కవి సమ్రాట్

ఆమె ఉదయాన పదకొండింటికి చేతిలోని సంచిని పసిబిడ్డలా పట్టుకుని మైసూరు సబర్బ్‌ బస్సు స్టేషనులో దిగుతూనే ఆటో అతనితో “చంద్రవళ్ళి చెరువు” అని అంది.

వయసులో చిన్నవాడైన ఆ ఆటో డ్రైవర్ ముఖకవళికలు మార్చి ‘అదెక్కడ’ అన్నట్టు ఆమె మొహంకేసి చూశాడు.

ఆమె కోపం చూపించకుండా “చంద్రవళ్ళి చెరువు” అని మళ్ళీ చెప్పింది.

“మేడమ్, కారంజి చెరువా?”

ఆమె సహనం కోల్పోయింది. “కాదు. చం ద్ర వ ళ్ళి చె రు వు” ఆమె ఒక్కొక్క అక్షరాన్ని ఒత్తి పలికింది.

“సుబ్బరాయన చెరువు, లింగాంబుది చెరువు, హెబ్బాళు చెరువు” అతను మైసూరులోని చెరువుల పట్టీ అంతా చదవసాగాడు.

ఆమెకు నిజంగా కోపమొచ్చింది. ‘ఏదీ కాదు. వైశంపాయన చెరువు’ ఆమె తనకు మాత్రమే వినిపించేలా గొణుక్కుని ముందుకెళ్ళి ఇంకొక ఆటో అతని ముందు నిలుచుని “చంద్రవళ్ళి చెరువు” అంది.

“తెలీదు.” అతనూ తలాడించి అక్కడితో ఆగకుండా, “ఎందుకు మేడమ్, పొద్దుపొద్దున్నే చెరువు?” అని ముక్కు చిట్లించి నవ్వాడు.

“చావడానికి కాదులే, వాకింగ్ చేయడానికి.” ఆమె కూడా కోపం చూపించకుండా చక్కగా నవ్వింది.

“మేడమ్ వాకింగ్‌కి వెళ్ళాలనుకుంటే కుక్కరహళ్ళి చెరువు బెస్ట్. తీసుకెళ్ళనా?” అన్నాడు.

ఆమెకు సిగ్గు వేసింది. నిజానికి దాని పేరు కుక్కరహళ్ళి చెరువు. చంద్రవళ్ళి చెరువు కాదు. కవి సమ్రాట్‌గారి పుస్తకాలను చదివి చదివి ఆమెకు అది చంద్రవళ్ళి చెరువనే మెదడులో ముద్రపడిపోయింది.

“అవును, కుక్కరహళ్ళి చెరువు. రైట్, పోదాం పద” అని ఆటో ఎక్కి నిమ్మళంగా కూర్చుని ఆటో అద్దంలో తన మొహం చూసుకుని ముసిముసిగా నవ్వుకుంది. ఆమెకు నమ్మకం కుదరలేదు. కేవలం మూడు గంటల ముందు ఆమె మడికేరి సర్కారు బస్సు స్టాండ్‌లో ఉంది. కొడుకు ప్రద్యుమ్న తోటనుంచి జీపులో తీసుకొచ్చి దింపాడు. అతనికి అమ్మని బస్సు ఎక్కించడం ఇష్టం లేదు.

“మమ్మీ, మైసూరు వరకూ నేనే జీపులో దిగబెడతాను. గంటా గంటన్నరలో అక్కడ ఉంటావు” అన్నాడు.

“నో! నో!” ఆమె గట్టిగా చెప్పింది.

“సరే మమ్మీ, పోనీ వాపసు ఎన్నింటికి? ఇక్కడకి వచ్చి ఎదురుచూస్తాను.” అతను నిస్సహాయంగా అడిగాడు.

“వద్దు, నేనే బస్సు ఎక్కి వచ్చేస్తాను. కర్నల్ సాహెబుగారికీ చెప్పు, ఎవరూ ఎదురుచూడొద్దు.”

ఆమె జీపునుంచి దిగి అతనికి టాటా చెప్పి కంటిచూపుతోనే అతని నుదిటిపైకి ఒక పూలముద్దు పంపించి బస్సు ఎక్కింది.

అమ్మ కంటిచూపుతోనే అలా పూలముద్దు ఇవ్వడం ప్రద్యుమ్నకు చాలా ఇష్టం. అతను చూడ్డానికి అచ్చం నాన్నలా ఉంటాడు. అయితే అతని స్వభావం పూర్తిగా అమ్మది. చిన్నచిన్నవాటికీ నొచ్చుకోవడం. పెద్ద పెద్ద నిర్ణయాలు చేసేసుకోవడం. అవి చేయలేకపోయినప్పుడు లోలోపల కుమిలిపోవడం.

అతను జీవితంలో ప్రేమించిన ఒకే అమ్మాయి ఇప్పుడు పెళ్ళి చేసుకోడానికి ఒప్పుకోకుండా సతాయిస్తూ ఉంది. “అడవిని వదిలి బెంగళూరుకి రా, బిందాసుగా బతుకుదాం” అంటుందామె.

చూడ్డానికి నాన్నలానే దృఢంగా ఉండే ప్రద్యుమ్న ఏడ్చేటప్పుడు మాత్రం అచ్చం పిల్లవాడిలానే ఉంటాడు. నాన్న కర్నల్ సాహెబుగారికి ఏడుపుగొట్టు కొడుకుని చూస్తే చిరాకు. ‘పులి కడుపున ఎలుకపిల్లలా పుట్టాడు’ అని మొదలెడతారు. ‘ఇదంతా నీ గారాబం వల్లే’ అని ఈమెనూ ఛీత్కరించుకుంటారు.

ఆయన్ని ఇంట్లో భార్య కూడా ‘కర్నల్’ అనే పిలవాలి. పిల్లలు కూడా ‘కర్నల్ పప్పా’ అనే అనాలి. పనివాళ్ళూ అంతే, ‘కర్నల్ షావుకార్ సాబ్’ అని అనాలి.


కర్నల్ సాహెబుగారు సెలవల్లో ఊరికి వచ్చినప్పుడు, అప్పటికే ఉజిరె ఎస్.డి.ఎమ్. డిగ్రీ కాలేజిలో డిగ్రీ పూర్తి చేసుకుని వచ్చిన ఆమె ఇంటికి తనకోసం వధువుని వెతుక్కుంటూ వచ్చారు. అప్పటికి ఆయన ఇంకా కర్నల్ అవ్వలేదు. అప్పటికి కెప్టన్ అయివున్నారు. ఆయన వచ్చినప్పుడు ఆమె మునగదీసుకుని కూర్చునుంది. కన్నెత్తి చూడడానికీ భయం. అమ్మాయిని చూసుకోడానికి వచ్చి వెళ్ళినవారు మళ్ళీ వెంటనే మూడో రోజున వచ్చారు. ‘అమ్మాయి ఎందుకనో పొట్టిగా అనిపిస్తోంది’ అని అమ్మాయిని చూడ్డానికి జతగా వచ్చినవాళ్ళు అన్నారట. అందుకనే మళ్ళీ వచ్చి చూసెళ్ళారు. అప్పుడు ఆమె ఇంకా మునగదీసుకుపోయింది.

ఎందుకో ఆమెకు ఈ తంతు అంతా అయోమయంగా అనిపించేది. ఉజిరెలో హాస్టల్లో అమ్మాయిలు పెళ్ళి గురించి, భర్త గురించి గుసగుసలాడుతూ కిసుక్కున నవ్వుకుంటున్నవారు ఆమెను చూడగానే మాటలాపి మౌనం వహించేవారు. ఎందుకంటే ఆమెకి భర్త గురించి, పెళ్ళి గురించి, తర్వాతి సంగతుల గురించి మాటలు వింటే యాక్ అనిపించేది. ‘అంతా ఇలా ఉంటుందా…’ అన్న జుగుప్సకి లోనయ్యేది. అందుకే ఆమె వచ్చాక హాస్టలు అమ్మాయిల ఆటపట్టింపులు ఆగిపోయేవి.

కెప్టెన్ సాహెబుగారు తనని పొట్టిగా ఉందా, లావుగా ఉందా అని కళ్ళతోనే కొలుస్తున్నప్పుడు ఆమెకు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకున్నాయి. ఏం మాట్లాడకుండా ఇంట్లోకి పరుగెత్తింది.

మూడో రోజున అమ్మమ్మ ఇంటికి వెళ్ళింది. ఫోను, కరెంటు ఏమీ లేని కాటిబెట్ట అడవి లోపలున్న తాతముత్తాతలనాటి ఇల్లు.

అమ్మమ్మ ఒక్కత్తే ఉండేది. తాతయ్య చాలా కాలం కిందటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఎక్కడికో తెలీదు. ఆయనకు బాల్యంలోనే వైరాగ్యం వచ్చిందట. పొన్నంపేటలోని ఆశ్రమంలో సన్యాసులతో కలిసి ఉండే ఆయనని, తోట పనిపాటా చూసుకోడానికి ఎవరూ లేరని అమ్మమ్మకిచ్చి పెళ్ళి చేశారు. అమ్మ పుట్టిన ఆరునెలలకే తాతయ్య వెళ్ళిపోయాడు. కలకత్తాకో హరిద్వారుకో తెలీదు. అమ్మమ్మ కూతురును పెంచుకుంటూ, తోటపని చేసుకుంటూ ఒక్కతే జీవితం సాగించింది. కూతురూ పెళ్ళిచేసుకుని వెళ్ళిపోయాక ఆవిడ ఒంటరైపోయింది.

ఆమె సెలవు దొరికినప్పుడల్లా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళిపోయేది.

అమ్మమ్మ గట్టి మనిషి. గుట్టని కొంత కొట్టి సాఫుచేసి తోట వేసింది. గుట్టపై వాలుగా కాఫీ తోట. కాఫీ మొక్కల మధ్య నారింజ చెట్లు. నీడనిచ్చే చెట్లనిండా నల్లమిరియాల తీగెలు. వరి చేల పక్కన ఇసుక నేలలో యాలకుల మొక్కలు. ఇంటి చుట్టూ ఊదాపూలు, జామకాయ, పనసకాయ, జాజికాయ, కోకో చెట్లు. వానాకాలం తర్వాత వేసవిలో ఎక్కడినుంచో ఎగిరొచ్చే వలస పక్షులు. ఆమెకు అమ్మమ్మతో ఉండడం బాగా హాయిగా అనిపించేది.

అమ్మమ్మ బీరువానిండా పుస్తకాలుండేవి. అమ్మమ్మ హరికేన్ లాంతరులో కిరోసిన్ పోసి, వత్తిని పెంచి, ముట్టించి చదవడానికి కూర్చునేది. దీపానికి ఒక వైపున అమ్మమ్మ. ఇంకో వైపున ఆమె. చదివిన పుస్తకాల సారాంశాన్ని ఆమెకు కథలా చెప్పడమంటే అమ్మమ్మకి ఇష్టం. ఆమె మొదట్లో ఆ కథల సారాంశాలను వింటూ ఉండేది, ఆపైన తానే చదవడం మొదలుపెట్టింది.

అప్పుడే ఆమెకు కవి సమ్రాట్‌ కథల పుస్తకాలు చదవడానికి దొరికాయి.

అప్పట్లో ఆమెకు కథ, కవిత, నవల అనే వ్యత్యాసాలేవీ తెలీదు. అన్నీ కథల పుస్తకాలే. కవి సమ్రాట్‌గారూ అంతే. అన్నీ రాస్తూ వచ్చారు – కథ, నవల, కవిత, నాటకం, విమర్శ, యాత్రాకథనం అన్నీ. అయితే ఆమెకు ఆయన రచించినవన్నీ కథలే అనిపించాయి. అమ్మమ్మ వాళ్ళింట్లో ఆమె పగలూ రాత్రి ప్రాణం పెట్టి ఆయన పుస్తకాలన్నీ చదివింది. ఆయన రాసినవాటిల్లో అనురాగం, ప్రణయం లాంటి విషయాలు వచ్చినప్పుడు వాటిని వదిలేసి తర్వాతవి చదివేది.

పుస్తకం వెనుక అట్టమీద కవి సమ్రాట్‌గారి ఫోటో ఉండేది. ఇంత చిన్న వయసులో ఇన్నేసి విషయాల గురించి రాయడం సాధ్యమేనా అని ఆమెకు ఆశ్చర్యంగా అనిపించేది. కవి సమ్రాట్‌గారు అంత చిన్న వయసులోనే సముద్రాన్ని దాటి ఇంగ్లాండుకు వెళ్ళి చదువుకుని వచ్చారని అమ్మమ్మ చెప్పింది.

అమ్మమ్మ మైసూరులో వసంత మహల్‌లో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసింది. వసంత మహల్ మైసూరు కోటకు చాలా దగ్గర. మైసూరు కారంజి చెరువు, జంతుప్రదర్శనశాల, థండీ సడక్ అనే నడకబాట కూడా అక్కడే ఉన్నాయి. ఇంగ్లండులో చదువు ముగించుకుని వచ్చిన కవి సమ్రాట్‌గారు అక్కడే రోజూ వ్యాహ్యాళికి రావడం అమ్మమ్మ చూశానని చెప్పింది. ఆయన రాజవంశానికి చెందినవారు. బాల్యాన్ని కోటలోనే గడిపారు. చనిపోయిన రాజుగారు దత్తత తీసుకునుంటే ఈయనే ముందు రాజు అయ్యేవారు కాని, రాజుగారు దత్తత తీసుకునే లోపే ఈయన లండనుకు చదువుకోడానికి వెళ్ళిపోయారని అమ్మమ్మ చెప్పింది.

చదువుకుని తిరిగి వచ్చినాక కవి సమ్రాట్ అన్న పేరుతో రాయడం మొదలుపెట్టారు. ఆయన అసలు పేరు విక్రమాదిత్య అరస్ అని ఏదో ఉండాలట. అదేంటో అమ్మమ్మకి తెలీదు. “మంచి మనిషి, అయితే జతగాళ్ళందరూ మాత్రం పోకిరి అబ్బాయిలు” అంది.

అమ్మమ్మ లెక్క ప్రకారం పోకిరి అబ్బాయిలంటే పొగాకు తాగేవారు, కల్లు తాగేవారు, ఇంకా గుర్రపు పందాలు కాసేవారు. కవి సమ్రాట్ కూడా ఇవ్వన్నీ చేస్తుండేవారట.

“కానీ రాయడంలో మాత్రం ఆయన నెంబర్ వన్ కదే!” అమ్మమ్మ పెద్దగా నవ్వేది.


ఆమెకు నవ్వొచ్చింది. తన అమ్మమ్మ యవ్వనపు రోజులనాటి, కవి సమ్రాట్‌గారి మైసూరులో ఆయన అడుగుల జాడలను వెతుక్కుంటూ, ఆయన వ్యాహ్యాళికి వెళ్ళే కల్పిత చంద్రవళ్ళి చెరువు కోసం ఆటోలో తిరుగుతున్న తను. ఆటోరిక్షా మైసూరులోని రాజవీధులలో పొగ వదులుతూ కోటను దాటి, ఇద్దరు మహారాజుల విగ్రహాలను దాటి, రెండు వైపులా అంగళ్ళ వరసున్న పెద్ద రోడ్డు చివర సిగ్నల్ దగ్గర ఆకుపచ్చ లైట్ కోసం ఆగింది. ఇక్కడనుంచి ముందుకు పోతే డి.సి. ఆఫీసు, ఆ తర్వాత మహారాజా కాలేజి, దానికన్నా ముందే ఎడమవైపుకు రైలు పట్టాలు, అవి దాటితే అదే కుక్కరహళ్ళి చెరువు.

ఆమె చేతిలో ఉన్న మొబైలులో మ్యాప్‌ను చూస్తూ ఉంది. నిజానికి మ్యాప్ లేకుండా ఆమె మైసూరు అంతా తిరగాలనుకుంది. కానీ ఇది మ్యాప్ లేకపోతే ఏమీ తెలియని కాలం. బహుశా కవిసమ్రాట్‌గారు బతికుండుంటే, మ్యాప్ చూసుకుంటూ ఆయన కథల లోకంలో తిరుగుతున్న తన గురించే ఆయన తనదైన తేలికభాషలో ఒక కథ రాసుండేవారో ఏమో.

“పిచ్చి పిల్లా, నువ్వు నీ అమ్మమ్మ జమానాలో పుట్టుండాల్సింది, లేదా నేను నీ తరంలో మడికేరిలో పుట్టాల్సింది.” ఆయన ఒక చిన్న ఉత్తరంలో రాశారు.

అది ప్రద్యుమ్న ఆమె పొట్టలో కదులుతున్న కాలం. అప్పుడు ఆమె మైసూరులోనే ఉండేది. సాహెబుగారు కెప్టెన్‌గిరీ ముగిసి అప్పటికి కర్నల్ అయ్యారు. మైసూరు సైనిక అతిథి గృహంలో ఉండేవారు. అక్కడ ఏప్రిల్‌ లోనూ కొడగుకన్నా తీవ్రమైన చలి ఉండేది. కడుపులో ప్రద్యుమ్న ఒక పులకరింపు, తన కడుపు లోపలకి ఎలా చేరుకుందో అనేది ఆమెకు ఆశ్చర్యం. కవి సమ్రాట్‌ పుస్తకాలని కొన్ని తెచ్చుకుని వాటిల్లోని మాయాలోకంలో తిరుగాడేది.

‘చంద్రవళ్ళి చెరువు’ కవి సమ్రాట్‌గారి ఒక పుస్తకం. ‘వసంత వైభవం’ ఇంకొక పుస్తకం. ‘రాజ రహస్యం’ ఇంకోటి. ఇంకెన్నెన్నో.

కర్నల్ సాహెబుగారికి తెలిసేలా కాకుండా ఆమె చిన్న చిన్న కార్డులపైన ముద్దుముద్దు అక్షరాలలో రాసి పోస్టులో వేసేది. అరుదుగా ఆయనా జవాబిచ్చేవారు. ప్రద్యుమ్న పుట్టబోయేముందు, అ లేదా ప నుంచి మొదలయ్యే పేరు సూచించమని ఆమె అడిగింది. అబ్బాయి అయితే అపరాజిత, అమ్మాయి అయితే ఆలాపన అని ఆయన సలహా ఇచ్చారు.

“వల్లకాడేం కాదూ? ప్రద్యుమ్న అంటే చాలు” అని కర్నల్ సాహెబుగారు కొడుక్కి అలా పేరు పెట్టారు.

“ప్రద్యుమ్న అన్నది మంచి పేరే. కొడుకుని బాగా పెంచు” అని కవి సమ్రాట్‌గారు “నా కొడుక్కి నకుల అని పేరు పెడితే అతను నక్షత్రకుడిలా ఎదిగాడు. కూతురు విశాల అయినా విషం కక్కుతుంది!” ఒక పెద్ద ఆశ్చర్యార్థకంతో పాటుగా ఆయన జవాబిచ్చారు.

ఆయన పిల్లలు తండ్రిపైనే ఆస్తికోసం కోర్టు కేసు వేశారట!

చిన్న వయసులోనే ఆయన భార్య కాన్పులో విషజ్వరం వల్ల చనిపోయారు. అమ్మమ్మ సంరక్షణలో పెరిగిన పిల్లలు తండ్రిని ద్వేషించారు. పాఠకులు మెచ్చిన కవి సమ్రాట్‌, పిల్లలకు ఖల్‌నాయక్ అయ్యారు. ఎప్పుడూ ఇంటి నిండుగా ఉండే కవులు, కార్యకర్తలు, అభిమాన సుందరీమణులు, మద్యపానం, ధూమపానంతో నిండిన గోష్టులు – పిల్లలు తండ్రిని ద్వేషించేవారు.

వాళ్ళ ద్వేషానికీ కారణముందని కవి సమ్రాట్‌గారు రాశారు. “మంచి నాన్న మంచి రచయిత కూడా అవ్వడం చాలా అరుదు” అని అన్నారు.


ఆటో మహారాణి కాలేజీ దాటి డి.సి. ఆఫీసు దగ్గర మలుపులోకి వెళ్ళింది.

“ఒక్క నిముషం” ఆమె ఆటో ఆపింది. డి.సి. ఆఫీసు ఉదయపు ఎండలో మెరుస్తూంది. ఉద్యోగులు, ప్రజలు చేరుకోవడం మొదలుపెట్టారు. సంచిని ఆటోలోనే పెట్టి, దానిలోపలున్న చిన్న కెమేరాను తీసుకుని దిగింది. ఆటో అతను బీడీ కాల్చుకుంటూ ఆటోకు ఆనుకుని నిలబడ్డాడు.

ఆమె డి.సి. ఆఫీసు ఎదురుగా ఉన్న పార్కులో కాలుపెట్టింది. పార్కు మధ్యలో రాతి వేదికపై నుంచునున్న తెల్లవాళ్ళ కాలంనాటి రెసిడెంట్ నల్లని విగ్రహం. ఆ కాలంనుంచీ ఏమీ మారలేదనట్టుగా రాయిలా నుంచున్న పురుషాకృతి ఎండలో నిగనిగలాడింది.

ఆమెకు నవ్వొచ్చింది.

కవి సమ్రాట్‌గారి నవల ఒకదానిలో – వేడెక్కిన రక్తంతో ఉన్న ముగ్గురు యువ పోరాటయోధులు ఆ విగ్రహాన్ని అక్కడనుంచి కూలదోయాలని శ్రమపడతారు. వారిలో ఒకడు అప్పటికే స్వయాన లండనులో విద్యాభ్యాసం ముగించి వచ్చిన రాజవంశపు యువకుడు. ఈ విగ్రహం తెల్లవాళ్ళ పరాయి పాలనా కాలపు దౌర్జన్యాల ప్రతీక అని భావించి వాళ్ళు దాన్ని కదిలించడానికి శ్రమిస్తారు. ముగ్గురూ అర్ధరాత్రి, గాంధీ చౌక్‌లోని తెల్లవాళ్ళ బారులో తాగినంత తాగి, చాలినంత మత్తెక్కించుకుని అక్కడికొచ్చి తెల్లవారేవరకూ ఆ విగ్రహం కూలదోయాలని ప్రయత్నించి నీరసమొచ్చి వాపసు వెళ్ళిపోతారు. ఇది ఆయన నవల వృత్తాంతం. బహుశా ఆ నవల పేరు ‘ప్రజా విజయం’ అయ్యుండచ్చు.

ఆమె ఫోటో క్లిక్ చేసింది. ఆమె మొహంపై చిరునవ్వు అలానే మిగిలివుంది.

“ఉడుకు రక్తపు కాలమది. ఇప్పుడు మన మెదళ్ళు అలాంటి పనులు చేయడం లేదు. అయినా పాపం అతనేమి చేశాడని అంతగా. తర్వాత వచ్చిన మన ప్రజా ప్రభుత్వపు రెసిడెంటులు అతనికంటే భ్రష్టులు, క్రూరులు అయ్యారు” అన్నారు కవి సమ్రాట్‌గారు ఒక ఉత్తరంలో.

అప్పుడు ఆమెకు అవేవీ తెలియవు. ఇప్పటికీ అంతే. అదే చిరునవ్వు మొహంలో ఎప్పుడూ. పిల్లవాడు, తోట, తోట లోపలున్న పెద్ద ఇల్లు, పూలతోట, ఆంథూరియమ్, ఆర్కిడ్ మొక్కలు, వాడిపోని లిల్లీ కాడలు, పెంపుడు చేపలు, ఇంటిని కాపలా కాసే రెండు ముద్దొస్తూనే భయపెట్టే పెంపుడు కుక్కలు – అంతే. ఆమెకు అంతే తెలుసు.

స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని వచ్చిన కర్నల్ సాహెబుగారి గురించి కూడా ఆమె ఆలోచించలేదు ఎప్పుడూ. ఆయనా ఒక విగ్రహం ఈ బ్రిటిష్ రెసిడెంటు విగ్రహంలానే. దేనికీ కరిగేది లేదు. ఆయన హృదయంలో ఏమి జరుగుతుందో తెలియదు.

ఆమెకు తన పతి అయిన కర్నల్ సాహెబుగారికి హృదయం ఉంది అన్న సంగతి తెలిసింది రెండే సార్లు.

మొదటిసారి, తన రెండో కాన్పులో ఆడపిల్ల ప్రాణం లేకుండా బయటపడినప్పుడు తను కూడా మృత్యుముఖంలోకి వెళ్తోందని తెలిసినప్పుడు కర్నల్ సాహెబుగారు ఢిల్లీ మిలిటరీ ఆసుపత్రి రాతిబెంచీ పైన గొల్లుమంటూ తలపై చేతులు పెట్టుకుని ఏడుస్తూ కూర్చున్నారన్న సంగతి ఆ తర్వాత ఎవరో ఆమెకు చెప్పినప్పుడు. (దీన్ని ఆమె కవి సమ్రాట్‌గారికి రాసిన ఉత్తరంలో చెప్పింది. దానికి ఆయన ఏ జవాబూ ఇవ్వలేదు.)

రెండవసారి, ఈమధ్యనే కర్నల్ సాహెబుగారికి ఓపెన్ హార్ట్ శస్త్ర చికిత్స జరిగినప్పుడు.

అప్పుడు ఆమె గొల్లుమంటూ ఏడ్చింది! ప్రద్యుమ్న అమ్మను తల్లిలానే ఊరడించాడు. ఇది ఉత్తరంలో రాసి చెప్పడానికి అప్పటికి కవి సమ్రాట్‌గారు బతికి లేరు.

చివరి రోజుల్లో మైసూరులో హోటలు ఒకదాంట్లో గది ఒకటి అద్దెకు తీసుకుని అక్కడే నివాసం ఉంటున్న కవి సమ్రాట్‌గారు ఎవరినీ చూడడానికి రానివ్వలేదు. మనుషులపట్ల ఆయన నమ్మకం పటాపంచలైంది.

“నేను కవి సమ్రాట్‌ని అవకపోయినా కూడా పర్వాలేదు, మంచి తండ్రిని మాత్రం అవాలి” అని మాత్రం రాశారు.

ఆ ఉత్తరానికి ఆమె జవాబివ్వలేదు.


“మేడమ్, బయలుదేరుదామా?” ఒక బీడీ తాగి ఇంకొకదాన్ని పెదాల మధ్య పెట్టుకున్న ఆటో అతను అడిగాడు. ఇతని జీవితమే అందమైనది అయ్యుండచ్చు అనిపించింది.

“వెళ్దాం, మహారాజా కాలేజీ లోపలనుంచి వెళ్ళు” అంది.

అతను మహారాజా కాలేజీ లోపలనుంచి ఆటో పోనిచ్చాడు. అవే కట్టడాలు, అవే చెట్లు, అవే పచ్చికబయళ్ళు, అవే పూలపొదలు, అదే గ్రంథాలయపు భవనం. ఆటో అతను కాలేజీ ఆవరణనుంచి బయటకొచ్చి రైల్వే బ్రిడ్జి సొరంగం లోపలనుంచి అగ్నిమాపకదళం కార్యాలయం వైపు ఎడమకు తిప్పి బండి నడిపించాడు.

ఆటో ఒక వైపు పెద్ద గేటు ముందు ఆగింది. పక్కనే పెద్ద చేప ఆకృతిలో చేపల మార్కెట్టు. చెరువునుంచి వాటంతటవే బయటకొచ్చిన చేపలై ఉండాలి. ఎండ మెరుపులో జీవం పోతున్నట్టు కొట్టుకుంటున్నాయి.

ఆమె కిందకు దిగి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది.

“మేడమ్! అబ్ ఆప్ అందర్ నహీ జా సక్తా హై. షామ్ చార్ బజే ఖుల్తా హై” బీద మొహం గూర్ఖా అన్నాడు.

ఆమె గేటు ఊచల మధ్యనుంచే చెరువుని తొంగితొంగి చూసింది. దూరంగా నీరు మెరవడం కొంచెంగా కనిపించింది.

‘చం ద్ర వ ళ్ళి చె రు వు’ ఆమె మనసులోనే అనుకుంది. కవి సమ్రాట్‌గారు తన నవవధువు జతగా ఈ చెరువు దగ్గరకే వ్యాహ్యాళికి వచ్చేవారు.

లండను నుంచి చదువు ముగించుకుని వచ్చిన ఆయన. ఆంధ్ర నుంచి తత్వశాస్త్రం చదువుకోడానికి మైసూరుకి వచ్చిన ఆమె. రాజవంశీయులు ఆ వివాహాన్ని ఒప్పుకోలేదు. ఇద్దరూ ఒట్టిగా దండలు మార్చుకుని పెళ్ళి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రతీ సాయంకాలం ఈ చెరువు చుట్టూ నడిచేవారు. అదంతా ఆయన చంద్రవళ్ళి నవలలో రాశారు.

ఆమె పేరు చంద్రవల్లి. బాగా అందగత్తె అట.

“ఆమె ఉండుంటే నేను ఇలా ఉండేవాణ్ణి కానేమో” ఆయన రాశారు.

“భార్య ఎలా ఉన్నా భర్తలు మాత్రం అలానే ఉంటారు. రాతి బండల్లాగా!” ఆమె కూడా వెటకారంగా రాసింది.

అది ఆమె కడుపులోనే కడతేరిన ఆడపిల్ల తన్నడం మొదలెట్టిన కాలం.

ఆమెకు చెరువు ఎదుట ఆ భారీ గేటు ముందే కళ్ళు తిరిగినట్టయింది.

“పోదామా?” అంది.

“ఎక్కడికి?” ఆటో అతను అడిగాడు

“కవి సమ్రాట్ సర్కిల్” అంది.

అతను తల గోక్కున్నాడు. ఆపైన అతనికి తెలిసింది.

“ఓహ్! సమ్రాట్ సర్కిల్ మేడమ్ అది. కవి అని బోర్డుపైన మాత్రమే ఉంది, అయితే ఎవరూ అలా అనరు” అతను ఆటో నడిపించాడు.

సమ్రాట్ సర్కిల్ అన్ని సర్కిల్లలానే ఉంది. సర్కిల్ ఫలకం ముందే పెద్ద కొబ్బరిబొండాల గుట్ట. చేతిలో ఒక భారీ కత్తి పట్టుకుని నోటినిండా పాన్ నింపుకున్న పెద్ద గొంతు ఆడమనిషి.

“రండి మేడమ్ రండి. ఇక్కడే తాగుతారా? లేదా పార్సిలా?”

“ఇక్కడే. రెండు కొట్టు. ఇంకోటి ఆటో అతనికి.”

తాగుతూ చుట్టూ చూసింది. ఇక్కడే కవి సమ్రాట్‌గారి పెద్ద ఇల్లు ఒకటుండాలి. అయితే అది కనిపించకుండా చుట్టూ పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఎత్తుగా లేచాయి. కాళిదాస రోడ్డుకి చాచుకుంటూ కాంప్లెక్స్‌ల కింది అంతస్తులో చాలా పెద్ద పెద్ద బ్యాంకులు, టెలిఫోన్ కంపెనీ, బ్యూటీ పార్లర్లు, ఫాషన్ దుకాణాలు, కొవ్వు కరిగించే క్లినిక్కుల వరుస. కాంప్లెక్స్ పైన చివర్న ‘కవి సమ్రాట్ కాంప్లెక్స్’ అని రాగిపలక మీద కన్నడంలోనూ ఆంగ్లభాషలోనూ పెద్ద అక్షరాలతో రాసి ఉన్నాయి.


ఉదయాన్నే ఆఫీసుకి తయారవుతున్నప్పుడు నా మొబైల్ రింగయ్యింది.

“నీకు టైము ఉందా… ఉంటే దయచేసి రావచ్చుగా?”

చాలా కాలం నుంచి వినలేదు, అయినా బాగా పరిచితమైన గొంతు.

“ఏయ్! నువ్వు! ఎక్కడున్నావ్?”

“ఇక్కడే మైసూరులోనే ఉన్నా. దయచేసి రారాదూ. వస్తే చాలా బాగుంటుంది. నేనున్న చోటు లోకేషన్ పంపిస్తాను.” కొంత ఆలస్యంగా మెసేజ్ వచ్చింది.

మ్యాప్ చెప్పినట్టే వెళ్ళాను. కారు ఒక పెద్ద హోటలు ముందు ఆగింది. లోపలకి వెళ్ళి చూస్తే ఉదయాన కూడా మసక మసక దీపాలు వెలుగుతున్న లాంజ్‌లోని సోఫాలో ఆమె చేతిసంచి గట్టిగా పట్టుకుని అస్తవ్యస్తంగా కూర్చునుంది.

“ఏయ్… ఏమైంది నీకు?” దగ్గరకు వెళ్ళి భుజాలు కదిపాను.

“తెలీదు. నాకు ఏదో అయ్యింది. ఏమైందో తెలీడం లేదు.” ఆమె స్వెట్టరు చేతులను పైకి మడిచి తన ఒట్టి చేతులను చూపించింది. చేతులపైన గుండ్రంగా ఎర్రని మొటిమల్లాంటి పుళ్ళు.

“ఇక్కడ మాత్రమే కాదు. ఒళ్ళంతా అన్ని వైపులా వచ్చాయి. జ్వరం కూడా ఉంది. చచ్చేంత చలేస్తోంది.”

ఆమె శరీరాన్ని గట్టిగా బిగదీసి సోఫాలో ఇంకా మునగదీసుకుంది.

“ఎప్పుడొచ్చావ్? దేనికొచ్చావ్? కర్నల్ సాహెబుగారేరీ?”

“నిన్న ఇదే సమయానికి ఒక్కదాన్నే వచ్చాను. ఇంకేం అడగద్దు ప్లీజ్. నాకేదో అవుతుంది. నాకు హెల్ప్ చెయ్యి.” ఆమె వణికిపోతూ ఉంది.

హోటలులోని కుర్రాళ్ళూ బెదిరిపోయారు.

రిసెప్షనిస్ట్ దగ్గరకొచ్చి “డు యు నో హర్ సర్?” అంది.

“అవును తెల్సు. ఏమైందో చెప్పండి.”

“ఏమో సార్, ఆమె ఏమీ సరిగ్గా చెప్పడం లేదు. ఏదో అయితే అయ్యింది. ఉండడానికి మంచి గదే ఇచ్చాం. నిన్న మధ్యాహ్నమే చెకిన్ అయ్యారు. ఉదయాన్నే బయటకొచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఏమీ చెప్పడం లేదు. బహుశా ఏమైయ్యుంటుందనేది మాకూ తెలీడం లేదు.” గాభరాపడుతున్న రిసెప్షనిస్ట్ గబగబా అంది.

“ఏమీ అవ్వలేదు, మీరు కంగారు పడకండి.” నేను ఆమె చేయి పట్టుకుని లేపి బయటకు తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టాను.

“పిచ్చిపిల్లా, ఇప్పుడు చెప్పు ఏమైందో నీకు. మడికేరికి తీసుకెళ్ళి వదిలిపెట్టాలా? ఇక్కడే ఆసుపత్రి వైపు కారు తిప్పాలా? కర్నల్ సాహెబుగారికి కాల్ చేసి చెప్పాలా? ప్రద్యుమ్నని రమ్మని చెప్పాలా?” నేను ఆమె కన్నా ఉద్విగ్నతతో బడబడమని వాగాను.

“ఓయ్ పిచ్చోడా, కాస్త ఆగు. ఎక్కడైనా మంచి కాఫీ తాగించు. ఇంకేదన్నా మాట్లాడు. కాసేపు నవ్వించు ఎప్పట్లానే. అదే సర్దుకుంటుంది.” ఆమె తేరుకుని తనదే పైచేయి అనిపించుకుంది.

కాఫీ తాగుతున్న ఆమె ముఖం కుదుటపడుతున్నట్టు అనిపించింది. “ఉఫ్! చచ్చిపోయాను బాబూ. నువ్వు వచ్చి బతికించావు. లేదంటే ఈ టైముకల్లా నేను ఢమాల్!”

“సరే, ఏమైందో చెప్పు?”

ఆమె చెప్పడం మొదలెట్టింది.

“ఆటో అతను ఈ హోటలుకి తెచ్చి దింపాడా, నేను గదికి వెళ్ళానా. వెళ్ళినదాన్ని శవంలాగా పడిపోయాను. ఇక లేవనేకూడదన్నట్టు పడిపోయాను. తాగిన కొబ్బరినీళ్ళు తప్పించి ఏమీ తినలేదు. అర్ధరాత్రి మెలకువ వచ్చింది. పక్కన మూలనుంచి ఏదో చప్పుడయ్యింది. చూస్తే అది నా గదికి ఆనుకుని ఉన్న ఇంకో గదిలోంచి. మధ్యనున్న తలుపుకి రెండువైపుల నుంచీ గొళ్ళెం వేసుంది. అయినా తలుపుకి తాళం చెవి పెట్టే రంధ్రం నుంచి చూట్టానికి వీలుగా ఉంది. నేను చూశాను.”

ఆమె ఒక్క క్షణం మౌనమైపోయింది.

“ఏం చూశావు?”

“కవి సమ్రాట్‌గారు” ఆమె నిజంగా వణికిపోతూ ఉంది. “ఆయనా, ఆయన భార్య చంద్రవల్లి. బట్టలు లేకుండా కూర్చున్న వాళ్ళిద్దరూ తమ ఒళ్ళంతా పడిన పుళ్ళను గిల్లుతున్నారు!”

“నీది భ్రాంతి, పూర్తిగా భ్రాంతి!”

“కాదు ఖచ్చితంగా భ్రాంతి కాదు. ఇటు చూడు!” ఆమె చేతిసంచి లోంచి పాతదొకటి పత్రిక తీసి బయటపెట్టింది.

1992 సంవత్సరం పత్రిక. “వసతి గృహంలో విషాదాంతం పొందిన కవి సమ్రాట్‌గారు” అన్న వార్త పతాక శీర్షిక.

“అదే గదా?”

“అవును. ఇటు చూడు.”

“కవి సమ్రాట్‌గారు హోటలులో రెండు గదులను నెలకు అద్దెకు తీసుకుని ఒక్కరే ఉంటూ వచ్చారు. దుఃఖంలో మునిగిపోయిన ఆయన మామూలు మనుషులతో సంబంధాలు తెంచుకున్నారు. హృదయాఘాతం వల్ల నిద్రలోనే మరణించారని వార్త. చావు సంభవించిన పన్నెండు గంటలానంతరం ఆ విషయం హోటలు సిబ్బంది గమనికకు వచ్చింది. గవర్నరు, ముఖ్యమంత్రులు, ఇంకా సమాజంలోని ప్రముఖులందరితో సహా రాష్ట్రం రాష్ట్రమంతా కవి సమ్రాట్‌గారి మరణానికి సంతాపం ప్రకటించారు. ఆయన మైసూరు నగరంలో నివసిస్తున్న నివాసం దగ్గరి సర్కిల్‌కు కవి సమ్రాట్ సర్కిల్ అన్న పేరు పెట్టాలని నగరపాలక సంస్థ అందరి ఆమోదంతో నిర్ణయం తీసుకుంది.”

సరిగ్గా మూడు దశాబ్దాల క్రితపు పాత పత్రికలో మాసిన అక్షరాలు.

నేనూ సన్నగా వణికాను.

“పిచ్చిదానివి నువ్వు. కావాలి, కావాలనే ఆ హోటలు వెతుక్కుని వెళ్ళుంటావ్ నువ్వు, కదూ?” గద్దించాను.

“కాదు బాబూ, ఆటో అతను ఈ హోటలుకి తెచ్చాడు. నేను గది తీసుకున్నాను. రూము తాళం చెవి నాకిచ్చారు. లోపలికెళ్ళి పడుకున్నాను. ఇప్పుడు నాకు అంతా అర్థమవుతోంది.”

ఆమె మళ్ళీ తన స్వెటర్ చేతులను ఎత్తి మడిచి తన తెల్లని చేతులను చూసుకుంది. ఎర్రగా లేచిన కురుపులు మాత్రమే అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఆమె తన పొట్ట కూడా చూపించింది. అక్కడా పుండ్లు మాయమవుతూ ఉన్నాయి.

“అన్ని చోట్లా వచ్చాయి. అక్కడా వచ్చాయి.” ఆమె సన్నగా గొణిగింది.

“నీ తలకాయ. నీ భ్రమలు. నీ పొక్కులు నాకూ అంటుకునే లోపే మడికేరికి బయలుదేరు. నేను బస్సు ఎక్కిస్తాను.”

కారులో కూర్చోబెట్టి సబర్బన్ బస్సు స్టేషన్ వైపుకు కారు తిప్పాను.


అబ్దుల్ రషీద్ ఇప్పటి వరకూ కన్నడంలో నాలుగు కథాసంపుటాలు, ఒక నవల, రెండు కవితా సంపుటాలు, నాలుగు వ్యాస సంపుటాలు ప్రచురించారు. కెండసంపిగె (kendasampige.com) అనే అంతర్జాల పత్రికకు గౌరవ సంపాదకులు. కేంద్ర సాహిత్య అకాడమీ సువర్ణ మహోత్సవ అవార్డు, కర్ణాటక సాహిత్య అకాడమీ సాహిత్యశ్రీ అవార్డు అందుకున్నారు. రషీద్ ఊరు కొడగు (కూర్గ్). ఆకాశవాణిలో కార్యక్రమ నిర్వాహకులుగా పనిజేస్తూ మంగళూరు, మేఘాలయ రాజధాని షిల్లాంగ్, గుల్బర్గ, మడికేరి, లక్షద్వీప సమూహాల్లోని కవరత్తి ద్వీపాల్లో ఉండి వచ్చి, ప్రస్తుతం మైసూరులో ఉంటున్నారు. “కథలు చెప్పడం, రాయడం, ప్రయాణాలు చేసేటప్పుడు ఒంటరిగా ఉండడం నా జీవితంలోని మహావ్యసనాల్లో కొన్ని” అనే రషీద్, “పేరుప్రఖ్యాతలు, అవార్డులు రచనా వ్యాసంగానికి ఉపఫలాలు (by products) మాత్రమే. జీవితం, ప్రకృతుల రంగుల్లో కరిగిపోయే ఆనందమే అన్నింటికీ మించింది” అంటారు.

రచయిత పూర్ణిమ తమ్మిరెడ్డి గురించి: పుస్తకం.నెట్ నిర్వాహకుల్లో ఒకరైన పూర్ణిమ వృత్తి రీత్యా సాఫ్ట్‌వేర్ ఇంజనీరు. ...