రాఘవరావు ఇల్లు తాళం పెట్టి బయటికొచ్చి సరస్సు వేపు నడుస్తున్నాడు. కొన్ని పదుల ఎకరాల మీద విస్తరించిన ఆ కాండొమిన్యమ్‌కాంప్లెక్సుకి కేంద్ర బిందువులా ఒక చిన్నసరస్సు. ఆ సరస్సుని చుట్టి ఒక కాలిబాట. ఆ కాలిబాట మీద సరస్సు ఒడ్డున అక్కడక్కడా కొన్ని బెంచీలు. రాఘవరావు సరస్సుని సగం చుట్టి వచ్చి ఒక బెంచీ మీద చతికిల బడ్డాడు. అంతటా నిశ్శబ్దం. ఆ చోటంతా నిర్మానుష్యం. లోపలా బయటా ఒంటరితనం. ఇంతలో రన్నింగ్‌డ్రెస్‌లో ఒకామె కొద్దిగా వగరుస్తూ అతని పక్కనించి పరిగెత్తుకు వెళ్ళింది,వెళుతూనే ఒక ‘హాయ్ అతని వేపు విసిరేసి. ఆమె చూడ్డానికి కొంత ఇండియన్‌లా ఉన్నది కాని, ఆమె జుట్టూ, బిగుతైన రన్నింగ్‌డ్రెస్లో అథ్లెటిక్‌గా కనిపిస్తున్న శరీరమూ చూసి ఆమె ఇండియన్ కాకపోవచ్చునని అనిపించింది. వయసు నలభై ప్రాంతాలో ఉండొచ్చు ననుకున్నాడు కానీ ఖచ్చితంగా ఇంత అని నిర్ధారించుకో లేక పోయాడు. ఇంతలో ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళే పోయింది. మళ్ళీ ఒంటరితనం.
ఉద్యోగంలో ఉండగా ముప్ఫై ఐదేళ్ళ పాటు ఎంత బిజీ బిజీగా ఒక అంతర్జాతీయ మానవ సముద్రంలో మునిగిపోయి గడిపిన జీవితం. అలాంటి ఉద్యోగ జీవితం తరవాత మరెవరికైనా ఐతే ఒంటరితనం మీద వ్యామోహం ఏర్పడుతుందేమో. కానీ తనకి రిటైరైన దగ్గర్నించి పిచ్చెక్కినట్టుగా ఉంది. ఉద్యోగం మీద వ్యామోహం లేదు, డబ్బు అవసరం అసలే లేదు. కానీ పొద్దస్తమానం కావల్సింది మనుషుల్తో ఇంటరాక్షన్. ప్రేమా అవగాహనా పెద్దగా లేని తన వైవాహిక జీవితం భార్య మరణంతో ముగిసినప్పుడు ఏమీ లోటు అనిపించలేదు కానీ తనకీ ప్రపంచానికీ వారధిగా ఉన్న ఉద్యోగం ముగిసి పోయాక ఆ లోటు పూడ్చలేనిదిగా కనిపిస్తోంది. ఒంటరితనం ఇంత భయంకరంగా ఉంటుందని తనకెప్పుడూ తట్టలేదు. ఇక కొడుకూకోడళ్ళ బలవంతం మీద అమెరికా వచ్చాక, ఇంతకు ముందెప్పుడూ గట్టిగా లేని కుటుంబ బంధాన్ని పోనీ ఇప్పుడైనా ధృఢపరుచు కుందామన్న ఆశ. ఇక్కడికి వచ్చాక గానీ అదెంత దురాశో తెలిసి రాలేదు. అవును, తను రిటైరై కూచున్నాడని వాళ్ళ జీవితాలు ఆగుతాయా. సుఖానికీ సౌకర్యానికీ మర్యాదకీ కొదవ లేదు. కానీ తనకి కావల్సింది వాళ్ళతో కలిసి పోవటం వాళ్ళ స్నేహితులంతా తమ బాతాఖానీలో తననీ ఒకడుగా చేర్చుకోవటం. కావల్సింది వయసుకి గౌరవం కాదు, మనసుకి స్నేహం. అదివ్వటానికి వాళ్ళకిప్పుడు తీరికా ఓపికా లేవు. బహుశా అటువంటి ఊహే వాళ్ళకి వచ్చి ఉండక పోవచ్చు. ఈ ఇల్లున్న చోటే చాటి చెబుతోంది ఈ ఒంటరితనాన్ని ఎవరైనా తపస్సు చేసుకోవాలంటే ఈ చోటు బాగా పనికొస్తుందని అనుకున్నాడు.
సరస్సులోనుంచి బయటి కొచ్చిన బాతులు కోలాహలం చేస్తున్నై అతని కాళ్ళ దగ్గర. తనతో తెచ్చిన జొన్నల సంచీ తెరిచి రెండు గుప్పిళ్ళు నేలమీద విరజిమ్మాడు. బాతులన్నీఒకదాన్నొకటి తోసుకుంటూ గింజల మీదికి ఎగబడ్డం చూస్తూ బెంచీ మీద వెనక్కి వాలి కూర్చున్నాడు. వాటి తొక్కిసలాట అతనికి తన చిన్నతనంలో బెజవాళ్ళో ఎండాకాలంలో నీళ్ళ టాంకొచ్చినప్పుడు బిందెల్తో తప్పేలాల్తో మాకంటే మాకని తోసుకులాడే జనాన్ని తలపించింది. ఒక బాతు మాత్రం ఈ దొమ్మీలో దిగకుండా వేరేగా ఉండటం అతను గమనించాడు.
అది ఈ గుంపుకి కొంచెం ఎడంగా నుంచుని వుంది. తనవేపే చూస్తున్నట్టుగా వుంది. అప్పుడప్పుడూ ముక్కుతో రెక్కల్నీ పొట్టనీ సవరించుకుంటూ మళ్ళీ తన వేపే తిరిగి చూస్తోంది. ఇదొక్కటీ ఎందుకు గింజల కోసం పోవడం లేదా అని ఆలోచించాడు రాఘవరావు. గుంపులో తినడం ఇష్టం లేదేమో దానికి. అప్పటికే మిగతా బాతులన్నీ మెక్క గలిగినన్ని గింజలు మెక్కి మెల్ల మెల్లగా సరస్సులోకి జారుకుంటున్నాయి. ఇంకా చాలా గింజలు అక్కడక్కడా మిగిలి ఉన్నై. ఐనా ఈ బాతు కదల్లేదు. బహుశా దానికి ఆకలిగా లేదేమో ననుకున్నాడు. చూడగా చూడగా రాఘవరావుకి అది తనవేపు కొంచెం నిష్ఠూరంగా చూస్తున్నట్టు తోచింది. దాని తీరులో ఒక దర్జా ఒక ఠీవి ఉన్నట్టు కూడా అనిపించింది.హంసల్లో రాజహంసకి మల్లే ఇది రాజబాతు అనుకున్నాడు. ఆ దుష్ట సమాసానికీ తన పిచ్చి ఊహకీ తానే నవ్వుకున్నాడు. ఆ బాతుకి దర్జా చూసి దానికి వీరిగాడని పేరు పెట్టాడు. గింజల సంచీలోంచి కొన్ని గింజలు తీసి ఆ బాతు నించునున్న వేపు విసిరాడు. అది ఆ గింజలవేపు వెళ్ళలేదు. అసలు చలించను కూడా లేదు అలాగే అతని వేపు చూస్తూ ఉంది. ఇది అతని కుతూహలాన్ని పూర్తిగా రేకెత్తించింది.
అతను జేబు తడిమి చూసుకుంటే తను తినడానికి తెచ్చుకున్న ఓట్‌మీల్‌కుకీ చేతికి తగిలింది. అందులో ఒక చిన్న ముక్క తుంపి చేతులో పట్టుకుని బాతు దగ్గరికి వెళ్ళాడు. అది భయపడి పారిపోతుందేమో ననుకున్నాడు గానీ అది ఏమీ చలించకుండా అలాగే నించుంది. రాఘవరావు ముంగాళ్ళ మీద గొంతుకి కూర్చుని కుకీ ముక్క వున్న చేతిని బాతు ముందుకి చాపాడు. అది ఒక్క క్షణం పాటు అతని చేతిని తేరిపార చూసి ఒక్క తల విసురుతో చటుక్కున ఆ ముక్కని నోట కరుచుకుంది. దాని తల విసురు వేగానికి అతను ఉలిక్కిపడి చేతిని వెనక్కి లాక్కున్నాడు. అది అతని చేతిని తగిలీ తగలనంత సున్నితంగా .. అంత లాఘవంగా కుకీని నోట చిక్కించుకుంది. ఇంకో ముక్క తుంపి అలాగే చెయ్యి చాచాడు. బాతు మళ్ళీ అదే తల విసురుతో ఆ ముక్కని కూడా తీసుకుంది. ఇంకో ముక్క. అదికూడా తీసుకుంది. ఈసారి రాఘవరావు చెయ్యి తొణక లేదు. అతను నాలుగో ముక్క తుంచి చెయ్యి చాస్తుంటే బాతు ‘ఇప్పటికిది చాలూ నన్నట్టు తలాడించి వెనక్కి తిరిగింది.
“ఒరే వీరిగా! రేపు ఇంకో తాయిలం తెస్తా. మళ్ళీ రా,” అన్నాడతను.
“యు సీమ్ టు హావ్‌మేడ్‌ఎ ఫ్రెండ్‌దేర్”
ఒక స్త్రీ గొంతు విని వెనక్కి తిరిగాడతను. ఇందాక రన్నింగ్‌చేస్తూ వెళ్ళినామె ఎక్సర్సైజు ప్తూౖరెంది కాబోలు ఎప్పుడొచ్చిందో మరి, రాఘవరావు వెనకాలే నిలబడి ఉంది.
రాఘవరావు వీరిగాడి సంగతి మరిచి పోయి లేచి నిలబడి ‘హలో’ అన్నాడు. ఆమె చిర్నవ్వుతో, “హాయ్ ఆర్యూ న్యూ హియర్” అనడిగింది. రాఘవరావు తనని పరిచయం చేసుకున్నాడు. బదులుగా ఆమె తన పేరు కార్లా అనీ, హాస్పటల్లో నర్సుగా ఉద్యోగం చేస్తున్నాననీ చెప్పింది. ఆమె ఇంగ్లీషు మాట్లాడుతుంటే అమెరికన్ ఉచ్చారణలాగానే ఉన్నా, అక్కడక్కడా ఒక మెత్తటి యాస ధ్వనిస్తూ ముచ్చటగా ఉంది. మర్యాద కాదేమో అనుకుంటూనే కుతూహలం పట్టలేక అడిగేశాడు. ఆమె తను మెక్సికోలో పుట్టాననీ పదేళ్ళ వయసులో తన కుటుంబమంతా అమెరికాకి వలస వచ్చామనీ చెప్పింది. రాఘవరావు రిటైరై కొడుకు దగ్గరకి వచ్చి ఉంటున్నట్టు విని కార్లా ఆశ్చర్యపడింది.
“మీకేమీ పెద్ద వయసున్నట్టు లేదు, నా ఈడు వారే అనుకుంటాను, అప్పుడే రిటైరయ్యారా?”
“వయసు లేకేమ్ యాభై ఎనిమిది నిండాయి. మీరు నాకంటే కనీసమ్‌పది పదిహేనేళ్ళు చిన్నదానిలా ఉన్నారు. నా వయసంటారేమిటి? అఫ్‌కోర్స్ ఆడవాళ్ళ వయసు గురించి మాట్లాడ్డం మర్యాద కాదనుకోండి.”
కార్లా అతని మాటలకి గలగలా నవ్వింది.
“థాంక్యూ ఫర్‌ది కాంప్లిమెంట్ నా వయసు చెప్పను కానీ మీ వయసు కంటే అంత తక్కువేమీ కాదు.”
ఈసారి ఆశ్చర్య పోవటం రాఘవరావు వంతయింది. కార్లాయే సంభాషణ పొడిగిస్తూ, “కాలక్షేపానికి ఏంచేస్తుంటారు? ఐ మీన్ బాతులతో స్నేహం చెయ్యడం మినహాయించి,” అని మళ్ళీ గలగలా నవ్వింది. ఆమె వీరిగాడితో తను మాట్లాడ్డం విన్నదని గుర్తించి రాఘవరావు కొంచెం సిగ్గుపడ్డాడు. కొద్దిగా తడబడి తనని సమర్ధించుకుంటున్నట్టుగా, “ఆ బాతుందే,అదొక వింత బాతు. దానికి వీరిగాడని పేరు పెట్టాను,” అంటూ వీరిగాడి కోసం చుట్టూ చూశాడు. వీరిగాడెప్పుడో నీళ్ళలోకి జారుకున్నాడు. ఆ బాతుల గుంపుల మధ్య వీరిగాణ్ణి గుర్తుపట్ట లేక పోయాడతను. ఐనా కార్లా ప్రోద్బలం మీద వీరిగాడి వింత ప్రవర్తన గురించీ, చివరకి వాడు కుకీ ముక్కలు తిన్డం అంతా చెప్పాడు. ఆమె విరగబడి నవ్వి, స్నేహపూర్వకంగా అతని జబ్బమీద చరిచి, “రాఘవ్ యూ ఆరె ఫన్నీ మేన్. నేనిక వెళ్ళాలి. మళ్ళీ కలుద్దాం,” అనేసి వెళ్ళి పోయింది. ఇంటివేపు నడుస్తుంటే సాయంత్రం చాలా ఆహ్లాదకరంగా ఉన్నట్టు తోచింది రాఘవరావుకి.
నవీన్ లివింగ్‌రూములో సోఫాలో కూర్చుని ఆరోజు వచ్చిన మెయిల్‌చూస్తున్నాడు. ప్రీతి వంటింట్లో టీ కలుపుతోంది. లోపలికొచ్చిన రాఘవరావుని చూసి నవీన్,
“వాక్‌కి వెళ్ళొచ్చారా డాడీ?” అన్నాడు.
రాఘవరావు చెప్పులు విడిచి, కొడుక్కి ఎదురుకుండా ఉన్న సోఫాకుర్చీలో కూర్చుని అన్నాడు.
“ఔన్రా. కొంచెం సేపు లేక్‌ఒడ్డున కూర్చుని వచ్చాను. ఒక తమాషా జరిగింది తెల్సా. బాతులకి మేత పెడదామని ..” వీరిగాడితో తన అనుభవం చెప్పబోయాడు.
టీట్రేతో అక్కడికొచ్చిన ప్రీతి రాఘవరావుని ఎగాదిగా చూసి అతని మాటల కడ్డొస్తూ, “అయ్యొయ్యో, ఇంతసేపూ ఈ వేషంతోనే బయట తిరుగుతున్నారా అంకుల్ అసలే ఫాల్‌వచ్చేసింది.సాయంకాలం బాగా చలిగాలి తిరుగుతోంది. కనీసం ఒక స్వెట్టరన్నా లేకుండా .. కాళ్ళక్కూడా బూట్లు వేసుకోండి ఇకనించీ బయటికెళ్ళేప్పుడు,” అన్నది.
రాఘవరావు తను చెప్పబోతున్న విశేషం మరిచి పోయి కోడలి వంక విస్మయంగా చూశాడు. ఆమె అందించిన టీ కప్పు అందుకుని ఒకసారి చప్పరించి, “ఆ, ఇదో పెద్ద చలి కాదులే. ఢిల్లీలోనూ ముస్సోరీలోనూ ఉండగా ..” అంటూ ఏదో చెప్పబోయాడు. దానికి అడ్డంగా వచ్చి నవీన్ మెయిల్లోంచి ఒక పసుప్పచ్చ కార్డు ఎత్తి చూపిస్తూ, “ఈ శనివారం ట్రాయ్‌టెంపుల్లో ఏనివర్సరీ సెలబ్రేషన్ జరుగుతోందిట. పొద్దున్న సుప్రభాతం, విష్ణు సహస్రనామం, తరవాత సత్యనారాయణ పూజ, మధ్యాన్నం స్వామీజీతో భగవద్గీత డిస్కోర్సు .. ఇంకా చాలా స్పెషల్‌ప్రోగ్రాము లున్నాయి. మనం కూడా వెళ్తే బావుంటుందేమో ప్రీతీ?” అన్నాడు.
“టెంపుల్‌ఏనివర్సరీనా? ఓమైగాడ్ సరోజాంటీ నాకు వారం రోజుల క్రితమే చెప్పింది. నేను కంప్లీట్‌గా మర్చిపోయాను. తప్పకుండా వెళ్దాం. పోయినసారి కూడా మిస్సయ్యాం కదా. అసలు పొద్దున వెళ్ళిపోయి రోజంతా అక్కడే గడపొచ్చు. ఈసారి వెయ్యి నూట పదహార్లు కట్టి లైఫ్‌మెంబర్షిప్‌తీసుకోవాలి.” అన్నది ప్రీతి.
“ఆ, అవునవును. మన టెంపుల్‌కి మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు? ఏనివర్సరీ ఫంక్షనుకి ఫుడ్‌కూడా చాలా బాగా వుంటుందట కదా. ఏం డాడీ, మీరు కూడా రండి. స్వామీజీ డిస్కోర్సు చాలా బావుంటుంది నేనూ ప్రీతీ చాలా సార్లు విన్నాం. కాలక్షేపానికి కాలక్షేపమూ, పుణ్యానికి పుణ్యమూ. ఏమంటారు?” అన్నాడు నవీన్.
కొడుకు మాటలు వింటూ వీడు ఇంత భక్తి పరాయణుడుగా ఎప్పుడు మారాడూ అని చూస్తున్న రాఘవరావు నవీన్ అకస్మాత్తుగా తనని సంబోధించేసరికి చకితుడయ్యాడు.
“ఏమోరా, ఈ పూజలూ డిస్కోర్సులూ స్వామీజీలూ .. నాకెప్పుడూ అంతగా అలవాటు లేదు,” అన్నాడు సాలోచనగా. బదులుగా కోడలు అందుకుని, “ఇందులో అలవాటు ఏముంది అంకుల్ మనం చెయ్యాల్సిందల్లా అక్కడికి వెళ్ళి కూర్చోవటమే. పూజ చూడ్డం, స్వామీజీ చెప్పేది వినడం .. అంతేగా! అదీకాక ఇంట్లో మీరు అసలే బోరుగా ఫీలవుతున్నట్టు ఉన్నారు. అక్కడికి మనవాళ్ళందరూ వస్తారు. చాలామంది పేరెంట్స్.. మీ ఏజ్‌వాళ్ళూ వస్తారు. అందర్నీ కలిసినట్టు ఉంటుంది,” అన్నది రాఘవరావుని ఎలాగైన ఒప్పించాలన్నట్టు.
అవునుమరి తను వెళ్ళకపోతే అందరూ అడగరూ ఎందుకు రాలేదని. పైగా తన నొక్కణ్ణీ ఇంట్లో ఒంటరిగా వదిలి వెళ్ళేందుకి గిల్టీ ఫీలింగొకటి. ఐతే అప్పటికి రాఘవరావు వెళ్ళనక్కర్లేదనే నిర్ణయానికి వచ్చేశాడు. ప్రీతి చెప్పిన మాటలు అతని నిర్ణయాన్ని ఇంకా ధృఢపరిచాయి. తను రాననీ, తన గురించి వాళ్ళ ప్లాన్లు పాడు చేసుకోనక్కర లేదనీ మృదువుగానే కోడలికి చెప్పడానికి ప్రయత్నించాడు. కాని ప్రీతికి మామగారి ఎథీస్టిక్‌ఏటిట్యూడ్‌ఏమీ రుచించినట్టు లేదు.
వారం పది రోజులు గడిచేప్పటికి వీరిగాడు రాఘవరావుకి బాగా మచ్చికయ్యాడు. రాఘవరావు సరస్సు వొడ్డుకి రాగానే వాడు ఎక్కడున్నా వెంటనే వచ్చేస్తాడు. రాఘవరావు వాడికోసమని స్పెషల్‌గా తెచ్చే ట్రీట్స్‌మూడంటే ముచ్చటగా మూడే పలుకులు తినేసి వెళ్ళిపోతాడు. ఒక్కోసారి రాఘవరావు కూర్చున్న బెంచీ మీదనే ఎక్కి రెక్కల్నీ పొట్టనీ ముక్కుతో సవరించుకుంటూ కూర్చుంటాడు. రాఘవరావు శ్రద్ధగా గమనించి వాడి చేష్టల వల్లనూ, ఈకల రంగుల్లోనూ అమరికలోనూ తేడాలు గుర్తించి మిగతా బాతులమధ్య ఉన్నా వీరిగాణ్ణి గుర్తుపడుతున్నాడు. అప్పుడప్పుడూ కార్లా రన్నింగ్‌నించి తిరిగి వస్తూ అక్కడ ఆగేది. ఒక పది పదిహేన్నిమిషాలు ఇద్దరూ సరదాగా కబుర్లాడుకుంటారు. అతన్నికూడా తనతో రన్నింగ్‌కి రమ్మని కార్లా ఆహ్వానించింది కానీ రాఘవరావు జీవితకాలపు బద్ధకాన్ని అంత తేలిగ్గా ఒదులుకో లేక పోయాడు.
ఈరోజుల్లో బయటికి వచ్చినప్పుడు స్వెట్టర్లూ జాకెట్లూ బూట్లూ వేసుకోక తప్పడం లేదు రాఘవరావుకి. ఇంకో విషయం గమనించాడతను రాను రాను సరస్సులో బాతుల సంఖ్య తగ్గిపోతున్నదని. కొంత ఆలోచించిన మీదట చలికాలం వస్తుండడం వలన బాతులు ఏదైనా వెచ్చటి ప్రదేశాలకి వలస పోతాయని తోచింది. బాతులన్నిటికీ మామూలు మేత వేసి వీరిగాడికి ప్రత్యేకంగా తెచ్చిన వేరుశనగ పప్పులు తినిపించి వాణ్ణి నిమురుతూ, “ఏరా వీరిగా, మీ వాళ్ళంతా వలస వెళుతున్నారా? నువ్వు కూడా వెళతావా? ఎలా వెళతావురా నన్ను వొదిలేసి?” అన్నాడు. వీరిగాడు అతని మొహంలోకిి గంభీరంగా చూస్తున్నట్టు అతనికి తోచింది. ఊరికే ఇమోషనల్‌కాను అని గర్వపడే రాఘవరావుకి గొంతులో ఏదో చిక్కబట్టినట్టు నొప్పెట్టింది. అకస్మాత్తుగా అతనికి విపరీతమైన ఆందోళన మొదలైంది .. వీరిగాడు తోడు లేకుండా చలికాలమంతా ఎలా గడపటం? వాడెప్పటికి వలసనించి తిరిగి వస్తాడో. ఈ ప్రాంతాలకి తిరిగొచ్చినా మళ్ళీ ఈ సరస్సుకే తిరిగొస్తాడని గారంటీ ఏముంది. ఈ ఆలోచనలు అతన్నింకా విచారంలోకి తోసేశాయి. అది అతను గ్రహిస్తూనే ఉన్నాడు, కానీ ఆ ఉచ్చులోనుంచి బయటపడలేక పొయాడు.
మర్నాడు కార్లా కనిపించినప్పుడు ఈ విషయమే ప్రస్తావించాడు. బాతులు చలికాలంలో వలస వెళ్తాయనీ, మళ్ళీ మార్చిలోనో ఏప్రిల్లోనో తిరిగొస్తాయనీ, ఎక్కడికి వలస వెళ్ళేదీ తనకి తెలియదనీ చెప్పిందామె. ఎప్పుడూ ఈ విషయం గురించి ఆలోచించ లేదన్నది. మరో పది నిమిషాలు ఏవేవో సరదా కబుర్లు చెబుతూ కూర్చుంది కానీ రాఘవరావు ధ్యాస తన మాటల మీద లేదని గమనించింది. అతని దృష్టి మాటి మాటికీ బాతుల గుంపు మీదికే తిరిగి పోతోంది. అది చూసి కార్లా ఇలా అంది, “యునో రాఘవ్ మీరే ఎప్పుడూ చెబుతుంటారు కదా, ఇంటర్నెట్‌లో ఎన్నో విషయాల మీద సమాచారం ఉంటుందని. బహుశా దీని గురించి కూడా రాశారేమో. వెతికి చూడండి.”
విద్యుత్‌తగిలిన వాడిలా ఎగిరిపడ్డాడు రాఘవరావు. అరచేత్తో నుదుటి మీద చరుచుకున్నాడు.
“ఈ విషయం నాకింత వరకూ తట్టనే లేదు,” అంటూ కార్లా వేపు తిరిగి, “కార్లా, నువ్వు నాకో బ్రహ్మాండమైన దారి చూపించావు. ఎలా నీకు కృతజ్ఞతలు చెప్పుకోను?” అని
స్నేహ పూర్వకంగా చేతులు చాచాడు. కార్లా అతని చేతుల్లో చేతులు కలిపి, “యూ సీమ్ టు లైక్‌దట్‌డక్‌ఎ లాట్ మీకు మంచి సమాచారం దొరుకుతుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. గుడ్‌లక్” అని అతని చేతుల్ని మృదువుగా నొక్కింది.
కొన్ని రోజులపాటు రాఘవరావు ఇంటర్నెట్‌మీద రిసెర్చి చేసి చాలా సమాచారం సేకరించాడు. బాతుల్లో రకరకాలు, వాటి అలవాట్లు, ఎక్కడ గూళ్ళు పెట్టుకుంటాయో, ఎక్కడికి వలస వెళతాయో .. ఇలా. వీరిగాడు మాల్లర్స్డ్‌అనే జాతికి చెందిన బాతు. ఈ రకం బాతులు చలికాలానికి ఎక్కువగా మెక్సికో దక్షిణ కేలిఫోర్నియా ప్రాంతాలకు వలసవెళతాయిట.ఈ సమాచారమంతా మనసుకు పట్టించుకునే సరికి అతని బుర్రలో ఒక పధకం రూపు దిద్దుకున్నది. రిటైఅరై అమెరికా వచ్చినప్పటినించీ నీరుకారిపోయిన ఉత్సాహం ద్విగుణీకృతంగా అతని నరనరాల్లో నిండిపోయింది. మునుపు లేని ఒక లక్ష్యం ఇప్పుడు ఎదురుగా కనబడుతోంది.
సూర్యుడు ఎక్కువసేపు ఆకాశంలో మొహం చూపి ంచడానికి సిగ్గుపడుతుంటాడు. కాండొమినియం ఆవరణలోని చెట్లన్నీ ఆకులు రాల్చేసుకుని వొచ్చేస్తా నని భయపెడుతున్న చలికాలం కేసి భయంగా చూస్తుంటాయి. థెర్మామీటర్లు నలభై దాటని లో బ్లడ్‌ప్రెషరుతో బిగుసుకు పోతుంటాయి.
ఒక సాయంత్రం రాఘవరావు ఇల్లు తాళం తీసి లోపలికొచ్చి చూస్తే లివింగ్‌రూములో ఎవరూ కనబడలేదు. నవీన్, ప్రీతీ ఇంకా రాలేదేమో ననుకుని అతను కోటూ బూట్లూ విప్పి పెట్టి టీ పెట్టుకోవటానికి కిచెన్‌లో కెళ్ళాడు. మాస్టర్‌బెడ్రూములోంచి మాటలు వినిపించినై ఐతే వీళ్ళు వచ్చేశారన్నమాట మొగుడూ పెళ్ళాలు ఏదో ఇంపార్టెంట్ డిస్కషన్‌లో ఉన్నట్టుంది. వాళ్ళక్కూడా టీ కావాలేమో నని అడుగుదామని అతను గొంతెత్తి పిలవబోతుంటే లోపల్నించి కోడలి గొంతు బిగ్గరగా వినిపించింది. .. ” .. .. ఎవరో ఆడ మనిషితో చెట్టాపట్టాలేసుకుని పార్కులో షికార్లు కొడుతున్నారట. ఆ మనిషి ఈయన బుజమ్మీదకి వొరిగిపోయి విరగబడి నవ్వుతోందిట .. ఎంత సిగ్గులేనిమనిషి కాకపోతే! అంకుల్‌మాత్రం .. ఇంత వయసులో .. వయసుకి తగ్గట్టు హుందాగా వుండొద్దూ .. పబ్లిగ్గా .. చూసింది మన కమలే కాబట్టి సరిపోయింది .. నాకు కాల్‌చేసి చెప్పింది .. మన సొసైటీలో ఇంకెవరన్నా చూసుంటే .. ఇంకేవన్నా వుందా .. రేపణ్ణించీ నలుగుర్లో తలెత్తుకోలేం..”
రాఘవరావుకి రక్తం ఉడుకెత్తి పోయింది కోడలి మాటలు వింటుంటే. ధడాల్న వాళ్ళ గది తలుపు తెరిచి వాళ్ళని అక్కడికక్కడే నిల దియ్యా లని ఉద్రేక పడిపోయాడు. అతి ప్రయత్నం మీద ఆ ఉద్రేకాన్ని అణుచుకున్నాడు .. కోడలి వాగ్ధాటి అక్కడితో ఆగలేదు .. ” .. ఆయన్ననేం లాభం .. ఆంటీ ఐనా ఉండి ఉంటే .. నాలుగేళ్ళయి ఆవిడా లేక పోవడంతో .. ఆ మనిషి ఏం హొయలు చూపించి వల్లో వేసుకుందో .. నీతీ జాతీ లేని మనుషులు .. ఎంతకైనా తెగిస్తారు .. వింటున్నావా నవీన్ .. పరిస్థితి చెయ్యి జారిపోక ముందే మన జాగర్తలో మనం ఉండాలి .. కాస్తా కూస్తా కాదు కదా .. డాలర్లలోకి మార్చుకున్నా మినిమం ఒక హండ్రెడ్ కే అయినా ఉండదూ ..”
ఆహా! అదన్న మాట కోడలి అసలు భయం, పరువు గురించి కాదు, తన ఆస్తి కాస్తా పోతుందేమోనని. తనకి ముక్కూ మొహమూ తెలియని కార్లా గురించి అంత నీచంగా ఎంతెంత మాటలనేస్తోంది ప్రీతి? ఇన్ని పూజలూ పునస్కారాలూ స్వామీజీ డిస్కోర్సులూ ఆమెకి నేర్పింది ఇదేనేమో. కార్లా తో తన స్నేహానికి ఎంత అసహ్యమైన రంగు పులిమింది!అవునుమరి, పదేళ్ళ వయసు నిండాక ఆడా మగా మధ్య స్నేహాన్ని సెక్సు దృష్టితో తప్ప చూడలేని సమాజంలో పుట్టి పెరిగిన ప్రీతి .. ఆ సమాజపు విలువల్ని ప్రతిబింబించక ఏంచేస్తుంది?
రాఘవరావుకి కోడలి మీదా, ఆమె ఉపన్యాసాన్ని గతిలేక వింటున్న నవీన్ మీదా కొద్దిగా జాలి లాంటిది కైలిగింది. ఒక చిలిపి ఆలోచన కూడా వచ్చింది వాళ్ళంతట వాళ్ళే తనతో ఈ ప్రస్తావన ఎలా తెస్తారో చూడాలని. ఐతే కోడలి అపభ్రంశపు వాగుడింకా వింటూ ఉండ దల్చుకోలేదు. నిశ్శబ్దంగా మైన్ డోర్‌దగ్గరికెళ్ళి తలుపు తీసి మళ్ళీ బాగా చప్పుడయ్యేట్టు భడాల్మని మూసి తను అప్పుడే లోపలికి వచ్చినట్టుగా పెద్ద గొంతుతో “నవీన్ .. ప్రీతీ .. ఇంటికొచ్చారా లేదా?” అని అరిచాడు. బెడ్రూములో చెలరేగుతున్న ప్రీతి గొంతు చప్పున అణిగిపోయింది. దాని స్థానే గుసగుసలు వినిపించాయి. మరో నిమిషంలో దొంగ చూపులు చూసుకుంటూ కొడుకూ కోరచూపులు చూస్తూ కోడలూ లివింగ్‌రూములో కొచ్చారు. రాఘవరావు చలి నటిస్తూ అరచేతుల్ని వడిగా రుద్దుకుంటూ, “ఉహూహూ .. అబ్బ .. ఏంచలి. ఇలాంటప్పుడు ఒక్క కప్పు వేడి టీ తాగితే .. ఏమ్మా ప్రీతీ, నీక్కూడా ఒక కప్పు కలపనా పనిలో పనిగా ..” అంటూ హడావుడిగా కిచెన్ వేపు వెళ్ళాడు.
కోడలు అతనికేంజవాబు చెప్పకుండా మొగుడి వంక చూసి, ‘అలా బెల్లం కొట్టిన రాయిలా కూచుంటావేమ్ అడగండి ఆయన్ని నిలదీసి,’ అన్నట్టు ఒక చూపు విసరడం రాఘవరావు దృష్టిని దాటిపోలేదు. నవీన్ అటు తండ్రి వేపు చూడలేక ఇటు భార్య వేస్తున్న తూపుల్నీ ఎదుర్కోలేక సోఫాలో కూలబడి టేబుల్‌మీద కుప్పగా పడున్న మెయిల్‌చూడ్డం మొదలెట్టాడు. రాఘవరావు వాళ్ళిద్దర్నీ పట్టించుకోనట్టు బిజీగా టీ ప్రిపేర్‌చేస్తున్నాడు.
ఒక్క రెండు నిమిషాల పాటు నిశ్శబ్దం .. దాన్ని భగ్నం చేస్తూ నవీన్ సంభ్రమంగా కేక పెట్టాడు. చేతులో ఒక కాగితాన్ని ఎత్తి పట్టుకుని దాని వంక నమ్మలేనట్టుగా చూస్తున్నాడు.అదొక అంతర్జాతీయ బాంకు పంపిన క్రెడిట్‌కార్డు అప్రూవల్‌నోటీసు .. కార్డుతో సహా .. రాఘవరావు పేరిట. దాన్ని పైకెత్తి కిచెన్ విండో వేపు చూపిస్తూ నవీన్, “డాడీ, ఏంటిది?” అనడిగాడు వణుకుతున్న గొంతుతో.
ప్రీతి కూడా కుతూహలంగా నవీన్ పక్కకొచ్చి నిలబడి క్రెడిట్‌కార్డుని చూసి తెల్లబోయింది.
రాఘవ్రావు తాపీగా టీని కప్పులోకి వంచుకుని చప్పరిస్తూ వచ్చి నవీన్‌కి ఎదురుగుండా కుర్చీలో కూర్చుని కొడుకు చేతిలోంచి కాగితం అందుకుని చూశాడు.
“ఓ, ఇదొచ్చేసిందా! ఎక్సలెంట్ ఓరి దీనికేనా అంత కేక పెట్టావ్ ఐనా, నవీన్! ఇంకొకళ్ళ పేరిట వచ్చిన ఉత్తరాలు తెరవడం సభ్యత కాదు కదా!” అన్నాడు నింపాదిగా. నవీన్ కోపంతోనూ అయోమయంతోనూ సతమతమవుతూ, “సభ్యత సంగతి తరవాత .. ముందు ఈ క్రెడిట్‌కార్డు .. అసలు మీకు క్రెడిట్‌కార్డెందుకు?” అనడిగాడు అసహనంగా.రాఘవరావు కొడుకువేపు అమాయకంగా చూసి, “అదేంట్రా? మూడో నాలుగో రకాల కార్డులు పెట్టుకున్నవాడివి నీకు తెలీదూ క్రెడిట్‌కార్డెందుకో? ఏదన్నా కావలిస్తే కొనుక్కోవడానికీ, ప్రయాణాలకీ, కార్‌రెంట్‌చెయ్యటానికీ, హోటళ్ళకీ ..” అతని మాటల్ని ప్రీతి కటింగ్‌ప్లయర్లా కట్‌చేస్తూ అన్నది.
“ఐతే .. మీరెక్కడికన్నా ప్రయాణం చెయ్యబోతున్నారా?”
రాఘవరావు కోడల్ని ఒక్క క్షణం తేరిపార చూశాడు. తల పంకించి,
“ప్రీతీ, యు ఆర్‌వన్ షార్ప్‌వుమన్. బాగా కనిపెట్టావ్ కరెక్ట్ నేనొక ప్రయాణం మీద వెళుతున్నాను. నా బెస్ట్‌ఫ్రెండొకడు ఇక్కణ్ణించి కొన్నాళ్ళ క్రితం వలస వెళ్ళాడు. సరిగ్గా ఎక్కడికెళ్ళాడో తెలీదు కానీ మెక్సికో, సదర్న్ కేలిఫోర్నియా ప్రాంతాలకి వెళ్ళాడని తెలిసింది. వాణ్ణి మళ్ళీ చూడాలనిపించింది .. అందుకని ..”
నవీన్ అనుమానంగా అడిగాడు, “మీకిక్కడ ఫ్రెండ్స్ ఎవరున్నారు ? మీరసలు ఎప్పుడూ బయటికి రాందే!”
రాఘవరావు కొడుకు చెంప మృదువుగా తట్టి చులకన ధ్వనించేట్టు చిన్నగా నవ్వి, “వాడు నీకు తెలీదులే. చెప్పినా మీకు అర్థం కాదు,” అని సూటిగా ప్రీతి వేపు చూస్తూ ఇలా అన్నాడు.
“మీకు ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలి. ఈ ట్రిప్‌కోసం నేను కొన్ని వారాలుగా కార్లా దగ్గర అదే, పార్కులో నా బుజంమీద వొరిగిపోయి విరగబడి నవ్వుతోందే ఆవిడే! తన దగ్గర స్పానిష్‌నేర్చుకుంటున్నాను. బాగానే వచ్చింది మాట్లాడ్డం యో ఆబ్లో ఎస్పాన్యోల్‌ముయితో బియెన్! ఐనా ఇంత దూర ప్రయాణంలో మనిషికి మనిషి తోడుంటే బావుంటుందని కార్లాని నాతో రమ్మన్నాను. ఆమె నా మాట మన్నించి ఒప్పుకుంది. క్రెడిట్‌కార్డ్‌కూడా వచ్చేసింది కాబట్టి ఇక ఫ్లైట్‌టిక్కెట్లు కొనడమే తరువాయి. ఈ మాట కార్లాకిచెప్పి వస్తాను. అస్త లవిస్తా నీన్యోస్” అని చెప్పుల్తోటే బయటికి నడిచాడు.