బార్న్ టు ఫ్లయ్

ఎయిర్‌బార్న్ టు ఛెయిర్ బార్న్

కాళ్ళూ చేతులూ ఆడించడానికి నేను ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది. తట్టుకోలేని మెడ నొప్పి క్షణక్షణానికీ పెరిగిపోతోంది. నేను ఎందుకు కదలలేకపోతున్నానో ఒక్క క్షణం ఏమీ తోచలేదు. అయితే, నా పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని మాత్రం వెంటనే అర్థం అయింది. ఆ క్షణంలో, నన్ను కమ్ముకున్న ఆ నిస్పృహలో, నాకు తెలియకుండానే పెద్దగా అరిచానేమో, తెలియదు.

ఆ రాత్రి, ఆ భయంకరమైన 28 జూన్ 1988 నాటి రాత్రి, నా మనసంతా నిరాశానిస్పృహలతో, భయాందోళనలతో నిండిపోయింది. రాత్రి దాదాపు 11 గంటల సమయంలో, ఆరోజు ఫ్లయింగ్ డ్యూటీస్ పూర్తిచేసుకొని మోటార్‌సైకిల్‌పై ఆఫీసర్స్ మెస్‌కు తిరిగివస్తూ, పఠాన్‌కోట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లోని టెక్నికల్ ఏరియా గేట్‌కు కొంచం ముందుగా ఉన్న ఒక కొయ్య రోడ్ బ్యారియర్‌ను గుద్దుకోవడంతో, నేరుగా నా తల వెళ్ళి ఆ బ్యారియర్‌కు తగిలింది. ఆ తాకిడికి నా మెడ పూసలు విరిగిపోవడంతో మెడ కిందనుంచి ఏ భాగమూ కదలిక లేకుండాపోయింది. ప్రమాదం జరిగిన పదిహేను నిమిషాలకు స్పృహతప్పి పడిపోయి ఉన్న నన్ను స్టేషన్ క్వార్టర్స్ లోకి తీసుకొని వెళ్ళారు. ఆ తీసుకుపోయే తొందరలో నా మెడకింద ఎలాంటి ఆధారం ఇవ్వకపోవటంతో తల వెనుకకు వాలిపోయి, ఇంకా తల మీదనే ఉన్న హెల్మెట్ తాకిడికి విరిగిపోయిన మెడ ఎముకలు వెన్నుపాములోకి గుచ్చుకొనిపోవడంతో మెడ కింది శరీరమంతా పూర్తిగా చచ్చుపడిపోయింది. ఆ రాత్రి నన్ను పఠాన్‌కోట్ మిలిటరీ ఆస్పత్రిలో ఉంచి, మర్నాడు ఢిల్లీలోని ఆర్మీ హాస్పిటల్‌కు తీసుకువెళ్ళారు. అక్కడి డాక్టర్లు వెంటనే నా మెడకు సర్జరీ చేసినా లాభం లేకపోయింది. ఢిల్లీ ఆర్మీ హాస్పిటల్‌లో ఉన్న పదిహేను రోజుల్లో అప్పుడప్పుడూ నాకు స్పృహ తెలిసినా, ఎక్కడున్నానో, నా చుట్టూ ఏం జరుగుతుందో, చావు బతుకల మధ్య నేనెలాంటి పోరాటం చేశానో–ఇవేవీ నాకు గుర్తు లేవు. అలా, రెండు వారాల తరువాత నన్ను, జులై 12న, పుణేలో ఉన్న కిర్కీ మిలిటరీ హాస్పిటల్‌ లోని స్పైనల్‌ కార్డ్ సర్జరీ సెంటర్‌కు మార్చారు.

అక్కడ చేరిన రెండు వారాలకు, కొద్దిగా స్థిమితపడ్డాక, ధైర్యం కూడగట్టుకొని, నా పరిస్థితి ఏమిటి, ఇక జరగబోయేది ఏమిటి? అని మెడికల్ ఆఫీసర్‌ని వాకబు చేశాను. ఆయన ఏమీ మాట్లాడకుండా చేతులెత్తి ప్రార్థిస్తున్నట్టు పైకి చూశారు. ఆయన ఉద్దేశ్యం, ఇక అంతా ఆ దేవుడి దయ మా చేతిలో ఏమీ లేదు అనో, దేవుడున్నాడు నిన్ను ఇక ఆయనే కాపాడతాడన్న భరోసానో, మరింకేమో కాని, ఆయనలా చేయటం చూడగానే నా ఆశలన్నీ బుడగలలాగా పగిలిపోయాయి. నా పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉందో, నా వైకల్యం ఎంత ఘోరమైనదో కూడా అర్థమయ్యింది. జీవితంలో ఆటుపోట్లు అంతకుముందూ వచ్చాయి కాని అవి నన్నేమీ భయపెట్టలేదు. అటువంటి పరిస్థితులు నన్ను కాస్త అయోమయంలోకి నెట్టేవి కానీ ఎప్పుడూ వాటిని ఎదురుకోగలిగేవాణ్ణి. కానీ, ఇలాంటి పరిస్థితి నాకొస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఒకవేళ ముందే తెలుసున్నా కూడా, ఇలాంటి ప్రమాదం కోసం ఎలా సిద్ధపడతాం? విధివిలాసం అని ఎలా రాజీపడతాం? రోజులు గడుస్తున్నా నా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడకపోయేసరికి దేవుడిపై నాకున్న రవ్వంత నమ్మకం కూడా పటాపంచలయ్యింది.

మెడ దగ్గర వెన్నుపూసలు విరిగిపోవడంతో కాళ్ళూ చేతులూ చచ్చుపడి, క్వాడ్రిప్లీజిక్‌గా మారిన నా శరీరం మంచానికీ, చక్రాల కుర్చీకే పరిమితమైపోయింది. నా జీవితం ఇక పూర్తిగా పరాధీనమయింది. కేవలం స్పర్శ లేకపోవడం కాదు, కాళ్ళు చేతులు కదిలించలేకపోవడమూ కాదు. రోజువారీ పనుల సంగతి అటుంచి ప్రతీ చిన్న పనికీ, ఇతరుల మీద ఆధారపడవలసి వచ్చింది. కనీసం చెవి గీరుకోవాలన్నా, ఒంటి మీద వాలిన ఈగను తోలుకోవాలన్నా కూడా ఎవరో ఒకరు చేసిపెట్టవలసిందే. శరీరంలో ఏమాత్రమూ కదలిక లేకపోవడంతో రానురానూ కండరాలు బలహీనపడి చిక్కిపోయాయి. అందువల్ల రెండు నెలల్లోనే నా ఆకారం పూర్తిగా మారిపోయింది. అద్దంలో నా బదులు, ఒక ముడతలు పడ్డ చర్మం కప్పుకున్న అస్థిపంజరం కనిపించేది. డిప్రెషన్ మొదలవడం, దానితోపాటు మరికొన్ని చికాకులు రావడంతో రెండేళ్ళపాటు కిర్కీ మిలిటరీ హాస్పిటల్లోనే నేను ఉండిపోవాల్సి వచ్చింది. ఆ రెండేళ్ళలో ఉదాసీనతను, ఓటమిని ఎలా ఎదురుకోవాలో, డిప్రెషన్ నుంచి ఎలా బైటపడాలో మెల్లిగా నేర్చుకున్నాను. ఏదేమైనా మనసులో బాధను ముఖం మీద నవ్వుతో కప్పిపుచ్చటం నేర్చుకున్నాను. ఎయిర్ ఫోర్స్‌లో పనిచేసేందుకు నేనింక పనికిరాను కాబట్టి నన్ను 1990, ఏప్రిల్ 12న విధులనుండి తప్పించారు. అలా ఒక చిన్న ప్రమాదం పెనుభూతంగా మారి నా ఆశయాలూ ఆకాంక్షల పైనా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో నా కెరియర్ పైనా చావుదెబ్బ కొట్టింది. అదే ఏడాది ఆగస్ట్‌ నెలలో, కేవలం ఇరవయ్యారేళ్ళ వయస్సులో, నా జీవితంలోని రెండవ దశను మళ్ళీ కొత్తగా ప్రారంభించడానికి కిర్కీలోనే ఉన్న పారాప్లీజిక్ హోమ్‌లో చేరాను.

నేను పుట్టిందీ పెరిగిందీ తిరువనంతపురంకు సుమారు 35 కి.మీ. ఉత్తరాన ఉన్న చిరయింకీల్ అనే ఒక చిన్న ఊరిలో. తొమ్మిదో యేట తిరువనంతపురంలో ఉన్న కళక్కూటం సైనిక స్కూల్‌లో చేరాను. నాది దూకుడు స్వభావం కాకపోవడంతో ప్రతీదీ శ్రద్ధగా నిదానంగా చేసేవాణ్ణి. అలా అటు చదువులోనూ ఇటు ఆటల్లోనూ కూడా నిలకడగానే రాణించాను. ఆ తర్వాత, పుణేలోని ఖడక్‌వాస్లాలో ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడెమీ 65వ కోర్స్‌లో అత్యుత్తమ ఎయిర్ ఫోర్స్ కేడెట్‌గానూ, సికిందరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడెమీ 134వ పైలట్స్ కోర్స్‌లో శిక్షణ ముగించుకొని, ఎయిరోబేటిక్స్ విభాగంలో ఉత్తమ కేడెట్‌గానూ ఎంపికయ్యాను. 1984లో భారత వైమానిక దళంలో ఫైటర్ పైలట్‌గా పోస్టింగ్ ఇచ్చారు. ఏడు వందల గంటలకు పైగా మిగ్-21 విమానం నడిపిన అనుభవాన్ని నా స్వంతం చేసుకున్నాను.


అనిల్ కుమార్ నోటిరాత

వృత్తిలో అయినా, వ్యక్తిగత జీవితంలో అయినా అనుకోని ఉపద్రవం నాకు ఎదురైనప్పుడు దాన్ని హేతుబద్ధంగా అర్థంచేసుకొని, దాటిపోవడానికే ప్రయత్నించేవాణ్ణి కానీ ఏదీ, ఎందుకూ అనేది అర్థం అయేది కాదు. అలా జరిగిన ఉపద్రవాలన్నీ ఎందుకిలా అన్న ప్రశ్నకు అయోమయాన్ని, ఉదాసీనతనూ మాత్రమే జవాబుగా మిగిల్చేవి. ఇక వాటితో అలా రాజీపడి గడపడమే అలవాటు చేసుకున్నాను. కానీ ఇప్పుడు, ఈ వైకల్యం వల్ల తలెత్తిన సవాళ్ళను ఎదుర్కోవడానికి నాకై నేను విధించుకున్న ఉదాసీనత నుంచి బయటపడక తప్పలేదు. అందుకని నేను 1990 సెప్టెంబర్‌లో, రాయడం నేర్చుకోవాలని నిశ్చయించుకున్నాను. అందుకు నా చేతులు సహకరించవు కాబట్టి, నోటితో పెన్ను పట్టుకొని రాయడం ఒక్కటే మార్గం. నోటితో పెన్ పట్టుకొని తల వంచి కాగితం మీద అక్షరాలు రాద్దామని ప్రయత్నించాను. అన్నీ కొక్కిరి గీతలే వచ్చాయి. మూడు వారాలపాటు ఎంత కష్టపడినా రాతేమీ పెద్దగా మారకపోవడంతో విసుగనిపించింది. ఇక ఇలా కాదని, నాకు ఈ సలహా ఇచ్చి, మొదటినుంచీ నన్ను వెంటపడి పోరాడిన షీలా జార్జ్‌కి ఉత్తరం రాయాలని నిర్ణయించుకున్నాను. అప్పటిదాకా ఆమె చెప్పేదేమీ నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇక ఆమె చెప్పిన కొత్త పద్ధతిలో ప్రయత్నించి, మొట్టమొదటిసారిగా నోటితో రాసిన ఆ ఉత్తరంలో కొన్ని వాక్యాలను అర్థమయేలా రాయగలిగినప్పుడు ఎంత సంతోషంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. మొదట్లో సులభం కాలేదు, చాలా కష్టపడవలసి వచ్చింది కానీ నాలుగైదు నెలలు శ్రద్ధగా ప్రయత్నం చేశాక నా రాత చదవడానికి వీలుగా మారింది. ఈ చిన్నపాటి విజయం నాకు ఎంతగానో ఉపయోగపడింది. కేవలం పాత సంబంధాలను ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా తిరిగి కొనసాగించడమే కాకుండా, కొత్త మిత్రులను కూడా సంపాదించుకోగలిగాను.

ఇలా ఒక ఏడాది గడిచినాక, 1991 మే నెలలో భారత వాయుసేన పుణ్యమా అని, నాకు ఇంగ్లండ్ నుంచి తెప్పించిన ఒక ఎలక్ట్రిక్ వీల్‌ఛెయిర్ బహుమతిగా వచ్చింది. దాన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక జాయ్ స్టిక్ ఉంటుంది. దాని మీద గడ్డాన్ని ఆన్చి ముందుకూ వెనుకకూ పక్కలకూ కదిలిస్తూ వీల్‌ఛెయిర్‌ను పూర్తిగా కంట్రోల్ చేయచ్చు. సొంతకాళ్ళ మీద నడవగలిగే స్వాతంత్ర్యంతో పోలిస్తే ఇదేమీ పెద్ద విశేషం కాకపోయినా, ఇది నా రోజువారీ జీవితానికి ఒక కొత్త ఉత్సాహానిచ్చింది.


బార్న్ టు ఫ్లయ్; నితిన్ సాఠే, 2007.

ఇంతలో నా స్నేహితుడు వింగ్ కమాండర్ మురళీధరన్, ఇలా చేతితో రాసే బదులు కంప్యూటర్ వాడచ్చు కదా అన్న ఆలోచన పట్టుకొచ్చాడు. మురళీధరన్ అంతకుముందు నా ఫ్లైట్ కమాండర్, మిగ్ విమానాలమీద ఇద్దరం కలిసే పనిచేశాం. కంప్యూటర్ వాడడం వల్ల నేను మరింత సమర్థవంతంగా పనిచేయగలనని అతని సూచన. వింగ్ కమాండర్ జోగ్, డా. కులకర్ణిలిద్దరూ అప్పుడప్పుడూ నాకు ప్రోగ్రామింగ్ నేర్పిస్తూ ఉండేవాళ్ళు. వారే కంప్యూటర్ వాడకం వల్ల కలిగే లాభాలు వివరించి, నా అవసరాలకు తగ్గట్టు కీబోర్డ్ ఎలా ఉండాలో కూడా ఆలోచించారు. కొన్ని కంప్యూటర్ కంపెనీలతో చర్చలు జరిపారు. కానీ, ఏదీ సఫలం కాలేదు. వారి తల అడ్డంగా ఊగిన ప్రతీసారీ నా పట్టుదల కొద్దికొద్దిగా సడలుతూ వచ్చింది కానీ ఎలాగోలా ఒక కంప్యూటర్ సాధించకపోనన్న ఆశ మాత్రం బలంగానే ఉండింది. చివరకు 1992 ఫిబ్రవరిలో వేరే దారిలేక అప్పటికి ఆ ఆలోచనను మానుకోవలసివచ్చింది.

ఇదే సమయంలో టీచర్‌గా పనిచేద్దామనే ఆలోచన కూడా వచ్చింది. కానీ, ఏదో తెలియని జంకుతో వచ్చిన అవకాశాలన్నిటినీ తోసిపుచ్చుతూ వచ్చాను. ఎప్పుడే అవకాశం వచ్చినా ఏదో ఒక సాకు అప్పటికప్పుడు కల్పించుకొని తప్పించుకునేవాణ్ణి. నా ముందు ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఒకప్పుడు ఎలా కాక్‌పిట్‌లో కూర్చొని యుద్ధవిమానాన్ని కంట్రోల్ చేస్తూ నా జీవితాశయాన్ని సార్థకం చేసుకున్నానో, అలానే ఇప్పుడు కూడా ఈ వీల్‌చెయిర్లో కూర్చొని ఇక ముందు జీవితాన్ని, నా ఈ జీవితపు రెండో దశను కూడా అంతే సార్థకం చేసుకోగలనన్న నమ్మకం నాకుంది.

నమ్మండీ నమ్మకపోండి గానీ, కష్ట సమయాలు ఎప్పుడూ మంచి రోజులకే దారి తీస్తాయి. అసాధ్యంగా భావించే అడ్డంకులను అధిగమించాలంటే, ముందు వైకల్యం అనే ఆలోచననే మన మనసులోంచి తీసేయాలి. ఆ తరువాత తక్కిన శక్తిసామర్థ్యాలను కూడదీసుకొని మనకున్న బలాన్ని నిండు హృదయంతో ఒక లక్ష్యం కోసం వినియోగించుకోవాలి. కేవలం శారీరక సామర్థ్యం, సాధారణమైన తెలివితేటలూ మాత్రమే కాదు, విజయాన్ని సాధించాలనే తృష్ణ, తిరుగులేని పట్టుదల ఉంటే వాటితో మన భవిష్యత్తును పడుగూ పేకలుగా మనమే అల్లుకోవచ్చు. విధి అంటే మనచేతిలో ఉన్న ఈ అల్లికే. ఈ అల్లిక ఎంత కష్టంగా ఉంటే, ఆ విజయం అంత తీయగా ఉంటుంది. మన జీవితం అంత ఆనందంగానూ, సంతృప్తిగానూ ఉంటుంది.

11 అక్టోబర్, 1994.
పారాప్లీజిక్ హోమ్, కిర్కీ
పుణే – 411 020.

[1964లో కేరళలో జన్మించిన ఎం. పి. అనిల్ కుమార్ భారతీయ వాయుసేనలో మిగ్-21 ఫైటర్ పైలట్‌గా పనిచేసేవారు. 24యేళ్ళ వయసులో జరిగిన ఒక మోటర్‌సైకిల్ ప్రమాదంలో అతని మెడ క్రింది శరీరమంతా అచేతనమయిపోయింది. జీవితమంతా చక్రాల కుర్చీలో గడపవలసి వచ్చింది. ఆ సమయంలో, అతను నోటితో కలం పట్టుకొని రాయడం నేర్చుకున్నారు. 1994లో, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక నిర్వహించిన కౌంటర్ పాయింట్ వ్యాసరచన పోటీలలో అతను నోటితో రాసిపంపిన వ్యాసానికి–ఎయిర్‌బార్న్ టు ఛెయిర్‌బార్న్–ప్రథమ బహుమతి లభించింది. ఆ వ్యాసం నిజంగా నోటితో రాయబడినదని కిర్కీ పారాప్లీజిక్ హోమ్‌ను సంప్రదించి నిర్ధారించుకొనేదాకా ఆ పోటీ నిర్వాహకులు నమ్మలేకపోయారట. ఆపై ఆ వ్యాసాన్ని అలానే యథాతథంగా ప్రచురించారు. ఆ వ్యాసం ఎంతో ప్రాచుర్యాన్ని పొంది, ఎందరికో గొప్ప స్ఫూర్తినిచ్చింది. చివరి క్షణందాకా మానవ జీవనస్ఫూర్తికి నిలువెత్తు ఆదర్శంగా నిలిచిన అనిల్, 20 మే 2014న, తన యాభైవ యేట కేన్సర్ వల్ల కీర్తిశేషుడైనారు. ఆ ప్రముఖ వ్యాసాన్ని ఈమాట పాఠకుల కోసం అనువదించిన రచయితకు మా కృతజ్ఞతలు – సం.]