అలనాటి యువ కథ: స్వామీజీ

“నేనీ పూట భోంచెయ్యను… అర్ధశేరు ఆవు పాలు, ఒక కొబ్బరికాయ పంపించండి” అన్నారు స్వామిజీ.

“మీరీ గ్రామం వేంచెయ్యటం మా భాగ్యం” అన్నాడు రామస్వామి.

స్వామిజీకి కొంచెం కోపం రాగా, ఆ కోపం ఎందుకు వచ్చిందని కొంచెం ఆశ్చర్యపడ్డారు.

“నేనీ పూట భోంచెయ్యను…” అన్నారు స్వామిజీ మళ్ళీ.

రామస్వామి స్వామిజీ ముఖ కవళికల మార్పును గుర్తించి అటువంటి భావాలే అతని ముఖంలో గూడా ప్రతిబింబింపచేసి “చిత్తం…” అన్నాడు.

స్వామిజీకి ఈసారి కోపం రాలేదు. ఏడుపు వచ్చింది. ఏడవగూడదని ఊరుకున్నారు.

“నేను చెబుతున్నది మీకు వినబడుతున్నట్లు లేదు…” అన్నారు స్వామిజీ.

“అవునవును” అన్నాడు రామస్వామి.

రాత్రి ఎనిమిది గంటలు కావస్తున్నది. స్వామిజీ పరిచర్యకోసం ఈ రామస్వామిని ఉండమని చెప్పి ఇతర శిష్యపరమాణువులు తమ పనులమీద వెళ్ళిపోయారు. రామస్వామి ఆస్తిపరుడు; సద్గుణ సంపన్నుడు; అతిథి సత్కారాలు తెలిసినవాడు. అన్నీ ఉన్నవాడు. శని స్థానం ఎక్కడ? అన్న విషయం మీదనే అభిప్రాయ భేదం ఉంది. నోట్లో శని ఉందని కొందరంటే, కాదు చెవులో ఉంది అని మరికొందరు అనేవారు. రామస్వామికి చెముడు అని చెబితే ‘నీ కేమన్నా చాదస్తమా… తెలిసిన విషయం చెప్పటం ఎందుకు?’ అనే పాఠకులుండవచ్చు. ఎవరి మనసు నొప్పించటం నా ఉద్దేశం కాదు. అతనికి చెముడు నిజంగా లేదని, ఏదన్నా తిడితే వెంటనే వినబడుతుందనీ కొంతమంది అంటారు. నిజం రామస్వామికి, అతన్ని సృష్టించిన బ్రహ్మదేవుడికి మాత్రమే తెలియాలి.

ఏది ఎలా ఉన్నా స్వామిజీ ఇరకాటంలో పడ్డాడు. బిగ్గరగా చెబితేనేగాని అతనికి వినబడదు. ‘ఏమయ్యోవ్… నాకు అర్ధశేరు పాలు కావాలి… పావుశేరు తేనె కావాలి…’ అని ఏ ముఖం పెట్టుకుని బిగ్గరగా అరిచి చెబుతాడు? సర్వసంగ పరిత్యాగి, అన్ని కోరికలు వదులుకున్న వారు అని అందరి నోళ్ళా పడె. సన్యాసికయినా క్షుద్బాధ తప్పింది కాదు మరి. పరువు కోసం పొట్ట మాడ్చుకోవాలి. వరండాలో ఎవరో పెద్దమనుష్యుల్లాంటి వాళ్ళు కొంతమంది కూర్చున్నారు. లేకపోతే బిగ్గరగా చెప్పేవాడే. ఈ వ్యవహారం ఇట్లా కాదు… అనుకుని వర౦డాలో కూర్చున్న ఒకాయనను పిలిపించి “ఈ పూటకు నేను భోజనం చెయ్యను. ఆమాట ఈ రామస్వామిగారితో చెప్పండి” అని వాక్రుచ్చాడు. ఆయన నోట్లో శంఖం పెట్టుకుని స్వామీజీ భోజనం చెయ్యని సంగతి చెప్పాడు. రామస్వామి ‘చెయ్యరూ…’ అంటూ ఆశ్చర్యం ప్రకటించాడు.

స్వామీజీ అర్ధనిమీలిత నేత్రాలతో వాత్సల్యం కురిపించి తల ఊపారు, ఒక నిమిషం అట్లాగే ఉన్నారు.

“మరి ఫలహారమేదన్నా తీసుకోరూ?’ అంటే ‘ఫలహారం ఏమీ వద్దండీ… అర్ధశేరు పాలూ, వగైరాలు కావా’లని చెబుదామనుకున్నాడు. కాని వాళ్ళడిగితేనా?

రామస్వామి ఆశ్చర్యంనుంచి తేరుకున్నట్లు కనబడి “మరి… కొంచెం పాలు పుచ్చుకుందురుగాని” అన్నాడు. స్వామిజీ వెంటనే అందుకుని తనకు ఆ పూటకు కావలసిన ఫలాహారం వివరాలు చెప్పేశాడు. రామస్వామి ఆ వివరాలన్నీ వరండా లోని పెద్దమనిషి ద్వారా విని ఆయన చేతిలోనే డబ్బు పెట్టి ఆ పాలు, వగైరాలు తెమ్మని పంపాడు.

ఆ వెళ్ళినవాడు ఎంతవరకు తిరిగి రాలేదు. రామస్వామి పదిగంటల దాకా ఆగి “స్వామీజీ పాలకోసం వెళ్ళిన వాడు తిరిగి వస్తుండవచ్చు. నేనీలోపున భోజనం చేసివస్తాను…” అని చెప్పి వెళ్ళిపోయాడు.

స్వామిజీ కరుణామయులు. ఎవరి మనసు నొప్పించటం ఇష్టం లేదు. పరుల మనసు నొప్పించటానికి ఇష్టపడనంత దయార్ద్ర హృదయులు, తన హృదయాన్ని మాత్రం ఎలా నొప్పించగలరు? చూరువంక చూశారు. ఎలుకలు తిరుగుతున్నాయి. కడుపులో ఏదో దేవినట్లయింది. ఇప్పుడు పాల కోసం వెళ్ళినవాడు తిరిగి రాక, రామస్వామీ తిరిగి రాకపోయినట్లయితే తన గతేం కావాలి? ఆపద్బాంధవా! అనాథ రక్షకా! అన్యథా భావించక నా సంగతి చూడవయ్యా దేవుడా! అనుకున్నారు. దేవుడు అద్దం ఫ్రేములో కూర్చుని చిరునవ్వు నవ్వాడు.

స్వామీజీ లేచి నిలబడ్డారు. వరండా లోకి వచ్చి చూశారు. ఎవరూ లేరు. నిరామయంగా ఉంది. కుక్క ఒకటి కొబ్బరి చిప్ప నోట కరుచుకుని పారిపోతున్నది. స్వేచ్ఛాజీవి అనుకున్నారు స్వామీజీ. పిల్లి ఒకటి పరుగెత్తుతున్నది.

కాలు కాలిందేమో తెలియదు. కుక్కను చూసి భయపడిందేమో? స్వామీజీ ఏకాగ్రచిత్తంతో చూశారు. పిల్లి నోట్లో ఏదో ఉంది. ఇంకొంచెం పరిశీలించి చూశారు. అతని హృదయం జల్లుమంది. రామ! రామ! ఇటువంటివి చూడగూడదు అనుకుని పిల్లికి చెలగాటం అంటే ఇదే కదా అనుకున్నారు.

పదిగంటలు దాటింది. స్వామీజీకి పాలు రాలేదని కాలం ఆగిపోతుంది కనకనా! స్వామీజీ అయినా మానవ మాత్రుడే గదా! ఆకలి వెయ్యటం మానుతుందా! ఆకలి ఎక్కువవుతున్న కొద్దీ సత్తు, చిత్తు విషయముల మీదకు మనసు మళ్ళించాలని ప్రయత్నించారు. కొంచెం ఆలోచనా పరంపర పెరగటం సత్తు, చిత్తుల సమన్వయం ఆకలి దగ్గర ఆగిపోవటం; ఇలా జరుగుతూ వచ్చింది.

స్వామిజీ మళ్ళీ వరండాలోకి వచ్చి చూశారు. స్తంభంమీద చెయ్యి వెయ్యబోతూ చీమలబారు చూసి ఆగిపోయారు. ఆ బారు ఇంటిలో నుంచి ఉంది. చీమలు నోట పంచదార తునకలు కరుచుకుని మెల్లగా లైనులో పోతున్నాయి. ఆ చీమలకు పెట్టిన దేవుడు నాకుగూడా పెడతాడని అనుకోబట్టే కదా ఇంతవరకు వచ్చింది అనుకున్నారు స్వామీజీ. చీమలవంక చూస్తుంటే వారి కళ్ళ వెంట నీళ్ళు తిరిగినాయి.

పదిన్నరయింది.

ఆవు అంబా అనటం వినపడి స్వామీజీ, కునికిపాట్లనుంచి ఒక్కసారి ఉలిక్కిపడి లేచారు. పాలు తెస్తానని వెళ్ళాడుగాని ఆవును తోలుకు వస్తానని అనలేదు గదా! ఈ గోమాత అరుపు జాలిన బడింది. కలయో! వైష్ణవ మాయయో! అనుకున్నారు. వాకిట్లోకి వచ్చి చూస్తే అదేమీ కాదని తేలింది. ఎదురింటి వారి దొడ్లో ఆవు గడ్డి మేస్తూ మేస్తూ ఒకసారి అంబా అంది. అంతే. అక్కడే మరొక ఆవు నెమరువేస్తూ పడుకుంది. ఈ ప్రపంచంలో అన్ని జీవరాసులు ఏదో ఒకటి తింటూనే ఉన్నాయి. మానవజన్మ అన్ని జన్మల్లోకల్లా ఉత్తమమైనది. వాక్కు, జ్ఞానము ఇచ్చాడు అని తను అనేకసార్లు చెప్పాడు. అంతా తలలూపారు.

తనకన్నీ ఇచ్చాడు. ఇంత తిండిగూడా ఇస్తే సరిపోయేదిగదా! అనుకున్నారు. ఈ రాత్రివేళ ఏమిటి చేసేది? ఎవరిని పోయి అడగాలి! స్వామీజీకి కడుపు మంట ఎక్కువయింది. వరండాలో నుంచి గదిలోకి, గదిలో నుంచి వరండా లోకి చాలాసార్లు తిరిగారు. నీరసంతో పాటు ఇలా తిరగటంతో ప్రాణాలు డస్సి పోయినాయి. ఆకలికి నిద్ర గూడా రాలేదు. అలాగే తెల్లవార్లూ జాగారం చెయ్యక తప్పింది కాదు. ‘అన్నీ వదులుకున్నానుగాని… ఈ ఆకలిని వదులుకోలేక పోయానుగదా! ఇంతకీ నాదంటూ ఏమీ లేకపోవటం వలనగదా ఈ ఇక్కట్టు వచ్చింది…’ అని పశ్చాత్తాప ధోరణిలో ఆలోచించారు.

తెల్లవారొచ్చింది. కాలకృత్యములు తీర్చుకుని మళ్ళీ జింక చర్మం మీద ఆసీనులయి భక్తులను స్వీకరించి ఆశీర్వదించటానికి ఉద్యుక్తులయ్యారు.

పాలకోసం వెళ్ళినవాడు అప్పుడు వచ్చాడు. స్వామీజీ మనసు అప్పుడు ఎలావుందో చెబితే వారికి అపచారం చేసినట్లు అవుతుంది. ఆ వచ్చిన వాడిని నమిలి మింగి ఆకలిబాధ తప్పించుకుందామా! అన్న ధోరణిలో ఉన్నారు. ఆయన స్వామీజీకి సాష్టాంగపడి నమస్కరిస్తుంటే స్వామీజీ మెల్లిగా ఆయనను లేవతీశారు. అలా లేవతీసిన తర్వాత చాచి చెంపమీద కొడదామన్నంత ఆవేశం కలిగింది స్వామీజీకి. ‘పాలు తీసుకుని రాలేదేం…’ అనన్నా అడిగి, తీసుకు రానందుకు చీవాట్లు పెడదామనుకున్నారు. అందుకు ధైర్యం చిక్కలేదు.

“రాత్రి పాలు బాగున్నాయా…” అని అడిగాడు ఆయన. స్వామీజీ ముక్కుపుటాలు ఎగిరినాయి. కనుబొమలు ఎగిరినాయి. పెదిమలు ముడివడ్డాయిగాని, మీసగడ్డాల కింద ఉండటం వలన దర్శనం కాలేదు. ఆ ఆగ్రహం నిగ్రహించుకుని, కోపం దిగమింగి “రాత్రి పాలు ఎవరూ తీసుకురాలేదు” అన్నారు శాంతంగా. ఆ శాంతం ఎలా ఉందయ్యా అంటే పగిలిపోయేముందు అగ్నిపర్వతంలాగా, గాలివాన వచ్చేముందు ఆకాశంలాగా.

“మా అబ్బాయికిచ్చి పంపాను మీకోసం… తేనెగూడా పంపాను…” అన్నాడు ఆయన. స్వామీజీ కోపం ఆయన మీద నుంచి, ఆయనగారి అబ్బాయి మీదకు మళ్ళింది.

“అబ్బాయి ఎక్కడ?” అన్నారు స్వామీజీ.

“నేను కనుక్కుని వస్తానుండండి స్వామీజీ…” అంటూ ఆయన అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు. స్వామీజీ అతను వెళ్ళిపోయిన వంకనే తీక్షణంగా చూశాడు. గుడ్డి కొంగలు ఆ దారిలో లేకపోవటం వలన స్వామీజీ ప్రభావం అక్కడివారికి అర్థం కాలేదు. భక్తబృందం ఎక్కువైపోయింది. అందరికి విభూతి, కుంకుమ ఇస్తున్నారు స్వామీజీ. వచ్చేజనం ఏ మాత్రం తరిగేటట్లు కనబడటం లేదు. అంతా కొబ్బరికాయలు, అరటిపళ్ళు తెచ్చి సమర్పిస్తున్నారు. వాటన్నిటినీ ప్రసాదం కింద చేసి అందరికి అక్కడే పంచి పెట్టటం ఆచారం.

స్వామీజీకి వాటన్నిటిని చూస్తుంటే భక్తబృందాన్ని కాసేపు వరండాలో కూర్చోమని చెప్పి కాసిని అరటిపళ్ళు భుజించుదామని కోరిక కలిగింది. అన్ని ప్రభావాలుగల స్వామీజీ ఆ మాట ఎట్లా అనగలరు? వచ్చి సాష్టాంగపడి అంతా కాళ్ళకు మొక్కి దొంగ దణ్ణాలు పెట్టి వాళ్ళ బాధలు నివారణ చేసుకునే వాళ్ళేగాని, ఒక్కరయినా ఆప్యాయంగా ‘స్వామీజీ, రాత్రి భోజనం చేశారా?’ అడిగే వాళ్ళున్నారా? ఛా! ఎందుకు ఈ మర్యాదలు. తిన్నావా, చచ్చావా, అని అడిగే దిక్కుగూడా లేని పరిస్థితి అయిపోయింది. ఇంతకంటే సంసారుల్లో కలిసిపోవటం నయం అనుకున్నారు స్వామిజీ.

ఆ సమయంలో రామస్వామి కనపడ్డాడు. ఆయనతో ఏదన్నా చెప్పటం గుడ్డివాడికి అద్దం చూపించటంలా అవుతుంది అనుకున్నారు స్వామిజీ.

కడుపులో కాలిపోతోంది. భక్తులు తరిగేటట్లు లేరు. ‘నాకు ఆకలేస్తోందర్రోయి…’ అంటూ ఒక పొలికేక పెట్టాల్సినంత ఆవశ్యకత ఉంది. అభిమానం అడ్డువస్తుంటే ఏమిటి చెయ్యటం?

స్వామిజీని ఆవూరు రావలసిందిగా ఆహ్వానించిన రామశేషయ్య స్వామిజీ దగ్గరకు వచ్చి ఆయన పాదాలు స్పృశించి “మీరాక వలన మాగ్రామం పునీతమయింది!” అన్నారు.

“అంతా భగవదేచ్ఛ…” అన్నారు స్వామీజీ.

“ఈ రోజు ఏకాదశి. మీకు ఫల ప్రయత్నాలు జరుగుతున్నాయి. భక్తులు వెళ్ళిన తర్వాత దయచేద్దురుగాని…” అన్నాడు రామశేషయ్య భక్తి పురస్సరంగా.

‘నాకు ఫలహారం వద్దు… ఆకలి వేస్తోంది… అన్నమే పెట్టండి’ అందామనుకున్నారు స్వామీజీ. కాని ఏమీ మాట్లాడకుండా చిరునవ్వు ముఖం పెట్టారు! ‘అట్లాగే’ అన్నట్లు.

చిరునవ్వు ముఖం పెట్టామని స్వామీజీ అనుకున్నారు కాని చూసిన వాళ్ళకు ‘అన్నమో రామచంద్రా!” అని బావురుమని ఏడుస్తున్నట్లుంది.

(ప్రథమ ప్రచురణ: ఏప్రిల్ 1960. సేకరించిన అన్వర్‌కు కృతజ్ఞతలతో – సం)