మార్థహళ్ళి నాకు ఇష్టమున్నా లేకున్నా మా అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌తోపాటు నన్నూ నిద్ర లేపుతుంది. మంచానికి ఆ చివర అటుతిరిగి పడుకునే నా ఛార్టెడ్ అకౌంటెంట్ శ్రీమతిగారికి (బెడ్డు మీద ఆ నాలుగు నిముషాల తరువాత కూడా ఆవిడకు మొబైల్లో నెంబర్స్ చూసుకోవడంలో వున్న ఆనందం నా భుజం మీద తల ఆనించి పడుకోవడంలో ఉండదు మరి.) నిద్రాభంగం కలగకుండా మంచం మీదనుంచి జారి బెడ్రూమ్లోంచి బైటకు వస్తాను. అమెరికన్ కంపెనీ కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్. ప్రాజెక్ట్ మేనేజర్ని కాబట్టి ఇస్త్రీ చొక్కా ఉంటే చాలు జూమ్ మీటింగ్‌లో కనిపించడానికి, కింద లుంగీ ఉన్నా, షార్ట్స్ ఉన్నా, అసలేమీ లేకపోయినా. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టీ ఏరోజైనా ఇంటిపనుల డ్యూటీ నాదే. అంట్లు కడగడం, కాఫీ పెట్టడం. శ్రీమతికి బెడ్డు మీదకి అందించడం. ముఖం చిట్లించుకుంటూ ఆమెగారు లేచి విసవిస బాత్రూములోకి దూరి బైటకు వచ్చేలోపే టిఫిన్ చేయడం. వారు వచ్చి గబ గబా సేవించి ఆఫీసుకి వెళ్ళడం! ఆ లోపు నాకు నా ఫోనులు, మెసేజులు!
మా మెయిడ్ చెప్పా పెట్టకుండా సెలవులు పెట్టడం మరీ ఈ మధ్య ఎక్కువైపోయింది. ఎప్పుడు వస్తుందో తెలీదు. ప్రతి నెల మూడో తారీఖున మట్టుకు తప్పకుండా వస్తుంది. జీతం తీసుకోవడానికి. అంతే! ఆ తరువాత ఆవిడ దయ మా ప్రాప్తం. దానితో ఆవిడ రాకపోకలు స్ప్రెడ్‌షీట్ మీద మల్నాడు కొండల శిఖరాలలాగా ఎగుడు దిగుడుగా కనబడుతుంటాయి! దానితో మా ఇద్దరికి విపరీతమైన స్ట్రెస్ పెరిగిపోయి కౌన్సిలర్‌కి నెల నెలా వేలకి వేలు సమర్పించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి నెంబర్లు అలా అస్తవ్యస్తంగా వుంటే మా ఆవిడకి సరిపోదుగా అందుకని ఒక శుభ ముహుర్తాన, ‘యు ఆర్ టెర్మినేటెడ్’ అని ఆ మెయిడ్‌ని పంపేసింది. దానితో ఇంట్లో పనులు నామీదకు వచ్చిపడ్డాయి.
ఆపైన నా శ్రీమతి అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో, ‘మెయిడ్ వాంటెడ్’ అని ప్రకటించింది. అక్కడితో ఆగకుండా తన ఆఫీసు క్లయింట్స్‌కి కూడా చెప్పేసింది. ఒక మూడు వారాల తరువాత నా శ్రీమతిగారి క్లయింట్ ఒకరు కబురంపించారు. మా ఆవిడ వెంటనే వారికి ఫోన్ కొట్టింది. రెండు నిముషాలలోపే మా ఫ్లాట్ కాలింగ్ బెల్లు గణగణమని మోగింది.
నేను తలుపు దగ్గిరకి వెళ్ళేలోపే మా ఆవిడ సోఫాలో నుంచి ఒక గెంతు గెంతి తలుపు దగ్గిరకి చేరింది. తలుపు తెరిచింది. ఎవరని చూశాను. మనిషి ఎలావుంటుందో అని కుతూహలం కొద్దీ మెడ సాచి మరీ చూశాను.
“రామ్మా, రా” అంటూ మా ఆవిడ గొంతులోంచి ప్రేమ ఒలికిస్తూ అంటుండగా ఆమె మా హాల్లోకి అడుగు పెట్టింది. మా ఆవిడకన్నా పొడుగరే! నల్లటి ఒత్తెన జుత్తు. కోల మొహం. మెరుస్తున్న కళ్ళు. చామనఛాయ. సన్నగా, నాజుకుగా వుంది. అందంగా వుంది. నేను చలించిపొయ్యాను. మీరే చెప్పండి! ఒక మొగవాడు అందమైన ఆడదాన్ని చూసినప్పుడు చలించకుండా వుండగలడా? అలాంటివాడుంటే గింటే ఏ హిమాలయాల్లోనో వుండాలి. మనమధ్యెందుకు? ఏ మాటకామాటే! ఆ అమ్మాయి అందం ముందు… అనకూడదు కాని నా భార్య అందం దిగదుడుపే! అందుకని అప్పటికప్పుడే ఒక నిర్ణయానికి వచ్చేశాను. వెంటనే పకడ్బందీగా ప్రణాళిక కూడా రచించుకున్నాను. ఇక ఈ అమ్మాయి వచ్చిందిగా అందుకని మా ఆవిడ ఇదివరకన్నాకూడా తొందరగా ఆఫీసుకు వెళ్ళిపోవడం మొదలుపెట్టింది. ఆఫీసు నుంచి రావడం కూడా అంతే! ఆలస్యంగా వస్తోంది.
నేను వర్కింగ్ ఫ్రమ్ హోమ్ కదా. బోల్డెంత టైముంది. ఆ అమ్మాయితో జోకులేస్తూ, కాఫీ తెమ్మని కేకేస్తూ, వేళ్ళు తగిలిస్తూ, ఆమె భుజాలకి నా భుజాన్ని రాస్తూ, అవసరం వున్నా లేకున్నా తన పనుల్లో కల్పించుకుంటూ తనతో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాను. తనకి కూడా ఇష్టమయ్యిందనుకుంటా, తను కూడా దగ్గిరయ్యింది. ఇద్దరం ఒకరికి ఒకరం ఎంత దగ్గిరయ్యామంటే ఇద్దరం రిక్లైనర్‌లో పక్క పక్కనే కూర్చునేంత. అంత దగ్గిరయ్యి ఆగిపోలేదు. ఆ శుక్రవారం ఇంకా దగ్గిరైపోదామనుకున్నాను.
కాని శుక్రవారం ఉదయం ఆ అమ్మాయి రాలేదు. మధ్యాహ్నం కూడా రాలేదు. ఫోన్ చేస్తుంటే జవాబు లేదు. కాలుకాలిన పిల్లిలాగా ఫ్లాటులోనే ఆ గదిలోనుంచి ఈ గదిలోకి ఈ గదిలోనుంచి ఆ గదిలోకి తిరుగుతున్నాను. లంచ్ టైమ్ కూడా దాటిపోయింది. కాని నా మనసు నిండా ఆమే! నా కళ్ళనిండా ఆమే! నా దృష్టంతా తలుపు మీదే! గడియ వెయ్యడం, తియ్యడం. తలుపు ముయ్యడం, తెరవడం అంతా చికాకుగా వుంది. గడి తీసేసి తలుపు ఓరగా వేసి దానివంకే చూస్తూ అలా నా రిక్లైనర్‌లో కూర్చుండిపొయ్యాను.
నిదానంగా ఆ అమ్మాయి నా దగ్గిరకు వచ్చింది. తన రెండు అరచేతుల్లోకి నా మొహాన్ని అందుకుంది. మల్లెపూల గుబాళింపు! ఆ పరిమళానికి మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా నడుం మీద చేతులానించుకుని చిరునవ్వుతో నన్ను చూస్తున్న నా సుందరాంగి! మా పనిమనిషి! చెయ్యి జాచి తనని అందుకున్నాను. నా ఒడిలోకి లాక్కున్నాను. తన అధరాలను అందుకున్నాను. అదే తొలిసారిగా ఆమెని ముద్దు పెట్టుకోవడం. అదే చివరిసారి కూడా ఐపోయింది నా ఖర్మ కాలి!
తలుపు దగ్గర భద్రకాళిలాగ నా భార్య!
“నీకు అదే దొరికిందా! ఆ ముసల్దే కావాల్సివచ్చిందా? ఏమే నీకు నా మొగుడే దొరికాడా? నిన్ను నమ్మి ఇల్లు వదిలి వెళ్తే ఇదా నువ్వు చేసే పని! ఎర్రగా, బుర్రగా వున్నాడని నా మొగుడికే వల వేస్తావుటే! ముసల్దానా?” అంటూ ఇంకా చాలా అనరాని మాటలు, అనకూడని మాటలు, అసందర్భపు మాటలు అంది. కాని అవన్నీ ఈ కథకి అనవసరం.
మా ఆవిడని ప్రసన్నం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. చివరకు ఎలాగోలాగ ‘క్షమించాను ఫో’ అని అనిపించుకున్నాను. తను అంత సులువుగా నన్ను క్షమించెయ్యడం నాకు చాలా ఆశ్చర్యం కలుగజేసిందనడంలో సందేహమేమీ లేదు! కాని అసలు విషయం అది కాదు. మా పనిమనిషిని ‘ముసల్దానా’ అని తిట్టడమే నాకు ఆశ్చర్యం కలిగించింది.
తను ప్రశాంతంగా ఉన్నప్పుడు నెమ్మదిగా అడిగాను, “ఔనురా… ఆ పనమ్మాయి వయసులో నీ కన్నా కూడా చిన్నది కదా దాన్ని ముసల్దానా అని తిట్టావేమిటి?” అని.
“ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ బుర్ర దొబ్బిందా? దాని వయసుకి అది నీకు ఏ అవ్వో బామ్మో అవుతుంది తెలుసా? ముడతలు పడ్డ దాని మొహం అదీను! దాని నెరిసిపోయిన జుత్తు, దొడ్డికాళ్ళు కనపడటంలేదా నీ కళ్ళకి?”
ఆ ప్రశ్నలకు నా దగ్గిర జవాబు లేదు. ఏదో మనసు వికలమైపోయి అలా అంటోంది. కొన్ని రోజుల్లో అన్నీ సర్దుకుంటాయిలే అనుకున్నాను.
నా వైవాహిక జీవితాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి మా పనిమనిషితో నా వ్యవహారానికి ఫుల్స్టాప్ పెట్టెయ్యాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుత పరిస్థితుల్లో పనమ్మాయిని మానిపించడం మంచిపని కాదని కూడా నా శ్రీమతీ నేనూ అనుకున్నాం.
మరో సంఘటనతో నేను నా భార్య విషయంలో మరి కొంత ఆందోళన పడాల్సివచ్చింది… మా పాప విషయంలో జరిగిందది.
మా పాపతో మా పనిమనిషి అనుబంధం పెరిగింది. ఆ రోజు ఆదివారం. భోజనం చేసిన తరువాత బాసిపట్టు వేసుకుని కూర్చుని పాపని తన వొడిలో పడుకోబెట్టుకుని జోలపాట పాడుతోంది తను. అది వింటూ పాప నిద్రపోతోంది. టైమ్ చూస్తే ఒంటిగంట. ఆవిడ జోలపాట వింటూ నేను కూడా నా రిక్లైనర్‌లో నిద్రలోకి జారుకున్నాను. మెలకువ వచ్చిన వెంబటే గడియారం వంక చూస్తే నాలుగు చూపిస్తోంది. పనమ్మాయి ఇందాక ఒంటిగంటకి ఎలా కూర్చునుందో అదే భంగిమలో వుంది. ఒడిలో మా పుత్రికారత్నం అలాగే నిద్రపోతోంది. నా దృష్టి పనమ్మాయి పాదాల మీద పడింది. అవి వెనక్కి తిరిగున్నాయి.
ఆఁ!
కళ్ళు నులుముకుని మళ్ళీ చూశాను. మాములుగానే వున్నాయి. మా పాప పాదాల వంక చూశాను. అవి కూడా వెనక్కి తిరిగి ఉన్నాయి! అయ్యో అదేమిటి! కళ్ళు గట్టిగా నులుముకుని మళ్ళీ తన పాదాలని చూశాను. మాములుగానే వున్నాయి. తన మొహంలోకి చూస్తే పెదాల మీద చిరునవ్వు! ఆ పెదాల మధ్య కోరగా వున్న దంతాలు!
టీ తాగుతున్నప్పుడు మా ఆవిడతో, “నువ్వుండగా పనమ్మాయి మన పాపని ఒడిలో గంటలు గంటలు అలా పెట్టుకుని జోల పాట పాడటం మంచిది కాదమ్మాయ్” అన్నాను.
నా వంక ఒక పిచ్చి చూపు చూసింది. “నీకేమన్నా పిచ్చి పట్టిందా? మనకి పాప ఎక్కడుంది? చూస్తుంటే నీ పిచ్చి బాగానే ముదిరినట్టుంది. నిన్ను డాక్టర్ దగ్గిరకి తీసుకెళ్ళి చూపించాలి!”
“ఏం మాట్లాడుతున్నావమ్మాయ్! నువ్వు మెలకువగానే ఉన్నావా? నిద్రపోతున్నావా? ఎప్పుడూ ఆ ఆఫీసు, డబ్బులు, లెక్కలేనా? కాస్త ఇంటి సంగతులు పట్టించుకో! నీకో ఏడాది కూతురుంది. దాని ఆలన పాలన నాతో పాటు నువ్వు కూడా చూసుకోవాలన్నది గుర్తు పెట్టుకో! ఇక నుంచి ఆఫీసుకి పదింటికెళ్ళు. ఐదింటికల్లా ఇంటికి వచ్చేయి. ఇంటికి వచ్చిన తరువాత ఆఫీసు గురించి మర్చిపో. రెస్టు తీసుకో. ఇంట్లో నువ్వున్నంత సేపు మన పాపని నువ్వే చూసుకోవాలి!”
“ఔనా? అలాగా? సరే… మన పాప పేరేమిటి? చెప్పు? ఈ మధ్య నీకు ఊహాగానాలు ఎక్కువైపోతున్నాయి. ఈ రోజు ఆ ముసల్ది రాలేదు. రానని నాకు వాట్సాప్ మెసెజ్ పెట్టింది. ఇంకో మాట. ఇలాగైతే నీతో సంసారం చెయ్యడం కష్టం! నువ్వు నీ పిచ్చి తగ్గించుకో. లేకపోతే నేను విడాకులకి అప్లై చేసుకుంటా!”
నా బుర్రనిండా ఒకటే ఆలోచనలు. కాని ప్రశ్న మాత్రం ఒక్కటే. ఎలా? మా జీవితంలో అత్యంత ముఖ్యమైనది మా పాప. బంగారు తల్లి! దానిని మర్చిపోవడమా? మా ఇంట్లో, మా ఇద్దరి చుట్టూ జరుగుతున్న విపరీతమైన సంఘటనలని గమనిస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది…నా భార్యకి మతిభ్రమణం మొదలయ్యిందని!
“మాట్లాడవేం? మన పాప అంటున్నావుగా? ఎలాంటి జుత్తు దానిది? దాని ముక్కు ఎలాగుంటుంది? ఎవరి పోలికలు దానివి? ఎక్కడ పుట్టిందది? దాని పుట్టిన రోజు ఎప్పుడు? మన పాప… మన పాప అని ఒకటే సతాయిస్తున్నావుగా? మరి నీకు కనపడితే నాకు కనపడాలిగా! దాన్ని కన్నదాన్ని నేను? మరి నాకు కనపడదేం?” అలా ప్రశ్నలమీద ప్రశ్నలు గుప్పించింది.
నా నోరు తెరిచాను జవాబిద్దామని. నా నోరు అలా తెరుచుకుని వుండిపోయింది. ఏది? ఒక్కటీ గుర్తు రావడం లేదు. తను అడిగిన వాటికి దేనికీ సమాధానం గుర్తు రావటం లేదు! ఏమయ్యింది నాకు? నాకు కూడా మతి పోయిందా?
నా వంక తను చూస్తున్న చూపులు… కోపంగాను… ఆశ్చర్యంగాను… నేను పిచ్చివాడినైపొయ్యాను అని తనకి తాను నిర్ధారించుకుంటున్నట్టున్న చూపులవి! నేను ఆ చూపులు భరించలేను! నేను నోర్మూసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం మీద వాలాను. కాస్త నా మెదడుకి విశ్రాంతి ఇవ్వాలి. ఇవ్వాలంటే నిద్ర కావాలి, రావాలి! అలా పడుకుండి పొయ్యాను! నా భార్య అవతలి గదిలోకి వెళ్ళి విసురుగా గడేసుకున్న చప్పుడు వినిపించింది. నేను నిద్రలోకి జారుకున్నాను.
మూడో ఘటనతో మా జీవితాలలో పెద్ద దుమారం లేచింది.
దబ దబ తలుపులు బాదుతున్న చప్పుడుతో లేచాను. నా బెడ్రూమ్ తలుపులు ఎవరు బాదుతోంది! వెళ్ళి తలుపులు తెరిచాను. ఎదురుగుండా నా భార్యామణి.
“నేనెళ్ళిపోతా! నేనీ ఇంట్లో వుండలేను!” అని ఏడుస్తూ పిచ్చిగా అరవడం మొదలుపెట్టింది. కావలించుకుని, “ఏమయ్యిందే పిచ్చిదానా?” అని అనునయిస్తూ అడిగాను. అపర భద్రకాళిలాగా నా మీదకు లేచింది!
“ఏమిటి? నేను పిచ్చిదాన్నా? నేను కాదు పిచ్చిదాన్ని! నీకే పిచ్చి! నువ్వే పిచ్చోడివి…” అంటూ శోకాలు మొదలుపెట్టింది. అలాగే తనని పొదివిపట్టుకుని వాష్ బేసిన్ దగ్గిరకు తీసుకెళ్ళి చల్లని నీళ్ళతో ముఖం కడిగాను. తన ఏడుపు తగ్గిన తరువాత ఒకొక్కటిగా నెమ్మదిగా తనతో చెప్పించాను.
రాత్రి తను పక్క గదిలోకి వెళ్ళి పడుకుందా! అలాగే నిద్ర పోయిందట! తరువాత ఎప్పుడో ఎందుకో మెలకువ వచ్చి చూస్తే గోడమీద మా పనిమనిషి తన రెండు చేతుల్ని కాళ్ళలాగా వాడుతూ, నాలుగు కాళ్ళతో నా భార్య వంకే చూస్తూ ఆ గోడమీద నుంచి ఈ గోడమీదకి, ఈ గోడమీదనుంచి ఆ గోడమీదకి పాకుతూ కనపడిందట, జుత్తు విరగబోసుకుని మరి. కళ్ళు చింతనిప్పులాగా ఎర్రగా వున్నాయట! తను తలుపు తెరిచేటప్పటికి తను పడుకున్న గదిలో నుంచి నా గదిలోకి వచ్చిందట. నా భార్యకి పిచ్చి ముదిరిపోయిందన్నది నాకు అర్థమైపోయింది.
తనకి తెలియనిదేమిటంటే, మా పాపని నా బెడ్ పక్కనే ఉయ్యాలలో పడుకోబెట్టామన్నది తను మరిచిపోయింది. ఒక రాత్రి పూట దాని ఏడుపుకి నాకు మెలకువ వచ్చింది. చూస్తే ఎదురుగుండా వాల్ క్లాక్‌లో టైమ్ రెండు చూపిస్తోంది. పాపని సముదాయించడానికి ప్రయత్నించాను కాని దాని ఏడుపు ఆపలేకపొయ్యాను. ఇక అప్పుడు ఇక లాభం లేదని పనిమనిషికి వాట్సాప్ చేశాను. పాప ఏడుపు ఆపటం లేదు, వచ్చి కాస్త దానిని నిద్రపుచ్చమని చెప్పాను. మళ్ళీ ఆ అర్ధరాత్రి పూట ఆ మెసేజ్ చూస్తుందో లేదోనని అనుమానం వేసింది. అందుకని ఫోన్ చేశాను. పలికింది. వచ్చింది. పాపకి జోల పాట పాడి నిద్రపుచ్చింది. ఆ పాటతో నేను కూడా నిద్రలోకి జారుకున్నాను.
ఇదంతా మా ఆవిడకి పూస గుచ్చినట్టు చెప్పా.
నా వంక పిచ్చి చూపులు చూస్తూ,”నీకు కూతురు లేదు! నాకు కూతురు లేదు. మనకే కూతురూ లేదు. కొడుకు అంతకంటే లేడు. కాని మనకు ఉన్నది ఇప్పుడు ఒక్కటే! పిశాచి! దయ్యం! అది మనిద్దర్ని పట్టుకుని పీడిస్తోంది. మన ఇంట్లోనే తిష్ట వేసింది! నువ్వు వుండాలనుకుంటే ఈ ఇంట్లో వుండు! నేను మాత్రం వుండను! నేను పోతున్నా!”
అలా అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి తన సామన్లు, బట్టలు అన్ని రెండు సూట్‌కేసుల్లో సర్దుకుని ఏడుస్తూ బయటికి పరుగెత్తుకుంటూ వెళ్ళిపోయింది.
ఆ రాత్రి నేను మంచం మీదకి చేరిన తరువాత చాలాసేపు నిద్ర పోకుండా ఆలోచించాను. నాకు ఋజువులు కావాలి. దేనికంటే… నా భార్యకి పిచ్చెక్కిందని చెప్తే వాళ్ళూ వీళ్ళు నమ్మాలిగా! అదొక్కటే మార్గం నాకు పిచ్చెక్కలేదని వాళ్ళని నమ్మించడానికి కూడా! కదా! అంతే కాదు. ఇటీవలి కాలంలో నా ఇంట్లో జరిగిన సంఘటనల మూలంగా నా మీద నాకే నమ్మకం సడలిపోతోందేమోనని డౌటు కూడా వేస్తోంది. అందుకని నాకు పిచ్చెక్కలేదని, నా మైండు పోలేదని నేను నా మీద నమ్మకం కుదుర్చుకోవాలంటే తిరుగులేని ఋజువులు కావాలి.
నా ఫోన్ ఓపెన్ చేసి ఔట్‌గోయింగ్ కాల్స్ లిస్ట్ చూశాను. అందులో పనిమనిషి ఫోన్ నెంబర్ కోసం చూశాను.
లేదు.
నా వాట్సాప్ మెసేజెస్ చూసాను. నేను పంపిన మెసేజ్ వుంటుంది కదా అందులో.
లేదు.
నా ఫోనులో అసలు నా పనిమనిషికి సంబంధించిన ఎటువంటి వివరాలు లేవు.
నా అసహాయత మీద నాకే కోపం వచ్చింది. నన్ను నిరాశ, నిస్పృహలు ముంచేస్తున్నాయి. నిద్రపోవాలి. నిద్రపోతే వాటికి దూరంగా వుండగలుగుతాను. లేచేటప్పటికి కాస్త ధైర్యం వస్తుంది. అప్పుడు సరిగ్గా ఆలోచించగలుగుతాను. అలా అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాను.
మెలకువ వచ్చింది. ఎవరో ఏడుస్తున్నారు. గుక్క తిప్పుకోకుండా ఏడుస్తున్నారు. గోడమీద గడియారం ఒంటి గంట అయ్యిందని చూపిస్తోంది. ఏడుస్తున్నదెవరా అని పక్కకి తిరిగి చూశాను.
పాప!
ఉయ్యాలలో గుక్క తిప్పుకోకుండా ఏడుస్తోంది.
పనిమనిషికి ఫోన్ చెయ్యాలి.
తప్పదు.