నిద్ర లేచి మరోసారి చనిపోయాన్నేను.
నాలో జీవం ఉందని ఎదుటివాడికి ఉత్సాహంగా తెలియజేసే నా మెలకువ, నా వైపు తిరిగి మాత్రం ఖచ్చితంగా నీలో ఏ జీవం లేదని తెగేసి చెబుతుంది. ప్రతి రోజూ!
బతికే ఉన్నాననడానికి శ్వాస తీసుకోవడమొక్కటే సరిపోతుందని ఎవరైనా వాదిస్తే నేనేమీ చెయ్యలేను. వాళ్ళ వైపు నమ్మలేనట్టు చూడటం తప్ప.
“దిక్కుల్జూడమాక, బాత్రూం ఖాళీగుంది. టక్కునెల్లు. స్కూలు టయం. పిల్లలు లైన్గడితే ఇంకో గంటాగాల!” చీపురు పట్టుకుని ఎదురుగా నిల్చునుంది నీల.
ఎంత జీవితం ఇమిడుందో ఆమెలో! లేదు, కొన్ని జీవితాలకు శరీరాలు చాలవు. బైటికి పొర్లి, పొగలు కక్కుతూ, మత్తుగా పారే లావాలవి. ఆమెతో దహించబడ్డ ఓ అనాథ శకలాన్ని నేను.
ఆ నాలుగిళ్ళ చివరకి తొంగి చూశాను. ఉన్న రెండు బాత్రూముల్లో ఒక దాని తలుపు తెరిచుంది. సెకండ్లో వెయ్యోవంతు సేపు నాలో మెరిసిన సంతోషం. వెంటనే కుదిపేసే బాధ. నేను సంతోషించే కారణాలు ఇంతకి దిగజారినందుకు ఆ వెనకే అసహ్యం! ఇవేమీ పట్టనట్టుగా నన్ను చకచకా లాక్కెళ్ళి తన పని తను జరిపించుకుంటోంది నా శరీరం.
‘దరిద్రపెదవా, మీ మిస్సు వారం కితం రిపోర్ట్ కార్డిత్తే, నువ్విప్పుడ్సూపిత్తన్నా!’ ఓ తల్లి గదమాయింపు.
‘మీ అన్న యాడబడితే ఆడకొచ్చి గొడవజేస్తే ఈ సారి బాగుండజ్జెప్తున్నా.’ ఓ భర్త బెదిరింపు.
‘సెక్క పకోడీ కింద మాడగొట్టిసచ్చావా, గాడిదకొడకా! మార్కెట్లో ఏ నా కొడుక్కొంటాడ్రా?’ బండి సతీశ్ బాధ.
బాత్రూంలోకే లైవ్ న్యూస్! ప్రపంచమంతా ఆ నాలుగు కొంపల్లోనే కూరుకుపోయినట్టు.
తిరిగెళుతుంటే హఠాత్తుగా ఆ మాటల్లో పచ్చిదనం తగ్గింది. గొంతుల్లో కరుకుదనం మెత్తబడింది. మొహాల్లో కోపం సడలింది. ఎప్పుడూ అంతే. వాళ్ళందరూ కరెక్టే ఇక్కడ. నేనే తప్పు. నేనెక్కడ ఒప్పు అనే అన్వేషణలోనే ఈ జీవితకాలం గడిచిపోయేట్టుంది.
ఇంట్లో నీల రెడీగా ఉంది, క్యారేజ్ బ్యాగేసుకోని. అసలామె పేరు నీల కాదు! ఓ ఆదర్శ స్త్రీ స్పర్శ కోసం వెతుక్కుంటున్న సమయంలో చటుక్కున నా ముందు మెరిసిన ఆమెని చూసి అప్రయత్నంగా నేనన్న పేరు. ‘బాగుంది’ అంది ఆమె. బహుశా మా పెళ్ళయ్యాక, ఆమె పేదరికపు ఆనవాళ్ళు చెరిపేసే మొదటి మెట్టు ఆ పేరే అనుకుందేమో. పాపం! అదొక్కటే మిగిలింది చివరికి.
“నిన్నా నిదరపట్టలేదా?” అంది కుచ్చిళ్ళు సర్దుకుంటూ.
తల సగం అడ్డంగా ఊపాను.
“బైటికెల్లు, కొత్త అయిడియాలు రావాలంటే, అటీటు తిరగాలిగా.” అంది నా భుజాన్ని చేత్తో రాస్తూ.
“వెళ్తాలే, కొంచెం రాసుకుని పొద్దున.”
“సర్లే, నేను రాత్రన్నం బెట్టుకున్నా. నీ టేబిల్ మీన ఆమ్లెట్ బెట్టా. తిను. కుక్కరింకో విజిలొచ్చుద్ది. ఆపేస్కో. టైవైంది ఎల్లొస్తా.” అంది కళ్ళలోకి చూస్తూ.
నేనేమీ తలూపలేదు. చిన్నగా కూడా.
వెళ్ళిపోయింది.
చూస్తూ నించున్నా బాధలోకి ఒరిగిపోతున్న ఆమె ముఖాన్ని. వెనకనుండే.
చిన్న చిన్న శిక్షలు నావి.
వీలైతే చంపేయాలనిపిస్తుంది నీలని. ఇన్నేళ్ళుగా నన్నెందుకు భరిస్తోందో అర్థం కాదు. ఆమెదంతా స్వార్థపు మంచితనం. అసలు మంచితనమంటేనే స్వార్థం. నేనైతే ఎప్పుడో తన్ని తరిమేసేవాడిని నన్ను!
అందుకే నా నవలలో ఆమెనో విలన్‌గా పెట్టాను. ఎందుకలా? ఏమో, అన్నిటికీ సమాధానాలుండవు. తయారుచేయలేం.
లాప్టాప్ ఓపెన్ చేశాను. సగం క్రాక్ ఇచ్చిన స్క్రీన్ మీద పేరుకుపోయిన దుమ్ము, ఎండ పడి బంగారు రంగులో మెరుస్తోంది. అక్షరం కనపడట్లేదు. అదే మంచిది, ఎలాగూ ఆ అక్షరం ముందుకి కదలదు. ‘నీలో ఆ స్పార్క్ పోయింది’ అన్నాడొకడు ఏడాది క్రితం. అసలా స్పార్క్ ఎందుకొచ్చిందో అని చిరాకు నాకు. నాలో పడిన పదాల కుంభవృష్టులు, వాక్యాల ఝరీప్రవాహాలై, పేజీల జలపాతాలుగా మారి, నలభై కథలని, రెండు నవలలనీ సాహితీ సముద్రంలోకి తీసుకెళ్ళి వంపాయి. ఒకప్పటి మాట. చుట్టూ పర్వతాల్లా పేరుకున్న ఇసుకదిబ్బలు తప్ప, పిల్ల కాలువలు కూడా కనపడవిప్పుడు!
సృజన నిజంగానే ఎండిపోతుందా? ఇంకా ఎంత మిగిలుందో ఏదైనా స్కానింగ్‌కి దొరుకుతుందా? విజయాల్లేకపోతేనే బావుండేదనిపిస్తుంది నాకు. ఆ వెనకే దాగున్న అపజయాల్నీ నిర్లక్ష్యాల్నీ ఎదుర్కోలేని ఓ డొల్ల ఎమోషన్ విజయం! మనుషుల్ని బలహీనులుగా మాత్రమే తయారు చేయగలిగే ఓ మత్తు అత్తరు విజయం.
ఉయ్ షుడ్ ఆల్ ఫెయిల్ గ్లోరియస్లీ!
‘కయ్య్…’ కుక్కర్ విజిల్. దరిద్రపు కుక్కర్! దీన్ని బైటపడేస్తే కానీ లైఫ్ బాగుపడదు. పొద్దునా, రాత్రీ, పొద్దునా, రాత్రీ… విజిల్, తిండి, విజిల్, తిండి…
పనికొచ్చేవీ, పని చేసేవీ ఎప్పుడూ బోర్ కొడతాయెందుకో!
మొబైల్ తీశాను. సిగరెట్ మత్తు నుండి బైటపడటానికి ఎక్కువ టైమ్ పట్టలేదు దీనిలో కూరుకున్నాక. కొత్త పోస్ట్‌లు, అభిప్రాయాలు, రివ్యూలు, అభిప్రాయాల్లాంటి రివ్యూలు, మార్కెటింగ్ కోసం కృతజ్ఞతల పోస్ట్‌లు, అభినందనలు, ఆవేదనలు, ఆక్రోశాలు, ముఠా గొడవలూ… అదో ప్యారలల్ ప్రపంచం. ఆ ప్రపంచాగ్నికి నేను సైతం ఓ సమిధనయ్యాననే ఆక్రోశం దహిస్తోంది. ఇదేనా ఇన్నేళ్ళగా నేను సంపాదించిన, సంపాదించగలిగిన సర్కిల్?
వాట్ ఎల్స్ యామ్ ఐ ఎక్స్‌పెక్టింగ్? అదీ మనుషుల నుండి!
మొబైల్ పక్కన పడేసి, ఆమ్లెట్ నోట్లో కుక్కుకుంటూ బైటికొచ్చాను. ఇంటి ఎదురు పిట్టగోడల్లేని డాబా మీది అమ్మాయి డ్యాన్స్ రీల్స్ చేసుకుంటోంది. మొబైల్‌తో వీడియో తీసుకోడానికి కష్టపడుతోంది. నా వైపు చూసింది. చెయ్యూపాను ‘నేను రానా’ అన్నట్టు. వద్దంది, చెయ్యి గుండెకి అడ్డం పెట్టుకుంటూ. రెండు నెలల క్రితం వాళ్ళ నాన్నే వచ్చి అడిగాడు హెల్ప్ చెయ్యమని. ఫోన్లో ఆమె రీల్స్ రికార్డ్ చేసి పెట్టేవాడిని. రెండు మూడు రీల్స్ తరువాత తనే వచ్చి వద్దన్నాడు. నీల ఏం అనలేదు, అనుకోలేదు.
ఎవడికీ అక్కర్లేదు లేదు నేను. ఈ అమ్మాయికీ, నా పాత పబ్లిషర్స్కీ, ఆ స్క్రిప్ట్ రైటర్‌కీ…
“ఆ రైటరో పరమ చెడ్డవాడు, మనిషే కాదు” అన్నాడెవడో. నాకాశ్చర్యం. పరమ చెడ్డవాడు కాబట్టే కదా వాడో మనిషవ్వగలిగాడని?!
లోపలికొచ్చాను ఆవేశంగా. అరవయ్యో పేజీలో కదులుతోంది కర్సర్ నా ల్యాప్‌టాప్‌లో. నా హీరో, అతని లవర్ ఇద్దరూ రొమాంటిక్‌గా ఒక బీచ్‌లో, వెన్నెల్లో కూర్చుని ఉన్నారు. ఎలాగైనా ఆ రోజు ప్రపోజ్ చేసెయ్యాలని ఉంది ఇద్దరికీ, కానీ అడుగు ముందుకేసే ధైర్యం లేదు. నాకూ లేదు! నోట్స్ చెక్ చేసుకున్నాను. ఎవరు ప్రపోజ్ చేస్తే తరువాత కథ ఎటు మారుతుందో వేసుకున్న స్కెచ్‌లు చూశాను. కానీ అవేవీ సీన్‌ని ముందుకి నడపట్లేదు.
అక్కడ కావలిసిన భావావేశంలో నా దగ్గర భావమూ ఆవేశమూ రెండూ లేవు. ‘ఏవి తల్లీ నిరుడు కురిసిన పద సమూహములూ…?!’ నిస్సహాయత. కానీ నేనే తల్లినీ నమ్మనే? అంతా నేనే చేసుకోగలను, నేను మాత్రమే చేసుకోగలను అనే ధైర్యం ఉన్నప్పుడెవరినీ నమ్మనన్నాను. లోకం వేసే సప్త ‘ఎ’ కారాలనీ ఎదిరించగలిగే నా బలమైన ప్రాకారాలన్నీ కాలంతో పాటే నిర్వీర్యమైపోయాయి. ‘నేను నమ్మను’ అనే నమ్మకం తప్ప ఇంకేం మిగిల్లేదిప్పుడు నా దగ్గర.
మూర్ఖుణ్ణని తెలిసినా ఏం చెయ్యలేని జ్ఞానిని ఏమనాలి? ‘మూర్ఖజ్ఞాని’ అనా?
ఇంకొన్ని రీల్స్ చూశాను. నవ్వాను, ఏడ్చాను, సానుభూతి చూపించాను. ఇవన్నీ నేను జనాలతో చేయించాలనుకున్నవి. ఎదుటివాడు ఇంత అవలీలగా చెయ్యగలుగుతున్నది, నేనెందుకు చెయ్యలేకపోతున్నాననే ఈర్ష్యని నా రక్తం, శరీరంలో నలుమూలలకీ మెల్లగా చేరుస్తోంది. ఈర్ష్యకో ముఖం తొడిగితే, పది తలల రావణుడే అందంగా కనపడతాడేమో.
కొంతమందిని అన్ ఫాలో చేశాను. కొంతమందికి లైక్ కొట్టాల్సి ఉన్నా ఇగ్నోర్ చేశాను. ఇంకొంత మందికి తప్పు ఎమోజీతో సమాధానం పెట్టాను. నవ్వాల్సిన చోట ఏడుపు, ఏడవాల్సిన చోట నవ్వు. అదో తృప్తి. అదో శిక్ష. బ్లడ్ ఈర్ష్య లెవల్స్ తగ్గించుకోడానికి.
చివరికి ఆమె ప్రొఫైల్ దగ్గర ఆగాను. రోజూ జరిగేదే. ప్లెజర్ హంట్! దాన్ని నేను వేటాడను, అదే నన్ను వెంటాడుతుంది అనుక్షణం. ఏ నిగ్రహాలూ ఆపలేవు దాన్ని.
నా సుఖం, నా ధర్మం. సమాంతర ప్రపంచాలవి. దేని అర దానిదే.
ఆమె పెదాలంటే ఇష్టం నాకు. కాదు నడుము. కాదు గొంతు, దాని మీద పుట్టుమచ్చ! ఇవన్నీ ఇష్టమే ఆమెలో. ఇంకొన్ని కూడా. కానీ అవేవీ నాకంత సుఖాన్నివ్వవే? ఇంకా ఏదో కావాలి ఆమెలోంచి నాకు. ‘అసలామె ఎలా ఉంటుంది?’ అని నా ఊహల్లో గుర్తు తెచ్చుకోవడానికి కూర్చున్నప్పుడు, నాకు స్థిరంగా గుర్తొచ్చేవి ఆ కళ్ళే. ఆమె మాటా గుర్తొస్తుంది అప్పుడప్పుడూ. ఆ వంకరలూ, సాగదీతలూ… లీలగా వినిపిస్తాయి కానీ క్షణంలో మూగబోతాయి. ఆ కళ్ళు మాత్రం నాలోకి స్పష్టంగా చూస్తాయి. ఆమె అంటే ఆమె కళ్ళే. చిక్కటి ఆడతనాన్ని నింపుకుని, నన్ను అమాంతం వాటిలోకి లాక్కునే నల్లసముద్రాలవి. వాటిని సూటిగా చూడలేక అల్లాడతాను నేను. అటూ ఇటూ పిచ్చి చూపులు చూస్తూ.
జన్మలో ఒక్కసారైనా దగ్గరగా, గాఢంగా చూడగలనా వాటిని? ఆమెని దగ్గరగా పొదివి పట్టుకుంటూ, ఆ కళ్ళు తప్ప ప్రపంచమేదీ లేదని చెప్పకుంటూ?
కళ్ళని ఇష్టపడినంత మాత్రాన నాదేమీ ప్రేమ కాదు, స్వచ్ఛమైన వ్యామోహమే. మగ కళ్ళతో ఆడ ఒంటినే కాదు, కంటిని చూసినా కాముకత్వమే అంటుందీ లోకం. కానీ కళ్ళలో ఏముంటుంది కాముకత్వం?! ఏమో, ఆమెకి కనబడుతుందేమో నా కళ్ళలో. బహుశా ఆ ఎదురింటి మేడ మీది అమ్మాయికి కూడా!
“తిన్నావా!” నీల నుంచి కాల్.
దీని తిండి గొడవేంటి?
“లేదింకా”
“తాలింపెట్టుకో, మర్చిపోమాక. ఉప్పు జూస్కోనేస్కో.”
“చీరలేమైనా అమ్మావా…?” మొక్కుబడి ప్రశ్నలుంటాయి నా దగ్గర.
“పొద్దున జరీ చీరల సెక్షన్లో ఉండే అక్క రాలే. బాలేదనుకుంటా ఒంట్లో. నన్నెళ్ళమన్నారు మా సార్!”
“ఓ, నైస్…”
“రెండు పెద్ద చీరలమ్మా. బా జేస్తన్నావన్నారు. ఈడకి మారిస్తే బావుండిద్ది!”
“ఎక్కువొస్తుందా…?”
“మరి! మూడు వేలెక్కువ జీతం, పెద్ద చీరలకి కమీషన్ గూడిస్తారు. ప్రొప్రైటర్గారు చూస్తే బావుండు.”
“సరే ఉంటా.”
పెట్టేశాను. ఇవీ ఆమె ఆనందాలు. ఇవే!
ఆమె మీద అసహ్యం ఏమాత్రం తగ్గలేదు. కానీ తను లేకపోతే నాకసలు గడవదే… ఏంటిలా ఆలోచిస్తున్నాను! నా రాతలు వేరు, నేను వేరు. రచయితగా బతుకుతూ, మనిషిగా పతనమవ్వడం. రెండిటిలోనూ ఏకసూత్రంగా బతకడానికి నేనేమైనా చలాన్నా? తెలివైనవాణ్ణి.
మెడ నెప్పిగా ఉంది. మొబైల్ పక్కన పడేసి, నా నోట్‌బుక్ అందుకున్నాను. కొన్నైనా వాక్యాలు గెలికితే కానీ తినకూడదనే పంతం! తిరగేస్తుంటే పాత నోట్స్ కళ్ళపడ్డాయి. ఆ రచయితెవడో తెలుసుకోవాలన్న కుతూహలం. పేజీలు తిప్పాను. ఎంత బాగున్నాయో కొన్ని పేరాలు! ఆ భాష, ఆ శిల్పం, ఆ ఫ్లో… వాడేవడో… నేను కాదు! ఛాన్సే లేదు. ఏమీ తెలియనప్పుడున్న స్వచ్ఛత ఇప్పుడు లేదు. ప్రతిరోజూ కొత్తగా పుడతాం, నిన్నటి వాడికి ఆవగింజంత భిన్నంగా. ఆ గింజలన్నీ కలిసి, కొండలా మారి నన్ను ముంచాయి. మెదడు మారలేకుండా చేయగలిగే టెక్నాలజీ ఉంటే బావుండు.
చటుక్కున చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ‘నా నవల ఇది, కొన్ని ఐడియాలివ్వు?’ అడిగాను దాన్ని. నాకిదలవాటే. అద్దెకైనా తెలివి దొరుకుతుందేమోనన్న ప్రయత్నం. ఎప్పటిలాగే చచ్చు సమాధానాలిచ్చిందది. నాకు నచ్చింది అదలా చెయ్యడం. వెయిట్! నాకు నచ్చాలనే అది కావాలని చెత్త సమాధానాలిస్తోందా? అయితే అది మేధావే. ఎవడైనా బాధలో ఉంటే, వాడికన్నా బాధ పడిన సందర్భాలు, వాడికన్నా వెధవలా ప్రవర్తించిన విషయాలూ చెప్పడం. ‘సెల్ఫ్ డెప్రికేషన్’ యాటిట్యూడ్. అది మనిషికే సొంతం. దాన్నీ కృత్రిమ మేధ తనలో ఇంకించుకుందంటే… ఇది మింగేస్తుంది అందర్నీ మెల్లగా! నా ఆలోచనల్ని పసికట్టినట్టుందది. సర్దుకుని ‘నీ హీరో ఇలా ప్రవర్తించవచ్చు…’ అనేదో చెప్పబోతోంది. హఠాత్తుగా మూసేశాను దాన్ని. గుండె వేగంగా కొట్టుకుంటోంది.
నాలో మిగులున్న ఒకే ఒక్క ఆనందం – నాలోంచి తవ్వితీయగలిగిన వాక్యం. దాన్ని కూడా తాకట్టు పెట్టలేను. నాకు నేను అర్థం కాను.
“అంకుల్! అంకుల్!” ఎదురింటి అమ్మాయి పిలుస్తోంది.
గేటు బైటికెళ్ళాను.
“వీడియో తీస్తావా?” అంది అసహనంగా చూస్తూ.
లో నెక్ టాప్, వైట్ స్కర్ట్‌లో తల పైకి పెట్టి గజిబిజిగా చూస్తున్న నెమలిలా ఉంది.
మొహంలో స్పష్టంగా కొట్టొస్తున్న వల్నరబిలిటీ!
తలుపేసి ఆమె వెనకే మెట్లెక్కి పైకెళ్ళాను.
చకచకా ఎక్కేసింది తను, నా చూపులు ఎక్కువ సేపు ఓ చోటే పడనీయకుండా.
“ఎలా తియ్యాలి?” అనడిగాను ముభావంగానే పైన.
“ఈ రీల్ చూడంకుల్, కెమెరా రౌండ్‌గా తిప్పుతా షూట్ చేశారు. సేమ్ ట్రై చెయ్!”
దగ్గరగా వచ్చింది, చుట్టూ తిరుగుతోంది. నాకు ఊపిరాడట్లేదు.
కొన్ని ట్రైల్స్ చేశాం. రకరకాల ఫిల్టర్స్, యాంగిల్స్, మ్యూజిక్! ఆ గంటసేపు ప్రపంచం గుర్తుకురానంతగా.
మధ్యమధ్యలో తను నన్ను చూసింది. నా కళ్ళెక్కడ పడుతున్నాయో చూసింది. కొన్నిసార్లు సర్దుకుంది, చాలాసార్లు వదిలేసింది.
“థాంక్సంకుల్, నేను ఎడిట్ జేస్కుంటాలే రాత్రికి!” అంది చివరికి మొబైల్ మురిపెంగా చూస్కుంటూ.
నేను వెనక్కి వెళుతుంటే తల పైకెత్తి “డాడీకి చెప్పబాక అంకుల్, ఫీలౌతాడు” అంది.
“చెప్పన్లే” అని నవ్వి మెట్లు దిగుతున్నప్పుడెందుకో నా వెనకే దిగింది హడావిడిగా.
“ఇలాంటియేస్కుంటే గానీ ఫాలోవర్స్ చూడరంకుల్” అంది తన డ్రెస్సు వైపు చూపిస్తూ.
నేనడగలేదే ఈ జస్టిఫికేషన్?
“ఇంకా చానా రీల్స్ చెయ్యాలి. నీల ఆంటీ షాపోళ్ళు, చీరల రీల్స్ నాకే ఇస్తామన్నారు.”
“ఓ కంగ్రాట్స్! ఐ విల్ హెల్ప్ యూ, డోంట్ వర్రీ”
“అంకుల్…”
సందేహిస్తూ ఆగింది. ఏంటన్నట్టు తలూపాను.
“ఏమనుకోకు, సన్‌గ్లాసెస్ పెట్టుకోవా ఈ సారి నుండి? నాకూ ఫ్రీగా ఉంటది.”
నా రక్తం ఒక్కసారిగా గడ్డకట్టింది. ‘నువ్వు చూస్కో దరిద్రుడా! నాకు మాత్రం తెలియనివ్వకు.’
వేల కొరడాలు ఒంటిని చీరేస్తున్న నొప్పి. ‘నీ సహాయం కావాలిరా నీచుడా!’
కాళ్ళు తడబడుతున్నాయి గేటు నుండి బైటికి కదులుతున్నాయి. ‘ముసుగులో చేసుకో నీ చూపుల వ్యభిచారం.’
తల తిరిగిపోతోంది.
ఇన్నాళ్ళూ నన్ను దట్టమైన పొరలతో చుట్టేసి, విడదీయలేని కవచంలా కాపాడిన నా అహంకారం, ఈ రోజు నగ్నంగా రోడ్డుమీద వదిలేసింది. అది నా అస్తిత్వం. అదే నా వనరు. ఏమీ చెయ్యదే? ఇదో పెద్ద ద్రోహం!
ఇంట్లో పడ్డాను వచ్చి.
చేతి వేళ్ళే తీశాయి కుక్కర్ నుంచి అన్నాన్ని. కలుపుతున్నాయి మెల్లగా, నోట్లో పెడుతున్నాయి. ఓ మొద్దుబారిన కొయ్యలా చూస్తున్నాను వాటిని.
మెల్లగా మసకబారుతున్నాయి అవి కూడా. కళ్ళ నుండి ఉప్పు నీళ్ళు రాలి కంచంలో పడుతున్నాయి. ఉప్పు సరిపోవాలనేమో నీల చెప్పినట్టు. ఇప్పుడు నోరూ అందుకుంది కళ్ళు మొదలుపెట్టిన రాగాన్ని. నేనేం అడ్డుపెట్టలేదు వాటికి. అదో క్లీనింగ్, పేరుకున్న మురికిని కడిగే కెథార్సిస్.
లేచాను మెల్లగా. చేతులు కడిగాను. ఏదో తేలిక. నేరం చేసి పట్టుబడిపోయినప్పుడొచ్చే తేలిక! ల్యాప్‌టాప్ ముందు కూర్చున్నాను.
“తిన్నావా?” నీల నుండి కాల్.
“ఊఁ” నోరు ఒణుకుతోంది.
“నెక్స్ట్ మంతు నన్నీ కొత్త సెక్షన్లో యేసి చూస్తారంట, బాజేస్తే పర్మనెంట్ అవ్వుద్ది!”
“హుఁ…”
“రాస్కున్నావా ఎవన్నా?”
“ఆఁ…”
“నూ రాస్కో, బిర్యానీ పార్సిల్దెస్తా, నీకిష్టంగా!”
“ఊఁ…”
ఓ రెండు క్షణాలాగింది.
పెట్టేసింది.
సెలక్ట్ ఆల్, డిలీట్! మొత్తం కథ చెరిపేశాను ల్యాప్‌టాప్‌లో. రెండేళ్ళ కష్టం, రెండు క్షణాల్లో… పూఫ్… అసలది నా కథే కాదు, ఓ బరువు.
ఖాళీ కాగితం మీద కర్సర్ ఓపిగ్గా ఎదురుచూస్తోంది…
వేళ్ళలోకి పుట్టుకొస్తున్న పచ్చి ధైర్యం… టైప్ చేస్తున్నాను… మొదటి వాక్యం…
దయా గేటు బైటికొచ్చి, తన కాస్ట్లీ సన్‌గ్లాసెస్‌ని రోడ్డు మీద పడేసి కసిగా కాలితో తొక్కుతున్నాడు…