మరణ వార్తలని వార్తాపత్రికల్లో ప్రచురించేటప్పుడు చుట్టూ చిక్కని నల్ల బార్డరు వేయడం ఆనవాయితీ. అదెప్పుడు? లోకం కాస్తో కూస్తో ప్రశాంతంగా, సుభిక్షంగా ఉన్నప్పుడు మాత్రమే. యుద్ధసమయాల్లో, ప్రకృతి భీభత్సాల్లో, అల్లర్లలో మనిషి చావుకి ఒక గౌరవం ఉండదు. హోదాలుండవు. దహన సంస్కారాలు ఉండవు. కనీసం వారిని లెక్కపెట్టి అధికార గణాంకాల్లో ఆ మాత్రం ఉనికిని కూడా వారికి మిగలనివ్వరు. ఇలా అసందర్భంగా, అన్యాయంగా, అమానుషంగా, అర్థరహితంగా చనిపోయినవాళ్ళకి, వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్ళకి సాహిత్యమే కాస్తన్నా మర్యాదనిస్తుంది. తెల్లబట్టలో చుట్టి తాళ్ళు కట్టిన ఆ ‘శరీరా’ల వెనుక మనుషులని, జీవితాలని గుర్తు చేసుకుంటుంది.

ముస్లిమ్ పేషంట్ కొనవూపిరితో ఉంటే కల్మా చదివిన హిందూ డాక్టర్; ఆక్సిజన్ సప్లయర్ ముస్లిమ్ కనుక అత్యవసరమున్నా సిలిండర్ తీసుకువెళ్ళమన్న హిందూ కుటుంబం; మీల్స్ అందించబోతున్న వాలంటరీ అబ్బాయిని ఏ కులస్థులు వండిన వంట ఇది అని అడిగిన హోమ్ ఐసోలేషన్‍లో ఒంటరిగా ఉన్న పెద్దమనిషి; తనామనా బేధం లేకుండా కులమతాలకతీతంగా రోజుకి వందలాది దహన సంస్కారాలు చేస్తూ, కనీస గౌరవాన్ని చనిపోయినవారికందిస్తున్న యువత, కరోనా రోగ లక్షణాలు కనిపించగానే గదిలో పెట్టి తాళం వేసి మర్నాడు ప్రాణం పోయేవరకూ ఒక పెద్దాయనకి కనీసం తాగడానికి పచ్చిమంచినీళ్ళు కూడా ఇవ్వని కుటుంబ సభ్యులు; వైరస్ వచ్చి ఊపిరాడని వాళ్ళు, వైరస్ అంటుకుంటుందేమోన్న భయాందోళనలతో ఊపిరి తీసుకుంటున్న వాళ్ళు; ‘డబ్బు లేకపోతే బతికే హక్కు లేదా?’ అని రగిలిపోయే గుండెలు, ‘ఇంత డబ్బుండీ, అంత ఖర్చు పెట్టీ మనిషిని దక్కించుకోలేకపోయామే’ అని కుమిలిపోయే మనసులు; ఎలా అయినా బతికి తీరాలన్న మొండిపట్టు; అందరూ పోయి మనమే ఎందుకు మిగిలున్నామనే సర్వయివల్ గిల్ట్… ఈ గండం గట్టెక్కగానే మర్చిపోయే సంగతులు కావివి. #sabYaadRakhaJaayega (అన్నీ గుర్తుపెట్టుకుంటాం) అన్నది ఒక పొలిటికల్ స్లోగన్ మాత్రమే కాదు. బతికి బట్టకట్టిన ప్రతి ఒక్కరి నైతిక బాధ్యత అది. ఆ బాధ్యతని మోయాల్సినవాళ్ళల్లో ప్రప్రథమంగా ఉండాల్సింది కవులు, రచయితలు, కళాకారులూ. చిన్న వెలుగుని కూడా చూడనలేంతగా కళ్ళు చీకటికి అలవాటు పడిపోయినప్పుడు మళ్ళీ మళ్ళీ కళ్ళు తెరవమని గుర్తు చేసి, గుండె రాయి అయిపోయి శోకమంతా గొంతులో అటకాయించినప్పుడు కరిగించి కన్నీరుగా మార్చి, కన్నీటి ఉప్పెనలో కొట్టుకుపోతున్న జీవానికి ఆసరా ఇవ్వగలిగినవారిలో సాహిత్యకారులు ఒకరు! – పూర్ణిమ తమ్మిరెడ్డి.

ప్రతీ మనిషికీ కొన్ని అభిరుచులుంటాయి. వీటిలో చాలామటుకు ఏ ప్రయత్నాన్ని, పరిశ్రమని కోరనివి. సహజాతమైనవి. వినోదం, కాలక్షేపం వీటి ప్రధాన లక్షణాలు. కొందరు వీటినే శ్రద్ధగా గమనించుకుంటారు. అదనపు సమయాన్ని వెచ్చించి, ఈ అభిరుచులకు పదునుపెట్టుకునే ప్రయత్నాలు చేస్తారు. చాలా కొద్దిమంది మాత్రం మరొక్క అడుగు ముందుకువేస్తారు. సహజాతమైన అభిరుచులతో తృప్తిపడకుండా, తమకు అలవాటు లేని, నేర్చుకునేందుకు తేలిక కాని అభిరుచులను ప్రయత్న పూర్వకంగా అభివృద్ధి చేసుకుంటారు. ఈ స్థాయిలలో హెచ్చుతగ్గులు లేవు. కాని, వినగానే, చూడగానే స్వభావసిద్ధంగా సహజంగా నచ్చే వాటి మీదే శ్రద్ధ చూపేవారు మేధోశ్రమ లేకుండా దొరికే తాత్కాలికమైన, ఉపరితలానుభవంతో తృప్తి పడతారు. అక్కడ ఆలోచనకు తావు లేదు. ప్రయత్నంతో సాధించుకొనే అభిరుచి అలా కాదు. ముందు దానిని పరిశీలించాలి. ఆసక్తి సడలకుండా నిలకడగా అభ్యసించాలి. దానిలోని ఆకర్షణ ఏమిటో, ప్రత్యేకత ఏమిటో వెతికి సాధించుకోవాలి. ఏ అభిరుచి అయినా ఇలాంటి పరిశ్రమతో ఏర్పడినప్పుడు, అందులో నైపుణ్యం సిద్ధించడంతో పాటు, సహజాతమైన అభిరుచులు కూడా పదునెక్కి, వాటితో ముడిపడ్డ ఏ అనుభవమైనా ఉపరితలాన్ని దాటి ఒక లోతైన అనుభవంగా మిగుల్చుకోవడానికి కావలసిన పరిశీలనాజ్ఞానం పెంపొందుతుంది. విశ్లేషణాత్మక సాహిత్యపఠనం ఇలాంటి ప్రయత్నపూర్వక అభిరుచి. అలా చదవడం వల్ల సాహిత్యాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోగల శక్తి వస్తుంది. వాక్యాల సొగసు, పదాల ఆడంబరాన్ని దాటుకొని సంపూర్ణ పఠనానుభవం పాఠకులకు దొరుకుతుంది. సాహిత్యాభిమానులు, రచయితలూ చాలామంది ఈ ప్రయత్నపూర్వక శ్రమను పక్కకు నెట్టుకుంటూ పైపై మెరుగులతోటే తృప్తి పడడం వల్లనే మన సాహిత్యపు స్థాయి నానాటికీ పతనమవుతూ వస్తోంది. కళలో నైపుణ్యం సాధించడానికైనా, కళను ఒక నిండు అనుభవంగా ఆస్వాదించడానికైనా, సాహిత్యకారుడికైనా సాహిత్యాభిమానికైనా ఇలాంటి ఒక మెలకువతో కూడిన పరిశ్రమ తప్పనిసరి. అందుకని రచయితలు, ప్రత్యేకించి తెలుగు రచయితలు, అభ్యుదయమని పొరబడుతూ నెత్తికెత్తుకున్న కొత్తొక వింత పాతొక రోత స్వభావాన్ని, పరిశ్రమ చేయలేని తమ అలక్ష్యాన్ని వదిలి ప్రపంచసాహిత్యాన్ని, అంతకంటే ముఖ్యంగా మనకు సాహిత్య వారసత్వంగా అబ్బిన తెలుగు ప్రాచీన సాహిత్యాన్ని, అభ్యాసంలా చదవడాన్ని అలవరచుకోవాలి. కూలంకషంగా, విమర్శనాత్మకంగా, కథాకథనవ్యాకరణ పద్ధతులను పరిశీలిస్తూ చదవాలి. అప్పుడు, నిజమైన సాహిత్యమంటే ఏమిటో బేరీజు వేసుకోవడానికి ఒక బలమైన కొలమానం దొరుకుతుంది. అలా, వ్యక్తిగత అభిరుచుల స్థాయి బలపడేకొద్దీ, భాషా సాహిత్యం కూడా బలోపేతమవుతూ ఉంటుంది. అలాకాని చోట ఆముదపు చెట్లనే మహావృక్షాలనుకునే భ్రమలో సాహిత్యలోకం మిగిలిపోతుంది.

ప్రతీభాషా తనదైన కొన్ని మహాకావ్యాలను తయారుచేసుకుంటుంది. తరాలు మారినా తరగని సజీవచైతన్యాన్ని తమలో నింపుకుని, చదివిన ప్రతిసారీ నూత్నమైన అనుభవాన్ని మిగులుస్తాయవి. నిత్యనూతనమైన ఆ కావ్యాలే కాలక్రమేణా క్లాసిక్స్ అని పిలవబడి ఆ భాషాసంస్కృతులలో, ఆ జాతి సంపదలో భాగమవుతాయి. ఆయా సమాజాలు ఈ సాహిత్యకావ్యసంపదను ఎలా కాపాడుకుంటున్నాయో ఎలా చదువుతున్నాయో వాటిని ఎలా తరువాతి తరాలకు అందిస్తున్నాయో గమనిస్తే, ఆ సమాజపు సాహిత్యసంస్కారం తేటతెల్లమవుతుంది. తమ తమ భాషలలోని ప్రాచీన మహాకావ్యాలను తాము నిరంతరంగా భిన్న దృక్కోణాల నుండి అధ్యయనం చేయడమే గాక ఇతరభాషలలోకి కూడా అనువదించి వాటిని విశ్వవ్యాప్తంగా సజీవంగా నిలుపుకుంటున్న సమాజాలతో పోలిస్తే, ప్రస్తుత తెలుగు సాహిత్య సమాజపు అచేతనాస్థితి అర్థమవుతుంది. ప్రాచీన తెలుగు సాహిత్యం అన్న పేరు వినపడగానే కాలం చెల్లిన సంగతులేవో చెవిన పడుతున్నట్టు చూసేవారే మన చుట్టూ ఉన్నారిప్పుడు. మూఢభక్తి లాంటి భాషాభిమానమే తప్ప ప్రాచీన సాహిత్యం చదివి సమకాలీనులు తెలుసుకోదగినదీ, నేర్చుకోదగినదీ ఏమీ ఉండదన్న నమ్మకమే చాలామందిలో స్థిరపడిపోయి ఉంది. ప్రాచీనసాహిత్యాన్ని చదవడం భాషాభిమానాన్ని నిరూపించుకోవడానికో సమకాలీన సమాజపు పోకడలకు ఆకాలం ఎంత ఎడంగా ఉందో నిరూపించడానికో అయితే అంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి ఉండబోదు. ఆవేశపూరితంగా, తాత్కాలికోద్వేగాన్ని మాత్రమే కలిగిస్తూ, ఆలోచనారహితమైన అభిప్రాయప్రకటనగా మిగిలిపోతున్న సమకాలీన సాహిత్యాన్ని గమనించే కొద్దీ, స్పష్టమైన ప్రణాళికతో చిరస్థాయిగా నిలబడగల రసానుభూతితో కళాత్మకంగా సాగే మహాకావ్యాల ప్రాధాన్యం అవగతమవుతుంది. వాటి వైపు వేసే ఒక్కో అడుగూ, మన ఆలోచనలు స్పష్టమయ్యేందుకు తగిన వ్యవధినిచ్చేంత సహనపూరితమైన పఠనానుభవం దొరకనుందన్న హామీనిస్తుంది. ఒక్కో అధ్యాయాన్ని, ఒక్కో అంకాన్ని, ఒక్కో వాక్యాన్నీ శ్రద్ధగా గమనించే కొద్దీ, కథాకథనపద్ధతులు గుణదోషాలతో సహా అర్థమవుతూ ఒక కళగా సాహిత్యాన్ని ఆనందించడాన్ని, విశ్లేషించడాన్ని నేర్పిస్తాయి. విస్తారమైన, సంపూర్ణమైన పఠనానుభవం అందించే మానసికోల్లాసం ఎలాగూ దక్కుతుంది. ఒక వాక్యమో, సన్నివేశమో ఇలాగే ఎందుకు రాశారన్నది గమనించే కొద్దీ, రాతలో కొత్త మెళకువలు తెలుస్తాయి. క్లాసిక్స్‌ని చదవడం దానికదే ఒక అభ్యాసము, మన అభిరుచిని పెంపొందించుకునే మార్గమూ కనుక సాహిత్యంలో పొల్లునూ గింజనూ విడదీసి చూడటం అబ్బుతుంది. అంటే, పాఠకులుగా, రచయితలుగా మన స్థాయిని, మన భాషాసాహిత్య స్థాయినీ కూడా ఒక మెట్టు పైకెక్కించే అభ్యాసమిది. ఇట్లాంటి అవకాశం, అభ్యాసం, పరిశ్రమ పూర్తిగా మృగ్యమై సాహిత్యం పట్ల కనీస అవగాహన లేని సాహిత్యకారులు చుట్టూ మర్రిమానుల్లా పాతుకుపోతున్నారు. ఇప్పటికైనా మహాకావ్యాలు చదవడమెందుకో మనం గుర్తించలేకపోతే, సమకాలీన తెలుగుసాహిత్యం ముందుతరాలకు క్లాసిక్స్ ఏవీ సృష్టించలేదన్నది కళ్ళకు కడుతున్న నిజం.

తెలుగులో ఒక కవితను కాని, కావ్యాన్ని కానీ ఎలా చదవాలో చెప్పేవాళ్ళు మన సాహిత్యసమాజంలో లేరు. ఒక పుస్తకాన్ని ఎందుకు చదవాలో కారణాలు చెప్పమని అడిగితే, దాన్ని అవమానమనుకునే వాతావరణం నుండి సాహిత్యకారులు ఎడంగా జరిగినదెన్నడూ లేదు. ఒక కవిని, కావ్యాన్ని చదవకపోతే, మన జ్ఞానంలో పూడ్చుకోలేని లోటుగా ఏదో మిగిలిపోతుందని బలంగా వివరించి చెప్పగల ధైర్యవంతులు లేరు. భాష, చరిత్ర, సాహిత్యం, విమర్శ–వీటి అవసరమేమిటో, కాలానుగుణంగా వాటికి తగ్గట్టు పాఠకుడిని సన్నద్ధం చెయ్యాల్సిందెవరో మన ఆలోచనలకు అందదు. వాటికి సంబంధించిన కనీస అవగాహన, ఆయా రంగాల్లో కృషి చేస్తున్నామని రొమ్ము విరుచుకునేవారిలో కూడా కనపడదు. ఇలాంటి వాతావరణం నుంచి తప్పించి, తన లోతైన పరిశోధనలతోను, సూక్ష్మమైన పరిశీలనలతోను, బలమైన ప్రతిపాదనలతోనూ తెలుగు సాహిత్యానికి చేతన తెచ్చి విశ్వవేదికన స్థానం కలిగించిన సాహితీవేత్త వెల్చేరు నారాయణరావు. తెలుగులో కవితావిప్లవాల స్వరూపాల అధ్యయనం నుంచి సాహిత్య అనువాదాలు, విశ్లేషణల దాకా విశేషంగా పరిశ్రమించి, శోధించి వెలువరించిన వెల్చేరు సాహిత్యం పట్ల, తెలుగునాట ఈనాటికీ అనంతమైన నిశ్శబ్దం ఉంది. ఏ రంగంలోని వాళ్ళకైనా, ఎన్నేళ్ళుగానో వాళ్ళు సౌకర్యవంతంగా అనుసరిస్తున్న పద్ధతుల్లో లోపాలను ఎత్తి చూపి మార్పు అవసరమని హెచ్చరించేవారి పట్ల సుహృద్భావం ఉండదు. దానిని అడ్డుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ ఎదుటి మనిషి కృషి పట్ల నిర్లక్ష్యంగానే పరిణమిస్తాయి. రచ్చ గెలిచిన ఈ ప్రపంచస్థాయి సాహిత్యాధ్యాయి కృషికి, ఇంట దక్కిన నిరాదరణకి ఇంతకన్నా బలమైన కారణమేదీ కనపడదు. వాదభావజాలపు సంకుచిత నియమాలకు విభిన్నంగా సాహిత్యాన్ని కొత్తగా చదవడానికి, అర్థం చేసుకోవడానికి, విశ్లేషించడానికీ వెల్చేరు నారాయణరావు చేసిన ప్రతిపాదనలు విప్లవాత్మకవైనవి. సశాస్త్రీయమైనవి. వాటితో ఏకీభవించగలమా లేదా అన్నది సమస్య కాదు, కాని వాటిని విస్తృతంగా అధ్యయనం చేసి విశ్లేషించవలసిన అవసరాన్ని తెలుగు సాహిత్యలోకం ప్రయత్నపూర్వకంగానే విస్మరించడం మాత్రం సాహిత్యనేరం. ఆలస్యంగానయినా, వారికి అత్యున్నత సాహితీపురస్కారమైన ఫెలోషిప్ అందించి, సాహిత్య అకాడెమీ తన బాధ్యత నిర్వర్తించింది. గౌరవాన్ని నిలుపుకుంది. కనీసం ఈ పురస్కార వార్త మిషగా అయినా, వెల్చేరు నారాయణరావు రచనలు, సిద్ధాంతాలు తెలుగునాట చర్చలోకి తేవడం, బహుశా అదీ, ఆయన కృషికి ఒక సాహిత్యసమాజంగా మనమివ్వగలిగిన అసలైన గౌరవం.

సాహిత్యసృష్టి చాలా చిత్రమైనది, ప్రత్యేకమైనది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపగల శక్తి కలది. శతాబ్దాలుగా సాహిత్యకారులు, ఎన్నో విభిన్నమైన జీవననేపథ్యాల నుండి వచ్చి కూడా, అంతకు ఎన్నోరెట్లు విభిన్నమైన జీవనపార్శ్వాలని గమనిస్తూ కూడా, జీవితానికి ఏ లక్షణాలు ప్రాథమికమనుకుంటామో అవే సాహిత్యంలోనూ ప్రతిఫలింపజేయడం ఇందుకు ఒక గొప్ప ఉదాహరణ. సమాచారప్రసారాలు సంక్లిష్టమైన కాలంలో కూడా యుద్ధం-శోకం, ప్రేమ-పగ ఆకలి-కోరికల చుట్టూ తిరిగిన దేశదేశాల కథల మధ్య, క్లాసిక్స్ అని చెప్పబడ్డ మహోత్కృష్ట సాహిత్యం మధ్య గల సామ్యాలను విమర్శకులు విశ్లేషిస్తూనే ఉన్నారు. జీవనవిధానాలు, దేశకాలసంస్కృతులూ ఎంత విభిన్నమైనవయినా సాహిత్యకారులు స్పందించే తీరులోని ఏకత్వాన్ని ఈ విశ్లేషణలు ఎత్తిచూపుతాయి. ఇప్పుడు, ప్రపంచం లోని ఏ మూల ఉన్న విషయమైనా చూపుడువేలి చివరే దొరికే ఈ రోజుల్లో, కథల్లో సామ్యాలు కనపడం మరింత సహజం. ఇవన్నీ ఒకే ఆలోచనకు చెందినవనుకోవడం మరింత సులువు. అంతమాత్రాన అవన్నీ ఒకే కథలనుకోవడం తగనిపని. కథావస్తువులో ఎంతటి ఏకత్వమున్నా శైలీశిల్పాల విన్యాసమే భిన్నత్వానికి దారులు వేస్తుంది. అదే ఒక మామూలు విషయాన్ని కథగా కళగా మారుస్తుంది. ఒకే కథను వేయి గొంతులలో వినిపిస్తుంది. ఏ కథకు ఆ కథనే ప్రత్యేకంగా నిలుపుతుంది. అందుకే, ఇప్పుడు మనం వెదుక్కోవాల్సింది కథావస్తువుల్లోని సామ్యాలను కాదు. కథనాలలోని భిన్నత్వాన్ని. ఒకే వస్తువును సాహిత్యం ఎన్ని రకాలుగా, ఎన్ని కోణాలలో ప్రతిఫలించగలదో గమనించాలి. వస్తువులోని సామ్యత కాదు, అది ప్రకటించే విధానంలోని వైవిధ్యాన్ని గుర్తుపట్టాలి. ప్రతీ కథ ఒకేలా ముగియదని, ముగియనక్కరలేదని, ఏ కథ ముగింపు ఆ కథే వెతుక్కుంటుందని గుర్తించి, ఆ మలుపులను, ముగింపులను అర్థం చేసుకోవడం, గౌరవించడం ముఖ్యం. రచయితలకైనా, విమర్శకులకైనా ఆ సూక్ష్మదృష్టి, ఆ వివేచన కొరబడినప్పుడు, వస్తుసామ్యమే ప్రాతిపదికగా కథలను పోల్చుకుంటూ, తమ భావజాలానికి, తమ అవసరాలకు సరిపోయినట్టుగా మాత్రమే ఆ కథను వివరించాలని ప్రయత్నించినప్పుడు, అన్ని కథలకూ ఒకే ముగింపు బలవంతపు అవసరం అవుతుంది. ఈ మూస ఇందులో ఇమడని జీవితాలను వెక్కిరిస్తుంది. విస్తరించుకుపోవడమే ప్రధాన లక్షణమైన సాహిత్యాన్ని పరిధి గీసి దాటనివ్వని ప్రమాదకర ధోరణి ఇది. గుంపుగా కాక మనలేని సాహిత్యసమాజంలో ఏకాకుల గొంతులు వినపడవు. వాటిని ఆహ్వానించి వినడం వినిపించడం నేర్చుకోని సాహిత్యసమాజానికి ఆరోగ్యకరమైన ఎదుగుదల ఉండదు.

కనీవినీ ఎరుగని రీతిలో కొరోనా వైరస్ గతసంవత్సరం ప్రపంచమంతటినీ కుదిపివేసింది. ఎన్నో వ్యాపారాలను, వృత్తులను అతలాకుతలం చేసింది. ఏ పూటకాపూట సంపాదించుకునే ఎన్నో జీవితాలను రాత్రికి రాత్రి అయోమయంలోకి నెట్టింది. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ప్రభుత్వాలకు పేదప్రజలు ఆటబొమ్మలేనని పాశవికంగా స్పష్టం చేసింది. దేశాల మధ్య, మనుష్యుల మధ్య కొత్త దూరాలు ఏర్పరచింది, కొత్త భయాలు సృష్టించింది. వెలివేత లాంటి జీవితంలో అశాంతికి, వేదనకూ గురి చేసింది. నిజానికి ఇట్లాంటి క్షణాల్లోనే మనిషి తనకు తానొక ప్రశ్నార్థకమై జవాబులు వెదుక్కునే ప్రయత్నం చేస్తాడు. తనకు నిజంగా కావలసినవి, అక్కర్లేనివీ బేరీజు వేసుకుంటాడు. బహుశా అందుకే సమాజంలోనూ ఏకాంతంలోనూ తమతమ విలువలు, బాధ్యతలు స్పష్టం చేసుకొని కొందరు మరింత మంచితనంతో ముందుకుసాగారు; మరికొందరు ఇదే సందర్భాన్ని తమ స్వార్థాన్ని, ఇతరుల పట్ల ద్వేషాన్ని సమర్థించుకొనేందుకు అనువుగా వాడుకున్నారు. ఆదినుండీ ఏ పరిస్థితిలోనయినా ఈ రెండు దారులూ ఉంటూనే ఉన్నాయి, ఏది ఎంచుకుంటామనేది మన విజ్ఞతను బట్టి ఉంటుంది. కళాకారులూ దీనికి అతీతం కాదు. నిజమైన కళాకారుడు ప్రతిబంధకాలతో నిస్పృహ చెందడు. పరిమితులు పెరిగేకొద్దీ తన కళను అపరిమితంగా సృష్టించుకునే దారులను అన్వేషిస్తాడు. కళను సామాజిక, సామూహిక ప్రభావాలకు ఆవలగా చూస్తాడు. తనదైన ఏకాంతంలో నుండి, తనవే అయిన అనుభవాలలో నుండి ఓ కొత్త చూపుతో కళాసృజనకు ఉద్యమిస్తాడు, ఒక విశాల ప్రపంచాన్ని సృష్టించుకుంటాడు. దృశ్య సంగీత మాధ్యమాలలో ఎందరో కళాకారులు ఈ కోవిడ్ కట్టుబాట్లనే తమ సృజనకు వేదికగా మార్చుకొని ప్రతిభను నిరూపించుకోవడం దానికదే ఓ స్ఫూర్తిసందేశం. కళాకారుడైనా, సామాన్య మానవుడైనా దిక్కుతోచని స్థితిలో కొత్త దిక్కు వెతుక్కుంటాడనేది మరొక్కసారి నిరూపించబడిన తరుణమిది. తెలుగు సాహిత్యానికి కోవిడ్ వంటి దుర్దశ కొన్ని దశాబ్దాలుగా ఏర్పడి ఉన్నా, తెలుగు సాహిత్యకారులు ఎంచుకోవలసిన దారి ఎంచుకోకున్నా, ఇప్పుడు ఈ ఆశావహ దృక్పథమే మనకు మరింత అవసరం. ఈ కోవిడ్ ఏకాంతం తెలుగు కవిరచయితలలో ఏ కొత్త దారులు తెరిచిందో, తెలుగు సాహిత్యంలో ఏ ప్రభావం చూపిందో, అసలు చూపిందో లేదో కూడా మనకింకా తెలియదు. తెలుగునేలపై ప్రముఖులమనుకునే వారి ధోరణి షరా మామూలుగానే ఉన్నా, వాటికి భిన్నంగా కొందరు రచయితలు కొత్తదారి పడుతున్నారని, ఒంటరి దీపాలుగా ద్వీపాలుగా, వైవిధ్యమైన కథాకథనప్రయోగాలతో తెలుగు సాహిత్యాన్ని సజీవంగా ఉంచేందుకు తమదైన కృషి చేస్తున్నారని మా ఎరుక. కారుమొయిలులా కొత్త వెలుగులను కమ్మేస్తున్న పాత ధోరణులను పక్కకు నెట్టి, సాహిత్యచర్చలు ఈ కొత్త కలాల గురించి కొనసాగాలి. జీవితం కొత్త అనుభవాలతో ఎలా మనల్ని బలోపేతం చేస్తోందో, తెలుగు సాహిత్యాన్నీ అదే రీతిన పరిపుష్టం చేసుకోవాలి. అదే మనం ఎంచుకోవలసిన దారి.

సాహిత్యం ఒక ఆయుధం కాదు సమాజాన్ని ఖండించడానికి; సాహిత్యం మన వాదభావరాజకీయావసరాలు తీర్చే, తీర్చగలిగే ఒక పనిముట్టు కాదు-ప్రత్యేకించి వాటిని వాడటం చేతకాని చేతులలో. అలా కావాలి అంటే ముందు సాహిత్యం పట్ల, సమాజం పట్ల, ఆ రెంటి సంబంధం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలి. అది లేనప్పుడు, ఎన్ని వాదాలను సమర్థిస్తూ ఎన్ని నమూనా కథలు రాసినా వాటి ఫలితం శూన్యం. సమాజం ఒక అభాసరూపి; బహుముఖీన. నిర్వచనాలకు లొంగనిది. పాఠకులతో రచయిత జరిపే సాహిత్య సంభాషణ వ్యక్తిగతమైనది. సామూహికమైనది కాదు. అందువల్ల రచయిత చేయగలిగింది, చేయవలసింది తమ రచనల ద్వారా తమ ఆలోచనలను పాఠకులకు స్పష్టంగా చేర్చగలగడం, పాఠకులు తమ భావాలకు, ఆలోచనలకు స్పష్టతనిచ్చుకోవడంలో సహాయపడడం మాత్రమే. ఇలా తమ సాహిత్యం ద్వారా పాఠకులను ప్రభావితం చేయగల సామర్థ్యం ఉన్న రచయితలు తెలుగులో ప్రస్తుతం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే కనిపిస్తున్నారు. కోట్లమంది తెలుగువారిలో సాహిత్యం చదివేవారు వేలమందిలోను, విమర్శనాత్మకంగా చదవగలిగినవారు వందల్లో మాత్రమే ఉన్నారనడం సత్యదూరం కాని విషయం. పాఠకుల సాహిత్యాభిరుచి ఈ స్థితికి రావడానికి కారణం రచయితలే. సాహిత్యం ఇలానే ఉండాలి, ఈ వాదాలనే సమర్థించాలి, ఈ రకమైన ముగింపులే ఇవ్వాలి అని నిర్బంధించి, సమాజంలోని ఎన్నో రంగుల జీవితాలను కేవలం నలుపు-తెలుపులలో చూపే ప్రయత్నాలను మాత్రమే రచయితలు, పత్రికలు కూడా సమర్థించడం వల్లనే. అందువల్ల, పట్టుమని పదిమంది కూడా చదవని తమ సాహిత్యం ద్వారా సమాజంలో మార్పు తెస్తున్నామనుకోవడం, వారి సాహిత్యానికి అంత శక్తి ఉందనుకోవడం కేవలం రచయితల పగటికల మాత్రమే. వైయక్తికస్థాయిలోనైనా మార్పు తేగలిగినంత ప్రభావంతో తెలుగులో ఎవరూ రాయటంలేదు. కారణం? పాఠకులకంటే కూడా ముఖ్యంగా రచయితలకు సాహిత్యస్వభావం గురించి లేశమాత్రమైనా అవగాహన లేకపోవడం. తమచుట్టూ తమలాంటి ఒక పదిమందిని కూడగట్టుకొని తాము చూసిందే ప్రపంచమని, దాన్ని తాము మారుస్తున్నామని, ప్రశ్నిస్తున్నామని, తమ గొంతు వినిపిస్తున్నామని అపోహపడడం, అలా కాని సాహిత్యాన్ని నిందించడం, ఆపై సాహిత్యవ్యాసంగాన్ని తమ స్వప్రయోజనాలకు వాడుకొనడం. ఇదీ నేటి పరిస్థితి రచయితలది, కొండొకచో పత్రికలదీ. సాహిత్యం ద్వారా తమ వాదపక్షపాతాన్ని ప్రకటించడం, దాన్ని ముందుకు తీసుకుపోవాలని ప్రయత్నించడంలో ఏ తప్పూ లేదు. కాని, సాహిత్యం కేవలం మనకు నచ్చినట్టే ఉండాలని, మన ఇష్టాయిష్టాలను, మన అభిప్రాయాలను, అపోహలనూ మాత్రమే ప్రతిబింబించాలని అనుకోవడం, అలా కాని సాహిత్యం ప్రమాదమని, హేయమని దాడి చేయడం కేవలం మూర్ఖత్వం. మనం నచ్చని, మనకు నచ్చని ప్రజలు ప్రపంచంలో ఉన్నట్టే, మనకు నచ్చని కథాంశాలు, పాత్రలు, వాటి ప్రవర్తనలు ఉన్న కథలుంటాయి. కథను కథలాగానే చదవాలి. అర్థం చేసుకోవాలి. కథగానే విమర్శించాలి. ఈ సాహిత్య సంస్కారం ప్రస్తుతం పాఠకులకంటే రచయితలకు ఒక ముఖ్యావసరం కావడం బాధించే విషయం. రచయితలు ముందు తమ దృక్పథాన్ని విశాలం చేసుకోవాలి. నిష్పాక్షికంగా తమచుట్టూ ఉన్న సమాజాన్ని లోతుగా పరిశీలించాలి. అవధులు లేని దాని విస్తీర్ణతను బహురూపత్వాన్ని గుర్తించాలి. సాహిత్యసంస్కారంతో పాటు, భిన్నాభిప్రాయాల పట్ల నిరసనను కూడా గౌరవంగా తెలపగలిగే సాంఘిక సంస్కారమూ అలవర్చుకోవాలి. ఈ తక్షణావసరాన్ని గుర్తించకుంటే తెలుగు సాహిత్యం, రచయితలు కొత్తలోతులకు దిగజారగలరేమో కాని కొత్త ఎత్తులు ఎక్కలేరు.

తెలుగులో కథలూ కవితలూ వచ్చినంత ఇబ్బడిముబ్బడిగా వ్యాసాలు రావు. వస్తువు రాజకీయమైనా, సామాజికమైనా, ఉగ్రవాదమైనా, స్త్రీలపై అత్యాచారాలైనా మరింకేదైనా సరే, తెలుగు వారి భావప్రకటనకు కవితలే తొట్టతొలిదారి. లేదూ సినిమాఫక్కీలో ఎంతపెద్ద సమస్యకయినా చిటికెలో పరిష్కారం చూపించే కథలు. అంతే కాని, ఆ సంఘటనలను తార్కికంగా విశ్లేషించి నిగ్గుతేల్చే వ్యాసం మాత్రం తలపోయరు. వస్తువు పట్ల నిబద్ధత లేకపోవడం, ఆలోచనకు తావివ్వని సోమరితనం, కథాకవితాది ప్రక్రియలకు స్వీయ శైలి ముసుగులో ఎలాగైనా రాసే వీలుండటం బాహ్యకారణాలుగా కనపడుతోన్నా, వ్యాసం ఎలా రాయాలో తెలియకపోవడం కూడా ఇందుకు ఒక ముఖ్యకారణం. ఇందువల్లనే ఇప్పటి వ్యాసాలు ఏం చెప్తున్నాయో కూడా అర్థం కాని స్థితిలో ఉంటున్నాయి. సాహిత్యవిమర్శావ్యాసాలు, సాహిత్యదర్శనం కొంతయినా చేయించవలసిన పుస్తక సమీక్షలు, ముందుమాటలు అర్థం లేని నిర్వచనాల కుప్పగా, ఆత్మీయ అభయవచనాలుగా, మొహమాటపు పొగడ్తలుగా మిగిలేయి. వీటిలో ఏ ఒక్కటీ కథను, కవితను ఎలా చదవాలో లేదా చదవకూడదో పాఠకులకు వివరించదు. విమర్శ ఎలా చేయాలో నేర్పదు. పనిముట్లు ఏమీ అందివ్వదు. వారి వివేచనను పెంచదు. విశ్వవిద్యాలయాల్లో తెలుగు ప్రధానాంశంగా పెద్ద చదువులు చదువుతున్న విద్యార్థులకు కూడా వ్యాసం యొక్క రూపం, భాష ఎలా ఉండాలన్న కనీస అవగాహన లేదని వారి రచనల ద్వారా తేటతెల్లమవుతూనే ఉంది.

ఏ రచనైనా ఒక సంభాషణ. భావప్రకటనకు ఒక మాధ్యమం. ఒక అంశాన్ని కూలంకషంగా తార్కికంగా క్రమబద్ధంగా చర్చించడాన్ని రచనా ప్రక్రియగా వ్యాసం అని పిలుస్తున్నాం తప్ప అంశం సాహిత్యేతరమయినా, ఆ వ్యాసం సాహిత్యమే అవుతుంది. కథా కవితాదిప్రక్రియలను చిత్రిక పట్టడానికి ఏ రకమైన పరిశ్రమ అవసరమో వ్యాసం రాయడానికీ అదే కృషి అవసరం. ఈ కృషి కరువైనప్పుడు ఆలోచనలో స్పష్టత లేకపోవడం, భావాలను వాక్యాలుగా మార్చడంలో తడబాటు లేదా తొందరపాటు, అధ్యయనం కొరవడడం వంటి లోపాలు ఏ రచనలోనైనా కొట్టొచ్చినట్టు కనపడతాయి. కథాకవితలకంటే వ్యాసరచన భిన్నమైనది అనుకోవడం అపోహ. కథ, కవిత మనసును కదిలిస్తాయని, వ్యాసం పొడిగా సాగుతుందనీ అనడం కూడా అసంబద్ధమే. తార్కిక విశ్లేషణలకు సృజనకారుల భావనామయ ప్రపంచం తలొంచదంటూ తమ అర్థవిహీనతను అమూర్త్యభావనలుగా ప్రకటించి తప్పించుకోజూస్తారు కవులు, కథకులు. తేడా అల్లా వ్యాసం ఆ వెసులుబాటు ఇవ్వదు. అంతే కాదు, సాహిత్యవిమర్శకు ఏకైక రూపం వ్యాసం. అందుకే సరైన వాక్యం, వ్యాసం రాయలేనితనం తెలుగులో సద్విమర్శను క్రమేణా మాయం చేస్తోంది. వస్తువును బట్టి సృజన, సృజన రూపాన్ని బట్టి వాక్యం సమకూరుతాయి. వాక్యం కేవలం దానిలోని బలం వల్ల పాఠకులకు గుర్తుంటుంది. వివిధ ప్రక్రియల ఉద్దేశాలను, వాటిలోని వాక్యాల ధోరణులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తుండడంతో క్రమేణా తెలుగు వాక్యం బలాన్ని కోల్పోతోంది. స్నేహాలనూ సాహిత్యాన్నీ గుంపుకట్టి విమర్శను ఎడంగా నెట్టేశాక, రచనను చూడటానికి అభిమానమూ అవసరమే రెండు కళ్ళయ్యాయి. తార్కిక వివేచన పూర్తిగా పక్కకు తప్పుకున్నాక, వాక్యాల్లోని రసహీనతను పట్టిచ్చే సాధనమేదీ మిగల్లేదు. కథలూ కవితల ద్వారా ఆగ్రహావేశాలు ప్రకటించే తెలుగు సాహిత్యకారులు వ్యాసం ద్వారా తమ వివేచనను కూడా ప్రకటించడం నేర్చుకోనంతకాలం తెలుగు భాష బోలు శబ్దాల రణగొణధ్వనిగానే మిగులుతుంది తప్ప ఆలోచనను పెంపొందించే భాష కాలేదు.

మట్టిముద్దగాదు మహిత సత్కవి శక్తి మట్టుచున్న నణగిమణిగి యుండ/ రత్నఖచితమైన రబ్బరుబంతియై వెంటవెంట నంటి మింటికెక్కు అని ఎంత నమ్మినా, సామాజిక అసమానతలకు గురైన ఆవేదనలో, …ఎంత రత్నకాంతి యెంత శాంతి! ప్రకృతి గర్భమందు భగ్నమైపోయెనో/ పుట్టరాని చోట బుట్టుకతన అని అతను వాపోయిన మాట కూడా నిజం. ఎవడారగించు నమృతభోజనంబున గలిసెనో ఈలేమ గంజిబువ్వ/ ఎవరు వాసముసేయు శృంగార సౌధాన మునిగెనో యిన్నారి పూరిగుడిసె? అని ప్రశ్నించిన మాటా నిజం. కాని, వీటికి అతీతంగా, గవ్వకుసాటిరాని పలుగాకులమూక లసూయచేత నన్నెవ్విధిదూరినన్ నను వరించిన శారదలేచిపోవునే? అంటూ ఎనలేని ప్రతిభతో ఇంతింతగా ఎదిగి, ఆలస్యంగానైనా అందుకు తగిన గుర్తింపూ సత్కారాలూ పొంది కులమతతారతమ్యాలన్నీ తన కవితాధారతో త్రోసిరాజని మహాకవుల సరసన నిలబడ్డాడు గుఱ్ఱం జాషువా. జాషువా నూటయిరవైఐదవ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని అందరూ ఆయన గురించి మాట్లాడుకుంటున్న ప్రస్తుత సందర్భంలో, ఆయనను కొంతకాలంగా దళితకవిగా మాత్రమే పేర్కొనడం, ఆయన సాహిత్యాన్ని ఆ దృక్పథంనుంచే పరిశీలించడం సాహిత్యాభిమానులు నిశితంగా చర్చించాల్సిన విషయం. విశ్వనరుడనని చెప్పుకున్న ఓ కవిని ఇలా ఒక కులానికీ వర్గానికీ ప్రాంతానికీ పరిమితం చేయడం వల్ల, ఆ రకమైన ముద్రలు ఆపాదించడం వల్ల అతని కవిత్వంలోని విశ్వజనీనత కుదించబడుతుంది. ఆ సాహిత్యపు సర్వకాలీనత చెరిగిపోతుంది. కళాకారుడి సృజనకు ఇదే అసలైన గుర్తింపు పత్రమై నిలిచిపోతుంది. తన ప్రమేయం లేకుండానే తగిలించబడ్డ అస్తిత్వాన్ని మోస్తున్న దుస్థితి కేవలం జాషువా ఒక్కడిదే కాదు. ఎందరో కవులు, రచయితలు, కళాకారులు కులమతలింగప్రాంతీయాది అస్తిత్వవాదముద్రలను తమ ప్రమేయం లేకుండానే మోస్తున్నారు. తమ సృజనకు వెలుపలగా ఈ చట్రాలలో బలవంతంగా ఇరికించబడుతూనే ఉన్నారు. ఇవి తప్ప సృజనను పరిశీలించేందుకు మరేమీ తూనికరాళ్ళుగా తెచ్చుకోలేని సంకుచితవాదులతో నిందించబడుతూనే ఉన్నారు, వివక్షకూ గురి అవుతున్నారు. అభిమానంతో కొందరిని తమవారిగా ప్రకటించుకోవడానికి, మరికొందరిని శత్రువులుగా భావించి తుడిపివేయడానికి, అవే ముద్రలను వాడుతున్నామన్న గ్రహింపు లేకపోవడం గొప్ప సాహిత్యవిపత్తు. ఏ ముద్రతో ఒక కళాకారుడిని పైకెత్తుతున్నారో, అదే ముద్రతో మరొక కళాకారుడిని పతనం చేస్తున్నారని సాటి కళాకారులతో సహా ఎవరూ గుర్తించట్లేదు. ఉద్దేశ్యం మంచిదైనా చెడుదైనా చివరికి నష్టపోయేది కళ మాత్రమే. ఏ కళయైనా ఆయా కళాకారుల లోతైన అధ్యయనం, లోకాతీతమైన తపన, నిర్విరామ కృషి ఫలితం. వాళ్ళ ఉనికి కులమతవర్గవాద పరిధులకు అతీతమైనది. వారి సృజనాత్మకత అస్తిత్వాలకు, సొంత వ్యక్తిత్వాలకు అందనంత ఎత్తులోది. వారి సృజనను ఆ స్థాయిలోనే ఆ పరిధిలోనే విశ్లేషించాలి, అభినందించాలి, విమర్శించాలి కూడా. అలా కాక, కళాకారులకు సాహిత్యేతర అస్తిత్వాన్ని అంటగట్టి వారిని, వారి కళను ఆ సంకుచితదృష్టితో వెల కడితే ఏ కొద్దిమందికో తాత్కాలిక ప్రయోజనం కలగడం వినా సాహిత్యానికి యావత్‌సమాజానికి శాశ్వతమైన నష్టమే మిగులుతుంది.

భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణభాగంలో, ప్రత్యేకించి తెలుగుభాషాప్రాంతాలలో ఆంగ్లేయుల పాలన వేళ్ళూనుకుంటున్న సమయంలో వారికి మన చరిత్ర, సంస్కృతీ సంప్రదాయాలు, సామాజిక విధివిధానాలను అర్థం అయేలా చెప్పి పరిపాలనాపద్ధతులకు సహకరించిన పండితులు, విద్యావేత్తలు అయిన స్థానికుల గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఉదాహరణకు, సి. పి. బ్రౌన్ గురించి మనకు తెలిసినంతగా, అతనికి ఇతోధికంగా సహాయం చేసిన తెలుగు పండితుల గురించి, వారి కృషి గురించి తెలీదు. కల్నల్ మెకంజీ పేరు మనం విన్నాం కాని అతనికి ఆ పేరు రావడానికి కారణమయిన కావలి సోదరుల గురించి వినలేదు. కలకత్తాలో విలియమ్ జోన్స్ సంస్కృత భాషను ప్రధానం చేసి ఇతర స్థానిక భాషలను పట్టించుకోని కారణంగా స్థానిక భాషలు మాట్లాడే వాళ్ళంతా బ్రిటిష్ వారి దృష్టిలో అధములు, తమ పురాచరిత్ర ఔన్నత్యానికి తగనివారుగానూ అయారు. అందుకు కొంత భిన్నంగా దక్షిణ భారతంలో ఆంగ్లేయులకూ స్థానికులకూ మధ్య సంబంధం మరికొంత సాదరసమభావనలతోను, విజ్ఞానం ఇచ్చిపుచ్చుకునేలానూ ఉంటూ వచ్చింది. అందువల్ల స్థానిక పండితులు, మేధావులు జాత్యహంకారపు నీడలోను, అధికారి-సేవకుడు వంటి అసమానమైన స్థితిలోనూ కూడా విజ్ఞానం రెండువైపులకూ పారే స్థితిని వీలైనంతగా నెలకొల్పుకున్నారు. వీరు స్థానిక సంస్కృతీసంప్రదాయాలను, సాహిత్యాన్ని బ్రిటీష్ వారికి నేర్పే క్రమంలో ఆ పురాచరిత్రను ఒక ఆధునికరూపంలో నమోదు చేయడమూ మొదలుపెట్టారు. ఇలా స్థానిక పండితులు, ఆధునికరూపాల్లో నమోదు చేసిన చరిత్ర వల్ల ఇప్పటిదాకా పుక్కిటి పురాణాలుగా కొట్టిపారేసిన మన చరిత్రను, సాంప్రదాయ సాహిత్యాలను అధునాతన పరిశోధనాపద్ధతులలో విశ్లేషించి అర్థం చేసుకోవడానికి కావలసిన వీలు ఇప్పుడు మనకుంది. వీరి కృషిని గమనించి, తద్వారా మరుగున పడ్డ మన నిజచరిత్రను మనం వెలికి తెచ్చే అవకాశాలు ఎంతగానో ఉన్నా ఇప్పటికీ తెలుగునాట చారిత్రకపరిశోధకులెవరూ వాటిని వినియోగించుకున్న దాఖలాలు లేవు. చారిత్రక సాహిత్యాన్ని పునః ప్రచురించడం, ఆ సాహిత్యానికి సందర్భోచితమైన వ్యాఖ్యానాన్ని అందించడం, వాటికి లోతైన దృష్టీ అధ్యయనం ఉన్న విమర్శకులతో ముందుమాట రాయించడం ద్వారా చరిత్రను ఒక కొత్త కోణం నుండి భావి తరాలకు పరిచయం చెయ్యడం ఏకాలానికాకాలం పునరావృతం కావలసిన ఒక అవసరం. ఆ అవసరాన్ని గుర్తెరిగి ఆ దిశగా అడుగులు పడుతున్నాయో లేదో గమనించుకోవాల్సిన బాధ్యత సాహిత్యసమాజంలో ఉన్నామని చెప్పుకునే ప్రతి ఒక్కరిదీ.

స్త్రీ సాహిత్యం అని ప్రత్యేకంగా విభజించి చూపించడం సాహిత్యానికి లింగభేదం ఆపాదించడంలా పైకి కనపడుతున్నా దాని ఉద్దేశ్యం అది కాదు. చుట్టూ ఉన్న పరిస్థితులు, నాటుకుపోయిన మూస అభిప్రాయాలు స్త్రీని తన ఆశలు, అభిప్రాయాలు, ఆలోచనలూ సవివరంగా, నిస్సంకోచంగా చెప్పనివ్వని స్థితి నేటికీ ఉంది. ఇలాంటి వాతావరణంలో, స్త్రీ ఆంతరంగిక ఆలోచనా స్థితిని మనకేమాత్రమైనా పరిచయం చెయ్యగలిగినది సృజనాత్మకలోకంలో ఆమెకు దొరికే స్వేచ్ఛ. వాళ్ళ ఆశలనూ ఆశయాలనూ స్త్రీసహజమైన సౌకుమార్యంతో చెప్పుకున్న రచయితలను పాఠకులు, మామూలు రచయితల మాటేమోగానీ అభ్యుదయ రచయితలుగా సాహిత్యాన్ని భుజాన పెట్టుకొని మోస్తున్నవారిగా పేరొందినవాళ్ళు కూడా తీసికట్టుగానే చూశారు. తరాలుగా తమ లోపలే ఉడికిపోయిన అసహనాన్ని ముసుగుల్లేకుండా చూపెట్టినప్పుడు అర్థంచేసుకునే ప్రయత్నం చెయ్యకుండా అఘాయిత్యం అని అవమానించారు. మహిళాలోకం మొత్తం ఆదరిస్తున్న వారి రచనలను, ఎందుకు అవి అంత ప్రాచుర్యం పొందుతున్నాయో అర్థం కాక, ఆ సాహిత్య స్వభావాలను అర్థం చేసుకోలేక, ‘వంటింటి సాహిత్యం’ అనో ‘కలలూ కల్పనల మత్తుమందు’ అనో, ‘నిష్ప్రయోజనమైన సాహిత్యం’ అనో నిరసించారు. ఈ పరిణామాలన్నీ పునరుద్ఘాటించినది ఒక్కటే నిజాన్ని: తన భావాలను తాను స్వతంత్రంగా చెప్పుకునే స్త్రీకి కనీసం సాహిత్యసమాజంలోనైనా సరైన గౌరవం లేదు. అందుకే స్త్రీలు, సాహిత్యంలో తమ స్థానాన్ని నిర్లక్ష్యం చేస్తున్న పురుషాహంకారానికి చెంపపెట్టుగా వాళ్ళు చొరబడలేని సాహిత్యవిభాగాన్ని తమకు తాముగా ఏర్పాటు చేసుకున్నారు. తమదైన పంథాలో వెళుతూ ఆధునిక తెలుగు సాహిత్యచరిత్రలో నవలా సామ్రాజ్యాన్ని ఏలుకున్నారు. లింగవయోవిచక్షణ లేకుండా పుస్తకపఠనాన్ని ఆబాలగోపాలానికి అలవాటు నుండి అభిరుచిగా మార్చగలిగారు. ఇంత చేసినా, సమాజం, సాహిత్యరీతులు, పఠనరీతులూ అన్నీ మారాయని చెప్పుకుంటున్న ఈ దశాబ్దంలో కూడా స్త్రీ సాహిత్యం పట్ల అదే తేలికపాటి దృష్టి కొనసాగడమే కొరుకుడు పడని విషయం. ఇప్పటికీ స్త్రీ కథ రాస్తే దాని ఆధారంగా ఆమె జీవితాన్ని ఊహించి, ఆమె వ్యక్తిత్వాన్ని కొలవాలనుకునే మేధావులకు కొరతేమీ లేదు. రచయిత రాస్తే ఆదర్శమని పొగడబడే కథావస్తువు రచయిత్రి రాస్తే ఆమె శీలానికి, బరితెగింపుకు కొలమానమవ్వడంలో ఎవ్వరికీ ఏ ఆక్షేపణా లేదు. స్త్రీపురుష సంబంధాల గురించిగాని, స్త్రీ ఆంతరంగిక విషయాల గురించిగాని స్త్రీ తనకు సబబనిపించినదేదో రాస్తే స్వీకరించే సహనపూరిత వాతావరణం నేటికీ లేదు. సమాజానికి వ్యతిరేకులయ్యో, లేదా సమాజం నుండి విడివడి ఒక ప్రతిఘటనగానో ఇంకా ఎన్నాళ్ళుండాలి స్త్రీ సాహిత్యం? ఎందుకుండాలి? సాహిత్యానికీ సమాజానికీ ఎంత దూరం?

పంజరంలో బందీ అయిన పక్షి ఎందుకు పాడుతుందో తెలుసా? తన రెక్కలు కత్తిరించబడి, తన కాళ్ళకు సంకెళ్ళు వేయబడి, రగిలిపోతున్న కోపం, నిస్సహాయతల ఊచలకావల చూడలేక, ఇక వేరే దారి లేక, దూరతీరాలకు తన గొంతు చేరాలని, స్వేచ్ఛాస్వాతంత్రాల కోసం తాను పాడే పాట పదిమందికీ వినిపించాలని–అంటుంది మాయా ఏన్జెలో తన కవితలో. ఇటీవల ప్రపంచమంతా వెల్లువెత్తుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం మొదట అమెరికాలో ఇలానే గొంతు విప్పుకుంది. తరతరాలుగా లోపల వేళ్ళూనుకున్న ఆధిపత్యభావజాలం సాటి మనిషి పీకపై కాలు పెట్టి ప్రాణాలు తీసివేయడానికి సంకోచించని ఆ క్షణంలో సాంకేతికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన సామాజికంగాను అభివృద్ధి చెందినట్టు కాదని సర్వప్రపంచానికీ స్పష్టమయింది. రంగు, కులం, మతం, జాతి, లింగభేదం, అధికారం, ధనం-ఇలా సాటి మనిషిపై వివక్ష వేయి పడగలతో విషం చిమ్ముతూనే ఉంది. ఈ రుగ్మత ఏ ఒక్క దేశానిదో, ఏ ఒక్క సంస్కృతిదో కాదు. ప్రపంచమంతటా ఏదో ఒక రూపంలో ఈనాటికీ ఈ వివక్ష కనపడుతూనే ఉంది. అసహాయుల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కాలం మారిందనీ బానిస భావజాలం మేమిక మొయ్యమనీ ఇన్నాళ్ళూ దానిని భరించిన వాళ్ళు ఇప్పుడు బాహాటంగా చెప్పడం ఆధిపత్య సమాజానికి అహం మీద పడిన దెబ్బవుతోంది. ఎంత కట్టడి చేసినా తమ బ్రతుకుని గానం చేస్తూనే ఉండాలన్న పట్టుదలతో, వేనవేల ఒంటరి గొంతులు ఇప్పుడు ఒక్కటై మార్మోగుతున్నాయి. వివక్షకు గురైనవారి అనుభవాల్లోని వేదన, ఆ గొంతుల్లోని తడి, ధిక్కారం అందరికీ అర్థమవడం కోసం ఉద్యమిస్తున్నాయి. మునుపు లేని కొత్త చర్చలకు, కొత్త ఆలోచనలకు తావిస్తున్నాయి. సహానుభూతి ఉండీ సమస్యలోతులు పూర్తిగా తెలియనివారికి తెలియజేస్తున్నాయి. భిన్నాభిప్రాయాలను గౌరవించడానికి, భిన్నానుభవాలను అర్థం చేసుకోవడానికి, విభిన్నజీవనరీతులకు రెండు చేతులతో స్వాగతమిచ్చి తమ సరసనే స్థానమివ్వడానికి ఔదార్యం, సహనం, సహానుభూతి అవసరం. కత్తిరించబడ్డ చరిత్ర పుస్తకాలు, జల్లెడ పట్టబడిన బడిపాఠాలు అన్ని నిజాలూ చెప్పవు. అన్ని దృక్కోణాలూ చూపవు. మనసు లోపల్లోపలికి వెళ్ళి తమ అస్ఠిమూలగతమైన వివక్షాధోరణులను, అహంకార ఆధిపత్య ధోరణులను ఎవరికివారు తరచిచూసుకోగలగడమే సమాజంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు. ఆ ఆలోచన మెదిలే దిశగా, అలా చూసేందుకు వీలైన ప్రశ్నలను వివక్ష, దాస్యం, అణచివేతల కొలిమిలో కాలిపోయి ఇక వేరే దారితోచని కళాకారుల గళం ఆర్తిగా అడుగుతూనే ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేసిన, ఇప్పటికీ చేస్తున్న అలాంటి గొంతులేవైనా మన చుట్టూనే ఉన్నాయా అని చెవులొగ్గి వినాల్సిన సందర్భమిది. మన లోపలి చీకటి కుహరంలో తెలియకుండానే దాగివున్న వివక్షాధోరణుల పైన ప్రతి ఒక్కరం నిజాయితీగా వెలుగు ప్రసరించుకోవాల్సిన తప్పనిసరి తరుణమిది. సాటిమనిషిని ద్వేషించడానికి వెయ్యి కారణాలెప్పుడూ ఉంటాయి. ప్రేమించడానికి ఒక్క కారణం వెతుక్కొనవలసిన సమయమిది.

జాతీయ రహదారుల మీద పగిలి నెత్తురోడుతోన్న అరికాళ్ళ ముద్రలు. రోళ్ళు పగిలే ఎండల్లో నిండు నెలల గర్భిణుల నడకలు. నిలువ నీడ లేని దారుల్లో ప్రసవం. ఆగే వీల్లేని బ్రతుకుని మోసుకుంటూ తారురోడ్ల మీద పచ్చి కడుపులతో ఆ తల్లుల ఎడతెగని ప్రయాణం. గడ్డలు కట్టే రొమ్ములను నొక్కుకుంటూనే రోజుల పసిగుడ్లను హత్తుకుంటూనే కొనసాగిన నడకలు. పెద్దలు, పిల్లలు, వృద్ధులు, అనారోగ్యులు అందరిదీ అదే దారి. అదే వరస. ఊరెటో తెలీదు. ఇంకెంత దూరం వెళ్ళాలో లెక్కేలేదు. వెళ్ళగలరో లేదో తెలీదు. భాష రాదు. బస్సు లేదు. రైలు లేదు. చేతిలో చిల్లిగవ్వ లేదు. కనీసం అరికాళ్ళకు చెప్పుల్లేవు. ఎక్కడా ఆగి ఆశ్రయం పొందగల పరిస్థితి అసలే లేదు. గత రెండు నెలలలో రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటుకుంటూ కోట్లాది వలస కార్మికులు చేసిన హృదయవిదారకమైన ప్రయాణంలో మచ్చుకి కొన్ని దృశ్యాలివి. ఎలాగోలా ఇల్లు చేరాలన్న వెర్రి ఆశకి ఆకలి, వ్యాధి భయం, అధికారులు ఎక్కడ ఎందుకు అడ్డగిస్తారోనన్న బెరుకు తప్ప ఏం తోడున్నాయి వారికి? అవసరానికి వాడుకోవడమే తప్ప ఏ సమాజమూ సొంతంచేసుకోని ఏకాకితనం ఈ వలసజీవులది.

కరోనా వైరస్ ప్రపంచమంతటినీ అతలాకుతలం చేసింది. రవాణా వ్యవస్థలు స్థంభించిపోయాయి. సామాజిక జీవితం సగటుజీవి మరపుపొరల్లోకి నెట్టేయబడింది. లక్షలలో నిరుద్యోగులవుతున్నారు. ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. బలవంతంగా మీదపడ్డ ఒంటరితనం, ఉన్నట్టుండి మారిపోయిన జీవితం, ఉక్కిరిబిక్కిరిచేసే బాధ్యతలు, కనీసావసరాలు తీరేందుకు ఏర్పాటు చేసుకోవాల్సిన తొందర–ప్రపంచమంతా అనుభవించిన వొత్తిడిలో స్థాయీభేదాలుండవచ్చునేమో కాని, ఉదాసీన వాతావరణం మాత్రం ఎక్కడా లేదు. ఇట్లాంటి పరిస్థితికి ఏ దేశపు ప్రజలూ సిద్ధపడి లేరన్నది వాస్తవం. ఏ ప్రభుత్వమూ ఎన్ని ముందస్తు జాగ్రత్తచర్యలు తీసుకున్నా నూటికినూరుశాతమూ తన ప్రజలను కాపాడుకోలేదనీ అర్థం చేసుకోగలం. కానీ, గత కొన్నాళ్ళుగా భారతదేశంలో మనం చూసిన వలసజీవుల కన్నీటిచరిత్ర, ఒక పరిపాలనావ్యవస్థగా మనమెంత హీనస్థితిలో ఉన్నామో సుస్పష్టం చేసింది. ఇందరు వలసకార్మికులు అప్పటికప్పుడు అమలైన లాక్‌డౌన్‌తో అటు పనిలేక, భత్యంలేక, బ్రతుకులేక, భద్రతలేక, ఇంటికిపోయే దారిలేక గిలగిలలాడిపోతూ నడివేసవిలో సామాను నెత్తిన పెట్టుకుని రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి నడిచిపోతుంటే, సరిహద్దుల దగ్గర ఆపి చోద్యం చూసిన పాలకవ్యవస్థను ఏమనాలి? ప్రజల క్షేమం చూడాల్సిన ప్రభుత్వం వారిపైనే తమ జులుం చూపించడాన్ని ఇంకేమనాలి? సమాజంలోని ఒక భాగానికి కనీస రక్షణ కరవవుతున్నప్పుడు, నిర్లజ్జగా వాళ్ళనలా వదిలేసి చేతులు దులుపుకోవడం ఎంత అమానుషం! కులాన్ని, మతాన్ని, ధనాన్ని మత్తుమందుగా ప్రజలకు పంపిణీ చేసి అవసరానికి పబ్బం గడుపుకునే మన ప్రభుత్వాల ప్రమాదకర ధోరణికి నిలువెత్తు ప్రతీక ఈ వలసకార్మికుల మహానిర్గమనం. అయితే, రాజ్యం నీళ్ళొదిలేసిన బాధ్యతను సామాన్య ప్రజానీకం తలకెత్తుకుంది. ప్రభుత్వం గుడ్డిదైనచోట మానవత్వం కళ్ళు తెరిచింది. సాటి మనుషుల కష్టానికి చలించిపోయిన సామాన్యులెందరో తమ శక్తికి మించి, వలస కార్మికులకు ఎంతో కొంత కడుపు నింపి వారిని ఆదరంతో గౌరవంతో ఇళ్ళకు చేర్చడం కోసం తపించారు, శ్రమించారు. చీమూ నెత్తురూ లేని రాజకీయనాయకులు వారి శ్రమను తమదిగా ప్రచారం చేసుకుంటున్నా, అహంకారంతో అధికారయంత్రాంగం అడ్డుపడుతున్నా అన్నింటికీ ఎదురొడ్డి మరీ అనుకున్నది సాధించారు. మనుషుల్లో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ఇంత గొప్పగా ప్రకటించి, అది ఎన్నటికీ సమసిపోదని భవిష్యత్తు పట్ల భరోసా ఇచ్చి, దేశమంటే మట్టి కాదు, దేశమంటే ప్రభుత్వం కాదు, దేశమంటే మనమేనని మరొక్కసారి గుర్తుచేసిన ఆ మానవీయశక్తులందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం.

అభిరుచి, అధ్యయనం ఉన్న సంపాదకులు; భావనాగరిమ, రచనాపటిమ ఉన్న రచయితలు; ఆసక్తి గల పాఠకులతో తెలుగునాట పత్రికలకు స్వర్ణయుగమొకటి నడిచింది. అయితే రచనతో ఎదురైన సమస్యలకు ఏకపక్షంగా కత్తెర పట్టిన సంపాదకులు, తమ రచనలు వేరొకరు పరిష్కరించడం తమ ప్రతిభకు అవమానకరంగా భావించిన రచయితలు ఆనాడూ లేకపోలేరు. సాహిత్యం వ్యాపారమైన సమయంలోనే సాహిత్యంలో రాజకీయవాదాలూ ప్రబలమై ప్రచురణకర్తలే సంపాదకులూ అయినాక పత్రికల ఏకఛత్రాధిపత్యానికి రచయితలు, పాఠకులు తలొగ్గక తప్పలేదు. తిరస్కరణలు, ప్రచురణలూ ప్రశ్నార్థకంగా మారి, సమీక్షాపరిష్కరణల గురించిన సంభాషణ కొరవడిన ఆకాలం సంపాదకుల పట్ల ఔత్సాహిక రచయితలకు అపనమ్మకాన్ని మిగిల్చింది. క్రమేణా పత్రికాప్రాబల్యం కనుమరుగై సాంకేతిక సహకారంతో రచయితలే ప్రచురణకర్తలుగా మారిన ఈకాలం తామేది రాస్తే అదే సాహిత్యం అనే అహాన్ని నేటి రచయితలకు మిగిల్చింది. ఈ రెండు వైపరీత్యాల ఊగిసలాటలో ఏది సాహిత్యమో ఏది కాదో, అది ఏ ప్రమాణాలతో ప్రచురణకు నోచుకుంటోందో అర్థంకాని అయోమయ వాతావరణంలో తెలుగు సాహిత్యలోకం కూరుకుపోయింది. ఈ స్థితిలో వెబ్‌పత్రికలు వచ్చాయి. సాహిత్యాన్ని శ్రద్ధతో, గౌరవంతో సమీపించే రచయితలకు మునుపు సాధ్యపడని వేదికను ఇవి కల్పించాయి. ప్రచురణకు ముందుగానే రచయితకు తమ పరిష్కరణలకు కారణాలు చూపించడానికి సంపాదకులకు, ఆ మార్పుల పట్ల తమ అభిప్రాయాలను వెల్లడించడానికి రచయితలకు, వెబ్ పత్రికలు సౌలభ్యాన్ని కలిగించాయి. అందువల్ల, రచనను మెరుగుపరిచి ప్రచురణ దాకా తెచ్చేందుకు సంపాదకులూ రచయితలూ కలిసికట్టుగా పనిచేయడానికి అవసరమైన ఆ సంభాషణ ఇప్పుడు సాధ్యమయింది. రచయిత ఏం చెప్పదలుచుకున్నాడో దానికి అతి దగ్గరగా రచనను తీసుకువెళ్ళాలన్న సంపాదకుడి బాధ్యతను ఇది కొంత తేలిక చేస్తుంది. సంపాదకుడి ఆశయమూ రచనను మెరుగు పర్చడమేనని తమ వ్యాసంగం పట్ల గౌరవం ఉన్న రచయితలకూ ఇదే తెలియజేస్తుంది. సంపాదకులు-సమీక్షలు-పరిష్కరణ అనేవాటి గురించే కాక సాహిత్యం-సృజన-అభివ్యక్తి వంటి వాటిపట్ల రచయితలకు ఉన్న అపోహలు కూడా చెదరాలంటే ఇలాంటి సుహృద్భావ వాతావరణం ప్రస్తుతం తెలుగులో తప్పనిసరి. ఒక రచనను సంపాదకులు ఎంత శ్రద్ధగా పరిశీలించి పరిష్కరించి ప్రచురిస్తున్నారన్నదానిబట్టే సాహిత్యం పట్ల, రచయితల పట్ల వారికున్న గౌరవనిబద్ధతలు, అవి ఉండడంలోని అవసరం, అనివార్యత స్పష్టమవుతాయి. కాబట్టి, సంపాదకత్వమంటే కేవలం రచనలకు ఒక వేదికను ఇవ్వడం మాత్రమే కాదని తెలిసిన సంపాదకులు నేడు అవసరం. తమ అపరిపక్వ భావావేశాలకు తావివ్వడమే ప్రోత్సాహం అని అపోహపడే రచయితలు నేడు అనవసరం. సాహిత్యవ్యాసంగం ఒక నిరంతర అధ్యయనం అని తెలుసుకొని ఈ అవకాశాన్ని తెలుగు సాహిత్యకారులు ఎంతగా సద్వినియోగం చేసుకుంటారన్నది వారి వివేచనపై ఆధారపడివుంటుంది.

“Each of us needs something of an island in his life—if not an actual island, at least some place, or space in time, in which to be himself, free to cultivate his differences from others” – John C. Keats.

ప్రతి మనిషికీ జీవితంలో తానొక్కడూ మనగల్గిన ద్వీపపు అవసరం ఉంది, నిజంగా ద్వీపం కాకపోయినా కనీసం తనకు తానుగా ఉండగల్గిన ఒక ప్రాంతము, సమయమూ కావాలి. 1820లో టైఫస్ విజృంభణతో ఇటలీలోని నేపుల్స్ హార్బర్‌లో ఒక ఓడలో చిక్కుపడి బందీ అయేనాటికి క్షయ వ్యాధితో బాధపడుతున్న తన జీవితంలో మిగిలున్నది నాలుగు నెలలేనని ఇంగ్లీష్ కవి జాన్ కీట్స్‌కి తెలుసు. అప్పటికతని వయసు పాతికేళ్ళు. ఆ స్థితిలో కూడా అతను కొత్త కవిత్వం చదివాడు, రాశాడు. గతంలోకి తొంగిచూసుకుని అనుభవాలన్నింటినీ ఓ క్రమపద్ధతిలో రాతగా పదిలపర్చుకున్నాడు. ఆ ఏకాంతంలో తన అన్నేళ్ళ జీవితానికీ అతనొక కొత్తచూపు ఇచ్చుకున్నాడు. మానవ చరిత్రలో ఇటువంటి విపత్తులు రావడం, ప్రపంచాన్ని కబళించడం కొత్తకాదు; మానవాళి దానిని దాటుకొని తిరిగి తననూ సమాజాన్నీ పునర్నిర్మించుకోవటమూ కొత్త కాదు. అప్పటి టైఫస్ అయినా ఇప్పటి కొరోనా అయినా ఇదే సత్యం. కానీ మనమే ఒక చిత్రమైన స్థితిలో కాలం గడుపుతున్నాం. ఇళ్ళలో నిజంగా బందీ అయినవారు కొందరే అయినా, బందీ అయ్యాం అన్న భ్రమను మోస్తున్నవారు మాత్రం లెక్కకందనంతమంది. సోషల్ మీడియా మనిషిలోని సంఘజీవిని ఏనాడో మరుగుపరిచింది. అది కట్టిన కోటగోడలతో అతడేనాడో ఒంటరివాడయ్యాడు. ఇప్పుడు వినపడుతున్న ఒంటరి కేకల్లోనూ మనిషికి మనిషి ఎడమవుతున్నాడన్న బాధ కనిపించదు, నిజంగా సాటిమనిషికి సహాయం చేయలేకపోతున్న వ్యథ కనిపించదు. ఒక మిథ్యాప్రపంచంలో బ్రతుకుతూ బైట ప్రపంచాన్ని ఊహిస్తూ, నిందిస్తూ లేదా దానికి భయపడుతూ సాగిస్తున్న వ్యాఖ్యానాలే అన్ని దిక్కుల్లోనూ కనపడుతున్నాయి తప్ప సంవేదనతో ప్రతిధ్వనించే గొంతులెక్కడ? ఏ సమాచార సంబంధాలూ తెగిపోనివాళ్ళు, సరుకులు నెలలకు సరిపడా కొనిపెట్టుకున్నవాళ్ళు, ఉద్యోగానికి, జీవితానికి సంబంధించి ఏ అభద్రతా లేనివాళ్ళూ కూడా ఈ బూటకపు అరుపులకు గొంతు కలపడం మందిమనస్తత్వమే తప్ప మరొకటి కాదు. హామ్‌స్టర్ వీల్ లాంటి జీవితానికి అంకితమైపోయి, నిదానించి తన గురించి తన సమాజం గురించి స్పష్టత తెచ్చుకోవడానికి అవసరమైన కనీస సమయాన్ని పూర్తిగా సోషల్ మీడియాకే ధారాదత్తం చేసిన మనిషి ఈ రోజు కొత్తగా ఈ ఒంటరి గీతాన్ని పాడటంలో అర్థం లేదు. మనందరం కీట్స్‌లా మన జీవితానికో కొత్తచూపు ఇచ్చుకోలేకపోవచ్చు కానీ అనుకోకుండా దొరికిన ఈ ద్వీపంలో మన గురించి మనం కనీసపాటి స్పష్టత తెచ్చుకోగలిగితే జీవితంలోనైనా ప్రపంచంలోనైనా రాబోయే విపత్తులకు సిద్ధపడే శక్తిని సంపాదించుకుంటాం. అందుకే, బయటకు వెళ్ళే స్థితి లేకపోతే లోపలికి ప్రయాణం చెయ్యండన్న నానుడి ఈరోజు మరింతగా అవసరం.

సాహిత్యం అంటే ఇలానే ఉండాలి, ఇవి మాత్రమే చెప్పాలి, ఇలా మాత్రమే చెప్పాలి అన్నది కనపడని కంచె. సమాజపు కట్టుబాట్లను లెక్కచేయకుండా తమదైన అభిప్రాయాలని ధైర్యంగా వెల్లడించిన రచయితలు ఈ కాలంలోనే కాదు, ఏ కాలంలోనైనా ఎంతోమంది లేరు. అంతమాత్రాన అలా చెప్పిన వారు సమాజ వ్యతిరేకులో దేశద్రోహులో కారు. భిన్న ప్రవర్తనలను, విశ్వాసాలనూ నిరసించి హేళన చెయ్యడం, మన సిద్ధాంతాలకు వ్యతిరేకంగా నడుచుకునేవారి పట్ల ద్వేషం కక్కడం, చివరకు హింసకు కూడా తెగించడం, మనముందున్న నేటి నాగరికత. సామూహిక ధోరణులకు, అభిప్రాయాలకు, నమ్మకాలకూ వంతపలికే సాహిత్యాన్ని కళలనూ మాత్రమే ఆదరించడం ఈ సంకుచిత ధోరణిలోని భాగమే. ఏ భిన్నస్వరం వెలువడ్డా దౌర్జన్యంతో నొక్కివేయడం ఈ ఆధిపత్యధోరణికి మరోకోణమే. అందుకే గొంతు పెగుల్చుకోలేనివారి స్వరమై బిగ్గరగా, బలంగా, మనముందుకొచ్చిన సాహిత్యం ఈనాటికీ బహుతక్కువ. ఆ సాహిత్యానికి దక్కిన ఆదరణ, గౌరవం ఇంకా తక్కువ. సమూహాల్లో కలవలేక అవస్థపడుతున్న మనుష్యుల లోలోపలి సంక్షోభాలను, సంకోచాలనూ నిజాయితీగా నిబ్బరంగా చెప్పుకోనిస్తున్నామా? ఆ జీవితాలు చెప్పే సత్యాలను అంగీకరిస్తున్నామా? ఏ చట్రంలోనూ బిగియకుండా, ఏ నిరసనలకూ వెరవకుండా, జీవితాన్ని దాని అన్ని ఎత్తుపల్లాలతో, చీకటివెలుగులతో పాఠకుల ముందుకు తెచ్చే కథలను భూతద్దం పెట్టి వెదుక్కోవాల్సిన పరిస్థితి నుండి మన సాహిత్యచరిత్రేం పెద్దగా ఎదగలేదు. ఇప్పుడే కాదు, అట్లాంటి జీవితాలను, భిన్నస్వరాలను మన సాహిత్యంలోకి, కళల్లోకి, సమాజంలోకీ సాదరంగా ఆహ్వానించుకోలేనంతకాలం ఆ ఎదుగుదల అసాధ్యం. ఇటువంటి పరిస్థితుల్లో టెలింగ్ ది ట్రూత్ అబౌట్ మి అన్న ఎ. రేవతి ఆత్మకథను, రచయిత్రి పి. సత్యవతి ఒక హిజ్రా ఆత్మకథగా చేసిన తెలుగు అనువాదానికి ఈ ఏటి కేంద్రసాహిత్య అకాడెమీ అవార్డు లభించడం ఆశావహమైన విషయం. సమాజం చూపే అనాగరిక వివక్షను, భాషభాషల్లోనూ వినిపించాలనుకున్న ధైర్యానికి దక్కిన గౌరవమిది. సమాజంలోని పెనుచీకటిని వేలెత్తిచూపి, జీవించే హక్కు కోసం నిర్భయంగా చేసిన ఒక మనిషి పోరాటం గుర్తించదగినది, స్వాగతించదగినది, గౌరవించి గెలిపించదగినది. సమాజం భిన్నత్వానికి పర్యాయపదం. అందుకే, ఈ తరహా సాహిత్యాన్ని సమాజం స్వీకరించే తీరును బట్టి ఇక ముందయినా అది భిన్నత్వంలో ఏకత్వం చూసి పురోగమిస్తుందా లేక తనను తాను చీల్చుకొని అధోపతనం అవుతుందా అన్నది చూచాయగానైనా తెలుస్తుంది.

తెలుగులో మంచి కథలు లేవూ రావూ అంటాం, వస్తే మనం గుర్తు పట్టగలమా? మనకు అసలు కథ చదవడం వచ్చా? రచయిత-రచన-పాఠకుడు అని ఆగిపోతున్నాం కాని సాహిత్యంలో అటుపైన వచ్చే అతిముఖ్యమైన సాహిత్యచర్చను మనం మర్చిపోయాం. పాఠకుడు పెట్టుకున్న అద్దాలను బట్టి, రచన ఎన్నో రంగుల్లో తారసపడవచ్చు. అది సహజం. అయితే, ఈ రంగులను దాటుకుని రచనకు స్వతంత్రమైన అస్తిత్వమంటూ ఒకటి ఉంటుంది. కథ నిజంగా ఏం చెబుతున్నదన్నది పాఠకులు చూడగల్గుతున్నారా, విస్మరిస్తున్నారా, లేక తమకు నచ్చింది తామే తీసుకుని తిరగరాసుకుంటున్నారా తెలుసుకునేందుకు అక్కరకొచ్చేది సాహిత్యచర్చ ఒక్కటే. సోషల్ మీడియాలో సాహిత్య ప్రేమికులు వేలాదిగా ఉన్న గ్రూపులున్నాయి కాని వాటిల్లో ఎవరూ సాహిత్యం గురించి విశ్లేషించరు, తమ అభిప్రాయాలు స్పష్టంగా వెల్లడిస్తూ చర్చలు చేయరు. ఇది పాఠకులే కాదు, రచయితలూ చేయరు. పుస్తక ప్రచురణ కూడా ఏటా నడిచే పబ్బంలా మారడంతో, పరస్పర పొగడ్తల భాగోతానికి ఏ విఘాతమూ కలగకుండా, ఇప్పుడు రచయితలూ జాగ్రత్తపడుతున్నారు. కనీసం వాళ్ళైనా సాటి రచయితల కథలు, కవితల గురించి ఎందుకు విశ్లేషించరు? ఏది బాగుందో, ఏది బాలేదో ఎందుకు మాట్లాడుకోరు? రచయితలూ ఈ దిశగా అడుగులు వేయడం లేదంటే వాళ్ళూ సామాన్య పాఠకుల్లాగానే కథలో తమకు నచ్చిందీ నచ్చనిదీ చూసుకుంటారే తప్ప, తమ ఇష్టాయిష్టాలకు ఆవలగా కథ ఏం చెప్తోందో చూడటం లేదు అనే అర్థం. ఒక రచనను అనుభవించేది వైయక్తికంగానే, మౌనంగానే కావచ్చు. కాని, రచన ఒక వస్తువు. దానికొక నిర్మాణపద్ధతి ఉంటుంది. అది మనముందు పరచుకున్న తీరొకటి ఉంటుంది. ప్రతీ వాక్యమూ, ప్రతీ సంఘటన, ప్రతీ వర్ణన రచనానిర్మాణంలో భాగం. ఆ నిర్మాణపద్ధతి, తీరు, నడత వల్లనే రచన అంతిమంగా బాగుండేదీ బాగుండనిదీ, ఆ రచన ఒకరికి నచ్చినా నచ్చకున్నా. తమ రచనను ఎలా ఆవిష్కరిస్తున్నాం అన్నది రచయితలు చేయవలసిన, చేసుకోవలసిన చర్చ. శాస్త్రీయ పరిశోధనలలో ఉన్నవారు ఒకరినుంచి ఒకరు నేర్చుకున్నట్టు, తమ పద్ధతుల బాగోగులు చర్చించుకున్నట్టు, రచయితలూ రచనల లక్షణాలు చర్చలు చేస్తూ, పదిమందిలో మాట్లాడుకుంటూ ఉంటే, సాటి రచయితల్లో కొందరైనా తమ రచనల గురించిన అపోహలు తొలగించుకునే వీలుంటుంది; పాఠకులకు అవగాహన పెరిగే అవకాశముంటుంది; తెలుగులో మంచి రచనలు మరికొన్ని రావచ్చనే భ్రమ కొంతయినా నిజమయే అవకాశముంటుంది.

ఈమాట సాహితీకుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు!

ఒక కొత్త సంవత్సరమే కాదు, ఒక కొత్త దశాబ్దమూ మొదలవుతున్నది. గడిచిన పదేళ్ళూ ప్రపంచమంతటా లాగానే మన దేశంలోనూ తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయార్థిక కళాసాంస్కృతిక రంగాలాదిగా ఎన్నో మార్పులు సంభవించాయి. మతోన్మాదం, సంకుచితత్వం రాజ్యమేలుతున్నాయి. మనిషిని మనిషి కులమతప్రాంత భేదాల విచక్షణతో చూడడం ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. నిర్మూలించబడవలసిన సామాజిక రుగ్మతలు వ్యక్తుల అస్తిత్వాలకు గర్వచిహ్నాలుగా మారి సమాజానికి హాని చేసే ఆయుధాలవుతున్నాయి. ప్రభుత్వాలు చెదపురుగుల లాగా ప్రజాస్వామ్యాన్ని తొలుచుకు తింటూ, పౌరుల ప్రాథమిక రాజ్యాంగహక్కులను కాలరాస్తూ నియంతృత్వం చెలాయిస్తున్నాయి. నిలదీసి నిజాన్ని నిగ్గు తేల్చవలసిన పత్రికలు ప్రభుత్వాలకూ, పార్టీలకూ భజంత్రీలుగా మారిపోయాయి. అసత్యప్రచారాలు నిజాలుగా చలామణీ అవుతున్నాయి. నోరువిప్పి ప్రశ్నించగల హక్కు ఎన్నడో అఘాయిత్యపు దాడులకు బలి అయింది. సామాజిక కార్యకర్తలు, కళాకారులు, రచయితల గొంతులు మునుపెన్నడూ లేనంతగా నొక్కివేయబడుతున్నాయి. చివరికి ఆటవిక న్యాయాన్ని హర్షించి ఆమోదిస్తూ, కాపాడవలసిన చట్టాన్నే కాలరాసే అధికారులకు సన్మానాలు చేసే స్థితికి మన సమాజం దిగజారిపోయింది. కళాసాహిత్యకారులు తమ కనీస స్వేఛ్ఛకోసం పోరాడవలసిన స్థితి ఏర్పడింది. ఇలాంటి వాతావరణంలో సమాజపు పోకడలను, ప్రభుత్వాల తీరును ప్రశ్నించే విమర్శించే ఏ పాత్రికేయులకైనా, సామాజిక కార్యకర్తలకైనా, కళాసాహిత్యకారులకైనా ఆందోళన, నిరాశానిస్పృహలు సహజం. కాని, ఇలాంటి చీకట్లు కమ్మడం ఇది మొదటిసారి కాదు. ఆఖరుసారీ కాబోదు. తిరిగి కొత్త ఉదయం రాక తప్పదు. మార్పుకోసం పోరాడేవారు ఎప్పుడూ ఉంటారు. కళాకారులు రచయితలపట్ల అనాగరికమూ అప్రజాస్వామ్యమూ అయిన దాడులను ఖండించి, ఒకనాడు పోరాడి సాధించుకున్న భావప్రకటనాస్వేచ్ఛ కోసం ఈనాడు మళ్ళీ పోరాడుతున్న ప్రతీ గొంతుక ఒక గడ్డిపోచలానే కనపడవచ్చు; కాని, అవన్నీ ఒక్కటిగా కూడినప్పుడు ఆ త్రాటి బలానికి మదపుటేనుగులైనా లోబడక తప్పదు. కట్టి లాగితే ఏ పీఠాలైనా కదిలి కుదేలు కాకతప్పదు. ఆ గొంతుకలు చీకటిని పారదోలడానికి ప్రయత్నించే చిరుదీపాలే కావచ్చు; కాని, అన్నీ కలిసి వెలిగితే చీకటి పటాపంచలు కాకతప్పదు. ప్రతిఘటించాలన్న ఎరుక ముఖ్యం. సమైక్యత అవసరమన్న స్పృహ అవసరం. మార్పు అనివార్యం.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో జరపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక పెద్ద దుమారాన్నే లేపింది. ప్రస్తుత ప్రపంచంలో ఎదగడానికి, ఆర్థికంగా ఉన్నతమైన వర్గాలతో విద్యావుద్యోగాలలో పోటీ పడడానికి బడుగు వర్గాలవారికి ఉపయోగపడుతుందని ఈ నిర్ణయాన్ని సమర్థించే వారొకపక్క, విద్యాబోధన మాతృభాషలోనే ఉండాలని ఆవేశంతో ప్రతిఘటిస్తున్న భాషాభిమానులొకపక్క, తమ తమ కులమతవర్గ వాదాలకనుగుణంగా దీనికి రకరకాల రంగులలుముతున్న మరికొందరొకపక్క, తలో వైపు నుండి కూడి విషయాన్ని ఫక్తు రాజకీయం చేశారు. వీళ్ళ నినాదాలన్నీ తమ లబ్ధి కోసమూ, తమ అత్యుత్సాహమో, అజ్ఞానమో ప్రదర్శించడం కోసమూ తప్ప నిజంగా ప్రభుత్వ పాఠశాలలు తప్ప గతిలేని పిల్లల బాగోగుల గురించి కాదు. వాళ్ళకు ఎలాంటి చదువు కావాలి, అది ఎలా చెప్పచ్చు, వారికీ ఎలా సమానావకాశాలు కల్పించచ్చు అని కాదు. ఉద్వేగపూరిత విశ్వాసాలను దాటి, తెలుగు బోధన కావాలనేవారు దానివల్ల విద్యార్థులకు ఏం ప్రయోజనం కలుగుతోంది అని ఆలోచించటంలేదు. ఆంగ్ల బోధనను సమర్థించేవారు అసలు మన పాఠశాలల్లో ఆంగ్లం చక్కగా నేర్పగలిగే ఉపాధ్యాయులెంతమంది ఉన్నారు, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం ఎంత సమర్థవంతంగా అమలు చేయగలదు అన్నవి ఆలోచించటంలేదు. ఒక భాష మాట్లాడగలగడం వేరు. ఆ భాషలో ఆలోచించగలిగే సామర్థ్యం తెచ్చుకోవడం వేరు. కనీసం తను చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పగలిగేంతగా, రాయగలిగేంతగా తర్ఫీదునివ్వగలిగిన ప్రభుత్వ పాఠశాలలు ఎన్నున్నాయి? ఉపాధ్యాయులెందరున్నారు? ఇప్పటికే తెలుగు ఆలోచననిచ్చే భాషగా కాకుండాపోయింది. అందువల్ల ప్రాథమిక విద్య మాతృభాషలో ఉంటే ప్రస్తుత తెలుగు సమాజాల్లో విద్యార్థులకు ఏ మేలు జరుగుతుంది అనేది చర్చనీయాంశమే. అదేవిధంగా అరకొర ఆంగ్లబోధన వల్ల విద్యార్థులకు భావిజీవితంలో ఉపయోగపడేంత భాషాసామర్థ్యం వస్తుందన్నదీ అనుమానాస్పదమే. గత ముప్ఫై నలభై ఏండ్లలో తెలుగు ఇంగ్లీషు మీడియాలలో చదివిన విద్యార్థులెందరిని చూసినా మాధ్యమం వారి భాషను కాని, ఆలోచనను కాని ప్రభావితం చేసినట్టు కనిపించదు. మరోపక్క, గత కొన్ని దశాబ్దాలుగా తెలుగుదేశంలో విద్యాబోధన స్థాయి క్షీణిస్తూ వచ్చిన మాటా రహస్యమేం కాదు. ఈ స్థితిలో, విద్యాబోధన ఏ మాధ్యమంలో అన్న చర్చకు ముందు, ఏ విద్య? ఏ రకమైన బోధన? అన్న ప్రశ్నలు వివరంగా చర్చించబడాలి. కేవలం ఉపాధి కోసమే విద్య అనుకున్నప్పుడు అది ఏ మాధ్యమంలో ఉండాలి అనేది ఆర్థిక సామాజిక కారణాల బట్టే ఉంటుంది. కానీ విద్య కేవలం మనుగడ కోసం మాత్రమే కాదు. భాష మనిషికీ మనిషికీ మధ్య ఉన్న సంభాషణ అంతరించకుండా ఉండేందుకే కాదు. ఏ తరానికాతరంలో బుద్ధిజీవులను పెంచేదే విద్య అని, అందుకు తోడ్పడే భాష అవసరమని, మర్చిపోకూడదు. ఇప్పుడు మన తెలుగుదేశంలో జనం వెంపర్లాడుతున్న భాష, అది తెలుగైనా ఇంగ్లీషైనా, ఒక స్వంత ఆలోచననిచ్చే భాషగా ఉందా? మనం పిల్లలకు ఏ రకమైన విద్య నేర్పించాలనుకుంటున్నాం, నేర్పిస్తున్నాం, ఎందుకు, ఎలా నేర్పిస్తున్నాం? అన్న చర్చలు మొదవలవ్వాలి. మాధ్యమాల మార్పుకన్నా, శిక్షణలోనూ, శిక్షకులలోనూ మార్పు ముఖ్యమన్న ఎరుక అన్ని చర్చల్లోనూ ప్రధానంగా వినపడనంతకాలం, అవి ఎంతకాలం, ఏ స్థాయిలో నడిచినా ఏ లాభమూ లేదు.

కేవలం తన ఆలోచనలను అక్షరబద్ధం చేసుకొని చూసుకోవడమే రచయిత లక్ష్యమైతే సాహిత్యం అనేదే ఉండదు. తన ఊహలు, అభిప్రాయాలు, ఆలోచనలు పదిమందికి తెలుపవలసి ఉన్నదనే స్పృహ సాహిత్యానికి, ప్రత్యేకించి ఆత్మకథాసాహిత్యానికి మూలబీజం. రచనకు కావలసిన ముడిసరుకులన్నీ జీవితంలోనే ఉంటాయి. కానీ అనుభవాన్ని రచనగా మార్చే పాటవం, ఆ చెప్పడంలో తనలోకి తాను నిజాయితీగా చూసుకునే చూపు రచనలను మనకు దగ్గర చేస్తాయి. అనుభవాలు వ్యక్తిగతమై, మనిషి లోతులు, బలహీనతలతో సహా అర్థమవుతున్న కొద్దీ, ఆ రచయిత మనిషిగా పాఠకుడికి ఆప్తుడవుతాడు. బహుశా ఇందుకే ఆత్మకథలు ఎప్పుడు ఎవరు రాసినా చెల్లుతూనే ఉన్నాయి. అవి శ్రీపాద అనుభవాలూ- జ్ఞాపకాలూ, దాశరథి జీవనయానం లాగా తమ తమ జీవితాల సాక్షిగా పాఠకులకు ఆనాటి చరిత్రను పరిచయం చేయవచ్చు. అబ్బూరి వరదకాలం లాగా, ఆచంట జానకిరామ్ సాగుతున్న యాత్ర లాగా, తమ జీవితాల్లోని ముఖ్య సంఘటనలను, ప్రముఖుల సాంగత్యాన్నీ మాత్రమే పొందుపరచవచ్చు. లేదూ, తమ మామూలు జీవితానుభవాలనే ముళ్ళపూడి శ్రీదేవిలా నెమరేసిన మెమరీస్‌ గానో, సోమరాజు సుశీలలా ఇల్లేరమ్మ కతలు గానో చెప్పి ఆకట్టుకోనూవచ్చు. ఒక ‘నేను’ తన జీవితంలోని బాధనైనా సంతోషాన్నైనా, తనకు తానుగా సాధించుకున్న విజయాలైనా పరాజయాలైనా, తన తలపొగరైనా, గర్వభంగమైనా, పంచుకోదగినదేనని నిస్సంకోచంగా నమ్మి ఉండకపోతే, ఈ రోజు మనకు అందుబాటులో ఉన్న సాహిత్యంలో సింహభాగం వెలుగు చూసేది కాదు. నిరాధారమూ, అసమంజసమూ, అసందర్భమూ అయితే తప్ప, స్వోత్కర్ష, పరనింద కూడా సాహిత్యంలో చొరబడరానివేం కావు. అందుచేత, ఎవ్వరైనా ఏదైనా ఎలాగైనా చెప్పవచ్చు. కానీ, నిజం నిక్కచ్చిగా చెప్తున్నామన్న అపోహలో అకారణమైన అక్కసునీ, ఇతరుల పట్ల ద్వేషాన్నీ కథలుగా, ఆత్మకథలుగా రాయడం సరి కాదు. సాహిత్యానికున్న పరిధినీ విశాలమైన వేదికనూ స్వార్థ ప్రయోజనాల కోసం ఆక్రమించుకుంటే, ఇప్పటిప్పుడు అడ్డుకునేవారు లేకపోవచ్చు. అంతమాత్రాన, రాసినదంతా సాహిత్యమూ కాదు, సాహిత్య చరిత్ర అంతకన్నా కాబోదు. తాత్కాలికమైన ఉద్వేగాలూ స్నేహాలూ శత్రుత్వాలూ కాలంతో కరిగిపోయాక, నిజాయితీగా తమ కథలు వినిపించిన గొంతులే మిగిలి, ముందుతరాలకు తమ కాలపు సాహిత్య చరిత్రను నిష్పక్షపాతంగా చెప్తాయి.