ఈమాట పాఠకులకు కన్నెగంటి చంద్రను కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కథయినా, కవితయినా, చంద్ర పేరు చూడగానే చేస్తున్న పనులన్నీ ఆపేసి వెంటనే చదివే పాఠకులం ఎందరమో. అలాంటి చంద్ర, అక్షరం మనసు తెలిసిన చంద్ర, తన రచనల నుంచి ఏమీ ఆశించకుండా నిరాపేక్షగా చావో బతుకో వాటి మానాన వాటిని విడిచిపెట్టే చంద్ర, ఒకానొకప్పుడు పృథివ్యాపస్తేజోవాయురాకాశములైన పంచభూతాల వంటి ఐదు కవితలు రాశాడు తెలుసాలో – మట్టి, వాన, మంట, గాలి, మబ్బులు, అంటూ! ఆ కవితలు చదివి వేలూరి అందరినీ, ఇప్పుడైనా చూడండి చంద్ర ఎందుకు మంచి కవో అని చెప్తూచెప్తూనే, ఆర్కైవుల్లో ఆ ఐదు కవితలూ వెతుక్కుని చదువుకుని దాచిపెట్టుకున్నాం కూడానూ. ఆతర్వాతెప్పుడో చంద్ర కవితలను వాన వెలిసిన సాయంత్రం అనేసి హడావిడిగా పుస్తకం చేసినప్పుడు వేలూరి ఈమాటలో వాటి గురించి మరోసారి గుర్తు చేశారు కూడానూ. ఏమైతేనేం, ఆ ఐదు కవితలూ మీకు పరిచయం చేయడం కోసం, పోనీ ఆ సాకుతో మీతో కలిసి మేమూ మరోసారి చదవడం కోసం ఈ సంచికలో ప్రచురిస్తున్నాం.

తాము చేసే పని మీద శ్రద్ధాసక్తులు, తమ పనితనం పట్ల గౌరవము, గర్వము, అభిమానమూ లేనివారి పని ఫలితాలు ఎంత నాసిరకంగా ఉంటాయో చెప్పడానికి మన తెలుగు ప్రచురణారంగం ఒక చక్కటి ఉదాహరణ. తెలుగులో ఇప్పటికీ, ఇన్నేళ్ళ తరువాత కూడా మనం గర్వంగా చెప్పుకోదగిన ప్రచురణ సంస్థలు లేవు. విషయం ఏదైనా పుస్తకం కూడ ఒక వస్తువే. దానికీ నాణ్యతా ప్రమాణాలు ఉంటాయి. ప్రచురణ అంటే కేవలం అచ్చేయడం కాదనీ, ఒక మంచి పుస్తకం అనేది శ్రద్ధతో అభిమానంతో రూపు దిద్దితేనే సాధ్యమనీ, అవి లేకపోవడమే మన ప్రచురణ సంస్థల ప్రస్తుత పరిస్థితికి కారణమనీ, తమ వ్యాసం తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలులో శ్రీనివాస్, నాగరాజు, నారాయణరావు తమ అభిప్రాయాలను సోదాహరణంగా వివరిస్తున్నారు. అంతే కాదు, ప్రస్తుతం తమ పుస్తకాలు తామే ప్రచురించుకునే ఔత్సాహికులకు ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలో వివరిస్తున్నారు కూడా.
 
తెలుగు గ్రంథాలలో అత్యంతకఠినమైనవాటిలో అగ్రగణ్యంగా, వసుచరిత్రం కంటే దుర్లభమైనదిగా పరిగణించబడే గ్రంథం, 16వ శతాబ్దిలో జటప్రోలు సంస్థానాన్నేలిన సర్వజ్ఞ సింగభూపాలుని వంశీకుడు, రామరాజభూషణునికి సమకాలికుడు అయిన సురభి మాధవరాయలు రచించిన చంద్రికాపరిణయముఅనే మహాప్రబంధం. ఈ గ్రంథానికి కొల్లాపురసంస్థానపండితులైన బ్రహ్మశ్రీ వెల్లాల సదాశివశాస్త్రి, అవధానం శేషశాస్త్రులవారు వ్రాసిన టీకాతాత్పర్యసహితవ్యాఖ్యానంతో కూడిన ప్రతి ఆఖరిముద్రణ 1928లో. ఆ ప్రతి ఇప్పుడు అలభ్యం. అపురూపమైన ఆ ప్రతి సాధించుకుని, షుమారు ఏడు వందల పేజీలు అక్షరం అక్షరమూ అచ్చుతప్పులు దిద్దుకుంటూ, కేశవపంతులు నరసింహశాస్త్రి, శ్రీరంగాచార్యులవారి ఉపోద్ఘాతములు జత చేస్తూ, యూనీకోడ్‌లో తిరగ వ్రాసి ఈమాట గ్రంథాలయం కోసం అందచేశారు తిరుమల కృష్ణదేశికాచార్యులు. వారి అద్వితీయమైన శ్రమకు, ప్రాచీన సాహిత్యం పట్ల వారి నిబద్ధతకూ ఈమాటనుంచి వారికి హృదయపూర్వక అభినందనలు.

డా. పుల్లెల శ్రీరామచంద్రుడు (24 అక్టోబర్ 1927 – 24 జూన్ 2015): సంస్కృతాంగ్లాంధ్రహిందీ భాషలలో, వేదాంత వ్యాకరణ అలంకారశాస్త్రాలలో అద్వితీయమైన పాండిత్యప్రతిభతో నూటయాభైకి పైగా పుస్తకాలు వ్రాసి, సంస్కృతభాష నుండి ఎన్నో క్లిష్టమైన రచనలను తెలుగు లోకి అనువాదం చేసిన కవి, రచయిత, లాక్షణికుడు, విమర్శకుడు, అలంకారికుడు, వైయాకరుణి, నైఘంటికుడు, సంస్కృతాంధ్ర భాషాసాహిత్యాలకు ఇతోధికంగా సేవ చేసిన మహనీయుడు, డా. పుల్లెల శ్రీరామచంద్రుడు ఇక లేరు. 1927లో జన్మించిన శ్రీరామచంద్రుడు హిందీ, ఇంగ్లీష్, సంస్కృత భాషల్లో బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీలను, సంస్కృతంలో ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పట్టాను సాధించారు. ప్రతిపదార్థాలతో, విశ్లేషణాసహితంగా వాల్మీకి రామాయణానికి చేసిన పది సంపుటుల చక్కటి తెలుగు అనువాదం ఆయన ప్రతిభకు ఒక చిన్న నిదర్శనం మాత్రమే. ఆనందవర్ధనుడి ధ్వన్యాలోకం, భరతుడి నాట్యశాస్త్రం, ఉపనిషత్తులు, రాజశేఖరుడి కావ్యమీమాంసా, పతంజలి యోగసూత్రం, కౌటిల్యుని అర్థశాస్త్రం, మమ్మటుడి కావ్యాదర్శం, బ్రహ్మసూత్ర శంకరభాష్యం, ఇలా ఎన్నో సంస్కృత గ్రంథాలను అందరికీ అర్థమయేలా అనువాదం చేసి శ్రీరామచంద్రుడు తెలుగువారికి ఎనలేని మేలు చేశారు; అలంకారశాస్త్ర చరిత్ర, ప్రాకృతభాషాసాహిత్యచరిత్ర వంటి గ్రంథాలతో తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టం చేశారు. వైజ్ఞానికశాణ్ముఖమ్, కో వై రసః, పాశ్చాత్యతత్వశాస్త్రేతిహాసః, పారసీకలోకోక్తయః, తదితర సంస్కృత రచనల ద్వారా దేశవ్యాప్తంగా గౌరవం అందుకున్న పండితుడు, సంస్కృతాంధ్రభాషాభివృద్ధి కోసం జీవితాంతమూ కృషి చేసిన మహామహోపాధ్యాయుడు అయిన శ్రీరామచంద్రుడికి 2011లో పద్మశ్రీ పురస్కారం ఇచ్చి కేంద్రప్రభుత్వం సత్కరించింది. నిగర్వి, సహృదయుడు అయిన ఆయన మరణం తెలుగుసాహిత్యం పూడ్చుకోలేని ఒక పెద్ద లోటు.

కోనసీమని తలచుకుంటే ఇప్పటికీ కొబ్బరి తోటలు, కాలువలు, పచ్చని పొలాలు – ఇవే గుర్తొస్తాయి. ఈ సీమ నుంచి బయటపడి ఇంగ్లీషు చదువులు చదువుకుని పైకొచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నా కానీ, వేదపారాయణులు, నిత్యాగ్నిహోత్రులు అయిన అతి కొద్దిమంది బ్రాహ్మణులు ఈ ప్రాంతంలో ఇంకా వున్నారు. భమిడిపాటి వారు, బులుసు వారు, దువ్వూరి వారు, పుల్లెల వారు, ఇలా. వేదపఠన పాఠనాన్ని , యజ్ఞయాగాదులని శాస్త్రోక్తంగా నిర్వహించుకుంటూ ఈ కుటుంబాల వాళ్ళు మూడువేల ఏడువందల సంవత్సరాల వైదిక సంప్రదాయాన్ని నిలబెట్టారు. ఇది మానవ జాతి చరిత్రలోనే అపూర్వమైన విషయం. వీరిని క్షుణ్ణంగా పరిశీలించి సూక్ష్మమైన వివరాలతో సహా, విస్కాన్సిన్ విశ్వవిద్యాలయపు ఆచార్యుడు డేవిడ్ నైప్ (David M. Knipe) Vedic voices – Intimate narratives of a living Andhra tradition (2015) అనే ఒక పుస్తకం రాశారు. కేరళ నంబూద్రి బ్రాహ్మణుల అతిరాత్ర అగ్నిచయన క్రతువుని ఫ్రిట్స్ స్టాల్ (Frits Staal)వివరంగా రెండు పుస్తకాలు, ఒక చలనచిత్రంగా భద్రపరిచాడు. ఇప్పటికీ వైదిక సంప్రదాయాన్ని గురించి పాఠాలు చెప్పే తరగతుల్లో వీటిని వాడుతూ వుంటారు. కానీ, వైదిక బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి గుర్తింపు ఇప్పటి దాకా లేదు. నైప్ పరిశోధన ద్వారా ఆ సంప్రదాయాల నిర్వికార ప్రాచీనత గురించి వివరంగా తెలుస్తుంది. వైదిక సంప్రదాయాన్ని గురించి ఇతర ఆధారాలతో రాసిన పుస్తకాలు చాలా వున్నాయి కానీ ఇప్పటికీ వున్న వైదిక కుటుంబాల దైనందిక జీవితాన్ని పరిశీలించి వివరంగా రాసిన పుస్తకం ఇదొక్కటే.


డా. ఉపాధ్యాయుల అప్పల నరసింహ మూర్తి (1944 – 2015): నరసింహ మూర్తిగారు చక్కటి సాహిత్య విమర్శకుడు, గొప్ప వక్త కూడా. ఇతర భారతీయ భాషల ఆధునిక నాటకాలతో పోల్చి, మూర్తిగారు రాసిన కన్యాశుల్కం – తులనాత్మక పరిశీలన అన్న బృహద్గ్రంథం వారికెంతో పేరు తెచ్చింది. ఔచిత్యప్రస్థానం, కథాశిల్పి చాసో, కవిత్వదర్శనం మొదలైన పుస్తకాలు ప్రచురించారు. రబీంద్రనాథ్ టాగోర్ నేషనల్ ఫెలోషిప్ అందుకున్న ఏకైక తెలుగువాడు, ఇటీవలే పరమపదించిన ఈ సాహితీవేత్తకు ఈమాట శ్రద్ధాంజలులు.

ఒక సమాజపు ఔన్నత్యం, ఆ సమాజం తన స్త్రీలు, పిల్లలు, వృద్ధులతో ఎలా ప్రవర్తిస్తుంది అన్న అంశంపై ఆధారపడి వుంటుందని వాడుక. వీరితో మనం ప్రస్తుతం ఎలా ప్రవర్తిస్తున్నామో మనకూ తెలుసు. ఇప్పుడు ఈ జాబితాలో మనదేశపు రచయితలనూ కళాకారులనూ చేర్చవలసి రావడం దౌర్భాగ్యం. సంస్కృతి పేరుతో స్త్రీల పైన, మనోభావాలు దెబ్బ తింటున్నాయన్న నెపంతో రచయితలు, కళాకారుల పైన, తమ ఆత్మన్యూనతను కప్పి పుచ్చుకునేందుకు ఈ సంస్కృతీరక్షకుల దౌర్జన్యం రానురానూ దుర్భరమవుతున్నది. వీరికి మాత్రమే సమాజపు మంచీ చెడూ తెలుసు, వీరు ఒప్పుకున్నవే విలువలు, కేవలం వీరే నైతికధర్మాధికారులు, వీరిని వీరే ఎన్నుకుంటారు. సృజనకూ అభిప్రాయ వ్యక్తీకరణకూ స్వేచ్ఛ ఇవ్వని సమాజమూ విమర్శను తీసుకోలేని సంస్కృతీ పతనానికే దారి తీస్తాయని వీరు గ్రహించరు. ఈ రకమైన ప్రవర్తనలో వీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారో స్పష్టంగానే కనిపిస్తుంది. మనవారు రాయని శాస్త్రం లేదని, ప్రవచించని సత్యం లేదని, కనిపెట్టని విజ్ఞానం లేదని, మనల్ని మనం మభ్యపెట్టుకుంటూ అబద్ధాల చరిత్రలు రాసుకున్నంత మాత్రాన మన సమాజం, సంస్కృతి ఉన్నతమైనవి అయిపోవని, మన ఔన్నత్యం కేవలం మన ప్రజాస్వామ్యపు విలువలని కాపాడుకోవడం లోనే ఉందనీ వీరు గ్రహించరు. సంస్కృతీసాంప్రదాయాల పరిరక్షణ ముసుగులో వీరు చేస్తున్న అఘాయిత్యాలు కేవలం వీరి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే. ఈ రకమైన నిర్బంధాలు మానవ చరిత్రలో కొత్త కాదు. కాలం నిదానంగా అయినా సరే, నిష్పక్షపాతంగానే నిజాన్ని వెలికితీస్తుంది. చరిత్రలో ఇంతకు ముందు ఇదేవిధంగా ఎందరో ఉగ్రవాదులను పంపిన దారినే వీరినీ పంపుతుంది. రక్షణ కోసం స్వాతంత్ర్యాన్ని త్యాగం చేసిన మనిషి ఆ రెంటికీ అర్హుడు కాడని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్నట్టు, ఇలాంటి ప్రతికూలత ఎదురైనప్పుడల్లా ఎవరికీ తల ఒగ్గకుండా మన స్వేచ్ఛను నిర్భయంగా ప్రకటించుకుంటూ వుండడమే మనం చేయగలిగిందీ చేయాల్సిందీ.

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఆలన్ ట్యూరింగ్(23 జూన్ 1912 – 7 జూన్ 1954): కంప్యూటర్లు మన జీవితాలని ఊహించని విధంగా మార్చేశాయి. మన ఆలోచనలని, అనుభవాలని, మన విద్యవైద్యావైజ్ఞానిక విధానాలకు, పరిశోధనలకు మునుపెన్నడూ లేనంత ఊతం ఇచ్చాయి, మన ప్రస్తుత కాలాన్ని సాంకేతిక యుగం అని పిలుచుకునేంతగా కంప్యూటర్లు మానవాళిని ప్రభావితం చేశాయి. ఐతే, వీటి ఆవిర్భావానికి ట్యూరింగ్ మెషీన్ అని పిలవబడే ఒక ఆలోచన, ఒక యంత్రం కాని యంత్రం ఆధారం అని, అది ఎంత తేలికైన, అద్భుతమైన ఆలోచనో తెలుసుకున్నవారు విస్మయానికి గురి కాకతప్పదు. అందుకు ఆద్యుడైన ఆలన్ ట్యూరింగ్ గురించి కంప్యూటర్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు అనే శీర్షిక క్రింద కొడవళ్ళ హనుమంతరావు కొంత విరామం తరువాత రాసిన వైజ్ఞానిక వ్యాసం; వాణి నా రాణి అని ఠీవిగా చాటుకున్న పిల్లలమర్రి పినవీరభద్రుడు జైమినీ భారతాన్ని రాసిన ఉదంతాన్ని చక్కటి కథగా మలచిన తిరుమల కృష్ణదేశికాచార్యుని పద్యనాటిక, ఈ సంచికలో.


ఇంకా: మానస, స్వాతికుమారి, నారాయణ, ఇంద్రాణిల కవితలు; శ్యామలాదేవి, సుబ్రహ్మణ్యం, ఆర్ శర్మ, సాయి బ్రహ్మానందం కథలు; మోహన రావు, కామేశ్వరరావు, మానసల వ్యాసం, శీర్షిక, సమీక్షలు; శ్రీనివాస్ సమర్పిస్తున్న రేడియో నాటకం, లలిత గీతాలు…

తమ అనుభవాలు ఆలోచనలు భావుకతతో బాధతో ఆవేశంతో ప్రేమతో పదిమందికీ పంచుకుందామనీ, సమాజానికి దిశానిర్దేశనం చేద్దామనీ, కవిగా గొప్ప పేరు తెచ్చుకుందామనీ ఎందరో ఉత్సాహపడుతుంటారు. కానీ వీరికి ఇప్పటిదాకా ఆచరణలో పెట్టగలిగే సూచనలిచ్చి వారిని ప్రోత్సహించే దిశగా ఏ ప్రయత్నమూ లేకపోవడం విచారకరం. సాహిత్యంపై తన అపోహలను బాహాటంగా ఒప్పుకుంటూ, వాటికి ప్రాయశ్చిత్తంగా కవి కావాలనుకునే వారు వెంటనే పాటించగలిగే సూచనలిస్తూ మాధవ్ మాౘవరం రాసిన బోధనాత్మక సోదాహరణ వ్యాసం కవి కావడం ఎలా? కొన్ని ప్రాక్టికల్ సూచనలు ఈ సంచికలో. ప్రాచుర్యంలో ఉన్న కొన్ని కవిత్వ పద్ధతులతో పాటుగా కవిత్వం నిజంగా ఏమిటి, కవి ఏర్పరచుకోవలసిన లక్షణాలు, కవిగా కొనసాగడం ఎలా? వంటి ఉపయుక్త అంశాలు కూడా ఈ వన్‌స్టార్ గైడ్ లాంటి వ్యాసంలో చర్చించబడ్డాయి.


ఇంకా: ప్రసాద్, మానస, తఃతః, రవిశంకర్‌ల కవితలు; ఆర్ శర్మ, శివకుమార శర్మ, శ్యామలాదేవిల కథలు; వేంకటేశ్వర రావు, మురళీధరరావు, వేంకటేశ్వరరావుల వ్యాసాలు; కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం శీర్షిక; శ్రీనివాస్ సమర్పిస్తున్న కట్టమంచి రామలింగారెడ్డి, వేదుల సత్యనారాయణ శర్మల ఆడియో ప్రసంగాలు…

చేకూరి రామారావు (1 అక్టోబర్ 1934 – 24 జులై 2014): చేరాగా సుపరిచితమైన భాషాశాస్త్రవేత్త ఆచార్య చేకూరి రామారావు ఇక లేరు. నోమ్ చామ్‌స్కీ భాషాసిద్ధాంతాలని తెలుగు భాషకు అనువర్తించి చేసిన పరిశోధనలకు కార్నెల్ యూనివర్సిటీ నుండి భాషాశాస్త్రంలో డాక్టరేట్ తీసుకున్న చేరా, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేశారు. భాషాశాస్త్ర పరిశోధకుడిగా తెలుగు వాక్యం, భాషాంతరంగం, భాషాపరివేషం వంటి ఎన్నో పుస్తకాలు వెలువరించారు. చేరాతలు శీర్షిక ద్వారా తెలుగులో ఎందరికో కవులుగా గౌరవం కల్పించారు. వచన పద్య లక్షణాలపై కోవెల సంపత్కుమారతో జరిపిన చర్చ ఎంతో ప్రసిద్ధమైంది. సాహిత్య విమర్శ, పరామర్శలలో తనదైన స్థానం ఏర్పరుచుకున్న చేరా 2002లో రాసిన స్మృతికిణాంకం సంకలనానికి కేంద్రసాహిత్య ఎకాడమీ అవార్డు లభించింది.
 
 

సత్తిరాజు లక్ష్మీనారాయణ (15 డిసెంబర్ 1933 – 31 ఆగస్ట్ 2014): బాపూ అన్న కలంపేరుతో తెలుగువారి గుండెల్లో గూడు కట్టుకున్న సత్తిరాజు లక్ష్మీనారాయణ తుది శ్వాస విడిచారు. సాక్షి, బాలరాజు కథ, ముత్యాలముగ్గు, సంపూర్ణ రామాయణం, సీతాకళ్యాణం, అందాల రాముడు, త్యాగయ్య, వంశవృక్షం, పెళ్ళి పుస్తకం, శ్రీరామరాజ్యం వంటి సినిమాల దర్శకుడు, బాపూరమణల పడుగూపేకలో పేక; బుడుగు, సీగానపెసూనాంబ, రాధా గోపాళం – ఇలా రమణ అక్షరానికి రూపమిచ్చిన గీతగాడు, రామభక్తుడు, మితభాషి, ప్రపంచంలో అగ్రశ్రేణి లైన్‌డ్రాయింగ్ ఇలస్ట్రేషనిస్టుల సరసన ఠీవిగా కూర్చున్న కొంటెబొమ్మల బాపూ ఇక మనమధ్య లేకపోయినా, తన చేతిరాతతో మన గుండెలపై చేసిన బాపూ సంతకం మాత్రం శాశ్వతంగా మనతోనే ఉంటుంది.
 
ఈ సంచిక ఇలా ఇద్దరు ప్రముఖుల మరణాలతో, ఒక ఉజ్వలమైన తెలుగు తరం క్రమంగా అస్తమిస్తున్నదన్న చేదునిజంతో విడుదల చేయవలసి రావడం మాకు ఎంతో బాధ కలిగిస్తున్న విషయం.

కవి బిల్హణుడు 11వ శతాబ్దపు కాశ్మీర కవి. చోరపంచాశికా అనే ప్రేమకవిత ద్వారా జగత్ప్రసిద్ధుడు. కావ్యకథనమైన ఈ కవి ప్రణయోదంతాన్ని ఒక చక్కటి పద్యనాటికగా సాహిత్యపునఃసృష్టి చేసిన తిరుమల కృష్ణదేశికాచార్యుల రచన, బిల్హణీయము; తెలుగు పద్యాలలో అన్నిటికన్నా ఎక్కువ భావక్లిష్టత ఉన్న పద్యంగా ఒక పద్యంపై తన నిర్ణయాన్ని వివరిస్తున్న ఏల్చూరి మురళీధరరావు వ్యాసం ఆంధ్రవాఙ్మయంలో అత్యంత ప్రౌఢమైన పద్యం!; కనకప్రసాద్ శబ్ద సాహిత్యం అమ్మా కనకమ్మా; ప్రముఖగాయకుడు, మాధవపెద్ది సత్యం ప్రత్యేక జనరంజని కార్యక్రమం, లలితగీతాల ఆడియోలు, ఈ సంచికలో…


ఇంకా: ఇంద్రాణి, సమవర్తి, మానస, శ్రీవల్లీరాధిక, కనకప్రసాద్, బివివి ప్రసాద్, మోహనరావుల కవితలు; సాయి బ్రహ్మానందం, ఆర్ శర్మ, శ్యామలాదేవిల కథలు; రమాసుందరి నవలాసమీక్ష; వేంకటేశ్వరరావు, మోహనరావుల వ్యాసాలు; ఛందం సాఫ్ట్‌వేర్ గురించి పరిచయం; కామేశ్వరరావు ధారావాహిక నాకు నచ్చిన పద్యం.

బ్రౌన్ దొర! తెలుగుభాషోద్ధారకుడు! తెలుగు భాషకు ఎనలేని సేవ చేసిన మహనీయుడు! కేవలం ఇలానే మనకు తెలిసిన సి.పి. బ్రౌన్‌ (ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్, 1798-1884) గురించి ఇప్పటికీ మనం వర్ణించుకుంటున్నాం. గడిచిన ఇన్నేళ్ళలో కవిపండితులు, మేధావులు మొదలుకొని విశ్వవిద్యాలయాల ఆచార్యుల దాకా ఇలా బ్రౌన్ గురించి వందిమాగధుల స్తోత్రాలు చదివిన వారే, పోటీలు పడి మరీ అతన్ని కీర్తించిన వారే కానీ, చారిత్రక దృష్టితో తెలుగు భాషలో బ్రౌన్ చేసిన పనులేమిటి, బ్రౌన్ ఉద్దేశాలేమిటి, తెలుగు భాషకు అతని సంస్కరణలవల్ల నిజంగా జరిగిన మేలేమిటి, కీడేమిటని అని ఒక్కరంటే ఒక్కరు కూడా ప్రశ్నించి పరిశోధించినవారు లేకపోవటం ఆశ్చర్యాన్నీ, మన దాస్యప్రవృత్తిపట్ల బాధనూ కలిగించే విషయం. ఈ రోజు ఆ ప్రశ్నలకు మొట్టమొదటిసారిగా ఒక సమాధానం దొరుకుతున్నది. గత కొన్నేళ్ళుగా విస్తృతంగా పర్యటించి, అసంఖ్యాకమైన సాహిత్య, చారిత్రక ఆధారాలను పరిశీలించి, బ్రౌన్ తెలుగు భాషలో చేసిన పని గురించి క్షుణ్ణంగా పరిశోధించి ఒక సమగ్రవ్యాసంగా మనకు పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావులు మనకు తెలియని బ్రౌన్‌దొర పేరుతో ఈ సంచికలో అందిస్తున్నారు. తెలుగు భాషాభిమానులు ప్రతి ఒక్కరూ చదవవలసిన ముఖ్యమైన వ్యాసం ఇది.


ఇంకా: నిషిగంధ, తఃతః, మానస, దేశికాచార్యులు, భాస్కర్, సమవర్తి, ఉదయకళల కవితలు; పూర్ణిమ, సాయి బ్రహ్మానందం, రాధ, ఆర్. శర్మ, చంద్ర, వేంకటేశ్వరరావుల కథలు; సుజాత, మానసల పుస్తక సమీక్షలు; సీతారాం, వేంకటేశ్వరరావు, మోహనరావు, మురళీధరరావుల వ్యాసాలు; రాజా ముఖాముఖి; సురేశ్, కామేశ్వరరావుల శీర్షికావ్యాసాలు పలుకుబడి, నాకు నచ్చిన పద్యం, పెండ్యాల జనరంజని ఆడియో, గ్రంథాలయంలో పెద్దక్కప్రయాణం పుస్తకం…

తమ మనోభావాలు గాయపడుతున్నాయని, తమ సంస్కృతిని అవమానించారని, ఇలా అర్థం లేని ఆరోపణలతో విద్యావేత్తలు, రచయితలు, కళాకారులపై జరుగుతున్న దాడులను సమర్థవంతంగా అడ్డుకోకపోగా, వ్యక్తిస్వేచ్ఛను మరింత నియంత్రించే విధంగా నాయకులు, ప్రభుత్వాలు ప్రవర్తించడం గర్హణీయం. నాగరిక సమాజంలో తమ అభివ్యక్తిని — అది ఎంత సమాజవ్యతిరేకమైనా సరే, నిర్భయంగా ప్రకటించే హక్కు ప్రతివారికీ నిర్ద్వంద్వంగా ఉండి తీరాలి; అంతే ముఖ్యంగా ఆ అభివ్యక్తాన్ని విమర్శించే హక్కు కూడా. విమర్శకు ఎవరూ అతీతులు కారు, కారాదు. కానీ, నిజాలని వక్రీకరించడం, ఒక పుస్తకాన్ని లేదా చిత్రాన్ని కనీసం చదవకుండా, చూడకుండా ఆందోళనలు చేయడం, వంటివి సహ్యమైన ప్రతిచర్యలు కావు. ఒక తాజా ఉదా. భారతదేశంలో పెంగ్విన్స్ ప్రచురణ సంస్థ ఇటీవలే అమ్మకాలు ఆపివేసిన ది హిందూస్: ఏన్ ఆల్టర్నేటివ్ హిస్టరీ, అన్న పేరుతో వెండీ డానిగర్ వ్రాసిన పుస్తకం. పెంగ్విన్స్ సంస్థను, డానిగర్‌ను, విమర్శిస్తూ మెయిన్‌స్ట్రీమ్ మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ ముమ్మరంగా అభిప్రాయాలు వెలివడ్డాయి, చర్చలు జరిగాయి. నింద, ప్రతినిందల ఈ అయోమయపు పరిస్థితిలో, ఆ వివాదపు పూర్వాపరాలను నిష్పక్షపాతంగా, సహేతుకంగా బేరీజు వేసి మనకు తన వ్యాసం ద్వారా వివరిస్తున్న సురేశ్ కొలిచాలను అభినందిస్తున్నాం.


30 మార్చ్ 2014 ప్రత్యేక ప్రచురణ: ఉగాది సందర్భంగా పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న లలిత గీతాలు: ఉగాది పాటలు.

ఇంకా: పూర్ణిమ, స్వాతికుమారి, రాధ, సోమ శంకర్, వేంకటేశ్వరరావు, ఆర్. శర్మ, సాయి బ్రహ్మానందంల కథలు; మానస, ఇంద్రాణి, భవానీ ఫణి, వైదేహి, యదుకులభూషణ్‌,దేశికాచార్యుల కవితలు; శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవ కవితాగానం, వారి జ్ఞాపకాలు, పరుచూరి శ్రీనివాస్ సమర్పణ; మురళీధరరావు, మోహన రావుల వ్యాసాలు; కనకప్రసాద్ శబ్దసాహిత్యం, కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం.
 
[గమనిక: ఈమాటలో శబ్దతరంగాలను ఇకపై Apple, Android టాబ్లెట్లలో కూడా వినగలిగే ఏర్పాటు చేశాము. పూర్తి స్థాయి మొబైల్ పోర్టబిలిటీ త్వరలోనే అందిస్తాము. – సం.]

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

ఈమాట నవంబర్ 2013 సంచికలో ప్రచురించిన ఏల్చూరి మురళీధరరావు సాహిత్యవ్యాసం పైన పాఠకులు ఆసక్తికరమైన అభిప్రాయాలు వ్యక్తపరిచారు. ఈ సంచికలో ఆ వ్యాసానికి ప్రతిగా తమ విమర్శలను వ్యాస రూపంలో జెజ్జాల కృష్ణ మోహన రావు, పరుచూరి శ్రీనివాస్ తెలియజేస్తున్నారు. ఇలా సాహిత్య వ్యాసాలపై స్పందనలు, ప్రతిస్పందనలు సామరస్యంగా తెలుపుకోవడం మాకెంతో సంతోషం కలిగిస్తున్నది. ముందు ముందు ఇలాంటి సాహిత్య చర్చలు మరెన్నో జరగాలని కోరుకుంటున్నాం. ప్రతి సంచికలో కొత్త రచయితలు ఈమాటను తమ రచనలకు వేదికగా చేసుకొనడం చూస్తుంటే ఈమాట మరింతగా ఎదుగుతోందని మాకు నమ్మకం కలుగుతోంది. నాకు నచ్చిన పద్యం, పలుకుబడి లాంటి శీర్షికలు, సాహిత్య పరిశోధనాత్మక వ్యాసాలు, ఆడియోలు ఈమాటకు వన్నె తెస్తున్నాయి. మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, అందిస్తున్న ప్రోత్సాహాలతో ఈ సాహితీప్రయాణం ఇలాగే కలకాలం సాగాలని ఆశిస్తున్నాం.


ఈ సంచికలో: మానస, భగవంతం, ఇంద్రాణి, కనకప్రసాద్, హెచ్చార్కె, నారాయణ, దేశికాచారి, ప్రసూన, భాస్కర్, అట్లూరి ప్రసాద్, తఃతః, బివివి ప్రసాద్‌ల కవితలు; మూలా సుబ్రహ్మణ్యం, బులుసు సుబ్రహ్మణ్యం, దమయంతి, సాయి పద్మ, ఆర్. శర్మల కథలు; సాయి బ్రహ్మానందం, మోహన రావు, శ్రీనివాస్, తలిశెట్టి రామారావుల వ్యాసాలు; కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం; సురేశ్ పలుకుబడి; శబ్దతరంగాలలో సాలూరి జనరంజని, చెలియలికట్ట రేడియో నాటిక. …

ఎస్. మీనాక్షిసుందరం (12 అక్టోబర్ 1913 – 13 ఆగస్ట్ 1968): గణితశాస్త్ర ప్రపంచంలో పేరెన్నిక గన్న ప్రతిభావంతులలో ఒకరైన ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం శతజయంతి సందర్భంగా ఆయన జీవితాన్ని పరిచయం చేస్తూ, గణితంలో ఆయన విశేషకృషిని వివరిస్తూ వాసుదేవరావు ఎరికలపూడి రాసిన శాస్త్రీయ వ్యాసం, ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షి సుందరం; నన్నెచోడుని కుమారసంభవంలో లలితాస్యాంబురుహంబు పద్యం గురించి మానవల్లి రామకృష్ణకవి విమర్శను ప్రస్తావిస్తూ ఆ వివాదం ఆ కావ్యపు కర్తృ – కాల నిర్ణయాలకు ఎలా మూలచ్ఛేదనం అయిందో వివరిస్తూ ఏల్చూరి మురళీధరరావు సాహిత్య వ్యాసం, నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన; నాగరాజు పప్పు, పరుచూరి శ్రీనివాస్ పరిశోధనాత్మక చారిత్రక వ్యాసం రెండవ భాగం, భారతీయ పుస్తక చరిత్ర: 2. రాత పుట్టుక, పరిణామం – భారతీయ లిపులు ఈ సంచికలో ప్రత్యేకం.


ఇంకా ఈ సంచికలో: పాలపర్తి ఇంద్రాణి, ఎలనాగ, మలినేని క్రాంతికుమార్, మానస చామర్తి, దాసరాజు రామారావు, జెజ్జాల కృష్ణ మోహన రావుల కవితలు; మాగంటి వంశీ మోహన్, తాడికొండ శివకుమార శర్మ, బులుసు సుబ్రహ్మణ్యం, ఆర్. శర్మ దంతుర్తి, లైలా యెర్నేనిల కథలు; జెజ్జాల కృష్ణ మోహన రావు, రాళ్ళపల్లి సుందరం, సురేశ్ కొలిచాలల వ్యాసాలు; భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం; శబ్దతరంగాలలో పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న మేఘసందేశం – సంగీత రూపకం తెలుగులో, చా.సో.తో ముఖాముఖీ; కనక ప్రసాద్ శబ్దసాహిత్యం…

ఈ సంచికతో ఈమాటను సాంకేతికంగా మరిన్ని సదుపాయాలు కలిగిన సరికొత్త వర్డ్‌ప్రెస్ లోకి మార్చాం. అందుకు అణుగుణంగా, పాఠకుల సౌకర్యం కోసంగా ఈమాట వెబ్‌సైట్‌లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశాం. పాఠకులందరికీ చిరపరిచితమైన ఈమాట వేషాన్ని మరికొంత మెరుగు పరిచాం; మీకు నచ్చిన రచనని మీ మిత్రులతో ఫేస్‌బుక్, గూగుల్+, ఈ-మెయిల్ ద్వారా వెంటనే పంచుకునే వీలు; ఒక రచయిత రచన చదివే పాఠకులకి ఆ రచయిత ఇతర రచనలు కనిపించే అమరిక; ముఖపత్రంలో పాత సంచికల నుండి కథలు, కవితలు, వ్యాసాలు ఎప్పటికప్పుడు యాదృచ్ఛికంగా కనపడే ఏర్పాటు; ఇలా ఎన్నో. త్వరలోనే మొబైల్ పరికరాలలో కూడా ఈమాటను చదువుకునే వీలు కల్పించడానికి కృషి చేస్తున్నాం. ఈ ప్రయత్నంలో మా ఊహలకి రూపాన్నిచ్చి, నవ్వుతూ మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించినందుకూ, ఇకనుంచి ఈమాట సాంకేతిక నిర్వహణా భారంలో పాలు పంచుకుంటున్నందుకూ అశ్విన్ బూదరాజుకి మా హార్దిక కృతజ్ఞతలు.


ఈమాట గ్రంథాలయంలో కొత్తగా మహాభారత యుద్ధ కథ తేలికపాటి వచనంలో; సామాన్యుల కథలు – కోళ్ళ మంగారం మరికొందరు. అపురూప శబ్ద తరంగాలు: తెలుగువారికి చిరపరిచితమైన రక్తకన్నీరు నాటకం; రెండు ఉగాది కవిసమ్మేళనాలు.
 
ఈ సంచికలో: మండువ రాధ, పాలపర్తి ఇంద్రాణి కవితలు; బులుసు సుబ్రహ్మణ్యం, వేలూరి వేంకటేశ్వర రావు, లైలా యెర్నేని, మండువ రాధ, ఆర్. శర్మ దంతుర్తి, ఆర్. దమయంతిల కథలు; పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, వాడ్రేవు చినవీరభద్రుడు, బండ్లమూడి స్వాతికుమారి, సురేశ్ కొలిచాల, జెజ్జాల కృష్ణ మోహన రావు, లక్ష్మన్న విష్ణుభొట్ల, వెల్చేరు నారాయణ రావుల వ్యాసాలు; భైరవభట్ల కామేశ్వరరావు నాకు నచ్చిన పద్యం…,

మానవ సమాజ పరిణామ క్రమంలో ఒక అతి ముఖ్యమైన ఘట్టం లిపి పుట్టుక — రాత ద్వారా మానవుడు సమాచారాన్ని పంచుకోవడం. ఆ రాత పుట్టుక, పెరుగుదలల పూర్వోత్తరాలను ఎంతో ఆసక్తికరంగా, విజ్ఞానదాయకంగా పప్పు నాగరాజు, పరుచూరి శ్రీనివాస్ వివరిస్తున్న సమీక్షా వ్యాసపు మొదటి భాగం రాత పుట్టుక, పరిణామం: 1. పాశ్చాత్య ప్రపంచం; భగవంతం కవిత త్రిపురాత్రి… త్రిపురహిత పగలు ఇటీవలే కీర్తిశేషుడైన కవి, రచయిత త్రిపుర జ్ఞాపకంలో కనకప్రసాద్ అవధారు; కవి, పుస్తకం, కర్తృత్వం మీద తన సిద్ధాంతాన్ని మరికొంచెం వివరిస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు రెండవ భాగం; మే 24-26న డాలస్‌లో జరిగిన తానా 19వ ద్వైవార్షిక సమావేశాల జ్ఞాపిక ఈమాట గ్రంథాలయంలో; ఆకాశవాణి పన్నాల సుబ్రహ్మణ్య భట్టు త్రిపురల పిచ్చాపాటీ;నాకు నచ్చిన పద్యం శీర్షికను ఇకనుంచీ కొనసాగించే భైరవభట్ల కామేశ్వర రావు మొదట చెప్పిన పద్యం దాశరథి మించుకాగడా — ఈ సంచికలో విశేషాలు.

తెలుగు పలుకు – తానా 2013 జ్ఞాపిక


ఇంకా ఈ సంచికలో: ఎలనాగ, తః తః, స్వాతికుమారి, నారాయణ, జాన్‌హైడ్, ఆర్. దమయంతి, దేశికాచార్యులు, ప్రసాద్, భాస్కర్, ఇంద్రాణి, శ్రీవల్లీ రాధిక, హెచ్చార్కెల కవితలు; రవిశంకర్, సుబ్రహ్మణ్యం, శివకుమారశర్మల కథలు; మోహన రావు, మురళీధరరావుల వ్యాసాలు; సత్యం శంకరమంచి అపురూపమైన ఆడియో రూపకం హరహరమహదేవ

పి. బి. శ్రీనివాస్ (22 సెప్టెంబర్ 1930 – 14 ఏప్రిల్ 2013): పిబిఎస్‌గా సంగీతాభిమానులకు చిరపరిచితుడు, దక్షిణభారత సినీసంగీతానికి కలికితురాయి అయిన ప్రతివాద భయంకర శ్రీనివాస్ కేవలం గాయకుడే కాదు, బహుభాషాకోవిదుడు, సాహిత్యవేత్త కూడా. సహృదయుడు, అజాతశత్రువు, ఆయన స్మృతికి నివాళిగా జెజ్జాల మోహనరావు, విష్ణుభొట్ల లక్ష్మన్న, పరుచూరి శ్రీనివాస్‌లు సమర్పిస్తున్న బహుభాషా సినీగీతభరిత వ్యాసం ప్లేబ్యాక్ సింగర్ పి.బి.ఎస్; ఆ సంగీత కళానిధి జీవితాన్ని, ఆయన ఛందో విజ్ఞానాన్ని సంగ్రహంగా పరిచయం చేస్తూ ఏల్చూరి మురళీధర రావు వ్యాసం సంగీత సాహిత్య శ్రీ నివాసుడు; భారతదేశంలో కవి పుస్తకాన్ని రచించడు, పుస్తకమే కవిని రచిస్తుంది. అంటే పుస్తకానికి అర్థం మారితే దానితో పాటు కర్త కూడా మారతాడు అంటూ తన సిద్ధాంతానికి మరికొంత వివరణ ఇస్తూ వెల్చేరు నారాయణ రావు రాసిన వ్యాసం మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు.


ఈ సంచికలో: ఇంద్రాణి, సాయి పద్మ, స్వాతికుమారి, ఎలనాగ, దేశికాచార్యులు, భాస్కర్, తః తః, సత్యనారాయణల, మల్లావధాని, మోహన రావుల కవితలు; గౌరి కృపానందన్, శర్మ దంతుర్తి, శారదల కథలు; రాళ్ళపల్లి సుందరం, సురేశ్ కొలిచాల, భరణి కొల్లిపర, పి. బి. శ్రీనివాస్‌ల వ్యాసాలు; బృందావనరావు సమర్పించే నాకు నచ్చిన పద్యం

అనాదిగా స్త్రీని ఎన్నో రకాలుగా చిత్రకారులు చిత్రిస్తున్నారు. అయితే, ఏ చిత్రం స్త్రీ అంతరంగాన్ని కూడా చూపిస్తుంది, ఏ చిత్రం స్త్రీని కేవలం ఒక విలాసవస్తువుగానే గమనిస్తుంది, చిత్రకళా చరిత్రలో స్త్రీ మూర్తి చిత్రానికి ఉన్న విశిష్టత ఏమిటి — వేలూరి వేంకటేశ్వర రావు వ్రాసిన సచిత్ర వ్యాసం ఆధునిక చిత్రకళలో స్త్రీ మూర్తి; భారతీయ సాహిత్యంలో వాస్తవికత పాశ్చాత్య సాహిత్య విమర్శకు ఎందుకు అందదో సత్య మొహంతితో ముఖాముఖీ-1: సాహిత్యంలో వాస్తవిక వాదం భరణి కొల్లిపర అనువాదం; సుమతీ శతకం వలస పాలన వల్ల ఒక నీతి శతకంగా మన సంస్కృతిలో ఎలా మార్పు చెందిందో వివరిస్తున్న వెల్చేరు నారాయణ రావు వ్యాసంతెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం ఈ సంచికలో ప్రత్యేకం.


ఇంకా: మూలా సుబ్రహ్మణ్యం, జాన్ హైడ్ కనుమూరి, స్వాతికుమారి బండ్లమూడి, తః తః కవితలు; గౌరీ కృపానందన్, జయప్రభ కథలు; మెలికముగ్గులలో గణితశాస్త్రపు ముడులు విప్పదీసే జెజ్జాల కృష్ణ మోహన రావు వ్యాసం; భాసుని సంస్కృత నాటకం ప్రతిమ నుంచి ఒక సన్నివేశం; పాలగుమ్మి విశ్వనాథానికి లలిత సంగీత నివాళి — పరుచూరి శ్రీనివాస్ సమర్పిస్తున్న అపురూపమైన ఆడియోలు; నాకు నచ్చిన పద్యం, కథ నచ్చిన కారణం…

!!!ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!

వెల్చేరు నారాయణ రావు (జననం: ఫిబ్రవరి 1, ప్రతి ఏడు కొత్తగా) ఈమాటకి ఆప్తుడు, ఆత్మీయుడు, అంతకంటే ముందు మామంచి నేస్తం. పుస్తకాలు చదువుకోడమన్నా, అందరితో కలిసి కూర్చుని వాటి కబుర్లు చెప్పుకోడమన్నా ఆయనకు గొప్ప సరదా. కానీ అదే సరదా ఇలా ఎనభయ్యో వడిలో పడిపోడంలో చూపిస్తాడని మేం అనుకున్నామా! ఈ సాహిత్యపు రాలుగాయి తెలుగు సారస్వతానికి ఏం చేశాడో, చేస్తున్నాడో స్థాలీపులాక న్యాయంగా మీకు రుచి చూపిద్దామని పది మెతుకులు (ఒకటి చాలదు గదా మరి!) పట్టుకొచ్చేసరికి ఏడాది పడుతుందని మాకు తట్టలేదు. ఆయన మాకోసం పెరగకుండా ఆగనూ లేదు. అందుకే, కాస్త ఆలస్యంగా అయినా అంతే ఆప్యాయంగా నారాయణ రావు విశేష సంచికగా ఈ ఈమాటను అందిస్తున్నాం. ఈయన లాంటి వాడు ఇప్పటి దాకా లేడు, ఇంకొకడు వస్తాడనే నమ్మకమూ లేదు. అందుకే తప్పని సరై అడగడం, “వీఎన్నారూ, వయసు మీద వేసుకోడం మీరు కాస్త ఆపుతారూ?” అని. వింటే ఎంత బాగుణ్ణు.


“The number of citizens capable of reading and understanding the texts and documents of the classical era … will very soon approach a statistical zero. India is about to become the only major world culture whose literary patrimony, and indeed history, are in the custodianship of scholars outside the country: in Berkeley, Chicago, and New York, Oxford, Paris, and Vienna. This would not be healthy either for India or for the rest of the world that cares about India.”

-Sheldon Pollock (‘Crisis in Classics‘, 2011.)


పరుచూరి శ్రీనివాస్‌కి పదివేల నూటపదహారు; పప్పు నాగరాజుకి ఐదువేల నూటపదహారు; భైరవభట్ల కామేశ్వరరావుకి వెయ్యి నూటపదహారు; సురేశ్ కొలిచాలకు ఉత్తి నూటపదహారు – కృతజ్ఞతలు, ప్రత్యేకంగా!

ఆధునిక వర్ణచిత్రకళను సమూలంగా మార్చివేసిన క్యూబిౙమ్ పద్ధతికి ఆద్యులైన బ్రాక్, పికాసో ద్వయంలో ఒకరిగా, ఇరవయ్యవ శతాబ్ది మేటి చిత్రకారుల త్రయం, బ్రాక్, పికాసో, మథీస్‌లలో ఒకరిగా ప్రసిద్ధి కెక్కిన చిత్రకారుడు జ్యార్జ్య్ బ్రాక్. ఆ మహోన్నత చిత్రకారుడు బ్రాక్ గురించి ఎస్. వి. రామారావు వ్రాసిన వర్ణ చిత్ర సహిత సమగ్ర వ్యాసం; సుశ్రావ్య పద్యపాఠి జువ్వాడి గౌతమరావు గానం చేసిన రుక్మిణీ కళ్యాణం; బహుముఖ ప్రజ్ఞాశాలి, నటి, గాయని, క్రీడాకారిణి టి. జి. కమలాదేవి గురించి పరుచూరి శ్రీనివాస్ సంక్షిప్త వ్యాసం; సాహిత్య విమర్శకుడు, విశ్వనాథ పాండిత్య కరదీపిక, జువ్వాడి గౌతమరావు గారి గురించి రమణ జువ్వాడి పరిచయ వ్యాసం, వారి సాహిత్యధార నుంచి రెండు వ్యాసాలు; ఈ సంచికలో ప్రత్యేకం.


ఇంకా: వింజమూరి బాలమురళి, మూలా సుబ్రహ్మణ్యం, విన్నకోట రవిశంకర్, పాలపర్తి ఇంద్రాణి, ఆర్. శర్మ దంతుర్తి, జెజ్జాల కృష్ణ మోహన రావుల కవితలు; మాధవ్ మాౘవరం, గౌరి కృపానందన్‌, సాయి బ్రహ్మానందం గొర్తిల కథలు; జువ్వాడి గౌతమరావు, చీమలమర్రి బృందావనరావు, సురేశ్ కొలిచాల, వేలూరి వేంకటేశ్వర రావుల వ్యాసాలు, శీర్షికలు…


జయంతితే సుకృతినః రససిద్ధాః కవీశ్వరాః
నాస్తి తేషామ్ యశః కాయే జరా మరణజమ్ భయమ్
!

శాస్త్ర , కళా రంగాల్లో ఎనలేని కృషిచేసి ధృవతారలల్లే దారి చూపిన ఏ కొద్దిమందో మాత్రమే పార్థివ శరీరాన్ని ఒదిలి వెళ్ళిపోయినా యశఃకాయులై మనమధ్యే ఉండిపోతారు. అటువంటి మహామహుడు, తెలుగువారు గర్వించదగ్గ ద్రావిడ భాషాశాస్త్రవేత్త ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి ఇటీవలే అస్తమించారు. ఆచార్య కృష్ణమూర్తి, విశిష్ట ప్రతిభాసంపన్నులు. భాషాశాస్త్రంలో తమ విశేషమైన కృషితో అంతర్జాతీయ స్థాయిలో మన్ననలందుకున్నవారు.

తమ వెలుగుతో ప్రపంచపు చీకట్లను పారద్రోలే దీపాలు కొడిగట్టటం, సహజమరణం అనివార్యమని తెలిసినా కూడా బాధించే విషయం. గత కొద్దికాలంగా, అతి తక్కువ వ్యవధిలో చనిపోయిన తెలుగు తేజోమూర్తులను గుర్తు చేసుకున్నప్పుడల్లా ఇది ఒక తరం అంతరిస్తున్న సమయమేమో అనే భావన రాకా మానదు. వారు వెళ్ళిపోగా ఏర్పడ్డ శూన్యం భయపెట్టకా మానదు. దీపాన్ని దీపంతో వెలిగించి దీపావళిగా మార్చినట్లు వారి మార్గదర్శకతను ఆదర్శంగా తీసుకొని ముందు తరాలకు అందించడం మన బాధ్యత, మనం ఆ జ్ఞానమూర్తులకు చూపగల గౌరవం. ఈ తరంలోనూ, రాబోయే తరాల్లోనూ వారు వెలిగించిన జ్ఞానదీపాలు కొడిగట్టకుండా కాపాడే సమర్థులు ఉన్నారనీ, ఉంటారనీ ఆశించడం ఒక పగటికల కాదనే మా బలమైన నమ్మకం.


సెప్టెంబర్ 8, 2012: రచయిత, సంగీత విద్వాంసుడు, శాస్త్రవేత్త, ఈమాట సాహితీకుటుంబంలో సభ్యుడు అయిన కొడవటిగంటి రోహిణీప్రసాద్ ఆకస్మికంగా మరణించారన్న దుర్వార్త ఇప్పుడే మాకు తెలిసింది. వారి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాం.


ఈ సంచికలో కథలు, కవితలు, వ్యాసాలతో పాటుగా సంగీతపరిమళం వెదజల్లే డా. శ్రీపాద పినాకపాణి గారు నిండు నూరవ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంలో వారి గురించి పరిచయ వ్యాసం, ప్రత్యేకం. భద్రిరాజు కృష్ణమూర్తిగారి 80వ జన్మదినం సందర్భంగా ఈమాట ప్రచురించిన ప్రత్యేక సంచిక ఈ సమయంలో మరొక్కసారి గుర్తు చేయడం సముచితం. విశ్వనాథ వేదాంత చర్చ ఆడియో మరొక విశేషాంశం. ఇంకా…