హన్నన్నా అట్టె అట్టె! రెXంత మాటన్నారు రెXంత మాటన్నారు ఈ బైస్కోపులో ముచ్చటగా ముగ్గురే హీరోయినీమణుల్ని కట్టబెట్టనంత మాత్రాన హీరో గారి హీరోగం మరీ ముదిరిపోయిందంటారా? దీన్లో విడ్డూరమేమిటి మీ విడ్డూరం వింతగెలెయ్య! తెలుగు సిన్మా హీరో అంటే అసలు మీకు ఆవగింజంతైనా అవగాహన ఉన్నట్టు లేదే లేకపోతే రేXవిటండీ మీ ఓఘాయిత్తెవూ మీరూను. యాభై మంది యమకింకరుల్లాటి కర్కశ విలన్ భటుల్ని పెదాల మీద చిరునవ్వు చెరక్కుండా మొహాన పడ్డ ముంగురులైనా కదలకుండా డొక్కలు చించి డోళ్ళు కట్టి ఆ డోళ్ళ మీదే తన ప్రతాపాన్ని కన్నె పిల్లలందరికీ కన్నుల పండగ్గా డప్పు వేయించే హీరో గారి గురించి అంతలేసి మాటలంటానికి మీకు మాటలెలా వచ్చాయి? ఎక్కడ అన్యాయం జరుగుతున్నా హఠాత్తుగా ప్రత్యక్షమై పోయి గుక్క తిప్పకుండా అరగంట సేపు అరువు గొంతు అరుపుల డైలాగుల్తో హోరాహోరీగా పోరాడే వారి గురించి వీరూ వారూ లాగా మీరూ హోరెత్తి పోతే ఎలాగ? “అదంతా బానే వుంది గాని యింతమంది హీరోయిన్లతో పొలీగమీ ఏవిట”ంటారా? అయ్యా, మీ అసలు సొదా బాధా అదైటే ఆ మాట ముందే అనొచ్చుగా తమ బొంద! అబ్బయ్యేది, వాడబ్బయ్యేది ఎవడి ఎదటైనా సరే ఒళ్ళంతా వెదికినా అర గజం మించిన బట్ట కట్టుకోలేకపోయినా పెద్దాళ్ళందరికీ బుద్ధులు చెప్పే భారీ డైలాగుల సిన్మా హీరోయిన్ లాగా పేట్రేగి పోయి ఇంత డొంకతిరుగుడు ఉపన్యాసాలెందుకు!
అయ్యా, తమ లాంటి పెద్దల వద్ద చాలా గుంభనంగా ఏ మాత్రం స్వోత్కర్ష లేకుండా సొంత డబ్బాని చాటున దాచేసుకుని నివురుగప్పిన్నిప్పు లాగా మినుకూ మినుకూ మంటూ ఉంటాననేగా మీరు మరీ ఇంత ఎలిమెంటరీ సందేహాలు వెలిబుచ్చుతున్నది? ఏవిటీ, డబ్బా బాగానే బయటికి కనపడుతుందంటారా! పోదురూ మీ ఛలోక్తులూ మీరూనూ! అమెరికాలో ఎక్కువ రోజులుండి మీకు డబ్బాకీ సన్నాయికీ కూడా తేడా తెలియటం లేదట్టుంది గాని నినదభీషణ శంఖము దేవదత్తమే? లేకపోతే ఏవిటండీ! అసలే కట్నాల గొడవల్లో బడి యావద్భారతమూ అట్టుడికినట్టుడికి పోతుంటే ఆడకూతుళ్ళు పెళ్ళి కొడుకుల కోసం సిన్మా హాళ్ళన్నీ వెయ్యేసి కళ్ళతో వెదుక్కుంటుంటే పెళ్ళీడొచ్చిన కుర్రాళ్ళు కాబోయే పెళ్ళాంతో రాబోయే వస్తువుల కోసం ఈ టీవీ ఆ టీవీ అనకుండా చూసి సొంత ఇళ్ళ లోనే కోరికల భారీ కర్మాగారాలు నడుపుతుంటే దేశజనాభాకి జీవితపు విలువల్ని బాధించైనా బోధించే ఏకైక రంగం సిన్మా పరిశ్రమ శ్రమ దానం చెయ్యకుండా చేతులు ముడుచుక్కూచోవాలనా మీ అభిప్రాయం? కష్టమైన సాంఘిక సమస్యల్ని ముచ్చటైన తేలిక మార్గాల్లో పరిష్కారం చెయ్యటానికి బారుల్లో బారులు తీరి బీరులు సేవిస్తూ హోటల్ గదుల్లో మదవతుల్తో మదరతులు సాగిస్తూ పగలు పచ్చిగంగైనా ముట్టకుండా మధ్య మధ్యలో కేవలం మద్యవే పుచ్చుకుంటూ రాత్రులు నేత్రాల మీదికి నిద్రల్ని రానియ్యకుండా కాంతాకనకాల కోసం కళ్ళకి వత్తులేసుకుని కాపలాలు కాస్తూ తపస్సులు చేస్తూ కనుక్కున్న మహత్తర మార్గాల్ని తవరిలా బూచికపుల్ల కింద లెక్కేస్తే ఎలా? సంఘ సంస్కరణంటే మాటలా మూటల్తో పని గాని? మహా మహా వాళ్ళం మనవంతా ఎప్పుడొకప్పుడు “మమ” అని ఆ మహాసాగరంలో మునకేసిన వాళ్ళవే కదా! ముత్యాలూ రత్నాలూ దొరకటం అటుంచి ఊపిరి తిరక్క కళ్ళు తిరిగి బుర్ర వాచి ఉరికి బయటపడ్డ వాళ్ళవే కదా! మరి మనలాటి జీనియశ్శుంఠలకే అంతుపట్టని వ్యవహారాల్ని ఎంత వింత జనవైనా సిన్మాల వాళ్ళు మాత్రం అంచెలంచెల్లో నరుక్కురావాల్తప్ప సంస్కరణంతా ఒక పూట్లో చేసుక్కూచుంటే తర్వాత సిన్మాలు తియ్యటానికి సమస్యలు నిండుకోవూ?
అందుకే ముందుగా పెళ్ళిళ్ళ సమస్యని అంటే అదేలెండి పెళ్ళిళ్ళు కాని సమస్యని ఒకో హీరోకీ వాడి వేడి కొద్దీ ముగ్గుర్నో నలుగుర్నో కట్టబెట్టి కష్టబెట్టి తీరుస్తావన్నమాట. ఇలా కొన్నాళ్ళు జరిగిందంటే ఇక లైఫ్ ఆర్ట్‌ని ఇమిటేట్ చేసిపారేసి పొలీగమీ పూలూ కాయలూ కాయటమూ, మీరంటున్నట్టు ఒక వంక నించి సవతుల నెయ్యాల కయ్యాల ఒయ్యారి సయ్యాటలు, మరో వంక నించి పెళ్ళాల సాకర్ ఆటలో బంతుల్లా వంతుల్లో చావు దెబ్బలు తినే మొగుళ్ళ వ్యథాభరిత జీవితాలు ఇలా కొత్త కొత్త సమస్యల్ని రచించిచెండాడుతూ ఉక్కుముక్కల్లాటి సిన్మాల్ని మనలాటి (అప)కార్యశూరులు తీసెయ్యటమూను! ఆ మాటకొస్తే ఎవర్దాకో ఎందుకూ మీరు ప్రొడ్యూసర్ ఔదురూ నేనూ ఏదో మనకీ మనకీ ఉన్న బహుకాల స్నేహం దృష్య్టా అవతల హాలీవుడ్ వాళ్ళంతా కాళ్ళా వేళ్ళా బడుతున్నా వాళ్ళని (బూ)తూలనాడి తూలిపడేట్టు తన్ని మీ సిన్మాని డైరెక్ట్ చేసే పనికి పూనుకుంటా రేప్పొద్దున్నించే.
చూశారా తీగ లాగితే డొంకంతా కదిల్నట్టు మీలాటి ముందుచూపున్న ప్రొడ్యూసర్లు ఒక్క ముక్కంటే నాలాంటి మేధావికెడ్ డైరెక్టర్ చేతులో అదో ఎవార్డ్‌సిన్మాగా తర్జుమా అయిందా లేదా? అందుకే నాతో మాట్టాడ్డవే ఓ ఎడ్యుకేషన్ అన్నాడెవడో! అబ్బే, అదెవడో వాడి గురించి అనుకున్నది కాదు, ఎవడో నా గురించి, అంటే నేనే నా గురించి అన్నది లెండి. అరె, ఏవిటలా మా కాబోయి మానేసిన మావగారిలా ధువధువలూ చిటపటలూనూ! కొంపదీసి మీగ్గూడా ఎవరేనా యంగ్‌బ్యూటిఫుల్‌విడోతో యంగండ్ రెస్ట్‌లెస్ ఎంగేజ్‌మెంట్‌ఉందా ఏవిటి? నేనూ అందాకా వస్తా పదండి ఎంతైనా ఈ విషయాల్లో చెయ్యిదిరిగిన చెయ్యి గదా మన్ది! ఏవిటీ ఈ పూట ఎంతమాత్రం తవ కార్లో మరొకరు రావటానికి వీలుపడదంటారా! నన్నిలా ఒక్కణ్ణే ఈ మాల్లో ఒదిలేసి మీరు వెళిపోవడం చూశారూ, ఇది బేస్ బార్బేరియస్! మరో సారి ఆలోచించుకోటం మంచిది నామాట విని ..
డామిట్, కథ హీరోకే అడ్డం తిరిగింది!