విభజన మిగిల్చిన నెత్తుటి చారలు ఈ నల్లటి గీతలు.
అప్పుడు హత్యలూ జరిగాయి, మానభంగాలూ జరిగాయి. బలవంతపు మతమార్పిడిలూ జరిగాయి. మతమార్పిడికి ఒప్పుకోక బలవన్మరణాలూ జరిగాయి.
పంద్రాగష్టు అంటే స్వాత్రంత్య దినోత్సవం అని చెప్పుకొస్తారు. కానీ ఒక్క గీతతో, కొందరి సంతకాలతో తరతరాలుగా ఉన్న నేల పరాయిదవటమంటే ఏంటో ఎవరూ చెప్పరు. ఉన్నపళంగా, కట్టు బట్టలతో, ఇల్లూ-వాకిలీ, గొడ్డూ-గోదా అన్నీ వదులుకొని ప్రాణాలు అరచేత పట్టుకొని పారిపోవటం ఊసెత్తరు. దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న ఇరుగూ-పొరుగే ప్రమాదంగా మారటమంటే ఏంటో చెప్పరు. ముఖ్యంగా, ఎప్పుడూ ఏ ఆయుధమూ పట్టుకోని ఒక మామూలు మనిషిలో మరో మనిషిని చంపితే గానీ తాను సురక్షితం కాదన్న భయం ఎలా పుడుతుందో, అంతటి అభద్రతను ఎవరు ఎలా పెంచి పోషిస్తారో… హుష్… అది అసలే చెప్పరు.
అందుకే విభజనను గుర్తించే మ్యూజియం పెట్టుకోడానికి మనకు డెబ్భై ఏళ్ళు పట్టింది.
విభజనకు సంబంధించిన సాహిత్యం, సినిమాలు లేవని కాదు. ఆ తరంలో ఆ దారుణాన్ని భరించినవాళ్ళు బాగానే రాశారు దాని గురించి. సినిమాలూ వచ్చాయి. కానీ అదెప్పుడో, ఎక్కడెక్కడో, వాళ్ళెవరికో జరిగిందనట్టు… దూరంగా, విసిరేసినట్టు, కింద పడితే లేచి మట్టి దులుపుకొని పోయినట్టు…
‘కాదు, కాదు, అది ప్రకృతి విలయానికి తట్టుకోలేక ఓడిపోవడం కాదు. అది ఆధునిక ఆయుధాలకి బలి అవ్వడం కాదు. అది మనిషి మీదకు మనిషిని ఉసిగొల్పడం’ అని మనకి అర్థమైపోతే? ఇప్పుడు, ఇక్కడ, మనకే జరుగుతుందది అని మనకి తెలిసిపోతే? అందుకే అంతా గప్‌చుప్!
మంటో ‘సియా హాషియే’ అందుకే ప్రత్యేకం! ఇందులో చంపడం, చావడం మాత్రమే ఉండదు. వాటి చుట్టూ అల్లుకున్న వివశత, వెర్రితనం కూడా ఉంటాయి. వాటిని గురించి వెగటూ ఉంటుంది, వెటకారమూ ఉంటుంది. ఏడ్వలేక నవ్వటమూ ఉంటుంది. అంతటి విపరీత పరిస్థితుల్లోనూ ఒకడిని ఒకడు దోచుకోవడమూ ఉంటుంది. అంతటి గందరగోళంలోనూ ఆడ-మగ, పేద-ధనిక, బలవంతుడు-బలహీనుడు మధ్య మారని హెచ్చుతగ్గులను నాలుగేసి వాక్యాల కథల్లో పట్టుకున్నది కేవలం ఆయనే.
ఇట్లాంటి కథలు రాసి మంటో ‘శవాల మీద చిల్లరేరుకున్నాడు’ అని ఎవరో అనే ఉంటారు. ‘నేను నల్లటి పలక మీద తెల్లటి బలపంతో రాస్తాను, ఎందుకంటే ఆ తెలుపు వల్ల నలుపు మరీ స్పష్టమవుతుంది.’ అని మంటోనే ఇంకో చోట చెప్పుకున్నాడు. కానీ, గతానికి మొత్తం సున్నం కొట్టి తెల్లగా మార్చేసి, విభజన గురించి మనం మర్చిపోయేలా చేశాక, మంటో కథలు ఆ సున్నాన్ని గీరి నల్లటి నిజాన్ని చూపించే గాట్లు! ఈ గాట్ల వల్లనే ఎంత సున్నం కొట్టారో, ఇంకా కొడుతున్నారో స్పష్టంగా తెలిసివస్తుంది.
అటు హిందూస్తాను గానీ, ఇటు పాకిస్తాను గానీ కాని నేలమీద టోబా టేక్ సింగ్ కుప్పకూలిపోతాడు గానీ, మంటో మాత్రం అక్కడే తచ్చాడుతూ ఉంటాడు. అటూ ఇటూ ఉన్న కంచెలు చేసిన ఘోరాలని మనకి వినిపిస్తూనే ఉంటాడు. మన చుట్టూ పుట్టుకొస్తున్న కంచెల గురించి ఆలోచించుకోమంటూ… – పూర్ణిమ.
బూటు
అల్లరిమూక దారి మార్చింది. సర్ గంగారామ్ బొమ్మ మీద విరుచుకుపడింది.
లాఠీదెబ్బలు కురిపించారు. ఇటుకలు, రాళ్ళు విసిరారు. ఒకడు మొహానికి తారు పూశాడు.
ఇంకొక్కడు పాత బూట్లను జమచేశాడు. వాటిని దండలా గుచ్చి బొమ్మకి వేయడానికి ముందుకు వెళ్ళాడు.
అంతలో పోలీసులు వచ్చారు. తూటాలు పేల్చడం మొదలుపెట్టారు. చెప్పుల దండ వేద్దామనుకున్నవాడికి గాయాలయ్యాయి.
అతడికి మందేసి, పట్టీ కట్టడానికి సర్ గంగారామ్ ఆసుపత్రికే పంపించారు.
బందోబస్తు
మొదటి దొమ్మీ ఆ సందు మొదట్లో ఉన్న హోటలు దగ్గర జరిగింది. వెంటనే అక్కడ ఒక సిపాయిని కాపలాకని పెట్టారు.
రెండో దొమ్మీ రెండో రోజు సాయంకాలం పచారీ దుకాణం దగ్గర జరిగింది. సిపాయిని మొదటి సంఘటనా స్థలం నుండి తప్పించి, రెండో ఘటనా స్థలం వద్ద కాపలా ఉంచారు.
మూడో కేసు రాత్రి పన్నెండింటికి లాండ్రీ దగ్గర జరిగింది.
ఇన్‌స్పెక్టర్ సిపాయిని ఈ మూడో ఘటనా స్థలానికి కాపలా కాయడానికి వెళ్ళమని ఆదేశిస్తున్నప్పుడు, అతడు కొంచెం దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు: “నన్ను గొడవ జరగబోతున్న చోటుకి పంపండి.”
సారీ
కత్తి
కడుపును కోస్తూ
బొడ్డు కిందవరకూ వెళ్ళింది
నాడా తెగింది
కత్తితో పొడిచినవాడి
నోటి నుండి
కల్మా-ఎ-తసర్రుఫ్ వినిపించింది
“ఛ! ఛ! ఛ… మిస్టేక్ అయిపోయింది.”
దయ
“నా కళ్ళముందే
ఎదిగిన నా కూతురుని
చంపకండి.”
“సరే! అతని మాట ఎందుకు కాదనడం?
బట్టలు ఊడదీసి
ఒక మూలకి పడేయండి.”
శుభ్రత
బండి ఆగుంది.
తుపాకీలు పట్టుకున్న ముగ్గురు ఒక డబ్బా దగ్గరకు వచ్చారు. కిటికిల్లోంచి లోపలకి తొంగిచూసి, ప్రయాణికులని అడిగారు: “జనాబ్! కోడిపుంజు ఏమైనా ఉందా లోపల?”
ఒక ప్రయాణికుడు ఏదో చెప్తూ ఆగిపోయాడు. తక్కిన ప్రయాణికులు జవాబు ఇచ్చారు: “లేదండి!”
కొంతసేపటికి బల్లాలు పట్టుకున్న మరో నలుగురు వచ్చారు. కిటికిల్లోంచి లోపలకి తొంగి చూస్తూ ప్రయాణికులని అడిగారు: “ఏం జనాబ్? ఏదైనా కోడీ-గీడీ ఉందా లోపల?”
ఇందాక ఏదో చెపుతూ ఆగిపోయిన ప్రయాణికుడు, జవాబు ఇచ్చాడు. “తెలీదండి. మీరు లోపలికి వచ్చి పాయఖానాలో ఓసారి చూడరాదూ?”
బల్లాలు పట్టుకున్నవారు లోపలకి వచ్చారు. టాయిలెటు బద్దలు కొడితే అందుల్లోంచి ఒక కోడిపుంజు బయటకి వచ్చింది.
బల్లెం పట్టుకున్న ఒకతడు అన్నాడు: “హలాల్ చేసేయ్.”
ఇంకొకడు అన్నాడు: “వద్దొద్దు. డబ్బా ఖరాబు అయిపోతుంది. బయటకి తీసుకుపో…”
సామ్యవాదం
అతను తన ఇంట్లో ఉన్న అన్ని ముఖ్యమైన సామాన్లూ ఒక ట్రక్కులో వేయించి ఇంకో పట్టణానికి వెళ్తున్నాడు.
దారిలో అల్లరి మూకలు అతణ్ణి అడ్డుకున్నాయి.
ఒకడు ట్రక్కులో ఉన్న సామానుని ఆరాగా చూస్తూ అన్నాడు: “దేఖో యార్! ఇంత సామాను తీసుకొని నువ్వొక్కడివే ఎక్కడికి తుర్రుమంటున్నావ్?”
సామాను యజమాని నవ్వుతూ బదులిచ్చాడు: “జనాబ్! ఇదంతా నా సామాను.”
ఇద్దరు ముగ్గురు మనుషులు నవ్వారు: “మాకంతా తెల్సు!”
ఒకడు అరిచాడు: “దొరికింది దొరికినట్టు దోచుకోండి. ఇతడు ధనవంతుడు. ట్రక్కు తీసుకొని దొంగతనాలు చేస్తున్నాడు.”
గర్హణ
“చూడయ్యా,
నువ్వు బ్లాక్ మార్కెట్టు
రేటున డబ్బులు తీసుకున్నావ్
కానీ, ఎంత చెత్త
పెట్రోల్ ఇచ్చావ్
అంటే
ఒక్క దుకాణం
కూడా తగలబడలేదు…!”
విశ్రాంతి కావాలి
“చావలేదు… చూడు, ఇంకా ప్రాణం మిగిలే ఉంది.”
“ఉండనీ… నాకింక ఓపిక లేదు.”
అదృష్టం
“ఏం లేదు, దోస్త్
ఇంత కష్టపడ్డాక
కేవలం
ఒక బాక్సు చేతికి
చిక్కింది, కానీ అందులోనూ
సాలా, పంది
మాంసం బయటపడింది.”
కంటిలో కొవ్వు
“మా _______వాళ్ళు కూడా ఎలాంటోళ్ళంటే…
యాభై పందులు ఎంతో కష్టపడి
వెతికితే దొరికాయి. మసీదులో కోశాము.
అక్కడ గుళ్ళల్లో చకచకా
ఆవు మాంసం అమ్ముడుపోతోంది.
కానీ, ఇక్కడ పంది మాంసం కొనడానికి
ఎవరూ రావటమే లేదు!”