జనంతో ఆడిటోరియం ఆవరణ కిటకిటలాడుతోంది. తళతళ లాడే పంచెలు పైకెగగట్టి, ధగ ధగ మెరిసే పట్టు చీరలు కట్టి, హడావిడిగా తిరుగుతున్న కార్యకర్తలతో ఆడిటోరియం సందడిగా వుంది.
ఎదురుగా వేదిక మీద జరుగుతున్న కూచిపూడి నాట్య ప్రదర్శనపై మనసు లగ్నంకాక అసహనంగా కదులుతున్నారు చిందులరావుగారు.
నర్తిస్తున్న కళాకారిణికి ఆ నాట్యంలో బాగానే ప్రావీణ్యత ఉంది. చుట్టు ప్రక్కల ఊర్లలోనూ, నాట్య శాస్త్రం లోతుపాతులు తెలిసిన పండితుల్లోనూ ఆమెకు మంచి పేరుంది.
అయినా ఆ నర్తకి చిందులరావును రంజింప జేయడంలో మాత్రం ఘోరంగా విఫలమైందని, చిందులరావుగారి మొహం చూస్తే ఇట్టే తెలిసి పోతుంది.
మరయితే అంతగా తనను నచ్చన్ని నాట్యాన్ని బలవంతాన చూసేకన్నా, చప్పున లేచి ఆడిటోరియం లోంచి బయటకు వెళ్ళొచ్చుకదా అనుకునేరు!
నృత్య పోటీలకు ప్రధాన న్యాయనిర్ణేతగా నియామకం కొట్టేసాక, పోటీ ప్రదర్శనలు జరుగుతున్నప్పుడు బయటకు వెళ్ళడం ఏం బాగుంటుంది? బాగోదు కనుకనే చిందులరావుగారు దిక్కులు పరికిస్తూ అలా కుర్చీలో బందీలా కూర్చున్నారు.
వారికిరుప్రక్కల కూర్చున్న గంతులరావు, గెంతులబాబులు (వూళ్ళో చాలా మంది వీరిని సుందోపసుందులని వ్యవహరించెదరు కావున, సౌలభ్యం కోసం మనం కూడా వీరినలాగే వ్యవహరించెదము), వినమ్రంగా చిందులరావు గారి వైపే చూస్తున్నారు. సుందోపసుందులు అక్కడ జరుగుతోన్న నాట్యపోటీలకు సహ న్యాయనిర్ణేతలు.
అసహనం అవధులు దాటి, అవస్థల రాగం తారాస్థాయినందుకోగా, కోపంగా స్టేజి వైపు చూసారు చిందులరావు. ఈనాటి పరిస్థితిని కోరికోరి కొనితెచ్చుకున్న వైనం గుర్తొచ్చింది.
***
“రికార్డింగ్ డాన్సు ప్రోగ్రాం అయిడియా కంటే నృత్య ప్రదర్శన ఆలోచనే బాగుంది” అన్నారు సంస్థ అధ్యక్షులు కులాసాలరావు.
“ఆలోచనలు బాగానే వుంటాయి. కానీ ఈ రోజుల్లో భరత నాట్యాలెవరు చూస్తారు? ఒహవేళ చూసే ఓపిక జనాలకున్నా చేసే పాండిత్యం మన ఊళ్ళో ఎవడికి ఏడ్చింది?” అన్నారొకరు ఆవేశంగా.
వింటున్న చిందులరావు మనసు చివుక్కుమంది.
“మన వూళ్ళో వాళ్ళే చెయ్యాలని ఏముంది? ప్రక్క ఊళ్ళో వాళ్ళతో చేయించొచ్చుకదా” అన్నాడో పెద్దమనిషి.
“తమరు చేయమనగానే వారెందుకు చేస్తారు? ఏవన్నా పోటీల్లాంటివి పెట్టి కప్పో సాసరో ఇస్తామంటే వచ్చి చేస్తారుగానీ” అన్నారింకొకరు.
“ఈ పోటీల ఆలోచన భేషుగ్గా వుంది” మెచ్చుకున్నారు మంత్రాలరావు.
“అ ఆ లే సాంతం తెలియని అయ్యవారిని, అష్టోత్తరం చదివిపెట్టమన్నట్టుంది మీరు చెప్పేది. పోటీలు నిర్వహించాలంటే మనకూ నాట్యాల గురించి తెలిసి ఉండాలికదా!” అన్నారొక పెద్దాయన.
ఆ ఊర్లోనే నాట్య శాస్త్రం గురించి కాస్తో కూస్తో తెలిసిన ఒకరిద్దరి పేర్లు చెప్పారింకొకరు. అయితే కొన్ని బలమైన కారణాల వలన, నొసలు చిట్లించి పెదవి విరిచారు కార్యదర్శి మంత్రాలరావు గారు.
ఇక చిందులరావు ఊరుకోదలుచుకోలేదు.
ఒక్క ఉదుటన లేచి, “ధధనిక్ ధధనిక్ ధన్ …అరె… ధధనిక్క ధధనిక్క ధన్” అంటూ చిందులు వేయడం మొదలెట్టాడు. అక్కడ వున్న మిగతా వాళ్ళకు, చిందులరావు ఆంతర్యం అవగతంకాక, “ఇప్పటి వరకు బాగున్నాడు కదా. ఇంతలోనే ఏమైంది…” అనుకుంటూ అయోమయంగా చూడసాగారు. కాస్సేపలా గంతులేసి అలసి, వగరుస్తూ…”ఏమండోయ్ కాస్త ఇలా చూడండి. తమకు తెలియని విషయాలు మరెవ్వరికీ తెలియవని తీర్మానించేయకండి. చెప్పండి…అసలు మీకు నాట్యాల గురించి ఏమి కావాలో?” అలుపు తీర్చుకోడానికి ఒక్క క్షణమాగి మాటలాపి , సంచి లోంచి ఫోటో ఆల్బం తీసి “చూడండి… ఇవన్నీ నేను నాట్యం చేస్తుండగా తీసిన ఫోటోలు…ఇదిగోండి ఈ ఫోటో…” అంటూ, చుట్టూ వున్న వాళ్ళకు చూపించడం మొదలెట్టాడు. అవన్నీ రథం తిరుణాళ్ళప్పుడు, పోలేరమ్మ జాతరప్పుడూ చిందులరావు వేసిన చిందులకు సంబందించిన ఫోటోలు.
“అయినా నాట్యాల గురించి మహా తెలియాల్సింది ఏముంది? కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామంలో పుట్టిన నాట్యాన్ని కూచిపూడి నాట్యమని, కథలు రాసే వాళ్ళు వేసే నాట్యాన్ని కథక్ అనీ, కలికాలానికి సంబందించిన కథలను నాట్యాలుగా ప్రదర్శిస్తే కథా ‘కలి’ అని… ఇంగ్లీష్ సినిమాల్లోలా ప్రక్క మనిషిని ఒడిసిపట్టుకుని డాన్స్ చేస్తే దాన్ని ఒడిస్సి అనీ అంటారు. ఇక వీటన్నింటికీ భిన్నంగా వుండి భారతదేశంలో వేసే నాట్యాన్ని భరత నాట్యమని అంటారు. అయినా పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఊరికే అన్నారా?”
చిందులేస్తూనే ఉపన్యాసం ఇస్తున్న చిందులరావు ఆగగానే, అక్కడ చేరిన వాళ్ళంతా చిందులరావు పరిజ్ఞానానికి చకితులై చప్పట్లు కొట్టేసారు. గంతులరావు, గెంతులబాబు ఉద్రేకాన్ని ఆపుకోలేక వెంటనే గంతులు వేయడం మొదలెట్టారు.
ఆ దెబ్బతో చిందులరావును పోటీలకు ప్రథాన న్యాయనిర్ణేతగాను,కార్యక్రమ నిర్వాహకుడిగాను నియమించి గంతులరావు, గెంతులబాబులను వారికి సహాయకులుగా నిర్ణయించారు.
చిందులరావు మొహంలో ఆనందం వెయ్యిన్నొక్క చిందులు వేసింది.
***
వేదిక మీద కూచిపూడి నృత్యమైపోయి, భరత నాట్యం మొదలైంది.
ఆడిటోరియం లోని ప్రేక్షకుల్లో అధికభాగం ఆవలించడం మొదలెట్టారు. ఏదో సంస్కృతికి జరుగుతున్న సేవలో ఉడతా భక్తి ప్రదర్శించాలని వస్తే, ఈ నాట్యాల గోలేమిట్రాబాబు అనుకుని ప్రక్క వాళ్ళతో క్రొత్తగా రిలీజైన ప్రేమ వరదల సినిమాల్లోని క్రొత్త రకం స్టెప్పుల గురించి బాతాఖానీ మొదలెట్టారు.
చిందులరావుకు చిరాకు హెచ్చింది. ఒక్కసారి కుర్చీలోంచి లేచి, వేదిక పైకెక్కి నాట్యం చేసున్న అమ్మాయి వైపో సారి ఈసడింపుగా చూసి, ఆర్కె్రసా వాళ్ళకు ఆపొద్దని సైగ చేసి, పంచె సర్దుకు ఎడాపెడా చిందులు వేస్తూ మధ్య మధ్యలో కేకలు వేయడం మొదలెట్టాడు. ఒక్క క్షణం విస్తు పోయినా రెప్పపాటు కాలంలో సర్ధుకుని… చిందులరావు చిందులకు కరతాళ ధ్వనులు చేస్తూ కేరింతలు కొట్టసాగారు జనం. ఈల వీరుల హోరుతో హాలు దద్దరిల్లింది.
స్టేజీ మీద ఓ మూల నిలబడి, బెదురుగా చూస్తున్న అమ్మాయి వైపు తిరిగి “ఇదీ డాన్సంటే! ” అని, ప్రేక్షకుల వైపు తిరిగి “చిన్నప్పుడు డ్రిల్లు క్లాసులో చేసిన ఎక్సర్‌సైజుల్లా, పద్దతిగా అలా కాళ్ళూ చేతులూ కదిలించడం, స్టేజీ మీద ఇంత జాగా ఉంటే, ఆ చిన్న పళ్ళెంలో కాళ్ళు పెట్టి జారడం…నెత్తి మీద చెంబు పెట్టుకుని సర్కస్ చేయడం…అసలివి నాట్యాలేనా?” భీకరంగా అడిగేరు.
“కాదు కాదు…” అని పెద్దపెట్టున అరిచారు జనం. చిందులరావుకు నిరసన తెలియజేయాలని ప్రయత్నించిన, రెండు మూడు గొంతులు మిగిలిన వాళ్ళ అరుపుల్లో ఈలల్లో పడి ఎవరికీ వినిపించలేదు. సుందోపసుందులు చిందులరావువైపు ఆరాధనగా చూడసాగారు.
ప్రేక్షకులు ఉత్సాహంగా వున్నారని గమనించిన సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు కులాసాలరావు, సంస్థ గురించి నాలుగు ముక్కలు చెప్పడానికి అదే సరైన అదనుగా భావించి వేదికనెక్కారు.
పంచెకట్టులో పదహారణాల (లేక నూరు పైసల) తెలుగుదనానికి ప్రతిరూపంగా (పంచెకట్టే కదా తెలుగు సంస్కృతికి ప్రతీక!) చిరునవ్వులతో సభకు నమస్కారం చేసి కేవలం ఇంగ్లీషులోనే సంభాషించారు “దూరాభారం నుంచీ ఈ కార్యక్రమాలకు విచ్చేసిన తెలుగు వాళ్ళందరికీ నానమస్కారములు. అసలీ సంస్థ స్థాపనకు బీజమెలా పడిందంటే…” అంటూ మొదలెట్టి.
***
“బంగారు పాళెం” పేరులో పాళెం వున్నా, అది ఓ మాదిరి పట్టణం క్రిందే చెప్పుకోవచ్చు. వూరి పేరులో బంగారమున్నట్లే, అన్ని రకాల వనరులూ పుష్కలంగా ఉండడంతో ప్రజలందరూ మామూలు ఊళ్ళలో కంటే నవనాగరీకంగా,సకలైశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారు.
ప్రతి రోజు లాగానే, ఉదయం భోజన కార్యక్రమాలయ్యేక, పనిలేని వాళ్ళందరూ ఊరు చివరి మర్రిచెట్టు దగ్గరకు చేరి, ఆమాటా ఈమాటా మాట్లాడుకుంటూ, కాలక్షేపం చేయసాగారు.
ఆ రోజు కులాసాలరావు మాత్రం, వాళ్ళందరికీ దూరంగా, మర్రిచెట్టును ఆనుకుని కూర్చుని, దీర్ఘంగా మొన్నా మధ్య పేపరులో తెలుగు సంస్కృతి పతనమైపోతోందని, సాంస్కృతిక పునరుజ్జీవనానికి సమయం ఆసన్నమైందని వాపోయిన వ్యాసం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
రోజూ ఈ విధంగా, మర్రిచెట్టు దగ్గర చేరి పోచుకోలు కబుర్లతో గడిపేకంటే ఏదైనా కాస్త మన సంస్కృతిని కాపాడే పని చేస్తే బాగుంటుందని వారి తలపు.
“కానీ ఎలా?” అని ఆలోచిస్తూ మధన పడసాగారు కులాసాలరావు.
అప్పుడే ్రసాంగ్ టీ తాగడం ముగించి, సిగరెట్టు వెలిగించి, గాఢంగా రెండు దమ్ములు పీకిన మంత్రాలరావు, తన చురుకైన చూపులతో కులాసాలరావు మనసులో ఏదో తుఫాను రేగుతోందని పసిగట్టేసాడు.
కులాసాలరావును చెట్టుకు కాస్త దూరంగా తీసుకుపోయి, “బావగారు, అసలు సంగతేమిట”ని అడిగేడు.
కొంచెం సేపు నాన్చేక, చూపులను ఆకాశంలోకి సారించి, కులాసాలరావు తన అంతర్మధనాన్ని మంద్ర స్వరంలో టూకీగా వివరించేరు.
“ఓస్ ఇంతేనా?! నేను కూడా ఎంతో కాలంగా మన సంస్కృతికి పట్టిన చిలుమును వదిలించి, కొత్త మెరుగులు పెట్టే అంశం గురించి తీవ్రంగా ఆలోచిస్తున్నాను” ఉత్సాహంగా చెప్పాడు మంత్రాలరావు.
“నిజంగా?” అన్నట్టు చూసారు కులాసాలరావు.
“నువ్వూ నేనూ కలిస్తే సంస్కృతి కాదుకదా మనల్ని మనమే బాగు చేసుకోలేము. మనకూడా మందీమార్బలం (మంది అనగా జనం, మార్బలం అనగా ధనబలం) వుంటే మనల్ని, మన సంస్కృతిని, వీలునుబట్టి మన జాతిని కూడా బాగు చెయ్యొచ్చు. అందుగ్గాను ముందస్తుగా మనం చెయ్యాల్సింది ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించడం. దానికి నువ్వు అధ్యక్షుడు, నేను కార్యదర్శి” అని మరో దమ్ము లాగడానికని, మాటలకు విరామమిచ్చాడు మంత్రాలరావు.
ఈ ఆలోచన కులాసాలరావుకు బాగా నచ్చింది. సాంస్కృతిక సేవతో బాటు, చుట్టూ పదిమంది జనం,పదవీ గౌరవం…!
“కానీ సంస్థ నడవాలంటే డబ్బు కూడా కావాలికదా?” సందేహం వెలిబుచ్చారు కులాసాలరావు.
“డబ్బు కూడా కాదు… అస్సలు కావల్సింది డబ్బే! దాన్తోనే అన్నీ సమకూరతాయి” అని మనసులో అనుకుని, పైకి మాత్రం “ఇంతకు ముందు నేను చెప్పిన మందీమార్బలంలో, మంది సంగతి నా కొదిలెయ్యి. మిగిలిన విషయాలు నువ్వు చూసుకో. అయినా ఇల్లాంటి సంస్థల వల్ల ఎప్పుడూ లాభాలే తప్ప ఎట్టి పరిస్థితుల్లో నష్టాలుండవు. ఇటు ప్రజల్లో పేరు, అటు పెద్దవాళ్ళలో గుర్తింపు, సాంస్కృతిక సేవ చేస్తున్నామన్న ఆత్మ సంతృప్తి! ఇంకా…” అంటూ సంస్థ స్థాపన వలన ఒనగూరే మరెన్నో ఉప ఉత్పత్తుల గురించి ఉదాహరణలతో సహా వివరించారు మంత్రాలరావు.
సంస్థలో ఇద్దరి పాత్రల గురించి విపులంగా చర్చించుకుని, ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత, మర్రిచెట్టు దగ్గర పోగయ్యే వాళ్ళకు సంస్థ స్థాపించడం గురించి చెప్పారు.
వాళ్ళకూ నచ్చింది. అసలిలా చెట్టు క్రింద ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ చీదుతూ గడిపే బదులు, హాయిగా సంస్థ కోసం తీసుకునే ఆఫీసులో బిచాణా వెయ్యొచ్చని, అది పేకాడుకోడానికే కాక మరెన్నో విధాలా ఈ చెట్టుకింద కంటే సౌకర్యమని తోచింది.వెంటనే సభ్యత్వ రుసుము చెల్లించి, సంస్థలో చేరి పోయారు.
తర్వాత మాట్లాడకుండా తోకలూపుంటూ పన్లు చేసే మేకల్లాటి అమాయకుల్ని వెదికి వాళ్ళకి ప్రాముఖ్యం లేని పదవుల పందేరం జరిపారు.
ఆ విధంగా సాంస్కృతిక విలువలను పరిరక్షించడానికి, పునరుద్ధించడానికి, అవసరమైన ఒక సంస్థ స్థాపనకు బీజం పడింది.
***
“అలా ఒక సదుద్దేశ్యంతో, మహోన్నత ఆశయంతో స్థాపించబడిన ఈ సంస్థ మన సంస్కృతిని నిలబెట్టడానికి, మనందరిలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టడానికి కంకణం కట్టుకుంది… రానున్న రోజులలో మేమెన్నో ఇల్లాంటి నాట్యపోటీలు ఏర్పాటు చేసి అంతరించిపోతున్న కళలకు ప్రోత్సాహాన్నిచ్చి, జీవం పోయాలనుకుంటున్నాం. ఇంకా మన తెలుగు సంస్కృతిని కాపాడే సదుద్దేశ్యంతో, ఇవ్వాళ జరుగుతున్న సభకు మా కార్యకర్తలందరం సాంప్రదాయబద్ధంగా పంచెలు, చీరెలు కట్టుకున్నాం. అలాగే పడుచు పిల్లలు పరికిణీలు ధరించారు…”
“మరి పిల్లాపీచునో…” అరిచారొకరు జనం లోంచి!
” గోచీలు పెట్టుకొచ్చారు” అంత కంటే పెద్దగా జవాబిచ్చారు మరొకరు.
సభ అనుకున్న ఫ్రీవే లోంచి తప్పు ఎగ్సిట్లోకి దూసుకుపోతోందని గ్రహించి, మిగిలిన నాట్య పోటీలను తిలకించి, పరవశించమని ప్రేక్షకులకు వినయంగా విన్నవించి, ప్రసంగాన్ని ముగించారు.
అప్పటికి కాస్త ఆవేశం తగ్గి, హాయిగా ఊపిరితీసుకుంటున్న చిందులరావుకు మరలా కష్టాలు మొదలయ్యాయి.
చిందులరావుగారి ముఖకవళికలను గమనిస్తూ, వాటికి తగ్గట్టు తాళం వెయ్యడంలో సతమతమై పోసాగారు సుందోపసుందులు.
అప్పుడప్పుడు శ్రీరామనవమికి, వినాయక చవితికి ఏర్పాటు చేసే స్టేజీ నాటకాల్లో, మాంఛి మసాలా సినిమా పాటలకు గంతులేయడం తప్పిస్తే వీరికి ఏ ఇతర నాట్యంలోనూ ప్రవేశం గానీ, అవగాహన గానీ లేవు. ఏదో స్టేజీ మీదకు పిలిచి దండలేమైనా మిగిలితే వేస్తారన్న ఆశ, చప్పట్లు కొట్టించుకోవచ్చునన్న చిరుకోరిక తప్పిస్తే ఈ పోటీల పైన మరే విధమైన ప్రత్యేక ఆసక్తి లేదు. అందుచేత, ఇద్దరూ కూడబలుక్కుని, నాట్య ప్రదర్శనలు చూడ్డం కంటే చిందులరావు గారి ముఖకవళికలు చూడ్డం
వారు కునికిపాట్లు పడ్డప్పుడు తన్మయత్వంలో తలవూపుతున్నారని వీళ్ళూ తల వూపడం, వారు దోమల్ని చంపడానికి రెండు చేతులూ దగ్గరకు చేరిస్తే, చప్పట్లు కొడుతున్నారని భ్రమపడి వీళ్ళూ చప్పట్లు మ్రోగించడం, వారి ఆవలింత లోంచి వెలువడ్డ శబ్దాన్ని మరోలా అర్ధం చేసుకుని, వీళ్ళూ కూనిరాగాలు తీయడం… లాంటివి చాలా మెళకువతో చేస్తూ ఎక్కడా చిందులరావు గారి దృష్టిలో చీపుగా కనిపించకుండా చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నారు.
హఠాత్తుగా జనంలో చెలరేగిన కలకలానికి ఉలిక్కి పడి, స్టేజి వైపు చూసారు న్యాయనిర్ణేతలందరూ. స్టేజీ మీద ఒకబ్బాయి సినిమా పాట వరసలో సాగుతున్న పాటకు చిందేస్తూ కనిపించాడు.
భరతనాట్యంలో సొంపేముంది? కూచిపూడిలో సొగసేముంది? కధాకళిలో సోయగమేంఉంది? ఈ కుర్రవాడి చిందులో వున్న ఒడుపు, శరీరం వూపులోగల మెరుపు ఏ నాట్యం లో కనిపిస్తాయి?! అనుకుంటూ పరమానంద భరితులై, తను కూడ స్టేజీ ఎక్కి ఆ కుర్రాడితో కలిసి చిందేద్దామన్నంత ఆవేశం వచ్చినా ఆ కుర్రాడి ముందు ఎందుకూ చాలక మరీ అభాసు పాలవుతానని గ్రహించి, అటే చూస్తూ మైమరచి పోయారు చిందులరావు.
ఆ తన్మయావస్థలో, తన వంకే కన్నార్పకుండా చూస్తున్న సుందోపసుందులు వైపు ” బాగుందికదూ” అన్న భావంతో, నవ్వుతూ కనుబొమలు ఎగరేసారు.
నవ్వుతూ కనుబొమలు ఎగరవేయడాన్ని తప్పుగా అర్ధం చేసుకున్న సుందోపసుందులు, “తమ ఆజ్ఞ” అన్నట్లు, తల పంకించి, చేతులో పేపర్లను ప్రక్కన పెట్టి, కుర్చీల్లోంచి లేచి, ఆశీర్వాదం కోసం చిందులరావు కాళ్ళ మీద పడ్డారు.
సంఘటనలకు అర్ధాలు వెదుక్కునే పనిలో చిందులరావు తికమక పడుతూవుండగా పరుగు పరుగున స్టేజీ ఎక్కేసారు సుందోపసుందులు.
చిందు వేస్తున్న కుర్రవాడు, బెదిరిపోయి బిక్క మొహంవేసి చూస్తుంటే, సుందోపసుందులు ఆ కుర్రవాడి చెరో చేయి పట్టుకుని… తమతో పాటు గంతులు వేయడానికి ప్రోత్సహించారు.
గంతులతో స్టేజీ ఊగిపోసాగింది. జనాలు వెర్రిగా కేకలేస్తూ, తన్నుకొస్తున్న ఉద్రేకాన్ని తట్టుకోలేక కుర్చీలు విరగ్గొట్టసాగారు. కార్యకర్తలు కలుగజేసుకోకపోతే, ఒక కుర్చీలేమిటి, ఏకంగా ఆడిటోరియాన్నే పీకి పందిరి వేసేవాళ్ళేమో ఆనందం పట్టలేక!
చిందేస్తున్న అబ్బాయికి ఆటంకం కలిగించినందుకు కించిత్తు బాధ పడ్డా, స్టేజీ దిగివచ్చిన సుందోపసుందుల వైపు మెచ్చుకోలుగా చూసారు చిందులరావు.
***
చిందులేసి, గంతులేసి … అలసి నిద్రలో జోగుతున్న న్యాయ నిర్ణేతలను, కొందరు కార్యవర్గ సభ్యులు లేపి, పోటీలు అయిపోయాయని, ఇక తదుపరి అంశం బహుమతులు ప్రకటించడమేనని చెప్పారు.
తప్పదన్నట్లు, ముగ్గురూ కలిసి, ఓ మూలకు వెళ్ళారు.
“ఎవరికిద్దామంటారు మొదటి బహుమతి?”అడిగారు చిందులరావు.
“మీరెవరికిద్దామంటే వారికే!” చెప్పారు మిగిలిన ఇద్దరూ ముక్త కంఠంతో.
“అదేమిటోయ్ మీరెవరికంటే వారికే ఇద్దామనుకుని నేనస్సలు ప్రోగ్రాములే చూడకపోతే…” అన్నారు చిందులరావు చిరునవ్వులు చిందిస్తూ.
“భలేవారే…మేం బహుమతుల లిస్టు తయారు చేయడం హనుమంతుని ముందు కుప్పిగంతులు వేయడానికి ్రటై చేసినట్లుంటుందని మేమస్సలు ప్రోగ్రాములను గమనించలేదు” అన్నారిద్దరూ ఏకతాళంలో.
“పెద్ద చిక్కే తెచ్చి పెట్టారోయ్…” అని, “అయినా భరత నాట్యానికి బహుమతి నిస్తే కథక్ వాళ్ళకు కళ్ళు కుట్టొచ్చు. అలాగని కథక్ వాళ్ళకిస్తే కథాకళి వాళ్ళ కడుపు మండొచ్చు. అయినా జనాల స్పందన చిందు వైపు వుందాయె. ఏమి చేయాలిప్పుడు” అన్నారు చిందులరావు, ఆలోచిస్తున్నట్లు మొహం పెట్టి.
బహుమతుల ప్రకటనకు ఇంకా వ్యవధి ఉండడంతో, కొంతమంది స్టేజి పైకెక్కి సినిమా పాటలకు స్టెప్పులెయ్య సాగారు. జనాల చప్పట్లతో, ఈలలతో హోరెత్తిపోతోంది ఆడిటోరియం.
“ఇంతకీ చిందు వేసిన కుర్రవాడి పేరేమిటన్నారు?” అడిగారు.
సులభగ్రాహ్యులైన సుందోపసుందులులు గబగబా పరుగెత్తుకెళ్ళి చిందేసిన కుర్రాడి పేరును చిటికెలో కనుక్కొచ్చారు.
“ఎలాగూ…మన ముగ్గురికేకాక ప్రేక్షకులకు కూడా చిందు బాగా నచ్చింది కాబట్టి, అతడికే మొదటి బహుమతి ఇద్దాం. మీరేమంటారు?” అన్నారు చిందులరావు.
“సరిగ్గా మేమనుకున్నదే మీరూ అన్నారు” అని భుజాలు చరుచుకున్నారు, గంతులరావు, గెంతుల బాబు.
“మరి ద్వితీయ తృతీయ బహుమతులు…” అడిగేరు. ఎప్పుడెప్పుడు ఈ పని అయిపోతే, గభాల్న వెళ్ళి స్టేజి మీద సినిమా పాటలకు గంతులేసి, చప్పట్లు, ఈలలు వేయించుకుందామా అని వాళ్ళ తాపత్రయం.
“వాటి గురించి మనకేం వర్రీ లేదు. అవి ఎవరికివ్వాలో ఆల్రెడీ పెద్దవాళ్ళు నిర్ణయించేశారు. హమ్మయ్య, మొత్తానికి కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించేశాం” అంటూ బహుమతుల వివరాలు ప్రకటించేందుకు స్టేజీ ఎక్కారు చిందులరావు.
సభకు విచ్చేసిన జనాల్లో చాలామంది కాణీఖర్చులేకుండా కావలసినంత వినోదం, కాలక్షేపం దొరికినందుకు సంతోషంతో చప్పట్లు కొట్టుకుంటూ ఇళ్ళ దారి పట్టారు.
(ఈమాట, మార్చి 2002 సంచికలోని, శ్రీ కె.వి.యస్.రామారావు గారి ‘కూనిరాగం ‘ కథ స్పూర్తితో.)