అతను
ఆరున్నర అడుగుల ఆజానుబాహుడు
తను
ఐదూ రెండు అర్భకుడు
అతను
రెండొందల పౌండ్ల కండలు తిరిగిన వస్తాదు
తను
నూట డెబ్భై పౌండ్ల డయబీటిస్ పేషంటు
అతనికి
బహుశా ముప్ఫై దగ్గర్లో వుండొచ్చు
తనకి
యాభై దాటుతోంది
ఐతే
అవసరం తనది
తప్పదు
జాబ్ ఫెయిర్.
పాతికేళ్ళ నుంచి తను నమ్మకంగా పనిచేసిన కంపెనీ “అనివార్య కారణాల” వల్ల తనకి ఉద్వాసన చెప్పేసి అప్పుడే రెణ్ణెళ్ళౌతోంది.
లోకం అంతా ఒక్కసారిగా తలకిందులై, చావుని చూసిన వాడిలా తిరుగుతున్నాడిప్పుడు.
నిరుద్యోగం సత్తా ఏమిటో పూర్తిగా అవగాహనలోకి వస్తోంది.
ఏదో ఒక ఉద్యోగం
ఎలాటి కంపెనీ ఐనా సరే
ఎవడి కింద నైనా సరే
ఏం చెయ్యాల్సొచ్చినా సరే
దొరికితే చాలు
ఎదురుగా ఓ పొడవాటి టేబుల్. దాని వెనక నలుగురు కుర్రవాళ్ళు. వాళ్ళ వెనక అటూ ఇటూ తిరుగుతూ ఒకతను సూపర్‌వైజ్ చేస్తున్నాడు. అతన్తోనే తనకి పని.
అతను యిండియన్ కుర్రాడు!
ఇంకా పరీక్షగా గమనిస్తే తెలుగు వాళ్ళ సంతానంలా కనిపిస్తున్నాడు.
బహుశ ఆ కంపెనీకి సియీవోనో అలాటిదేదోనో అయ్యుండొచ్చు.
ముందుగా అతనే ఉద్యోగాల కోసం వచ్చిన వాళ్ళతో మాట్టాడుతున్నాడు. తరవాత అక్కడ కూర్చుని ఉన్న కుర్రవాళ్ళలో ఖాళీగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి కొన్ని పేపర్లు పూర్తిచేసి ఇవ్వాలి.
అతన్ని బాగా ఇంప్రెస్ చేస్తేనే ఆపై వ్యవహారాలు జరిగేది.
తన వంతు వచ్చేసింది.
అతని ఎదురుగ్గా నిలబడ్డాడు.
గొంతు సవరించుకున్నాడు.
రెస్యూమెని ఒకసారి అప్రయత్నంగానే తడుముకున్నాడు.
స్వాభిమానం, సందేహం, ఆభిజాత్యం, భయం కలగాపులగంగా కలబడుతూండగా
“హాయ్ అంకుల్, వాటె సర్‌ప్రైజ్! హవార్యు?”
అతనే!
తననే!!
ఎవరు? ఎవరు??
“నేను, కృష్ణని. కృష్ణ రావ్. మీరు షికాగోలో ఉన్నప్పుడు …”
అవును. గుర్తొచ్చింది. తన చిన్ననాటి మిత్రుడు సుబ్బారావ్ కొడుకు. తన కొడుకు కిరణ్‌కీ వీడి(?)కీ మూణ్ణెళ్ళే తేడా. సరిగా ఇరవై ఏళ్ళు కూడా ఉండవు. చూసి ఐదారేళ్ళైంది. ఇంతలోనే ..
ఇప్పుడు .. యిక్కడ .. యిలా ..
గొంతు పూడిపోయింది.