రెండు వీధుల మధ్య వారధులం మేవు
నిక్కర్ల రోజుల్నుంచి, పైటల్ని చూసి పరవశించే రోజుల్లోంచి
నడివయసు తుఫాను ముంగిటదాకా
రెండు దేశాల మధ్య వారధులం మేవు
కొండల్ని, కోనల్ని, సముద్రాల్ని,
భాషల్ని, భావాల్ని, భేదాల్ని,
దాటి ఎగిరిన రెండు స్వేఛ్చా విహంగాలం మేవు
మనసులో ఏమూల్లో ఎక్కడ పుట్టిందో
ఈ బైపోలార్ భూతం, వాడి
మెదడుని చెర పట్టింది
స్వేచ్ఛని బిగ పట్టింది, మనసు
సునామీలా ఎగిసి పడడం తప్ప
సముద్రంలా తుళ్ళి పడడం నిలిపేసింది
వరదై పొంగి పొర్లటం తప్ప
వానై నాట్యమాడటం మానేసింది
ఎగిరితే ఆకాశంలో సూర్యుడిలా వెలుగుతాడు
జారితే పాతాళంలోకి బుడుక్కని మునుగుతాడు
వికాటాట్టహాసం, గుండెకి శరాఘాతం తప్ప
చిరునవ్వుని, కంటతడిని ఎక్కడో
మనసు లోతుల్లో పారేసుకున్నాడు,
వాటికోసం మందులతో తన
మెదడు చుట్టూ పంజరం కట్టుకున్నాడు
తన మనసు రెక్కలు తానే కోసుకున్నాడు