“టు మ్యారీ ఎ విడో ఆర్ నాట్ టు మ్యారీ?!
దటీజ్ ది క్వశ్చన్! షేక్స్‌పియర్ పడ్డ అవస్థలో పడ్డాం!”
ఇది గురజాడ వారి “కన్యాశుల్కం” నాటకంలో గిరీశం అంతర్వేదన. డెబిట్ క్రెడిట్ల బ్యాలెన్స్ షీట్ వేసుకుంటాడు. పాపం!
అసలు, షేక్స్‌పియర్ కన్న ముందే ఎంతో మంది ఈ సంశయావస్థకు లోనై ఉంటారని నా ఉద్దేశం. కావ్య రచనారంభంలో కవి పడే అంతరంగ మథనాన్ని “కృత్యాద్యవస్థ” అంటారు.
విద్వాంసుడు పడే కష్టాన్ని విద్వాంసుడే తెలుసుకోగలడట! అయితే “బోద్ధారో మత్సర గ్రస్తాః”!
అసూయాళువులైన కవులు ఒక్కొకచో సంశయావస్థలో పడి పోతుంటారు.
రాస్తారు …! కొట్టేస్తారు …! … ఎవరో రాసిందైనా కొట్టేస్తారు!!
అదలా ఉంచితే ఏదైనా ఒక అంశంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవడం ఎంత కష్టమో!
మన సాహిత్యవ్యవస్థలో సంశయావస్థ అడుగడుగునా పదేపదే కనిపిస్తూనే ఉంటుంది!
తెలుగుభాషలో ఆదికవి నన్నయ భారతాన్ని తొలిగ్రంధంగా తెలిగిస్తూనే ఓం ప్రధమంగా “భారతభారతీ సముద్రము దరియంగ నీదను విధాతృన కైనను నేరబోలునే!” అని సందేహించారు.
కవిబ్రహ్మ తిక్కనగారు తన కృతిపతిగా హరియో హరుడో తేల్చుకోలేక ఇద్దర్నీ కలిపి హరిహరనాధుడని ఓ దండం పెట్టేశారు. ఈ అనిశ్చిత పరిస్థితి ఆయన కావ్యనేత ఐన ధర్మరాజులోనూ ఉంది. శ్రీకృష్ణుణ్ణి రాయబారానికి పంపుతూ “శస్త్ర జీవికయ తగియున్న దయినను వంశనాశ మనభిమతము!” అన్నారు ఆ “మెత్తనిపులి”.
శ్రీనాథ మహాకవి సంగతి చెప్పనే అక్కర్లేదు. “భీమఖండం”లో వ్యాసుడు శిష్యసమేతంగా ఏడు రోజులు తిండిలేక మలమల మాడిపోయి కాశిని శపించబోతాడు. శ్రీవిశాలాక్షి భోజనానికి ఆహ్వానించింది. అప్పుడు వ్యాసుడు “ఏనొక్కడినే రానో? ఎల్లన్ శిష్యుల గొంచు వత్తునొ?” అన్న మీమాంసలో పడి గ్రామర్ని కూడ మర్చిపోయి (ఎల్లన్ శిష్యుల) తప్పులోనో పప్పులోనో కాలేశాడు. ఆకలే అన్నింటికీ అమ్మ కదా!
నాకు తెలిసినంత వరకు పోతన్న గారి కున్న డైలెమ్మా మరెవ్వరికీ లేదండీ! గజేంద్రుడు మకరి బారి నుండి రక్షించుమని విష్ణువుకి మొరపెట్టుకుంటూనే “కలడు కలండనెడి వాడు కలడో లేడో” అని సంశయించాడు.
యశోదాదేవి మన్ను తిన్న కన్నయ్య నోట బ్రహ్మాండాలన్నీ చూసి “కలయో? వైష్ణవ మాయయో? ఇతర సంకల్పార్థమో?..” అని .. “యశోదాదేవి గానో?..” అనుకునే దాకా వచ్చి ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయింది.
రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వద్దకు అగ్నిద్యోతనుణ్ణి పంపి తిరిగి అతని రాకకై ప్రతీక్షిస్తూ “ఘనుడా భూసురుడేగెనో? నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో? విని కృష్ణుండది తప్పుగా తలచెనో? విచ్చేయునో? ఈశ్వరుండనుకూలింప దలంచునో? తలపడో? ఆర్యామహాదేవియున్ నను రక్షింప నెరుంగునో? ఎరుగదో? నా భాగ్యమెట్లున్నదో?” అని ఆశంకించింది.
పెద్దన కవీంద్రుని మనుచరిత్రలో ప్రవరాఖ్యుడు తన వూరికి దారి అడుగుతూ వరూధినీ కాంతని “భీతహరిణేక్షణ!” అనేసేసి అలా పిలవకూడదని అనిపించిందో ఏమో వెంటనే నాలుక కరుచుకుని “తల్లీ! తెరువెద్ది? శుభంబు నీకగున్!” అనలేదూ?
ముద్దుపల్కుల తిమ్మనగారి సత్యభామకి కోపం “ముక్కు” మీదే గదా! పారిజాతాన్ని శ్రీకృష్ణుడు రుక్మిణికివ్వగానే పలుముళ్ళమాటల యతియైన నారదుడు “సత్య గరువంబింక చెల్లద”ని ఓ తీర్మానం చేసేశాడు. ఇదంతా చూసిన చెలికత్తె ఒకతె సత్యభామకి “మోత కార్యక్రమం” పెట్టింది. అప్పుడు కోపపరాకాష్టలో సత్య భామ “ఏమేమీ! కలహాశనుండచటికై యేతెంచి యిట్లాడెనా? ఆ మాటల్చెవి యొగ్గి తా వినియెనా గోపికావల్లభుండే మే మాడెను రుక్మిణీసతియు ..” అంటుంది. సవతి రుక్మిణీదేవి తన గురించి ఇంకా ఏవేవో అనే వుంటుందన్నది సత్య డౌటు!
ఇంక ఆధునికానికొస్తే భావ పికస్వామి శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి “ఈ అడవి దాగిపోనా? ఎచటైన ఆగిపోనా?” అని విచికిత్సకి లోనై మన బోటివాడెవ్వడో కిసుక్కుమనేసరికి చిర్రెత్తిపోయి “నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు? నా యిచ్చయే గాక నాకేటి వెరపు?” అని కోప్పడ్డారు.
కవిసమ్రాట్ విశ్వనాథ “రామాయణ కల్పవృక్షం” రాస్తూ “మళ్ళీ రామాయణమా?” అని మనం విస్తుబోతామని ఆయనే సంశయించి “తిన్నన్నమే తినడం లేదా?” అని డబాయించారు.
మార్క్సిస్ట్‌మార్క్ కవి శ్రీశ్రీగారు పోతన స్టైల్లోనే “ఇంతకీ ఒక సకలేంద్రియాతీతశక్తి ఉన్నట్టా ? లేనట్టా?” అని అనుమానించారు “ఖడ్గసృష్టి”లో.
మహాప్రస్థానం లో కూడా “సంధ్యా సమస్యలు” అన్న కవితలో “అటు చూస్తే బాదం హల్వా ఇటు చూస్తే సేమ్యా ఇడ్లీ; ఎంచుకొనే సమస్య కలిగిందొక ఉద్యోగికి..” అని సందేహాస్పద చిత్తవృత్తికి అద్దం పట్టారు.
గురజాడ వారన్న “షేక్స్‌పియర్ పడ్డ అవస్థ” ఇక్కడ స్పష్టంగా లేదూ!
ఆరుద్ర గారు “త్వమేవాహం” రాసి, “జీర్ణమంగే సుభాషితం” అని కినిసి “ఇంటింటి పజ్యాలు”, “కూనలమ్మ పదాలు” మున్నగు సరదా కవితల పరదాల వెనక దాక్కున్నారు. అవి మాత్రం ఎందరి కర్థమయ్యాయో?! .. ఆరోరుద్రుడికే అది ఎరుక!
వాగ్గేయకారులకి వల్లభుడు శ్రీ త్యాగరాజు స్వామి సైతం “నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా?” అని మిలియన్ డాలర్ క్వశ్చన్ విసిరారు.
కొన్ని దశాబ్దాల క్రితం బడాబడా విద్వాంసులు భారతి సాహిత్య మాసపత్రికలో ఒక అక్షరం గురువో లఘువో తేల్చుకుందుకు నెలల తరబడి కేశాకేశీ బాహాబాహీ హోరాహోరీ ముష్టాముష్టీ పోరాడుకోలేదూ! ఇంతకీ అది తేలిందా?!
వ్యాకరణ రంగంలో విభాష, వికల్పం, బహుళం, అనేవి ఈ శంకాజాతికి చెందినవే!
కావ్యానికి పరమప్రయోజనం ఏమిటీ? ఆనందమా? నీత్యుపదేశమా? అని అటు అరిస్టాటిల్, ఇటు భరతమహర్షి వంటి మహామహులే నిశ్చయించగలిగారా?!
షేక్స్‌పియర్ “హేమ్లెట్” “టు బి, ఆర్ నాట్ టు బి!” అంటాడు. అయినా ఈ సంశయావస్థకి ఆదిపురుషుడతగాడే అంటే నేనొప్పేది లెదు. ఈ సందేహాలున్న దేహాలు అంతకుముందే లోకంలో ఉన్నాయన్నది యథార్ధాల కెల్ల యథార్ధం! దీని విషయంలో ఎంతో ఆలోచించాలి ఆలోకించాలి పరికించాలి పరిశీలించాలి. అపుడైనా విషయం తేల్తుందో మునుగుతుందో!
అన్నింటినీ ఖచ్చితంగా నిర్ణయించే తర్కశాస్త్రం లోనూ “విత్తు ముందా? చెట్టు ముందా?” అని శాకాహారులూ “కోడి ముందా? గుడ్డు ముందా?” అని మాంసాహారులూ క్వశ్చన్ మార్క్ ముఖాల్తో బొమముడి వేశారు తెలుసా?
సంస్కృత న్యాయాల్లో “సన్యాసి యోషా న్యాయం” కూడా ఇట్టిదే!
ఓ సాములారి వేదాంతోపన్యాసం విని, వైరాగ్యం కొని తెచ్చుకున్న ఆసామికి బయటికి రాగానే అందమైన యువతి కనిపించింది అంతే! ఆ అతిలోకసుందరిని చూసిన మన జగదేకవీరుడి మనస్సు సన్యాసానికి టాటా చెప్పేసింది! ఈ సంశయావస్థకి వివరణలెందుకు?
ఏ భాషోద్యమాలలో నైనా గ్రాంధిక, వ్యావహారిక విభాగంలో దేనిని గ్రహించాలి? దేనిని త్యజించాలి? పెద్ద సమస్య. పురాణాల్లోని “త్రిశంకుస్వర్గం” ఈ అయోమయస్థితికి రాచబాట! మన సామెతల్లో “ఏ పుట్టలో ఏ పాముందో?!” అన్న దాన్లో సంశయావస్థ చోటు చేసుకుంది.
ఆఖరికి సినిమా పాటల్లో కూడా ఈ స్థితి ఉంది “ఉన్నావా? .. అసలున్నావా?” … “దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం” బాపతు పాటల్లో మనం ఈ సంశయావస్థని గమనించగలం.
అస్తినాస్తి విచికిత్సాహేతుశాతోదరులైన మన కావ్య నాయికల నడుములింతకీ “ఉన్నట్టా మరి లేనట్టా?”
రాజకీయాల్లో మన ఇండియా అనుసరించిన “అలీన విధానం” అన్న వ్యవస్థ ఇదే అవస్థకి తిన్నగా సంబంధించినదే!
శ్రీనాథుడు క్రీడాభిరామం రాశాడా? లేదా?
రాయల వారికి పెద్దన ఘోస్ట్ రైటరా కాదా?
వేమన రాసిన పద్యాలు రెండు వేలా? ఐదు వేలా?..
ఇటువంటి “చలనంబు లేని శయనంబు” గల తెలుగు సాహిత్య సమస్య లెవ్వరూ ఎటూ నిర్ణయించగలిగేవేనా?
జీవితంలో ప్రతిరంగం లోనూ సంశయావస్థ గోచరిస్తూనే ఉంటుంది. వర్షం “కురవనా మాననా?” అన్న ఆలోచనలో ఉందని కవులెన్ని మార్లు వర్ణించలేదు!
కన్యాశుల్కం నాటకం లోనే చివర్లో గిరీశంతో బుచ్చమ్మ లేచిపోయిందనే విషయం తెలిసి అగ్నిహోత్రావధాన్లు పేరుకి తగ్గట్టుగా అయిపోయి అరుస్తాడు, ఏం చేయాలో పాలుబోక. చివరికి, “ఇంతకీ దారి యిటా? అటా?” అనడుగుతాడు.
ఈ తాటస్య్థ చిత్తవృత్తి ఈ సందేహాస్పద మనఃప్రవృత్తి ఇట్లా ఉండడానికి కారణం ఏమిటీ? అని ఆలోచిస్తే గొపీచంద్ రాసిన “అసమర్ధుని జీవితయాత్ర” నవలలో ఒక సమాధానం దొరుకుతుంది. రామయ్య తాత జీవితసత్యాన్ని కాచివడబోసి సీతారామారావుకి వినిపిస్తాడు సుదీర్ఘంగా నవల చివర్లో. అంతా విని ఎటూ నిర్ణయించుకోలేక సీతారామారావు, ఒక్కసారి “మిథ్య! మిథ్య గనుకనే ఎటు త్రిప్పి చెప్పటానికైనా వీలుంది!” అని గట్టిగా అరిచి చెబుతాడు.
జీవితంలోనూ, సాహిత్యం లోనూ ఈ సంశయావస్థకి హేతువులు వివేకాతిశయమైన చిత్త చాంచల్యమో? వినయగుణాధిక్యమో? అని అటునిటు గాకుండ చెప్పాల్సిందే! ఇంత రాశాక ఇది వ్యాసమేనా? కాదా? అన్న సంశయం కలిగింది. అందుకే, ఈ అవస్థ కింతటితో ఫుల్‌స్టాప్ పెడుతున్నాను. Bertrand Russell అనే మహానుభావుని మాటలిక్కడ స్వర్తవ్యాలు! ” The most unfortunate thing is that the stupid are cock-sure, while the intelligent are full of doubt!”