మోహన్ ఆఫీసులోకి అడుగుపెట్టేసరికి పెద్ద “వెల్‌కమ్ బేక్” అన్న బేనర్ ఎదురుగా కనిపించింది.
“వెల్‌కమ్ బేక్ మొహాన్!” అని ఒక పాటలా పాడారు మిగిలిన ఎంప్లాయీస్ అందరూ.
“తేంక్ యు ఆల్” అప్రయత్నంగానే అన్నాడు మోహన్. కాని అతని మనస్సు పూర్తిగా అక్కడ లేదు.
అతను కొంత ముభావంగా వుండడం గుర్తించి అందరూ పనుల్లోకి వెళ్ళిపోయారు.
అతని అసిస్టంట్ లిజ్జీకి మాత్రం అంతటితో వదలాలని అనిపించలేదు. ఆమెకు అతని దగ్గర చనువు కూడ ఎక్కువే.
“ఏమిటి మొహాన్! ఇంకా ఆఫీసులో కూడ సరిగ్గా అడుగుపెట్టలేదు. అప్పుడే ఇంటికి వెళ్ళాలని అనిపిస్తుందా ఏమిటి?” అని అడిగింది చిలిపిగా.
అతను ఏమీ మాట్లాడలేదు.
లిజ్జీకి మోహన్‌తో పదేళ్ళ పైగా పరిచయం ఉంది. ఇద్దరూ కలిసి ఒకే కంపెనీలో కొంత కాలం పనిచేసారు. ఆ తర్వాత మోహన్ బయటకు వచ్చి తనే ఒక కంపెనీ స్టార్ట్ చేసాక ఆమెని అడిగాడు వచ్చి తన కంపెనీలో చేరమని. అలా దాదాపుగా కంపెనీ మొదలైనప్పటి నుంచి లిజ్జీ అతనికి అసిస్టెంట్‌గా పనిచేస్తున్నది.
” ఐతే మీ వెడ్డింగ్ బాగా జరిగిందా? హనీమూన్‌కి ఎక్కడికి వెళ్ళారు?” ప్రశ్నలు కురిపించింది అతని మీద.
“లిజ్జీ! ప్లీజ్ లీవ్ మి ఎలోన్ ఫర్ సమ్ టైమ్”
దెబ్బ తిన్నట్టు అతని వంక ఓ చూపు చూసి వెళ్ళిపోయింది.
బేక్ లాగ్ లో ఉండిపోయిన ఈమెయిల్స్, లెటర్స్ చూస్తూండగానే లంచ్ టైమ్ అయింది.
“మొహాన్! ఆర్ యు ప్లానింగ్ ఎనీ స్పెషల్ పార్టీ ఫర్ అజ్?” అంటూ వచ్చాడు మైక్. అతను మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్.
“సారీ మైక్! అయామ్ స్వాంప్డ్ విత్ లాట్స్ ఆఫ్ స్టఫ్ టు టేక్ కేర్ ఆఫ్”
“ఒకే, అనదర్ టైమ్ దెన్”
మోహన్ ఆలోచనలు ఆ ముందు రోజుకు పరుగు తీసినయ్.
మోహన్ కీ, వాళ్ళ మేనమామ కూతురు ఉషకీ పది రోజుల క్రితం పెళ్ళి జరిగింది. మోహన్ తల్లిదండ్రులు ఇరవై ఏళ్ళ క్రితం అమెరికాకు వచ్చెయ్యడంతో ఎప్పుడన్నా ఇండియా వెళ్ళినప్పుడు తప్ప రెండు కుటుంబాల మధ్య సంబంధాలు పెద్దగా లేవు ఇన్నాళ్ళూ. మోహన్‌కిప్పుడు ఇరవై ఆరేళ్ళు. మొదటి నుంచీ అతను “హై ఎచీవర్” కావడం మూలాన గర్ల్ ఫ్రెండ్స్ తో తిరిగి కాలం గడపడం అతనికి చాలా సిల్లీగా అనిపించేది. పైగా ఎప్పుడూ ఎంతో బిజీగా వున్నందువల్ల ఆ విషయం లోతుగా ఆలోచించే అవకాశం కూడ కలగలేదు. అందువల్ల తల్లిదండ్రులు ఇండియాలో సంబంధం చూస్తామంటే అలాగే నన్నాడు. ఇంటలెక్చ్యువల్ క్యూరియాసిటీ వుండడం అనేది ఒక్కటే అతను తనకు కాబోయే భార్యలో కోరుకున్నది.
ఉష సోషియాలజీలో పి. హెచ్. డి. చేసింది. చాలా దగ్గర సంబంధం, అందులోనూ పూర్తిగా తెలిసిన కుటుంబం కాబట్టి అతని తల్లిదండ్రులు ఇష్టపడ్డారు. మోహన్ కూడ ఉషతో ఫోన్లో మాట్లాడాడు. చాలా స్మార్ట్ వుమన్ లా అనిపించింది.
తర్వాత ఏర్పాట్లన్నీ చకచక జరిగిపోయినయ్. వైభవంగా విజయవాడలో పెళ్ళి జరిగింది.
పెళ్ళైన దగ్గర్నుంచి వీసా తెచ్చుకునే హడావుడి, ఆ తర్వాత అందరికీ టికెట్లు సంపాయించే పన్లు.
మోహన్ కంపెనీ ని కొనడానికి ఒక కంపెనీ కొంత ఇంటరెస్ట్ చూపిస్తున్నది. ఇండియా నుంచే ఆ వ్యవహారాలు చూస్తున్నాడతను.
మొత్తం మీద వారం రోజుల్లో ప్రయాణం కుదిరింది.
మోహన్, ఉష బిజినెస్ క్లాసులో ముందుగా వచ్చారు. అతని తల్లిదండ్రులు, ఆమె తల్లిదండ్రులు కలిసి నాలుగు రోజుల తర్వాత రాబోతున్నారు.
శాన్ ఫ్రాన్‌సిస్కో ఎయిర్ పోర్ట్‌లో దిగి సామాన్లు తీసుకోబోయాడు మోహన్. ఉష అతన్ని అనుసరించింది.
అంతలో ఎవరో వ్యక్తి అక్కడికి రావడం, ఆమె అతన్ని చూసి చిరునవ్వు నవ్వడం గమనించాడు మోహన్. సామాన్లు తీసుకుని వచ్చేసరికి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు.
వాటిలోంచి తన సూట్ కేస్ ను అతనికి చూపించింది ఉష. ఆ కొత్త వ్యక్తి ఆ సూట్ కేస్ ను తీసుకున్నాడు.
“మోహన్! అయామ్ సారీ!” చటుక్కున అతని బుగ్గ మీద ముద్దిచ్చి మళ్ళీ అతని వంక చూడకుండా ఆ ఆగంతకుడితో వెళ్ళిపోయింది ఉష.
ఏం జరిగిందో మోహన్‌కి అర్థం కావడానికి చాల సేపు పట్టింది.
అర్థం అయ్యాక ముందు నమ్మలేక పోయాడు.
కలేమో అని అనుమానం కూడ వచ్చింది.
చివరికి నిజమేనని తేలే సరికి సామాన్లు చేత పట్టుకుని తనొక్కడే నిలబడి వున్నాడు.
అదివరకే తను విన్న ఇలాటి ఒకటి రెండు కథలు గుర్తొచ్చాయి.
ఇదేదో టీవీ రియాలిటీ షో లాగా, తను దాన్లో ఒక “జో ష్మో” లాగా అనిపించింది.
ఐతే, ఇప్పుడు తను ఏంచెయ్యాలో ఎవరూ స్క్రిప్ట్ రాయలేదు!
అందరూ లంచ్ నుంచి తిరిగి వచ్చాక జరిగిన విషయం అంతా అందరి ముందు చెప్పాడు మోహన్. ఇలాటి విషయాలు దాచి ప్రయోజనం లేదని మోహన్‌కి బాగా తెలుసు. ఎలాగైనా బయటకు రావడం తప్పదు.
నమ్మలేనట్లుగా చూసారు అందరూ. ఒకరిద్దరు వాళ్ళు కూడ ఇలాటి కథలు విన్నట్లు చెప్పారు.
చైనీస్ వాళ్ళలో ఇలాటి సంఘటనలు చాల జరిగాయని ఒకరు చెప్పారు.
బహుశా ప్రతి కొత్త ఇమిగ్రెంట్ గ్రూప్ ఇలాటి అనుభవాల్ని కొత్తగా ఎక్స్‌పీరియన్స్ చెయ్యాలేమో అన్నారొకరు.
అరేంజ్డ్ మేరేజెస్, ఎమిగ్రేషన్ కలిసినప్పుడు కలిగే ఒక సైడ్ ఎఫెక్ట్ ఇది అన్నారు మరొకరు.
అసలు ఏసియన్ రేసుల్లో ఈ గుణం వున్నదా అని ఒకతను అనుమానం వెలిబుచ్చి, అందరి చూపులు కోపంగా అతని మీద పడడంతో నాలిక్కరుచుకున్నాడు.
చర్చ ప్రేమలు, పెళ్ళిళ్ళ మీదికి తిరిగింది.
“ఇక్కడ పెళ్ళిని పవిత్రమైందిగా భావిస్తారు” అంటూనే, “అందులో సగం పైగా విడాకుల్లో ముగిసినా!” అని చేర్చాడు జాన్.
“నిజమే! ఇండియాలో కూడ పెళ్ళి పవిత్రమైందే. పైగా ఇక్కడున్నంత డివొర్స్ రేట్ కూడ లేదక్కడ” అన్నాడు రమేష్. అతనో సాఫ్ట్ వేర్ ఆర్కిటెక్ట్.
“బాలీవుడ్ మూవీస్ చూస్తే ప్రేమ గొప్పదని, ప్రేమతో ప్రారంభం కాని పెళ్ళి పనికిమాలినదని మీ ఉద్దేశ్యంలా కనిపిస్తుందే!” ఈ మధ్యనే కొన్ని హిందీ సినిమాలు చూసిన తన పరిజ్ఞానాన్ని చూపించాడు మైక్.
“ఔను. ప్రేమ నుంచే పెళ్ళికి దారి ఉండాలని, పెద్దవాళ్ళు అరేంజ్ చేసే పెళ్ళి నరకం అని ఇండియన్ మూవీస్ ఎప్పట్నుంచో నూరిపోస్తూనే వున్నాయి. కాని దానివల్ల అరేంజ్డ్ మేరేజెస్ సంఖ్య అంతగా ఏమీ తగ్గలేదు. కొన్ని లవ్ మేరేజెస్ ఉన్నా, వాటి సంఖ్య ఇంకా తక్కువే. మహా ఐతే ఫైవ్ పర్సెంట్ ఉంటాయేమో!” ఆలోచిస్తూ అన్నాడు రమేష్.
“పెళ్ళి ఎలాటిదైనా, కనీసం తను పెళ్ళి చేసుకున్న వ్యక్తి ఎలాటి వాడో కూడ తెలుసుకోకుండా ఇంత హ్యుమిలియేటింగ్‌గా పారిపోవడం నేను అర్థం చేసుకోలేక పోతున్నాను. హౌ కెన్ ఎ పర్సన్ డు దిస్ టు అనదర్?” తనలో తను అనుకుంటున్నట్లు అన్నాడు మోహన్.
“ఇదేదో చాలా ఎబ్నార్మల్ సైకాలజీ అనిపిస్తున్నది నాకు. పెళ్ళికి ముందు అల్టార్ దగ్గర దాకా వెళ్ళి మానేసే వాళ్ళు అక్కడక్కడ కనిపిస్తారు కాని మరీ ఇలా పెళ్ళైన వెంటనే పారిపోవడం ఇట్స్ బియాండ్ మై కాంప్రహెన్‌షన్” అన్నది లిజ్జీ.
“వీసా కోసం పెళ్ళి చేసుకుని ఉండొచ్చునేమో!” అన్నాడు జాన్, తను చూసిన “గ్రీన్‌కార్డ్” లాటి సినిమాలను గుర్తు తెచ్చుకుంటూ.
“ఇంకో లవర్ ముందుగానే ఉంటే, ఆ విషయం చెప్పకుండా పెళ్ళి చేసుకోవడమే కాకుండా ఎయిర్‌పోర్ట్ లో నుంచే అతన్తో వెళ్ళిపోవడం ఇట్ షోస్ టోటల్ లేక్ ఆఫ్ ఎతిక్స్ అండ్ మోరల్స్” లిజ్జీ మళ్ళీ అన్నది.
“ఇప్పుడు ఏం చెయ్యాలో నాకేమీ అర్థం కావడం లేదు. రెండే మార్గాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఐ. యన్. యస్. కి రిపోర్ట్ చెయ్యడం. రెండోది ఏమీ చెయ్యకుండా ఊరుకోవడం” అన్నాడు మోహన్ ఆలోచిస్తూ.
“ఊరుకోవడం చాలా ప్రమాదం మొహాన్. ఆమె ఇప్పుడు నీ భార్య అనే విషయం మర్చిపోకు…” అని జాన్ ఏదో చెప్పబోతుండగా మైక్ వెంటనే అందుకున్నాడు.
“దానికి ఋజువు ఏమిటి? ఇక్కడ మీరు ఎలాటి పేపర్లు ఇంకా ఫైల్ చెయ్యలేదు కదా! కాబట్టి ఇక్కడ నీ స్టేటస్ ఇంతకు ముందు ఏదో ఇప్పుడూ అదే. నువ్వు నీ మేరిటల్ స్టేటస్ ఛేంజ్ ఫైల్ చేసే వరకు అది మారదు.”
“పోనీ ఆమె తనొక్కతే వెళ్ళి పేపర్లు ఫైల్ చెయ్యకూడదా?”
“వీల్లేదు.”
“ఫేక్ పేపర్స్‌తో ఆ రెండో వ్యక్తే మొహాన్‌గా యాక్ట్ చేస్తేనో?”
“అది చాల డేంజెరస్ వ్యవహారం. ఏ మాత్రం అనుమానం వచ్చినా ముందు ఇద్దర్నీ జైల్లో పడేస్తారు”
ఇదంతా విన్నాడు మోహన్. “కాబట్టి, ఏమీ చెయ్యకపోతే నష్టం కలగదని మీ అభిప్రాయం! అది నిజమేననుకుంటాను. ఎందుకైనా మంచిది, ఒక అటార్నీని కూడ కన్సల్ట్ చేస్తాను. కాని, అలా వదిలేస్తే, ఇలాటి వాళ్ళను ఇంకా ఎంకరేజ్ చేసినట్లేగా! నేను ఈ విషయం మర్చిపోయి ఊరుకుంటే ఇంకా నాలాటి వాళ్ళు ఎందరో దెబ్బ తినే అవకాశం వుంది కదా!”
“కాని, నువ్వు ఐ. యన్. యస్. కి రిపోర్ట్ చేసినందువల్ల నీకు కలిగే ఉపయోగం ఏమీ లేదు. పైగా ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. పేపర్లలో, టీవీలో వచ్చినా రావొచ్చు. దానివల్ల నీకు, మన కంపెనీకి కూడ చెడ్డపేరు వస్తుందేమో ఆలోచించుకో” రమేష్ అన్నాడు.
“ఇక్కడ మొహాన్ విక్టిమ్ అనే విషయం మర్చిపోవద్దు. అందువల్ల ఈ విషయం బయటకు వచ్చినా అతని మీద ప్రజలకు సానుభూతే కలుగుతుంది కాని, ఎవరూ చెడ్డగా అనుకోరు.” మైక్ వెంటనే అన్నాడు. దీనివల్ల కంపెనీకి కూడ ఫ్రీ పబ్లిసిటీ వచ్చే అవకాశం ఉందని గుర్తించాడతను.
“ఐ తింక్ దట్స్ ఎనఫ్! మొహాన్‌కి కొంచెం ఆలోచించుకునే టైమ్ ఇద్దాం. లెట్ హిమ్ డిసైడ్ వాట్ హి వాంట్స్ టు డు” అని లిజ్జీ ఆ చర్చను ఆపేసింది.
మోహన్ తల్లిదండ్రులు, ఉష తల్లిదండ్రులు కూడ వచ్చారు. వాళ్ళను తీసుకు రావడానికి మోహన్ ఎయిర్ పోర్ట్‌కి వెళ్ళాడు కాని జరిగిన విషయం అక్కడ చెప్పలేదు వాళ్ళకి. ఇంటికి వచ్చాక ఉష కనపడడం లేదే అని అడిగారు వాళ్ళు. అప్పుడు మెల్లగా అంతా చెప్పాడతను.
అందరూ షాకయ్యారు అది విని.
ఉష తల్లిదండ్రులకు వెంటనే అక్కడి నుంచి పారిపోదామా అనిపించింది. ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో తెలియక ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు.
“అన్నయ్యా! మన కుటుంబం లో పిల్ల, చిన్నప్పట్నుంచి తెలిసింది అని వాణ్ణి పట్టుబట్టి ఈ సంబంధం చేసాను. అందుకు నాకు బాగా మేలు చేసావే!” అన్నది మోహన్ తల్లి సుభద్ర, వాళ్ళ అన్న సుబ్బారావుతో.
“సుభద్రా! అలా మాట్లాడకు. వాళ్ళకు మాత్రం తెలుసా ఇలా జరగబోతుందని? ఇప్పుడు ఇండియాలో తల్లిదండ్రుల్నో, లేకపోతే కుటుంబాన్నో చూసి పిల్లలు ఎలా ఉండబోతారో ఎవరూ చెప్పలేరు. ఆ కాలం ఎప్పుడో పోయింది. చుట్టాలని, సొంత కులం అని చాదస్తంలో పడి మనలాటి వాళ్ళు అనుకోవడమే కాని పిల్లల ప్రవర్తనకు వాటితో ఏమీ సంబంధం లేకుండా పోతున్నది.” అన్నాడు మోహన్ తండ్రి విజయ్.
“తేంక్స్ బావా! కాని దీన్లో మా ప్రమేయం అసలేమీ లేదనడం కూడ సరి కాదు. పిల్ల తల్లిదండ్రులుగా మాకు కనీసం దాని స్వభావం గురించైనా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అది మేము సరిగా నిర్వర్తించలేక పోయాం” అన్నాడు సుబ్బారావు బాధగా.
“దానికి మరీ స్వతంత్రం ఇచ్చేస్తున్నారు, అది ఆ తర్వాత మన మాట అసలు వినదు అని ఎప్పట్నుంచో మొత్తుకుంటూనే వున్నాను. ఐనా నేనేదో పాతకాలం దాన్నయినట్లు, మీరు ముందు తరం వాళ్ళయినట్లు నామాట కొట్టిపారేసారు. ఇప్పుడు మీ మూలానే ఇలా ఐంది!” అంది వాళ్ళావిడ అతన్ని దెప్పిపొడుస్తూ, ముక్కు చీదేస్తూ.
“అసలు, వాడెవడో, ఎక్కడుంటాడో కూడ మనకు తెలియదు కదా!” అన్నాడు విజయ్.
“తెలియకుండా ఎక్కడకు పోతుందిలే! ఇక్కడ దాని ఫ్రెండ్స్ కొందరున్నారు. వాళ్ళను కనుక్కుంటే ఎవరో ఒకరికి తెలియక పోదు. కాని, తెలుసుకుని ఏం చెయ్యగలం అన్నది ఇప్పుడు ప్రశ్న” అన్నాడు సుబ్బారావు.
“నిజమే. బలవంతాన తీసుకొచ్చి కాపరం చేయించలేం. అందుకు అది ఒప్పుకున్నా మోహన్ ఒప్పుకోడు. ఎవరి దాకానో ఎందుకు, నేనే ఒప్పుకోను!” అంది సుభద్ర తెగేసి చెప్తూ.
ఎంతో సేపు అలా తర్జన భర్జనలు సాగాయి. ఏం చెయ్యాలో ఏమీ తేలలేదు. పిల్ల తనంత తానుగా వెళ్ళింది కాబట్టి ఎవరి మీద పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడానికి లేదు. మహా ఐతే తల్లిదండ్రుల్తో ఇక ముందు ఎలాటి సంబంధాలు ఉండవని చెప్పొచ్చు. కాని ముందు ముందు ఏమౌతుందో ఎలా జరుగుతుందో ఎవరు చెప్పగలరు?
ఈ పనికి శిక్షగా ఐ. యన్. యస్. కి రిపోర్ట్ చేసి ఆమె వీసాని కేన్సిల్ చేయించొచ్చు. వాళ్ళు ఆమెని డిపోర్ట్ చేసి పంపుతారు.
కాని, ఆ తర్వాత?
ఏం చెయ్యాలో ఏమీ పాలుపోక అందరూ దిగ్భ్రాంతులై కూర్చున్నారు.