ఆత్మహత్య కథలు-అ

1. కాలం, బాల్యం

అతణ్ణి మొదటిసారి చూసినపుడు మాసిన పంచ కట్టుకుని ఉన్నాడు. చొక్కా కూడా వేసుకోలేదు. అర్ధనగ్నంగా చాలా దరిద్రంగా ఉన్నాడు.

ఆ తర్వాత అతణ్ణి చూడనేలేదు.

ఎవరెవరి బాల్యమో అనవసరంగా వచ్చి మనసులో మోకరిల్లుతోంది. మోకాళ్ళమీద ఎలా ఉండగలుగుతోందో తెలీడంలేదు. చక్కటి పొజిషనే మరి.

అతణ్ణి చూసిన ఆ క్షణంలో ఉన్నట్టుండి ఒక విజిటింగ్ కార్డ్ నా చేతబెట్టి, ఆ క్షణాన్ని ఫ్రీజ్ చేసి, అతను మాత్రం ఆ క్షణం నుండి తప్పుకున్నాడు.

నేను మాత్రం ఆ క్షణం లోనే ఉన్నాను. అప్పుడు స్పృహ వచ్చినవాడిలా నా చేయి విజిటింగ్ కార్టుని తడిమింది.

దానిపై, డా. శాంతి, సైకియాట్రిస్ట్ అని ఉంది.

2. నోస్టాల్జియా

శాంతిని పదేళ్ళ తర్వాత అనుకోకుండా చూసినపుడు కొంచం ఒళ్ళు చేసిందనిపించింది. ఒకప్పటి అందం లేదు. శాంతి తెలివైంది. మామూలుగా అయితే ఇలాంటి సందర్భాల్లో, గుర్తుపట్టలేనట్టు లాంటి పదాలు తప్పనిసరిగా పడాలి. అందుకే ఎంతో ముందుచూపుతో ఆమె తన ఆధార్ ఐడీ కార్డుని పెద్ద ఫ్లెక్సీ మీద ప్రింట్ చేసి అది చేత్తో పట్టుకొని తిరుగుతోంది ప్లకార్డ్ లాగా.

‘శాంతీ’ అన్నాను ఎంతో గారంగా.

‘గారంగా అంటే ఏంట్రా?’ అనడిగింది.

‘…’

‘పదేళ్ళు గడిచినా అలానే ఉంటారా ఏంటి? నీ పెళ్ళామేమైనా బోన్సాయ్ పెళ్ళామా’ అని కస్సుబుస్సులాడింది. ‘రోజూ నీలాంటి నోస్టాల్జిక్ శాల్తీలకోసమే దీన్ని మోసుకు తిరగాల్సొస్తుందిరా’ అంటూ ఆ పెద్ద ఐడీ కార్డుని కింద పెట్టింది.

‘గతమంతా గుర్తుందా’ అంటూ మాటలు కలిపాను.

‘కాకపోతే భవిష్యత్తు గుర్తుంటుందా? లేక వర్తమానం గుర్తొస్తుందా? ఎందుకురా ఇలా వందలేళ్ళుగా టార్చర్ చేస్తారు? నీ స్క్రిప్టులో ఇంకా ఏం టెంప్లేట్స్ ఉన్నాయో చూపించు, ఆ తర్వాత నీతో మాట్లాడాలో వద్దో నిర్ణయించుకుంటాను.’

‘రా, వెళ్ళి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ అంటూ ఎన్నో ఏళ్ళుగా మనసు పొరల్లో దాచుకున్న ప్రేమనంతా నా చేతిలోకి కేంద్రీకరించి తన చేయి పట్టుకున్నాను.

ఫ్లెక్సీ తీసి నా తలమీద ఒక దెబ్బ కొట్టింది.

‘మనసు పొరల్లోనుండి నిన్నెవడ్రా ప్రేమను వెలికి తీయమంది? ఒకటే కంపు’ అంటూ క్యాకరించి ఉమ్మింది. పరిమళం గుబాళించింది.

‘టిఫిన్ తిన్నాక చివరిగా టీ తాగుతారు గాని, ముందుగా టీ తాగుదాం అని పిలుస్తున్నావు’ అని విసుక్కుంటూ, నా ఐడి కార్డు చూపించమంది.

ఎంత వెతికినా దొరకలేదు. హమ్మయ్యా… ఎలాగో ఒకలా… ‘ఏంట్రా అది ఎలాగో ఒకలా’ అని మళ్ళీ కొట్టింది.

దొరికింది. ఆమెకు చూపించాను.

‘నాతో రా. దీన్ని పెద్ద సైజులో ఎన్‌లార్జ్ చేసి ప్రింటు చేయించి ఒక మినీలారీకి కట్టించుకుని, నువ్విక ఎక్కడికెళ్ళినా అందులోనే వెళ్ళాలి’ అని ఆర్డర్ వేస్తూ, నన్ను ఫ్లెక్సీ ప్రింటింగు షాపుకు ఈడ్చుకెళ్ళింది.

3. అమ్మ… తాబేలు…

స్వయం సుబ్బారావు, పస పాపారావు పుట్టుకతో శత్రువులు. ఒకరిమీదొకరు పగ తీర్చుకోడానికే స్నేహితుల్లా నటించుకోవడం మొదలుపెట్టి, అది వాళ్ళకు సౌకర్యంగా ఉండటంతో ఇక చేసేదేం లేక అలానే కొనసాగిస్తున్నారు.

ఈ ప్రపంచంలో మానవులుగా పుట్టి భవసాగరాలు ఈదుతున్న ఎందరో అల్పజీవుల యథార్థ జీవితాలను చూడటంవల్లనూ, ప్రపంచ సాహిత్యాన్నంతా వల్లెవేయడంవల్లనూ వీళ్ళిద్దరూ ఒక నిర్ణయానికొచ్చారు. అదేంటంటే అందరూ అమ్మ చనిపోయాక, ‘అమ్మ బతికుండగా ఆమెకు నేనేం చెయ్యలేదే’ అన్న పశ్చాత్తాపానికీ, భావోద్వేగానికీ, దుఃఖానికీ లోనై తీవ్రంగా ఏడుస్తున్నారు. అలాంటివాళ్ళు, వాళ్ళ ఏడుపేదో ప్రశాంతంగా వాళ్ళేడ్చుకోక, వచ్చే పోయే ప్రతి ఒక్కర్నీ పిలిచి, ‘సార్, నేను మా అమ్మకంటూ ఏమీ చెయ్యలేదు సార్’ అంటూ ఏనుగు ఉచ్చ పోసినట్టు భోరున కన్నీళ్ళు కారుస్తూ ఏడ్చి, తల్లికి చెయ్యాల్సినవన్నీ సక్రమంగా చేసిన వాడికంటే వీడే గొప్పోడన్న పేరు కొట్టేస్తున్నారు. వినేవారికి ఎక్కడ లేని పాపభీతినీ, అపరాధభావాన్నీ, మానసిక ఒత్తిడినీ కలిగించేస్తున్నారు.

ఈ పరిస్థితి మన జీవితాల్లో చోటుచేసుకోకూడదని నిర్ణయించుకున్నవారు, వారి వారి అమ్మలకు అన్నీ చెయ్యాలి అని సంకల్పించుకున్నారు.

స్వయం సుబ్బారావు కనిపించిందల్లా కొనిపెట్టాడు అమ్మకు. ప్రతి రోజూ, ‘నువ్వేదైనా చెప్పమ్మా నేను వింటాను’ అని గంట సమయం అమ్మ ముందర కూర్చుని చెప్పమని పొరుపెట్టేవాడు. చివరిగా పేకేజి టూర్ బుక్ చేసి స్విజర్లేండుకు పంపించి అమ్మను చంపేశాడు. ‘నేను మా అమ్మకు అన్నీ చేశాను’ అని సంతోషంగా అందరికీ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు.

పస పాపారావుకు తండ్రి లేడు. అమ్మ కోసం మేట్రిమోనియల్ ప్రకటన ఇచ్చాడు. ప్రకటనకు వచ్చిన రెస్పాన్స్‌లను గూర్చి చర్చించేందుకు స్వయం సుబ్బారావుని తీసుకుని ఇద్దరికీ కామన్ ఫ్రండయిన గుడ్ల కుప్పయ్య ఇంటికి వెళ్ళాడు.

కుప్పయ్య పెళ్ళాం బాత్రూమ్‌లో స్నానం చేస్తూ ఉంది. గుడ్ల కుప్పయ్య తలుపు సందులోనుండి చూస్తూ ఉన్నాడు.

స్వయం సుబ్బారావు సంచిలో ఉన్న ఐదు తాబేళ్ళను తీసి బయట విడిచాడు. అవి ప్రతీకలు ప్రతీకలు అని శబ్దం చేస్తూ వరుసగా వెళ్ళి వంటగదిలోకి దూరాయి.

టీవీలో ఒకతను, ‘మా అమ్మకు నేనేమీ చెయ్యలేదు సార్!’ అని భోరుమంటున్నాడు.

హాల్‌లో మూడు ఉరి తాళ్ళు వేలాడుతున్నాయి, మూడిట్లోనూ అందమైన పూల గుచ్ఛాలు గుచ్చున్నాయి.

‘పాడె కావాలా? పాడె, పాడె…’ అని వీధిలో ఒకామె అరుస్తూ వెళ్తోంది.

కుప్పయ్య పెళ్ళాం గభాలున తలుపు తోసింది, గుడ్ల కుప్పయ్య తలకు అది ఠపామని తగిలి అక్కడికక్కడే కుప్పకూలి చచ్చాడు.

కుప్పయ్య పెళ్ళాం ముందుగా బాత్రూమ్ నుండి బయటకొచ్చింది. వెనకే గుడ్ల కుప్పయ్య నాన్న, అమ్మ బయటకొచ్చారు. ఇంకా చాలామంది లోపలనుండి వస్తున్నట్టే ఉంది, అయితే ఈ లోపు గుడ్ల కుప్పయ్య వాళ్ళమ్మ, చేతిలో ఉన్న ఉక్కు పైపుతో స్వయం సుబ్బారావు నెత్తినా పస పాపారావు నెత్తినా గట్టిగా కొట్టడంతో సరిగ్గా కనిపించలేదు.

4. డాక్టర్

చంద్రం పేరు ప్రఖ్యాతులు కోరుకునే డాక్టర్, పేరు ప్రఖ్యాతులకోసం శాయశక్తులా కృషిచేసే డాక్టర్, అ(తి)సాధారణమైన డాక్టర్, అందమైన డాక్టర్, 55% మార్కులతో పట్టా పుచ్చుకున్న డాక్టర్, స్టెతస్కోప్ వీపు మీద పెట్టి చూడని డాక్టర్, తన పేరుకు ముందు Dr అని పెద్ద D పెట్టుకోకుండా dr అని చిన్న d పెట్టుకునే డాక్టర్ అంటూ చదువుతూంటే కడుపులో తిప్పుతున్నట్టుందా? అజీర్తి చేసినట్టుందా?

చంద్రం అలా ఏం కాదు.

కథని మొదట్నుంచి ఆనవాయితీ ప్రకారం మొదలు పెడదాము. ఎలా? సింపుల్! చంద్రం ఒక పేరు ప్రఖ్యాతులు గల డాక్టర్. కాని, చంద్రం అలా సింపుల్ కాదు.

చంద్రానికి చంకలో సూదియ్యాలని కోరిక. నర్స్ శాంతికి చంద్రం మీద ఒక కన్ను. ఇంకో కన్ను వెయిటింగ్. చంద్రం సూదికి శాంతి మీద కన్ను, అందుకనే హీరోయిన్ సమంత ద్వారా ఉన్నదాంట్లోనే ‌అతి చిన్నదిగా ఒక కన్ను చేసి సూదికి బిగించాడు చంద్రం.

‘ఒక రోజు’ అనే ఈ కథ ఇప్పుడు మొదలవ్వాలి. అయితే చంద్రానికి ఇలా దేన్నీ సాదాసీదాగా చేస్తే నచ్చదు కాబట్టి–ఒక దివ్యమైన శుక్రవారం అని ఈ కథ మొదలవుతుంది. ఎంత విభిన్నంగా చెయ్యాలనుకున్నా ఈ కథ ఒకరోజు అనే మొదలవ్వడాన్ని తప్పించడం వీలు కాలేదు చూడండి. తరవాత వచ్చే వాక్యం? దివ్యమైన శుక్రవారం… ప్చ్… సరే, రండి తర్వాత లైనుకు… వచ్చే లైనులో కథ రాకెట్ వేగాన్ని పుంజుకోబోతుంది… శాంతి ఇంటికి బయలుదేరేందుకు బట్టలు మార్చుకునే సమయంలో, ఒట్టి షిమ్మీలో ఉండగా చంద్రం లోపలకు దూరడం… సూదిలో ఉన్న కంటికి రేచీకటి వచ్చేయడం… అది తెలీక శాంతి చంకలో చంద్రం సూది పొడిచేయడం, ‘నువ్వు ముద్దు ఇస్తావనీ, నీ ముద్దు ముక్తి అనీ తెలుసు! అయితే అది నేను చచ్చేప్పుడిస్తావా లేక ముద్దిచ్చినప్పుడు నేను చస్తానా?’ అంటూ శాంతి ముందరే శైలుతో సరసాలడటం, రెండు ప్యాంటీలను తీసి తన వెనక జేబుల్లో దోపుకోవడం… అని రసవత్తరంగా సాగబోతోంది.

ఒక దివ్యమైన శనివారం.

5. పసుపుపచ్చ లంగా

శాంతి పసుపుపచ్చ లంగాని రొమ్ములపైకి కట్టుకని బాత్రూమ్ షవర్ కింద స్నానం చెేస్తోంది.

హలో.

హలో.

సార్ సార్… సార్… సారీ సార్… నేనే సార్… సారీ సార్, నిన్ననే అడిగారు, అర్జంటని, సారీ సార్. ఈ రోజు కూడా మరిచిపోయి ఇంటిలోనే పెట్టొచ్చాను సార్. ఆరోజు గుమ్మందాకా వచ్చారు కదా? ఆ ఇల్లే. మీ ఇంటి నుండి దగ్గరే… సారీ సార్. నా వైఫ్ ఇంటిలోనే ఉంటుంది, ఆమె పేరు శాంతి, కోప్పడకుండా వెళ్ళి తీసుకుంటారా?

హలో… హలో…


రచయిత గురించి: పాండిచ్చేరిలో పుట్టిన ఆర్. శ్రీనివాసన్, తమిళనాడులోని కడలూర్ జిల్లాలో చదువుకున్నారు. అరాత్తు అన్న పేరుతో 2010 నుండి సోషల్ మీడియాలో నేటితరం జీవితానికి అద్దం పట్టే విషయాలను తీసుకుని ప్రయోగాత్మకమైన మైక్రో కథలు, కవితలు రాయడం ధ్వారా గుర్తింపు పొందారు. ప్రముఖ రచయితలు చారునివేదితా, జయమోహన్, మనుష్య పుత్రన్ వంటివారి మెప్పుపొందారు. ఇప్పటివరకు మూడు నవలలు, మూడు కథల సంపుటాలు, ఒక బాలల కథల సంపుటి, వాహనాలకు సంబంధించిన వ్యాస సంపుటి, ఒక కవితా సంపుటి ప్రచురించారు. క్లుప్తంగా, సటైరికల్‌గా రాయడం ఈయన శైలి. వీరి కథలన్నీ ఆధునిక యువత జీవితవిధానాల చుట్టూనే తిరుగుతాయి.