టెక్నాలజీ!కోవాడిస్‌

క్లుప్తంగా భవిష్యత్తులో కనుక్కోబడే టెక్నాలజీలు పొల్యూషన్‌ ని తీసేస్తాయనీ, మానవులకు అంతులేని ఎనర్జీ లభించేట్లు చేస్తాయనీ, ప్రకృతిని రక్షిస్తాయనీ, మనందరం కలలు కంటున్నాం. మన ఈ నమ్మకాలకు నిజాయితీ పరీక్ష పెట్టడం, ప్రస్థుత టెక్నాలజీలు చేస్తున్న ప్రకృతి ధ్వంసం తగ్గించడానికి వ్యక్తిగతంగా ఒక మనిషి ఏమి చెయ్యవచ్చో చర్చించడం ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.

ముఖ్యపదాలు జ్ఞానం, సైన్సు, టెక్నాలజీ, ప్రకృతి, వృక్షాలు, ఫాసిల్‌ ఫ్యూయల్స్‌, సివిలైజేషన్‌, గ్లోబల్‌ వార్మింగు, లీన్‌ దేశం, శాంతి భద్రతలు, పొల్యూషన్‌, ఇతర జీవులకు అంతిమ శ్వాస.

“కోవాడిస్(Quo vadis)”:‌ లాటిన్‌ నుంచి వచ్చిన ఈ పదానికి అర్థం “ నువ్వు ఎటు వెళ్తున్నావు, నీ గమ్యం ఏదీ? ” అని.

విషయసూచిక

1. మానవ నాగరికత పుట్టుక
1.1. సంగీతం పుట్టుక
1.2. కొన్ని నిర్వచనాలు
2.సైన్సు, టెక్నాలజీల ప్రస్థుత స్థితి
2.1. అందరూ స్పెషలిస్టులే
2.2. ఈ శతాబ్దపు పారడాక్సులు
2.3. టెక్నాలజీ తెచ్చిపెట్టిన మార్పులు
3. గ్లోబల్‌ వార్మింగు
4. విమాన ప్రయాణాలవల్ల గ్లోబల్‌ వార్మింగు మరీ ఎక్కువవుతోంది
5. చెట్లూ, పొదలూ అదృశ్యమవుతున్నాయి
6. మానవులకు శాంతిభద్రతలూ, ఇతర జీవులకు అంతిమశ్వాస
7. దీర్ఘకాల సంక్షేమానికి లీన్‌ దేశం
8. మన ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ సివిలైజేషన్‌
9. మతాధిపతుల ఆంక్షలు
10. పొల్యూషన్‌ కి సొల్యూషన్‌
11. మీరు ఎలా సహాయం చెయ్యగలరు?
11.1. జనాభా హద్దులో ఉంచడానికి జరుగుతున్న ప్రయత్నాలకు చేయూత
11.2. వుడ్‌ ప్రోడక్టుల వాడకం తగ్గించడం
11.3. పిల్లలకు ప్రకృతిసౌందర్యాభిమానం నేర్పించడం
11.4. మంచివి కాని టెక్నాలజీలను తిరస్కరించడం
12. రిఫరెన్సులు

1. మానవ నాగరికత పుట్టుక

మానవ నాగరికత (సివిలైజేషన్‌) షుమారు 20,000 సంవత్సరాలక్రితం ఇండియాలో ప్రకృతిని అర్థం చేసుకునే ఉద్దేశంతో వేదాల రచనతో మొదలయ్యింది.

ఆ కాలంలో ప్రకృతిలీలలన్నీ చాలా మాయగా కన్పించేవి. ఇండియాలో నివసించిన మన పూర్వీకులు ఈ మాయను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం మొదలుపెట్టారు. ఆ ప్రయత్నం వారిలో ఎన్నో నిగూఢమైన ప్రశ్నలను రేకెత్తించింది. ఆ కాలంలో సమకూర్చబడిన మన వేదాల్లోనూ, ఉపనిషత్తుల్లోనూ, పురాణాల్లోనూ ఈ ప్రశ్నలను పదే పదే చూస్తాం.

1. మెరుపులు ఏమిటి?
2. వర్షపు నీరు ఆకాశానికి ఎక్కడనుంచి వస్తుంది?
3. పిట్టలు ఎగిరినట్లు మానవుడు ఎగరలేడా?
4. జీవులకూ, జీవంలేనివాటికీ అసలు భేదం ఏమిటీ?
5. “ప్రాణం” ఏమిటి?
6. మృత్యువు ఏమిటి?
7. ప్రతి జీవీ ఎందుకు మరణించాలి?
8. మరణించాక జీవికి ఏమవుతుంది?
9. మానవునికి మరణం లేకుండా చెయ్యడం ఎలా?
10. మానవ జీవితానికి ధ్యేయం ఏమిటి?
11. ప్రతిదినం సూర్యోదయం, సూర్యాస్తమయం ఎందుకు జరుగుతాయి?
12. సూర్య, చంద్ర, నక్షత్రాలకు కాంతి ఎలా వస్తుంది?
13. ఋతుగమనానికి కారణం ఏమిటి?
14. సముద్రంలో కెరటాలు ఎందుకు వస్తాయి?
15. కొందరు అందంగాను, మరికొందరు కురూపులుగానూ ఎందుకవుతారు?
16. కొందరు ఆరోగ్యులుగానూ, మరికొందరు అనారోగ్యులుగానూ ఎందుకవుతారు ?
17. కొంతమంది స్త్రీలకు పిల్లలు ఎందుకు పుట్టరు?

ఇలాంటి అద్భుతమైన ప్రశ్నలు వేసిన మన పూర్వీకులను తలంచుకుంటే నాకు ఎంతో గర్వం కల్గుతుంది. ఇవి మానవ మేధోవికాసానికి చాలా దోహదం చేసాయి.

మన పూర్వీకులకు ముఖ్యంగా చీకటి, చావు, గొడ్రాలుతనం, నచ్చలేదు. జీవించేవాటికి “ప్రాణం” ఉంటుందని సిద్ధాంతం పెట్టి, ఈ ప్రాణం ఏమిటో కనుక్కోవడానికి ప్రయత్నం చేసారు. మృత్యువు లేకుండా చెయ్యడం ఎలా అని శోధించడం మొదలుపెట్టి, “అమృతం” అనే ద్రవం ఒక్క గుటక త్రాగితే చిరకాలం బ్రతికి ఉండవచ్చని సిద్ధీకరించి, ఆ అమృతం కొరకు వెదకడం మొదలుపెట్టారు.

ఆ కాలంలో మానవజనాభా చాలా తక్కువ, అందరూ తమకు విరివిగా సంతానప్రాప్తి కల్గాలని కోరుకునే వారు. ఎక్కువ సంతానం కల దంపతులకు మిక్కిలి సంఘగౌరవం ఉండేది.

మనపూర్వీకుల జ్ఞానతృష్ణ ఋగ్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులోని ఈ క్రింది శ్లోకంనుంచి గ్రహించవచ్చు.

అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యో మామృతం గమయ.

ఋగ్వేదం బహుశా మానవజాతి కంపోజ్‌ చేసిన మొదటి డాక్యుమెంటు. “ వేదం ” అంటేనే “ జ్ఞానసంకలనం ” అని అర్ధం. అది కంపోజ్‌ చేసిన కాలంలో “ వ్రాత ” ను మానవుడు ఇంకా కనిపెట్టలేదు. రాబోయేతరాలకు వేదాలను అందించడానికి అప్పుడు “ పారాయణపద్ధతి ” అమలు పర్చారు. వాటిని ఇంపుగా పాడగలిగే శ్లోకాల రూపంలో కూర్చి, ప్రతిదినం పారాయణచేస్తూ గుర్తుంచుకొనే బాధ్యత కొంతమంది మనుష్యులకు అప్పజెప్పారు. ఈ మనుష్యులనే “ బ్రాహ్మణులు ” అన్నారు. వారి సంఘబాధ్యత వేదాలను క్షుణ్ణంగా నేర్చుకొని, ప్రతిదినం పారాయణచేస్తూ తరతరాలుగా అవి మానవజాతికి అందుబాట్లో ఉండేట్లు చెయ్యడం. బ్రాహ్మణులు రోజూ వేదపారాయణం చెయ్యక వాటిని మర్చిపోతే మానవజాతికి గొప్పనష్టం సంభవిస్తుందనే విపరీతభయం మనపూర్వీకులకు ఉండేది. ఈ వేదనష్టభీతి మూలాన బ్రాహ్మణులపని (దినదిన వేద పారాయణ) అతిముఖ్యమైన పనిగా పరిగణించబడి, వారికి సంఘంలో అగ్రస్థానం లభించింది.

ఇంట్లో తండ్రి వేదపారాయణం చేస్తూండగా వినడం మూలాన స్వతహాగా అది పిల్లలకు తేలిగ్గా అబ్బుతుందికదా, అందుకనే బ్రాహ్మణుల పిల్లలు బ్రాహ్మణులయ్యే రీతి అమలులోకివచ్చింది. ఈ ఆచారమే కాలక్రమేణా మన “ కులవ్యవస్థ ” కు దారి తీసింది.

1.1 సంగీతం పుట్టుక

వేదాలను గుర్తుంచుకోవడానికి మొదలుపెట్టిన పారాయణ పద్ధతే క్రమేపీ “సంగీతం”ను పుట్టించింది.

1.2 కొన్ని నిర్వచనాలు

జ్ఞానం (knowledge) = ప్రకృతిలీలలూ, వాటికి కారణాలూ
విశదీకరించే సమాచారం

శాస్త్రం (సైన్సు) = తెలుసుకోబడిన జ్ఞానసమూహం

టెక్నాలజీ = సైన్సు వాడి మానవజాతి ఎదుర్కుంటున్న
సమస్యలను తీర్చే పద్ధతులు.

జ్ఞాన సముపార్జనా, టెక్నాలజీ డెవలప్‌ చెయ్యడం, చాలా పవిత్రమైనకార్యాలుగా మొదలయ్యాయి.

2. సైన్సు, టెక్నాలజీల ప్రస్థుత స్థితి

వేదాలు కంపోజ్‌ చేసిన కాలంనుంచి ఇప్పటికి సైన్సు, టెక్నాలజీలు ఎంతో అభివృద్ధి చెందాయి. 21వ శతాబ్దపు మొదటి సంవత్సరానికి మానవజాతి గీనోమ్‌ కోడును ఛేదించడం పూర్తిజేసి, మానవశరీరానికి మాలిక్యులర్‌ బ్లూప్రింటును అవగాహన చేసుకున్నది.

వరల్ద్‌ వైడువెబ్‌ (WWW) నిర్మించడం ఇంకొక గొప్ప టెక్నలాజికల్‌ ఫీటు. దీన్నివాడి ప్రపంచంలో ఎక్కడున్నవారైనా, నేను ఆన్‌ఆర్బర్‌లో నా డస్కుమీద వ్రాస్తున్న ఈ వ్యాసాన్ని తమ పర్సనల్‌ కంప్యూటర్‌ (PC) తో చదవగలరు.

ఇవి మానవమేధస్సుకు ఘనవిజయాలు.

కానీ వృద్ధిచెందుతున్నకొద్దీ సైన్సుయొక్క గమ్యం “ ప్రకృతిని అర్థం చేసుకోవడం ” నుంచి “ మిగతా జీవులు పూర్తిగా నశించిపోయినాసరే, ప్రకృతిని పూర్తిగా మానవ అవసరాలూ, విలాసాలకోసం కంట్రోల్‌ చెయ్యడం ” కు మారింది.

ఇది చాలా శోచనీయం, గర్హనీయం.

2.1. అందరూ స్పెషలిస్టులే

మనకు ఇప్పుడు తెలిసిన జ్ఞానసమూహం ఎంత పెద్దదంటే, ఒక మనిషి తన జీవితకాలంలో సైన్సులో ఒక చిన్న భాగాన్ని మాత్రమే అర్ధం చేసుకోగలడు. కనుక ప్రతివాళ్ళూ, సైన్సులో ఒక ప్రత్యేక శాఖలో మాత్రమే తర్ఫీదు పొంది, ఆ శాఖలో స్పెషలిస్టులయ్యి, మిగతాశాఖలనుగురించి ఎక్కువ పట్టించుకోకపోవడం మామూలు అయ్యింది. ఈ స్పెషలైజేషన్‌ నుగురించి ఒక పిట్టకధ చెప్తాను.

చెవిపోటు భరించలేక ఒకాయన ఆస్పత్రిలో చెవిశాఖకు వెళ్ళి అక్కడ ఒక డాక్టరుని తన చెవి పరీక్షచెయ్యమని అడిగాడు.

డాక్టరు ఏమిటి నీ సమస్య?
వ్యక్తి నొప్పి, చెవిపోటు, గింగురుమనే శబ్దం …
డాక్టరు ఆగు, ఆగు, ముందు ఏ చెవిలో ఈ సమస్య ఉందో చెప్పు.
వ్యక్తి ఎడమచెవి.
డాక్టరు సారీ, నేను కుడిచెవి స్పెషలిస్టుని. ప్రక్కగదిలోని
డాక్టరుని చూడు!

మరీ అందరూ ఇలా స్పెషలైజు చేయడం మూలాన, ఎవ్వరికీ మొత్తం సైన్సు, టెక్నాలజీ డెవలప్‌ మెంటు ఎటువెళ్తోందీ తెలియదు, తెలుసుకోవాలనే కుతూహలం ఉండడంలేదు కూడా.

2.2. ఈ శతాబ్దపు పారడాక్సులు

ఈ కొత్తశతాబ్దం మానవచరిత్రలో చాలా విడ్డూరమైనది. ఈ కాలంలో ఎన్నో పారడాక్సులు చూడవచ్చు.

21వ శతాబ్దపు పారడాక్సులు

బోలెడు సమాచారం కానీ తక్కువ వివేకం
బోలెడు ధనం కానీ చాలా బీదరికం గూడా
బోలెడు వస్తుసంపద కానీ తక్కువ తృప్తి
గొప్ప ఔషధాలు కానీ చాలా అనారోగ్యం
ఎన్నో టెక్నాలజీలు కానీ చాలా సమస్యలు గూడా
చాలా తీరిక వేళ కానీ తక్కువ ఆనందం
బోలెడు ఆహారం కానీ చాలా ఆకలిదప్పులు
బోలెడు భవనాలు కానీ అన్నిచోట్లా వీధివాసకులు
దీర్ఘాయుష్షులు కానీ నిస్పృహజీవితాలు

అంతముఖ్యంకాని సమస్యలు తీర్చగల పండితులు కొల్లలు అస్సలు సమస్యలు పరిష్కరించగల ప్రముఖులు అరుదు.

2.3. టెక్నాలజీ తెచ్చిపెట్టిన మార్పులు

మన టెక్నాలజీ ప్రపంచాన్ని ఎలా మారుస్తోందో ఈ క్రింది గేయం తెలుపుతుంది.

మానవ దురాక్రమణ ప్రకృతిని హతమారుస్తోంది

ఆకాశంలో పెద్దరొద చేసే విమానాలు
ఎక్కడ చూసినా శంఖుస్థాపనలే
అన్నిచోట్లా ఎ్తౖతెన క్రేనులు
మహా వృక్షాలను తృటిలో పడగొట్టే చైనుసాలూ
భూమాతకు గుండెపోటు కల్గించే బుల్‌ డోజర్లు
సర్వత్రా మానవుడు ప్రకృతిని చంపి తన హర్మ్యాలను నిర్మిస్తున్నాడు
పచ్చటి అడవులనన్నిటినీ కాంక్రీటుజంగిల్స్‌ గా మారుస్తున్నాడు
మానవ దురాక్రమణ ప్రకృతిని హతమారుస్తోంది.

మనచేష్టల ప్రభావం ప్రపంచంలో ఇంకేమి మార్పులు తెస్తోందో క్రింది సెక్షన్‌లలో పరిశీలిద్దాం.

3. గ్లోబల్‌ వార్మింగు

ఒక ముఖ్య నిర్వచనం.

ఈక్విలిబ్రియం = వచ్చేవీ, పోయేవీ సగటున సమానంగా ఉండే
స్థితి; ఆటూ, పోటూ సమానంగా ఉండడం.

ఉదాహరణకు మానవ జనాభా తీసుకోండి. పుట్టుకలవల్ల ఇది పెరుగుతుంది. చావులవల్ల తగ్గుతుంది. పుట్టుకలు, చావులు సరిసమానంగాఉంటే ప్రపంచం పాప్యులేషన్‌ ఈక్విలిబ్రియంకు వస్తుంది. ప్రస్థుతం పుట్టుకలు చావులకన్నా చాలా ఎక్కువవడంమూలాన మానవ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది.

ఇంకొక ఉదాహరణ ఒక చెరువు నీటి లెవల్‌ తీసుకోండి. వర్షంవల్ల ఇది పెరుగుతుంది. నీళ్ళు ఆవిరైపోవడంమూలాన తగ్గుతుంది. వర్షంనీళ్ళూ, ఆవిరైపోతున్ననీళ్ళూ సరిసమానంగాఉంటే చెరువు నీటిలెవెల్‌ ఈక్విలిబ్రియంలో ఉండగలదు.

అస్సలు విషయానికి వద్దాం. పగటిపూట సూర్యరశ్మిలో ఎనర్జీని ఎబ్సార్బ్‌ చేసి భూమి వేడెక్కుతుంది. ఈ ఎనర్జీని మళ్ళీ భూమి స్పేసులోకి ఇన్ఫ్రారెడ్‌ రేడియేషన్‌ ద్వారా పంపించేస్తుంది. సూర్యరశ్మినుంచి ఎబ్సార్బ్‌ చేసే ఎనర్జీ, ఇన్ఫ్రారెడ్‌ రేడియేషన్‌ గుండా బయటకువెళ్ళిపోయే ఎనర్జీ సరితూగితే భూమిటెంపరేచర్‌ ఈక్విలిబ్రియంలో ఉంటుంది. ఎన్నో శతాబ్దాలనుంచీ మొన్నమొన్నటివరకూ భూమిటెంపరేచర్‌ ఈక్విలిబ్రియంలో ఉండేది.

గాలిలోని కొన్ని గాసులు, బయటకు వెళ్ళిపోయే ఇన్ఫ్రారెడ్‌ రేడియంట్‌ ఎనర్జీలో కొంతశాతాన్ని మళ్ళీ భూమివైపు తిరగకొట్టే గుణం కల్గి ఉంటాయి. వీటిని “ గ్రీన్‌ హౌసు గాసులు ” అంటారు.

నీటిఆవిరి ఒక గ్రీన్‌ హౌసు గాసు. మేఘం నీటి ఆవిరిసమూహమే కదా. అందుకనే చలికాలంలో ఆకాశం మేఘావృతంగా ఉన్న రాత్రి కమ్మటి వెచ్చదనంతో హాయిగా ఉంటుంది. ఆకాశంలో మేఘాలులేనిరాత్రి వణుకు పుట్టే చలిగా ఉంటుంది.

కార్బన్‌ డైఆక్సైడు (CO2) నీటి ఆవిరికన్నా ఎక్కువశాతం బయటకు వెళ్ళిపోయే రేడియంటు ఎనర్జీని భూమివైపు త్రిప్పికొట్టే గ్రీన్‌ హౌసు గాసు. 18వ శతాబ్దం వరకూ గాలిలో CO2 శాతం, వాల్యుంనిబట్టి, 0.027 ఉండేది.

భూగర్భం నుంచితీసే బొగ్గు, క్రూడాయిల్‌, నేచురల్‌ గాసులను “ ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ ” అంటారు. ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ కాల్చినప్పుడు గ్రీన్‌ హౌసు గాసులు విడుదలచెయ్యబడతాయి. వీటిలో ఎక్కువ భాగం CO2 .

ప్రస్థుతం మన టెక్నాలజీలకన్నిటికీ చాలా ఎనర్జీ అవసరం. ఈ ఎనర్జీలో చాలాకొద్దిభాగం న్యూక్లియర్‌ రీఏక్టర్లనుంచీ, హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ ప్లాంట్లనుంచీ ఉత్పత్తి చేస్తున్నాం. ఎక్కువ భాగం ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ కాల్చి ఉత్పత్తిచేస్తున్నాం. దీనివల్ల మనం గాలిలో చాలా ఈఖ2 ని విడుదల చేస్తున్నాం. మనం కల్పిస్తున్న ఎయిర్‌ పొల్యూషన్లో ఇది ముఖ్యమైనది.

పెరుగుతున్నమొక్కలు CO2 ని పీల్చి కిరణజన్యసంయోగక్రియతో దానిలోని కార్బన్‌ (C) ని కార్బోహైడ్రేట్లుగామార్చి ఆక్సిజన్‌ (O2) ని గాలిలోకి విడుదలచేస్తాయి. కానీ జనాభా బాగాపెరిగిపోవడంతో, మొక్కలజాతి అంతా పీల్చుకునే CO2 కన్నా, మనం ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ కాల్చి గాలిలోకి విడుదలచేస్తున్న CO2 చాలా ఎక్కువ అయ్యింది. దీనివల్ల, వాతావరణంలో CO2 ఈక్విలిబ్రియం చెదరిపోయి, దాని శాతం పెరుగుతోంది. ఇప్పుడు వాల్యూంని బట్టి CO2 సాతం 0.037 కి పెరిగింది. CO2 అమోఘమైన గ్రీన్‌ హౌసు గాసు అవ్వడం మూలాన, దీనివల్ల టెంపరేచర్‌ ఈక్విలిబ్రియం చెదిరిపోయి భూమి వేడెక్కడం మొదలుపెట్టింది. దీనినే “ గ్లోబల్‌ వార్మింగు ” లేక “గ్రీన్‌ హౌస్‌ వార్మింగు ” అని పిలుస్తారు. మానవులు పెద్దమొత్తాలలో ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ కాల్చి గాలిలోకి విడుదల చేస్తున్న గ్రీన్‌ హౌసు గాసులవలనే ఈ గ్లోబల్‌ వార్మింగు కల్గుతోందని తెలుస్తోంది.

గ్రీన్‌ హౌస్‌ వార్మింగువల్ల గత 50 మిలియన్ల సంవత్సరాలలో మొట్టమొదటిసారి ఆగస్టు 2000 లో ఉత్తర ధ్రువం దగ్గర దట్టమైన మంచుగడ్డ కరిగి ఒక మైలుపొడవు మంచులేని నీటిసముద్రంగా మారిందని [1] లో వార్త వచ్చింది. ఇదే ప్రాంతంలో 6 సంవత్సరాల క్రితం 9 అడుగుల దళసరి మంచుగడ్డ ఉన్నట్లు రికార్డు చెయ్యబడింది. గత పాతిక సంవత్సరాలలో ఈ ప్రాంతం వాతావరణం చాలా వేడెక్కడం మూలానే ఇలాజరిగిందని ఈ రిపోర్టు చెప్పింది.

ఉత్తరార్ధగోళంలో సముద్రజలాలు మిగతాచోట్లకన్నా పదిరెట్లు ఎక్కువగా వేడెక్కుతున్నట్లు [2] లో రిపోర్టు వచ్చింది. దీనివల్ల ఇంకొక 30 సంవత్సరాలలో అన్నిసముద్రాలలోనూ “ కొరల్‌ రీఫ్సు ” చనిపోవచ్చని ఈ రిపోర్టులో అంచనా వేసారు.
4. విమాన ప్రయాణాలవల్ల గ్లోబల్‌ వార్మింగు మరీ ఎక్కువవుతోంది

సముద్రతలంనుంచి షుమారు 50,000 అడుగుల ఎత్తువరకూఉన్న గాలిపొరను “ ట్రొపోస్ఫియర్‌ ” అని పిలుస్తారు. నీటిఆవిరి, మేఘాలు, వర్షం, స్నో అన్నీ ఈ పొరలోనే ఉంటాయి. దానిపై పొరను “ స్ట్రాటోస్ఫియర్‌ ” అని పిలుస్తారు. అది ట్రొపోస్ఫియర్‌ పైభాగంనుంచి షుమారు ఇంకొక 100,000 అడుగులు ఎత్తువరకూ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్‌లో నీటిఆవిరి చాలా తక్కువ, మేఘాలు అరుదు.

స్ట్రాటోస్ఫియర్‌ చేరేటప్పటికి గాలిఒత్తిడి సముద్రతలంలోఉండే ఒత్తిడిలో 1% మాత్రమే ఉంటుంది. అందువల్ల స్ట్రాటోస్ఫియర్‌ లో ప్రయాణంచేసే విమానాలకు ఎయిర్‌ రెసిస్టెన్సు తగ్గి ఫ్యూయల్‌ ఖర్చు బాగా తగ్గుతుంది. అందుకనే జెట్‌ విమానాలు వీలైనంతవరకూ స్ట్రాటోస్ఫియర్‌ లోనే ప్రయాణం చేస్తాయి. అయినా ప్రతిపాసెంజర్‌ మైలుకీ జెట్‌ విమానం, నేలమీద పయనించే బస్సుకన్నా 8 రెట్లు ఫ్యూయల్‌ కాలుస్తుంది [3] .

ప్రయాణంచేసే ప్రతి జెట్‌ విమానం స్ట్రాటోస్ఫియర్‌ లో గ్రీన్‌ హౌసుగాసులను పెద్దమొత్తాలలో విడుదల చేస్తుంది. అక్కడ గాలిఒత్తిడి చాలా తక్కువ గనుక ఎయిర్‌ కాంపొజిషన్‌ తేలిగ్గా మారుతుంది. అదీకాక అక్కడ CO2 ని ఎబ్సార్బ్‌ చేసే మొక్కలూ, తడి ఎమీ లేవు. అక్కడ విడుదలైన CO2 ట్రోపొస్ఫియర్‌ కి దిగీంతవరకూ అలానే స్ట్రాటోస్ఫియర్‌ లో ఉండిపోతుంది. అది ట్రోపొస్ఫియర్‌ చేరడానికి చాలా సంవత్సరాలు తీసుకుంటుంది.

కనుక జెట్‌ విమానాల ట్రాఫిక్‌ వల్ల స్ట్రాటోస్ఫియర్‌ లోని CO2 శాతం, మొత్తం వాతావరణంలో ఈఖ2 శాతంకన్నా ఎక్కువ అవుతోంది. దీనివల్ల గ్లోబల్‌ వార్మింగు మరీ పెరుగుతోంది.

విమానాల స్పీడు సౌకర్యంగా ఉండడంమూలాన ప్రపంచమంతటా విమాన ప్రయాణం తెగ పెరుగుతోంది. ఈ సౌకర్యం ధర గ్లోబల్‌ వార్మింగుని మరీ ఎక్కువ చెయ్యడమే.

5 చెట్లూ, పొదలూ అదృశ్యమైపోతున్నాయి

చక్కగాఎదుగుతున్న చెట్లను, వార్తాపత్రికలు, మేగజీన్లు, ఫోనుడైరక్టరీలు, పేపరుప్లేట్లు, నేప్‌ కిన్లూ, టాయిలెట్‌ టిష్యూ, టెట్రాపాక్‌ కంటైనర్లూ, కార్డుబోర్డు, వగైరా ప్రోడక్టులుగా మార్చడంలో అమెరికాలో మనం చాలా ప్రతిభ గడించాం. ఇవన్నీ చాలా తక్కువ కాలం వాడుక తర్వాత చెత్తగా మారిపోతాయి. అన్నిదేశాల్లోకీ ఇలాంటి పేపరుప్రోడక్టులవాడకంలో అమెరికన్‌లదే అగ్రస్థనం. అమెరికాలో పేపరుప్రోడక్టులమ్మడానికి కెనడాలాంటి దేశాలు తమ చక్కటి అడవులను ధ్వంసం చేస్తున్నారు.

ఇలాంటి తక్కువకాలప్రయోజనాలకు పేపరువాడకం తేలిగ్గా తగ్గించవచ్చు; కానీ ఎవ్వరూ దీన్నిగురించి పట్టించుకోవడంలేదు. ఎందుకని? “ మానవుడు చెట్లని చంపి నాశనం చెయ్యడానికే భగవంతుడు వాటిని సృష్టించాడు ” అనే గట్టి నమ్మకం వీళ్ళందరికీ ఉందిగనుక.

Alfred Joyce Kilmer (18861918) వృక్షాల గొప్పతనాన్ని గురించి వ్రాసిన పద్యరత్నం ఆధారంగా నేను వ్రాసిన గేయం ఈ క్రింద ఇస్తున్నాను (చరణాలు నెంబరు చేసాను).
మహావృక్షం

1. ఒక మహావృక్షానికన్నా సుందరమైనది ఈ
సృష్టిలో మరేదీ లేదని నా అభిప్రాయం,
2. గ్రంధాలయంలో పుస్తకాలన్నీ తిరగేసినా ఒక
వృక్షం అందంతో సరితూగే కవిత కన్పించదు,
3. భూమాత చనుకట్టులో తియ్యదనం జుర్రుకునే వేరులవృక్షం,
4. పచ్చటి ఆకులకొమ్మలతో నింగిన సూర్యదేజఉనికి
పగలల్లా అంజలిఘటించే వృక్షం,
5. రంగుల చిలకలగూడును శిరసున ధరించే వృక్షం,
6. చలికాలంలో హిమాలయమయి ధగధగ మెరిసే వృక్షం,
7. మండుటెండలో ఇతరప్రాణులకు చల్లటి
నీడనొసగి కాపాడే ఆకులవృక్షం,
8. “ అడగకపోతే అమ్మైనా బువ్వపెట్టదు ” అంటారు
కానీ అయాచకంగా ప్రతిదినం అన్నిజీవులకూ
అమృతఫలాన్నందించే కల్పవృక్షం,
9. బుల్లిరెక్కలతో తేలియాడే సీతాకోకచిలుకలకు
కమ్మటి మకరందాన్నిచ్చే పుప్పొడి వృక్షం,
10. గాడాంధకారంలో మిలమిలమెరిసే
మిణుగురుపురుగులకాలవాలమైన వృక్షం,
11. సుగంధపుష్పాలతో వసంతశోభతెచ్చే వృక్షం,
12. మానవుడి ఉపయోగానికై బొగ్గుగామారిన వృక్షం,
13. తొడిమలురాల్చి భూమాతను జీవనాధారిగా మార్చిన వృక్షం,
14. వ్రేళ్ళతో భూమాత ఉపరిభాగాన్ని రక్షించే వృక్షం,
15. భూమాతగర్భంలోకింకిన జలాన్ని పైకితెచ్చి
ఆకాశంలో మేఘానికందించే వృక్షం,
16. ఆమ్లజనిని సృష్టించి అన్నిజీవులనూ పోషించే వృక్షం,
17. జీవచక్రానికి సూత్రధారియైన వృక్షం,
18. మలయమారుతంతో నాట్యమాడే వృక్షం,
19. స్వచ్ఛమైన వర్షజలంతో కలసిమెలసిఉండే వృక్షం,
20. నాలాంటి మానవులకు మధురగీతమల్లడం వచ్చేమో
కానీ ఇట్టి వృక్షాన్ని సృష్టించ గల్గింది నీవే భగవాన్‌.

ఈ కాలం మానవులకు వృక్షాలమీద అంతగౌరవంలేదని తెలుస్తోంది. ఇప్పటికీ చాలామొక్కలు మొలకెత్తుతూనే ఉన్నాయి. కానీ మనం చేస్తున్న లాన్‌ మోయింగు, వీడింగు, కల్టివేటింగు, గోల్ఫింగు, స్కియ్యింగు, స్నోమొబైలింగు, డ్రైవింగు మొదలైన కార్యాలలో ఈ మొక్కలన్నీ నశించిపోతున్నయి. దీనివల్ల, వచ్చే వందసంవత్సరాలలో పలురకాల వృక్షజాతులు అంతరించవచ్చు.

6. మానవులకు శాంతిభద్రతలూ, ఇతర జీవులకు అంతిమశ్వాస

మనమంతా “ శాంతిభద్రతలు (World peace)” అంటే ఎంతో పవిత్రమైనవిగా పరిగణిస్తాం.

నేను ఒకసారి టీవీలో మిస్‌ యూనివర్సు కంటెస్టు చూసాను. చాలాదేశాలనుంచి సుందరీమణులు దాంట్లో పోటీ చేసారు. పోటీలో దేహసౌందర్యమేకాక, స్విమ్మింగు, డాన్సింగు, డిబేటింగు, సింగింగు లాంటి కళలలో కౌశల్యంకూడా చూస్తారు. చాలా పోటీలు అయ్యాక ఐదుగురు ఫైనలిస్టులను సెలక్టు చేసారు. చిట్టచివరి పోటీలో ప్రతి ఫైనలిస్టునీ ఒక ప్రశ్నకు జవాబు చెప్పామని అడిగారు. ఆ ప్రశ్న ఇది “ నీకు ఒకేఒక్క వరం ఇస్తే, ఏమి కోరుకుంటావు ?” . గెలిచిన అమ్మాయి “world peace , ప్రజలందరికీ శాంతి భద్రతలు సమకూడడం ” అని ఎంతో గొప్పగా చెప్పింది. దానికి అంతా చప్పట్లు కొట్టి, మెచ్చుకొని, ఆవిడను మిస్‌ యూనివర్స్‌ గా ఎన్నుకున్నారు.

మనం శాంతి భాద్రతలను గురించి మాట్లాడినప్పుడు మన గురించే ఆలోచిస్తాం గానీ, ఇతర జీవులను గురించి పట్టించుకోం. ఎన్నో రకాల జంతువులు, చెట్ల జాతులూ, 6 బిలియన్ల మానవుల చేష్టల మూలాన సమసి పోతున్నాయి. ఉదాహరణకు ఫ్లారిడా కోస్తా సముద్రంలో “ మానటీ ” అనే బహుసాధు నీటి జంతువు ఉంది. ప్రస్థుతం 200 మానటీలు మాత్రమే మిగిలాయి, ఈ మానటీ లకు ఇప్పటికైనా శాంతి భద్రతలు కల్గించలేమా? ఆ సముద్రంలో విహరించే పడవలు, నౌకలు క్రింద నలిగి ఆ మిగిలిన కొన్ని మానటీలు గూడా నశించిపోవాలా? అలానే హాంకాంగు సముద్ర తీరంలో చాలా అందమైన పింకు డాల్ఫిన్లు నివసిస్తాయి. ప్రస్థుతం మిగిలిన 300 పింకు డాల్ఫిన్లూ ఇలానే నశించి పోతున్నాయి. ఇలానే కాలిఫోర్నియాలో మిగిలిన 150 మౌన్టెన్‌ లయన్సూ, ఆఫ్రికాలో మిగిలిన కొన్ని వందల గోరిల్లాలు, కొన్ని వేల ఏనుగులూ, దక్షిణ అమెరికాలో మిగిలిన కొన్ని వందల మహోగనీ చెట్లూ, ఇండియాలో మిగిలిన కొన్ని వందల ఖడ్గమృగాలూ, ఇలాంటి జీవులన్నిటికీ కనీసం ఇప్పటికైనా శాంతి భద్రతలు అవసరం లేదా? పెరిగిపోతున్న మానవ జనాభా ఈ జీవులు నివసించే ప్రాంతాలని ఆక్రమించుకోవడం మూలాన ఇలాంటి జీవులెన్నో అంతిమ శ్వాసను పీలుస్తున్నాయి.

నా చిన్నతనంలో ఇండియాలో పెరుగుతున్నప్పుడు ఒక అనుభవాన్ని గురించి చెప్తాను. 1940ల్లో మా కుటుంబం ఆంధ్రప్రదేష్‌ లోని కొల్లేరు సరస్సు మీద పడవలో వెకేషన్‌ కి వెళ్ళాం. కొల్లేరు సరస్సు తక్కువలోతు సరస్సు, ఇప్పుడు అలాంటి సరస్సుని వెట్లాండ్సు ఏరియా అంటారు. మేము వెళ్ళిన పడవలో మోటారులేవీ లేవు, తెరచాప, మానవభుజబలంతో కదిలే పడవ అది. నా చిన్నతనం కంటికి మాత్రం కొల్లేరు సరస్సు ఎంతో మహా సముద్రంలా కనపడింది. సరస్సు మధ్య ఒక చిన్న ద్వీపం మీద కొల్లేరు దేవతకు ఒక గుడి ఉంది, ఆ గుడి మా గమ్య స్థానం. చేరడానికి పూర్తిగా రెండు రోజులు పట్టింది, మళ్ళీ తిరుగు ప్రయాణం ఇంకో రెండు రోజులు. దారి పొడుగూతా ఎన్నో రకాల నీటి బాతులు చూసాం, ఏపుగా పెరుగుతున్న బెండు ( cork ) నీటి వృక్షాలు చూసాం. ఈ బెండు వృక్షాలు బహు పెళుసువి. వాటి కొమ్మలు 24″ మందంతో లోపల తెల్లటి పెళుసు చెక్కతో, బయట ఆకుపచ్చ బెరడుతో ఉన్నాయి. పెళుసు చెక్కమూలాన ఈ కొమ్మతో ఎంత గట్టిగా బాదినా అవతలి వాళ్ళకు నొప్పి కలగదు. ఆ కొమ్మలు ఆయుధాలుగా మేం పిల్లలం తెగ కొట్లాడుకొని ఆనందించాం.

ఈ మధ్య ఒకసారి ఇండియా వెళ్ళినప్పుడు కొల్లేరుకు మళ్ళా వెళ్ళాను. అక్కటా, సరస్సు పూర్తిగా మాయమయి పోయింది!. పెరుగుతున్న మానవ జనాభాకు ఇళ్ళు కట్టడానికి స్థలంకోసం, తినడానికి వరి పండించడం కోసం, సరస్సులో నీళ్ళన్నీ డ్రైను చేసారని అక్కిడి ప్రజలు చెప్పారు. నీటి బాతులు అస్సలు లేవు, బెండు చెట్టు extinct అయిపోయింది. ఈ జీవులన్నీ వాటి నివాసస్థలాన్ని మానవుడు ఆక్రమించుకోవడం మూలాన అంతిమశ్వాస పీల్చాయి. పాపం, కొల్లేరు దేవత తన సరస్సును, దాంట్లో తాను సృష్టించిన సాధు జీవులనూ మానవులబారి నుండి రక్షించుకోలేకపోయింది.
7. దీర్ఘకాల సంక్షేమానికి లీన్‌ దేశం

హద్దుమీరిబరువెక్కడం మానవశరీరానికి ఆరోగ్యకరంకాదని మెడికల్‌ సైన్సు ఎప్పుడో గుర్తించింది. ఆరోగ్యంగా బ్రతకాలంటే లీన్‌ శరీరం ఉండాలి. ఇలానే దేశాలుగూడా తమ ప్రజాక్షేమంకోసం జనాభాను హద్దులో ఉంచుకొని లీన్‌ దేశాలుగా మారాలి. “ సర్వేజనాః స్సుఖినోభవంతు ” అనే దీవెన నిజంకావాలంటే దేశం జనాభా తక్కువగా ఉంచడం అవసరం.

8. మన ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ సివిలైజేషన్‌

ప్రపంచమంతటా ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ వాడకం హద్దులేకుండా పెరిగిపోతుంది. ప్రస్థుతం అమెరికన్లువాడే క్రూడ్‌ ఆయిల్‌ లో 60% ఇతరదేశాలనుంచి వస్తోంది. డిమాండు సప్లైస్థాయికిపెరగడంతో అమెరికాలో పెట్రోలు, నేచురల్‌ గాసు, హీటింగుఆయిల్‌, ఏవియేషన్‌ గాసొలీను ధరలన్నీ పెరిగిపోతున్నయి. అందువల్ల అమెరికాప్రెసిడెంటు తరచుగా OPEC దేశాలను క్రూడ్‌ ఆయిల్‌ ప్రొడక్షన్‌ పెంచమనీ, ధరలు తగ్గించమనీ బలవంతం చెయ్యడం చూస్తూనే ఉన్నాం.

ఇతర ఎనర్జీసోర్సులు కనిపెట్టడానికి దీర్ఘకాలంనుంచీ తీవ్రప్రయత్నాలు జరుగుతున్నా ఇంతవరకూ పెద్దమొత్తాలలో ఎనర్జీ లభ్యమయ్యేట్లుచేసే భద్రమైన కొత్తపద్ధతులేవీ కనిపెట్టబడలేదు. పెరుగుతున్న జనాభామూలాన వాడుకలోనున్న మన టెక్నాలజీలన్నిటికీ ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ నుంచివచ్చే ఎనర్జీ రోజురోజుకీ ఎక్కువ అవసరం అవుతోంది. అందువల్ల మన ప్రస్థుత సివిలైజేషన్‌ ని “ ఫాసిల్‌ఫ్యూయల్స్‌ సివిలైజేషన్‌ ” అని పిలువవచ్చు. ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ లేకుండా ఈ సివిలైజేషన్ని ప్రస్థుత స్థాయిలో ఎక్కువకాలం నిలపగలమనుకోడానికి ఇప్పుడు ఆధారాలులేవు.

“ సైంటిస్టులు కొత్త ఎనర్జీసోర్సులు కనిపెడ్తారులే! ” అనే ఆశతో జనాభాని ఇప్పటిలాగే విచ్చలవిడిగా పెరగనివ్వడం హానికరం అని తోస్తోంది.

“ దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ”

అని సామెత చెప్పినట్లు వీలైనంత త్వరలో జనాభాను అదుపులోపెట్టి ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ వాడకాన్ని తగ్గించుకోవడం మంచిది.

9. మతాధిపతుల ఆంక్షలు

““ బెర్తుకంట్రోలువాడితే నరకానికి పోతావు ” అని మా మతాధిపతి చెప్తున్నారు, మేము ఏమిచెయ్యగలం ?” అని కొందరు అడుగుతున్నారు.

మతాధిపతులెవ్వరూ ఇప్పటిపరిస్థితులను గమనించడంలేదు. వాళ్ళు చదివే పుస్తకాలన్నీ చాలా కాలంక్రితం రచించబడినవి. ఆ కాలంలో మానవజనాభా బహుతక్కువగా ఉండేది; ప్రకృతి అంతులేనిదీ, నాశనంలేనిదీగా కనపడేది. ఇప్పుడు ఈ విషయాలన్నీ తారుమారు అయినట్లు వాళ్ళు గ్రహించడంలేదు. అంతేకాక కొంతమంది మతాధిపతులకు తమ మతస్థులసంఖ్య చాలా ఎక్కువ అని బడాయికొట్టాలని ఉండవచ్చు, తమ మతస్థులు ఎక్కువైతే తమకు దానాలు ఎక్కువ వస్తాయనే పేరాస ఉండవచ్చు. ఇలాంటి బడాయిలూ, పేరాసలూ, మతసూక్తులకు విరుద్ధం ఐనా మానవమాతృలైన మతాధిపతులకు ఈ భావాలు ఉండవచ్చు.

ఈ ప్రశ్న వేసినవారికి నేను ఇలా చెప్తాను. “ మానవులను సృష్టించిన దేవుడే మిగతాజీవులనూ, ప్రకృతినీ సృష్టించాడు కదా. పెరిగిపోతున్న మానవజనాభా ఇతరజీవులను పూర్తిగా ధ్వంసంచేస్తోంటే ఆ దైవం నిస్సహాయంగా ఎందుకు ఊరుకుంటున్నాడో ఆలోచించండి ” అని. నిజానికి ఇప్పటి పరిస్థితుల్లో అందరూ మానవజనాభాని హద్దులోఉంచడానికి తోడ్పడితే ఆ దైవం చాలా సంతోషిస్తాడని నేనంటాను. ఈ విషయం చెప్తూ “ బెర్తుకంట్రోల్‌ నిషిద్ధం ” అనే వాళ్ళ మతసిద్ధాంతం చాలా తప్పు అని మతాధిపతులకు వక్కాణించి చెప్పమంటాను.

10 పొల్యూషన్‌ / కి సొల్యూషన్‌

మనం ఇప్పుడు వాడుతున్న టెక్నాలజీలు పలురకాల పొల్యూషన్లని భూమిమీదా; నీటివనరులూ, సముద్రజలాల్లోనూ; గాలిలోనూ విడుదల చేస్తున్నాయి.

కల్గుతున్న పొల్యూషన్‌ ని తేలిగ్గా తీసేసే టెక్నాలజీలు డెవలప్‌ చెయ్యడానికి ప్రభుత్వాలు చాలావ్యయం చేస్తున్నాయి. కానీ అలాంటి టెక్నాలజీ కనిపెట్టి ఉపయోగంలో పెట్టినా, దానివల్ల కొత్తరకం పొల్యూషన్‌ తయారవుతుంది. కనుక జరుగుతున్న పొల్యూషన్‌ తేసేసే కొత్త టెక్నాలజీలను డెవలప్‌ చెయ్యడంతో పొల్యూషన్‌ కంట్రోలు చెయ్యడం అసంభావం. దీనికే నేను “ మూర్తి కాలుష్య సిద్ధాంతం ”(Murty’s Law on Pollution) అని నామకరణం చేసాను.

ఎన్ని టెక్నాలజీలు డెవలప్‌ చేసినా, జనాభా పెరుగుతున్నకొద్దీ పొల్యూషన్‌ పెరుగుతూనే ఉంటుంది. పొల్యూషన్‌ ని కంట్రోల్‌ చెయ్యడానికి ఈ క్రిందివి చాలా అవసరం.

1. జనాభా హద్దులో ఉంచడం

2. తక్కువ పొల్యూషన్‌ కల్గించే జీవనవిధానాలను అవలంభించడం.

కనిపెట్టబోయే కొత్త టెక్నాలజీలు, జనాభా పెరుగుతున్నా పొల్యూషన్‌ ని కంట్రోల్‌ చేసి, మానవజాతికి అంతులేని ఎనర్జీని అందించి, ప్రకృతిని రక్షించేస్తాయనే ఆశ ఒక ఎండమావి.

11. మీరు ఎలా సహాయం చెయ్యగలరు?

చీకటిని తిడుతూ కూర్చోక
వీలైతే చిరుదీపం వెల్గించు

అని సామెత చెప్తుంది. కొత్తతరం వాళ్ళకి ముందంజ తీసుకొని టెక్నాలజీ వెళ్తున్న దారి మార్చడానికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. మార్పులు తీసుకురావడానికి వ్యక్తిగతంగా చెయ్యగల్గిన సహాయానికి కొన్ని ఉదాహరణలను ఇస్తాను ఇక్కడ.

11.1. జనాభా హద్దులో ఉంచడానికి జరిగే ప్రయత్నాలకు చేయూత

మన పూర్వీకులు తక్కువ సంతానం కల్గడం అంటే భయపడ్డారుగానీ, వాళ్ళకు అధికసంతానభీతి కల్గినట్లు లేదు. ఇప్పుడు ప్రపంచమంతటా జనాభా ఎక్కువయిపోయి ఎవ్వరికీ ఏమి చెయ్యాలో తెలియడంలేదు. అందువల్ల ఈ కాలం అధికజనాభాసమస్య తీర్చే దారి చూపించమని కోరే ఉద్దేశంతో, బృహదారణ్యకోపనిషత్తులో ఇంతకుముందు చెప్పిన శ్లోకానికి 4వ పాదం కల్పించి ఇలా పూర్తి చేసాను.

అసతో మా సద్గమయ
తమసో మా జ్యోతిర్గమయ
మృత్యో మామృతం గమయ
అధికసంతానో మా మిత సంతానః గమయ.

జనాభా తగ్గించడం చైనా, ఇండియాల్లాంటి దేశాల్లోనేకాదు; అమెరికా, యూరప్‌,కెనడాల్లోనూ, ప్రపంచమంతటా అత్యవసరం.

స్వయంగా సొంతకుటుంబంలో సంతాననియంత్రణం అవలంబించి ఇతరులకు దారి చూపించడం అందరూ చెయ్యగల గొప్ప సహాయం. నేనైతే మా ఇంట్లో 2వ బిడ్డ పుట్టినవెంటనే వాసెక్టమీ చేయించుకున్నాను.

2000 సంవత్సరంలో జరిగిన ఒకవిషయం ఇక్కడ చెప్తాను. ఆ సంవత్సరంలో బ్రిటీషుప్రధానమంత్రి కుటుంబంలో 4వ బిడ్డ పుట్టినట్లు ప్రముఖవార్త ప్రపంచమంతటా విన్పించింది. ఈ దంపతులను వేలెత్తిచూపించి వ్యక్తిగతంగా విమర్శించడం నా ఉద్దేశం కాదు, కానీ ఈ వార్తను ఒక పాయింటు చెప్పడానికి వాడుతున్నందుకు వాళ్ళనుంచి క్షమాపణ కోరుకుంటున్నాను. “ యధా రాజా తధా ప్రజా ” అంటారుగదా, ఇది ప్రజలకు మంచితోవను చూపిస్తుందని నాకు అనిపించడంలేదు.

11.2. వుడ్‌ ప్రోడక్టులు వాడకం తగ్గించడం

మీ బాత్‌ రూములో “ బిడే విత్‌ వర్టికల్‌ స్ప్రే ” లేక ఇలాంటివే మిగతా పనిముట్లు పెట్టించుకుంటే, మీ ఇంట్లో టాయిలెట్‌ టిస్యూ వాడే అవసరమే ఉండదు. దీనివల్ల సూయేజి తగ్గుతుంది, కొన్ని చెట్లను రక్షించిన పుణ్యం లభిస్తుంది.

వీలైనంతవరకూ న్యూస్‌ పేపర్లూ, మేగజీన్లూ కొనడం తగ్గించవచ్చు. ఈ మధ్య వీటిని ఇంటర్‌ నెట్‌ మీద చదవడం తేలికయ్యింది. లేక, మీ ఆఫీసులో న్యూస్‌ పేపరు వస్తూంటే, దాన్ని రాత్రి కానీ, మరుసటిరోజు కానీ మీరు ఇంటికి తెచ్చుకొని చదువుకోవచ్చు. ఇవేవీ కుదరక మీరు వీటిని కొంటే, కనీసం ఆ కాపీలను కొంతమంది స్నేహితులతో షేరు చేసుకోవచ్చు.

పేపరుప్లేట్లూ, స్టైరోఫోమ్‌ ప్లేట్లూ, పేపరునేప్కిన్లూ, గిఫ్టురాపులూ వగైరావాటి వాడకం తేలిగ్గా తగ్గించవచ్చు.

మీరు కొత్తగా ఇల్లు కట్టించుకుంటే బిడే విత్‌ వర్టికల్‌ స్ప్రే ప్రతి బాత్‌ రూముల్లోనూ పెట్టించవచ్చు. వుడ్‌ సైడింగు బదులు వినైల్‌ సైడింగు, వుడ్‌ కిటికీలబదులు ఎక్రిలిక్‌ లేక వినైల్‌ కిటికీలు, వుడ్‌ ఫ్లోరింగు బదులు సిరమిక్‌ టైలుఫ్లోరింగు, వుడ్‌ డెక్‌ బదులు వినైలుడెక్‌ పెట్టించుకోవచ్చు.

11.3. పిల్లలకు ప్రకృతి సౌందర్యాభిమానం నేర్పించడం

చక్కటి వృక్షాలనుచూసి తన్మయత్వంచెందే పిల్లలను చూడడం చాలాఅరుదు ఈ రోజుల్లో. పిల్లలసంగతెందుకు, అలాంటి పెద్దవాళ్ళు కూడా ఎక్కువమంది కనపడరు. ఇప్పటి ఎడ్యుకేషన్‌ ప్రకృతిసౌందర్యాన్ని అనుభవించడం నేర్పించకపోవడమే దీనికి కారణం.

మీ దొడ్డిలో ఉత్తి లాన్‌ పెంచి తృప్తిచెందమాకండి. మీ పిల్లల సహయంతో వీలైనన్ని చెట్లునాటి పెంచండి. మీ పిల్లలకు ప్రకృతి సౌందర్యాన్ని అభిమానించడం నేర్పించండి.

11.4. మంచివి కాని టెక్నాలజీలను తిరస్కరించడం

మద్యపానీయాలూ, కాఫీ, టీ, సాఫ్టుడ్రింకులు, చాకొలెట్‌, వగైరావి శరీరపోషణకవసరంకాని ఆహారవస్తువులు. వీటి తయారీకని ద్రాక్ష, కాఫీ, టీ, చాకొలెట్‌ తోటలు పెంచడానికి ఎంతోభూమిని మనం ప్రకృతినుంచి ఆక్రమించుకున్నాం. ఈ వస్తువుల వాడకం పెరిగేకొద్దీ ఇంకా ఎక్కువ భూమి మానవాక్రమణక్రిందకు వస్తుంది. ఇలాంటి పదార్ధాల వాడకం తగ్గించుకోవడం ప్రకృతిరక్షణకు సహాయం అవుతుంది.

గొప్ప పేరున్న సైంటిస్టులు చెప్పేవన్నీ మంచివిషయాలే అని గుడ్డిగా నమ్మకండి. ఒక ఉదాహరణ ఇస్తాను. ఈ మధ్య ఎడ్వర్డు టెల్లర్‌ అనే ఒక ఘరానా అమెరికన్‌ సైంటిస్టు గ్లోబల్‌ వార్మింగు రద్దు చెయ్యడానికి ఒక ప్రస్తావన చేసాడని వార్తల్లో విన్నాను. ఈ మహానుభావుడిప్రోద్బలం మూలానే అమెరికా ప్రభుత్వం 1950 దశాబ్దంలో హైడ్రొజన్‌ బాంబు నిర్మించారని వినికిడి. ఈయనకు అమెరికాప్రభుత్వపరిధిలో పలుకుబడి మెండు.

వాతావరణంలో దుమ్ము సూర్యరశ్మిలో కొంతభాగాన్ని స్పేస్‌ లోకి రిఫ్లెక్టు చేసేస్తుంది. దీనివల్ల సూర్యరశ్మినుంచి భూమి ఎబ్సార్బ్‌ చేసే ఎనర్జీ తగ్గుతుంది.

ఆయన ప్రపోజల్‌ ఏమిటంటే “ డస్టుబాంబులు ” తయారుచేసి, వాటిని స్రాటొస్ఫియర్‌ లో ప్రేల్చడం. దీనివల్ల స్రాటొస్ఫియర్‌ లో డస్టుపొర ఏర్పడి, అది సూర్యరశ్మిలో కొంతభాగాన్ని అక్కడనుంచే స్పేస్‌ లోకి రిఫ్లెక్టు చేసి గ్లోబల్‌ వార్మింగును రద్దుచేస్తుందని ఆయన చెప్పారట. స్రాటొస్ఫియర్‌ లో అలా ఏర్పరచిన డస్టుపొర చాలా సంవత్సరాలు అక్కడే తేలుతూ ఉంటుంది. దీనితో, మనం ఫాసిల్‌ ఫ్యూయల్స్‌ వాడకం తగ్గించనవసరంలేకుండా గ్లోబల్‌ వార్మింగును రద్దు చేసెయ్యచ్చని ఆయన అన్నారట.

వినడానికి ఈ పధకం బాగానేఉంది. కానీ ఏర్పరచిన డస్టుపొర మరీ ఎక్కువ సూర్యరశ్మిని స్పేసులోకి రిఫ్లెక్టుచేస్తే భూమి చాలా చల్లబడడానికి అవకాశం ఉంది. అది జరిగితే మనం ఏమీ చెయ్యలేము, ఎందుకంటే ఏర్పడిన డస్టుపొరను తీసెయ్యడం చాలా కష్టమైన పని. అపాయాన్ని కల్గించగల ఇలాంటి టెక్నాలజీలకు సపోర్టు ఇవ్వకుండా వ్యతిరేకించడం మన బాధ్యత.

ఇలానే మీ కల్పనాశక్తివాడి ప్రకృతిరక్షణకు వీలైనంతసహాయం చెయ్యండి.

12. రిఫరెన్సులు

[1] Report “North Pole is Watery, Warmer”, Detroit Free Press, 22 August 2000.

[2] Report “A Growing Coral Crisis — Overfishing and Global Warming Are Killing Reefs Around the World. Is it Too Late to save Them?”, Newsweek, 30 October 2000.

[3] K. G. Murty, “Green House Gas Pollution in the stratosphere Due to Increasing Airplane Traffic, Effects on the Environment”, Dept. of IOE, University of Michigan, Ann Arbor, Nov. 2000. Can be seen on the webpage — http –//www-personal.engin.umich.edu/~murty/ under the section“Articles on societal problems”.
ి