లోకంలో అనుభవానికీ, అనుభవజ్ఞులకు ఉన్న విలువ వేరే చెప్పవలసిన పనిలేదు. అయితే,”అనుభవాన్ని” నిర్ణయించడానికి ప్రాతిపదిక ఏది? కొలవడానికి “కొలబద్ద” ఏమిటి? సాధారణంగా ఒక వ్యక్తి, ఒకపనిని చాలాకాలంగా చేస్తుంటే, ఆతడు ్ ఆమె అనుభవం గలవారని చెప్పబడుతున్నది. కాబట్టి, అనుభవానికి ప్రమాణం “ఒక విషయానికి చెందిన దీర్ఘకాల నిర్వహణ లేక సంబంధం” అనుకుంటే సరిపోతుందా? “తెడ్డెంత పప్పుకలిపిన, రుచి తెలియగ నేర్చునటయ్య” అన్నది లోకోక్తి. వంటగదిలోని గరిటెకు, పప్పు కలిపే కాలప్రమాణపు అనుభవం చాలానే ఉంటుంది. కానీ, పప్పురుచి తెలుసుకునే శక్తి దానికి ఏనాటికీ లేదు, రాదు. “అబ్బే! గరిటె; ఒక అజీవపదార్ధం. దానికి స్పందన లేదు. మానవులు ఇంద్రియాల (senses) ద్వారా స్పందించి, మనసులో అనుభూతిపొంది, తదనుగుణంగా ప్రవర్తించే జీవులు. కాబట్టి, “పప్పుగరిటె” ఉదాహరణ, ఈ విషయంలో చెప్పకూడదు” అని అంటే; ఇంకొకటి పరిశీలిద్దాం. “ఒక ఉద్యోగానికి, పదవ తరగతిని, విద్యార్హతగా ప్రకటిస్తే, ఒక సంవత్సరంలో వీలైనంతగా ఉత్తమశ్రేణిలో, ఉత్తీర్ణుడైనవాడిని ఎంపిక చేయాలేగానీ; పఠనానుభవం ఎక్కువనిచెప్పి, పదవ తరగతి పది సంవత్సరాలపాటు
చదివిన వాడిని ఎంపిక చేయడం విడ్డూరమే ఔతుందిగదా! కాబట్టి, అనుభవమంటే కేవలం, దీర్ఘకాల ప్రమాణమేగాక, మరింకేదో దానితో ఉండిఉండాలనే విషయం బోధపడుతోందిగదా! ఆ “యింకేదో” ఏమిటి?
సరదాగా, కాలక్షేపానికని పిలిస్తే, ఒక తెలుగు మిత్రుడి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి, ఆయన మహోత్సాహంగా దూరదర్శినిలో ఒక ఆట ప్రత్యక్షప్రసారం చూస్తున్నాడు. అది ఐరోపా తదితర ఖండాలలో “ఫుట్బాల్ గానూ, ఉత్తర అమెరికాలో “సాకర్”గా పిలవబడే ఆట. జరుగుతున్నది 1998లో ఫ్రాన్సు దేశంలో; అర్జెంటీనా, ఇంగ్లాండు జట్ల మధ్య ప్రపంచ కప్పు పోటీ. నాకు తెలిసి ఆయనకు ఆటలపట్ల ఆసక్తి, అభిరుచి ఏవీ లేవు. పోనీ, ఈ మధ్యనే అలవరచుకుంటున్నాడేమో అనుకున్నా! నాకు ఆటలపట్ల కొద్ది ఆసక్తి ఉన్నందువల్ల, ఆయన అత్యుత్సాహానికి నేను పెద్దగా ఇబ్బంది పడలేదుగానీ,ఆయన ధోరణి మాత్రం కొంత వింతగా అనిపించిన మాట వాస్తవం. ఆటని చూస్తున్న ఆయనని చూస్తే, ఒక విషయం ఎవరికైనా సరే, సులభంగా బోధపడుతుంది. ఆయనకు ఆ ఆటలోని ప్రాధమిక సూత్రాలు గాని, ఆ ఆటలో ఏ, ఏ దేశాలు పేరుమోసినవి వగైరా విషయాలేవీ తెలియకపోయినా, ఆయన అర్జెన్టీనా జట్టు గెలవాలని తీవ్రంగా కోరుకుంటున్నట్టు నిస్సంశయంగా గ్రహింపవచ్చు. ఆట ముగిసింది. అర్జెన్టీనా గెలిచింది. ఆయన మహా సంతోషించాడు. ఆయన సంతోషానికి నేనూ ఆనందించి, నవ్వుతూ “మీకు అర్జెన్టీనా జట్టుపై అభిమానంలావుంది”, అన్నాను. ఆయన నిరాసక్తిగా ముఖం చిట్లించి, “అబ్బే! అదేమీ లేదు. అర్జెన్టీనా గెలవడం కాదు, నాకు ముఖ్యం. ఇంగ్లాండు జట్టు ఓడిపోవడం రెండువందల సంవత్సరాలు మనలని క్షోభపెట్టి పాలించిన వీళ్ళు, ఎక్కడా, దేనిలోనూ గెలవకూడదు. గట్టిగా మాట్లాడితే, భారతీయుడన్న ప్రతివాడు, ఇదే కోరుకోవాలి కూడా!”
అన్నాడు. ఆ చెప్పిన తీరు చూస్తే, ఆయనకున్న ఆ అభిప్రాయం యధాలాపమో, క్షణికమైనదోకాక, దాని అంతర్గత ప్రాతిపదిక తీవ్రమైనదేనని; యెవరికైనా అనిపిస్తుంది.
చేతిగీతలను చూసి, ఒక మానవుడిని గురించి అంతా చెప్పవచ్చునని; హస్తసాముద్రికుల, వారిని విశ్వసించే వారల నమ్మకమైతే కావచ్చు. కాని, ఒక విషయానికి సంబంధించి, ఒక వ్యక్తి “దృష్టిని” ఏర్పరచే గీతలనుబట్టి, అతని ప్రవృత్తి ఎటువంటిదో చెప్పవచ్చునని నా అభిప్రాయం. ఈ గీతలు రేఖాగణితానికి (geometry) చేందినవి. అందులో ప్రస్తుత విషయానికి సంబంధించిన ఆ అంశమే “కోణము”.
“కోణము అనగా ఒక మూల. రెండు సరళ రేఖలు (straight lines సూటి గీతలు) కలసినపుడు లేక ఖండించుకొన్నపుడు గాని, కోణము ఏర్పడును. ఒక కోణమునేర్పరచు రేఖలను పొడిగించుటవలన ఆ కోణము విలువ మారదు”.
మొదటిసారిగా ఆరవ తరగతిలో ఈ విషయం నేర్చుకున్న రోజుల్లో, కోణం విలువ దాని మూలంలోనే నిర్ధారణ ఔతోంది కాబట్టి, ఆ ఆఖరి వాక్యం అనవసరమని, అది అందరికీ తేలికగా తెలుస్తున్న విషయమేనని భావిస్తుండేవాడిని. గణితం సంగతి ఏమోగానీ, మానవ ప్రవృత్తి ఆధారంగా ఒక విషయంలో ఏర్పడే “దృక్కోణానికి” (angle of vision) ఆ ఆఖరివాక్యం అన్వయిస్తే మాత్రం, దాని విలువ, అవసరం ఎంతో ఉండడమేకాక, దాని విషయం శ్రద్ధగా పరిశీలించవలసిన అగత్యం
కూడా ఉందని అనిపిస్తుంది.
భారతదేశభక్తి భారతీయులకు అవసరమే! గతచరిత్రలో 200ల ఏళ్ళకుపైగా బ్రిటీషు వాళ్ళు మనదేశం పాలించి కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కలిగించిన సంగతి విదితమే! ఐతే భారతదేశభక్తిని ఏర్పరచే దృష్టిని అదేధోరణిలో వెనక్కు పొడిగించి, ఇప్పటి బ్రిటీషు ఫుట్బాల్ జట్టు మీదో, క్రికెట్టు జట్టు మీదో కక్షగా మార్చుకోవడం, ఆ ఆటగాళ్ళని తిట్టడం ఎంతవరకు అవసరమో, సమంజసమో నాకు అర్ధం కాలేదు. ఐతే, “ఇందులో పెద్ద వింత ఏముంది? ఒక ఎ.ఎన్.ఆర్. మీద అభిమానం, మరో ఎన్.టి.ఆర్. పై ద్వేషం గాను; ఒక బి.జె.పి. పై మక్కువ, మరో కాంగ్రెసుపై మంటగాను; లేక అటుది ఇటుగాను మారటల్లేదా? ఇది చాలామందికి సహజమే! నిజానికి మనకు సూటిగా సంబంధంలేకపోతే, ఇవి చూడడానికి, వినడానికి బలే తమాషాగా ఉంటాయి”, అనేటట్లైతే, సహజమైన ప్రతిదీ సమంజసమూ, సబబూ ఔతుందా? అన్న ప్రశ్న బయలుదేరుతుంది. దీనికి సమాధానమేమిటి? నిజమే! సబబు కాదు. కానీ, లోకంలో ఎక్కువమంది విషయంలో సహజంగా జరిగేదిమాత్రం ఇదే!” ఐతే, అలానే ఎందుకు జరుగుతోంది?
నిశితంగా చూస్తే, మానవ ప్రవృత్తికి సంబంధించిన ప్రతి చిన్న విషయంనుంచీ, చాలా పెద్ద విషయాలవరకు; ఈ దృక్కోణ సూత్రం తెలిసో, తెలియకో, తెలిసీ తెలియకో అన్వయింపబడుతూనే ఉంటుంది. గత చరిత్ర చూస్తే, ప్రపంచ విజేత కాదలచిన ఒక అలెగ్జాండర్ ఆ దృష్టినే పొడిగించి, యుద్ధాలు చేసి, చేసి; చివరకు విసుగెత్తి, జీవితమంటే కేవలం దృక్కోణ రేఖలను పొడిగించటం కాదు అని తెలుసుకొని, నిజంగా ఏదో సాధించేలోగానే పాపం! కన్నుమూశాడు. అంత పేరుమోసిన అలెగ్జాండరు శూన్యహస్తాలతోనే మరణించాడని, లోకానికి సందేశమిచ్చే విధంగా, తనచేతులను బయటికేఉంచి, తన మృతకళేబరాన్ని ఖననం చేయమని కోరాడట! ఐతే, రాజ్యకాంక్షతో చెలరేగిన మరో అశోకుడు కూడా, రాజ్యాలకై యుద్ధాలు చేసి, చేసి, దృక్కోణం అదే ధోరణిలో పొడిగించడమే మానవజీవిత పరమార్ధం కానక్కరలేదని, నిజంగా కోణం విలువ పెంచేవిధంగా ప్రవర్తిస్తే కలిగే శాంతి, సుఖాలు ఎటువంటివో ప్రపంచానికి చూపి చిరస్మరణీయుడైనాడు. మహాభారత కథ బహుళ ప్రచారంలో ఉండి, ఆ కాలానికి గ్రంధరూపంగా వెలువడుతున్నప్పటికీ, “దృక్కోణం” విస్తరించడానికీ, పొడిగించడానికీ వ్యత్యాసం పాటించలేకపోవడంవల్ల, తెలుగునాట మరో కురుక్షేత్రమనదగ్గ “పల్నాటియుద్ధం” జరిగింది. ఇంకా చెప్పవలసివస్తే, ఒక మహాచక్రవర్తి అయిఉండి కూడా, వ్యక్తిగతస్థాయిలో అతినిరాడంబరంగా, విలాసాలకు దూరంగా బ్రతికిన ఒక ఔరన్గజీబు, కేవలం ఒక్క మతపరమైన విషయంలో అనుసరించిన విపరీత ధోరణి పొడిగింపుకీ, ఒక అక్బర్ పాదుషా అదే విషయంలో పాటించిన దృక్కోణ విస్తరణకీ ఉన్న భేదమేదో, ఫలితాల రూపంలో చరిత్ర మనకు చూపిస్తుంది.
నిజానికి, ఈ దృక్కోణపు సూత్రం అన్వయింపబడని విషయమంటూ లేదేమో! అమలుపరిచే వ్యక్తికున్న స్థాయి, సంస్కారాలనుబట్టి, తీసుకున్న విషయంబట్టి, అవసరంబట్టి; ఒక ధోరణిని పొడిగించడానికి, విస్తరింపజేయడానికిగల భేదం అనేకరకాలుగా మానవ సమాజంలో దర్శనమిస్తుంది.
వాదాల (-isms) విషయాలలో సైతం, ఈ సూత్రం క్రమక్రమేణా వివిధస్థాయిలలోకి మారుతున్నట్టు కనిపిస్తుంది. “తొండ ముదిరితే, ఊసరవెల్లి ఐనట్లే”; ఒక కాలంలో, ఒకప్రయోజనమాశించి ఒక దృక్కోణంతో ఏర్పడే ఒక వాదం, కొంతకాలానికి కోణం పెరగకుండా, అదే ధోరణిలో పొడిగింపబడితే; అతివాదంగాను, ఆపై తీవ్రవాదంగాను, ఆమీద ఉగ్రవాదంగాను, ఇంకా పొడిగిస్తే ఉన్మాదంగాను మారుతుంది.
ఐతే, నిజంగా సమాలోచనగలిగి, పరప్రయోజనమాశించే విషయాలలో, ఒకే దృక్కోణ ధోరణిని పొడిగిస్తే, దానిని “ఏకాగ్రత, శ్రద్ధ, నిష్ట, దీక్ష” అనే పేర్లతో వ్యవహరిస్తారు.
తత్వపరమైన ఆధ్యాత్మిక విషయాలలో సైతం, అనాలోచితమైన ఏకధోరణిని పాటిస్తే, దానిని అజ్ఞానమని, పొడిగించడం మోహమని, మాయలో పడటం అనే పేర్లతోనూ; విస్తరింపగల సందర్భాలలో జ్ఞానమని వ్యవహరిస్తారు.
అలాగే కేవలం సాంకేతిక ప్రతిభ ప్రధానంగా గల విషయాలలో దీని పొడిగింపు “ప్రత్యేకత” (specialization) అని పిలవబడితే, దాని విస్తరింపును “బహుముఖ ప్రజ్ఞ” అని అనబడుతోంది.
అలాగే, ఒకరికి ఇబ్బంది కలిగింపకపోయినా, ఒకేరీతిలో పొడిగింపబడుతూ, అర్ధరహితంగా కొనసాగే ధోరణులకు లోకంలో “వేలంవెర్రి” అని పేరు.
జీవితానుభవంతో మానవులు వీలైనన్ని విషయాలలో పెంచుకోవలసినది, పెరగవలసినది “దృక్కోణం”. ఆధునిక యుగంలో మానవులు గతకాలం వారికంటే చాలా శక్తిని, జ్ఞానాన్ని ఆర్జించే అవకాశాలున్నమాట వాస్తవమే! కానీ, ఆర్జించిన జ్ఞానానికి, వాటితో చేరుకునే స్థాయికి అనుగుణంగా, దృక్కోణాన్ని పెంచడమంటే, ఆ కోణాన్ని ఏర్పరిచే రేఖలను ముందుకో, వెనక్కో అదే ధోరణిలో పొడిగించడమో; లేకపోతే, వైవిధ్యం పేరుతో అదే పరిమాణంలో మరో విభాగానికి అన్వయించడమో మాత్రమే అనుకుంటే, అంతకంటే ఘోరమైన మూఢత్వం మరొకటి లేదు. అటువంటి ప్రవృత్తి ఉన్నవారు ఏ కాలంలోఐనా, ఎంత ఆధునికులైనా, మూఢులే! ఇది నిందాపూర్వక వాక్యం కాదు. కేవల యదార్ధం మాత్రమే!