేపటికి. అంతలోనే ఒక్క విసురుతో కొద్దిలో నీళ్ళలో పడిపోయేంతగా జరిగింది. చేప, కొద్దిగా పెద్దదే అయి వుండాలి, దాని తొందరలో అది ఉన్నట్టుంది. మరి ఆ బుద్ధి ముందే ఉండొద్దూ. నా కూతురి పోల్‌ వైపు చూసాను, ఏ కదలికా లేదు. త్వరగా రీల్‌ చుట్టటం ప్రారంభించాను. ఇది కొత్త ఫిషింగ్‌ రాడ్, ఇంకా చేతిలో అలవాటు కాలేదు. చేప త్వరగా పైకి తేలడం లేదు. నా వెనకగా వినిపిస్తున్న అడుగుల శబ్దం దగ్గరవుతోంది. త్వర త్వరగా చుట్టేసాను. చేప ఒక మొతాదుదే, కానీ బలంగా లాగుతోంది. వెంట వెంటనే దాన్ని ఎడం చేతిలో నెట్లోకి వేసి, దగ్గరగా లాక్కుని దాని పెదవిలోంచి కొక్కేన్ని లాగేసాను. ఒకసారి అంటీ అంటనట్టుగా ముద్దు పెట్టేసి నీళ్ళలోకి వేసేసాను.దాని తొమ్మిదో బర్త్‌డే గుర్తొచ్చింది. అంతకు ముందు మూణ్ణెళ్ళ క్రితమే తన పుట్టిన రోజు కోసం కష్ఠపడి తయారు చేయించుకున్న కర్రలను ఇదే మొదటిసారి ఫిషింగ్‌ చేయడానికి బయటకు తీయడం. ఆనాటి దాని బర్త్‌డే థీం ఫిషింగ్‌. అది ఒక మెర్‌మెయిడ్‌ డ్రెస్సు వేసుకుని తన క్లాసు ఫ్రెండ్స్‌ అందరినీ పిలిచింది. వాళ్ళందరికీ నాతో పట్టుబట్టి చేయించిన రెండు ఫిషింగ్‌ రాడ్స్‌నూ చూపించింది కూడా. దాని ఫ్రెండ్‌ వాళ్ళ డాడ్‌ తయారు చేస్తాట్ట, కర్రలను నున్నగా తమ చేతి సైజుకు తగ్గట్టుగా తయారు చేస్తే ఆ చేపలు పట్టే రాడ్స్‌ కు వాటిని పట్టుకునే మనుషుల పర్సనాలిటీస్ వస్తాయని అదే చెప్పింది. నాకు దాని ముచ్చట తెలుసు కాబట్టి ఈ రాడ్స్‌ ఎట్లా తయారు చేయాలి అని ఇంటర్నెట్‌ అంతా వెతికి, ఒకటీ అరా పుస్తకాలు తిరగేసి రెండు రాడ్స్‌ చేసేసరికి తలప్రాణం తోకలోకొచ్చింది. మా పట్టుదల చూసి మా ఆవిడ కూడా ఏమీ అనలేదు మేమిద్దరం ఈ కష్ఠమంతా పడుతూ ఉంటే. అంతవరకొస్తే మా ఆవిడ కొన్నాళ్ళుగా మా ఇద్దరి చేపల వేటను గురించి విసుక్కోవడం మానేసింది. ఆవిడ మూతి విరుపులు తగ్గాక ఎందుకనో నాకూ నా కూతురికీ ‘ఇక ఇందులో మజా ఏముంది ‘ అన్నట్టుగా ఏదో స్తబ్దుగా తయారయింది.

కొక్కానికి మళ్ళీ బెయిట్‌ పెట్టటానికన్నట్లుగా వంగుతూ ఉంటే వెనకాలే చీకట్లో నడిచొచ్చిన నా భార్య అడిగింది, “పట్టిన చేపను ఎందుకు వదిలేసావు? నేను చూసాను ” అంటూ. నేనేం మాట్లాడలేదు. తను చూడకుండా నా కూతురి ఫిషింగ్‌ పోల్‌ వైపు చూసి కనపడకుండా నవ్వాను. ఏదో చేప తన కొక్కాన్ని లాగుతున్నట్టుంది. దాని పోల్‌ కొద్దిగా జరిగింది. నా భార్య నేను పనిలో ఉన్నాను అనుకుందో ఏమో, తను త్వర త్వరగా వెళ్ళి దాని రాడ్‌ పట్టుకుని రీల్‌ చుట్టడం మొదలు పెట్టింది. కొద్ది సెకండ్లలో దాని గుండ్రటి కొక్కెం బయటకొచ్చేసింది. ఏ చేపా లేదు దాని చివర.

ఆవిడ ఆ చేపల కర్రను ప్రక్కన పడేస్తూ అంది, “రేపు ఇంటికెళ్ళాక మీరన్నట్లే, దాని చివరి కోరిక ప్రకారమే చేద్దాం” అంది.

నేను మళ్ళీ కూర్చున్నాను మొదటి స్థానంలోనే, చుక్కల్లోకి చూస్తూ.

* * * * * *

టెంటు సర్దేసి జీపులో వెనక్కి మళ్ళీ ఇంటివేపు బయల్దేరాం ఆదివారం సాయంత్రం.”డాడ్‌, ఎడాప్ట్‌ ఎనదర్‌ గర్ల్‌ బై మై టెంత్‌ బర్త్‌ డే” ఉన్నట్టుండి చెప్పింది నా కూతురు కళ్ళు చికిలిస్తూ.

“నాలుగు నెల్లే కదా అయింది నీ తొమ్మిదో పుట్టిన రోజు జరిగి, నీ క్లాస్‌మేట్ ఎవరికైనా కొత్తగా అట్లాంటి ప్రెజెంట్‌ వచ్చిందేమిటి? అయినా ఇంకా చాన్నాళ్ళుందిలే నీ పదవ బర్త్‌డే అప్పుడు నువ్వు ఎట్లా అంటే అట్లాగే చేద్దాం” ఏదో ఆలోచిస్తూ అనాలోచితంగా మాట ఇచ్చేసాను.