గ్రామ్యాదేశ నిరసన సభ – కందుకూరి వీరేశలింగం పంతులుగారి ప్రసంగము

[ఈ ప్రసంగము ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రిక సంపుటి -1 సంచిక- 2 నుండితీసుకున్నాము (పే.151-58). ఆ సంచికలోని ఈ పేజీలను యథాథతంగా ఇక్కడ (pdf 807 KB)చూడవచ్చు. – సం. ]

మొట్టమొదట ఆంధ్రభాష నాగరిక భాష, గ్రామ్య భాష యని రెండు విధములు. పట్టణ వాసులు మాట్లాడు భాష నాగరిక భాష. జానపదులు మాట్లాడెడి భాష గ్రామ్య భాష. నాగరిక భాషయే గ్రాంథిక భాషగా మారినది. ఇప్పుడు గ్రాంథిక భాష మారవలెనన్న హుణ విద్యాభ్యాస మొనర్చిన నవనాగరికుల భాష యాదర్శముగా నుండవలెనా? లేక పండితుల యొక్క భాష వాడవలెనా? మొదటిది హుణ భాషాపదభూయిష్ఠమై యుండును. రెండవది వ్యావహారిక భాషగా నుండును. కాఁబట్టి గ్రాంథిక భాష యీ రెంటికంటెను భిన్నముగా నుండవలెను. మనుష్యుల వలెనే వాడుకలోనున్న భాషలు కూడ సంస్కారమును బొదుచుందుట సహజము. సంస్కృతమునకు మొదటి పేరు గీర్వాణము. సంస్కృతమను పేరు సంస్కరించుట వలననే వచ్చినది. సం= అనగా చక్కఁగా; కృత= సంస్కరింపఁబడినదని యర్థము. గీర్వాణ భాషను సంస్కరించిన తరువాత వాడుకలో నున్న భాషకు ప్రాకృతమని పేరు. ప్రాకృతము పాత్రానుసారముగ నాటకరచనయందును ప్రహసనములందును వాడియున్నారు. అట్లే యాంధ్రము నందు కూడ పాత్రోచితముగ నాటకములందును రసోత్పత్తి కొఱకు నవలల యందును ప్రహసనములలోను గ్రామ్య భాష స్వేచ్ఛగా నుపయోగింపఁవచ్చును.

కందుకూరి వీరేశలింగం పంతులు
కందుకూరి వీరేశలింగం పంతులు
(వాడపల్లి శేషతల్పశాయి గారికి కృతజ్ఞతలతో)

ఆంధ్ర వ్యాకరణము ముఖ్యముగా పద్య కావ్యములకు వ్రాయబడినది. రమారమి నలువది సంవత్సరముల క్రిందట తెలుఁగులో గద్య కావ్యములే లేకుండెను. అప్పుడు చిన్నయ్య సూరి తన వ్యాకరణమును రచించి యందును లక్ష్యముగా నీతిచంద్రికను వచనముగా వ్రాసెను. దీని శైలి మిక్కిలి కాఠిన్యము. మొట్టమొదట నేనును చిన్నయసూరిగారి త్రోవనే తొక్కి కొన్ని గద్య కావ్యములు రచించితిని. కాని యీ గ్రంథములను జదివి బోధపరుచుకొనుటకుఁ గావలసిన శ్రమమునకు దగినంత ఫలము లేదని తోచి గద్య కావ్యములను సులభ శైలిని వ్రాయనారంభించితిని. మొట్టమొదట నన్ను పండితులు పరిహసించినను రాను రాను నా శైలినే యాదర్శముగ నుండ నోపునని కొందఱు చెప్పియున్నారు. గద్య కావ్యములు వ్రాయునప్పుడు వ్యాకరణములో కొన్ని మార్పులవసరమగును. ఎల్లప్పుడు సంధినిత్యమనినచో వచనరచనయందు కష్టమగును. వ్యంగ్యార్థము స్ఫురించు చోట్లను, క్లిష్టార్థములు స్ఫురించు చోట్లను, అర్థసౌకర్యము కొఱకును, పదములను విసంధిగనే వ్రాయవచ్చును. గద్య రచనయందిదివఱకే యిది యంగీకరింపఁబడినది.

మన పూర్వ కవుల చూపిన త్రోవనే మనము క్రొత్త పదములను స్వీకరింప వచ్చును. క్రొత్త వృత్తులు పెరుగుకొలఁది క్రొత్త మాటలు కల్పించుట సహజము. ఇది యిదివఱకు మన భాషలో జరిగిన యంశమే. ఏమార్పులు చేసినను నియమములకు లోబడి యుండవలెను గాని విచ్చల విడిగా నుండరాదు. ఇట్టి మార్పులు భాషాభివృద్ధికి దోడ్పడవు.

గ్రామ్య భాషలో గ్రంథములు వ్రాయుటవలన వాఙ్మయాభివృద్ధి కానే కాదు గదా, యొక మండలము వారి పుస్తకములు మఱియొక మండలము వారికి అరబ్బీ భాషగా నుండును. విశాఖ పట్టణము వారు “పుల్లలావు” అన రాజమహేంద్రవరము వారు “పొయిపట్టలేదా” యని యడుగుదురు. చెన్నపట్టణము వారు “పూడ్చాడు” అనఁగా ఉత్తరాది వారు “గోతిలోనా” యని ప్రశ్నించెదరు. ఇంతియ కాక “వాడొచ్చాడు” అని వ్రాసిన యెడల “వచ్చు” ధాతువా? “ఒచ్చు” ధాతువా యని సందేహము గలుగును. కొన్ని మండలములలో “ఆడొచ్చాడు” అందురు ‘వాడా’, ‘ ఆడా’ యని సంశయము పుట్టును. భాషయొక్క పరిశుభ్రత పోవును. శబ్దములు చెడిపోవును. కాఁబట్టి గ్రామ్యభాషలో వ్రాసిన గ్రంథములను పాఠశాలలో నుపయోగింపఁ గూడదు. గ్రంథములను గ్రాంథిక భాషలోనే వ్రాయవలెను.