మార్పు

సుజాత అమెరికా వెళ్ళే రోజు దగ్గర పడే కొద్ది షాపింగుతో, చుట్టాలను చూడ్డానికి తిరగడంతో గడిచి పోతూనే వుంది.  సుజాత క్లాస్‌మేటు రాధిక మాత్రం, ఏమిటీ మీ ఆయన అక్కడ బట్టలు కొని పెట్టడా? ఇక్కడే ఇవన్ని కొనుక్కు వెళ్ళాలా? అని ఒకటే నస.  రాధిక ఎమ్‌ . బి. బి. ఎస్‌ .  ఫైనల్‌ చదువుతుంది, సుజాతది ఇంజినీరింగ్‌  ఫైనల్‌  అవగానే పెళ్ళి చేసేసారు వాళ్ళ తల్లిదండ్రులు.  చాలా సొంత అభిప్రాయాలతో పెరిగినా, పెళ్ళి విషయంలో ఇంట్లో వాళ్ళు గీసిన గీత దాటే ధైర్యం లేకనో లేక తనకు కూడ అదే దారి మంచిది అనిపించో తల ఎత్తకుండా అమెరికాలో చదివి, వుద్యోగం చేస్తూ రెండు వారాల కోసం వచ్చిన అబ్బాయిని చేసుకోవడం జరిగిపోయింది.  హనీమూనుకు కూడ టైము లేకపోవడంతో, అతగాడేమో వెంటనే ప్లేన్‌ ఎక్కేసాడు, ఇంకో రెండు నెలల్లో వీసా కొరకు పేపర్లు పంపుతాను అని చెప్పి.  రెండు నెలలు అనుకున్నది మూడు అయ్యింది కాని వెంట వెంటనే వీసా రావడం, ఆ వెళ్ళే రోజు దగ్గర పడడం కూడ జరిగిపోయింది.

రాధిక మాత్రం ఇంట్లో చెప్పేది చెప్తూనే వుంటారు లెద్దూ అని, తన దారిలో తను హౌస్‌ సర్జెన్సీ చెసే ఒకతనితో ఇండియా టైపులో డేటింగ్‌ మొదలు పెట్టేసింది.  ఫ్రెండ్స్‌ తో కలిసి హోటల్లో కాఫీ తాగడంతో మొదలైన పరిచయం, ఇద్దరు కూడబలుక్కుని అతనికి డ్యూటీలేని రోజు మధ్యాహ్నం షికార్లకూ పార్కులకూ వెళ్ళే వరకు వచ్చింది.  రాధికకు ఎంత అమెరికా వెళ్ళాలని వున్నా, ముక్కూ మొహం తెలియని వాడిని చేసుకోవడం తనవల్ల కాదని ఖచ్చితంగా ఇంట్లో చెప్పేసింది.

సుజాత అటు అమెరికా వెళ్ళి ఆరు నెలలు తిరక్క ముందే, రాధిక పెళ్ళి తను కోరుకున్న వాడితో తిరుపతిలో జరిగిపోయింది.

నాలుగు సంవత్సరాల తరువాత కాని ఇద్దరికీ హైదరాబాదులో మళ్ళీ కలవడం కుదరలేదు.  చాలా లావు అయిపోయానని సుజాత ఒకటే గొడవ, రాధిక ఇలా ఎలా మెయిన్‌ టెయిన్‌ చేస్తుందో అని మెచ్చుకోవడం.  రాధిక మాత్రం, హైదరాబాదులో రెండు హాస్పిటళ్ళలో పొద్దున్నా, సాయంత్రం పని చేస్తే నువ్వు కూడా నాలాగ పీక్కుపోవడానికి ఒక్క నెల చాలు అని నవ్వేసింది.

అదేం రాధీ, నువ్వు కావాలని కోరుకున్న లైఫ్‌ ఇదే కదా అంటే, అవునులే, హైదరాబాదులో వుండి మేము పడే కష్టాలు చెప్పాలంటే అవి చెప్పులోని రాయిలాంటివి. చెప్పినా అర్ధం కావు కాని, ఇంతకీ మీ అమెరికా ముచ్చట్లు చెప్పు అని అడిగింది.  అమెరికాలో వున్న ఈ నాలుగు సంవత్సరాల్లో తను ఎంత కష్టపడి కమ్యూనిటీ కాలేజీలో ఒక సంవత్సరం, ఇంకో ఏడు యూనివర్సిటీ కోర్సులు చేసి, క్రితం సంవత్సరం నించే ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో జాయినైనట్టు చెప్పింది.  మరి లైఫ్‌ ఎలా వుంది అని అడిగినదానికి మాత్రం, ఏముందే అంతా రొటీను, పొద్దున్నే లేచి ఆయన కారులో రైలు స్టేషనుదగ్గర డ్రాప్‌ చేస్తే వర్కుకు వెళ్ళేసరికి ఎనిమిదిన్నర, పని మామూలుగా వున్నా కూడా, లంచ్‌తో కలిపి తొమ్మిది గంటలు బయట గడిపేసరికి, ఎప్పుడు  ఇంట్లో పడదామా అనే వుంటుంది.  ఇంటికి రాగానే, అంట్లూ అవీ శుభ్రం చేసి, కొంచెం వండేసి, ఏదో టీవి ప్రోగ్రాం చూసేసి పడుకోవడమే.  వీకెండ్స్‌ కూడా పెద్దగా లైఫ్‌ అంటూ ఏమీ లేదు. ఎప్పుడో వెళ్ళిన కొత్తలో, పార్కుకు వెళ్ళాలని, మ్యూజియం, డౌన్‌టౌన్‌ చూడాలని వుండేది కాని ఈమధ్య పెద్దగా బయటకి వెళ్ళాలన్నా అదో బోరుగా తయారయ్యింది.

మరిక్కడ నువ్వు, మీ ఆయన అంతా బిజీయేకదా, టైము గడవదు అనే ఛాన్సే లేదు, పైగా పనివాళ్ళను పెట్టుకోవచ్చు కదా అంది.  కరెక్టే, మాకు ఇక్కడ ఇంట్లో కొంచెం హెల్ప్‌ వుంటుందనుకో.  అంతే తేడా, మాకుండే బాధలు కూడ మీకు లాగానే, బయటకు వెళితే ఇంటికి రావడం సాయంకాలం దాకా వీలు పడదు అని రాధిక చెప్పింది.

చాలా రోజుల తరువాత కలిసాము కదా, మరి ఆదివారం షాపింగుకి వెళదాము అని ప్లాను చేసారు ఇద్దరు.  అబిడ్స్‌ కి వెళ్ళి కొన్ని డ్రెస్సులు, ఒకటి రెండు చీరలు, ఏమైనా జువెల్రీ వుంటే చూడాలని ఉద్దేశం.

అయిదు షాపులు తిరిగి, ఒక వంద డ్రెస్సులు చూసి, రెండు తీసుకుంది సుజాత.  రాధిక ఒకటి కొన్నది.  ఇంక చీరలు చూసే వోపిక లేదు కాని ఏదైనా రెస్టారెంట్లో తినేసి ఇంటికి వెళదాము అని ఇద్దరు డిసైడ్‌ చేసారు.

ఇంట్లోకి వెళ్ళగానే, పెళ్ళిలో మాత్రమే చూసిన సుజాత వాళ్ళాయన ముందు హాల్లో కూర్చుని టీ తాగుతూ కనిపించాడు.  నమస్కారం, బాగున్నారా అని పలకరించింది రాధిక.

నమస్కారం పెడుతూనే, ఆయన మాత్రం సుజాత చేతి సంచుల వైపు దృష్టి సారించడం గమనించింది రాధిక.  సుజాత బెడ్‌రూం లో బట్టలను పెట్టేసి, బయటకు వచ్చే లొపే, ఆయన బెడ్‌రూం లోకి వెళ్ళి సుజాతను ఏదో అడగడం గమనిస్తూనే వుంది.  సుజాత కొంచెం గొంతు తగ్గించి, లేదు లెండి ఎక్కువగా ఏం దుబారా చేయలేదు, తప్పదని ఒకటి రెండు డ్రెస్సులు కొన్నా అంతే అని సంజాయిషీ ఇచ్చినట్లు చెప్పడం చెవిన పడి ఆశ్చర్యపోయింది రాధిక.  తనకు సొంత సంపాదన వున్నా అన్ని లెక్కలు ఆయనకు చెప్పాల్సి వున్నట్టుంది అని అనుకుంది.  ఇద్దరూ కలిసి బయటకు వచ్చేసారు, సుజాత మొహం చూస్తే కొంచెం నొచ్చుకున్నట్లు అనిపించింది స్నేహితురాలి ముందు కొంత బయటపడిపోయినందుకు.

బయల్దేరే ముందు మాటల్లో చెప్పింది, ఎంత అమెరికాలో వున్నా, బడ్జెట్‌ ప్రకారం జరక్కపోతే ఏదీ కుదరదు అని.  తాము ఇండియా ప్రయాణం పెట్టుకున్నప్పటినించి, వెళ్ళేదాక ఎవరు ఎంత ఖర్చు పెట్టాలో, ఏది ఎలా కొనాలో అన్నీ ప్లాను చెసుకున్నాకే వచ్చాం అని సర్ది చెప్పింది.  రాధిక నోట్లోకి వచ్చిన మాట, మరి మీ ఆయన పొద్దుటి నించి ఎంత ఎక్కడ ఖర్చు పెట్టాడో అడిగావా, తను చెప్పాడా అనేది. కాని దాన్ని నొట్లోనే మింగేసింది ఎందుకైనా మంచిదని.

కొంచెం సేపు కూర్చుని ఇంక వెళ్తానని లేచింది రాధిక.  అమెరికా తిరిగి వెళ్ళేముందు ఆదివారం తమ ఇంట్లో భోజనాలకు పిలిచింది తను వాళ్ళిద్దరిని.

రాధిక వాళ్ళు వుండేది సిటీలో చాలా బిజీగా వుండే నారాయణగూడ ఏరియా.  తమ అత్తగారి ఇంటినించి బయలు దేరి రాధిక ఇంటికి వెళ్ళడానికి రెండు గంటలు ఆదివారం అయినాసరే పట్టింది.   వాళ్ళు అక్కడ ఫ్లాటు కొనుక్కుని రెండు సంవత్సరాలు అయ్యింది.  రెండు బెడ్రూంల ఫ్లాట్‌ ఇక్కడ ఇంత ధర అవుతుందని ఎప్పుడూ అనుకోలెదు.  డాలర్లలో సంపాదిస్తున్నాం అన్నమాటే కానీ, ఇంటి రెంట్లు, ఇన్శ్యూరన్సులు, కారు ఖర్చు, టాక్సులు పోను మిగిలే డబ్బులతో ఇక్కడ మంచి ఏరియాలో ఫ్లాట్‌ కొనాలంటే కష్టమే.  సుజాత వాళ్ళ ఆయన దార్లోఈవిషయాలన్ని బేరీజు వేసుకుంటూ సిటీలో కారు అభిమన్యుని మరిపిస్తూ నడుపుతూ ఫైనలుగ గమ్యం చేరారు.  నాలుగు సంవత్సరాల్లో ఆ ఏరియాలో తను గుర్తించిన తేడాలన్నీ సుజాత వినిపిస్తుంటే వింటూ మరి ఇక్కడ కూడ ఫ్లాట్ల్లల్లో అలవాటు పడ్డట్టున్నారు మనుషులు, ఒకే జనరేషనులోఎంత మార్పు అన్నాడు సుజాత వాళ్ళ ఆయన.

ఇద్దరూ మెట్లు ఎక్కి, రెండవ ఫ్లోర్లో వున్న రాధిక వాళ్ళ ఫ్లాటుకి వెళ్ళారు.  రాధిక వాళ్ళది రెండు బెడ్రూంల చక్కని ఫ్లాటు.  సొంత అభిరుచిలో శుభ్రంగా అలంకరించుకున్న ముందు  హాలు చూసి ముచ్చట పడింది సుజాత.  ఇంత టైము ఎలా దొరికింది నీకు, ఇక్కడ మీకు పనివాళ్ళు వుండబట్టి హాయిగ ఇలా అలంకరించుకోవడం లాంటివి చేయవచ్ఛు, కొంత అసూయ ధ్వనించింది సుజాత మాటల్లో.  రాధిక మాత్రం, పని వాళ్ళు వున్నా కూడ మనం వెనక నించి సర్దవలసి వస్తూనే వుంటుంది, ఎందుకంటే మన ఆలోచన ప్రకారం అన్నీ కావాలంటే ఏ పనివాళ్ళు మాత్రం చేయగలరు, అంది.

ఇద్దరు మొగవాళ్ళు, టి.వి. లో ప్రొగ్రాం చూస్తూ పొలిటికల్‌ ముచ్చట్లు మొదలు పెట్టారు.  ఇద్దరికి తనే ఏదైన జ్యూసు  తీసుకుంటారో, కోక్‌ తీసుకుంటారో కనుక్కుని, గ్లాసులు అరేంజ్‌ చేస్తుంటే రాధిక చెప్పింది, వాళ్ళ ఆయనకు ఐసు లేకపోతే తగదని, రెండు స్కూపులు ఐసు వేసి ఇవ్వమని.  ఒకరి ఇష్టా ఇష్టాలు అంత బాగా తెలుసుకుని శ్రద్ధగా చూసే రాధికను చూసి మెచ్చుకుంది సుజాత.  రాధిక నవ్వి వూరుకుంది.

తాము వచ్చేసరికే, పదకొండు గంటలలోపే స్నేహితురాలు గుత్తివంకాయ కూర, బెండకాయ       వేపుడు, ఛికెన్‌ సిక్స్టీఫైవ్‌ , సాంబారు, రసం అన్నీ చేసినందుకు కొంచెం నొచ్చుకుని, మరి ఇంతలా మమ్మల్ని మేపాలా ఇప్పటికే నేను లావు తక్కువయ్యానని అంది సుజాత.  సరే మరి, నువ్వు ఈ అప్పడాలు వేయడంలో సహాయం చెయ్యి మరి, ఇంకా ఈ పూరీలు వేడిగా చేస్తే బావుంటాయని ఆగాను మీరు వచ్చేవరకు అని వూరించింది తన అతిధిని, రాధిక.

టి. వి. చానెల్స్‌ అన్నీ చెక్‌ చేసి, ఎక్కడా సెటిల్‌ కాలేక, వంటింట్లోకి తొంగి చూసాడు సుజాత వాళ్ళాయన, ఇల్లంతా ఘుమ ఘుమ లాడి పోతూవుంది, ఇలా హాయిగా ఎలాంటి స్మోక్‌ డిటెక్టర్‌ గొడవ లేకుండ వంటింట్లో వేపుడు చేసే అదృష్ఠం మనకు లేదు సుజాతా అంటూ.  సుజాత చెప్పింది వాళ్ళాయన వారానికి రెండు రోజులు వంట చేయటం మాత్రమే కాదు, ఇల్లు శుభ్రం చేయటం, అంట్లు తోమడం లాంటి వాటిల్లో కూడా బాగానే సహాయం చేస్తాడని.  టి. వి. లో ఆటలు లాంటివి లేకపోతే ఇంటిపని విషయంలోకొంచెం నయమే అని.  అన్నీ ఇద్దరు ఆడవాళ్ళు టేబులు మీద పెడుతూ వుంటే కొద్దిగా హెల్ప్‌ కూడ చెసాడు ఆయన.  హాల్లో నుంచి రాధిక వాళ్ళాయన మాత్రం వంటిల్లు వంకే  రాలేదు.  రాధిక, పని ఆవిడ రాకపోతే తను హాస్పిటల్‌ నించి వచ్చేటప్పటికి ఏ వొక్కపని ముట్టుకోకుండా, హోటల్లో భోజనం చేసేసి వచ్చే తన మొగుడి సంగతి బయటకి చెప్పలేదు.

అన్నీ అరేంజ్‌ చేసాక, అందరూ కలిసి కొద్దిసేపు మళ్ళీ ఇండియా, అమెరికా లైఫ్‌ కంపేర్‌ చేసుకుంటూ, తమ తమ ఫ్రెండ్స్‌ ఎక్కడెక్కడ వున్నది, ఈ మధ్య  పిల్లల చదువులు ఎలా వున్నాయి, పిల్లలని అమెరికాలోపెంచడం మంచిదా, ఇండియాలో బాగా పెరుగుతారా లాంటివన్నీ మాట్లాడుతుంటే, రాధిక భోజనాలు చేస్తూ మాట్లాడుకోవచ్చు అని చెప్పింది.

అందరూ భోజనాలకు కూర్చున్నారు, రాధికే అతిధులకు కొసరి మరీ వడ్డించింది.  వంటలను మెచ్చుకుంటున్న సుజాత వాళ్ళాయన మాటలు వింటూ భోజనం చేసి చాలాకాలమయినట్టు పెద్దగా మాట్లాడకుండా అందరు కానిచ్చారు.  చివరగా చెప్పింది సుజాత మాంగో ఐసు క్రీం వుంది తర్వాత. కాని ముందు ఈ గాజర్‌ హల్వా తినండి అని డిసర్ట్‌ కూడ వడ్డించేసింది.

త్వర త్వరగా తినే అలవాటున్న సుజాత వాళ్ళ ఆయన, భోజనం అయ్యాక మిగతా అందరిది అయ్యేదాక ఆగాడు.  చివరగా ఒక త్రేనుపు తీస్తూ ఇంక లేవండి మీరు అక్కడ బేసినులో వాష్‌ చేసుకోండి, చెప్పాడు రాధిక వాళ్ళాయన.  అలవాటు ప్రకారం ప్లేటు తీయపోతూ వుంటే ఆయనే, ఎందుకండి మీకు శ్రమ, వాళ్ళు తీస్తారు లెండి, మీరు చెయ్యి వాష్‌ చేసుకోండి అని చెప్పాడు.  పక్కనే వున్న సుజాత వైపు అంగీకారం కొరకు అన్నట్టుగా చూసి, తను చెయ్యి కడిగేసుకున్నాడు.

ఇద్దరు బయట హాల్లో కొంచెం సోంఫు తీసుకుని చతికిలపడ్డారు.  ఇద్దరు ఆడవాళ్ళు ప్లేట్లు, అవీ తీసేసి, బెడ్రూంలోకి వెళ్ళి ఫోటోలు చూడ్డంలో నిమగ్నమై పోయారు.

ఈలోపు సాయంత్రం మూడు కావటం, అందరికి టీలు తీసుకునే అలవాటు వుందా అని అడిగి రాధిక టీలు పెట్టడానికి లేస్తూ, మనం ఎంత చదువుకున్నా, ఎన్ని వుద్యోగాలు చేసినా, మనకు ఇలాంటి పనులు తప్పవు సుజాతా, అందరు ప్రోగ్రెస్‌ అంటారు, నాకు మా మమ్మీకి తేడా ఏమీ కనిపించట్లేదు అంది.  సుజాత మాత్రం, లేదే డబ్బు విషయంలోనైనా, పనుల విషయంలోనైనా మనం ఇక్కడేదో బ్యాలన్సు సరిగ్గా లేదు అని గుర్తించగలగడమే ప్రోగ్రెస్‌ మన అమ్మలతో పోల్చుకుంటే.  మనం కాకపోతే మన ముందు తరం ఆడపిల్లలైనా తమ అస్థిత్వాన్ని  నిలుపుకోవడంతోపాటు, దాన్ని స్థిర పరచుకోవడనికి వెనుకడుగు వేయరేమో అంది చివరి మాటగా.

*           *              *                     *                      *              *          *
ఇంత వరకూ రాసి మూర్తి వళ్ళు విరుచుకున్నాడు.  ఈ కథకు ఒక కొసమెరుపు, చిట్ట చివరి పొర లాంటిది తోస్తే బాగుండును అని ఆలోచనలో పడి కొద్దిసేపు బెడ్‌ మీద కళ్ళు మూసుకుని పడుకున్న వాడల్లా క్రిందనించి అనిత ఏదో గట్టిగా పిలిచినట్టు వినిపిస్తే బద్ధకంగా లేచి ఏంటో ఆదివారం కూడా హాయిగా తనను గడపనివ్వదు అనుకుంటూ మెట్లు దిగాడు.  అనిత ఒక్కసారిగా నిద్రమత్తు దిగేలా చెప్పింది, ఆదివారం ఇంట్లో వుంటే కొద్దిసేపు బాబును చూసుకోవచ్చుకదా, ఆ రాత కోతలతో ఊర్లో వాళ్ళనుద్ధరిస్తానని బయల్దేరకపోతే అని.  అసలు వారానికి ఒక్కసారైనా వాడికి డైపరు మార్చడమో, స్నానం చేయించడమో చెయ్యొచ్చుకదా అంది.

అదికాదు అనితా, ఈ కథకు ఏదైనా సర్‌ ప్రైజు ముగింపిద్దామని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాను కొద్దిసేపు అని ఏదో సర్దిచెప్పబోయాడు తనొక కప్పు కాఫీ కలుపుకుంటూ.  మాలా ఇండియాలో పుట్టి, పెరిగిన ఆడవాండ్లకు అసలు బ్రతుకంతా ఒకటే టైపు, మీ కథల్లోలా కొసమెరుపులుండవు అంది ఎకసెక్కంగా.  కాఫీ అప్పుడే నోట్లో పెట్టుకున్నాడో లేదో పొలమారింది మూర్తికి.