ఇప్పటి సంగతి

ఈమధ్య ఒకసారి అఫ్సర్‌తో మాట్లాడుతూ ఇండియా టుడే వాళ్ళు వేసిన సాహిత్య సంచికలో మీ పద్యం చూసానని చెప్పాను. అఫ్సర్‌ వెంటనే ఆ పద్యం చాలా పొడుగ్గా ఉందని కొందరు స్నేహితులు అన్నారని నేనేమీ అనకముందే చిన్న గొంతుకతో అన్నాడు. “కవులు పద్యం కూర్పు ఎలా వచ్చిందన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నారన్న మాట!” అనుకుని చాలా సంతోషించాను.

భావకవిత్వం రోజుల గురించి ఇరవై ఒకటో శతాబ్దపు రోజుల్లో ముచ్చటగా మాట్లాడవలసిన పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. కాని ఆ రోజుల్లో రెండు ముఖ్యమైన విశేషాలుండేవి. ఒకటి కవులు ఎక్కడ చేరినా కవిత్వం గురించి మాట్లాడుకునేవారు. ఆ పద్యంలో నడక ఎంత మృదువుగా వుందో, అక్కడ యతి పదమధ్యస్థంగా ఎంత ఒడుపుగా పడిందో, ఆ నుడికారం ఎంత సొగసుగా వుందో మరీమరీ చెప్పుకునేవారు. రెండోది ఏది మంచి పద్యమో, ఎవరు బాగా రాస్తున్నారో కవులే చెప్పేవారు.

మంచి ఇంజనీరు ఎవరో ఇంజనీర్లే నిర్ణయిస్తారు. మంచి ఫిజిసిస్టు ఎవరో ఫిజిసిస్టులే నిర్ణయిస్తారు. మంచి పండితుడు ఎవరో పండితులే నిర్ణయిస్తారు. అలాగే, మంచి కవిత్వాన్ని నిర్ణయించగలవాళ్ళు కవులే. సాహిత్యం ఒక స్పష్టమైన రంగంగా వున్నంతకాలం ఆ సాహిత్యాన్ని నిర్మించేవాళ్ళే దాని ప్రమాణాన్నీ, ప్రవర్తననీ నిర్ణయించేవాళ్ళు. ఆ రంగం లోకి కొత్తగా ప్రవేశించేవాళ్ళకి ఎలాంటి అర్హతలు వుండాలో వాళ్ళు రాసే రచనలకి ఎలాంటి గుర్తింపు వస్తుందో వాళ్ళే నిర్ణయించేవాళ్ళు.

సాహిత్యరంగం తన ఉనికిని ఒక విశిష్ట వైజ్ఞానిక రంగంగా కాపాడుకున్న రోజులు అవి. ఆ రంగంలో అంతర్గతంగా తీవ్రమైన వివాదాలు, తిరుగుబాట్లు, చర్చలు, సిగపట్లు జరిగాయి. కాని ఆ రంగానికున్న సరిహద్దులు చెరిగిపోలేదు. ఆ రంగపు అస్తిత్వం దెబ్బతినలేదు.

మనకున్న జ్ఞాపకాలతో చరిత్ర చూసినా కూడ సాహిత్యరంగం భావకవిత్వం కాలం వరకూ స్థిమితంగానే వున్నట్లు దాఖలాలు కనబడతాయి. భావకవులు తమ కాలపు పండితుల వల్ల నిందలు పడ్డారు. వాళ్ళూ భావకవులూ మీకు కవిత్వం తెలియదంటే మీకు తెలియదని వాదించుకున్నారు. తిట్టుకున్నారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ఊరూరా తిరిగి తన కొత్త కవిత్వాన్ని చదవడానికి కావలసిన కవితాప్రమాణాలు, విధానాలు ప్రచారం చేసి పదిమంది చేతా ఒప్పించేదాకా భావకవిత్వానికి కవిత్వంగా గుర్తింపు దొరకలేదు.

పద్యం మీద, దాని రచనాసౌష్టవం మీద దృష్టి లేని కవులు పైకి రావడానికి వీలు లేని రోజులవి. పద్యంలో నిర్మాణ చమత్కారం గురించి రకరకాల మాటల్లో కవులు మాట్లాడుకునేవారు. వినేవాళ్ళకి ఆ మాటలు బాగుండేవి కూడా.

సాహిత్యరంగంలో శ్రీశ్రీ ప్రవేశించాక అతని రాజకీయ బోధనలు, విప్లవసందేశాలు సాహిత్యరంగాన్ని కలుషితం చేస్తున్నాయని ఎదుర్కున్న వాళ్ళంతా అతని వాదాలు క్రమక్రమంగా రాజకీయ సిద్ధాంతం వైపు సాహిత్యాన్ని మళ్ళిస్తున్నాయని వాదించినా శ్రీశ్రీకి మాత్రం రచనాచమత్కారాల మీద దృష్టి బలంగా వుండేది. అతను రకరకాల ఛందస్సుల్లో ప్రయోగాలు చెయ్యడం, మాటల్ని వాటి నడకల్ని కొత్త కొత్త రీతుల్లో పట్టుకుని ప్రదర్శించడం మానలేదు. అతని అధివాస్తవిక దశలో ఇది ఎక్కువగానూ ఆ తరవాత తక్కువగానూ ఉండి వుంటే వుండొచ్చు గాక, కాని ఆ స్వభావం మాత్రం శ్రీశ్రీ కవిత్వంలో పోలేదు.

ఇది 1960వ దశాబ్దం వరకూ వున్న పరిస్థితి.

1970లో విరసం రంగంలోకి వచ్చింది. సాహిత్యంలో రాజకీయ నిబద్ధత అమల్లోకి వచ్చింది. విప్లవవాదంతో, మార్క్సిస్టు సామాజిక దృక్పధంతో రాయనివాళ్ళు విరసం వాళ్ళకి ఆ కారణం చేత కవులు కాకుండా పోయారు. అవతలి వర్గం వాళ్ళకి విరసం తరహా కవులు రాసేది అందులో విప్లవ రాజకీయాలు వున్నాయి కాబట్టి కవిత్వం కాకుండా పోయింది. మొత్తం మీద మీకు యిష్టమైన సిద్ధాంతాలు వున్నాయా లేవా అన్నదే ఒక రచన కవిత్వమా కాదా అన్న అంశానికి గీటురాయి అవడం మొదలయింది.

విరసానికి ముందు కొద్ది సంవత్సరాల కాలంలో దిగంబర కవులు, తిరగబడు కవులు, ఇంకా ఇలాంటి కవుల గుంపులు కూడా విరసంలా కాకపోయినా వాళ్ళ వాళ్ళ భాషల్లో వాళ్ళ వాళ్ళ కవిత్వానికి “సామాజిక పరిస్థితుల పట్ల కవులకున్న అభిప్రాయాలు” ప్రధానం చేసి మాట్లాడేవారు. ఇవి ప్రధాన భూమికలు మాత్రమే కాక ఇవే కవితాలక్షణ ప్రతిపాదకాలు అన్నట్లుగా చెప్పేవారు. వాళ్ళ పుస్తకాలకి రాసిన ఉపోద్ఘాతాల్లో మాటవరసకి కూడా కవిత్వం గురించి చర్చ వుండేది కాదు.

విరసం బలపడిన తరవాత ఈ మార్గం విశృంఖలంగా కొనసాగింది. ఆ తరవాత పదేళ్ళలోనూ విప్లవోద్యమ దృష్టి సాహిత్యత్వాన్ని నిర్ణయించింది. సామాజిక చైతన్యం, ప్రజల కోసం రాయడం, పీడిత ప్రజల తరఫున కవి సాయుధుడై నిలబడడం లాంటి భావాలు కేవలం కవులకి అంగీకారం కావడం మాత్రమే కాదు అవి సాహిత్యవిమర్శ భాషగా మారాయి. ఆ తరవాత విరసం చల్లబడినా విరసం వల్ల ఏర్పడిన సాహిత్యధోరణి మారలేదు. విరసాన్ని తిరస్కరించిన స్త్రీవాదులు, దళితకవులు కూడా సాహిత్యవివాదాలలో విరసం మార్గాలనే కొనసాగించారు. వీళ్ళకి కూడా సాహిత్యం తమ సామాజిక, రాజకీయ భావాలను ప్రచారం చేసే ఉపకరణమే.

అలాంటి భావాలని ఒప్పుకోని కవులుంటే వాళ్ళని నిరాకరించడానికి కూడా ఆ భాషే వాడుకలోకి వచ్చింది. ఒక వ్యాసరచయితని గాని, ఒక నవలారచయితని గాని, ఒక కవిని గాని ఆమోదించడానికీ నిరాకరించడానికీ వాడే భాష ఒకటే కావడమే కాకుండా ఆ భాష సామాజిక రాజకీయ భావాల్ని చర్చించే భాష అయింది. అంటే సాహిత్యానికి ప్రత్యేకరంగంగా వుండే స్థితి పోయింది. సాహిత్యమూ సమాజజీవనమూ ఒకటే అయిపోయాయి.

ఈ మార్పు చాలా పెద్దమార్పు. కుర్చీలు చేసేవాళ్ళు, ఇళ్ళు కట్టేవాళ్ళు, యంత్రాలు నడిపేవాళ్ళు, భౌతికశాస్త్రాల్లో పనిచేసేవాళ్ళు, వంట చేసేవాళ్ళు, సంగీతం పాడేవాళ్ళు వీళ్ళు పనిచేసే రంగాలు వాటి వాటి అస్థిత్వాన్ని పోగొట్టుకోలేదు. కాని భాషతో పనిచేసే రంగాలు మాత్రం సరిహద్దులు లేకుండా కలిసిపోయాయి. మీరు పాత్రికేయులు కావచ్చు, వ్యాసకర్తలు కావచ్చు, నవలాకారులు కావచ్చు, కథకులు కావచ్చు, కవులు కావచ్చు. మీమీ రంగాలకి వేరే శిక్షణ కాని, మీ పనులని విలువ కట్టడంలో వేరు వేరు విధానాలు కాని వుంటాయనీ, వుండాలనీ అనే అవగాహన లేకుండా పోయింది.

చదివేవాళ్ళకి కొండగుర్తుగా ఫలానా ఆయనో ఆవిడో కవి అనో కథారచయిత అనో ఒక దృష్టి లేదనికాదు నేననేది. “సాహిత్యం ఒక విశిష్టరంగం, ఆ రంగంలో ప్రక్రియల్ని పరీక్షించడానికి వేరే ప్రమాణాలుంటాయి, వాటిని గుర్తించడానికీ, వాటిని చర్చించడానికీ కేవలం వాటిలో ఉన్న భావాలు వ్యక్తమైన దృక్పథాలు మాత్రమే గీటురాయి కాదు”) అన్న సంగతి పూర్తిగా విస్మృతమై పోయింది.

ఈ పరిస్థితి రావడానికి చాలా కారణాలున్నాయి. ఒక కారణం విరసం తరహా సాహిత్యకారులూ, ఆ రకం సాహిత్య విమర్శకులూ. వీళ్ళకి నిజానికి అవసరమైన ప్రత్యేక శిక్షణ, అర్హతలు లేవు. అవి లేకుండా వీళ్ళు సాహిత్యరంగంలో ప్రవేశించడానికి ఆ రంగపు సరిహద్దుల్ని చితక్కొట్టెయ్యడం తప్ప వీళ్ళకి వేరే మార్గం లేదు. వీళ్ళలో చాలా మంది కవులు కారు, రచయితలు కారు. విమర్శకులూ పండితులూ అసలే కారు. అంచేత సాహిత్యవ్యవస్థని భగ్నం చెయ్యడం వీళ్ళ రాజకీయ అస్తిత్వానికి తప్పనిసరి అయింది.

అయితే ఈ పని తమ కళ్ళముందే జరుగుతూండగా సాహిత్యప్రజ్ఞ పుష్కలంగా వున్నవాళ్ళు కూడా విరసం నడుపుతున్న ఉద్యమంతో మనస్ఫూర్తిగా సానుభూతితో పనిచేస్తూ కళ్ళప్పగించి చూస్తూ వూరుకున్నారు. అంతేకాదు, సాహిత్యవ్యవస్థ దెబ్బతినడానికి శక్తివంచన లేకుండా సహకరించారు కూడా.

ఈ పనిలో శ్రీశ్రీ నించి మొదలుపెట్టి ప్రసిద్ధకవులు, రచయితలు, విమర్శకులు వున్నారని నేను పేరుపేరునా చెప్పక్కర్లేదు. ఈ పరిణామానికి నేను ప్రత్యక్షసాక్షిని. అంచేత ఈ విషయం నాకు స్పష్టంగా తెలుసు.

అయితే ఈ పని చేసినందుకు మన గొప్ప కవుల్నీ, రచయితల్నీ, విమర్శకుల్నీ ఇవాళ తప్పు పట్టక్కర్లేదు. వాళ్ళా రోజున ఆ పని చెయ్యడానికి వాళ్ళలో గాఢంగా వున్న సాహిత్యశక్తే కారణం. వాళ్ళు గొప్ప సాహిత్యాన్ని సృష్టించే శక్తి వున్న వాళ్ళు కాబట్టే మానవభవిష్యత్తు పట్ల వాళ్ళకి గాఢమైన గౌరవం వుంది. ఆ గౌరవమే వాళ్ళలో ఆనాటి రాజకీయ ఉద్యమాల పట్ల సానుభూతి కలగడానికి కారణమైంది. ఆ సానుభూతి యెంత ఎక్కువంటే వాళ్ళు అందుకు సాహిత్యప్రమాణాల్ని విస్మరించాడానికి కూడా సిద్ధపడ్డారు. సాహిత్యవ్యవస్థకి వేరే అస్తిత్వం లేదనీ, అది ఆర్థికవ్యవస్థలో విడిగా చూడడానికి వీలులేని భాగమని నమ్మడానికి కూడా వాళ్ళు జంకలేదు.

ఇందువల్ల విరసం బలపరచిన రాజకీయ ఉద్యమాలు ఎంతవరకు లాభం పొందాయి అన్న ప్రశ్నని ఈ వ్యాసంలో చర్చించడం లేదు. కాని విరసం ప్రతిపాదించిన సాహిత్యదృక్పధం వల్ల సాహిత్యం ఒక వ్యవస్థగా బలహీనపడింది.

అయితే ఈ విధంగా సాహిత్యవ్యవస్థ బలహీనపడినందువల్ల లాభం పొందిన వాళ్ళు విరసం తరహా కవులు కారు. తీవ్ర రాజకీయ విశ్వాసాలతో రచనలు చేసి, అందుకు అవసరమైన కార్యాచరణలో భాగస్వాములై, దాని ఫలితంగా ప్రభుత్వం కలిగించిన కష్టాలనీ నష్టాలనీ భరించి జీవితాలని పణంగా పెట్టినవాళ్ళు కారు.

అనేక వామపక్ష రాజకీయ పార్టీల ప్రచారం ఫలితంగా స్థూలంగా ప్రచారంలోకి వచ్చిన ఉదారభావాలని కడుపులో చల్ల కదలకుండా అంగీకరించేసి, కవిత్వానికీ సాహిత్యానికీ సమాజంలో వున్న గౌరవాన్ని వాడుకుని, సాహిత్యరంగం ఒక వ్యవస్థగా బలహీనపడడాన్ని అవకాశంగా తీసుకుని, సాహిత్యరంగాన్ని ఆక్రమించినవారు మధ్యతరగతి అవకాశవాదులు.

అభ్యుదయం, పురోగమనం, మానవత్వం, పీడిత ప్రజలు ఇలాంటి మాటలు, వీటి చుట్టూ వున్న భావాలు ఈ రకం కవుల కవిత్వంలో నిరభ్యంతరంగా సులువుగా చోటు చేసుకున్నాయి. అదే సమయంలో అకాడెమీలు, విశ్వవిద్యాలయాలు, సమాజంలో పై తరగతుల్లో వున్న సాహిత్య, వైజ్ఞానిక సంస్థలు, వీళ్ళకి అందుబాటులోకి రావడానికి ఏ ఆటంకమూ లేకపోయింది కూడా. సాహిత్యానికి వేరే ప్రమాణాలు లేకుండా పోవడం వీళ్ళ “అభ్యుదయానికి” అవసరం. అంచేత ఆ ప్రమాణరాహిత్యాన్ని వీళ్ళు నిశ్శబ్దంగా సమర్ధించారు, ప్రోత్సహించారు.

ఏ రకంగానూ మామూలు చిన్నకవులుగా కూడా గుర్తింపు పొందడానికి కావలసిన అర్హతలు లేనివాళ్ళు కూడా పెద్ద బహుమానాలు, సన్మానాలు, ప్రభుత్వసంస్థల గుర్తింపులు, పొందడానికి అభ్యంతరం లేని అవ్యవస్థ ఇందువల్ల నిరాటంకంగా కొనసాగింది. సాహిత్యం ఒక స్వతంత్ర వ్యవస్థగా నిలబడితే అందులో పనిచేసే సంస్థలకి అంటే ప్రచురణాలయాలు, సాహిత్యపత్రికలు, ఎకాడమీలు, విశ్వవిద్యాలయాలు, వీటికి ఒక సాంస్కృతిక నిబ్బరం, సాహిత్యరంగాన్ని ఒక విశిష్టరంగంగా నిలబెట్టే ప్రమాణాలని నిర్ణయించే సంప్రదాయం, బలపడి వుండేవి.

గత యాభై ఏళ్ళలో ఈ సంస్థలన్నీ రూపులేకుండా చితికిపోయాయి. మనకి ఉన్నదల్లా రాజకీయరంగమే, ఇంకే రంగమూ లేదు. ఎకాడమీ బహుమతులు కావచ్చు, సాహిత్యసంస్థల నాయకత్వం కావచ్చు, ఏ పనికేనా, రాజకీయాధికారంలో వున్నవాళ్ళని ఆశ్రయించడం తప్ప వేరే మార్గం లేదు. రాజకీయాధికారంలో ఉన్నవాళ్ళ ప్రమేయం లేకుండా సాహిత్యంలో ఒక గొప్ప వ్యక్తి గుర్తింపు పొందే అవకాశం లేదు. ఏదో ఒక రాజకీయ ఉద్యమం తోడ్పాటు లేకుండా కవిత్వం బతకడానికి జాగా లేదు.

ప్రభుత్వమే ఇవాళ ఆంధ్రదేశంలో ఉన్న ఏకైక సంస్థ. ప్రభుత్వేతరంగా, ప్రభుత్వ ప్రమేయం లేకుండా, సాంస్కృతికనాయకత్వం వహించగల సంస్థ గాని, రంగం గాని మనకు ఏర్పడలేదు. ఏర్పడే అవకాశం లేకుండా చెయ్యడానికి కృషి చేసినవాళ్ళే మనకి సాంస్కృతిక నాయకులు అయ్యారు. ఏర్పడాలని పనిచేసినవాళ్ళు మనకి ఎవరూ మిగలలేదు.

బలమైన ప్రజాస్వామిక సంస్కృతి వున్న దేశాలలో ప్రచురణసంస్థలు, విద్యాసంస్థలు సాహిత్యానికి ఒక నిబ్బరమైన ప్రతిపత్తిని ఏర్పరుస్తాయి. సమాజంలో యితర రంగాలలో పైకి వచ్చిన వాళ్ళు ప్రభుత్వరంగంలో కలిసిపోరు. వాళ్ళు సంస్కృతీరంగాన్ని తమలో కలిపేసుకోరు కూడా. పుస్తకాలు ప్రచురించే సంస్థల్ని నిర్వహించేవాళ్ళు, ప్రచురణ ప్రమాణాల్ని కాపాడుకుంటేనే వాళ్ళ పుస్తకాలు అమ్ముడవుతాయి గనక, ఏ పుస్తకం ప్రచురించాలో ఏది ప్రచురించకూడదో నిర్ణయించుకోడానికి తాపత్రయపడతారు. అందుకోసం కవుల్నీ, రచయితల్నీ, విమర్శకుల్నీ, పుస్తకసంపాదకుల్నీ తోడు తీసుకుంటారు. ఎవరి రాజకీయ దృక్పధం ఏదైనా, భావజాలం ఏదైనా, వారికి ఒక సాహిత్యప్రమాణం వుండాలి, ఒక అభిరుచి ప్రమాణం కాపాడే దమ్ము వుండాలి అనే విషయాల్లో మాత్రం ప్రచురణకర్తలకీ, బహుమానాలూ ఇతరగుర్తింపులూ ఇచ్చే సంస్థలకి, నిక్కచ్చి అయిన పట్టుదల వుంటుంది. ఇలాంటి సంప్రదాయాలున్న సంస్థలు ఏర్పడడానికి మన రాజకీయవ్యవస్థ సహకరించ లేదు.

సాహిత్యం ప్రతిపాదించే, ప్రచారం చేసే, అభిప్రాయాలూ సిద్ధాంతాలూ ఏవైనా సరే ముందు అది సాహిత్యం కవాలి. నిజంగా సాహిత్యరంగంలో వున్న వాళ్ళు సాహిత్యంలో చెప్పబడిన భావాలు, ప్రతిపాదించబడిన ఆశయాలూ మాత్రమే ఆధారంగా సాహిత్యస్థాయిని నిర్ణయించరు. కాని ఇవాళ, “మీ యిష్టం వచ్చిన రాజకీయాల్ని, సామాజికవిలువల్ని, మీరు ప్రతిపాదించుకోండి, మీ రచనకి సాహిత్యస్థాయి వుంటే అది సాహిత్యంగా గుర్తించి గౌరవిస్తాం” అనేవాళ్ళు తెలుగులో లేరు. వాళ్ళు వుంటే, ఒక రచనలో పైపైన కనపడుతున్న భావాల్ని వల్లించేసి ఇది గొప్ప సాహిత్యం అని చెప్పడమో లేకపోతే వాళ్ళకి ఇష్టం లేని భావాలు చెప్పే కవిత్వాన్నీ రచననీ ఆ కారణంగా కొట్టిపారెయ్యడమో ఇవే సాహిత్యవిమర్శగా చలామణీ అవడం తగ్గేది.

సాహిత్యప్రక్రియలని చర్చించడానికి అవసరమైన భాష మనకి ఏర్పడడానికి కనీసం పైన చెప్పిన లాటి నిష్కర్ష అవసరం. అప్పుడు పుస్తకసమీక్షలు రాసేవాళ్ళూ సాహిత్యవివాదాలు చేసేవాళ్ళూ కేవలం రచనావిశేషాల్నీ, దానిలో భాషనీ, ప్రక్రియాప్రమాణాల్నీ ప్రధానంగా చర్చించవలసిన అవసరం కలుగుతుంది.

ఫలాని కవిత్వం విప్లవాన్నో, స్త్రీవాదాన్నో, దళితవిముక్తినో, హిందూమతభావాల పునరుద్ధరణనో, ఇంకో లక్ష రకాల రాజకీయ సమస్యలలో ఏదో ఒక పక్షాన్ని సమర్థించడమో, నిరాకరించడమో చేసిన కారణాన అది అంగీకారం పొంది, చెయ్యని కారణాన తిరస్కరించబడే స్థితి పోతుంది. ఒక రచన అసలు సాహిత్యమా కాదా అన్న ప్రశ్న ఒక్కటే సాహిత్యంలో ముందు తేలవలసిన ప్రశ్న. నిజమైన సాహిత్యవిమర్శ ఈ ప్రశ్నని తేలుస్తుంది.

సాహిత్యం రాయడమూ, ఉద్యమనాయకుల చేతనో, అధికారుల చేతనో, ప్రభుత్వం చేతనో గుర్తింపబడడమూ మాత్రమే అలవాటుగా వస్తున్న ప్రస్తుత తెలుగు సమాజంలో, అచ్చమైన కవి కేవలం నిస్సహాయుడైన ఒంటరి వ్యక్తి. ప్రభుత్వాలనీ అధికారులనీ ఆశ్రయించని కవి ఎంత మంచి కవిత్వం రాస్తున్నప్పటికీ ఆ వ్యక్తికి గుర్తింపు వుండదు.

ఇవాళ తెలుగు సాహిత్యంలో రెండు రకాల వాళ్ళు కనిపిస్తారు మంచి రచనలు చేస్తున్నా పేరు బయటకు రానివాళ్ళూ, చెత్త రాసి బహుమానాల మెరుపుల వల్లా అధికార పదవుల వెలుగు వల్లా సాహిత్యవేత్తలుగా గుర్తింపులు పొందేసిన వాళ్ళూ. ఇందులో పేరు తెచ్చుకోలేని మంచి రచయితల్ని గుర్తించడానికి గాని, పేరొచ్చేసిన తక్కువ తరహా రచయితల్ని సరిగ్గా విలువ కట్టడానికి గాని ఘంటాపధంగా ఏర్పడిన మార్గాలేవీ లేవు.

ఇవాళ తెలుగులో ఏ సాహిత్యపుస్తకాన్నైనా తీసుకుని భావాలు, అభిప్రాయాల జోలికి పోకుండా చర్చించడానికి కావలసిన మాటలు లేవు. ఎవరేనా యీ ప్రయత్నం చేసినా సాహిత్యవివాదాలు వ్యక్తిగతదూషణలుగా మారిపోతున్నాయి. అలా మారిపోవడానికి తెలుగు పత్రికలు ఇచ్చినంత అవకాశం ఇంకే దేశంలో పత్రికలూ ఇవ్వవు.

అంచేత కవులే కవుల రచనల్నీ కథకులే కథకుల రచనల్నీ వాళ్ళ వాళ్ళ ముఖాముఖి సమావేశాల్లో, చిన్న పత్రికల్లో, ఇష్టాగోష్టుల్లో, చర్చించే అలవాటు చేసుకోవాలి. కవులు, రచయితలు మాత్రమే ఆధునిక తెలుగుకి కావలసిన విమర్శ విధానాలనీ, సాహిత్యచర్చకి తగిన భాషనీ తయారుచెయ్యగలరు.

ఇది సాహిత్యానికి సార్వకాలిక మార్గంగా చెప్పడం లేదు గాని, ఇవాళ తెలుగు సాహిత్యాన్ని సాహిత్యం గానే చూసి చర్చించేవాళ్ళు కావాలి. రాజకీయాలు, సిద్ధాంతాలు, సామాజిక విశేషాలు మాట్లాడేవాళ్ళు చాలామంది వున్నారు. సాహిత్యానికి సిద్ధాంతాలు, రాజకీయాలు, వాదాలు ఇవి ఏవున్నా ఫరవాలేదు, ఏవీ లేకపోయినా ఫరవాలేదు. సాహిత్యానికొక స్వతంత్ర ప్రతిపత్తిని, సంస్థాత్మక అస్తిత్వాన్ని తిరిగి నిర్మించాలి. మీకు విశ్వనాథ సత్యనారాయణ యిష్టం కావచ్చు, శ్రీరంగం శ్రీనివాసరావు యిష్టం కావచ్చు. మీ అభిమానితులు దళితకవులు కావచ్చు, స్త్రీవాదులు కావచ్చు, హిందూనాగరికత గొప్పతనం చెప్పేవాళ్ళు కావచ్చు. ఎవరైనా గానీ, ముందుగా తేలవలసిన విషయం వీళ్ళు కవులూ, రచయితలూ ఔనా కాదా అన్నది.

మనకు ఎన్నో రకాల సాహిత్యాలున్నాయి. ఒకో రకం సాహిత్యంలో ఎన్నో విభాగాలున్నాయి. వీటన్నింటికీ ఒకే రచనాప్రమాణాలు వుంటాయనీ, వుండాలనీ నేననడం లేదు. కాని ఏ సాహిత్యవిభాగానికైనా ఒక సాహిత్యప్రమాణం వుంటుంది. అదేదో చర్చించగలవాళ్ళు ఆ సాహిత్యంలో పనిచేస్తున్న కవులే, రచయితలే.

మనకున్న ఏ సాహిత్యసంస్థా, సంఘమూ ప్రస్తుతం యీ పని చెయ్యడం లేదు. ఇది ఇవాల్టి సాహిత్యపు దీనదశ.

రెండు గొప్ప భాషలు, రెండు గొప్ప సంస్కృతుల మధ్య గత ఏభై ఏళ్ళుగా తెలుగుసాహిత్యం నలిగిపోయింది. సంస్కృతంలోంచో, ఇంగ్లీషులోంచో గొప్ప సిద్ధాంతాలని ఏకరువు పెట్టి, తెలియని పుస్తకాలలోంచి ఉదాహరణలూ, పాఠకులు చదవని సిద్ధాంతాల ప్రవచనాలు వుటంకిస్తే అది సాహిత్యవిమర్శ అవదు.

సాహిత్యవిమర్శ సిద్ధాంతాలు వేరు, సాహిత్యాభిరుచులూ ప్రమాణాలూ నిర్మించే దక్షత వేరు. ఎంత గొప్ప సిద్ధాంతమైనా ఏది సాహిత్యమో ఏది కాదో నిర్ధారించలేదు. ఆ పని కవులు, రచయితలు కవులు రచయితలుగా, చెయ్యాలి. దీనికి యింకో దారి లేదు.

రూపం సారం అని తెలుగులో వేరువేరు విభాగాలు చేసి మాట్లాడడం, ఈ రెండింటికీ అవినాభావ సంబంధం ఉందని చెప్పడం ఒక అలవాటుగా మారింది. కాని రూపాన్ని గురించి ప్రత్యేకంగా మాట్లాడేవాళ్ళు ఎక్కువమంది వుండడం లేదు. ఉంటే అదేదో రూపవాద సిద్ధాంతులు చేసుకునే పనికిరాని చర్చగా తోసిపుచ్చడం మనకి ఇన్నాళ్ళూ కష్టం కాలేదు.

సంస్కృతంలోనూ ఇంగ్లీషులోనూ వున్న సాహిత్యసిద్ధాంతాలు నేరుగా మన భాషలోకి వచ్చేస్తుంటే, అందులో ఏవీ కవిత్వం రాసేటప్పుడు కవులకి అవసరం లేదని ఎవరూ ధైర్యంగా అనలేదు. విమర్శకులు వీటిని గజిబిజిగా తెలుగులో రాసేస్తుంటే, ఈ విజ్ఞానం మనకి తెలుగు సాహిత్యంలోని ఒక పద్యం, ఒక కథ, ఒక నవల, ప్రతి అక్షరం, ప్రతి పంక్తి, ప్రతి వాక్యం, పట్టుకుని అది అవసరం అవునో కాదో నిర్ధారించుకోవడానికి ఎలా పనికొస్తుందని మనం ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. మంచిచెడ్డలు నిర్ధారించే అభిరుచి ఎలా రూపొందుతుందో మనకి నిజంగా తెలియదు. అది కవులే, రచయితలే మనకి నేర్పాలి.

వచనపద్యం వచ్చిన తర్వాత ఆధునికభాషల్లో కవిత్వం చిక్కబడింది. పద్యానికి అంతకుముందున్న నియమాలు తగ్గబట్టి కవిత్వంగా మారడం తప్ప వచనానికి మరే నియమమూ లేని స్థితిలో కవిత్వం శబ్దపు బరువు నించి బయటపడి కొంత వెసులుబాటు సంపాయించుకుంది. పుస్తకంలో చూసి పద్యాన్ని నిశ్శబ్దంగా చదువుకునే మనస్సుకి అనుకూలమైన స్వరూపంతో పద్యంలో ప్రతి అక్షరమూ, ప్రతి పంక్తీ, ప్రతి విరామచిహ్నమూ అర్థవంతం చెయ్యవలసిన అవసరం ఏర్పడింది. వచనపద్యం అనేది భాషని వాడడంలో చాలా పరిణతులైన కవులకి మాత్రమే పట్టుబడే ప్రక్రియ అయింది.

దీనితో బాటు వచనం కూడా మారింది. పూర్వం పద్యం లోనే చెప్పే వైజ్ఞానిక విషయాలూ యితర సమాచారాలు వచనంలో చెప్పుకోమని కవి వదిలెయ్యడం వచనపద్యం వచ్చాక సాధ్యమయింది. వచనంలో రకరకాల సమాచారాల విశ్లేషణ చెయ్యడానికి, వాదాల ప్రతిపాదనా వివిధ దృక్పథాల సమన్వయమూ ఏర్పరడానికి, ధ్వనులూ వ్యంగ్యాలూ శ్లేషలూ లేని స్పష్టతతో రాయడానికి, వీలుకలిగింది. అచ్చుయంత్రం ఫలితంగా పద్యమూ వచనమూ రెండూ రెండు రకాలుగా మారాయి. ఆధునిక కాలానికి తగినట్టుగా అభివృద్ధి పొందాయి. ఇదీ ఆధునికభాషల్లో జరిగిన పరిణామం.

తెలుగులో వచనపద్యం, ఒక కొత్తరకమైన పద్యం రాయవలసిన అవసరం నించి వచ్చిందిలా కనబడడం లేదు. ఛందస్సు నేర్చుకోలేనివాళ్ళు కవిత్వం పేరుతో రాసెయ్యడానికి కావలసిన లైసెన్సు ఇచ్చే ప్రక్రియగా అది తయారయింది. అంచేత వచనపద్యం వచ్చి ఇటు కవిత్వాన్నీ అటు వచనాన్నీ రెండింటినీ పాడుచేసింది.

ఈ పరిస్థితి వచ్చింది అని గుర్తించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా వుంది. అలా గుర్తించి, ఒక రచనని తీసుకుని ప్రతి పదాన్నీ పంక్తినీ చూసి పరీక్షించి ప్రశ్నించాలి. ఈ పని నిజానికి రచయితలు, కవులు స్వయంగా చేసుకోవలసిన పని. లేదా మిత్రులు చూసి చెప్పాల్సిన విషయం. అదీ చెయ్యిదాటిపోతే ప్రచురించే ముందు సంపాదకులు ఆపి దాన్నిగురించి శ్రద్ధ పట్టమని ఆ రచయితనో కవినో అడగాలి.

తెలుగులో ఇప్పుడివేవీ అమలులో లేవు. రాసింది రాసినట్టుగా అచ్చువెయ్యడమే రాసినవాళ్ళ పని. పుస్తకాలకి రచయితలే ప్రచురణకర్తలు. అంచేత ప్రచురణసంస్థలు ఏర్పరచే సాహిత్యసంప్రదాయాలు మనకి వేరే లేవు. పత్రికల్లో సాహిత్యపు పేజీల సంపాదకుల యిబ్బందులు నాకు ప్రత్యక్షంగా తెలియవు కాని వాళ్ళు ఈపని శ్రద్ధగా చెయ్యడానికి కావలసిన వసతులు వున్నాయని నాకనిపించడం లేదు.

కవిత్వం కోసం వేరే పత్రికలు ఎలాగూ లేవు. అంచేత అవి వుండి వుంటే ఎలా వుండేదో చెప్పలేం. కాని కొత్త కవిత్వం రాస్తున్నప్పుడు భావకవులు, ఆధునికకవులు కవిత్వం కోసం పత్రికలు పెట్టుకున్న రోజులు గత ముప్ఫై యేళ్ళ క్రితం వరకూ వున్నాయి. అప్పుడు ఒక తరహా కవులు ఒక పత్రికలో రాయడం వుండేది. వాళ్ళు పద్యాన్ని గురించి ఏ విధమైన చర్చలు చేసేవాళ్ళో మనం వెనక్కి వెళ్ళి సమాచారం సంపాయించగలం అనుకుంటాను. అది మనకు పద్యచర్చలో ఉపయోగం కావచ్చు.

ఒక్కొక్కప్పుడు పద్యం ఎందుకు మంచిపద్యమో చెప్పడం కొంచెం సులువే గాని ఒక పద్యం ఎందుకు మంచి పద్యం కాదో చెప్పడం కష్టం. ముఖ్యంగా ఈ రోజుల్లో అచ్చవుతున్న పొడుగుపాటి వచనపద్యాల్లో, అంత పొడుగు ఆ పద్యానికి ఎందుకు అవసరం అన్న ప్రశ్న లేవదీస్తే నిలిచే పద్యాలు ఎన్నో వాటిని రాసిన కవులు కూడ నిబ్బరంగా చెప్పలేరు. వచనపద్యాల్లో అన్నిటికన్నా ముఖ్యం పంక్తిస్వరూపం. చాలా పంక్తులు రూళ్ళకర్రతో గీసిన గీతల్లాగా ఒకదాని తరవాత ఒకటి పేర్చి వుంటాయి. అవి ఆ పద్యానికి అవసరమా అని అడిగిచూడండి, ఏమవుతుందో! వచనపద్యంలో పంక్తులు విరిగే చోటు చాలా ముఖ్యమైన చోటు. ఎలా తోస్తే అలా ఆ క్షణానికి తట్టినట్టు పంక్తులు విరిచి కనిపించే వచన పద్యాలు మనకి కొల్లలుగా కనిపిస్తాయి. వీటిని గురించి మనం ఎప్పుడూ ఏ ప్రశ్నా వేసుకోలేదు. ఇలాంటి ప్రశ్నలే కథల గురించీ, నవలల గురించీ వేసుకోవాలి.

ఇంత వివరంగా ఈ విషయం ఎందుకు రాస్తున్నానంటే తెలుగులో చాలా పెద్దపేరున్న కవులూ, రచయితలూ ఈ పనులు నిరాటంకంగా చేసేస్తున్నారు. వాళ్ళని ఆపి అడిగే స్థైర్యం వున్న విమర్శకులు గాని, సంపాదకులు గాని లేరు.

వ్యక్తిగా కవికీ రచయితకీ పైకి రావాలని కోరుకునే హక్కు వుంది. సమాజంలో గౌరవమూ, డబ్బూ, పెద్ద వుద్యోగమూ కావాలని కోరుకుని అందుకోసం కావలసిన ప్రయత్నం చేసుకునే హక్కు వుంది. అంచేత కవుల్నీ, రచయితల్నీ వాళ్ళ రచనాశక్తికి సంబంధించిన విమర్శలకి సమాధానం చెప్పుకోవడంలో సంయమనం పాటించమని అడగలేం. పరీక్ష ఫెయిలయిన ప్రతివారూ పరీక్షావ్యవస్థని తప్పుబట్టే స్థితి వస్తే నష్టం లేదు. కాని పరీక్షావ్యవస్థే లేకుండా చేసే స్థితి వస్తే మాత్రం కష్టం. అదీ ఇవాల్టి పరిస్థితి.

సాహిత్యవ్యవస్థకి ఒక స్వతంత్ర సాంస్కృతికప్రతిపత్తీ, ఒక సామాజిక స్థైర్యమూ, ఒక గౌరవకరమైన చర్చాసంపత్తీ, ఏర్పడడానికి ఇవాళ తెలుగులో కవులే, రచయితలే పూనుకోవాలి. ఇది ఇంకే యితర సంస్థా చెయ్యగల పరిస్థితి తెలుగులో లేదు.


రచయిత వెల్చేరు నారాయణరావు గురించి: వెల్చేరు నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ విస్కాన్‌సిన్‌‍లో కృష్ణదేవరాయ చైర్‌ ప్రొఫెసర్‌‍గా పాతికేళ్ళపైగా పనిచేశారు. తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఎన్నో పుస్తకాలు ప్రచురించారు, పరిశోధనాపత్రాలు రాశారు. ఆయన రాసిన సిద్ధాంతగ్రంథం "తెలుగులో కవితా విప్లవాల స్వరూపం" తెలుగు సాహిత్య విమర్శ రంగంలో ఒక మైలురాయి. పాల్కూరికి సోమనాథుని సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం వరకూ తెలుగులోని శ్రేష్టసాహిత్యాన్ని (Classicsను) అనువదించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్న వెల్చేరు నారాయణ రావు  ఎమరి యూనివర్సిటీ నుంచి పదవీవిరమణ అనంతరం ఏలూరు దగ్గర నివసిస్తున్నారు. ...