హఠాత్తుగా ఓ కొత్తలోకంలో వెళ్ళి పడ్డట్లుంది బాలగోపాల్ పరిస్థితి.
అది తన సొంత ఊరే. తను పుట్టి, ఇరవై ఏళ్ళ వయసు దాకా పెరిగిన ఊరే. ఐతే అనేక కారణాల వల్ల (ఇరవై ఏళ్ళ క్రితం అమెరికా వెళ్ళి అక్కడే స్థిరపడ్డం వాటిలో ముఖ్యమైంది కావొచ్చు) గత పదేళ్ళుగా అతనిక్కడికి రాలేదు. ఇప్పుడు వచ్చి చూస్తోంటే అంతా కొత్తగా, తనెప్పుడూ చూడనిదిగా అనిపిస్తోంది. బజార్లో అటూ ఇటూ లేచిన కొత్తకొత్త మేడలు. రోడ్డు మీద తనని కొంత వింతగా చూస్తున్న అపరిచిత ముఖాలు. ఎక్కడన్నా ఒకరు తనకేసి అనుమానంగా చూస్తున్న అనుమానం. వడివడిగా నడుచుకుంటూ ఇల్లు చేరాడు.
తన వాళ్ళని చూట్టం తోటే అతనికి కలిగిన మొదటి ఆలోచన వీళ్ళంతా ఎంతగా మారిపోయారా అనేది. మనుషుల్లో మార్పు కన్పిస్తోంది. పరిసరాల్లో మార్పు కన్పిస్తోంది. వస్తువుల్లో మార్పు కన్పిస్తోంది. ప్రవర్తనల్లో మార్పు కన్పిస్తోంది.
ఒకవేళ మారింది వాళ్ళు కాదేమో, తనేనేమో అని ఒక క్షణం అతనికి అనిపించకపోలేదు. కాని అది నిజమని అతనికి అనిపించలేదు.
సాయంత్రం ఎప్పటిలాగా (అంటే ఇరవై ఏళ్ళ క్రితం ‘ఎప్పటిలాగా’) ఊరి బయటికి షికారుకి బయల్దేరాడు. తన వీధంతా కూడ మారిపోయింది. అదివరకు పెంకుటిళ్ళు కొన్ని ఇప్పుడు డాబాలుగా పైకి ఎదిగాయి. ఒకటి రెండు డాబాలు వెలిసిపోయి, మాసిపోయి, కూలటానికి సిద్ధంగా వున్నాయి. ఒక మిద్దె ఇల్లు గుడిసెగా ముడుక్కుంది. ఇరవై ఏళ్ళ తర్వాత వీళ్ళ వీళ్ళ ఆర్థికస్థితులు ఇలా వుంటాయని ఎవరైనా ఊహించగలిగారో చెప్పటం చాలా కష్టం. తన చిన్నప్పుడు ధనవంతులుగా వున్నవాళ్ళు ఇప్పుడు చితికిపోవటం, అప్పుడు ఏమీ లేనివాళ్ళు ఇప్పుడు ధనవంతులు కావటం కొంత వింతగా అనిపించినా, మొత్తం మీద వీధిలో లేనివాళ్ళ కంటే వున్న వాళ్ళే ఎక్కువగా వున్నందుకు అనుకోకుండానే ఆనందించాడతను.
బయట అరుగుల మీద కూర్చుని వున్న వయసు పైబడుతున్న వాళ్ళు కొందరు అతన్ని పలకరించారు. కొత్తకోడళ్ళు అతన్ని ఎరగని వాళ్ళు ఎవరా అన్నట్టు చూశారతని వంక. తనతో స్కూల్లో చదువుకున్న వాళ్ళు ఒకరిద్దరు పలకరింపుగా నవ్వారు.
వీధి మలుపు తిరుగుతోంటే “బాలయ్యా, బాలయ్యా!” అని ఎవరో పిలిచినట్టు అనిపించింది అతనికి. ఆ పిలుపు అలవాటు తప్పి ఎంతో కాలం ఐనందువల్ల ముందు అది తన గురించే అని గ్రహించలేదతను. తిరిగి చూసేటప్పటికి శేషమ్మ కనిపించింది. ఆమె పెద్దకొడుకు సుబ్బారావు తనకి రెండేళ్ళు సీనియర్ హైస్కూల్లో, తర్వాత కాలేజిలో కూడ. ఐనా ఇద్దరూ మిత్రులుగా వుండేవాళ్ళు. పదేళ్ళ నాడు వచ్చినప్పుడు వాళ్ళంతా విజయవాడకి వెళ్ళిపోయారని, సుబ్బారావు అక్కడే ఏదో వ్యాపారం చేస్తున్నాడని చెప్పారు. అంచేత అతనితో గాని, వాళ్ళ వాళ్ళతో గాని అప్పుడు మాట్లాడ్డం కుదర్లేదు.
“ఏవండీ, ఎలా వున్నారు?” అని పలకరించాడు గోపాల్ ఆమెని.
తన చిన్నప్పుడు చాలా అందంగా వుండేదామె (అని అందరూ చెప్పుకునే వాళ్ళు). ఇప్పుడు ఆ సౌందర్యావశేషాలు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కాని వయసుతో పాటు ఆమెకీ వాటి మీద పెద్ద ధ్యాస వున్నట్టు లేదు. జారిపోతున్న పైటని తాపీగా సవరించుకుంటూ ఎదురుగా వున్న అరుగు మీద చతికిలపడి, “ఇటు వచ్చి కూర్చో బాలయ్యా” అందామె. వెళ్ళి కూర్చున్నాడు గోపాల్.
“సుబ్బారావు ఎక్కడ వుంటున్నాడిప్పుడు?” అనడిగాడు.
“విజయవాడలో. నీకు తెలీదా? అవున్లే, మేం వూరొదిలేసి పోయాక మా గురించి ఇక్కడందరూ మర్చిపోయారు. నువ్వేమో పోయి అమెరికాలో కూర్చున్నావాయె! అది సరే గాని, అక్కడ నెలకే పది లక్షల దాక ఇస్తారంట గదా, ఈ ఇరవై ఏళ్ళకి గాను పది కోట్లన్నా వెనకేశావా?”
బెరుగ్గా అటు ఇటూ కదిలాడు బాలగోపాల్. ఏం చెప్పాలో తోచలేదు. స్టాక్ మార్కెట్లో పోయిన లక్ష డాలర్లూ, ఉంటుందో ఊడుతుందో తెలీకుండా ఊగులాడుతున్న ఉద్యోగం గుర్తొచ్చాయి తప్ప గత ఇరవై ఏళ్ళుగా తను సంపాయించి వెనకేసిందేమిటో అతనికేం తెలీలేదు. ఐతే, ఆ విషయాలు చెప్తే తనని అర్థం చేసుకోకపోగా విపరీతంగా అపార్థం కూడ చేసుకుంటారని అతనికి అనుభవం మీద తెలిసొచ్చింది.
“ఎంత చెట్టుకి అంత గాలి కదా! వస్తాయన్న మాట నిజమే గాని ఖర్చులు కూడ అలాగే వుంటాయి కదా? ఏదో జీవితం హాయిగానే గడిచిపోతుందిలే!” అన్నాడు కప్పదాటు వేస్తూ.
“నువ్వెప్పుడూ ఇంతే బాలయ్యా! నీ గురించి చెప్పుకోవు. నాకు చిన్నప్పట్నుంచీ నీ సంగతి తెలిసిందేగా! ఐతే, ఊర్లో అందరూ అనుకుంటున్నార్లే, రొండు కోట్లు పెట్టి ఇల్లు కొన్నావంటగా! చేతులో కనీసం ఇంకా అంతన్నా ఉండదూ? ఏమైనా, నీతోటి చదువుకున్నందుకు మావాడూ, వాడితో చదువుకున్న నువ్వూ ఇద్దరూ మంచి స్థితిగతుల్లో వున్నందుకు మాకందరికీ చాలా సంతోషంగా వుందయ్యా.”
ఈ విషయాన్నుంచి దారి మళ్ళించకపోతే ప్రమాదం అని గ్రహించి చటుక్కున “ఐతే సుబ్బారావు బాగా సంపాయించాడన్న మాట!” అన్నాడు.
“ఏదో ఆ ఏడుకొండల స్వామి దయా, మీలాటోళ్ళ నోటిచలవ! బాగానే సంపాయించాడు. నాలుగు కోట్లని తన నోటితో తనే నాతో అన్నాడు గాని ఐదారన్నా వుంటాయని నా నమ్మకం. మొదట్నుంచీ వాడు అంతే నీకు తెలుసుగా! మహా జాగ్రత్త మనిషిలే! ఏ లోకంలో ఉన్నాడో వాళ్ళ నాన ఈ పిల్లల్ని నా మీద ఒదిలేసి పోయాడు. ఏం చేశానో, ఇంత పెద్ద సంసారాన్ని ఒక్కదాన్ని ఎట్లా ఈదానో చూసిన వాళ్ళకి తెలుసు, పైనున్న ఆ భగవంతుడికి తెలుసు. మొత్తం మీద పిల్లగాడు ప్రయోజకుడయ్యాడు. చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు చేశాడు. అందరూ బాగానే లక్షణంగా వున్నారు. ఇక నా బాధ్యతలు తీరిపోయినయ్. ఏదో కృష్ణా రామా అనుకుంటూ కాలక్షేపం చేస్తున్నా,” కళ్ళొత్తుకుంటూ చెప్పిందామె.
నిజమే, అనుకున్నాడు గోపాల్. ఆమె బాగానే కష్టపడింది. పైగా భర్త చనిపోయేటప్పటికి మంచి వయసులో కూడ వుందేమో ఆమె గురించి అప్పట్లో చిలవలు పలవలు చెప్పుకునేవాళ్ళు కూడ. అవి భరిస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేస్తూ, పొలాలు చూసుకుంటూ జాగ్రత్తగా లాక్కొచ్చింది.
“సుబ్బారావు ఏం వ్యాపారం చేస్తున్నాడు?” అడిగాడు.
“ఒకటనేవుంది నాయనా? ఏవేవో చేస్తుంటాడు. రాజకీయ నాయకుల్తో తిరుగుతుంటాడు, మాట్టాడినప్పుడల్లా కొత్త వ్యాపారం చేస్తున్నాడంటాడు. నేను పట్టించుకోవటం మానేశా. తన సంగతులు తను చక్కబెట్టుకునే సమర్థుడయ్యాడు, నాకదే చాలు!” గాల్లోకి చేతులు జోడిస్తూ చెప్పిందామె.
“అవును బాలయ్యా, ఇంతకీ నీకు ఎంతమంది పిల్లలు?” అడిగింది హఠాత్తుగా.
“ఇద్దరు. ఇద్దరూ అబ్బాయిలే!” అన్నాడతను.
“అదృష్టవంతుడివయ్యా. మా సుబ్బారావుకి పెద్దబిడ్డ అమ్మాయి కదా! దానికి మొన్ననే పెళ్ళి కూడ కుదిరింది. ఇంకా ముహూర్తాలు పెట్టుకోలేదు కాని ఇవాళో రేపో అంటున్నారు. అనుకోకుండా సమయానికే వచ్చావు నువ్వు” అందావిడ ఆనందంగా. గోపాల్‌కి ఆశ్చర్యం వేసింది అంత పెద్ద పిల్లలున్నారా సుబ్బారావుకి? తన పిల్లలు ఇద్దరూ ఇంకా ఎలెమెంటరీ స్కూల్లోనే వున్నారు!
“సుబ్బారావుకి అంత పెద్ద పిల్లలున్నారని నాకు తెలీదే!” అన్నాడు.
“పెద్దపిల్లకి మొన్ననే పదిహేడు వెళ్ళి పజ్జెనిమిది వచ్చింది బాలయ్యా! ఐతే మంచి సంబంధం, మనల్ని వెదుక్కుంటూ వచ్చింది.”
“అలానా! అబ్బాయేం చేస్తున్నాడు?”
“ఏం చేసేదేంది బాలయ్యా! అమ్మాయిని అమెరికా ఇస్తున్నామయ్యా!”
“ఓహో అలానా! అక్కడ ఎక్కడుంటాడో అతను?”
“నాకేం తెలుసునయ్యా? ఏదో పేరు చెప్పారు గాని నాకు నోరే తిరగలేదు. ఏదన్నా గాని, అమ్మాయి హాయిగా వుండబోతుంది. నా దిగులు తీరింది. దూరాభారమని ఒకటే బెంగ గాని ఏం చేద్దాం చెప్పు? పైగా నీలాటి వాళ్ళు మనూరోళ్ళే ఒక ఇరవై మంది దాకా అక్కడ వున్నారు గదా! పిల్ల సంగతి కాస్త కనిపెట్టి వుండరూ?”
“అవున్లే, అవున్లే” గబగబా అన్నాడు గోపాల్ ఆ ఇరవై మందిలో ఎవరినీ కలవటం కాని కనీసం ఫోన్లో మాట్లాట్టం కాని ఇంతవరకు జరగలేదని గుర్తొచ్చి.
“అబ్బాయి అమెరికా నించి మొన్నొచ్చాడు. నిన్న పెళ్ళి చూపులు, అక్కడే నిశ్చయతాంబూలాలు కూడ అయినయ్. నాకిక్కడ అర్జంటుగా ఒక పొలం పని వచ్చి పడి ఇటు పరిగెత్తుకొచ్చాను కాని పెళ్ళి ఈ వారం లోపలే వున్నా వుండొచ్చు. ఇవాలో రేపో ముహూర్తాలు పెట్టుకుంటారనుకుంటా. అన్నట్టు, పెళ్ళికి రావటం మాత్రం మర్చిపోవద్దు. ఒక నెలన్నా వుంటావు కదా!”
“అబ్బే, ఓ పదిరోజుల్లో తిరిగెళ్ళాలి”
“అదేంది బాలయ్యా! ఏ పదిహేనేళ్ళకో ఇప్పుడు వచ్చావు, పదిరోజుల్లో పోవాలంటే ఎట్లా? రొండు మూడు నెల్లన్నా సెలవు పెట్టి రావొద్దు?” మెత్తగా మందలించింది.ఏం చెప్పాలో తోచక లేచి నిలబడ్డాడు గోపాల్.
“సుబ్బారావుని ఒకసారి ఫోన్ చెయ్యమనండి. నేను వెళ్ళేలోపుగానే ముహూర్తం కుదిరితే తప్పకుండా పెళ్ళికి వస్తాను” అని బయల్దేరాడు అక్కడినుంచి.
షికారుకెళ్ళి తిరిగొచ్చేసరికి, “ఏం నాయనా, ఇంత ఆలస్యం అయింది? ఇప్పటికే మన సుబ్బారావు నీకోసమని నాలుగు సార్లు ఫోన్ చేశాడే!” అంది అమ్మ వాకిట్లోనే.
కొంచెం ఆశ్చర్యం కలిగింది గోపాల్‌కి సుబ్బారావుకి తనంటే అంత అభిమానం ఎప్పుడు కలిగిందా అని. అలాగే, తన ఇంట్లో వాళ్ళకి సుబ్బారావు ‘మన సుబ్బారావు’ ఎప్పుడయ్యాడో కూడ అతనికి అంతుపట్టలేదు. హైస్కూలు, కాలేజి రోజుల్లో వాళ్ళు స్నేహితులే కాని మరీ ఆప్తమిత్రులు కాదు. పైగా ఇద్దరూ కలిసి ప్రశాంతంగా మాట్లాడుకుని దాదాపుగా పాతికేళ్ళవుతోంది. ఎవరి దార్లు వాళ్ళవయ్యాయి.
“సరే, స్నానం చేసి అతనికి ఫోన్ చేస్తా లే!” అన్నాడు.
“కాస్త ఆగు. తనే ఇప్పుడే ఏ నిమిషంలో నైనా మళ్ళీ చెయ్యొచ్చు. మాట్లాడాకనే స్నానం చేద్దువులే.”
బయటకెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు గోపాల్. చుట్టుపక్కల వాళ్ళు అక్కడ పోగు కావటం మొదయ్యింది. ఊరికే కుశలప్రశ్నలు వేసే వాళ్ళు, “మా అబ్బాయి ఏదో జావా కోర్సంట, చేస్తున్నాడు; వాణ్ణి తీసుకుపోయి నీ దగ్గరే పెట్టుకుని కాస్త ఉద్యోగం చూపించి పెట్టరాదూ?” అనడిగే వాళ్ళు, “ఐతే, ఇప్పుడు నీకు నెలకి ఎంత ఇస్తున్నారు? ఖర్చులన్నీ పోను రొండు లక్షలన్నా వెనకేస్తున్నావా?” అని ఆరా తీసే వాళ్ళు, “మా అమ్మాయీ అల్లుడూ వాళ్ళు ఉండే వూరికి ఎప్పుడన్నా పోయి పలకరించి రారాదూ?” అని మెత్తగా మందలించే వాళ్ళు ఇలా అన్ని దిక్కుల్నించి వస్తున్న ప్రశ్నల్ని చాకచక్యంగా కాచుకుంటూ వీలైనంత జాగ్రత్తగా సమాధానాలు చెప్తూ ఉండగా
మళ్ళీ ఫోనొచ్చింది సుబ్బారావు నుంచి.
“గోపాల్, సరిగ్గా సులేఖ పెళ్ళి సమయానికే నువ్వు రావటం బ్రహ్మాండంగా వుంది. రేప్పొద్దున్నే లగ్నాలు పెట్టుకుంటున్నాం. నువ్వు తప్పకుండా రావాలి,” అన్నాడు సుబ్బారావు ఆప్యాయంగా.
“అలాగే చూద్దాంలే. పెళ్ళికి మాత్రం నేనిక్కడ వుంటే తప్పకుండా వస్తాను,” అన్నాడు గోపాల్ మొహమాటంగా.
“అలా కాదు, రేపు నువ్వు తప్పకుండా రావాలి. ఒక కారిచ్చి మా డ్రైవర్ని ఇప్పుడే అక్కడికి పంపుతున్నా. దగ్గరుండి రేపు పొద్దున్నే నిన్ను ఎక్కించుకుని తీసుకొస్తాడు.”
“అక్కర్లేదు, నేను రాలేనా? ఇక్కడ కారు మాట్లాడుకుని వస్తాను కదా!”
“నువ్వు అమెరికా నుంచి వేలమైళ్ళు ప్రయాణం చేసి వస్తే నేను మనూర్నుంచి ఇక్కడికి నిన్ను తెప్పించకూడదా? ఇంకేం మాట్లాడొద్దు. నువ్వు రేప్పొద్దున్నే బయల్దేరి వస్తున్నావు. పదింటికే లగ్నాలు పెట్టుకునేది. ఉంటా మరి!”
అర్థరాత్రికి సుబ్బారావు చెప్పిన విధంగానే ఓ కారు ఏసీ కారు వచ్చింది. మర్నాడు ఉదయాన్నే బయల్దేరి విజయవాడ వెళ్ళాడు గోపాల్.
ఎంతో విశాలమైన స్థలం మధ్యలో బ్రహ్మాండమైన మేడ కట్టాడు సుబ్బారావు. చుట్టూ మామిడి, కొబ్బరి, జామ చెట్లు చక్కగా ఆరోగ్యంగా పెరిగి వున్నాయి. విస్తుపోయాడు గోపాల్. కారుకి ఎదురుగా వచ్చాడు సుబ్బారావు. గోపాల్‌ని సాదరంగా ఆహ్వానించాడు. ఇంట్లో వాళ్ళందర్నీ పరిచయం చేశాడు. గోపాల్ గురించి విపరీతంగా పొగడ్తలు గుప్పించాడు. మొదట్లో కొంచెం ఇబ్బంది అనిపించినా, కొద్దిసేపటికి గోపాల్ కూడ ఆనందించటం మొదలెట్టాడు. అతనికి విపరీతమైన ప్రాముఖ్యత ఇస్తూ అందరూ ఎంతో భయభక్తుల్ని ప్రదర్శిస్తోంటే కించిత్తు గర్వం కూడ కలిగిందతనికి.
ఇంతలో పెళ్ళివారు తరలివచ్చారు. హుందాగా, తొణికిసలాడుతోన్న ఆత్మవిశ్వాసంతో చిరునవ్వులు చిందుతూ వచ్చాడు పెళ్ళికుమారుడు. అతని పేరు కూడ గోపాలేనట! “పాల్ అని పిలవండి నన్ను. అక్కడ అందరూ అలాగే పిలుస్తారు” అన్నాడతను లోపలికి వస్తూనే.
“ఇతను నా చిన్ననాటి స్నేహితుడు బాలగోపాల్. ఇరవై ఏళ్ళుగా అమెరికాలోనే వుంటున్నాడు” అంటూ తనని పెళ్ళికొడుక్కి పరిచయం చేశాడు సుబ్బారావు.
అందరూ కూర్చున్నాక, “అమెరికా వాళ్ళ భాష అదొక రకంగా వుంటుందని అంటారు కదా, మీరిద్దరూ ఒకసారి మాట్లాడితే వినాలనుంది” అంది శేషమ్మ, గోపాల్ వంక చూస్తూ. గోపాల్ తికమకపడి పోయాడు. బిడియం వేసిందతనికి. ఎవరన్నా ఆ అఘాయిత్యాన్ని అడ్డుకుంటారేమోనని ఆశగా ఎదురుచూశాడు కాని అది జరక్కపోగా అందరూ ఉత్కంఠతో తననే చూస్తున్నట్టు అనిపించి ఇంకా కుంచించుకు పోయాడు. పాల్ మాత్రం అలాటి సందేహాలు ఏమీ లేకుండా టకటక మాట్లాడటం మొదలెట్టాడు. అతని భాషలో తప్పులకి విస్తుపోయాడు గోపాల్. కాని అతను అవేం పట్టించుకోకుండా దర్జాగా మాట్లాడేస్తుంటే గత్యంతరం లేక తనూ బరిలోకి దిగాడు గోపాల్. నాలుగైదు నిమిషాలు అన్నో మరికొన్నో యుగాలుగా గడిచాక, “చాలు నాయనా, నా చెవులు తరించినయ్. బాలయ్య మాట్లాడుతుంటే తెలుగు మాట్లాడుతున్నట్టే వుంది గాని నా మనవడి భాష మాత్రం అచ్చం దొరల భాషలాగానే వుందే!” అని ముచ్చటపడిింది శేషమ్మ ఏమీ మొహమాటం లేకుండా. ఆమెకి ఇంతటి జ్ఞానం వుందా అని ఆశ్చర్యపోయాడు గోపాల్. ఆమె అన్నది నిజమేనని అతనూ మనసులో ఒప్పుకున్నాడు కూడ. మిగిలిన వాళ్ళూ అదే ఆలోచనతో వున్నట్టు కనపడ్డారు. గోపాల్‌కి కొంత ఉక్రోషం వచ్చింది కాని వెంటనే తమాయించుకున్నాడు.
“అబ్బాయికి ఏడాదికి లక్ష డాలర్లు వస్తాయంట. పరవాలేదంటావా? అమ్మాయి కూడ అక్కడికి వెళ్ళాక ఏదన్నా చదువుకుంటే ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుని హాయిగా వుండొచ్చునంటున్నాడు. నిజమేనంటావా?” అడిగింది శేషమ్మ.
గోపాల్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. తన జీతం ఆ లక్ష డాలర్లు చేరుకోవటానికి పదిహేనేళ్ళ పైగా పట్టిందని, నిన్న కాక మొన్ననే తను ఆ అంకెని దాటానని గుర్తొచ్చిందతనికి. అలాటి తను ఏడాది నాడు ఏ ఓరకిల్ కోర్సులో చేసి ఆర్నెలల్లో ఆరంకెలకి ఎదిగిన వాళ్ళ గురించి మాట్లాడబోవటం అతనికి నవ్వుకూడ తెప్పించింది. ఎలాగైతేనేం బింకంగా “పరవాలేదు, ఇద్దరూ కలిసి బాగానే సంపాయించుకోవచ్చు, మిగుల్చుకోనూ వచ్చు” అన్నాడు.
“ఏదోనయ్యా, మీలాటి వాళ్ళు అక్కడ వున్నారనే అంత దూరమైనా అమ్మాయిని అక్కడికి పంపటం. కాస్త వాళ్ళ క్షేమసమాచారాలు గమనిస్తూ వుండు. ఎప్పుడన్నా కాస్తో కూస్తో అవసరమైతే సర్దుతూ వుండు,” అప్పుడే అప్పగింతలు మొదలెట్టేసింది శేషమ్మ. ఓ వెర్రినవ్వు నవ్వి ఊరుకున్నాడు గోపాల్, మరేం చెయ్యాలో తోచక. సుబ్బారావు అప్పటిదాకా తనమీద అంత ఆదరాభిమానాలు ఎందుకు చూపించాడో అర్థమైంది గోపాల్‌కి. దాన్లోనే, సుబ్బారావు వ్యాపారవిజయరహస్యం కూడ అతనికి దర్శనమిచ్చింది.
సుబ్బారావుకీ తృప్తిగా వుంది. అతనికి (కాబోయే)అల్లుడు సమర్థుడేనని అర్థమైంది. నిజానికి అతని ముందు గోపాల్ కూడ చాలడని అనిపించింది. అమెరికాలో అతను బాగానే నెగ్గుకు వస్తున్నాడని తేలిపోయింది. తన నిర్ణయం సరైనదేనని నమ్మకం కుదిరింది.
ఇంతలో పురోహితులు వచ్చారు. లెక్కలు కట్టారు. పంచాంగాలు తిరగేశారు. వాదించుకున్నారు. వివరించుకున్నారు. పదిరోజుల్లో దివ్యమైన ముహూర్తం వుందని తేల్చారు.
గోపాల్ హాయిగా వూపిరి పీల్చుకున్నాడు. ఆ ముహూర్తం నాటికి తనుండడు!