“ఈమాట” పాఠకలోకానికి స్వాగతం!
క్రితం సంచిక నుంచి ప్రవేశపెట్టిన పి. డి. ఎఫ్. మార్గానికి మీనుంచి వచ్చిన అనుకూల స్పందనకు అనుగుణంగా ఇకనుంచి ఆ పద్ధతిని కొనసాగించడానికి నిర్ణయించాం. ఐతే ఇండియాలోని కొందరు పాఠకులకు ఏక్రొబాట్‌ని డౌన్‌లోడ్ చేసుకోవటం సాధ్యం కాలేదని వింటున్నాం. అలాటి వారి సౌకర్యం కోసం html లో కూడ అన్ని రచనల్ని ఇవ్వదలుచుకున్నాం.
“ఈమాట” పత్రికలో గత మూడేళ్ళుగా వెలువడ్డ రచనల్లో కొన్నిటిని ఎంచి ఒక సంకలన పుస్తకంగా తీసుకు వస్తున్నామని ఇదివరకే ప్రకటించాం. “ఈ నేలా .. ఆ గాలీ” అనే పేరుతో వస్తున్న ఈ పుస్తకాన్ని ఆటా2002 సందర్భంగా ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నాం. ఆపై వారంలో ఈ సంకలనంలోని రచనలను అదే క్రమంలో ఇక్కడ ఉంచుతాం.
ఈ పుస్తకం ఇండియాలో ప్రముఖ పుస్తక విక్రేతలందరి వద్ద దొరుకుతుంది. ఇండియా బయట వుంటున్న వారు ఈమెయిల్ పంపితే ఈ పుస్తకం కాపీలు దొరికే వివరాలు ఇవ్వగలం.
“ఈ నేలా .. ఆ గాలీ” కి శ్రీ వెల్చేరు నారాయణరావు గారు రాసిన ముందుమాటను ఈ సంచికలో మీకు అందిస్తున్నాం. అందులో వారి లోతైన పరిశీలనలు కొత్త తెలుగు సాహిత్యసృష్టికి మార్గదర్శకాలు ఔతాయని మా ఆకాంక్ష. “ఈమాట”కు ఎన్నో విధాలుగా సహకరిస్తూ, ఈ సంకలనం బయటకు రావటానికి ఎంతో సమయాన్ని మాకిచ్చిన శ్రీ వెల్చేరు వారికి మా హార్దిక కృతజ్ఞతలు.
ఆటా2002 సూవనీర్ కోసం వచ్చిన రచనల్లో కొన్నింటిని “ఈమాట”లో ప్రచురించటానికి ఆనందంగా ముందుకువచ్చిన సూవనీర్ ఎడిటర్ శ్రీ కన్నెగంటి చంద్రశేఖర్ గారికి, ఈ సంచిక తయారుచెయ్యటంలో మాకు ఎంతో సహాయం చేసిన శ్రీ తమ్మినేని యదుకులభూషణ్ గారికి మా కృతజ్ఞతలు.