ఆకాశవంతెన 4

9

చివరకి, ఫార్మ్ నుంచి విడుదలయింతర్వాత, షాంగ్‌హాయ్‌లో తొమ్మిదవ నంబరు ప్రభుత్వ హాస్పిటలుకి వెళ్ళి ఆ పచ్చ చెరిపించుకున్నాడు కాలేజీ స్టూడెంటు. ఆ తొమ్మిదో నంబరు హాస్పిటలుకి కాస్మటిక్ సర్జరీలో పెద్ద పేరు. వళ్ళు కాలినవాళ్ళూ, కంటిరెప్పల్ని మడతపడేలా చేసుకోవాలనుకునే ఆడవాళ్ళూ అక్కడకి బాగా వెళుతుంటారు. ముక్కు ఎత్తుచేసుకోవాలన్నా అక్కడికే. అక్కడ బ్రెస్ట్ ఇంప్లాట్సు కూడా పెట్టగలరని అంటారు.
 
కాలేజీ స్టూడెంటు ఆపరేషను టేబులు మీదున్న సమయంలోనే, ఆ గది బయట ఎవరో అమ్మాయి చాలా గొడవ చేసిందట. ఆపరేషను చేసిన డాక్టరు తన మొహం పాడుచేశాడని ఆ అమ్మాయి ఆరోపణ. ఆ డాక్టరు కాలేజీ స్టూడెంటుతో కోపంగా అన్నాడట: ‘ఆ అమ్మాయి కంటిరెప్పల మీద మడత కావాలన్నది. నేను ఆపరేషను చేశాను. ఆమెకి రెండు మడతలు కావాలా? అలానే చేసిపెట్టగలను. అంతేకానీ తనని అందంగా తయారుచేయగలనని మాత్రం హామీ ఇవ్వలేను. ఆమె మొహానికి మడత రెప్పలు రాసుండకపోతే, నన్ననేం లాభం? తనకి పెళ్ళెలా అవుతుందని నన్నడుగుతుంది! ఆ అమ్మాయికి పెళ్ళయితే నాకేం, అవ్వకపోతే నాకేం?’

‘ఆ అమ్మాయికి నిజంగా ఎవరూ దొరక్కపోతే, నేనొకర్ని చూపెట్టగలను’ అన్నాడట కాలేజీ స్టూడెంటు. వాడన్నది నా గురించి…
 


తియన్ చియావ్ (Sky bridge)

ఆపరేషను అయింతర్వాత డాక్టరుకి కృతజ్ఞతలు చెప్పాడట కాలేజీ స్టూడెంటు. తనకి కృతజ్ఞతలు చెప్పక్కర్లేదు; తర్వాత్తర్వాత గొడవలు రాకపోతే చాలన్నాడట డాక్టరు. ‘అసలు ఈ ఆపరేషనుకి హాస్పిటల్ దాకా రానక్కర్లేదు. ఈ పనికి ఒక గరుక్కాగితం చాలంటే అతిశయోక్తి కాదేమో!’ అన్నాడట డాక్టరు. కాలేజీ స్టూడెంటు నిజంగా అలాంటి పధ్ధతులన్నీ ప్రయత్నించినవాడేనని పాపం ఆ డాక్టరుకెలా తెలుస్తుంది? వాడు కంకరరాళ్ళతో చెయ్యిని గట్టిగా రుద్దుకోడం రెండుసార్లు జరిగింది. రెండుసార్లూ ఫలితం దక్కలేదు. ఎందుకంటే వాడికో బలహీనతుంది. రెండుసార్లు కూడా చేతినుంచి రక్తం కారడం కనబడగానే వాడికి స్పృహ తప్పింది.

మనం నమ్మలేని విషయమేంటంటే, ఇలా రక్తం కళ్ళబడగానే మూర్ఛపోయేవాడు షామెంగ్ నుంచి జిన్‌మెంగ్‌[1]Xiamen is a city in the Fu Jian province of China. Jinmen is a small island under Taiwan’s control.కి వంటరిగా ఎలా ఈదుకువెళ్ళాడనేది!
 


 
కాలేజీ స్టూడెంటు తెల్లగుర్రపు సరస్సుకొచ్చిన కొత్తలో, ఫార్మ్ లీడర్ వాణ్ణి ఒకసారి అందరికీ కనబడి రమ్మన్నాడు–వాడు మా అందరికీ ఒక హెచ్చరికలాగా పనికొస్తాడని. వాడు ప్రతీ ప్రొడక్షన్ టీము దగ్గిరకూ వచ్చి చొక్కా కుడిచేతిని పైకి మడిచి చూపెట్టేడు. అక్కడ వ్రాసున్న నాలుగు పదాల్నీ చూపుతూ వాడు, ‘బాగా చూడండి. అయోమయంలో పడి తప్పూ ఒప్పుల విచక్షణ పోగొట్టుకుంటే ఇలా సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుంది’ అన్నాడు.
 
కాలేజీ చదువు పూర్తిచేసింతర్వాత ప్రభుత్వం వాణ్ణి షిన్‌జాంగ్‌లో ఉద్యోగం చెయ్యమన్నది. జీవనోపాధి సమస్య కాకపోవడంతో వాడు వెళ్ళలేదు. షాంగ్‌హాయ్‌లోనే నిరుద్యోగిగా మిగిలేడు. త్వరలోనే వాడికి తనలాంటి నిరుద్యోగే ఇంకొకడు తారసపడ్డాడు. కాలేజీ స్టూడెంటు వాణ్ణించి తెలుసుకున్నదేంటంటే, షామెంగ్‌కి అవతలి ఒడ్డే జిన్‌మెంగ్ అనీ, ఇటుపక్కనుంచి అవతలిపక్కకి చాలా సులభంగా ఈదవచ్చనీనూ. తప్పూ ఒప్పుల విచక్షణ పోగొట్టుకోవడంలో అదే తొలి మెట్టు.
 
వాళ్ళు చెయ్యబోయే పనికి వాళ్ళిద్దరూ ఒక చలికాలమంతా తయారయ్యారు. ప్రతిరోజూ పరిగెత్తడమే కాకుండా ఒక స్విమ్మింగ్ క్లబ్బులో చేరారు. ఆ తరువాతి వేసవిలో వాళ్ళు షామెంగ్‌కి వెళ్ళారు. నీళ్ళలోకి దూకేముందు వాళ్ళు ఒట్టు పెట్టుకున్నారు–జిన్‌మెంగ్‌కి వెళ్ళడమో లేక నీళ్ళలో చావడమో చేస్తామని. చచ్చేపనే ఐతే కలిసి చావాలని కూడా నిర్ణయం జరిగింది.

ఐతే వాళ్ళు నీళ్ళలోకి దూకగానే ఓ కెరటం వాళ్ళని విడదీసింది. కాలేజీ స్టూడెంటు సరైన దిశగా గట్టిగా ఈత కొట్టాడు. అనుకున్నట్టుగానే జిన్‌మెంగ్ దీవికి చేరాడు. వాడు అనుకున్నది సాధించిన ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యాడే గానీ తనకి ఎదురవబోతున్న అనుభవాన్ని ఊహించలేదు.

నేషనలిస్ట్ ఆర్మీకి[2]A very brief history of the state of affairs between China and Taiwan — After the last emperor Pu Yi abdicated in 1911, there was a period during which china was ruled by several warlords. In 1928, General Chiang Kai-shek, a protege of Dr. Sun Yat-sen, defeated most of the warlords and brought most of China under the KMT (Kuomingtang = the nationalist party) rule. Soon, the communist party started opposing the corrupt regime of the KMT. Between 1934 and 1949, the civil war between the communists under the leadership of Mao and the nationalists under Chiang Kai-shek’s leadership continued. Finally in 1949, the nationalists were routed by the communists and escaped to Taiwan with over a million supporters as refugees. The Taiwan-based nationalists (who, incidentally, ruled Taiwan with an iron fist — keeping the country under a state of emergency for over 30 years and punishing anybody they suspected of being a communist) vowed to reclaim their mainland while the communist-ruled China (PRC) considered Taiwan (ROC) as a renegade province and the hostilities continue to date. చెందిన సైనికులొచ్చి వాణ్ణి ఒక చీకటికొట్టులో పడేసి వాడితో తాను కమ్యూనిస్టు పార్టీ పంపిన వేగునని ఒప్పించడానికి చూశారు. తను వేగుని కాదన్నాడు వాడు. అబద్ధమాడుతున్నావన్నారు సైనికులు. కట్టేసి చావబాదేరు. నుదుట్నించి రక్తం కారుతూండగా వాడు స్పృహతప్పిపోయాడు. బహుశా, రక్తం కనబడగానే మూర్ఛపోయే జబ్బు వాడికి జిన్‌మెంగ్‌లోనే మొదలయ్యుండవచ్చు.

వాణ్ణలా మూడ్రోజులు ఇంటరాగేట్ చేశారు. ఆ తర్వాత, సైనికులు వాడి కుడిచేతిమీద ఈ స్లోగన్ పచ్చ పొడిపించి వదిలేశారు. వాళ్ళు వాడితో, ‘చూడు బాబూ, నువ్వు కమ్యూనిస్ట్ పార్టీకి వ్యతిరేకినని, స్వేచ్ఛా ప్రపంచానికి నిజాయితీగా వచ్చేననీ చెప్తున్నావ్. ఐతే మేము నిన్నంత వెంటనే నమ్మలేం. నిన్ను వెనక్కి పంపిస్తున్నాం. నువ్వక్కడ ఒక పని చెయ్యి. ఎవర్నన్నా పార్టీ లీడర్ని హత్య చెయ్యి. లేదూ ఎక్కడైనా బాంబు పెట్టు. దాంతో నువు చెప్తుంది నిజమో కాదో ఋజువౌతుంది’ అని, వాడికి ఒక సంచీతో బాంబులు, ఒక తుపాకీ ఇచ్చి మళ్ళీ నీళ్ళలోకి తోశారు–అలలు షామెంగ్ వైపుకు వెళ్తున్నప్పుడు. ఒడ్డుకు చేరగానే, వాడెళ్ళి తనకి కనబడ్డ మొదటి సైనికుడికి లొంగిపోయాడు.

“నా పార్ట్‌నర్ ఎడ్వెంచర్ నా ఎడ్వెంచర్ కంటే తేలిగ్గా ముగిసింది,” అన్నాడు కాలేజీ స్టూడెంట్. “వాడికి ఏడేళ్ళే శిక్ష పడింది. సముద్రంలోకి దూకిన కాస్సేపటికే ఎటువెళ్తున్నదీ తెలీని పరిస్థితిలో పడ్డాడు వాడు. చాలా నీళ్ళు తాగేసి తను చచ్చిపోతాననుకున్నాడట. అప్పుడే వాడికి చిన్న దీవొకటి కనబడింది. ఎలాగో వాడు దాని ఒడ్డుకు ఈదగలిగేడు. ఇసుకలో మోకాళ్ళమీద కూలబడి, రెండు పిడికిళ్ళతో ఇసుక తీసుకుని ‘స్వేచ్ఛ! స్వేచ్ఛ!’ అని కేకలుపెట్టడం మొదలుపెట్టాడట. పోలీసులొచ్చి స్టేషన్‌కి తీసుకెళ్ళేదాకా, తనున్నది గు లంగ్ యూ[3]Gu Lang Yu is a small resort island next to Xiameng. It’s under China’s control. లోనని వాడికి తెలీలేదు.
 


 
మేము పొలంలో నేలమీద పడుకుని ఎండనాస్వాదిస్తున్నప్పుడు, వాడి ఎడ్వెంచరు వివరాలు పదే పదే అడిగి చెప్పించుకునేవాళ్ళు ఖైదీలు. అందరూ అలిసిపోయేదాకా ఆ కార్యక్రమం జరిగేది. అదయ్యింతర్వాత మూడు సామ్రాజ్యాల చరిత్ర లోంచి కథలు చెప్పేవాడు కాలేజీ స్టూడెంటు. మధ్యమధ్యలో, కథ బాగా రసవత్తరంగా సాగుతున్నప్పుడు, చెప్పడమాపి ఒకటో రెండో సిగరెట్లు లాగేవాడు శ్రోతల దగ్గిర్నుంచి. అలా వసూలు చేసిన వాటిని నాతో పంచుకునేవాడు. నా దగ్గిర సిగరెట్లు కాల్చిన రోజుల్ని వాడు మర్చిపోలేదు.

ఆ రోజుల్లో పొట్టోడి పరిస్థితి క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. రోజూ జ్వరముండేది. రాత్రిపూట మగతలో కేకలు పెట్టేవాడు. అలానే కొన్ని వారాలు గడిచినై. ఒక రోజు పొద్దున్న, బాత్‌రూముకి వెళ్ళి పడిపోయాడు. వాడు మళ్ళీ తెలివిలోకి రాలేదు. కొండ మొదట్లోనే పాతిపెట్టాం వాణ్ణి. చచ్చిపోయేసరికి వాడి ఎముకలమీద చర్మం తప్ప మరేం మిగల్లేదు. ఐనా, ఒక 100 కిలోలుండుంటాడు వాడు. పదిమందిమి కలిసి మోసేం. వాణ్ణి పూడ్చిపెట్టేసరికి మేమూ సగం చచ్చేం.

ఎక్కువ లోతులేకుండా ఒక గుంత తవ్వి, పొట్టోణ్ణి అందులో ఉంచి మట్టి కప్పేం. ఆయాసంతో రొప్పుతూ నేలమీద కూలబడ్డాం. ఎవరికీ హాస్టల్‌కి నడిచివెళ్ళే ఓపిక మిగల్లేదు. ఆ సమయంలో కాలేజీ స్టూడెంటు మాట్లాడ్డం మొదలుపెట్టాడు: “ఒకరోజున, డార్విన్ అనే గొప్ప శాస్త్రవేత్త ఏదో చిన్న ద్వీపానికి వెళ్ళాడట. ఆయనకక్కడ అన్నీ పొట్టి చెట్లే కనబడ్డాయి. డార్విన్ కొన్ని రోజులపాటూ పరిశోధించి గమనించిందేంటంటే, ఆ ద్వీపమ్మీద సముద్రపు గాలి చాలా గట్టిగా వీస్తుందని. అంటే, ఏ చెట్టైనా బాగా పొడవు పెరగ్గానే సముద్రపు గాలి దాన్ని పడగొట్టేది. అంటే, అక్కడ పొట్టి చెట్లు మాత్రమే మనగలవన్నమాట. దీన్నుంచే డార్విన్ ‘సర్వయివల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్’ సూత్రాన్ని కనిపెట్టాడు.”

మాలో ఆకలికి చావకుండా బ్రతికున్నవాళ్ళందరం మా అమ్మానాన్నలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలనిపించింది, పొట్టోడికి మల్లే పెద్ద శరీరాలివ్వనందుకు.
 

10

రైలు దిగ్గానే, కళ్ళెదర నిలిచిందా వంతెన. రెండు కొండల మధ్యన ఉన్నదది. ప్లాట్‌ఫామ్ నుంచి చూస్తే, ఆకాశంలో ఉన్నట్లు కనబడుతుంది.

గడ్డపు సన్ నన్ను రైలు దగ్గర దిగబెట్టేడు. “నువ్వు ఎద్దుపడిన లోయ స్టేషన్ బయటకి వెళ్ళనక్కర్లేదు. ప్లాట్‌ఫామ్ మీదకి దిగ్గానే ఎడమ పక్కకి చూస్తే కనబడుతుందా బ్రిడ్జి. అక్కడ్నుంచే మీ అమ్మ లోయలోకి పడిపోయింది,” అన్నాడతను.
 
“అదేంటి? మా అమ్మని ఎవడో రైల్లోంచి తోసేస్తేకదా చనిపోయిందన్నారు ఇంతకుముందు?”
 
“అవును. అయితే అప్పుడా రైలు సరిగ్గా ఆ వంతెన మీదుగా వెళ్తున్నది.  అర్థమవుతున్నదా? అప్పటికి రైలు వంతెన మీద లేకపోయుంటే, మీ అమ్మ చనిపోయేది కాదేమో!”
 
చిట్టచివరికి నాకా దుర్ఘటన పూర్తిగా అవగతమయింది. ఆ జిన్ అనేవాడు మా అమ్మని చంపాలనుకోలేదు. నిజానికి వాడికా అవసరం లేదు. వాడిక్కావాల్సిందల్లా మా అమ్మ దగ్గరున్న రేషన్ టిక్కెట్లూ డబ్బులూనూ. వాడు కంపార్టుమెంటు తలుపు తీసేసరికి కటిక చీకటి, ఆపకుండా మొహానికి కొడుతున్న చలిగాలీనూ. పైపెచ్చు మా అమ్మని బయటికి తోసేయాలన్న టెన్షను. వాడికా సమయంలో రైలు బ్రిడ్జి మీద వెళుతున్న సంగతి తట్టలేదు.


 
“ఇది పూర్తిగా దురదృష్టమే. మీ అమ్మ దురదృష్టవంతురాలు. ఆ చంపినవాడు కూడా దురదృష్టవంతుడే. వాడు మీ అమ్మని చంపి తనూ నాశనమయ్యేడు.”  నా కథంతా విని స్టేషన్ మాస్టర్ తీర్మానించేడు.

మేం స్టేషన్ మాస్టర్ ఆఫీసుకి వెళ్ళి కొంచెం చన్నీళ్ళు తాగి సేదతీరేం. స్టేషన్ మాస్టర్ ఈ స్టేషన్‌కి వచ్చి మూడేళ్ళే అయిందట. తను మా అమ్మ గురించి ఎప్పుడూ వినలేదని చెప్పేడతను. స్టేషన్ రికార్డుల్లో కూడా ఏమీ లేదట. అయినా నన్ను స్థిమితంగా ఉండమన్నాడు. పక్క వూళ్ళో ఒక రిటైర్డ్ రైల్వే ఇన్‌స్పెక్టరున్నాడట. ఈ రైల్వే స్టేషన్‌కి సంబంధించినంత వరకూ అతడు నడిచే లైబ్రరీ లాంటివాడనీ, గత అరవై ఏళ్ళలో ఈ స్టేషన్లో జరిగిన విషయాలన్నీ అతడికి తెలుసుననీ స్టేషన్ మాస్టరన్నాడు.

మేం స్టేషన్నించి బయటపడి మెయిన్ రోడ్డెక్కాం. “మీరేమనుకోనంటే ఒక విషయమడుగుతాను. మీకు మీ అమ్మని చంపినవాడంటే చెప్పలేనంత ద్వేషం ఉండివుండాలి కదూ?” నడుస్తూ అడిగేడు స్టేషన్ మాస్టర్.
 
నేను ఒక క్షణమాలోచించి, “నాకు వాడంటే ద్వేషమా అంటే… ఏమని చెప్పను? మొదట్లో, నాకు చంపిందెవరో తెలీనే తెలీదు. ఇప్పుడు తెలుసు. అయితే, ఇప్పటికి మా అమ్మ మరణించి ఇరవయ్యేళ్ళు దాటింది.”

ఆ జిన్ అనేవాడు మా అమ్మని ఆ చీకటిలోయలోకి తోసినప్పుడు, ఆ యమధర్మరాజు ఎర్రపెన్ను వాడి పేరు మీద ఆగుండాలి. నాకయితే ఇప్పటిక్కూడా వాడి పూర్తిపేరు తెలీదు. నాకు సంబంధించినంతవరకూ వాడొక ఇంటిపేరు మాత్రమే.

ఆ నడిచే లైబ్రరీగా చెప్పబడుతున్న వ్యక్తి నివసించే గ్రామం బయట ఒక చిన్న డ్యామ్ ఉన్నది. ఆ డ్యామ్‌కు దిగువన వరి పొలాలు కనబడుతున్నాయి. పొలాలకు వేసిన ఎరువు వాసన ఘాటుగా ముక్కుపుటాలకి సోకుతున్నది. పొలాలకవతలి పక్కన, మట్టితో కట్టిన పూరిళ్ళు కనబడుతున్నాయి.
 
ఆ దృశ్యం నాకు తెల్లగుర్రపు సరస్సుని జ్ఞాపకం చేసింది. అదేమాట బయటకంటే, స్టేషన్ మాస్టర్ ప్రశ్నార్థకంగా చూసి “తెల్లగుర్రపు సరస్సేంటి?” అన్నాడు.
 
“తెల్లగుర్రపు సరస్సు ఒక చోటు కాదు. చాలా పెద్ద కథ. చెప్పాలంటే ఇరవైరెండు సంవత్సరాలు పట్టేది.”


1980లో కాలేజీ స్టూడెంటు, నేనూ తెల్లగుర్రపు సరస్సునుంచి బయటపడ్డాం. కమిస్సార్ మమ్మల్ని బస్సెక్కించినప్పుడు మా గురించి బెంగపడబోయేవాడిలా కనబడ్డాడు. చుట్టూ ఉన్న వరిపొలాల వంక, బోడికొండల వంకా ఒకసారి పరికించి చూసి నాతో “ఆలోచిస్తే, నువ్వు బాధపడాల్సిందేమీ లేదు. నిక్షేపంగా షాంగ్‌హాయ్‌కి తిరిగివెళుతున్నావు నువ్వు. నేను రిటైరయ్యేదాకా ఇక్కడే ఉండాలి. నీకు ఇరవైరెండేళ్ళ జైలు శిక్ష పూర్తయినట్టుండవచ్చు. నీకు పడింది ఇరవైరెండేళ్ళయితే, నాది యావజ్జీవం.”

నాకు జరిగినదానికి నాకతనంటే కోపమని అనుకున్నట్లున్నాడతను. నాకసలు అలాంటి ఆలోచనే లేదు. అతడు మంచివాడు. నిజానికి నేను ఆకలిచావు చావలేదంటే అందులో అతడి పాత్ర కూడా కొంత ఉన్నది. తిండి దొరకడం బాగా కష్టంగా ఉన్న రోజుల్లో, కమిస్సార్ నన్ను తరచూ, ఆఫీసు పనిమీద బయటకు పంపేవాడు. అంటే, నాకు మామూలుగా ఇచ్చే రేషన్‌తో పాటూ, ఆఫీసు పనిమీద వెళ్తున్నందుకు అదనపు రేషను లభించేదన్నమాట. డబ్బులుండి, రేషన్ టికెట్లుంటే, నేను వెళ్ళేచోట్ల మంచి తిండే దొరికేది. అలాటి మంచి భోజనం ఒకసారి దొరికినా, తరువాత కొన్నిరోజులపాటూ బాధుండేది కాదు. అందుకనే, మా టీములో అందరూ నేను కమిస్సార్ ఫేవరెట్నని చెప్పుకునేవాళ్ళు.

నిజానికి నేను వెళ్ళిన ఎనిమిదేళ్ళకే, అంటే 1966కల్లా, కమిస్సార్ నన్ను బయటకు పంపేయడానికి ప్రయత్నించాడు. నా తరపున అతడు మా ఫార్మ్ లీడర్లకి చాలా ఉత్తరాలు వ్రాసేడు. చివరకి వాళ్ళని ఒప్పించాడు కూడా. అయితే, ఆ సంవత్సరమే కల్చరల్ రివల్యూషన్ మొదలవడంతో నేను షాంగ్‌హాయ్‌కి వెళ్ళడం సాధ్యం కాలేదు. ఫార్మ్‌లోనే ఎంప్లాయీగా ఉండిపోయాను.

ఎంప్లాయీగా కొన్ని సంవత్సరాలు సాఫీగానే గడిపేన్నేను. నా మీద పెత్తనం చెలాయించేవాళ్ళెవరూ లేరు. సరిపోయేంత తిండి దొరికేది. ఖైదీగా ఉండి ఎంప్లాయీగా మారినవాళ్ళకి జీతం పెద్దగా ఉండేది కాదు కానీ అక్కడ అదే సరిపోయేది. కొత్త ఖైదీలు వచ్చినప్పుడు మాత్రమే బయట పరిస్థితి ఎంత గందరగోళంగా ఉన్నదో తెలుస్తుండేది మాకు.

ఆ రోజుల్లో, మా నాన్న కూడా సాఫీ జీవితమే గడిపేడు. తనకి చికాకు కలిగించిన ఏకైక విషయం–ఆయన దగ్గరున్న డొక్కు రేడియోలో తను ఎప్పుడూ వినే జానపద గీతాలు రావడం మానేసినై[4]During the cultural revolution, certain types of music was not considered revolutionary and hence discouraged and not broadcast on radio. The government replaced it with eight new songs it had developed — something like prescribed listening material..

అయితే, కొంతమంది జీవితాలు మాత్రం సాఫీగా సాగలేదనే చెప్పుకోవాలి. మా కాలేజీ స్టూడెంట్ ఇంటికి వెళ్ళేసరికి, అంతకు పది సంవత్సరాల క్రితమే అతడి కుటుంబం మొత్తం వాళ్ళున్న ఇంట్లోంచి ‘తుడిచివేయబడ్డారని’ తెలిసింది[5]During the cultural revolution, the government confiscated the houses belonging to rich people and used them as government provided housing. In addition, to make the rich understand how their servants and other poor people lived, the government made them live in the servant quarters of their erstwhile homes. Apparently, those that had provided comfortable living quarters to their servants benefited from their own generosity.. అతడి తల్లిదండ్రులు, ఇద్దరు అక్కలు, ఒక తమ్ముడు, కాలేజీ స్టూడెంటూ–మొత్తం ఆరుగురూ వాళ్ళ ఇంటి గరాజ్‌లో ఇరుక్కునుండేవాళ్ళు. “ఛీ! అది ఒక హాస్టల్ గదిలా ఉండేది. అది తెల్లగుర్రపు సరస్సులో మనమున్న పాక కంటే ఘోరం!” అన్నాడు కాలేజీ స్టూడెంట్.

వాళ్ళున్న గరాజ్ కిందనే ఆ బిల్డింగు మొత్తానికి సెప్టిక్ టాంకుండేది. పైనుండే వాళ్ళు టాయ్‌లెట్ ఫ్లష్ చేసినప్పుడల్లా, వీళ్ళకి నేలకింద నుంచి చప్పుడు వినబడేది. ఒకసారి రెండు నెలలపాటు మునిసిపాలిటీవాళ్ళు టాంకు ఖాళీచేయకపోవడంవల్ల టాంకు మూతకున్న ఖాళీలగుండా మురుగు బయటకొచ్చి గదినిండా ప్రాకింది. అయినా వాళ్ళు అక్కడే ఉండాల్సి వచ్చింది.

“మా పరిస్థితి ఊహించుకో!” కాలేజీ స్టూడెంటన్నాడు. “మా అమ్మ ౙొంగ్ షీ గర్ల్స్ స్కూలుకి వెళ్ళినావిడ. నీకు తెలిసో తెలీదో, ౙొంగ్ సిస్టర్స్[6] The Soong sisters–Ching-ling, May-ling, Ai-ling–are the daughters of one of the wealthiest families of pre-communist China. They all received western education and married Sun Yat-Sen, Chiang Kai-shek, and H.H. Kung (industrialist and Hong Kong’s finance minister) respectively. There is a 1997 film about these three starring Michelle Yeoh and Vivian Wu. ఆ స్కూల్లోనే చదువుకున్నారు. ఆవిడది మొదట్నుంచీ వెస్టర్న్ ఎడ్యుకేషన్. మామూలుగా, భోజనాలప్పుడు మేమెవరమన్నా చప్పుడు వచ్చేలా తింటేనే మమ్మల్ని పందులనేది. మురుక్కంపు భరించలేక మునిసిపాలిటీవాళ్ళని ఆవిడ ఎదుటే బండబూతులు తిట్టేన్నేను. నా మాటలకి ఆవిడ అసహ్యంతో డోక్కుంటుందేమో అనుకున్నాను.”

ఆవిడ కక్కుకోనుంటే పరిస్థితి ఇంకా ఛండాలంగా తయారయ్యుండేదనిపించింది నాకు. తల్లి డోక్కుంటుంది. అసలే మురుగు వాసన భరించలేకపోతున్న కొడుకు మూర్ఛపడిపోతాడు. వాంతీ మురుగూ… పరమ ఛండాలంగా తయారయ్యేది.

ఛైర్మన్ మావ్ అన్నట్లుగానే, ఈ ఉద్యమం (కల్చరల్ రివల్యూషన్) ధ్యేయం కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూనే క్యాపిటలిజం దారి తొక్కుతున్నవాళ్ళనూ, క్యాపిటలిస్టుల్లో రియాక్షనరీలనూ ఏరివేయడం[7]Mao’s stated purpose of cultural revolution.. నాలాంటి సామాన్యులకూ ఈ ఉద్యమానికీ అస్సలు సంబంధం లేదు. నేను మా కమిస్సార్‌తో మరో పదమూడేళ్ళు గడపాల్సిరావడం కేవలమూ కాకతాళీయం మాత్రమే.


నేను ఫాక్టరీకి తిరిగి వెళ్ళినప్పుడు, మా వర్క్‌షాప్ డైరెక్టర్ నన్ను నేను పని చేయబోయే చోటుకు తీసుకువెళ్ళాడు. నేను 1958లో తెల్లగుర్రపు సరస్సు ఫార్మ్‌కు వెళుతున్నప్పుడు అతడు నన్ను వీలైనంత త్వరగా తిరిగిరమ్మని చెప్పిన విషయం గుర్తుచేశాను డైరెక్టర్‌కి. అతడన్నట్లుగానే నేను తిరిగి వచ్చేను. కాకపోతే రావడానికి ఇరవైరెండు సంవత్సరాలు పట్టిందంతే.

“కరక్టే! ఇరవైరెండు సంవత్సరాలయ్యిందప్పుడే.” అన్నాడు డైరెక్టర్. “కానీ, 22సంవత్సరాల తర్వాత నేనింకా ఈ వర్క్‌షాప్ డైరెక్టర్‌గానే ఉన్నా. అంతేకాదు, ఇన్ని సంవత్సరాల్లో నా జీతం ఒక్కసారి కూడా పెరిగిన పాపాన పోలేదు.”

డైరెక్టర్ నన్ను నేనంతకుముందు చేసిన పనిలోనే చేరమన్నాడు. నేను మళ్ళీ నా లేత్‌ని స్టార్ట్ చేసినప్పుడు నా చేతులు వణికేయి. ఇన్ని సంవత్సరాల తర్వాత నాకీ మెషీన్‌ని ఆపరేట్ చేయడం గుర్తుండదని భయపడ్డానుగానీ ఫర్వాలేదు. పొడుగ్గోళ్ళొకసారి అన్నాడు: “కొన్ని కొన్ని విషయాలు ఒకసారి నేర్చుకుంటే చాలు, ఎప్పటికీ మర్చిపోం. సైకిల్ తొక్కడం, జేబులు కత్తిరించడం లాంటివన్నమాట!” చూడబోతే, ఈ మెషీన్‌ని ఆపరేట్ చేయడం కూడా ఈ కోవకి చెందిందే అనిపిస్తుంది.

సాయంత్రం పని ముగించే సమయానికి, క్వాలిటీ కంట్రోల్ ఇన్‌స్పెక్టర్ నా దగ్గిరికొచ్చాడు. నేనతన్ని ఎప్పుడూ చూడలేదన్నది నిస్సందేహం. సందేహమున్నదల్లా, అతగాడు ఇరవైరెండేళ్ళ క్రితం అసలు పుట్టేడా లేదా అన్న విషయంలోనే. “వాంగ్‌బావ్! మీరు చాలా గొప్ప పనివాడని విన్నాను. మరి మీరీరోజు చేసిన పని ఇలా ఉన్నదేమిటి? ఈ పనంతా మళ్ళీ చెయ్యాల్సిందే.” అన్నాడు.

నేను మనసులోనే తిట్టుకున్నా. ‘మరీ అంత మిడిసిపడబోకు బాబూ! నిన్ను ట్రెయిన్ చేసినవాడి ట్రెయినర్ నా స్టూడెంటు దగ్గర పని నేర్చుకోనుండవచ్చు.’

అది నేను వర్క్‌షాపుకి తిరిగివచ్చిన మొదటి వారం. ఓ ఆర్నెల్లు తిరిగేసరికి మా డైరెక్టర్ నన్ను మళ్ళీ మా ప్రొడక్షన్ టీమ్‌కు లీడర్ని చేశాడు.

ప్రొడక్షన్ టీమ్‌కు లీడర్నవ్వడమే కాదు, నేను మళ్ళీ మా ఫుట్బాల్ టీమ్‌లో చేరి వదిలిపెట్టిన చోటనే అందుకున్నా. గమ్మత్తుగా, నేను ఫాక్టరీని వదిలిపెట్టినప్పటికీ, ఇప్పటికీ అసలు తేడా తెలియడం లేదు. ఎవరన్నా నా వాచీని వేగంగా ముందుకు తిప్పేరేమో అనిపిస్తున్నది. నేను ఇరవైరెండు సంవత్సరాలనుకుంటున్నది అసలు 22 నెలలో లేక 22 రోజులేనేమో. లేదూ, ఇంకా తక్కువ సమయమేమో… ఇదంతా ఎలా ఉన్నదంటే, నేను ఫుట్బాల్ ఆడుతుండగా ఎవరో ‘వాంగ్‌బావ్! నీకు ఫోను!’ అని అరిచినట్టూ, ఫోనులో ఎవరో నాకు చాలా పెద్ద కథొకటి చెప్పినట్టూ, కథ విన్న తర్వాత నేను మళ్ళీ ఫీల్డులోకి వెళ్ళినట్టూ, గేమ్‌ కంటిన్యూ అయినట్టూ ఉంది.

ఫాక్టరీ ఫుట్బాల్ టీములో నేను మళ్ళీ మిడ్-ఫీల్డర్‌గానే చేరాను. అయితే, రెండు గేములయ్యేసరికి అవతలి టీములో డిఫెన్సు ఆడుతున్నవాళ్ళందరూ చాలా ఫాస్టుగా ఆడుతున్నట్టు అనిపించింది. దాంతో మా టీమ్‌వాళ్ళు నన్ను గోల్ కీపింగ్ చెయ్యమన్నారు. కొద్ది నెలలపాటూ, నా గోల్‌లోకి బంతి వెళ్ళడానికి వీల్లేకుండా కాపాడేను. తర్వాత ఇంకో ఫాక్టరీవాళ్ళ టీముతో జరిగిన మాచ్‌లో నా ఎముకొకటి విరగడం జరిగింది. డ లాంగ్ ఫాక్టరీ టీములో ఫార్వర్డొకడు రేసుగుర్రంలా దూసుకువచ్చేడు నా గోలు వైపు. వాడు దాన్ని తన్నబోతుండగానే నేను బాలుని పట్టుకున్నాను గానీ పట్టుకున్న వెంటనే ఏదో గట్టి చప్పుడు వినబడింది. ఎక్స్-రే తీసి ప్రక్కటెముక ఒకటి విరిగిందని చెప్పేరు. అప్పట్నుంచి ఫుట్బాల్ ఆడ్డానికి స్వస్తి చెప్పాల్సొచ్చిందిగానీ, మా టీముకి గొప్ప ఛీర్ లీడర్ దొరికేడు.

నేను విరిగిన ఎముకకి కట్టుతో ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు, ఒక రోజు అనుకోని అతిథి వచ్చేడు.

నేను తలుపు తీసి అప్రయత్నంగా అరిచేను “అరే, పొడుగ్గోళ్ళూ! నువ్వూ బయటకొచ్చేశావా?”

“ఆఁ! అదేమంత గొప్పచోటని ఉంటానక్కడ?” అన్నాడు పొడుగ్గోళ్ళు.

తను షాంగ్‌హాయ్‌కి ఏదో ‘బిజినెస్ పని’ మీద వచ్చేడట. తను వాళ్ళ ఊరికి తిరిగివెళ్ళి బిజినెస్ చేద్దామనుకుంటున్నట్టు చెప్పేడు. పొడుగ్గోళ్ళు సంగతి తెలిసినవాణ్ణి కాబట్టి నేను ఏం బిజినెస్సని అడగలేదు. తెల్లగుర్రపు సరస్సు పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉన్నదని చెప్పాడు పొడుగ్గోళ్ళు. ప్రతీ సంవత్సరం, వసంతకాలంలో ప్రక్కనున్న బోడికొండల్నుంచి వర్షపు నీరొచ్చి వరి పొలాల్ని ముంచెత్తుతున్నట్టు చెప్పేడు. ఒక డ్యామ్‌ కడదామన్నా, చెరువు తవ్వుదామన్నా సరిపడా మనుషులు లేరని అన్నాడు పొడుగ్గోళ్ళు. తను వచ్చేసేసరికి, ఫార్మ్ లీడర్లు ఆ పొలాల్ని నల్లకొండపల్లె రైతులకి కౌలుకిద్దామని ఆలోచిస్తున్నట్టు చెప్పేడు.

“టీమ్‌ లీడర్! నువ్వుగానీ వెనక్కెళ్ళి చూస్తే, మనం చేసిన పనిని ఎక్కడా గుర్తుపట్టలేవు. భలే బాధేస్తుంది. వీళ్ళు పనిచెయ్యగలిగినవాళ్ళను పదిమందిని పట్టుకుని లేబర్ ఎడ్యుకేషన్‌కి పంపొచ్చు కదా?”

“నువ్వు అప్పుడే మర్చిపోయినట్టున్నావ్!” అన్నాన్నేను. “ఇలాంటి వాగుడుక్కాదూ, నీకు రెండు సంవత్సరాలు ఎక్స్‌ట్రా వడ్డించారు?”

“ఔను, కరక్టే!” అని గట్టిగా నవ్వేడు పొడుగ్గోళ్ళు.
 

11

చనిపోయేముందు మా నాన్న ఆఖరి కోరిక నేను వీలైనంత త్వరగా ఎవర్నన్నా అమ్మాయిని వెతుక్కుని పెళ్ళిచేసుకోవాలని. మా వంశవృక్షం షాంగ్‌హాయ్‌లో వేళ్ళూనాలనేది ఆయన అభీష్టమని నాకు తెలుసు. తన చివరి రోజుల్లో ఎంతసేపూ నా పెళ్ళి గురించే మాట్లాడేవాడాయన. ఆయన నా పెళ్ళి చూడలేకపోయాడు గాని మా ఇంటికొచ్చిన ప్రతీ ఒక్కరికీ పెళ్ళి విషయంలో నాకు సహాయం చెయ్యడం ఒక బాధ్యతగా అప్పగించాడు.

కాలేజీ స్టూడెంటు నాకు ముగ్గురు ఆడవాళ్ళని పరిచయం చేశాడు. మొదటావిణ్ణి పరిచయం చేసినప్పుడైతే, చాలా శ్రమ తీసుకున్నాడు. అంతకు ముందురోజు రాత్రి ప్రత్యేకంగా మా ఇంటికొచ్చి అర్ధరాత్రి వరకూ మాట్లాడేడు. జుట్టు సరిగా దువ్వుకోమనీ, శుభ్రమైన బట్టలు వేసుకోమనీ జాగ్రత్తలు చెప్పాడు. ఆడవాళ్ళకి ఎలాంటి మాటలు చెప్పాలో, ఎలాంటి చోట్లకి తీసుకెళ్ళాలో సూచనలిచ్చాడు. నా మాటలూ, చేతలూ ఎలా ఉండాలో చెప్పాడు. వాడంత ఉత్సాహంగా మాట్లాడుతుంటే నేనడ్డు చెప్పలేకపోయాను గానీ, నిజానికి ఆడవాళ్ళ విషయంలో వాడిక్కూడా నాకు మల్లేనే ఓనమాలు రావనిపించింది. మాకు ఆడవాళ్ళ గురించి తెలిసిందంతా మేం తెల్లగుర్రపు సరస్సులో ఉండగా రేపు కేసుల్లో అక్కడకు వచ్చినవాళ్ళ దగ్గరనుంచి నేర్చుకున్నదే.

మా సమావేశం జిన్ ఆన్ పార్కులో ఏర్పాటు చేశారు. మేము కాఫీ షాపులో కాసేపు కూర్చున్న తర్వాత, పరిచయాలు చెయ్యడానికొచ్చిన ఇద్దరూ వెళిపోయారు. నన్ను ఆవిడతో కొంత సమయం గడపమని చెప్పివెళ్ళాడు కాలేజీ స్టూడెంటు. ఐతే వాడు ఇంటికెళ్ళేసరికి, నేను గుమ్మంలో వాడికోసం ఎదురుచూస్తూ కనబడ్డాను.

“అమ్మో! ఏమో అనుకున్నానుగానీ నువ్వు ఫర్వాలేదు వాంగ్‌బావ్!” అన్నాడు వాడు. “వ్యవహారం ఇంత త్వరగా తేల్చేశావా?”

“ఒరే కాలేజ్ స్టూడెంట్! నీకు నిజంగా నాకు సహాయం చెయ్యాలనే ఉంటే, ఇలా చేపలు కొట్టిపెట్టే ముసలమ్మలకి పరిచయం చెయ్యకు ఇంకోసారి.” అన్నాన్నేను.

“మతిలేకుండా మాట్లాడుతున్నావ్ నువ్వు. ఆవిడ నీకంటే ఒకేడు చిన్నది…” వాక్యం పూర్తిచెయ్యకుండా నావంక అలా చూస్తూ ఉండిపోయాడు వాడు. “వార్నీ! నువ్వు నిజంగా పడుచువాడిలా కనబడతావ్!”

నేను నిజంగానే పడుచువాడిలా కనబడతాను. ఒక్కోసారి నాకు ఇరవయ్యొకటి అనిపిస్తుంది. నా పనితీరుని బట్టి చూస్తే ముప్ఫై దాటినట్టనిపిస్తుంది. నన్ను ఆవిడకి పరిచయం చేస్తున్నప్పుడు వాళ్ళు నాకు నలభై దాటినయ్యని చెప్పారు. నిజానికి అప్పటికి నాకు నలభైతొమ్మిది సంవత్సరాలా, పది నెలలా, ఇరవైరెండు రోజులు.

ఎక్కువ రోజులు తిరక్కముందే, కాలేజీ స్టూడెంటు నా కోసం ఇంకో అమ్మాయిని పట్టుకున్నాడు. “వాంగ్‌బావ్! ఈసారి అమ్మాయి నీకు నచ్చుతుందని నేను హామీ ఇస్తున్నా. ఈ అమ్మాయికి ఎప్పుడూ పెళ్ళికాలేదు. వయసు ముప్ఫయ్యే.”

మేము పార్కులోంచి బయటకొచ్చింతర్వాత, నేనా అమ్మాయితో ఓ ఫర్లాంగు దూరం నడిచాను. అంతవరకూ తను ఒక్క మాట మాట్లాళ్ళేదు. ఉన్నట్టుండి, ఏదో ముఖ్యమైన విషయం మర్చిపోయాననీ, తను వెంటనే వెళిపోవాలనీ అన్నదా అమ్మాయి. మధ్యలో వెళిపోతున్నందుకు క్షమాపణలు చెప్పింది. ఏం చేద్దామనీ ప్రోగ్రామేమీ లేదు కాబట్టి ఫర్వాలేదన్నాను. బస్ స్టాండు దాకా దిగబెట్టేను తనని.

ఇంటికెళ్తూ నాలో నేను నవ్వుకున్నాను. ‘వాంగ్‌బావ్! నువ్వు గనుక మీ పల్లెటూరి బాబాయి చేసుకున్న వయసులోనే పెళ్ళిచేసుకుని ఓ పాపని కనుంటే, నీ కూతురు ఇదే వయసులో ఉండేదిప్పుడు. నువ్వు ఈ అమ్మాయిని పెళ్ళిచేసుకుంటే రోడ్డుమీద ఎదురయినవాళ్ళు వాంగ్‌బావ్! ఈ అమ్మాయి నీ కూతురా? అనడిగితే ఎలా ఉంటుంది?’

ఇలా మరికొన్నిసార్లయ్యేసరికి, నా టీమ్‌మేట్లు నా మీటింగుల్ని ముందుగానే పసికట్టేవాళ్ళు. నా జుట్టు బాగా దువ్వున్న రోజున వాళ్ళు “ఏంటి గ్రూప్ లీడర్! ఈ రాత్రేమన్నా విశేషమా?” అని అడిగేవాళ్ళు.

“విశేషమేం లేదు,” సమాధానమిచ్చేవాణ్ణి. “అలా ఓ నాలుగడుగులు నడిచిరాడమే.”

నా మీటింగులు చాలావరకూ కలిసి నడవడమంతే. చాలాసార్లు, రెండో ఫర్లాంగు నడవాల్సిన అవసరముండేది కాదు. ఎందుకంటే, నా గతం గురించి వినేసరికి ఆడవాళ్ళకి భయం పుట్టేది. నాకున్న ఒకే ఒక్క అర్హత–ఉండడానికి స్వంతానికి ఒక గది ఉండడం. ఐతే, వయసూ, జీతం, డబ్బూ లాంటివాటితో పోలిస్తే ఇది చాలా చిన్న అర్హత. కానీ, నాకు బాధేమీ లేదు. ఈ నడవడాలు నాకు ఒక మేలు చేసినై. ఇరవయ్యేళ్ళుగా మానలేకపోయిన సిగరెట్ల అలవాటుని వదిలించుకోగలిగా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తమ భర్తలు తాగకూడదనీ, సిగరెట్లు కాల్చకూడదనీ ఆశిస్తున్నారు. మంచి బట్టలు కూడా కొనుక్కోకూడదట. వేరే విధంగా చెప్పాలంటే, వాళ్ళక్కావాల్సింది డబ్బులు ఖర్చుచెయ్యని మగవాళ్ళు. గుర్రం బాగా పరిగెత్తాలి గానీ మేత తినకూడదు.

సర్వయివల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ సిద్ధాంతం ప్రకారం, బహుశా, ముందు ముందు గుర్రాలన్నీ అలానే ఉంటాయేమో!


నాకు ఆశ సన్నగిల్లుతున్న సమయంలో నాకు భార్య కాబోయే ఆవిడ తారసపడింది. ఆ రోజు కాలేజీ స్టూడెంట్ మా ఇంటికి పరుగెత్తుకొచ్చాడు. “వాంగ్‌బావ్! నీ కోసం ఒకావిణ్ణి వెదికా. అహ! అప్పుడే ఆత్రుతపడిపోకు, చెప్పేది విను ముందు. ఈ అమ్మాయి చేపలు శుభ్రం చేసే ముసలావిడా కాదు; మరీ పడుచమ్మాయీ కాదు. ఓ బట్టల ఫాక్టరీలో పనిచేస్తుంది ఈవిడ. వయసు ముప్ఫై తొమ్మిది. పేరు లి షూలన్. అందమైంది, తెలివైంది, ముక్కుసూటిగా పోయేదీనూ. నేను చూసి మాట్లాడేనావిడతో. మంచావిడ. ఒకసారి పెళ్ళయ్యింది గానీ భర్త పోయిన సంవత్సరమే పన్లో ఏదో యాక్సిడెంటులో పోయాడు. అత్తతో పడకపోవడంవల్ల తను త్వరగా బయటపడాల్సిన అవసరం వచ్చింది. కాకపోతే, ఒక్కటే సమస్య. ఈవిడకో కొడుకున్నాడు. వాడికప్పుడే పదకొండేళ్ళు. ఏంటి? బుర్రలోకెక్కుతుందా?”

“అంతా నీ ఇష్టం,” అన్నాన్నేను. “ఈవిణ్ణి పార్కులో ఎప్పుడు కలుద్దాం?”

ఐతే ఈసారి మీటింగ్ వేరే రకంగా జరిగింది. మేం పార్కుకెళ్ళలేదు. వీధుల్లో తిరగలేదు. కాలేజీ స్టూడెంటు ఆవిణ్ణి తిన్నగా నా ఇంటికి తీసుకొచ్చాడు. ఆవిడ చాలా ముక్కుసూటిగా “వాంగ్‌బావ్! మనమిద్దరమూ జీవితంలో చాలా ఒడిదుడుకులు చూసినవాళ్ళమే. మనకి డొంకతిరుగుడెందుకు? నాకు నీ పరిస్థితంతా తెలుసు. దాని గురించి నాకు అభ్యంతరాలేం లేవు. నీకూ నా గురించి తెలుసు. నీకభ్యంతరం లేకపోతే పెళ్ళి చేసుకుందాం. నేను చెప్పాల్సిందొకటే. నాకు వయసు పైబడుతుంది, నాకింకోసారి కనే ఓపిక లేదు.”

దానికి నాకభ్యంతరం లేదని చెప్పాను. నిజం చెప్పొద్దూ, అలాంటి బాధ్యత స్వీకరించడానికి నాకూ శక్తి మిగిలిందనుకోను.

“ఇంకో విషయం. నాకో కొడుకున్నాడు… నీకు తెలిసిందే. వాడు నా సర్వస్వమూనూ. అందువల్ల, నువ్వూ షావ్‌డాంగ్ ఒకరికొకరు నచ్చడం కూడా చాలా ముఖ్యం. వాడికి నువ్వు నచ్చితేనే మన పెళ్ళి జరుగుతుంది. లేదంటే, మనమీ విషయాన్ని మర్చిపోవడమే.”

ఆమె చెబుతున్నది అర్థమయ్యింది. నన్ను తన కొడుకుని ప్రేమించమని అడుగుతున్నది.

ఆ ఆదివారం షూలన్ తన కొడుకును తీసుకొచ్చింది. వాణ్ణి మొదట ఫూ షింగ్ ఎమ్యూజ్‌మెంట్ పార్కుకి తీసుకెళ్ళేను. తర్వాత హ్వాయ్ హై బజారుకి తీసుకెళ్ళా. వాడితో ఎలా ప్రవర్తించాలో నాకు బొత్తిగా తెలీలేదు. ఐస్‌క్రీమ్ కొనిపెడతానన్నాను. వద్దన్నాడు. బుడగలు కొనబోయా. అదీ వద్దన్నాడు. చివరికి గో టాయ్ సినిమా హాలు దగ్గరకెళ్ళాం. షావొలిన్ టెంపుల్ ఆడుతున్నది. వాణ్ణి లోపలికి తీసుకెళ్ళా.

“బాగుందా?” సినిమా అయింతర్వాత అడిగేను.

“బాగుంది.” అన్నాడు వాడు.

అలా అని, కుడిచేత్తో పిడికిలి బిగించి మొహమ్మీద కొడుతున్నట్టు నటిస్తూ ఎడమకాలితో నా పొట్టలో తన్నబోయాడు.

ఆహా! తాగుబోతు స్టైలు[8]షావొలిన్ టెంపుల్ సినిమాలో ఒక త్రాగుబోతు పాత్రుంటుంది. పేరుకు తగ్గట్టుగా ఉంటుంది అతగాడి ఫైటింగ్ స్టైలు.. దీన్నెలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. నేను వాడి కాలిని అడ్డగించి, క్రిందకి తోసేసి, “మేమీ సినిమాని మూడుసార్లు చూసేమండీ!” అన్నాను.

“మేము ఆరుసార్లు చూసేమండీ!” అని నవ్వేడు షావ్‌డాంగ్.

వాడితో అలా కత్తు కలిపేన్నేను.

“నాకు పదకొండేళ్ళప్పుడు–అంటే నీ వయసన్న మాట–నేను ఉత్తర జాన్సూలో మా పల్లెటూర్నించి షాంగ్‌హాయ్‌కొచ్చేను. రోడ్డుపక్కన ఓ తడికెల కొట్టాంలో ఉండేవాణ్ణి. మమ్మల్ని వెనక్కి, అంటే పల్లెలకి, పంపించమని మేయరు చెన్ యీ చాలామంది పార్టీ మెంబర్లని పంపేడు. వాళ్ళనెవరమూ పట్టించుకోలేదు.”

“మేయర్ చెన్ యీ నా?” అన్నాడు షావ్‌డాంగ్. “ఆయన గురించి నాకు తెలుసు. సినిమా ఉంది కదా ఆయన గురించి. నేంచూసేను దాన్ని. ఆయన మంచోడు కదా. ఆయన మిమ్మల్ని వెనక్కి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదు?”

మంచివాళ్ళని మనం ఎవరు చెప్పిందీ గుడ్డిగా చెయ్యకూడదని చెప్పాను. నేను చెప్పింది షావ్‌డాంగ్‌కి అర్థమయ్యుంటుందనుకోను. నాకైనా ఈ సంగతి ఇరవయ్యేళ్ళొచ్చిన తర్వాతనే నెమ్మదిగా అర్థమయ్యింది — మా ఫేక్టరీ డైరెక్టర్ పుణ్యమాని.


నాకు పెళ్ళయిందాకా తెలీని విషయమొకటుంది–కాలేజీ స్టూడెంటు నాకింతమంది ఆడవాళ్ళని, ఒకరితర్వాత ఒకర్ని, ఎలా పరిచయం చెయ్యగలిగేడా అని.

షాంగ్‌హాయ్‌కి తిరిగొచ్చింతర్వాత వాడు వాళ్ళ కాలనీవాళ్ళు నడిపే చిన్న ఫాక్టరీలో పనిక్కుదిరేడు. నా పెళ్ళయింతర్వాత కాలేజీ స్టూడెంటు బయటపెట్టిన విషయమేంటంటే, షూలన్‌తో సహా నాకు పరిచయం చేయబడ్డ ఆడవాళ్ళందరూ కూడా వాడి స్నేహితులు వాడికి ‘పరిచయం’ చేసినవాళ్ళు! వాడు వాళ్ళందర్నీ నాకప్పగించాడు. వాడు తన గురించి ఆలోచించుకోవట్లేదా అనడిగితే వాడు “నాఖ్ఖంగారు లేదు. నాకు నా మనస్సుని ఆకట్టుకుని, ఉత్తేజపరిచే స్త్రీ కావాలి. అటువంటామె దొరికేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను.” అన్నాడు.

వాడు నాకంటే రెండేళ్ళు పెద్ద. నేను నా వయస్సు నలభై కంటే ‘కొంచెం’ ఎక్కువని చెప్పుకునే రోజుల్లోనే వాడికి యాభై నిండినియ్యి. వాడికి తను కోరుకునేలాంటి అమ్మాయి దొరకాలని నా కోరిక.

నా వరకూ నాకు నేను నిజంగా కోరుకున్న అమ్మాయి దొరికిందో లేదో తెలీదు. ఐతే, వాడు వెతుక్కుంటున్నదీ, నేను వెతుక్కున్నదీ ఒకటి కాదు. ఇరవయ్యేళ్ళు కలిసున్నా, మా స్వభావాల్లో నిజంగా చాలా తేడా ఉంది. అలానే, షూలన్నూ నేనూ జీవితంలో పెళ్ళిద్వారా పొందాలనుకున్నది ఒకటో కాదో తెలీదు. ఒక్కోసారి ఒకటేననిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం మేమీ విషయంలో భిన్న ధృవాలమనిపిస్తుంది.

ఒకసారి షూలన్ అన్నది “వాంగ్‌బావ్! నిన్ను కట్టుకోడం పెద్ద పొరపాటు. నా బిడ్డకి ఒక తండ్రి కావాలనుకున్నాన్నేను. ఒక వయసుమీరినవాడు రెండో బిడ్డగా దొరుకుతాడని ఊహించలేదు.”

ఒకసారి షావ్‌డాంగ్, నేనూ ఒక పుస్తకం గురించి కొట్టుకున్నాం. షూలన్ అన్న మాటలు ఆ సంఘటన గురించే. నేను ఫాక్టరీ లైబ్రరీనుంచి ఓ మార్షల్ ఆర్ట్స్ నవల తెచ్చా. నేను ఇంటికి రాగానే షావ్‌డాంగ్ దాన్ని లాక్కున్నాడు. వాడు దాన్ని భోజనమవ్వకముందు నుంచీ రాత్రి పది వరకూ చదివేడు. చివరికి షూలన్ వాణ్ణి బలవంతంగా పడుకోబెట్టింది. అప్పట్నించీ రాత్రి పావుతక్కువరెండు వరకూ నేను చదివేను దాన్ని. పొద్దున్న మేము నిద్ర లేచేసరికి షావ్‌డాంగ్ దాన్ని దుప్పటికింద దాచుకుని చదవడం కనబడింది.

షూలన్‌కి నాగురించి అసంతృప్తేం లేదు నిజానికి. ఎందుకంటే షావ్‌డాంగే ఆమె సర్వస్వమూనూ. షావ్‌డాంగే నన్ను ఎంపిక చేసింది కూడానూ. షూలనే చెప్పింది. మేం పెళ్ళిచేసుకోబోయే ముందు నేను నచ్చానో లేదో కొడుకునడిగిందట. వాడు చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయి, చివరికి ఇలా అన్నాడట: “ఎలానూ నువ్వు నాకు ఇంకో నాన్నని తీసుకొస్తావ్. అలాంటప్పుడు వాంగ్‌బావైతేనే మంచిది. వాంగ్‌బావ్ మంచివాడు. నేను తన మాట వినఖ్ఖర్లేదని కూడా అన్నాడు.”

(సశేషం)

అధస్సూచికలు[+]