మనసు తరచూ మరో ప్రశ్న వేస్తుంది. ఈ ప్రశ్నకు నా మనసిచ్చే జవాబు – ఖర్చులూ ఫలితాల సంగతి నాకు అనవసరం. ఏదో సాధించాలని నేను ప్రయాణం చెయ్యడం లేదు. ప్రయాణమే నా జీవితం కాబట్టి ప్రయాణాలు చేస్తున్నాను. జీవించడానికి నాకు తెలిసిన ఒకే ఒక మార్గం ప్రయాణం…

సాహిత్యం ఇష్టంగా చదివేవాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉండాలని లేదు. అక్కడొచ్చే లైకులన్నీ రీడర్స్‌‌వి అనుకోవడం మన భ్రమ. కొత్త తరం పాఠకులను ఆకట్టుకోవాలంటే వారి అనుభూతులకి, వారుంటున్న కాలానికి సరిపడే రచనలు రావాలి. ఓ సామాన్య పాఠకుడిగా నేనైతే సీరియస్ కథనాలతో పాటు జీవితంలో సౌందర్యాన్ని, ప్రేమని, ఉత్సవాన్ని, ఆశావాదాన్ని ప్రకటించే రచనలు కూడా విరివిగా రావాలని కోరుకుంటాను.

మరుసటి రోజు పెద్దమ్మ ఉత్సాహంగా కనబడింది. కైండ్ అయిన కోడిని, కాకిని, పనిపిల్ల కుంజమ్మను, కొబ్బరికాయల వ్యాపారి అర్జునన్ నాడార్‌ను, భిక్షం అడుక్కోడానికి వచ్చిన పచ్చతలపాగా కట్టుకున్న ఫకీరునూ వేలెత్తి ఆమె వాళ్ళు కైండ్ అన్నట్టు చూపెట్టింది. ఆ రోజు మేఘాలు కమ్ముకుని ఉండటంతో ఎండ కాయలేదు. చల్లటి గాలిలో సన్నటి నీటి చెమ్మ వ్యాపించి ఉంది.

ఒక్కసారిగా ఊళల శబ్దం, ఉలిక్కిపడి నిద్రలేచా. ఎక్కడనుంచి వచ్చాయో తోడేళ్ళు అమీ చుట్టూ. అక్కడ అమ్మ, గొర్రెలు ఏమీ లేవు. అమీ వాటి వైపు చిత్రంగా చూస్తోంది. అమీ తల ఇంకా పెద్దదైంది. కళ్ళు నీలి రంగుతో వెలుగుతున్నాయి. అమీ ముఖంలో సన్నటి జలదరించే నవ్వు. క్రమంగా అది పెరిగిపోతోంది. నవ్వులా లేదు అది, తోడేలు ఊళలా ఉంది. చుట్టూ తోడేళ్ళు అమీతో పాటే ఊళలు పెడుతున్నాయి. వెక్కిళ్ళు మళ్ళీ మొదలయ్యాయి. తోడేళ్ళు నా వైపు తిరిగాయి.

సాయంత్రం వ్యాహ్యాళికి వచ్చిన బింబిసార మహారాజు, ఆ రోజు గుర్రం దాని ఇష్టం వచ్చిన దారిలో తీసుకెళ్ళినపుడు ఊరు చివర శ్మశానం దగ్గిర తేలాడు. కాలుతున్న శవాలు ఏమీ లేవు కానీ తాను వచ్చినట్టు గమనించాడు కాబోలు ఎవరో అరుస్తున్నాడు, దగ్గిరకి రమ్మని. వెళ్ళి చూస్తే రెండు మూడు రోజుల క్రితం కొరత వేయబడిన ఎవరో నేరస్థుడు. ఆ మనిషి చేతులు వెనక్కి విరిచి కట్టివేయబడి ఉన్నాయి.

స్వామిజీ పరిచర్యకోసం ఈ రామస్వామిని ఉండమని చెప్పి ఇతర శిష్యపరమాణువులు తమ పనులమీద వెళ్ళిపోయారు. రామస్వామి ఆస్తిపరుడు; సద్గుణ సంపన్నుడు; అతిధి సత్కారాలు తెలిసినవాడు. అన్నీ ఉన్నయి. శని స్థానం ఎక్కడ? అన్న విషయం మీదనే అభిప్రాయ భేదం ఉంది. నోట్లో శని ఉందని కొందరంటే, కాదు చెవులో ఉంది అని మరికొందరు. రామస్వామికి చెముడు అని చెబితే తెలిసిన విషయం చెప్పటం ఎందుకు?’ అనే పాఠకులుండవచ్చు.

పట్నాలు – ప్రేమలు: మేము ఇటుపక్క ఒడ్డు మీద ఉన్నాం. ప్రేమ అంటారే, దానిలో మునిగి. ఒకరినొకరు చూసుకుంటూ, తెలుసుకుంటూ, ఒకరి రుచి ఒకరికి వగరుగా, తెలుసుగా నీకు, ప్రేమలో. నా మనసంతా నిండిపోయిన విషాదం, ఒంటరితనం. ఆ సాయంత్రం నదుల ఒడ్డున నీడలు, కొత్త ప్రేమలలో ఉండే విషాదం, ఒంటరితనం. పాతప్రేమల నెమరువేత తెచ్చే విషాదం, ఒంటరితనం, పోగొట్టుకున్నతనం.

డబ్బు సమకూర్చగల అన్ని విలాసాలూ ఆ కారాగారంలో ఉన్నాయి. బహుశా ఈ ల కథెడ్రాల్ జైలు ప్రపంచంలోకెల్లా అతి విలాసవంతమైన జైలయి ఉండాలి. అలాగే ఓ ఖైదీ తనకు తానే నిర్మించుకుని తన వారినే కాపలాగా పెట్టుకొన్న ఏకైక కారాగారమూ ఇదే అయి ఉండాలి. ఎంత తాపత్రయపడినా ఎస్కోబార్‌కు తన స్వంతజైలులోనూ రక్షణ లభించలేదు.

సుందరి దగ్గరికి వచ్చి నిల్చుంది. అరవడం మొదలుపెట్టింది. నేను నాన్న కళ్ళనే చూస్తూ ఉండిపోయాను. ఆయన కళ్ళు క్రూరత్వాన్ని, కోపాన్ని, పశ్చాత్తాపాన్ని ఏకకాలంలో చూపిస్తున్నాయి. నేను మాట్లాడకుండా ఉండడం గమనించిన సుందరి ఇంకా కోపంగా అరిచింది. నాన్న ఇప్పుడు ఉరిమి చూశాడు. ఆయన కళ్ళను చూసే ధైర్యంలేక నేను తలవంచుకున్నాను. ఒళ్ళంతా కరెంటు పాకుతున్నట్టు అనిపించింది. నాన్న కోపంగా లేచి నిల్చుని అరుస్తున్నాడు. సుందరి ఎడమవైపు నిలుచుని అరుస్తుంది.

ఏం ఆశలని అడుగుతాడేమో అనుకున్నా. కానీ అడగలేదు. అతను మౌనంగా ఉండిపోవడం వెనుక నిరసన అర్థమవుతూనే ఉంది నాకు. వెళ్ళేదారిలో రోడ్ పక్కన కారు ఆపి మూర్తి టీ తెచ్చాడు. ఇద్దరం తాగాం. మూర్తి నా ఇష్టాయిష్టాలు ఒక్కటీ మర్చిపోకపోవడం ఎక్కడో కించిత్తు గర్వంగా అనిపించింది. కొద్దిగా మామూలు అయ్యాడు మూర్తి. నాలుగు గంటల ప్రయాణం. ఎర్రగొండపాలెం దగ్గరికి వచ్చాం.

ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం ఎవరో పిలిచారు వాళ్ళమ్మాయి బర్త్‌డే పార్టీకి రమ్మని. అతనికి వెళ్ళాలని లేక మీరు వెళ్ళిరండన్నాడు భార్యాపిల్లలను. జీవితంలో ఒక్క సరదాలేదు ఉత్త దద్దమ్మ అంటూ ఆవిడ సణిగింది, ఇప్పుడీ పిల్లలను తను డ్రైవ్ చేసుకొని తీసుకువెళ్ళాల్సి వచ్చేసరికి. అబ్బా, డాడీ, యూ ఆర్ యూస్‌లెస్ అన్నారు తొమ్మిదీ, పదేళ్ళ కూతుళ్ళిద్దరూ. వాళ్ళు వెళ్ళాక సోఫాలో జారపడి కళ్ళు మూసుకున్నాడు.

కార్తహేన పాతపట్నపు సందుగొందుల్లో మనసుతీరా తిరుగుతున్నప్పుడు ఓ పందిరి బాట, దిగువన బారులు తీరి ఉన్న చిరుదుకాణాలు కనిపించాయి. అందులో ఒక దానిలో కొకాదాస్ బ్లాంకాస్ అన్న మిఠాయిని అమ్ముతున్నారు. తురిమిన కొబ్బరిని రంగురంగుల తియ్యటి పాకంలో ఉడికించి చేస్తోన్న మిఠాయి అది.

రాత్రి పడుకున్నప్పుడు మంచాలను ఎత్తి, అందరూ కిందే చాపలు పరుచుకుని పడుకున్నారు. ఉన్న ఒంటి పరుపును మాత్రం ఒకవైపు వేశారు. ఆ సాకుగా బుజ్జిదీ, పిల్లాడూ అందులో పడుకునేట్టుగా; తనూ, భార్యా పక్కపక్కనే ఉండేట్టుగా ఎత్తువేశాడు రాజారామ్‌. తల్లి ముందటింట్లో మంచం వేసుకుంది. చాలా రోజుల దూరం కాబట్టి, అతడికి ఆత్రంగానే ఉంది. కానీ భార్య పడనియ్యలేదు. బుజ్జిదాన్ని పక్కలో వేసుకుని పడుకుంది.

తాణప్పన్న, లీలక్కతో మాట్లాడుతున్నప్పుడు లీలక్క నాలుగు దిక్కులూ చూడ్డం, అప్పుడప్పుడు ఫక్కుమని నవ్వడం, తలొంచుకోడం నిన్న వాళ్ళు గుడికి వెళ్ళేప్పుడు చూశాను. కప్పకళ్ళోడు “తెలిసిందిలే నెలరాజా…” అని పాడుకుంటూ కొబ్బరి చెట్టెక్కాడు. నన్ను చూసి కన్నుకొట్టాడు. అణంజి వంగి తాణప్పన్నను పరీక్షగా చూసింది. చేత్తో అతని లుంగీ పక్కకు తీసి చూసింది. నేను చేతులడ్డం పెట్టుకుని నవ్వాను. “ఏందా నవ్వు? విత్తనం సత్తువ చూడాలిగా!” అంది అణంజి.

ఆమె ఇంటికి తరచు వెళ్ళడం అలవాటైంది. ఉండేకొద్దీ ఆమెతో కాసేపు గడిపిరావడం బాగా అనిపించేది. అప్పుడప్పుడు తెలీసీ తెలీనట్లు ఆమె చేతివేళ్ళను తాకడం, భుజాన్ని తడుతూ మాట్లాడటం జరుగుతుండేది. అదేదో కావాలని చేసినట్లు కాదు కానీ అలా అవుతుండేది. ఆ మొక్కల మధ్య ఇల్లు అరణ్యంలో ఇల్లులా ఉండేది. అక్కడికి వచ్చినప్పుడు నా ఉనికి ఆ మొక్కలకి నచ్చనట్లు అనిపించేది. అప్పుడప్పుడు ఊపిరాడనట్లు అనిపించేది.

ఒక వేళ రాకపోతే? అప్పుడు తానే పిలవవలెనా అస్పష్ట సమాధానము భయంకరమై ఉండెను. గౌరవ భంగమని పిలవడము వీలు కాదు. అట్లని ఒకతే పండుకోవడమూ సాధ్యం కాదు. వస్తున్న నొప్పులు ఒక్కోసారి ఆమె నిశ్చయాన్ని సడలిస్తుండెను. ధైర్యమును జారుస్తుండెను. ‘థూ, పాడునొప్పి’ అనుకుంటుండగానే నొప్పి తగ్గి ముందు ముందు తాను ఎదుర్కోవలసిన దృశ్యమును కల్పించుకొన్నప్పుడు వళ్ళంతా సిగ్గుతో ముడుచుకుని పోయెను.

ఈ అపార్టుమెంటు బ్లాకులోనే ఓ ప్లాటులో ఆయన చాలా కాలంగా అద్దెకి ఉన్నారు. ఆయన గురించి పనిమనిషి – తాను పని చేసే అందరి ఇళ్ళల్లో చెబుతూ ఉండేది. ఈ పనిమనిషిని పనిలో పెట్టుకోవడానికి ముందు ఆయన పదిమందిని మార్చారట. ఈమెకి ఆయన గురించి చెప్పినతను – ఆయన చాదస్తం గురించి కూడా చెప్పాడట. కానీ ఆమెకు పని అవసరం, పైగా దాసుగారు కూడా తరచూ పనిమనుషులను మార్చి విసిగిపోయారు.

విమానం పైకి ఎగిరినపుడు పైనుంచి కొన్ని ద్వీపాలు కనిపించి పలకరించాయి. ఆ ద్వీపాల మీద అడుగు పెట్టాను, రెండు మూడు రోజులు తిరిగాను అన్న ఆలోచనే నాకు విభ్రమ కలిగిస్తోంది. డార్విన్ జీవపరిణామ సిద్ధాంతానికి శిలాన్యాసం చేసిన ద్వీపాలవి. జీవరాసుల గురించి ప్రపంచపు అవగాహనను సమూలంగా మార్చిన సిద్ధాంతానికి పుట్టినిళ్ళవి.

“కాదు కాదు, అందరూ అలా అనుకుంటారు కాని, ఏఐ అవతార్ అయినా విడాకులకి గ్రౌండ్స్ ఉంటాయి. మీరనుకున్న దానిలో కొంత నిజం ఉంది. చట్టం, 2032 యాక్ట్ ద్వారా చెప్పేదేంటంటే, ఏఐ అవతార్‌లని కేవలం యంత్రాలుగా భావించాలి. అంటే, వాటితో కేవలం శారీరిక సంబంధం అనుకోవాలి.” నేను సెక్స్ డాల్స్ గురించి చెప్పడానికి సందేహించాను. “కానీ, ఆ వ్యక్తి ఆ అవతార్‌ని నిజం మనిషిలాగ చూస్తే, చట్ట ప్రకారం విడాకులకు కారణం అవుతుంది.”

ఫ్రాంక్‌కి బహుశా అరవై ఏళ్ళు ఉంటాయేమో. ‘దేని సౌందర్యమైనా దాని ఆత్మలో ఉంటుంది ఫ్రాంక్’ అంటే గట్టిగా నవ్వేవాడు. ‘ఆత్మలో సౌందర్యం, హృదయంలో సౌందర్యం, శరీరంలో సౌందర్యం ఇవన్నీ ఒట్టి మాటలు శ్యామా. సౌందర్యమంటే ఒకటే, అది నీకు సౌందర్యంగా కనపడటం మాత్రమే’ అంటాడు. ‘బ్యూటీ ఈజ్ ఇన్ ది బిహోల్డర్స్ ఐస్ అన్న మాట’ అంటే, ‘కాదు. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ది బిహోల్డర్స్ లైఫ్, మూడ్, అండ్ ఛాయిస్’ అంటాడు.