“ఐతే ఇవాళ ఆఫీసులో ఏమిటి విశేషాలు?” అన్నాను సెన్సొడైన్ టూత్‌పేస్ట్‌ని సానిక్ ఎలక్ట్రిక్ టూత్‌బ్రష్ మీద వేసి బ్రష్ చేసుకుంటూ. ఇలా బ్రష్ చేస్తూ నోరు తెరిచి మాట్లాడేసరికి టూత్‌పేస్ట్ నురుగులు కక్కుతూ ఎదురుగా ఉన్న అద్దం మీద చిందింది. చుట్టుపక్కలంతా నురుగు మయమైపోయింది. ఏమీ కంగారు పడకుండా పక్కనే ఉన్న పేపర్ టవల్ రోల్ లోంచి రెండు చించి తుడిచేశాను. వెంటనే గ్లాస్ ప్లస్ స్ప్రే చేసి మళ్ళీ తుడిచాను. సింక్, అద్దం తళతళ లాడ సాగాయి. డెంటిస్ట్ సలహా మీద ఇప్పుడు రోజుకు నాలుగు సార్లు బ్రష్ చెయ్యవలసి వస్తోంది.
నేను ఇంత చేస్తున్నా నా భార్యామణి రాధిక (నేను ముద్దుగా ధికా అనీ, ప్రేమ ఇంకా పొంగుతుంటే ధీ అనీ కూడా పిలుస్తుంటాను) మౌనంగా వుండిపోయింది, ముఖం మీది మూడు నాలుగు లేయర్ల మేకప్‌ని కడుక్కుంటూ, తుడుచుకుంటూ. ఆ తర్వాత ఓ నాలుగడుల పొడవు నిట్టూర్పు విడిచింది.
చిలిపిగా బుగ్గన చిటికేస్తూ “ఏమిటి ఇవాళ పని మరీ ఎక్కువయిందా?” అనడిగాను, తెల్లగా మెరిసిపోతున్న నా దంతాల ధావళ్యానికి ముగ్ధుణ్ణవుతూ.
“ముందు కిందికి వెళ్ళి భోంచేస్తూ మాట్లాడుకుందాం పద హనీ” అంది రాధిక గోముగా. వయసు యాభై దాటినా ఆమె అమెరికా వచ్చిన రోజు ఎలా వుందో ఇప్పుడూ అలాగే కనిపిస్తుంది నా కళ్ళకి. వంటింట్లో లేటెస్ట్ మోడల్ జెన్ ఎయిర్ ఎలక్ట్రిక్ స్టవ్ మీద గుత్తివంకాయ కూర ఉడుకుతున్నది. పక్కనే కార్నింగ్ వేర్ గిన్నెలో పకోడీలు ఘుమఘుమ లాడుతున్నాయి.
ఒక పకోడీని తీసుకుని పటుక్కున కొరికి ఆ రుచిని హాయిగా ఆస్వాదిస్తూ అడిగాను “ఇప్పుడు చెప్పు. ఆఫీసులో ఇవాళ పని మరీ ఎక్కువగా వుందా? అన్నట్టు, ఈ పకోడీలతో పాటు నంచుకోవటానికి మాంఛి కొత్తిమీర పచ్చడి కూడ చేసి వుండాల్సిందోయ్ నువ్వు. అలాగే, వడియాలు లేని గుత్తివంకాయ కూర మిరియాలు లేని చారు లాటిది కదా! కాసిని వడియాలు వేపి వుండాల్సింది. ఇక వీటికి తోడు ముక్కులు ఘుప్పుమనిపించే పులిహోర, చివర్లో దద్ధోజనం, డిజర్ట్ కి శక్రపొంగలీ కూడా చెయ్యాల్సింది ధీ!” అన్నాను నా భార్యారత్నాన్ని మురిపెంగా చూసుకుంటూ.
“ఇవాళ ఏం జరిగిందంటే ..” అని ఏదో చెప్పబోయింది రాధిక ఓ ఉల్లిపాయ పకోడీని ఉల్లాసంగా నముల్తూ. నేనూ చిలిపిగా మరో పకోడీని నోట్లో పెట్టుకుంటూ, “ఎవరినైనా లే ఆఫ్ చేశారా ఏమిటి?” అన్నాను పకోడీ కమ్మదనాన్ని అరమోడ్పు కన్నుల్తో ఆస్వాదిస్తూ.
ఇంతలో నా ట్రెయో సెల్ ఫోన్ కం హేండ్ హెల్డ్ పీసీ “పిలువకురా అలుగకురా” అనే రింగ్ టోన్ తో మోగింది. ఆ రింగ్ టోన్ బట్టి అది మెడికల్ కాలేజ్ లో చదువుతున్న మా పుత్రికాశిరోమణి శారా నుంచి వస్తున్న కాల్ అని గుర్తించాను.
“హాయ్ బడీ, నీ బాయ్ ఫ్రెండ్ మైక్ ఎలా వున్నాడు? అన్నట్టు, ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ వాడేనా లేకపోతే ఈ వారానికి మరొకడు దొరికాడా?” అన్నాను ఫ్రెండ్లీగా. యుక్తవయసొచ్చాక పిల్లల్తో స్నేహితుల్లా ప్రవర్తించాలి తప్ప తల్లిదండ్రులమని పెద్దరికం చూపించటం అనాగరికమని నా ప్రగాఢ విశ్వాసం.
“నో డేడ్, ఇంకా వాడే. కొత్తవాళ్ళ కోసం వెదుకుతున్నా. ఎవడూ సరైనవాడు తగల్లేదు. ఐనా ఈ వారంలో ఇంకా నాలుగు రోజులున్నాయిగా!” అంది నా పుత్రికారాణి.
“కీపిటప్. ఇంకా ఏమిటి విశేషాలు?” అన్నాను మరో పకోడీ కసకస నముల్తూ. అవతలనుంచి ఫోన్లో కరకర చప్పుళ్ళు వినిపిస్తున్నాయి – “అర్గానిక్ కార్న్ తో చేసిన హెల్తీ చిప్స్ తింటున్నాను డేడ్, ఎంత బావున్నాయో! నువ్వూ, మాం భలే ఎంజాయ్ చేస్తారు” అంది శారా కిలకిల నవ్వుతూ, చిప్స్‌ని నోట్లో కరకర రుబ్బుతూ. నేనూ నా భార్యా “జిం-మంకీల”మనీ, ఛాన్స్ దొరికితే జింకి వెళ్ళి గంటల కొద్దీ ఎక్సర్‌సైజ్ చేస్తామనీ, చిప్స్ నోట్లో పెట్టుకుని ఏ ఇరవై ఏళ్ళో అయిందనీ దానికి తెలుసు. “హహ్హహ్హ, నైస్ జోక్, వెరీ నైస్” అన్నాను నేనూ నవ్వు కలుపుతూ, రాధిక కేసి కన్ను గీటుతూ. దాంతో ఆమె కూడ నాతో నవ్వు కలిపింది. ముగ్గురం అలా కాసేపు పగలబడి నవ్వుకున్నాం. ఫేమిలీ వేల్యూస్ అంటే మా ఫేమిలీ అంతా పడిచస్తాం మరి!
“ఓకే డేడ్, మళ్ళీ వచ్చే వారం ఫోన్ చేస్తాను. ఈలోగా ఓ వెయ్యి డాలర్లు నా బేంక్ ఎకౌంట్‌కి వైర్ చెయ్యి, నా క్రెడిట్ కార్డ్ లిమిట్ కూడ పదివేలకి పెంచమను. ఈ వీకెండ్ ఓ ఎక్స్‌క్లూజివ్ పార్టీకి వెళ్ళాలి”
“షూర్. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. మరీ ఎక్కువగా తాగకు. అలాగే డ్రగ్స్‌లో ఈ మధ్య ప్యూరిటీ తగ్గిపోతున్నది, కల్తీ పెరిగిపోతున్నది. జాగ్రత్త” అని చెప్పి తండ్రిగా నా బాధ్యతని నిర్వర్తించాను. “కమాన్ డేడ్, అయాం ఏన్ ఎడల్ట్ నౌ” అంది శారా గోముగా.
“ఓకే బై” అని ఫోన్ పెట్టేశాను.
ఈలోగా రాధిక డైనింగ్ టేబుల్ రెడీ చేసింది. రెడ్ వైన్ రెండు గ్లాసుల్లో నింపి వాసన చూశాను. “టు అవర్ ఫేమిలీ” అని ఇద్దరం వాటిని తాకించి సిప్ చెయ్యసాగాం.
బస్మతి రైస్ తో వండిన అన్నంలో చేరెడు నెయ్యి వేసుకుని ముద్దపప్పు, గుత్తి వంకాయ కూర, ప్రియా ఆవకాయ కలిపిన ముద్ద నోట్లో పెట్టుకుని ఆనందంగా ఆస్వాదిస్తూ మింగాను. ఓ గుక్కెడు వైన్‌ని దానికి తోడుగా పంపించాను. రాధిక కూడ ఆకలి మీద వున్నట్టుంది, మాట్లాడకుండా గుటుకూ గుటుకూ మంటూ ముద్దలు మింగేస్తున్నది.
అలా ఇద్దరమూ పందేలు వేసుకుని వండిన అన్నం, కూరలు, బాటిల్లో ప్రియా పచ్చడితో సహా ఖాళీ చేసేశాం. హాయిగా మీఠీ కిళ్ళీ నవుల్తూ లేజీబాయ్ రిక్లైనర్‌లో నడుం వాల్చాను. బేక్‌గ్రౌండ్‌లో సుబ్బులక్ష్మి సంగీతస్రవంతి సాగుతోంది. ఎదురు గోడ మీది బాపు బొమ్మ చూస్తూ హాయిగా జీవిత సౌఖ్యాన్ని అనుభవించసాగాను.
ఐతే ఇంతలో చక్కటి స్టార్‌బక్స్ కాఫీ తాగలేదని హఠాత్తుగా గుర్తొచ్చి కొన్ని నిమిషాల పాటు విలవిల్లాడి పోయాను. కాసేపు ఆగి తాగొచ్చులే అని సమాధాన పరుచుకుని కొంచెం తేరుకున్నాను.
ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది. రింగ్ టోన్ బట్టి ఎవరో చాలాకాలం నుంచి ఫోన్ చెయ్యని వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది.
“ధికా, ఒకసారి నా కాళ్ళ దగ్గరున్న ఫోన్ హేండ్ సెట్ తీసి ఇవ్వవూ?” అనడిగాను ప్రేమగా. “వస్తున్నా” అని అరిచింది ఎక్కడ్నుంచో. బాత్రూంలో వున్నట్టుంది. నాలుగైదు రింగ్‌లు అయాక వగుర్చుకుంటూ పరిగెత్తుకొచ్చింది. నా కాళ్ళ దగ్గర పడివున్న ఫోన్ తీసి నా చేతికి అందించింది. ఆ కాల్ చేసిన వాడు నా చిన్ననాటి మిత్రుడు సుబ్బారావు. చూసి పదేళ్ళయింది.
“ఒరేయ్ సుబ్బిగా! హౌ ఆర్యూ?” అనరిచాను ఆప్యాయంగా.
“హే హీరో! అయాం డూయింగ్ గ్రేట్” అన్నాడు సుబ్బారావు నీరసంగా.
“ఏమిటి ఏమయ్యింది నీ గొంతు నీరసంగా వినపడుతుంది?” అనడిగాను పగలబడి నవ్వుతూ.
“నీ పాడుబుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. అన్నట్టు ఇంకా సైకాలజిస్టువేనా లేకపోతే ఏ కంప్యూటర్ ప్రోగ్రామర్‌వో అయ్యావా?” అనడిగాడు సుబ్బారావు ఎత్తిపొడుస్తున్నట్టుగా.
“హహ్హహ్హ, ఇంకా నీజోకులు తగ్గలేదు. రెండేళ్ళ నుంచి జనరల్ ప్రాక్టీస్ చేస్తున్నా సరదాగా” అని అసలు విషయం బయటపెట్టాను మెల్లగా.
సుబ్బారావు ఇలా హఠాత్తుగా ఫోన్ చెయ్యటం వెనక ఏదో అంతరార్థం వుందని నా సూక్ష్మబుద్ధి వెంటనే గ్రహించేసింది. ఐనా తను బయటపెట్టేవరకు గుంభనంగా వుండాలని నిర్ణయించుకున్నాను.
“మాకు వెదర్ బ్రహ్మాండంగా వుందిరా సుబ్బిగా. చెట్లు పూలతో విరగబూసి మనం హైస్కూల్లో ఉన్నప్పుడు ఆడపిల్లలు ఎలా ముసిముసినవ్వుల్తో అటూ ఇటూ చూస్తూండే వాళ్ళో అలా చూస్తున్నాయి. రోడ్లు జడల్నిండా పూలమాలలు పెట్టుకుని మేటినీ సిన్మాకి వెళ్తున్న కాలేజి అమ్మాయిల్లా కళకళలాడుతున్నాయి. ఆకాశం ఆదివారం నాడు కాలేజి గ్రౌండ్స్ లాగా ప్రశాంతంగా వుంది…” అంటూ తన్మయత్వంతో నేను వర్ణిస్తుంటే నా భార్యామణి ఆరాధనగా నా వంక చూస్తూ నిలబడిపోయింది.
అవతల సుబ్బారావు నీళ్ళు నవుల్తూ గుటకలు మింగటం నాకు వినిపిస్తూనే వుంది. ఐనా తను బయటపడేవరకు నేనూ అడగదల్చుకోలేదు. “ఇక జీవితం అంటావా – మూడు పువ్వులూ ఆరు కాయలేననుకో! బెంగుళూర్‌లో ఇల్లు రెండేళ్ళలో పదింతలు పెరిగింది, హైదరాబాద్‌లో కొన్న వందెకరాల పొలం వందరెట్లు పెరిగింది. మెడికేర్, మెడికైడ్ లని మోసం చేస్తూ హాయిగా దోచుకుతింటున్నానిక్కడ. ఆంధ్రాకి వెళ్ళినప్పుడల్లా సన్మానాలు, బిరుదులూ. సినిమా తియ్యమని అక్కడి డైరెక్టర్లు, యాక్టర్లు రోజుకి పదిసార్లు ఫోన్ చేస్తున్నారు. వడ్డించిన విస్తరి నా జీవితం! అన్నట్టు, ఆ మధ్య నీ ఉద్యోగం పోయిందని విన్నాను – మీవూరి వాళ్ళెవరో ఏ తానాలోనో ఎనౌన్స్ చేసినట్టు గుర్తు. ఇంకా అలాగే వున్నావా లేకపోతే ఏదన్నా డొక్కు ఉద్యోగం దొరికిందా?
కాలు మీద కాలేసుకుని కూర్చుని అనెంప్లాయ్‌మెంట్ చెక్కులు పుచ్చుకుంటున్నావా ఏమిటి కొంపదీసి?” ఛలోక్తిగా అంటూ పక్కనే వున్న బల్లని బిగ్గరగా చరిచాను.
అది విన్నాడో లేడో తెలీదు గాని ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే సుబ్బారావు అసలుకథలోకి వచ్చేశాడు. “ఇక్కడ మా వూళ్ళో పిచ్చిరెడ్డి అని ఒక ప్రాణస్నేహితుడున్నాడు. వాడికి ఆ మధ్య స్ట్రోక్ వచ్చి అది పక్షవాతానికి దారితీసి మంచం పట్టాడు. ఇదిచూసి కాలేజి చదువుతున్న కొడుక్కి జీవితం మీద విరక్తి కలిగి ఊళ్ళుపట్టి పోయాడు. హైస్కూల్ సీనియర్ ఇయర్‌లో ఉన్న కూతురు ఎవడో నల్లవాడితో లేచిపోయింది. పాతికేళ్ళుగా పనిచేస్తున్న కంపెనీ ఉద్యోగం లోంచి ఊడబీకేసింది. మార్ట్‌గేజ్ కట్టలేకపోతే బేంక్ ఇల్లు స్వాధీనం చేసుకుంది. ఇవన్నీ జరిగేటప్పటికి తట్టుకోలేక పిచ్చిరెడ్డికి పిచ్చెక్కింది. ఆ పిచ్చిలో ఓ రోజు ఓ మొద్దుకత్తితో భార్యని పొడిచేశాడు. ఐతే ఆమె బతికి ఇప్పుడు వాడికి విడాకులు ఇస్తానని పట్టుబట్టుకు కూచుంది. ఎలాగైనా సరే అలా జరక్కుండా చూడాలని ఇక్కడి ఊరిపెద్దలం అందరం కిందా మీదా పడుతున్నాం. నీ సలహా కోసం ఫోన్ చేశాను” అన్నాడు సుబ్బారావు వినమ్రంగా.
ఇదంతా నాకు కొట్టినపిండే. ఇలాటి కేసులు వారానికొకటి పరిష్కరించి పారేస్తుంటాను. ఇదో లెక్కా? ఐతే ముందుగా, నా వాదనాపటిమతో సుబ్బారావుని చిత్తుచెయ్యదల్చుకున్నాను.
“సుబ్బిగా, పాతికేళ్ళ నుంచి ఇక్కడ వుంటున్నా అమెరికా జీవితం గురించి ఏమీ తెలీదు నీకు. ఒకసారి విడాకులు ఇవ్వాల్సిందే అని నిశ్చయించుకున్న వాళ్ళలో ఎంత శాతం మంది వాళ్ళ మనసు మార్చుకుని అదే మేరేజ్‌లో వుండిపోతారో తెలుసా?” అనడిగాను, వాడికి ఆ విషయం తెలిసుండదనే గట్టి నమ్మకంతో.
“ఆరు శాతం” అన్నాడు సుబ్బారావు గంభీరంగా.
నిజమేమిటో నాకూ తెలీదు గనక ఓహో, కాబోలు ననుకుని “మరి ఆ విషయం తెలిసి కూడ ఆమె మనసు మార్చాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్?” అని గుచ్చి గుచ్చి ప్రశ్నించా.
“నిజమేరా, ఇన్నాళ్ళూ నాకీ ఐడియానే రాలేదు!” అన్నాడు సుబ్బారావు ఆశ్చర్యంగా.ఇంత తేలిగ్గా సరెండర్ ఐపోతాడనుకోలేదు. మజా ఏమీ రాకుండానే దీన్నిలా వదిలేస్తే ఎలా?
“తొందరపడకు. ఊరికే ఒక డేటా పాయింట్ ఇచ్చానంతే. అంతమాత్రం చేత ఆమె ఆ ఆరు శాతంలో ఉండకూడదని కాదు. పైగా అది వర్తించేది తెల్లవాళ్ళకే, పిచ్చిరెడ్డి లాటి వాళ్ళ భార్యలకి కాదు” వాడ్ని బుజ్జగిస్తూ చెప్పాను.
“కాని పిచ్చిరెడ్డి వైఫ్ వైట్ వుమన్ మరి!” అన్నాడు సుబ్బారావు నాకు అడ్డు తగుల్తూ. ఇలా ప్రతి చిన్న విషయాన్నీ సీరియస్‌గా తీసుకునే వాళ్ళంటే నాకు చిరాకు.
“సుబ్బిగా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఫారెన్ నుంచి వచ్చే పుల్లాయిల్ని, పిచ్చిరెడ్లని పెళ్ళి చేసుకునే తెల్లవాళ్ళు తెల్లవాళ్ళలో లెక్కకాదు. కాబట్టి ఇలాటి స్టెటిస్టిక్స్ వాళ్ళకి వాడకూడదు” అని వాడి బుర్రకెక్కే భాషలో స్పష్టంగా చెప్పాను. హైస్కూల్లో ఉండగా అన్నిట్లో వాడికి ఫస్ట్‌మార్కులూ నాకు లాస్ట్‌మార్కులూ వచ్చినంత మాత్రాన వాడేదో గొప్పవాడు కాదుగదా!
“అలా అంటావా? మరైతే ఆ స్టెటిస్టిక్ గురించి నువ్వు నన్ను ఎందుకు అడిగావు?” అనడిగాడు అమాయకుడు సుబ్బారావు.
“ఏ పుట్టలో ఏ పావుందో కెలికితే తప్ప తెలీదు గదా, అందుకని” అని వివరించాను. మళ్ళీ ఇలాటి తలా తోకా లేని ప్రశ్నలడిగే అవకాశం ఇవ్వకుండా, “అసలు ఫేమిలీ అంటే ఏమిటి? ఓ ఫేమిలీలో విడాకుల ప్రసక్తి ఎందుకు రావాలి? ఎందుకు వస్తుంది? అందుకు బాధ్యులెవరు? ప్రభుత్వమా? సమాజమా? లిబరల్సా? గ్లోబలైజేషనా? ఎవరు? ఎవరు?” గర్జిస్తూ వాడి మీద ప్రశ్నల వర్షం కురిపించాను. నా ఈధాటికి తట్టుకోమను వెధవని!
“నువ్వడిగే ప్రశ్నలకీ నేను మాట్లాడుతున్న సమస్యకీ సంబంధం ఏమిటి?” కంగారుగా అడిగాడు సుబ్బారావు.
“సంబంధమా సంబంధమున్నరా? విడాకుల గురించి మాట్లాడటం అంటే మాటలా? మొగుడు ఎలాటివాడైనా పక్షవాతంతో బాధపడుతుంటే పెళ్ళాం చెయ్యాల్సింది వాడికి సేవలా లేకపోతే విడాకులకి కోర్టుకెళ్ళటమా? నేనొప్పుకోనంతే!” దృఢంగా చెప్పాను.
“బాగానే వుంది. మరి ఆ జూడీని అందుకు ఒప్పించటం ఎలాగనేదే కదా ఇప్పటి సమస్య!”
“ముందు మనం ఈ సమస్యకి మూలం ఏమిటో ఆలోచించాలి. ఇండియన్ కల్చర్‌కీ వెస్టర్న్ కల్చర్‌కీ ఉన్న తేడాల్ని చర్చించాలి. క్రీస్తుపూర్వం పదోశతాబ్దంలో జరిగిన సంఘటనలకి ఇందులో ఎంత పాత్ర వుందో తెలుసుకోవాలి. ..” ఆవేశంగా అన్ని విషయాల్నీ కూలంకషంగా చర్చిద్దామని ఉత్సాహపడుతుంటే ఇంతలో ఫోన్ కనెక్షన్ పోయింది. మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా సుబ్బారావు ఫోన్ బిజీగా వుండటంతో ఇక ఇవాల్టికి చాల్లే అని వాడిమీద దయతల్చి వొదిలేశాను.
“ఇంతకీ ఇవాళ ఆఫీసులో ఏంజరిగిందంటే …” ఏదో చెప్పబోయింది రాధిక.
“అన్నట్టు నా కాఫీ ఏది? ఇందాకట్నుంచి కాఫీ గురించి ఎంత బెంగ పెట్టుకుని వున్నానో! ఆ వాసన్ని తల్చుకుంటూ వుంటే మనసంతా ఏదోలా ఐపోతోంది. ఆహా, చక్కటి బెల్జియన్ కాఫీ రుచే రుచి.” కాఫీని తల్చుకుంటూ తన్మయంగా అన్నాను.
“సుబ్బారావు గారు ఏమంటున్నారు? ఫోన్లో ఏదో విడాకులంటున్నారు ఏమిటి?”
“ఈ ప్రపంచం ఏమైపోతున్నదో అర్థం కావటం లేదు. వాళ్ళ ఊళ్ళో ఎవరో విడాకులు తీసుకోబోతుంటే సుబ్బారావు దాన్ని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నాడు. గుడ్ ఫర్ హిం” అన్నాను ఆలోచిస్తూ.
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. ముందుగా ఫోన్ చెయ్యకుండా ఇలా ఊడిపడి తలుపు కొట్టే వాళ్ళెవరా అని ఆలోచిస్తూ నిలపడిపోయాను. రాధిక హడావుడిగా వెళ్ళి తలుపు తెరిచింది.
ఎవడో ఆజానుబాహుడైన నల్లవాడు నిగనిగలాడే కండల్తో లోపలికి వచ్చాడు. కొంప మునిగింది, పోలీసులకి ఫోన్ చేద్దామని చూస్తే నా లేజీబాయ్ రిక్లైనర్ కింద పడివుందది. కిందికి వంగి దాన్ని తియ్యలేను కనుక వాణ్ణి భయపెడదామని ఓ కిచెన్ నైఫ్ తీసి పట్టుకున్నాను.
రాధిక వాణ్ణి లోపలికి ఆహ్వానించి కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్నది. నేను బిత్తరచూపులు చూస్తుంటే, “హాయ్, అయాం బిల్” అన్నాడు వాడు చెయ్యి చాపుతూ.
“హనీ, మీట్ బిల్. ఆఫీసులో నా బాస్. ఎ వెరీ నైస్ జెంటిల్‌మన్. గత ఆర్నెలల్నుంచి మా ఇద్దరి మధ్య ఎఫైర్ సాగుతోంది. దీన్ని రహస్యంగా ఉంచటం ఇష్టం లేక ఇలా అతన్ని మన ఇంటికి రమ్మని నేనే ఆహ్వానించా. ఆ విషయం ఇందాకట్నుంచి చెప్పటం కుదర్లేదు. నువ్వు ఎంత ఓపెన్‌మైండెడ్ పర్సన్ వో చేప్తే చాలా ఆనందించాడు. బిల్ కూడా చాలా ఓపెన్‌మైండెడ్ గై. నీకు అభ్యంతరం లేకపోతే తనూ వచ్చి ఇక్కడ మనతోనే ఉంటానంటున్నాడు. అప్పుడు ముగ్గురమూ కలిసి హాయిగా వుండొచ్చు. లేదంటావా నీకు డివోర్స్ ఇచ్చి అతనితో వెళ్ళిపోతాను. ఈ రెంటిలో నీకు ఏది కావాలో తేల్చుకో. ఏమంటావు?” అన్నది పతివ్రతాశిరోమణి రాధిక.
కత్తితో వాళ్ళని పొడవటమా లేకపోతే నన్ను నేను పొడుచుకోవటమా అని ఒక్కక్షణం తర్కించాను కాని నాలాటి సివిలైజ్‌డ్ పర్సన్‌కి అది తగని పని అని వెంటనే గ్రహించి నాలిక్కరుచుకున్నాను.
ఐతే సమాధానం ఏమని చెప్పాలో మాత్రం వెంటనే తట్టిచావలేదు నాకు.