ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! ఒక కొత్త సంవత్సరమే కాదు, ఒక కొత్త దశాబ్దమూ మొదలవుతున్నది. గడిచిన పదేళ్ళూ ప్రపంచమంతటా లాగానే మన దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయార్థిక కళాసాంస్కృతిక రంగాలాదిగా ఎన్నో మార్పులు సంభవించాయి. మతోన్మాదం, సంకుచితత్వం రాజ్యమేలుతున్నాయి. మనిషిని మనిషి కులమతప్రాంత భేదాల విచక్షణతో చూడడం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. నిర్మూలించబడవలసిన సామాజిక రుగ్మతలు వ్యక్తుల అస్తిత్వాలకు గర్వచిహ్నాలుగా మారి సమాజానికి హాని చేసే ఆయుధాలవుతున్నాయి. ప్రభుత్వాలు చెదపురుగుల లాగా ప్రజాస్వామ్యాన్ని తొలుచుకు…
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దుమారాన్నే లేపింది. ప్రస్తుత ప్రపంచంలో ఎదగడానికి, ఆర్థికంగా ఉన్నతమైన వర్గాలతో విద్యావుద్యోగాలలో పోటీ పడడానికి బడుగు వర్గాలవారికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయాన్ని సమర్థించే వారొకపక్క, విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని ఆవేశంతో ప్రతిఘటిస్తున్న భాషాభిమానులొకపక్క, తమ తమ కులమతవర్గ వాదాలకనుగుణంగా దీనికి రకరకాల రంగులలుముతున్న మరికొందరొకపక్క, తలో వైపు నుండి కూడి విషయాన్ని ఫక్తు రాజకీయం చేశారు. వీళ్ళ నినాదాలన్నీ…
కేవలం తన ఆలోచనలను అక్షరబద్ధం చేసుకొని చూసుకోవడమే రచయిత లక్ష్యమైతే సాహిత్యం అనేదే ఉండదు. తన ఊహలు, అభిప్రాయాలు, ఆలోచనలు పదిమందికి తెలుపవలసి ఉన్నదనే స్పృహ సాహిత్యానికి, ప్రత్యేకించి ఆత్మకథాసాహిత్యానికి మూలబీజం. రచనకు కావలసిన ముడిసరుకులన్నీ జీవితంలోనే ఉంటాయి. కానీ అనుభవాన్ని రచనగా మార్చే పాటవం, ఆ చెప్పడంలో తనలోకి తాను నిజాయితీగా చూసుకునే చూపు రచనలను మనకు దగ్గర చేస్తాయి. అనుభవాలు వ్యక్తిగతమై, మనిషి లోతులు, బలహీనతలతో సహా అర్థమవుతున్న కొద్దీ, ఆ రచయిత మనిషిగా…
ఈరోజు తెలుగుభాష ఏ స్థితిలో ఉన్నది అన్న ప్రశ్నకు పతనమవుతున్నది అన్నదొకటే సమాధానం ఎవరిచ్చినా. ఏ దేశంలోనైనా, కాలంతో పాటు భాష తీరుతెన్నులు మారడం సహజం. కానీ, ఈ మార్పులను ఏ తరానికాతరం గమనించుకోవాలి. భాషను నిలబెడుతున్నవేవో, పతనానికి గురిచేస్తున్నవేవో చర్చించుకొని వాటిని నమోదు చేయడం, భావి తరాలకు భాష పట్ల మెలకువను, జాగరూకతను మప్పుతాయి. తెలుగు భాష స్థితి నానాటికీ దుర్భరంగా తయారవుతోందని అందరూ ఒప్పుకుంటున్నా, దానికి కారణాలు వెదికి విశ్లేషించే దిశగా ఎవరూ అడుగులు…
ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (1944-2019):'నా లోపల విశ్వమంత ఆమ్రవృక్షం ఎడతెగని పరాగపవనాన్ని శ్రుతి చేస్తుంటే, గానంగా కరిగిపోయే కోకిలాన్ని, ఏకాంత ఢోలాఖేలనం ఎప్పటికీ ఇష్టం నాకు' అంటూ తన ప్రవృత్తిని కవిత్వంలో ప్రకటించుకున్న సాహితీవేత్త ఇంద్రగంటి శ్రీకాంతశర్మ తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో జన్మించారు. కవులు, పండితులు అయిన తండ్రి శ్రీ ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రిగారి సాహిత్య వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కవిత్వమంతా రాజకీయమయమై, నిరసననూ, పోరాటాన్ని ప్రతిపాదించనిదంతా అకవిత్వంగా చూపించబడుతోన్న రోజుల్లో, ఒక సాహిత్య ప్రక్రియను ఈ తీరున అడ్డుగోడల…
'నీ జీవితం కాలిపోతుంటే మిగిలే బూడిదే కవిత్వం’ అని కెనేడియన్ కవి, గాయకుడు లెనార్డ్ కోహెన్ అంటాడు. కె. సదాశివరావు వ్రాసిన చలిమంటలు అనే కథలో రచయిత పరంజ్యోతి, తన రచనలేవీ ఎక్కడా ప్రచురించడు. అతనితో వ్యక్తిగత పరిచయం ఉన్న వారికి తప్ప అతని ప్రజ్ఞ మిగతా లోకానికి తెలియదు. అలాంటి వారి ద్వారా పరంజ్యోతి గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయిన తరువాతి తరం రచయిత ఒకడు, అతన్ని వెదుక్కుంటూ వెళతాడు. తన కవితలను వినాలనీ, పదిమందికీ తెలియజేయడానికి…
ఏ ఏటికాయేడు ఇబ్బడిముబ్బడిగా కథలు, కవిత్వ సంకలనాలు ప్రచురింపబడటం తెలుగునాట రానురానూ రివాజుగా మారుతోంది. ఊరికొకరుగా వెలిసి సాహిత్యాన్ని తమ భుజాల కెక్కించుకు మోస్తున్నామని చెప్పుకోడం చూపించుకోడం మొదలయ్యాకే మన సాహిత్య ప్రమాణాలు ఏ ఎత్తులో ఉన్నాయో మరీ స్పష్టంగా అందరికీ తెలిసి వస్తోంది. పేరు పొందిన కథా/కవిత్వ సంకలనాలు ఏవి తీసుకున్నా అందులో చేర్చబడని కథల/కవితల చర్చ అనివార్యంగా వాటితో జతపడి ఉంటుంది. కానీ, నిజానికి అసలు సమస్య అది కాదు. ఎంపిక చేయబడుతున్న రచనలూ…
ఈనాడే పుట్టిందీ కాదు, ఈ ఏటితోనే పోయేదీ కాదు. ఎవరు మహాకవి? ఎవరు ఎందుకు కాదు? అన్న చర్చలు సమయసందర్భాలతో నిమిత్తం లేకుండా తెలుగు సాహిత్య సమూహాలలో ఉండుండీ అలజడి రేపడానికి కారణం లేకపోలేదు. మనకు కవిత్వాన్ని (ఆ మాటకొస్తే ఏ సాహిత్య ప్రక్రియనైనా) చదివి అర్థం చేసుకోవడం కన్నా ముందే, అది రాసిన కవిని, ఆ కవిత్వాన్ని ఒక వాద-భావ-వర్గ ప్రాతిపదికలపై ఒక మూసలో పడేయడం మీద మోజు ఎక్కువ. కవిత్వం పలికించిన స్వరం కన్నా,…
ఏ కొద్దిమందో ఉంటారు. వారి భావాలు, ఆశయాలు, ఎంచుకున్న దారులు వంటివాటితో మనకు మమేకత ఉండకపోవచ్చు. పైపెచ్చు విరోధమూ ఉండవచ్చు. కాని, వారిని మనస్ఫూర్తిగా గౌరవించకుండా ఉండలేం. తమ ఆశయం పట్ల వారికున్న నిబద్ధత, అది సాధించడం కోసం చేసే నిరంతర పోరాటం, అహోరాత్రాలు జ్వలించిపోయే తపన, ప్రాణాలైనా అర్పించగల త్యాగశీలత, వారిని ప్రత్యర్థులు కూడా గౌరవించేట్టు, అభిమానించేట్టు చేస్తాయి. అలాంటి కొద్దిమందిలో ఒకరు శివసాగర్ అనే పేరుతో ప్రసిద్ధికెక్కిన కంభం జ్ఞానసత్యమూర్తి (15 జులై, 1931…
కథ అంటే ఏమిటి? దాని లక్షణాలేమిటి? అన్న ప్రశ్నలకు ఇప్పటిదాకా ఏ సాహిత్య సమాజమూ స్పష్టమైన సమాధానమివ్వలేదు. రచయితలు, విమర్శకులు వారి భావాలు, వాదాలు, అభిప్రాయాలను బట్టి తమకు తోచినట్టుగా ఈ ప్రశ్నలకు స్థూలంగా, అస్పష్టంగా కవితాత్మకమైన వివరణలను ఇచ్చుకున్నారు తప్ప సరైన సమాధానాలను ఇవ్వలేకపోయారు. నిర్దిష్టత లేని వివరణలు కేవలం వర్ణనలే అవుతాయి తప్ప నిర్వచనాలు కాబోవు. వాటి ఆధారంగా సాహిత్యలక్షణ చర్చలు జరగలేవు, జరపకూడదు. ఇది కథ ఎలా అయింది? అన్న ప్రశ్న లాగానే,…
ఈమాట జులై 2007 సంచికతో మొదలై నిరాఘాటంగా షుమారు పన్నెండేళ్ళు సాగిన నాకు నచ్చిన పద్యం శీర్షిక అనివార్య కారణాల వల్ల వచ్చే సంచిక నుండీ ఆగిపోతున్నదని చెప్పడానికి చింతిస్తున్నాం. కేవలం ఒక పద్యానికి అర్థం చెప్పడమే కాదు, ఆ పద్యం ఎందుకు మంచి పద్యమో, అందులో కవి గొప్పతనమేమిటో, ఇలా వివరించి చెప్తూ పద్యకవిత్వపు లోతులని నేటి పాఠకులకు అందజేయడం ద్వారా వారికి పద్యాన్ని, తద్వారా కవిత్వాన్ని చదవడం ఎలాగో కూడా తెలియజెప్పిన శీర్షిక ఇది.…
సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ (1887-1950): యావత్ప్రపంచంలో పేరెన్నిక గన్న రచయితల పంక్తిలో నిలబడవలసింది పోగా, జీవిత కాలంలో ఇంచుమించు విస్మృతుడైపోయి తనను తాను 'అనామకుడిగా ప్రసిద్ధుడ'నని వర్ణించుకున్న సిగిౙ్మండ్ క్రిజ్‌జనావ్‌స్కీ, తన కథలను బ్రతికుండగా ప్రచురణలో చూసుకోలేకపోయాడు. అతని కథలను స్టాలినిస్ట్ ప్రభుత్వం ప్రచురించనీయక పోవడంతో బ్రతికి ఉండగా అతను ఒక రచయిత అన్న సంగతి సాటి రచయితలతో సహా ఎవరికీ తెలియరాలేదు. ఒక ఇరుకైన గదిలో ఒంటరిగా అతను తన కథలనే అద్భుతలోకాలు సృష్టించాడు. వాస్తవంలో సాధ్యం…
ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు! మెకాలే విధానాల వలన తెలుగు పరిపాలనా భాషగా కాకుండా పోవడంతో ఇంగ్లీషు భాష ప్రాచుర్యం పెరిగి తెలుగుకు ఆదరణ పోయింది. ఆపైన కొంత కాలానికి లార్డ్ కర్జన్ విశ్వవిద్యాలయాలలో ఇంగ్లీషులో చదువుకుంటున్న వారివల్ల వారి వారి ప్రాంతీయ భాషలకు ఏ ఉపకారమూ జరగటం లేదని గమనించి స్కూళ్ళల్లో కాలేజీల్లో ప్రాంతీయభాషలకు ప్రాధాన్యం కల్పించాలని తీసుకున్న నిర్ణయం తెలుగు దగ్గరికి వచ్చేసరికి, లాక్షణిక-గ్రామ్య/గ్రాంథిక-వ్యావహారిక భాషావివాదంగా దారి తప్పి ఇప్పటికీ సరిబాట పట్టలేదు.…
ఫహెశ్! సాదత్ హసన్ మంటో రచనాజీవితాన్ని వెంటాడి, వేటాడిన ఒకే ఒక్క పదం. అర్థం: అశ్లీలం. అసభ్యం, కుసంస్కారం, మతానికి వ్యతిరేకం లాంటి పదాలకి తెరతీసే పదం. మంటో ఆ ఒక్క పదం కారణాన ఎన్నో యుద్ధాలు చేయవలసి వచ్చింది. కోర్టుల చుట్టూ తిరగవలసి వచ్చింది. తన రచనలను తానే సమర్థించుకోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇంతకీ అతని నేరమేమిటి? తనచుట్టూ ఉన్న సమాజాన్ని ఏ కోణం నుంచి, ఏ దృష్టి నుంచి చూశాడో అదే దృష్టిని, అదే…
(అడగ్గానే బొమ్మలు గీసి ఇచ్చిన అన్వర్‌కు బోలెడన్ని కృతజ్ఞతలు బోలెడంత ప్రేమతో - సం.)ఈ సంచిక ఈమాట ఇరవయ్యవ జన్మదిన సంచిక. ఈమాట ఇన్నేళ్ళుగా కేవలం నడవలేదు. ఇరవై ఏళ్ళుగా ఇంతింతై ఎదిగింది. రెక్కలుగట్టుకు ఎగిరింది. అమెరికా తెలుగువారికోసం ప్రాణం పోసుకున్న ఒక చిన్న ప్రయత్నం ఈరోజు ఎల్లలు లేని ప్రపంచపు తెలుగు పత్రికగా మూర్తిమంతమయింది; ప్రపంచవ్యాప్తంగా పాఠకుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ తెలుగు సాహిత్యరంగంలో తనకంటూ ఒక ఉనికిని, ఒక గౌరవాన్ని సంపాదించుకుంది. ఇందుకు కారణం…
తెలుగునాట తెలుగు చదవడం రాయడం అటుంచి సరిగ్గా మాట్లాడడం కూడా అరుదైపోతున్న ఈ రోజుల్లో, ఎక్కడో అమెరికాలోని డెట్రాయిట్ నగరంలో కొందరు పుస్తకాలు చదవడం ఇష్టం ఉన్నవారు కలుసుకోవడం, తాము చదివిన కథలూ నవలలూ కవితల మంచీచెడ్డలు మాట్లాడుకోవడం, ఆపైన ఆ ఆసక్తి, అభిరుచులే డిట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ పేర ఎదిగి ఒక సంస్థగా మారి అమెరికా తెలుగు ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడమే కాక, ఇరవై యేళ్ళు నిరాఘాటంగా నడవడం అసామాన్య…
ఇటాలియన్ ఆపెరాలను తెలుగు యక్షగానాలుగా పునఃరచించే బృహత్ప్రయత్నంలో తిరుమల కృష్ణదేశికాచార్యుల రెండవ రచన ప్రచ్ఛన్న పరిణయము. ఇల్ మాత్రిమోనియో సెగ్రెతో (రహస్య వివాహం) అన్న పేరుతో ఈ ఆపెరా మొదటిసారి 1792లో వియెన్నాలో ప్రదర్శింపబడినప్పటినుంచీ ఇప్పటికీ ప్రేక్షకాభిమానాన్ని నోచుకుంటూనే ఉంది. ఒక ఆంగ్లనాటకాన్ని ఆధారంగా చేసుకొని జొవాన్ని బెర్తాతి రచించిన ఈ రూపకాన్ని ప్రముఖ సంగీత కర్త దొమీనికో చిమరోసా స్వరబద్ధం చేశాడు. ఆయన స్వరబద్ధం చేసిన ఎనభైకి పైగా రూపకాలలో ఇది అత్యంత ప్రాచుర్యం పొంది,…
స్వేచ్ఛాభారతంలో ఇంకొక రోజు, ఇంకొక దౌర్జన్యపర్వం. ఈసారి మళయాళ రచయిత హరీశ్‌పై దాడులు. కారణం? షరా మామూలుగానే మనోభావాలు గాయపడటం. మా స్త్రీలను అవమానించేలా నీ నవలలో ఒక పాత్ర మాట్లాడింది కాబట్టి నీ భార్యాబిడ్డలను బలాత్కారం చేస్తాం, నీ చేతులు నరికేస్తాం అని బెదిరింపులు. ఈ రకమైన న్యాయం మధ్యప్రాచ్య తాలిబన్లకూ, మనదేశపు ధర్మగంగబిందువులకూ మాత్రమే సబబనిపిస్తున్నట్టుంది. ఇది భౌతికమైన దాడి. ఇక రెండవది, మానసికమైన దాడి. ఒక రచన ఆధారంగా రచయిత నైతికత, శీలం…
కళా సృజన అడవినుండి రాజాస్థానాలకు వెళ్ళిననాటినుండీ బహుశా దానికి వాణిజ్య విలువ ఏర్పడింది. రాజులు, జమీందారులూ పోయాక అది చాలా వరకూ పడిపోయింది. ఆ తర్వాత ప్రజాస్వామ్య యుగంలో, మానిటరీ బెనిఫిట్ స్థానంలో జనాదరణ వచ్చి కూర్చుందని చెప్పవచ్చు. దానికి మూలసాధనం ప్రచారసాధనాలయ్యాయి. అవి టెక్నాలజీతో మరింత ఎక్కువై, ఇంటర్నెట్ వచ్చాక బ్లాగుల్లో ఇన్‌స్టంట్ ప్రతిస్పందన నుంచి, ఇప్పుడు సోషల్ నెట్‌వర్కింగ్ ద్వారా అత్యంత వేగంగా ఎక్కువమంది జనాలకి ప్రచారం కావడం వరకూ వచ్చింది. ఇదొక అద్భుత…
సాంస్కృతికంగా బలమైన సమాజాల్లో ప్రతీ తరం రాబోయే తరాలకు బహుముఖీనమైన కళావారసత్వాన్ని ఇచ్చి వెళ్ళడం, ఆ నీడన కొత్త తరాలు తమ ఆలోచనలను రూపు దిద్దుకోవడం పరిణామక్రమంగా జరిగే విషయం. ఆ వారసత్వం లేని సమాజం ఎక్కువకాలం ఉండలేదు. తెలుగులో సాహిత్యసంగీతాది కళలలో లబ్ధప్రతిష్టులైన ఎందరో కళాకారులు నిన్నటి యువతరానికి తమ వారసత్వాన్ని అందించి పడమటిగూటికి చేరుకుంటున్నారు. వారికి వారి కళ పట్ల ఒక స్పష్టమైన జ్ఞానం, కళలకు లక్షణాలే కాని కచ్చితమైన నిర్వచనాలు ప్రయోజనాలు ఉండవన్న…