యాత్ర

నేను కోమల్‌గారి ఇంటికి వెడుతూ వెడుతూ మళ్ళీ దారి తప్పాను. వాళ్ళింటికి రావడం ఇది ఏడో సారో, ఎనిమిదో సారో.

మొదటిసారి వచ్చినప్పుడు ఎవరో నా జేబు కొట్టేశారు. బాగా గుర్తు. పొడవాటి కలకత్తా లాల్చీ వేసుకొని ఉన్నాను. బస్సు దిగి జేబులో చెయ్యి పెట్టగానే, పర్సు పోయిందని అర్థమైంది.

“అఖిలన్‌కు జ్ఞానపీఠ్ అవార్డు ఇచ్చారని కమర్షియల్ రచయితలు పండగ చేసుకోడం, జేబుదొంగలు లాల్చీని జాతీయ వేషంగా ప్రకటించాలని కోరడం, ఈ రెంటికీ తేడా లేదని మనం అర్థం చేసుకోవాలి” అన్న సుందరరామస్వామిగారి మాటలు గుర్తొచ్చాయి.

‘ఎలాంటి సందర్భంలో ఆ మాటలు గుర్తుకొచ్చాయి?’ అనుకుని తల కొట్టుకున్నాను.

కోమల్‌గారిల్లు ఎంత వెతికినా దొరకలేదు. ఆయన్ని కలవకుండా వెనక్కి వెళ్ళిపోదామన్నా డబ్బులు లేవు. కష్టపడి ఇంకో జేబులో తవ్వి ఓ యాభై పైసలు బైటికి తీశాను. అదృష్టవశాత్తూ, కోమల్‌గారి ఫోన్ నంబర్ రాసున్న చీటీ గూడా దొరికింది. రోడ్డు పక్కనున్న టీ బంకులోంచి, కొంచెం గాభరాగా ఫోన్ చేశాను. ఇప్పుడు గనక అవతలివాళ్ళు ఫోనెత్తి హలో అనేసి వెంటనే లైన్ కట్‌ చేస్తే, ఈ ఆఖరి యాభై పైసలు గూడా గోవిందా! అదృష్టం కొద్దీ కోమల్‌గారే ఫోనెత్తారు. ‘హలో’ అన్న పదం తర్వాత, మనిషి భారంగా అటునించి ఇటు సర్దుకున్నట్టు, చిన్న మూలుగు వినిపించింది.

“కోమల్‌ని మాట్లాడుతున్నాను” అన్నాడాయన.

కొంచెం తడబడి, తర్వాత పరిచయం చేసుకున్నాను. నా కథలు ఆయనకు బాగానే గుర్తున్నాయి. “నువ్వా?” అన్నారాయన, ఉత్సాహంగా. ఇంటికి ఆహ్వానించారు.

“కొంచెం మీ ఇంటికి దారి చెప్తారా సార్?”

“నేను ఎంత అద్భుతంగా వివరించి చెప్పినా, నువ్వు దారి తప్పుతావు. అది ఖచ్చితం. అడ్రెస్ చెప్తాను. ఒక ఆటో తీసుకొని వచ్చేయి…”

“సర్! నా దగ్గర డబ్బుల్లేవు.” కొంచెం ఇబ్బందిపడుతూ చెప్పాను.

“ఏవయ్యింది?”

“ఎవరో జేబు కొట్టేశారు సర్!”

కిసుక్కున నవ్వాడాయన. “ఆటో పట్టుకుని వచ్చేయ్. డబ్బులు నేనిస్తాలే!”

అడ్రస్ రాసుకుని ఆటో ఎక్కాను.

అదో కాంక్రీట్‌తో కట్టిన భవంతి. ఎనభైల తరహాలో ఒకే రకమైన వీధులు. రోడ్డుకిరువైపులా ఒకేలా ఉండే ఇళ్ళు. కోమల్ గారిల్లు బాగా పెద్దది. వాళ్ళమ్మాయి బయటకొచ్చింది.

“నాన్న మిమ్మల్ని లోపలికి రమ్మన్నారు. రండి.”

ఆ అమ్మాయే ఆటో అతనికి డబ్బులిచ్చి పంపేసింది. “మీ పర్సు పోయిందటగా, ఈ రూట్లో ఇది మామూలే” అందా అమ్మాయి.

లోపలికెళ్ళాను. హాలు పక్కనే ఉన్న గదిలో, రెండు దిళ్ళు చెరో వైపు వేసుకొని, మంచం మీద కూర్చుని ఉన్నాడాయన. ఎడమ పక్క నున్న కిటికీలోంచి, ఆయన ముఖంపై ఓ వైపు సన్నగా వెలుగు పడుతోంది. ఒక నోటుపుస్తకం, కొన్ని కాయితాలు వొళ్ళో వున్నాయి.

“లోపలికిరా” అన్నాడాయన తన చక్కని పలువరస తళుక్కుమనేలా, ఓ చిరునవ్వు చిందిస్తూ. “ఎంత పోయింది?”

“ఎనభై రూపాయలు, సర్.”

“అయ్యో!”

“పర్లేదండీ.”

“నేను వాడి గురించి ఆలోచిస్తున్నాను. ఇంత కష్టపడితే వాడికి కనీసం రోజు కూలీ డబ్బులు కూడా గిట్టలేదే అని!”

ఇద్దరం నవ్వేశాం.

భుజాల దాకా పెరిగి వెండిరంగులో మెరుస్తున్న ఆయన పొడవాటి జుట్టు, ఈ మనిషి రచయితో, కళాకారుడో, అయ్యుంటాడు అని తెలియచేస్తోంది. అదెలావున్నా, ఈ మనిషి ప్రాపంచిక విషయాలను పట్టించుకోడు అన్న విషయం మాత్రం, ఆయన ఆకృతిని చూడగానే తెలిసిపోతుంది. నాకు గూడా అలాటి సహజ సిద్ధమైన రూపం ఉంటే ఎంత బావుణ్ణు అనుకున్నాను. కానీ తక్కలైలో ఉన్న మా ఆఫీసుకి, అలా తయారై వెళితే వీధి కుక్కలు వెంటపడటం ఖాయం. నేను చేయగలిగింది – అందరిలో కలిసిపోయే వస్త్రధారణతో, టీఎ, డీఏ అనుకుంటూ, వెలిసిన రంగులతో వుండే ఆఫీసు బట్టలు వేసుక తిరగడమే! సెలవు రోజు మటుకు లాల్చీ తొడుక్కుని, ‘నేను వేరే లోకపు జీవిని’ అని అనుకుంటుంటాను.


ఈసారి కూడా ఒకే రకంగా వున్న ఆ ఇళ్ళ మధ్యలో, కోమల్ గారిల్లు ఎక్కడా? అని చాలాసేపు వెతుక్కుంటూ అయోమయానికి గురయ్యాను. ఎండ ఎక్కువగా లేదు కాబట్టి పర్లేదు. ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టడం సరి కాదు. ఈ నడుమ ఆయన ఆరోగ్యం కూడా బాగుండటం లేదు. కొంతసేపు ఆలోచించి, మా ఉమ్మడి మిత్రుడు ‘పరీక్ష’ జ్ఞానీకి ఫోన్ చేశాను. అతను చెప్పిన గుర్తులన్నీ నాకు తెలిసినవే. కాకపొతే జ్ఞానీ చెప్పే దాకా గుర్తుకు రాలేదంతే. తొందరగానే కోమల్‌గారిల్లు కనుక్కోగలిగాను.

“రండి.” వాడిపోయిన మొహంతో పలకరించింది వారమ్మాయి. లోపల కోమల్‌గారితో ఇంకెవరో ఉన్నారు.

“ఆయనతో పావై చంద్రన్ ఉన్నారు. అదే, కుంకుమమ్ పత్రికలో పని చేస్తారు గదా?” అన్నారు కోమల్ భార్య.

“ఓహ్.”

“చంద్రన్‌ని కలుస్తారా?”

“లేదండీ… ఇప్పుడు కాదు.”

చంద్రన్ వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వెళ్ళాను. ఇంతకుముందులానే మంచం మీద వెల్లకిలా పడుకొని ఉన్నారాయన. ఇంకా చిక్కిపోయారు. మెడ కండరాలు వదులైపోయి, దవడలు లోపలికెళ్ళిపోయి, పళ్ళు, ముక్కు ముందుకొచ్చాయి. బాగా వయసు మీద పడ్డ మనిషిలా అయిపోయాడు. నవ్వినప్పుడు, పెదవులు కుడివైపు తిరిగి, ఆ నవ్వుకి ఒకింత కొంటెతనాన్ని ఆపాదిస్తున్నాయి. లేకపోతే ఎప్పుడూ మొహం మీదుండే ఆ తుంటరి నవ్వే, ఆయన పెదవులను అలా పక్కకు తిప్పేసిందేమో! ఇప్పుడు మటుకు అదే నవ్వు నా గుండెల్ని మెలి తిప్పుతోంది. మోడా దగ్గరికి లాక్కుని కూర్చున్నాను.

“నువ్వు పావైని కలిశావు గదా?”

“లేదు. కానీ ఉత్తరాల ద్వారా పరిచయం.”

“ఓహ్. మంచివ్యక్తి.”

ఆయన వైపు దృష్టి నిలపకుండా ఉండడానికి ప్రయత్నించాను. కానీ నా చూపు, నా మాట వినకుండా ఆయన మొహంలోనో, కళ్ళలోనో, దేనికోసమో తీవ్రంగా వెతుకుతోంది. నా ఎదుటనున్న ఈ మనిషేనా తిరువణ్ణామలై దాకా ఉత్సాహంగా బస్సు ప్రయాణం చేసి వచ్చి, తనని తీసుకెళ్ళడానికి వచ్చిన రచయిత బవాచెల్లదురై బృందంతో, ఆర్భాటంగా నవ్వుతూ, వచ్చిన వాళ్ళందరినీ దగ్గరకి లాక్కుని మరీ ఆత్మీయంగా కౌగిలించుకుంటూ బుగ్గలు గిల్లుతూ, రాని వాళ్ళని పేరు పేరునా గుర్తుకు తెచ్చుకుని, లాల్చీ కూడా మార్చుకోకుండా మంచం మీదే కూర్చుని, దిండు ఒళ్ళో పెట్టుకుని, నాటకాల గురించి, సాహిత్యం గురించి మాట్లాడింది? నా ఎదుటనున్న ఈ మనిషేనా నిర్విరామంగా రెండు రోజులు గుళ్ళో, రమణాశ్రమంలో, వీధుల్లో, హోటల్లో, బవాచెల్లదురై ఇంట్లో మాట్లాడి మాట్లాడి, మాటలు ఇంకా పూర్తి కాకపోతే, అర్థరాత్రి రోడ్డు పక్క కల్వర్టు మీద బస్సుకోసం ఎదురు చూస్తున్నప్పుడు కూడా మాట్లాడుతూ, బస్సు రాగానే, వాక్యం మధ్యలోనే ఆపేసి, పరిగెత్తుకుంటూ బస్సెక్కి వెళ్ళిపోయింది?

అలా చూస్తూ ఉండిపోయాను.

ఎండా కాలంలో మాత్రమే నదిని చూసిన వాడికి, ఆ నదికి వరద వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం కష్టం. ఆలోచనల్లో మునిగిపోయి, కిటికీ లోంచి రెప్ప వాల్చకుండా బయటికి చూస్తున్నారు కోమల్. వ్యాధి పెరిగేకొద్దీ నిశ్శబ్దం ఆయనని కమ్మేస్తూ పోతోంది. నిజం చెప్పాలంటే తిరువణ్ణామలైకి వచ్చినప్పటికే, ఆయన వెన్నులో మొదలైన కాన్సర్ – వైద్యానికి లొంగదని తెలిసిపోయింది. రెండు ఆపరేషన్ల సాయంతో, జరగబోయే దాన్ని ఎనిమిదేళ్ళు వెనక్కి నెట్టగలిగారు. దగ్గరి స్నేహితులకు కూడా ఐదేళ్ళ తర్వాతనే ఆయన వ్యాధి గురించి తెలిసింది. ఆపరేషన్‌తో చిన్నదై పోయిన వెన్నెముకతోనే, ప్రతి నెలా ఇరవై పట్టణాల్లో నాటక ప్రదర్శనలు నిర్వహించేవారు. ఎన్నో స్క్రీన్‌ప్లేలు రాసి, ఓ రెండు సినిమాలకు దర్శకత్వం గూడా వహించారు.

ఒక దశలో నాటక ప్రదర్శనలు ఆపేయమని డాక్టర్లు మందలిస్తే అప్పుడు నాటకాల బృందాన్ని కట్టి పెట్టేసి తన చిన్ననాటి స్నేహితుడు, శ్రీరామ్ చిట్‌ఫండ్స్ యజమాని ఐన త్యాగరాజన్ నడిపే ‘శుభమంగళ’ పత్రికను తన చేతిలోకి తీసుకున్నారు కోమల్. అప్పటిదాకా కేవలం మహిళల పత్రికగా పేరున్న శుభమంగళ కోమల్‌గారి చేతుల్లో ఒక గొప్ప సాహితీ ఉద్యమంగా రూపుదిద్దుకుని, ఆయన మీద పని భారాన్ని ఇంకా పెంచింది. ఉన్నపళంగా చాలామంది ప్రసిద్ధ రచయితలు, యువ రచయితలు, పాఠకులు, ఈయన చుట్టూ గుమికూడారు. నాటకాల పిచ్చి ఇంకా ఎక్కువై, నాటక మహోత్సవాలు, వర్కుషాపులు, సాహితీ సమావేశాలు నిర్వహిస్తూ మునుపటికంటే మరింతగా, పూర్తిగా పనిలో కూరుకుపోయారు కోమల్.

కుర్తాలంలో ఒక సాహితీ సమావేశం ముగిసిన తర్వాత, ఇద్దరం చొక్కాలు విప్పి, భుజానేసుకుని, అక్కడున్న పెద్ద జలపాతం కింద స్నానానికి వెడుతున్నప్పుడు ధైర్యం కూడగట్టుకుని అడిగాను, “నొప్పేమన్నా ఉందా?” అని.

“జెయమోహన్! ఈ నొప్పి పసిబిడ్డ లాంటిది. మన చంకనెక్కి, ఎప్పుడూ చీమిడి కార్చుకుంటూ, ఆపకుండా నస పెడుతూ ఉంటుంది. రాత్రిపూట అకస్మాత్తుగా లేచి, చచ్చే ఇబ్బంది పెడుతుంది. కానీ నొప్పి నాదేగా? నా నుంచి పుట్టిందేగా? అందువల్ల దాని మీద నాకు వాత్సల్యం ఉండడం సహజం. ఈ దిక్కుమాలిన దాన్ని, బాగా పద్ధతిగా పెంచి, ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేద్దాం! ఏమంటావ్?”

అయితే క్రమేపీ మనిషిలో చురుకుదనం తగ్గింది. ఓ ఎనిమిది తొమ్మిది నెలలక్రితం ఫోన్ చేసినప్పుడు అన్నాడు, “ఇప్పుడెక్కడికీ వెళ్ళట్లేదయ్యా, ఆఖరికి ఆఫీసుగ్గూడా! ఇంటి దగ్గరే వుండి అన్ని పనులూ చూసుకుంటున్నా!”

“నొప్పేమన్నా తగ్గిందా?” అడిగాను.

“ఇప్పుడు అది పెద్దదయ్యిందయ్యా. దాని ఆలోచనలు దానికున్నాయిప్పుడు. ఎక్కడికో వెళ్ళిపోవాలని దాని తపన. కచ్చితంగా దాంతో పాటూ నన్ను గూడా తీసుకెళ్ళేట్టుంది.”

అపుడు కనపడ్డాడు, ఆయనలో… మొట్టమొదటి సారి ఓ జబ్బుమనిషి.


నన్ను ఆలోచనల్లోనించి బయట పడేస్తూ… కోమల్‌ నా వైపు తిరిగి నవ్వుతూ “అయ్యో! అసలు నువ్వున్నావని మర్చేపొయ్యాను” అన్నారు. “బుర్ర రోజంతా ఎక్కడెక్కడికో తిరిగొస్తోంది. ఏవో గజిబిజి ఆలోచనలు. ఒక పద్ధతంటూ లేదు. ఒక గంట తర్వాత, దేని గురించి ఆలోచిస్తున్నానా? అని వెనక్కి చూసుకుంటే, ఏవీ గుర్తుకురాదు. ‘వేవేల పక్షులు ఎగిరినా వినువీధిన దారి గురుతులుండవుగా!’ అనే కవిత లేదూ… అచ్చం అలాగే!”

“నొప్పెలా వుంది?” భయపడుతూనే అడిగాను.

“నీకు ‘పరీక్ష’ జ్ఞానీ తెల్సుగా. మొన్ననే వచ్చెళ్ళాడు. ఇదే ప్రశ్న వేశాడు. తలుపు తెరిచి, బొటనవేలు తలుపు సందులో పెట్టి, తలుపు గట్టిగా మూసి పెట్టి, రోజంతా అలానే ఉంచితే, ఎలా ఉంటుందో అలా వుంది.” అని అన్నాను. అమాయకుడు, దెబ్బకు భయపడి పోయాడు. అసలు ఈ మధ్య జ్ఞానీ వంటి నా నాటకాల మిత్రులు అందరూ భయంతో వణికిపోతున్నారనుకో! మేమంతా ఒకే తాను గుడ్డలం కదా. వాళ్ళక్కూడా నాలాగా ఇదే రోగం తగులుకుంటుందేమోనని. ఇంకా చెప్పాలంటే జ్ఞానీ కూడా నాలాగే నాటకాల పిచ్చోడు, అభ్యుదయవాది కూడా. హ్హ, హ్హ!” నవ్వేశాడాయన.

కోమల్‌గారి భార్య వచ్చి టీపాయ్ మీద కాఫీ పెట్టి గోడకానుకుని నిలబడి, నన్ను చూస్తూ “మీరైనా కొంచెం బుద్ధి చెప్పండి! వయసులో పెద్దవాళ్ళు, సీనియర్లూ అందరూ ఈయనకి చెప్పి చూశారు. కనీసం చిన్నవాళ్ళు మీరు చెపితే అన్నా, వింటారేమో అని ఒక ఆశ.”

“దేని గురించి?” అడిగానేను.

“నేను చెప్తాను” అన్నారు కోమల్.

“ఈయన బుర్రలోకేవీ ఎక్కడం లేదు. ఎక్కడానికి అసలు వినిపించుకుంటేగా!” అంటూ విసవిసా లోపలికెళ్ళిపోయారు ఆవిడ.

“ఏమైంది సార్?” రెట్టించాన్నేను. ‘ఏదో నాటక ప్రదర్శన చేస్తామని మొండి పట్టు పడుతున్నాడేమో ఈయన’ అని లోపల అనుకుంటూ.

“కైలాసయాత్రకు వెళదామనుకుంటున్నాను!” సమాధానం ఇచ్చాడు ఆయన.

“సర్?”

“అదే! హిమాలయాలకు తీర్థయాత్ర, అర్థం కావడం లేదా? నాదో కోరిక – ఆఖరి కోరిక లాటిదనుకో! హిమాలయాలకెళ్ళి కైలాస పర్వతం ముందు నిలబడాలని.”

నాకు బుర్ర తిరిగిపోయింది. “మీరసలు లేచే పరిస్థితుల్లోనే లేరు.”

“పాక్కుంటూ వెడతాను. ఏం? కారైక్కాల్ అమ్మగారు, చేతుల మీద కొండెక్కగాలేంది, నేనెక్కలేనా?”

“మీరు చెప్పేదానికి అర్థం పర్థం లేదు. ఇక్కణ్ణించి మీరు బయలుదేరితే, సగం దూరం వెళ్ళేలోపలే…”

“చచ్చిపోతాను. అంతేగదా, పోనీ! ఇక్కడ మంచం మీద పడుండి రైలు కోసం వేచిచూడ్డం కంటే, లేచెళ్ళి ఆ రైలుకు చెయ్యి అడ్డం పెట్టి ఆపి, ఎక్కడం ఎంతో మేలు. ఆ గోలంతా ఎందుకు? నేనైతే గట్టిగా నిర్ణయించేసుకున్నాను.”

నేనేం మాట్లాడలేదు.

“ఏదోటి మాట్లాడు.”

“ఏవీ లేదు సర్.”

“ఇంత భక్తిపరుడు! వీడు అభ్యుదయ రచయితల సంఘంలో ఎలా వున్నాడు, అని ఆలోచిస్తున్నావు కదూ! రేపు అందరూ అదే అనబోతారు. అనుకోనీ! వీటన్నిటి గురించి ఆలోచిస్తూ కూర్చోడానికి నాకు సమయం లేదు. కానీ ఎవడికి అర్థం అయినా కాకపోయినా, నువ్వర్థం చేసుకోడం ముఖ్యం. నాకోసం ఇదంతా ఎప్పుడోకపుడు రాయాలి నువ్వు!”

తలూపాను.

“ఇది మామూలు తీర్థయాత్ర కాదు. నేను ఒక హిందువుని! నాకలా చెప్పుకోడానికి ఇబ్బంది లేదు. అయితే నాకే చాదస్తాలూ లేవు. పూజలూ పునస్కారాలూ చెయ్యను. గుడికి కూడా ఎప్పుడూ వెళ్ళింది లేదు. నిజం చెప్పాలంటే, ఇప్పటిదాకా నేను ఆ దేవుణ్ణి వేడుకున్నది ఏవీ లేదు. ఒకప్పుడయితే ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని, జేబులో పైసా లేకుండా, వూరు మీద పడి తిరిగిన రోజులున్నాయి. ఆ రోజుల్లో గూడా దేవుడికి ఓ దణ్ణం పెట్టింది లేదు. అంతెందుకు? ఈ రోగం గురించి తెలిశాక కూడా చేయెత్తి ప్రార్థించలేదు. ఈ బాధనించి తప్పించమని ఆ పైవాడికి మొర పెట్టుకోకుండా మొండిగా ఎలా లాక్కొస్తున్నానో, నాకే తెలియడం లేదు.”

ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆయన మొహంలో ఏదో వెలుగు. “చాలా సంవత్సరాల క్రితం, కుముదమ్ పత్రిక కవర్ పేజీ మీద ఒక ఫోటో చూశాను. హిమాలయాల్లో స్వామి శారదానంద అని ఒకాయన తీసిన ఫోటో.”

ముందుకు ఉత్సాహంగా వంగి నేనన్నాను. “నాకు కూడా గుర్తుంది. చిన్న జడల బఱ్ఱె, ఒంటి నిండా మంచుతో, రోమాలు నిక్కబొడుచుకుని, తెల్ల దుప్పటి కప్పినట్టున్న కొండ వాలు మీద నిల్చుని! ఆ రోజుల్లో ఆ ఫోటో చాలా పాపులర్ అయ్యింది.”

“కరెక్ట్. అదే!

“ఆ రోజు శివగంగలో నాటకం పూర్తి చేసుకుని మిగతా వాళ్ళని పంపించేసి, పక్కరోజు ప్రదర్శన ఇవ్వబోయే సాతూరుకు కార్లో బయలుదేరాను. మధ్యలో ఏదో ఇబ్బందొచ్చి కారు ఆగిపోయింది. రోడ్డుకు రెండు పక్కలా బంజరు భూమి. మే నెల కూడాను. నేలంతా పూర్తిగా మాడి, ఎండిపోయుంది. ఆదీ అంతం లేనట్టుగా, కనుచూపు మేర సాగిపోతూ నిర్జీవంగా కనిపిస్తోన్న నేల. ఎక్కణ్ణించో గాలి మోసుకొచ్చిన మట్టి, ఎండుటాకుల మీద పడుతున్న శబ్దం, ఆగకుండా చెవుల్లో గింగురుమంటోంది. మెకానిక్‌ని తీసుకరావడానికి డ్రైవర్ నన్ను అక్కడే వదిలేసి బస్సు పట్టుకుని ఊర్లోకి పోయాడు. కారులో కూర్చోలేక పోయాను. బయటికి దిగి కొంత దూరం నడిచాను. రోడ్డు పక్కన ఒక పాడుపడిన ఇల్లు కనపడితే ఇంటి మేడ పైకెక్కి ఆ నిర్జీవమైన నేలనే తదేకంగా చూస్తూ కూర్చున్నాను. ఎందుకో తెలీదు. నా కళ్ళు నిండుకున్నాయి. కళ్ళ నించి నీళ్ళు జలజలా కారిపోవడం మొదలైంది. ఏ సమస్య, ఏ ఇబ్బందీ లేని జీవితం గడుపుతున్న రోజులవి. అయినా ఎందుకో ఆ క్షణంలో ఏదో లోతు తెలియని ఒంటరితనం హఠాత్తుగా నా మనస్సును సంపూర్ణంగా ఆవహించింది.

“కొంతసేపాగి నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఎందుకు ఏడుపొచ్చింది? నేలనావరించిన శూన్యం నాలోకి ప్రవేశించి ఇంకిపోయిందా? అసంభవం. అంతరంతరాల్లో శూన్యపు శకలమైనా లేకపోతే, బాహ్యప్రపంచంలో నాకు గోచరించింది, గ్రహింపుకెలా వస్తుంది? మనకు కనపడేది ఏమిటి? మహా రచయిత మౌని చెప్పినట్టు – బయట మనకు ఏదైతే కనపడుతుందో అది మనలో అంతరీకమైన పదార్థపు బాహ్యస్వరూపం. అంతేగా? అక్కడ నువ్వు గమనిస్తే, మహారచయిత మౌనికి అనావృతం అనే పదం ఎంత ఇష్టమో నీకు తెలుస్తుంది. విధ్వంసం అనే అర్థం వచ్చేట్టుగా వాడలేదాయన. అంతులేని మహాశూన్యం అనే అర్థం వచ్చేలా వాడాడు. ఆయన కథలన్నీ అంతే. అలాటి అనుభవాన్నే ఇస్తాయి.

“కొంతసేపటి తర్వాత దాహం వేస్తే కారు వైపు వెళ్ళాను. డ్రైవర్ ముందు సీట్లో నీళ్ళ సీసా వదిలేసి వెళ్ళాడు. కింద కార్పెట్ మీద కుముదమ్ సంచిక ఒకటి కనపడింది. చేతిలోకి తీసుకున్నాను. అప్పుడు కనపడింది ఆ ఫోటో. రెండుచేతులూ ఒక్కసారిగా కంపించాయి. ఆ సమయంలో, ఆ ప్రదేశంలో ఎలాంటి సంకేతం? గొప్ప సందేశంలా – ఏదో పైనుంచి వచ్చిన పిలుపు అనుకోవచ్చు. అక్కడే కూర్చుని దాన్నే చూస్తూ ఎంతసేపు అలా ఉండిపోయానో నాకే తెలియదు.

“ఆ రోజు జరిగిన దాని గురించి తరువాత ఎన్నోసార్లు, ఎంతో ఆలోచించాను మోహన్! మాటల్లో పెట్టడానికి ప్రయత్నించాను. ఏదో అంతులేని శూన్యాన్ని అనుభవిస్తున్నాను మోహన్! నేనేదీ లోపల దాచుకునే మనిషిని కాను – ఎక్ట్రావర్ట్‌ని. ఎప్పుడూ నా చుట్టూ జనం ఉంటారు. ఎడతెరిపి లేకుండా వాగుతూ, నవ్వుతూ, రోజులన్నీ సంతోషంగా నా జీవితాన్ని గడిపాను. కానీ నాలో ఏదో అంతులేని ఒంటరితనం వుంది. ఆ శూన్యాన్ని తాకకుండా ఇన్నాళ్ళూ గడిపాను మోహన్! తాకితే ఏమౌతుందో అన్న భయం. ఆ చిన్న జడల బర్రెను చూసినప్పుడు నా మనసులో స్ఫురించిన పదం అదే, ఒంటరితనం! అలా ఆ ఫోటోని చూస్తూ మూర్తీభవించిన శూన్యంలా అక్కడే కూచుండిపోయాను ఆ రోజు.

“సమస్త జీవరాశికీ ప్రకృతి ప్రసాదించింది – ఒంటరితనమే గదా. మిగతావన్నీ, ఆ బాధనించి తప్పించుకోడానికి మన మీద మనం కప్పుకునేవి. చేతికి ఏది దొరికితే దాంతో కప్పుకుంటాం! భార్య, పిల్లలు, స్నేహితులు, కళలు, సాహిత్యం, రాజకీయాలు ఇలాటివి. ఆ రోజు మటుకు, ఆ పొరలన్నీ తొలగించేసి, నగ్నంగా ఆ శూన్యంలో నిలబడాలనే కోరిక కలిగింది. అప్పుడు మాత్రమే, నా లోపల ఎక్కడో దాగున్న ఒంటరితనం బయటపడి భూతంలా నా ముందుకొచ్చి నిలబడుతుంది అనిపించింది నాకు. ఆ పిశాచాన్ని నేను అడగాల్సిన ప్రశ్నలు ఎన్నో ఉన్నాయిగా.”

“జడల్లోంచి గంగ ప్రవహిస్తూ, తలమీద చంద్రుణ్ణి ఉంచుకున్న రూపం గురించా మీరు చెప్తున్నది?” నవ్వుతూ అడిగాను.

“నన్ను చర్చల్లోకి నెట్టేయడం నీకు సరదా కదా?”

“అసలు ఎలా వెళదామని?” మామూలు ప్రపంచంలోకి వచ్చి అడిగాను నేను. “మీకు బెడ్‌పాన్ అవసరం వుంది. కొంచెం అటూ ఇటూ కదిలినా మీకు ఇబ్బందిగా ఉంటోంది. పైగా దూర ప్రయాణం. ఇక్కణ్ణించి విమానంలో వెళతారనుకుందాం, అయినా విమానం ఎక్కాలి, కూచోవాలి, దిగాలి. మళ్ళీ అక్కణ్ణించీ టాక్సీ తీసుకోవాలి. అసలు కొండ పైకి ఎలా ఎక్కుతారు మీరు? మోసుకుని పైకి తీసుకెళ్ళడానికి మనుషులు వుంటారట కదా?”

“నడిచే ఎక్కాలనుకుంటున్నాను.”

నాకు గుండె ఆగినంత పనయ్యింది.

“కచ్చితంగా ఇబ్బందే. కానీ వెన్నెముక విరిగి ఊడి వచ్చేంత కాదు కదా? చూద్దాం. లక్షా యాభైవేల మెట్లు అనుకుంటా! సో ఒకసారి కాలు కిందపెట్టి మళ్ళీ కాలు లేపి, అలా మూడు లక్షల సార్లు! ఎవరో పెద్ద సుత్తి తీసుకుని బాదుతున్నట్టనిపిస్తుంది. మూడు లక్షల సార్లు దేవుడి పేరు తలచుకున్నట్టు అనుకో. ఎంత పెద్ద పనైనా, అంకెల్లోకి మార్చేస్తే ఇంతే కదా అనిపిస్తుంది.” పొడిగించారాయన.

“తలచుకుంటేనే భయం వేస్తోంది. మంచి ఆరోగ్యం వున్న వాళ్ళకు కూడా… చాలా కష్టమైన ప్రయాణం.”

“సరిగ్గా చెప్పావ్. ఆరోగ్యంగా వున్న వాళ్ళకు కష్టం. ఎందుకంటే వాళ్ళు వెనక్కి తిరిగి రావాలనుకుంటారు కాబట్టి. తిరిగి వెనక్కి రావాల్సిన అవసరమే అసలు లేదనుకో… ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. ఏవంటావ్?”

అక్కడే కూచుండిపోయి ఆయన్నే చూస్తూ కొన్ని నిమిషాలు అలా ఉండిపోయాను.

“వాత్తియార్ రామన్‌కి, ఇళయభారతికీ చెప్పాను. నువ్వు రాసేది నేరుగా వా.రా. దగ్గరకు వెళ్తుంది. ఏవీ మార్చకుండా వున్నది ఉన్నట్టుగా ప్రచురించమని చెప్పాను.” నేను బయటికొచ్చేసే ముందు చెప్పారు కోమల్.

బస్‌స్టాప్‌కి వెళ్ళేటప్పుడు ఎక్కడో ఆలోచిస్తూ, మూడు నాలుగు సార్లు దారి తప్పాను. ఇద్దరో ముగ్గురో ఆటో డ్రైవర్లు, వాళ్ళ దారి కడ్డం వచ్చానని తిట్టేశారు కూడా. ఆ చిన్న జడల బర్రె గురించే నా ఆలోచన అంతా! నేను ఏడో తరగతిలోనో, ఎనిమిదో తరగతిలోనో ఉన్నప్పుడు, కుముదమ్ పత్రిక ముఖచిత్రంగా వేశారు ఆ ఫోటో. చూసినప్పటినించీ కలలో కనపడ్డ ఓ రమణీయ చిత్రంలా నా మనసులో ముద్రించుకుపోయింది. హిమాలయాల మీద నేను మనసు పారేసుకోడానికి ఆ ఫోటోనే కారణం.

ఆ లోయల్లో కొండల పైన మంచు కప్పుకున్న పర్వత శిఖరాల మీద ఎన్నెన్ని సార్లు నడిచాను? ఇపుడు ఆ జడల బర్రె ఉండదక్కడ. ఛాయాచిత్రకారుడు శారదానందగారూ వుండరు. అంతా ఆవరించి వున్న ఆనాటి మంచు, కరిగి ఈపాటికి మాయమై పోయి ఉంటుంది. శాశ్వతంగా నిలిచి ఉండేది ఆ హిమాలయాలు మాత్రమే. పార్వతి పుట్టినిల్లయిన హిమాలయాలు! శివుడు సొంతం చేసుకున్న హిమాలయాలు! ఏ హిమాలయాలను, కాళిదాసు తన కవిత్వంతో అభిషేకించాడో ఆ హిమాలయాలు! ఆ వెండికొండల్లో సంచరించాలనే కోరిక. ఏదో రోజు అడుగు పెడతానక్కడ. కైలాస పర్వత పాదాన మోకరిల్లి, బంగరు సంజె కాంతుల్లో స్నానిస్తూ, ఆ అంతులేని ఏకాంతంలో, నన్ను నేనే తెలుసుకుంటే, మిగిలేది ఏమిటో? జ్వలించి, శమించిన చితాభస్మం. అది నా నుదుట ధరించి, గుహాంతరాల్లోకి పయనిస్తానేమో?

పూర్ణ స్వరూప కైలాసం! భస్మాంగ రంజిత కైలాసం!


కోమల్‌గారు మళ్ళీ ఆఫీసుకొస్తున్నారని శుభమంగళ పత్రిక వాళ్ళు చెప్పారు.

“ఎలా వున్నారాయన?”

“పరవాలేదు.”

“బాగా తిరగగల్గుతున్నారా?”

“లేదు. కానీ కూర్చోగల్గుతున్నారు. మాట్లాడగల్గుతున్నారు.”

కలవాలనిపించింది. నా రెండో కథల పుస్తకం భూమి, స్నేహా పబ్లికేషన్స్ వాళ్ళ ప్రెస్‌లో తయారవుతోంది. ఆ పుస్తకం ఆయనకే అంకితం ఇచ్చాను. అంతా రెడీ అయిన తరువాత, ఒక ప్రతి తీసుకెళ్ళి ఆయనకివ్వాలి. హిమాలయాల్లో, కైలాస పర్వత సామీప్యంలో ఆయన ఎలాటి అనుభూతి పొందారో అడిగి తెలుసుకోవాలి. ఆయన వివరించి చెప్పొచ్చు. లేకపోతే చాలామంది లాగా ‘మాటల్లో చెప్పడం కష్టం. నీ కళ్ళతో నువ్వే చూడాలి’ అంటాడేమో!

మద్రాసు ఒక నెల తరవాత మాత్రమే వెళ్ళగలిగాను. పుస్తకం ఇంకా ముద్రణ పూర్తి కాలేదు. ‘అయిపోతోంది సర్’ అని ప్రెస్‌లో ఒకాయన చెప్పాడు. కోమల్‌గారి ఇంటికి ఫోన్ చేస్తే ఎవరూ తీయడం లేదు. ‘వెళ్ళాలా? వద్దా?’ అని కొంతసేపు తన్నుకులాడి, చివరికి బయలుదేరాను. ఇంటి ముందర, ఈ సారి ఎవరూ లేరు. రెండు మూడు సార్లు పిలిస్తే ఆయన భార్య బయటికి వచ్చి ముభావంగా నన్ను లోపలికి రమ్మన్నారు.

కోమల్‌గారి అమ్మాయి నా పక్కనుంచి వెడుతూ పల్చగా నవ్వింది. మృత్యువు, నిశ్శబ్దపు దుప్పటితో ఆ ఇంటిని కప్పేసిందని తెలుస్తోంది.

ఇంటి లోపలికి వచ్చేటప్పుడు నేను విన్న వింత శబ్దం ఏ టీవీనించో ఇంకెక్కడినించో వస్తోంది అని అనుకున్నానో, అది కోమల్‌గారి గొంతులోంచి వస్తోంది అని కొంత సేపటి తర్వాత అర్థమయ్యేసరికి నా చేతులు పట్టు తప్పాయి. పూర్తిగా స్పృహ కోల్పోయేంత బాధ కలిగినప్పుడు తెలీకుండా పుట్టే శబ్దం అది. ఒక ప్రాణి తట్టుకోలేనంత భయంకరమైన నొప్పిని అనుభవించేటప్పుడు అది చేసే శబ్దం! ఆశ పూర్తిగా నశించి, పక్క మనిషిని అడిగేటందుకు ఏమీ తోచక, కనిపించని ఆ స్వరూపాన్ని ఉద్దేశించి వేస్తున్న పెనుకేక! వేడుకోలో? పశ్చాత్తాపమో? దూషణో? లేక ప్రార్ధనో?

అలాటి వేదనాభరిత ప్రయాణం సంపూర్ణ ఏకాంతంలో మాత్రమే సాధ్యమయ్యే విషయం. ఆ స్థితిలో, ఆయన్ని గురువుగా భావించిన వాళ్ళు, భుజం మీద చేతులేసి నడిచిన మిత్రులు, భార్య, పిల్లలు… వాళ్ళు ఎవరైనా సరే, వేరే ప్రదేశం నించో, వేరే ప్రపంచం నించో, వేరే కాలం నించో మాత్రమే ఆయన్ని చూడగలరు.

“మీరు కావాలంటే లోపలికి వెళ్ళి కలవండి” అన్నారు కోమల్‌గారి భార్య.

‘వెనక్కి వెళ్ళిపోదాం… వెళ్ళిపోవడమే మంచిది…’ అనుకున్నాను. కానీ తర్వాత నన్ను గురించి ఆయన అడిగితే? అన్న ఆలోచనొచ్చింది. కలవకుండా వెళ్ళిపోతే నేను భవిష్యత్తులో దానికి బాధపడాల్సి వస్తుందేమో అనిపించి, వెళ్ళి తలుపు నెమ్మదిగా తోశాను.

గదంతా ఇంతకుముందెపుడూ లేని దుర్గంధంతో నిండి వుంది. మందుల వాసనతో కలిసిపోయి ఆ దుర్వాసన గాలిని నింపేసింది. కోమల్‌ మంచం మీద పడుకుని వున్నారు. అక్కడ ఎదురుగా కనిపించే మనిషి ఆయనే అన్న విషయాన్ని నా మనస్సాక్షి అంగీకరించడం లేదు. కోమల్‌గారి అందమైన పొడవాటి జుట్టు పూర్తిగా రాలిపోయి, కంటికి ఆనడం లేదు. మిగిలివున్న కొద్దిపాటి వెంట్రుకలు తలకు రెండు పక్కలా, దూది ముక్కల్లాగా అంటుకొని వున్నాయి. అలానే నించుండి పోయి ఆయన్నే చూస్తున్నాను. మొహం ఇంకా కుచించుకుపోయి పళ్ళు ఇంతకుముందు ఎన్నడూ లేనట్టుగా ముందుకు పొడుచుకుని వచ్చున్నాయి. వణుకుతున్న ఆయన మెడ బాగా వాచినట్టుగా కనపడుతోంది. అయినా ఆ కేకలు కోమల్‌గారి నుంచి వస్తున్నాయని ఊహించుకోవడం దుస్సాధ్యంగా వుంది. ఈ గదిలో అదృశ్యంగా ఇంకెవరైనా పొంచి ఉన్నారా?

ఆయన కళ్ళెత్తి నన్ను చూశారు. ఎరుపెక్కిన ఆ కళ్ళల్లో జ్వరం నిండి వుంది. ఆయన నన్ను గుర్తుపట్టలేదేమో అనిపించి మోడా లాక్కుని వెళ్ళి ఆయనకు దగ్గరగా కూర్చున్నాను.

“ఎవరూ… మోహనా?” సన్నటి మూలుగుతో అడిగారు.

“అవునండీ!”

“అంతా బానే ఉందా?”

“బావుంది సర్.”

“హిమాలయాల్లో నా ప్రయాణం గురించి రాస్తున్నాను. చదివావా?”

“చదివాను సర్.”

“చెప్పాల్సింది ఇంకా చాలా వుంది. నేను డిక్టేట్ చేస్తూ రాసుకోమన్నాను. చూద్దాం ఎంత ముందుకు సాగుతుందో.”

“అంతా బావుంటుంది సర్. అంత దూరం వెళ్ళి వెనక్కి రాగలిగారు కదా!” నవ్వారాయన. ఏదో మొహమాటానికి నేను అన్న మాట కాదు అది. నా గుండె లోతుల్లో నుంచి వచ్చిన ప్రార్థన.

“నొప్పి ఇంకా ఉందా, సర్?” అదొక మూర్ఖమైన, ఇంకా ఎక్కువ మాట్లాడితే క్రూరమైన ప్రశ్న అని తెలుసు. కానీ అక్కడ, ఆ సమయంలో, అంత కంటే మాట్లాడగలిగే విషయం, ఇంకేవుంటుంది?

“ఊళిఱ్పెరువలి యావుళ? (విధి బలీయమగును విడువడు తప్పుకో నెందుబోవ వచ్చి ముందు నిలచు) విధికంటే బలమైన శక్తి ఏముంది?” అన్నారాయన తిరుక్కురళ్‌ను గుర్తు చేసుకుంటూ. వంపు తిరిగిన ఆయన పెదవులు కొంటెగా నాకేసి చూసి నవ్వాయి. అప్పుడు అంగీకరించింది నా మనసు, నేను కోమల్‌గారి సమక్షంలోనే వున్నానని.

“ఆ పదం ‘పెరువలి’ని గమనించావా? తమిళభాషలో అలాంటి సంక్లిష్టమైన పదాలు చాలా వున్నాయి. ‘వలిమై’ అంటే శక్తి, బలం. ‘వలి’ అంటే వ్యధ. బలానికి, వ్యధకూ మధ్య సంబంధం ఏమిటి? వ్యధ లేకుండా బలం ఉంటుందా? లేదంటే, ఎంత బలం ఉంటే అంత వ్యధ అని అర్థమా? ఏది ఏమైనా నాకు ఆ పదం చాలా ఇష్టం. పెరువలి… చాలా సార్లు ఆ పదాన్ని స్మరిస్తూ వుంటాను.”

మూలుగుల మధ్యలో ఆగి ఆగి, మాట్లాడుతున్నారు. ‘మాట్లాడి ఇబ్బంది పడొద్దు’ అని చెబుదామనుకున్నాను. కానీ ఆయన ఏదో చెప్పాలని అనుకుంటున్నారని అర్థం అయ్యింది.

“నొప్పి తగ్గడానికి ఇంజక్షన్ ఇవ్వలేదా?”

“అన్ని ప్రయత్నాలూ చేశారు. తూమునయితే మూయొచ్చు. గండి పడితే ఎవరు మాత్రం ఏం చేయగలరు?” ఎపుడో తప్ప ఆయన తంజావూరు మనిషన్న విషయం ఆయన మాటల్లో అంత తేలిగ్గా బయటపడదు.

నీకు కి.రా. తెలుసుగా? రాజ నారాయణ్ కాదు. కి.రా. గోపాలన్?” అడిగారాయన.

“ఆయన గురించి విన్నాను. ‘కలైమగళ్’లో పని చేసేవారు ఆయనే కదా?”

“అవును. మొదట్లో త్రిలోకసీతారామన్ నడిపే పత్రికలో పని చేసేవాడు. తరువాత ‘మణిక్కోడి’లోకి వెళ్ళాడు. చివరగా ‘కళైమగళ్’కి వచ్చాడు. నిజం చెప్పాలంటే ‘మణిక్కోడి’ బృందంలో ముఖ్యుడు. అరవై దశకంలో ఒక మంచి రోజు చూసుకుని మాయమైపోయాడు. ఎక్కడెక్కడో వెతికారు. కనపళ్ళేదు. పదేళ్ళ తర్వాత నేను కాశీలో తిరుగుతూంటే వెనకనించొచ్చి నా భుజం మీద చెయ్యి వేసి ఒక స్వామివారి వేషంలో ప్రత్యక్షమయ్యాడు. ఎదురు పడగానే ఎక్కడో ఇతన్ని చూసినట్టుందే, అనుకున్నాను. ‘నేను, కి.రా.’ అన్నాడు. నేను ఓ రెండు క్షణాలు నమ్మలేకపోయాను. నన్ను ‘స్వామి’ అని పిలవాలి నువ్వు అన్నాడు. ‘అలానే!’ అంటూ ఇపుడు ఏం చేస్తున్నావని అడిగాను. ‘నేను సన్యాసిగా మారాను! అన్నాడు. అంత తొందరగా వదిలిపెడతానా? మారి ఏం తెలుసుకున్నారు కొత్తగా? అన్నాను ఎగతాళిగా. ‘దూరాన ఒక పర్వతం కనపడుతోంది, నాకు’ అన్నాడు. ‘అది బంగారు పర్వతం. కైలాసం. నిరంతరం దాని వైపే ప్రయాణం చేస్తూ వుంటాను. ఇప్పుడు కూడా అదిగో… దూరాన కనపడుతోంది. వెడుతున్నాను” అంటూ జనంలో కలిసిపోయాడు.

“నేను కైలాస పర్వత ప్రయాణం చేస్తున్నపుడు, కి.రా. గురించే నా ఆలోచనలన్నీ. దారి మధ్యలో ఎక్కడో ఒక చోట నన్ను కల్సి, ఏదో గొప్ప విషయం బోధిస్తాడనుకున్నాను. జ్ఞానాన్ని ఆర్జించినవారు మన చుట్టూ ఎంతోమంది ఉండొచ్చు. కానీ, ఎవరో ఒక మహాత్ముడు వచ్చి, మనకు వివరిస్తేనే కదా, దానికి ఒక అర్థం అంటూ ఏర్పడేది. ఏమంటావ్? అయితే కి.రా. వచ్చి నన్ను కలుస్తాడనే నమ్మకం, దారంతటా నాతో ప్రయాణించలేదు. కేదార్‌నాథ్ చేరుకొని కైలాస పర్వతం వైపు ప్రయాణం మొదలు పెట్టిన తర్వాత కానీ అసలు విషయం నాకు వెలగలేదు. అదీ సంగతి – కి.రా. ఇక లేడు. ఈ మట్టిలో ఒకటైపోయాడు. ఎంతో మంది అతనిలా తమ ఇళ్ళనీ కుటుంబాలనీ వదిలి ఈ భూమి మీదికి వచ్చారు. ఏదో వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. బదులుగా ఇంకేవేవో ఎన్నెన్నో పొందగలిగారు. చివరికి మరణించారు. ఇదంతా తప్పనిసరిగా ఈ నేలలో నిక్షిప్తమై పోయి ఉంటుంది.”

“కొండ మీదికి ఎక్కడం కష్టం అనిపించిందా?”

“ఏం కష్టం? కళ్ళు మూసుకుని, నాలుగైదు అడుగులు ముందుకు వేసేవాణ్ణి, ఏదో బావిలోకి దూకినట్టు… తర్వాత ఆగి రెండు నిమిషాలు నిలబడేవాణ్ణి.”

“ఆగడం మంచిదే లేండి. కొంత స్వాంతన దొరికుంటుంది.”

“అమాయకంగా మాట్లాడుతున్నావు! నిలబడితే ఇంకో రకమైన నొప్పి. నడవడం గునపంతో గుచ్చినట్టుంటే, నిలబడ్డం పారతో కోసినట్టు! కానీ మార్పు మంచిదేగా, ఏమంటావ్? పెరువలి! మావలి అనే రాక్షస రాజుండేవాడట. పెరుమాళ్ళు ఆయన తలమీద కాలుపెట్టి పాతాళలోకానికి ఒక్క ఉదుటున తొక్కేశాడట. పేరు గమనించావా? మా-వలి ; మహా – వలి, మహావ్యధ. ఆ విష్ణుమూర్తే, నిన్ను కాలితో తొక్కితే, మహావ్యధ సహజమే కదా?”

ఉన్నట్టుండి, ఏదో మీదికి వచ్చి పడ్డట్టు… ‘అమ్మా’ అని కేక పెట్టాడాయన. “అమ్మా! అమ్మా! అమ్మా!’ అని కొంతసేపు నొప్పి భరించలేక అలా అరుస్తూనే ఉన్నాడు.

లేచి వెళ్ళిపోదామా! అని అనుకున్నాను.

“వెడుతున్నావా?”

“లేదు’ అన్నాను మళ్ళీ సర్దుకుంటూ.

“నేను హిమాలయాలకు వెళ్ళకుండా, కైలాసం చూడకుండా చనిపోయుంటే, ఇక్కడే పుట్టి నా నాటకాలన్నీ మళ్ళీ ప్రదర్శించి, ఈ తమిళ దేశంలో పెను విధ్వసం సృష్టించి ఉండేవాణ్ణి. మీరందరూ బతికిపోయారు.” జోక్ చేశాడాయన.

కళ్ళు మూసుకున్నాడు. ఆ కనురెప్పల మీదున్న సన్నటి చర్మం కదులుతోంది. కుడి దవడ ఎముకలు, మెలి తిరిగి వణుకుతున్నాయి. కొంతసేపటి తర్వాత మాట్లాడటం మొదలెట్టాడు.

“ఇప్పటికీ కళ్ళు మూసుకుంటే నాకు ఆ హిమాలయాల మీద నడుస్తున్నట్టుగానే వుంది. ‘ఎత్తు’ అనేది హిమాలయాలను అత్యున్నత స్థితిలో నిలబెడుతుంది. నీ తల కిందా కాళ్ళు పైకీ పెడితే, మైళ్ళ కొద్దీ లోతుండే పాతాళ లోకాన్ని కూడా విపరీతమైన ఎత్తుగా ఉన్నట్టు ఊహించుకోవచ్చు. ఆ ‘ఎత్తు’ మనుషులకు తామెంత అల్పజీవులమో స్ఫురింపజేస్తుంది. అలానే ముందుకు నడుస్తూ పోతూ, తలెత్తి చూస్తే, ఎల్లలు లేని సంజె చీకటి, ఆకాశం నించి భూమి మీదికి వరదలా తరలి వస్తోందనే అనుభూతిని కలుగచేస్తుంది. పర్వతానికి చుట్టిన వడ్డాణంలా, కనపడుతోన్న కాలి బాట, మనల్ని ముందుకు తీసుకువెడుతూ ఉంటుంది. నడుస్తున్న కొద్దీ కొంచెం కొంచెంగా కనపడుతూ, ఒక్కసారిగా రాక్షస కాయంతో, మహా పర్వతం కళ్ళ ముందర సాక్షాత్కరిస్తుంది! మీదికి వంగుతోన్న ఆకాశంతో నిలబడి వున్న భూతగణాలతో పాటూ నీడ, చీకటి అనేవి నీలం, నలుపు రంగుల్లో, అక్కడ కనిపిస్తాయి. అందరూ మంత్రముగ్ధులై ధ్యానంలో మునిగి వుంటారు.

“ఆ కనపడ్తున్న కొండ ఎక్కి దిగితే కైలాస పర్వతం మనకెదురుగా కనపడ్తుంది – అని చెప్పారు వాళ్ళు. ఆ మాట వినగానే నాతోపాటూ వచ్చిన వాళ్ళందరూ కళ్ళు మూసుకుని తలలు వంచి ప్రార్థనలు చేశారు. ఎందుకో తెలీదు, నాకైతే ‘నేను ఘోరంగా మోసపోయాను’ అనిపించింది. కేవలం ఏదో నిర్జీవమైన పెద్ద కొండను చూడబోతున్నాను, అంతే – అనిపించింది. నా అంతరాంతరాల్లో నేను వూహించిందదే. ఎందుకంటే ఆ క్షణంలో నా తర్కానికి అందింది ఆ మాత్రమే. మూర్ఖంగా ముప్ఫయి ఏళ్ళుగా, ఒక కల కంటూ దాన్ని సాకారం చేసుకుందామని ఇంత దూరం వచ్చాను. ఆ స్వప్నం ఇన్నిరోజులు నాలో చిన్ని దీపాన్ని వెలిగించి, నా దైనందిన జీవితం అర్థరహితం కాకుండా కాపాడింది. నేను దాన్ని అలానే ఉండనిచ్చి వుండాల్సింది. ఇంత దూరం వచ్చి వుండకూడదు. నా బుర్రలో అదొక్కటే ఆలోచన. ‘నేను వచ్చి వుండకూడదు. నేను వచ్చి వుండకూడదు…’ నా కాళ్ళు గడ్డ కట్టిపోయి, వేళ్ళు కదపలేక పోతున్నాను. అంతెందుకు, ఆఖరికి కనుబొమ్మలు కూడా కదిలించ లేకపోతున్నాను. నా మనసంతా అదే మాటతో నిండిపోయింది. ఉన్నట్టుండి, విపరీతంగా భయం వేసింది. నేను చచ్చి పోయానా… నా శ్వాస ఆ మాటల దగ్గరే ఆగిపోయిందా… ఈ ఆలోచనలన్నీ నేను శవంగా మారిన తర్వాత చేస్తున్నవా… ఇదేనా చావంటే?

“నిజంగా చెప్తున్నా మోహన్! ఏదో ఒళ్ళు తెలీని స్థితి. నా శరీరం చల్లగా గడ్డకట్టిన శవంలా మారిపోయింది. నొప్పేమన్నా ఉందా అని చూశాను. లేదు. నిజంగానే నేను చచ్చి పోయాను. ఎంత హాయిగా వుంది. నేను చచ్చిపోయాను. ఇంక నొప్పంటూ లేదు. ‘ఊళిఱ్పెరువలి యావుళ’ – విధి కంటే బలీయమైన శక్తి ఏముంటుంది? ఓహ్ ఈ గడ్డం కవిగారు చచ్చిన తర్వాత కూడా నన్ను వదిలిపెట్టడం లేదు. పెరువలి మాయమై పోయింది. మావలికి మోక్షం ప్రాప్తించింది. ‘నేను చచ్చిపోయాను. చచ్చిపోయాను’ అని అరిచి ఆనందతాండవం చెయ్యాలనిపించింది. ఎగిరి గంతులు వేద్దామనుకున్నాను. ఎప్పుడైతే ఉత్తర భారతం నించి వచ్చిన భక్తులు, చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, కొండ పైకి వెళుతూ ఉండడం చూశానో, నాకు కూడా వాళ్ళలాగా పైకెక్కితే బావుంటుంది అనిపించింది. కానీ నొప్పి లేకపోయినా నేను నిజంగా ఎక్కేవాడినా అనే సందేహం వచ్చింది. ఆ క్షణంలో మటుకు ఎందుకో ఒళ్ళు మరిచి నృత్యం చేయాలనిపించింది. కానీ నా శరీరం నించి నన్ను నేను విడిపించుకోడం సాధ్యం కాలేదు. ఒక్కసారిగా భయం నన్ను ఆవరించింది. ఇక్కడే ఇరుక్కుపోయి ఎప్పటికీ ఇలానే ఉండిపోతానా, బోనులో చిక్కి, కుళ్ళి శవంలా మారే ఎలుక లాగా?

“అదంతా ఒక నాలుగైదు క్షణాల భ్రమ. కొంత సేపటి తర్వాత తెలివి తెచ్చుకుని, కొండ పైకెళ్ళే దారి పక్కన కూర్చున్నాను. ‘నాకిందంతా వద్దు. వాళ్ళనే చూడనీ కైలాసం. నేను వెనక్కి తిరిగి వెళ్ళిపోతాను. నా ఊహల్లో ఉండే కైలాసాన్ని అలానే ఉండనీ’ అని నిర్ణయించుకున్నాను.

“నాతో పాటూ ఒక మార్వాడీ ఆవిడ అప్పటిదాకా నడిచి వచ్చింది. ఎక్కడం మొదలు పెట్టినప్పట్నుంచీ అపుడపుడూ నన్ను ఆపేక్షగా పలకరిస్తోంది. ఆవిడది భారీ శరీరం. ఆయాసపడుతూ, తల పైకెత్తి, సీల్ చేపలాగా నోరు వెళ్ళబెట్టి, అతి కష్టం మీద కొండ ఎక్కుతోంది. నడుస్తూంటే ఆవిడ ఒళ్ళంతా అటూ ఇటూ కదిలిపోతోంది. అంత చలిలోనూ ఆవిడ నుదుటిపైనుంచి చెమట కారుతోంది. వచ్చి రాని భాషలో, నాతో కష్టపడి మాట్లాడుతోంది, ఆవిడ.

‘ముందుకు రావడం లేదా? కైలాసం ఇక్కడే వుంది. ఇంకొంచెం దూరం నడిస్తే చాలు… కళ్ళకు కనపడుతుంది’ అన్నారావిడ. బాగా నొప్పిగా ఉందని నా నోటిని తిప్పుతూ సైగ చేశాను.

‘ఇంతదూరం వచ్చారు. ఇంకెంత నాలుగడుగులు?’ అంటూ, జీవిత పరమావధి ఇదే… అన్నట్టుగా ఆవిడ నన్ను ప్రోత్సహించింది. ‘అదుగో పర్వత శిఖరం. అదే పరమశివుడుండే కైలాసం’ అని అంటూ కళ్ళు తడిచేసుకుని, కన్నీళ్ళు కార్చటం మొదలెట్టింది. మతి భ్రమించిన మనిషిలా, రెండు చేతులూ జోడించి, అటూ ఇటూ ఊగుతూ ఏదో భజన చేయడం మొదలు పెట్టింది. గుంపులోని జనమంతా అదే అవస్థలో వున్నారు. నేనొక్కడినే వేరే ప్రపంచంలో గడ్డ కట్టుకుపోయి, ఆ నిండు చలిలో, వాళ్ళ వంకే ఆశ్చర్యంగా చూస్తూ నిలబడి వున్నాను.

‘నా చెయ్యి పట్టుకుని లాగుతూ ‘దయచేసి రండి’ అంది.

‘లేదు బెహెన్‌జీ. నేను రాలేను. మీరు వెళ్ళండి’ అన్నాను.

‘మీరు రావాల్సిందే. మీరు రాకుండా నేనెలా వెళ్ళేది?’ అందావిడ. అని కదలకుండా అలా నా పక్కనే నిలుచుంది. అందరూ ముందుకెళ్ళి పోయారు. నేను ఆవిడ మటుకు, చీకటి ముసురుకున్న ఆ దారిలో మిగిలి ఉన్నాం. రెండు ఆత్మలు… వేరే వేరే చోట్ల పుట్టి, సంబంధం లేని రెండు వేర్వేరు జీవితాలు గడుపుతున్న వాళ్ళం… ఒకే చోట… ఆ సమయంలో… అలా నిలబడిపోవాలని రాసుంది.

‘బెహెన్‌జీ! మీరు ముందుకెళ్ళండి. నాలుగైదు నిమిషాల్లో అక్కడుంటాను.’ నేను గట్టిగా చెప్పాను.

‘లేదు. మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళే సమస్యే లేదు.’ ప్రకటించింది ఆవిడ. మిగతా వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చేస్తున్నారని, తొందర పెట్టాను.

‘పరవాలేదు. నేను కైలాసాన్ని చూడకూడదు అనేది, ఆ రుద్రుడి ఆన అయితే అలానే కానిద్దాం. అసలు మిమ్మల్ని ఈ స్థితిలో వొదిలి ఎలా వెళ్ళడం?’ అందావిడ.

“ఆ మాట నన్ను కదిలించింది. జీవితంలో ఏదైనా ఎప్పుడైనా వదిలేసి ఉండగలగడం… దేన్నీ ఇది నా సొంతం అనుకోకపోవడం… అలా అనుకునే వాళ్ళ చేతుల్లో ఏదీ నిలవదు. జీవితంలో వాళ్ళు గొప్పవనుకునేవీ సాధించలేరు.
కానీ అన్నిటికంటే ముఖ్యమైనదేదో అది వాళ్ళు పొందుతారు. అయినా నేను అక్కడ నించీ కదలలేదు.

‘నాకు ఒంటరిగా ఉండాలని వుంది. దయచేసి నన్ను వదిలెయ్యండి. మీరు వెళ్ళండి. కైలాసాన్ని దర్శించుకోండి. వెనక్కి వెళ్ళేటప్పుడు మీతోనే వస్తాను. కొంచెం సేపు నన్నిక్కడ ఉండనియ్యండి.’ చెప్పానావిడకి.

కొంతసేపు ఆలోచించి, ‘ఇక్కడే వుండండి. వచ్చేస్తా నేను’ అంటూ ఆవిడ గబగబా ముందుకు వెళ్ళింది.

“నేను అక్కడే కూర్చుని అనుకున్నాను, ‘ఈ ఒంటరితనం అనుభవించడానికా ఇంత దూరం వచ్చాను?. ఇదేనేమో నా ఆఖరి గమ్యం? బహుశా ఆ శివుడు నాకు ఇదే రాసిపెట్టాడేమో? నా స్వీయ కైలాసం!’ ఏకాంతంలో వున్నాను. ఆ ‘నేను’ అనే పదార్థం, నాకు సంబంధించనిది… అనిపించటం మొదలైంది.

“నా భారీ బూట్లు, స్వెట్టర్ మీద తగిలించిన దళసరి కోటు, మెరిసిపోతున్న తెల్లటి ఎంజీఆర్ టోపీ, మెడను చుట్టుకుపోయిన మఫ్లర్ – ఇవన్నీ తగిలించుకునేటప్పటికి, కైలాసం చూడడానికి అంత దూరమూ నా ముక్కు, నుదురు మటుకే ప్రయాణం చేసినట్టుగా వుంది. కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనపడని చిక్కటి చీకటి. ఇక్కడ కనపడే చీకటి లాగా కాదు. నీలపు ఛాయలో వున్న చీకటి. ఇంకొంత దూరాన, బూడిద రంగు ఆకాశం మీద ఎవరో చిత్రకారుడు చిత్రించినట్టుగా, వెండి పర్వత సానువుల మొనలు కనపడుతున్నాయి. అంతటా నిశ్శబ్దం. బహుశా చెవులు మూసుకపొయ్యాయేమో? నాతో వచ్చిన వాళ్ళంతా దగ్గరలోనే వున్నారు. కానీ వాళ్ళు చేసే శబ్దాలు, ఎక్కడో దూరాన్నించి వస్తున్నట్టుగా వుంది. శరీరం దానిపాటికదే వణికిపోతోంది. ఆశ్చర్యం ఏమిటంటే నొప్పి అనేదే తెలియడం లేదు. అసలు లేదా అనడిగితే… ఉందేమో? నాకైతే మటుకు తెలియడం లేదు. మధ్యాహ్నం మూడో, మూడున్నరో అయ్యుంటుంది. కానీ అక్కడ గంటలతో పని లేదు. అంతెందుకు సమయం అనే దానికి ఉనికే లేదక్కడ. పర్వత శిఖరాలు… కాలంతో వాటికి పనేముంది? కాలాతీతమైన స్థితి వాటిది. సిక్కులు ప్రార్థించేటప్పుడు, ‘సత్ శ్రీ అకాల్’ అంటారు. అ-కాలం. కాలంతో పని లేనిది. ఎంత గొప్ప మాట. కాలాతీత అవస్థలో ఎవరి కాలానికైనా అంతం ఎలా వస్తుంది? కాలా! ఓ మృత్యుదేవతా! నా దగ్గరకు రావడానికి ధైర్యం చెయ్యొద్దు! నిన్నెత్తి విసిరేస్తాను! ఎందుకని… కొంచెం కూడా బాధ అనేదే లేదు? బాధ అనేదే జీవితం. అది జీవితం మీద ఎప్పుడూ కదలాడే, మృత్యువు నీడ. ఎక్కడైతే జీవితం, మృత్యువు – ఇలాటి వాటికి అర్థమే లేదో, అక్కడ బాధ అనేది ఎక్కడుంటుంది? కదలకుండా అలానే కూర్చున్నాను. నా కళ్ళొకటే అటూ ఇటూ సంచరిస్తున్నాయి. కొండ వాలు మీద అటూ ఇటూ… ఒక సారిక్కడా… ఒక సారక్కడా…

“‘అది’ నాకు మొదట వెంటనే కనపడలేదు. కోటు జేబులోంచి బైనాక్యులర్స్ తీసి చూశాను. అప్పుడు కనపడింది, ఎక్కడో దూరంగా అకస్మాత్తుగా – జడల బఱ్ఱె!

“నేను చెప్తే నువ్వు నమ్మవు, మోహన్! నా ఊహో, భ్రమో అని కొట్టి పారేస్తావు. కానీ అది నిజం. ప్రమాణ పూర్వకంగా నిజం. అదే ప్రదేశంలో అదే విధంగా… శారదానంద ఫొటోలో వున్న మాదిరిగా… అదే జడలబర్రె! సత్య ప్రమాణంగా! తెలుపు దుప్పటితో కప్పిన ఆ పర్వతం మీద, దాదాపు రెండు మూడు కిలోమీటర్ల దూరంలో కనపడుతోంది. తెల్ల ఇసుక మీద తెల్లటి గులక రాళ్ళు పరిచినట్టుగా… కనపడేదంతా మంచే! కొండ వాలంతా, ఉప్పు రాళ్ళ వాన కురిసినట్టుగా వుంది. ఆ చిన్న జడల బఱ్ఱె, మంచులో, ముందు కాళ్ళు మడిచి కూర్చుని, తలను పక్కకు వాల్చి కళ్ళు మూసుకుని, వేరే లోకంలో విహరిస్తోంది. గుండె దడ పెరిగిపోయి నా కళ్ళు బైర్లు కమ్మాయి. ఇదంతా నిజమా? ఊహా? అనుమానం లేదు. అదే జడల బఱ్ఱె. నాలుగైదు నెలల వయసుండొచ్చు దానికి. నిత్యనూతనమైన, స్వచ్ఛమైన, మచ్చలేని శరీరం. ఒక క్షణం, ఏదో మహాకాయం ధరించిన చిట్టెలుకలాగా అనిపించింది. మరో క్షణంలో, రాతితో చేసిన పవిత్ర నందీశ్వరుడిలా అగుపడింది. ఒక్క ఉదుటున, దగ్గరకెళ్ళి దాన్ని నా చేతిలోకి తీసుకున్నాను. మరో క్షణంలో, నేను దాని పాదాల దగ్గర నిలబడి ఉంటే దాని గిట్టలు నా ఎత్తులో ఉన్నాయి. ఎంత నాజూకైన చర్మం దానిది! కేశాలు బూడిదరంగులో ఉండి, గాజు ఫలకాల్లా వున్నాయి. నాసికం లేత తాటిపండులా… గిట్టలు కవచంలా… అది అంత స్వచ్ఛంగా ఉండడం ఎలా సాధ్యం? నిజంగా శారదానంద ఆరోజు ఎలాటి అనుభూతిని పొందారో? అలాంటి చిత్రాన్ని బంధించిన తరువాత, శ్వాస పూర్తిగా స్థంభించి పోకుండా ఉండడం ఎలా సాధ్యం?

“ఆవిడ వెనక్కి తిరిగొచ్చేటప్పటికీ, నేను స్పృహ తప్పి వెల్లకిలా పడిపోయి వున్నాను. మొహం మీద నీళ్ళు చల్లి, అటూ ఇటూ కదిపి లేపిందావిడ. తన ఫ్లాస్క్ లోంచి కాఫీ తాగడానికిచ్చింది. లేవబోతుంటే అంది ‘లేవకండి, కొంచెం సేపు కూర్చోండి’ అని. ‘లేదు నేను ఇప్పుడే కైలాసం చూడాలి!’ అన్నాను ముందుకెడుతూ. ఒక కిలోమీటర్ దూరం ఐదునిమిషాల్లో నడిచేశాను. భారరహితమైన ఆ వాతావరణంలో దూది లాగా ఎగిరిపోతున్నాను. ఆకాశం బూడిద రంగులో వుంది. మధ్యాహ్నపు సూర్యుణ్ణి నల్లగొడుగులోంచి చూసినట్టుగా, మూగ వెలుగుతో అంబరం ప్రకాశిస్తోంది. సూర్యుడింకా బయటకు రాలేదు. కైలాస పర్వతం కోసం దిగ్మండలం అంతా వెతుకుతున్నాను. నాలుగైదు మంచుతో కప్పిన పర్వత శిఖరాలు, దూరాన ఆకాశంలో తెల్ల గుడారాల్లా కనపడుతున్నాయి. అకస్మాత్తుగా అప్పుడు నా కంటి ముందు సాక్షాత్కరించింది కైలాస పర్వతం. ఒక్కసారిగా నా శరీరం ఆనందపారవశ్యంలో మునిగిపోయి గడ్డ కట్టుకుపోయింది. వెచ్చని కన్నీళ్ళు ఆగకుండా ప్రవహిస్తున్నాయి. రెండుచేతులు జోడించాను. పెదవులు బిగబట్టి అలానే నిల్చున్నాను. ‘నీ కర్మ నశించింది’ అని చెవిలో ఎవరో గుసగుస లాడినట్టనిపించింది. ఎవరది? నాలో నేనేనా?

“చల్లటి గాలి లోయలోంచి పైకెగసింది. అప్పుడు నెమలి పింఛపు వర్షంలా చల్లటి సుడిగాలి ఆపాదమస్తకం నన్ను ముంచెత్తింది. మంచు మేఘాలు గొర్రెల మందలా కైలాసపర్వతపు కుడి వైపున లోయలో కదలకుండా నిలబడి వున్నాయి. ఆ పర్వతం చూడడానికి, రెండు అరచేతులూ, ఒడిలోవున్న పట్టువస్త్రంలో ఉంచి, ధ్యానంలో మునిగిపోయి వున్న మౌనీశ్వరుడిలా వుంది.

“అంతటా నిశ్శబ్దం. అకాలం.

“అక్కడ ఏ శబ్దం లేదంటే ఏవీ వినపడడం లేదని కాదు. గాలి ప్రవహిస్తోన్న శబ్దం, నిరంతరంగా చెవిన పడుతోంది. నువ్వు పడవ వేసుకుని, మద్రాస్ నుంచి దూరంగా సముద్రంలోకి వెళితే, నగరంనించి వచ్చే శబ్దాలన్నీ కలిసిపోయి, రణగొణ ధ్వనులతో కూడిన తరంగాలుగా మారి, నిన్ను చేరతాయి. అక్కడి గాలి చేసే శబ్దం అలా వుంది. కొంత మంది తుమ్ముతున్నారు. కొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నారు. కొంతమంది నిశ్శబ్దంగా ఏడుస్తున్నారు. మాతో పాటు వచ్చిన నాలుగు గుర్రాలు, పొగరుగా వాటి గిట్టలను నేలకేసి కొడుతూ శబ్దం చేస్తున్నాయి. కానీ ఈ శబ్దాలన్నీ ఒక మహా నిశ్శబ్దంలో మునిగి కరిగిపోతున్నాయి. భూత, భవిష్యత్, వర్తమానాలు – మన మనస్సులో సంచరించే అన్ని కాలావస్థలూ అక్కడ సంగమించి కాలాతీతమైపోయాయి. దూదిని గులాబిరంగులో ముంచి అక్కడక్కడా అద్దినట్టుగా, బూడిదరంగు ఆకాశంలో కెంజాయ మరకలు ఉద్భవిస్తున్నాయి. కొంతసేపటికి ఆ అరుణిమ దిగి వెళ్ళిపోయి, ఆకాశపు కింది భాగాన్ని ఆవరించింది. నింగి పైపొరను ఎవరో చీల్చివేసినట్టుగా వుంది.

“అప్పుడు మొదలైంది మళ్ళీ నా నొప్పి. ఎవరో కాలుతున్న ఇనప కడ్డీని నా ఒంటి మీద బలంగా నొక్కిపెట్టి మర్దిస్తున్నట్టు, మరుగుతున్న పాదరసం, రక్తంగా మారి నా నరనరాల్లో ప్రవహిస్తున్నట్టు, నా శరీరంలోని ప్రతి అణువణువూ కాలిపోయి బూడిదవుతున్నట్టూ ఎవరో బతికుండగానే నా చర్మాన్ని వలిచేస్తున్నారు. లాగేసిన చర్మం కింద వున్న నా శరీరమంతా వణికిపోతోంది. నా చర్మం అంతా వేరు చేసి, పక్కన పడేసి నన్నలా వొదిలేసి వెళ్ళారు. గాలి తగులుతున్న నా శరీరం, గాయాలతో తగలబడి పోతోంది. చూపు పూర్తిగా మందగించింది. పట్టు తప్పి జారి పోతున్నాననిపించింది. ఎక్కడో వున్న మెరీనాసాగరం ఒడ్డున వీచే గాలిలో పడిపోయి, ఇంకెక్కడికో విసిరేయబడ్డట్టుగా అనిపించింది. అకస్మాత్తుగా అదే సమయంలో, అనేకానేకమైన గొంతులు కలిసి, ‘జై శ్రీ కైలాష్’ అనడం వినిపించింది. కలా? నిజమా? ఈ నార్త్ ఇండియన్ గుంపు అంతా మద్రాస్ కొచ్చిందా? లేక ఇది రామేశ్వరమా?

“మరుక్షణం కళ్ళు తెరిచాను. నా ముందర కైలాస పర్వతం, బంగారు గోపుర శిఖరంలా కాంతులీనుతూ ఆకాశంలో కనపడింది. కళ్ళు మిరిమిట్లు గొలిపేలా ఒక వైపునున్న పర్వతపు ముఖం, పసుపుపచ్చగా ప్రకాశిస్తోంది. ఇంకో ముఖంపై, పర్వతపు వంపు నీడలు బంగారు వర్ణంలో మెరుస్తున్నాయి. బంగారు వర్ణం. పసిడి వర్ణపు ఆకాశ మండలం. అమలిన అపరంజి శిఖరం. ఏ మనిషీ దోచుకోలేని అపార సంపద. ఈ రోజుకీ నిలిచి ఉండి మన కళ్ళ కందుతోన్న ఓ అద్భుతం. కాలాతీతం!

“చెప్తే నమ్మవు కానీ, అక్కడున్న ఎనభై మంది కళ్ళల్లోనుంచి నీళ్ళు ధారాపాతంగా ప్రవహిస్తున్నాయి. కన్నీళ్ళెందుకు – బాధా? సంతోషమా? లేదా బాధలన్నీ సమసిపోయినందుకు పైకి పొంగి పొరలి వచ్చిన సంతోషమా? ప్రతి మస్తిష్కం, దానికై అదొక ప్రపంచం. అనేక రకాల దేవుళ్ళు, వివిధ రకాలైన స్వర్గాలూ… నరకాలూ… కానీ అంతా మనుషులమేగా? అందరం కీటక సమూహంలా ఒక గులకరాయి కంటుకుని బతుకుతాం. ఈ తుచ్ఛమైన నీచమైన జీవితం ఇదే విధంగా గడపాలని రాసి వున్నా, ఎంతో వేదనకూ వ్యధకూ గురై అర్థరహితంగా రాలిపోవడం ఖాయమైనా, ఎవరో మన సమస్త మానవాళికి పట్టాభిషేకం చేసి ఈ కిరీటాన్ని అనుగ్రహించాడు. ఆ కిరీటాన్ని మోయడం దుర్భరమైన భారం. అంత గొప్ప గౌరవాన్ని పొంది నిజంగా మనం అందుకు తగినట్టుగా బతుకుతున్నామా? నా ఆత్మ క్షోభిస్తోంది. నా రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి. నా జీవితంలోని దుర్మార్గమైన జ్ఞాపకాలు పైకి తేలి నన్ను కుదిపేస్తున్నాయి. మోహన్! నేను పని చేసిన చోట అడుగడుగునా ప్రతి రోజూ ఎదురయ్యే దుర్మార్గం, ఎవరినైనా రాయిగా మారుస్తుంది. పెద్దవాళ్ళల్లో, చిన్నవాళ్ళల్లో అందరిలో కనపడే దుర్మార్గం. ఎవడీ మూర్ఖుడు? ఈ దుర్మార్గపు శిఖరం మీద కిరీటం పెట్టి, మనిషిని దీవించింది? ‘మనిషి!’ ఎంత గొప్ప పేరు పెట్టాడు ఆయన మనకి. మోహన్! ఎనిమిదిమంది చేత, రాత్రంతా మానభంగానికి గురైన పన్నెండేళ్ళ కూతురిని, ఆ అమ్మాయి తల్లి తన చేతుల్లో మోసుకెళ్ళడం నా కళ్ళారా నేను చూశాను. ఆ ఎనిమిది మంది మగవాళ్ళూ ఆడ పిల్లలకు జన్మనిచ్చిన వాళ్ళే. ఇంకెంతో మంది నిర్దయగా, మోసగించబడ్డ ఆడవాళ్ళు, గుండెలు బాదుకుని ఏడవడం చూశాను. నా కడుపంతా, నేను మళ్ళీ మళ్ళీ దిగమింగిన అన్యాయాలు, అవి నా గుండెకి చేసిన గాయాల రసితో నిండిపోయుంది.

“మూర్ఖత్వంతో కళ్ళు మూసుకుపోయిన అంధుడివి! అసలు నీకు వెన్నెముకెందుకు? విస్ఫోటనకు గురికావాల్సిన ప్రతి క్షణంలో బండ రాయిలా ఉండి పోయింది నువ్వే కదా? ఆ దురదృష్టకరమైన క్షణాల్లో నీ నాలిక మీదకి దూకిన ప్రతి శాపాన్ని, బయటికి రాకుండా దిగమింగావు. అవి నీలో దాగి ఉండిపోయి నీ వెన్నెముకను తినేశాయి. ఉప్పు మీద పడిన ఇనుములా తుప్పు పట్టి ఆ వెన్నెముక వంగిపోయింది. చూడు! నా వెన్నెముక, నూరు విషసర్పాలు పెనవేసుకున్న గొలుసులా వుంది. వంద పాము కాట్లు! వంద విషాలు! నా మీదనా నువ్వు బంగారు కిరీటం పెట్టావు? నాతో ఆడుకుంటున్నావా? నన్ను గేలి చేస్తున్నావా? మరణభయంతో వణికిపోతూ, ఒక అల్పక్రిమి లాగా ఇక్కడ నిలబడిపోయిన నన్ను ఇంకా చిన్నబుచ్చుతున్నావా? ఎక్కడున్నావు నువ్వు? అసలున్నావా? అసలు నువ్వంటూ లేకపోతే నా జీవితమంతా హాయిగా గడపొచ్చు అనుకున్నాను. నువ్వు లేనిచోట ఏదైనా చెల్లుతుంది. నువ్వనేదే లేకపోతే దేన్నయినా సమర్థించవచ్చు. నువ్వు లేకపోతే ప్రతిదీ ఒక కొత్త అర్థాన్ని సంతరించుకుంటుంది.

“కానీ ఈ విశ్వాంతరాళంలో ఎక్కడో కూర్చుని, ఒక అద్భుతమైన కాంతి కిరీటాన్ని, మనిషి అనే జంతువు శిరస్సుపై ఉంచావు. అయ్యో! ఈ క్షణంలో, ఒకే ఒక్క క్షణం పాటు ఆ కిరీటాన్ని నా తల మీద ధరిస్తే, ప్రతిదీ అర్థవంతమౌతుంది. ఏదీ వ్యర్థమై పోదు. నా జీవితం, నా ప్రయాణం, కొత్త అర్థాన్ని సంతరించుకుంటాయి. ఒరేయ్ దుర్మార్గుల్లారా? మీ కోసం, మీలో ప్రతి ఒక్కరి కోసం ఈ కిరీటాన్ని నేను ధరిస్తాను. మీ వ్యధని, మీ ఎనిమిదితరాల వ్యధనీ నేనే మింగేస్తాను. నేను చేసిన, నా ముందు అనేక తరాలు చేసిన పనులకు, శిక్షను నేను అనుభవిస్తున్నాను. నేను ఏసుక్రీస్తు లాంటి వాడిని. కానీ నాకు ముళ్ళు వద్దు. బంగారు కిరీటం మాత్రమే కావాలి. ఇప్పుడే, ఈ క్షణమే, ఎక్కడున్నా… అసలు న్యాయం అనేదంటూ ఒకటుంటే, క్రిమి లాంటి ఈ మనిషి మీద నీకు కించిత్ నమ్మకం అన్నా ఉంటే, ఆ బంగారు కిరీటం వెంటనే నా తలనలంకరించాలి. ఇప్పుడే… ఈ క్షణం లోనే.

“అదెలా జరిగిందో నాకు తెలీదు మోహన్… ప్రమాణం – నాకు తెలీదు. అదొక రోగిష్టి బుర్ర లోనించి ఉద్భవించిన, పిచ్చి వూహ మాత్రం కాదు – అప్పటికప్పుడే ఆ అద్భుత కిరీటం, నా తలపై వచ్చి కూర్చుంది. నా శరీరం అంతా బంగారు వర్ణంలో మెరిసిపోయింది. కిందనున్న ప్రపంచం అంతా మాయమైపోయి నేనొక్కణ్ణే ఆ శూన్యంలో నిలబడిపోయాను. సమస్త మానవాళి కోసం, అంతులేని ఓ దయా ప్రవాహం – అపార శక్తిని సంతరించుకుంటూ, మంచు తుఫానులా విరుచుకు పడి, పర్వత సానువులపై నుంచి వేగంగా దొర్లుతూ, కుంభవృష్టిగా మారి భూమినంతా అభిషేకించింది. ఆ వర్షధారలో తడిసి, భూ ప్రపంచమంతా కంపించిపోతూ, కొత్త వెలుగులో మెరిసిపోతోంది. నేనక్కడ నిలబడి నా గుండె లోతుల సాక్షిగా, ప్రతి ఒక్కరినీ క్షమించాను. మనిషి అన్న ప్రతివాణ్ణీ భూత, భవిష్యత్, వర్తమాన, కాలాల్లోని ప్రతి మనిషినీ క్షమించాను.

“ఆ క్షణంలో అక్కడేవి జరిగిందో తెలీదు కానీ అక్కడ నుంచుని వున్న అందరూ ఒక్కసారిగా, నా వైపు చూశారు. వాళ్ళందరి కళ్ళల్లో భక్తి భావన. కొందరి మొహాలను కన్నీళ్ళు తడిపి ముంచేస్తున్నాయి. కొంతమంది గౌరవపూర్వకంగా నా వైపు చూస్తూ చేతులు జోడించారు. బెహెన్‌జీ నోరు తెరిచి ఏదో చెప్పబోయింది, ఎందుకో ఆమె పెదవులు మధ్యలోనే ఆగిపోయాయి. నాకు వాళ్ళు కనపడుతున్నారు, కానీ నేను వాళ్ళను చూడలేక కళ్ళు మూసుకున్నాను.”

కొంతసేపు ఆ గదిలో ఒక సుదీర్ఘమైన నిశ్శబ్దం రాజ్యం ఏలింది. ఆ గదిలో ఆయన లేరు. మసక వెలుతురులో కోమల్‌గారి శరీరం ఒకటే కనపడుతోంది. ఇంతసేపూ ఆయన మాట్లాడుతున్నారా? లేక ఇదంతా నా ఊహా? నా గుండె బరువెక్కింది. ధారగా జారబోతున్న నా కన్నీళ్ళను ఆపడానికి రెండు వేళ్ళతో కళ్ళు ఒత్తుకున్నాను.

“అమ్మా! అమ్మా! అమ్మా!” కోమల్ ఉన్నట్టుండి, పెద్దగా కేకలు పెట్టారు. ఆయన భార్య వచ్చి, పక్కనే మౌనంగా నిల్చుంది. ఏదో అగ్ని పక్కన నించుని ఉన్నట్టు, ఆమె ముఖం జ్వలిస్తోంది. కోమల్‌గారి సైగననుసరించి ఆయన్ని పట్టుకుని, కొద్దిగా ఓ వైపుకు జరిపింది. అమ్మా, అమ్మా, అమ్మా! అంటూ ఆయన బాధతో అరిచారు. వణుకుతున్న చేతులతో, ఆమె ఆయన భుజాలను పట్టుకున్నారు. దిండు మార్చి, ఒక మాత్ర చేతికందించింది ఆవిడ. మాత్ర మింగి కళ్ళు మూసుకున్నారాయన. అమ్మా! అమ్మా! అమ్మా! అని అరుస్తూనే వున్నారు. ఓ రెండునిమిషాల తర్వాత ఆ అరుపు మూలుగుగా మారింది.

కొంత సేపటి తర్వాత ఆయన కళ్ళు తెరిచి, నావైపు చూసి ‘నువ్వా?’ అన్నట్టు చూశారు. బాధ కొంత తగ్గిందన్నట్టుగా నిట్టూర్పు విడిచి మళ్ళీ మాట్లాడటం మొదలెట్టారు.

“మోహన్! ఆ రోజు కైలాసపర్వతం ఎదుట నిల్చున్నప్పుడు, నాకు నోట మాట రాలేదు. చెప్పేదీ, చేసేదీ ఇంకేమీ మిగిలిలేదు అనిపించింది. అంకెలు వేసి, కూడి, కింద గీత గీసి, జవాబు రాసిన తర్వాత, లెక్క అవసరమేముంది? తుడిపెయ్యొచ్చుగా? అక్కణ్ణించీ అడుగులో అడుగు వేసుకుంటూ, వెనక్కి నడిచాను. ఒక కొత్త పరిచయస్తుడిలా నొప్పి, నెమ్మదిగా నాలోకి మళ్ళీ ప్రయాణించింది. సంతోషం వేసింది. అలా చివరి దాకా మనల్ని వదలకుండా, ప్రయాణం చేసే స్నేహితుడు ఎక్కడ దొరుకుతాడు? ఊళిఱ్ పెరువలి! విధి కంటే గొప్పదైన శక్తి ఏముంది? ఊళ్ఎనుం పెరువలి – గొప్ప వ్యధ అనే గమ్యం. వెనక్కి వచ్చాక బెహెన్జీని అడిగాను – అక్కడ అందరూ ఒక్కసారిగా నా వంక ఎందుకు చూశారు? అని. ఆమె చిరునవ్వుతో చెప్పింది – సాయంసంధ్య వెలుగు ఉన్నట్టుండి, పక్కనున్న రాతి మీద ప్రతిఫలించి మీ మీద పడింది. బంగారు వర్ణ కాంతిలో మీరు మెరిసిపోతున్నారు. మీ తల మీద పెట్టుకున్న కుచ్చుటోపీ బంగారు కిరీటంలా మెరిసిపోతోంది. మా చూపులు మరల్చుకోలేకపోయాము. మీకు ఖచ్చితంగా ఆ కైలాసేశ్వరుడి కటాక్షం వుంది! నా కన్నీళ్ళు, బెహెన్జీకి కనపడనీకుండా, ఒంటి మీదున్న దుప్పటి, తలపైకి లాక్కున్నాను.”

కోమల్‌ మళ్ళీ మౌనం లోకి వెళ్ళిపోయారు. ‘ఇంక సెలవు తీసుకోవాలి’ అనుకున్నాను. అలా ఆలోచన రాగానే, ఆయనకెలా తెలిసిందో, “ఆలస్యం అవుతోందా? సరే అయితే! మళ్ళీ మనం ఎక్కడ, ఎప్పుడు కలుస్తామో తెలీదు కానీ తప్పక కలుస్తాం” అన్నారు చివరిగా కోమల్. అదే కొంటె నవ్వు ఆయన పెదవులపై మళ్ళీ మెరిసింది.

“నిన్న రాత్రి, కిటికీ బయట ఏదో శబ్దం వినిపించింది మోహన్. ఒక చిన్న బఱ్ఱె దూడ చెవులు ఆడించిన శబ్దం వచ్చింది. నిజం… ఆకుల గలగల అయ్యుండొచ్చు. లేదా అది బఱ్ఱె కూడా అయివుండొచ్చు. నాకైతే తెలీదు” పెద్దగా నవ్వుతూ అన్నారు, “మిగతా వాళ్ళు నన్ను భయపెట్టడానికి చూశారు. అదేదో భయంకరమైన జంతువు అన్నారు. కానీ అది చిన్న దూడ… అంతే! చూడ్డానికి ఎంతో చక్కగా వుంది. దాని తల నిమురుతూ ముద్దు చేయాలనిపిస్తోంది!”

నేను కోమల్‌గారి ఇంటి బయటకు అడుగు పెట్టగానే, మధ్యాహ్నపుటెండతో అప్పటిదాకా వేడెక్కిన గాలి, ఒక్క ఉదుటున నా చెవులకు సోకింది. అటూ ఇటూ మెల్లగా ఊయలలూగుతూ చెట్ల నుంచి నేల మీదికి జారి పడుతోన్న ఎండుటాకుల వాసనతో, పొడవుగా పరుచుకున్న నీడలతో సాయంకాలం సమీపిస్తోంది.

తలవంచుకుని ఆ నిశ్శబ్ద ఏకాంతంలోకి నా పయనం మొదలుపెట్టాను.

(మూలం: యాత్ర అనే ఈ కథకు మూలం జెయమోహన్ రచించిన అఱం అనే కథా సంపుటంలోని పెరువలి అన్న కథ. అఱం లోని కథలన్నీ నిజజీవితంలో జెయమోహన్‍కు తారసపడ్డ గొప్ప వ్యక్తుల గురించి రాసినవే. కథలో ముఖ్య పాత్రధారి ప్రముఖ తమిళ నాటక రచయిత, కళాకారుడు కోమల్ స్వామినాథన్. వెన్నెముక కాన్సర్‌తో బాధ పడుతున్న కోమల్ మానస సరోవర యాత్రకు పూనుకోవడమే ఈ కథాంశం. కోమల్ స్వామినాథన్ గారి గురించి మరిన్ని వివరాలు.)


జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దంపట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.