అజ్ఞాతవాసి

సికింద్రాబాద్ స్టేషన్ నుండి మరో మూడు నిమిషాలలో రైలు కదలబోతోంది. కిటికీ అవతల శైలు. ఇవతల కంపార్ట్‌మెంట్‌లో నేను. దిగులు తను మనసులో దాచుకున్నట్లు నేను దాచలేను.

ఓదార్పుగా చూసింది. “ఊరికే ఆలోచించకు. తోచనప్పుడు ఏదైనా చదువుకో, లేదా కవితలు వ్రాసుకో.”

సాహిత్యమంటూ, కవితలంటూ తనని పట్టించుకోనని గొడవ చేసే నా శ్రీమతి ఇప్పుడు వ్రాసుకోమని సలహా ఇచ్చింది. నవ్వి సరే అన్నట్లు తల ఊపాను. ట్రాన్స్‌ఫర్ తప్పనిసరి అయిన బ్యాంక్ ఉద్యోగిగా, ఈ నగరానికి దూరంగా వెళ్ళడం నాకు తప్పదు. ఇంటర్ చదువుతున్న పిల్లాడిని వదిలి శైలు నేనుండబోయే ఊరికి వచ్చే అవకాశం లేదు.

‘ట్రాన్స్‌ఫర్ అని విన్నాను. ఏ ఊరు? ఎప్పుడు వెళ్ళడం?’ సూర్య నుండి మెసేజ్. ఊర్లు, దేశాలు తిరుగుతూ యాత్రాకథనాలు రాసే వాడికి బహుశా ఆ ఊరి గురించి కూడా తెలిసే వుంటుంది. జవాబిచ్చాను.

‘చాలా చిన్న ఊరు. అక్కడ నీకున్నవి రెండే రెండు ఆకర్షణలు. ఒకటి సముద్రం. రెండు ప్రముఖ రచయిత మహంతి!’ సూర్య నుండి రిప్లయ్. నా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని ఎమోజీల రూపంలో గుప్పిస్తూ ‘నిజమా?!’ అని అడిగేలోపున మరో మెసేజ్. ‘వారి అమ్మాయితో కొద్దిగా పరిచయం. వివరాలు కనుక్కుని చెపుతాను.’

కేవలం పదిహేను కథలు, మరో ఇరవై కవితలు మాత్రం వ్రాసి – ఆపైన పాతిక ఏళ్ళకి పైగా ఒక్క వాక్యమూ వ్రాయని తెలుగువారి ఆరాధ్య రచయిత శ్రీకాకుళంలో ఓ చిన్న ఊర్లో వుండటమేమిటి?! ఏదైతేనేం ఆ పల్లెలో ఒక్కడినే ఎలా గడపాలా అన్న దిగులు కాస్త తగ్గింది. ఇప్పుడిప్పుడే కవిగా నిలదొక్కుకుంటున్న నాకో మార్గదర్శి దొరికినట్లే అనిపించింది.

రైలు కదిలింది. ఫ్లాట్‌ఫామ్‌ పైన చెయ్యి ఊపుతూ శైలు కనుమరుగైంది. మూసుకున్న కంటిరెప్పల వెనుక చెమ్మ చేరింది.

నా రచనకి ప్రేరణ నీవేనని నేనెన్నడూ చెప్పలేదు!
నీ భుజాన నేనుంచిన బాధ్యతల కావడి, బరువని నువ్వేనాడు అనలేదు!
కంటి భాషతో స్పర్శాసంకేతాలతో సమస్త ఖాళీలు పూరించుకునే మనం
ఇక ఈ దరిన నీవు – ఆ దరిన నేనై మాటల వంతెనొకటి నిర్మించుకుందాం…


బ్యాంకునుండి అయిదింటికి తిరిగి వచ్చి, సాయంత్రాలు వాకింగ్ అంటూ బయలుదేరి – నాలుగు వీధులూ తిరిగి, ఊరి చివర ఆటస్థలానికి వెళ్ళేవాడిని. అక్కడ దూరాన కనిపిస్తున్న సముద్రం కేసి చూసి… చూసి… చూసి… ‘అసలు నేనెవరు? ఎందుకు ఈ పరిసరాలలో ఒంటరిగా తిరుగుతున్నాను?’ లాంటి తాత్విక చింతనలు మనసులోకి వచ్చీరాక ముందే ఇంటికి తిరిగి వచ్చేసేవాణ్ణి, కానీ ఆ తరువాతే సమయం గడిచేది కాదు. శైలు, బాబు గుర్తుకు వచ్చి దిగులుగా వుండేది. జీబురుమంటున్న ఆ చీకటి రాత్రులలో మహంతి ఉనికి నాపాలిటి లైట్‌హౌస్‌లా వెలుగుతుండేది.

చేరిన నాలుగో రోజునే బ్యాంక్ కస్టమర్ల లిస్టులో సదాశివరావ్ మహంతి పేరు కోసం వెతికాను. లేదు. ఊర్లో మరో గ్రామీణ బ్యాంక్ కూడా వుంది. ఊరి జనాభా సుమారు నాలుగు వందలు. అరవై దాటిన మగవారిలో ఒకరుగా మహంతిని వెతికి పట్టుకోవచ్చు. లేదా ఆయనే ఎదురవొచ్చు. తీరా పరిచయమై పలకరిస్తే – ఆయన రచనలను ప్రస్తావించకపోవడం, నైవేద్యం లేకుండా దైవదర్శనం చేసుకోవడం లాంటిదే. వెంటనే ఆయన పుస్తకాల కోసం ఆర్డర్ పెట్టాను. వచ్చాక ఫోటోలు పరీక్షగా చూశాను. పాతికేళ్ళ క్రితంవి. మహంతి ఒరిస్సావాడు. తండ్రి ఉద్యోగరీత్యా హైద్రాబాదులో పుట్టి పెరిగాడు. రైల్వేలో ఉద్యోగం చేశాడు. ఇరవై నుండి నలభై ఏళ్ళ మధ్యలో రచనలు చేశాడు. అవి పుస్తకాలలో వున్న వివరాలు.

ఉత్తరాఖండ్ వెళ్ళిన సూర్య తిరిగి వచ్చేవరకూ ఆగి మెసేజ్ పెట్టాను. ఆ మరుసటి రోజు సాయంత్రం రిప్లయ్ ఇచ్చాడు. ‘అక్కడ ఆయన తనకు తెలిసిన తెలుగు ప్రపంచానికి దూరంగా అజ్ఞాతవాసంలో వున్నాడుట.’

నాకో పట్టాన అర్థం కాలేదు. ‘ఎందుకూ’ – అంటూ అడుగుతుండగానే వచ్చింది జవాబు. ‘ఆయనెక్కడుంటారో తెలుసుకునేందుకు ప్రయత్నించకు. ఒకవేళ తెలిసినా తెలియనట్లే వుండు.’

‘తెలుసుకుంటే ఏమవుతుంది?’

‘వద్దని చెపుతున్నాను.’

మనసు చివుక్కుమంది. ‘అసలింతకీ ఆయన ఇక్కడ అసలు పేరుతోనే వుంటున్నాడా?’

‘నీకనవసరం. ఒక వేళ కనిపించినా చేతిలో ఫోన్ వుంది కదా అని ఫోటోలు తీసి పంచకు. వాళ్ళమ్మాయి ముందే హెచ్చరించింది.’

వార్నీ! ఆశ పెట్టమన్నది ఎవరు? ఇప్పుడీ ఆంక్షలెందుకు?


వెనకటికెవరో తాళాల గుత్తి చేతికి ఇచ్చి పన్నెండో గది మాత్రం తెరవకూ అన్నాడట. అలా వుంది నా పరిస్థితి. తీరా ఆయనని కలిస్తే, ఆ విషయం స్నేహితులెవరికి చెప్పినా సూర్యకి తెలిసిపోతుంది. సరేలే ఇప్పుడీ మహంతి నాకు తెలియకపోతే వచ్చిన నష్టమేమి లేదు అనుకుని ఉక్రోషంగా సరిపెట్టుకున్నా పాడు మనసు ఊరుకోదు. వాకింగ్‌లో ఏదైనా కుదురైన ఇల్లు కనిపిస్తే ఈ ఇంట్లో కానీ ఉంటాడా అని ఆశగా చూసేవాడిని.

హైద్రాబాదులో వుండగా కవిమిత్రులతో గడిపిన రోజులు గుర్తుకు వచ్చేవి. ఓ ఐదు కవితలు పత్రికలలో రావడంతో వ్రాయడమన్న మాయాజాలంలో చిక్కుకున్నాను. ఇక ఏది చదువుదామన్నా, వ్రాద్దామన్నా – కళ్ళకి కనిపించని మహంతి ఊహల్లోకి వచ్చి కూర్చుంటాడు. తెలుగు జాతి ఆరాధ్య రచయితలలో ప్రత్యేకమయినవాడు. ఇప్పటికీ ఎవరో ఒకరు ఆయన గురించి ఏదో ఒక పత్రికలో గొప్పగా వ్రాస్తూనే వుంటారు. జంటనగరాలలో ప్రతి సాహితీ సమావేశానికి ఆయనని అభిమానించే కవులు, రచయితలు దగ్గరుండి తీసుకు వెళ్ళేవారట. ఆయన పరిచయ వాక్యాల కోసం, ముందు మాటల కోసం ఎంతకాలమైనా వేచివుండేవారుట. ఆయన రచనలని అందులో మార్మికతని బోర్హెజ్, త్రిపుర వంటివారి రచనలతో పోల్చి – రచయితలందరూ హారతులు పట్టే మహంతికి ఇలా దాక్కునే అవసరం ఏమిటో నాకస్సలు అంతుపట్టలేదు.

ఆయన కవితా సంపుటి చేతిలోకి తీసుకుంటుండగా పక్కనే వున్న పోస్టల్ కవర్ తళుక్కున ఓ ఐడియా ఇచ్చింది. ఆ మర్నాడు లంచ్ టైమ్‌లో వెళ్ళి పోస్టు మాస్టరుగారిని కలిశాను. “ఎమ్. సదాశివం అని, మేజర్‌గారి పాత ఇంట్లో ఒకరు అద్దెకి వుంటారు. వారు వీరు ఒకరో కాదో మీరే తేల్చుకోవాలి” అన్నాడాయన.


మేజర్‌గారిది డాబా ఇల్లు. గేటునుండి ఇంటి వరకూ ఇటుకలతో కాలిబాట. పిట్టగోడకి ఓ పక్కన జీడిమామిడి చెట్టు మరో పక్కన కొబ్బరి చెట్టు. ముందు అరుగుపైన గోధుమరంగు భైరవుడు. అన్నీ బావున్నాయి కానీ ఏదో ఒక వంక పెట్టుకుని గేటు తీసుకుని చొరవగా వెళ్ళడానికి లేకుండా అరుగు మీద ఆ బంటు.

నడకలో భాగంగా ఆ వీధిలో ఒకటికి రెండు సార్లు పచార్లు మొదలుపెట్టాను. టెన్నిస్ ఆట చూస్తున్న ప్రేక్షకుడిలా బంటుగాడు చూపులతోనే ఫాలో అయ్యేవాడు. అస్సలు మొరగడు. నమ్మేందుకు లేదు. పిట్టగోడదూకి కాలు పట్టుకున్నా అడిగేవాడు లేడు. అలా ఓ నెల రోజులు గడిచాయి. ఆ ఇంట మనిషి జాడ మాత్రం కంటపడలేదు. నా కాలక్షేపానికి ఇదంతా ఓ ఆటలా వున్నా – పరిచయమంటూ జరిగితే నా కవిత్వానికి ఓ మార్గదర్శి అవుతాడు కదా అన్న ఆశ నన్ను ఆ వీధిలో నడిపించేది.


రెండో శనివారం. సెలవు రోజు. సాయంత్రం ఐదింటికి సరిగ్గా నేనా వీధి కొసలో వుండగా తెల్లని లాల్చీ పైజామాలలో ఇంట్లోంచి బయటకి వచ్చాడాయన. నా గుండె ఒక్కసారిగా ఆగి కొట్టుకోసాగింది. సుమారు ఎత్తులో సన్నటి మనిషి. వయసు పైపడ్డా ఫోటోలో చూసిన అదే మొహం. పూర్తిగా తెల్లబడి అదే పల్చని జుట్టు. ఓ సారి బంటుగాడి తల నిమిరి, గేటు తీసుకుని నా ముందునుండే నడిచివెళ్ళాడు. ఎదురుపడి చేతులు పట్టుకుని ఆయన కోసం నేను పడిన తపనంతా చెప్పుకోవాలనిపించింది. ఎదురుపడ్డ వాళ్ళందరికీ అదుగో ఆయన ఫలానా అని అరిచి చెప్పాలనిపించింది. చూశావుగా చాల్లే అని మనసు హెచ్చరించింది. కాళ్ళు మాత్రం వెనకే నడిచాయి. అలా వెళ్ళి వెళ్ళి ఆటస్థలంలో ఓ చివరగా వున్న బెంచ్ పైన కూర్చున్నాడాయన.

ఐదు దాటేక చాలాసార్లు నేనిక్కడికి వచ్చాను. అన్నిసార్లూ బహుశా ఆయన అక్కడే కూర్చుని ఉండివుంటాడు. అయినా దూరాన కనిపిస్తున్న సముద్రం కళ్ళని కట్టేసి పరిసరాలను చూడనివ్వదు. మరుసటి రోజు ఐదు గంటలకి బ్యాంకునుండి సరాసరి అటే వెళ్ళి పేపర్ పట్టుకుని పక్క బెంచీపైన కూర్చున్నాను. అయిదుంపావుకల్లా ఆయన వచ్చి కూర్చున్నాడు. బ్యాడ్మింటన్ ఆటకేసి, దూరాన వున్న సముద్రం కేసి మార్చి మార్చి చూస్తూ కూర్చున్నాడు. కొన్ని రోజుల పాటు ప్రముఖ రాజకీయ వార్తలు ఉన్న పేజీని ఆయన వైపు వుంచి పేపర్ చదివాను. ఆయన ముందే ఏదో ఆలోచిస్తున్న వాడిలా అటూ ఇటూ పచార్లు చేశాను. ఓ రోజు వానవచ్చేలా వుంది అన్నాను. “ఊ” అన్నాడు. మర్నాడు నిజంగానే వానొచ్చింది. “రండి. చెట్టు కిందకి వెళ్దాం” అంటూ లేచాను. తల అడ్డంగా ఊపి వర్షంలో తడుస్తూ వెళ్ళిపోయాడు.

ఏ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు. అందుకే నాకు కుదిరి వెళ్ళగలిగిన రోజుల్లో ఆ పక్క బెంచీని విడవలేదు. ఆయన దూరంగా చూసే విరామాల మధ్య ఆగి ఆగి ఓ మాట అనేవాడు. ‘ఆ నీలం చొక్కా (బ్యాడ్మింటన్) బాగా ఆడుతాడు’, ‘ఎండ ఎక్కువగా వుంది’, ‘వర్షం వచ్చేలా వుంది’ లాంటి పొడి పొడి మాటలు. మరో మూడు నెలలు అలాగే గడచిపోయాయి.

దేనికైనా ఓ అంతుండాలిగా. ఈరోజిక తేల్చుకోవాలనిపించింది. “ఎప్పటి నుండి ఈ ఊర్లో వుంటున్నారు? ఏ వీధిలో మీరుండేది?” నా ప్రశ్నలకి ఆయన ఓసారి కళ్ళు చిట్లించి చూసి సమాధానం చెప్పకుండా తల తిప్పుకున్నాడు. అవి చూపులా? చురకత్తులా? నాకు మహావిరక్తి కలిగింది. ఈయన మహంతి కావొచ్చు మరో దానయ్య కావొచ్చు. నాకు కాని, తెలుగు సాహిత్య ప్రపంచానికి కానీ ఇప్పుడొచ్చే తేడా ఏముంది కనుక. ఇకపైన కలవడం దండగ అనుకుని లేచి వచ్చేశాను. నిరాశనుండి బయటపడే ప్రయత్నంలో కొత్త కవితొకటి వ్రాస్తుండగా శైలు ఫోన్ చేసింది. వినిపించాను.

నే వ్రాసుకున్న విన్నపాలు కెరటాల పాలైనాయి!
చెప్పుకున్న ఊసులేవో కడలి హోరులో కలిసిపోయాయి!
నీ చేరువకై చేస్తున్న నిత్యతపం నాది!
ఉప్పగా వుంటావని తెలిసీ దాహం తీర్చుకునే ప్రయత్నం నాది!

వింటున్న శైలు ఫక్కున నవ్వింది. “ఆ ఆఖరి లైను అసహజంగా లేదూ!” అంటూ మళ్ళీ గలగలా నవ్వింది.

ఓ వారం తరువాత తెల్లవారు జామున నాకో కల వచ్చింది. మహంతి నిలువెత్తు కెరటంలా సముద్రంలో నుండి నడుస్తూ బెంచ్ పైన కూర్చుని వున్న నాదగ్గరకు వచ్చాడు. ఒంటిపైన ఎక్కడా తడిబొట్టు లేదు. మెలకువతో పాటు నాకు జ్ఞానోదయం అయింది. ఒక వేళ ఆయన నా తల మీద మొట్టి నేను ఫలానా అని చెప్పినా కూడా తన రచనలు చదివానని ఆనందం ప్రకటించడమే కాని, వాటి గురించి మాట్లాడడం ఏనుగు ముందు చిట్టెలుక చేసే చప్పుడు లాంటిది. నిజానికి నేను కోరుకునేది – కవితలు రాస్తానని ఆయనకు తెలియడం. నా కవితలు వినిపించి ఆయనతో చర్చించడం. ఈ అభిరుచే లేకపోతే ఇలా ఆయన వెంటపడేవాడిని కాదుగా! అందుకే మొహమాటం పక్కన పెట్టి నా పనిమీద నేనుండడం మంచిదనిపించింది.


‘సర్! ఇదిగోండి. పత్రికలో వచ్చిన నా కవిత…’, ‘గురువుగారూ! ఇది నే కొత్తగా రాసిన కవిత… మీ అభిప్రాయం…’ అంటూ మనసులో ప్రాక్టీస్ చేసుకుని మరీ వెళ్ళాను. ఎప్పటిలానే ఆయన సముద్రంవైపు – జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆట వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. ఈమధ్య కనబడలేదేమిటి అన్న ఓ పలకరింపులాంటి చూపైనా నాకేసి చూడలేదు. ఉన్నపళాన ఆయనని మోసుకెళ్ళి సముద్రంలో పడెయ్యాలనిపించింది.

ఇక లాభం లేదని నోటుబుక్కులో సగం వ్రాసిన కవిత వున్న పేజీని తెరచి – పెన్ను చేతపట్టి ఆలోచిస్తున్నట్లు కూర్చున్నాను. ఉన్నట్లుండి నాకేసి తిరిగి “వాతావరణ సూచనల ప్రకారం వర్షం రావాలి. పైన ఓ నల్లమబ్బు కూడా లేదు” అంటూ నా చేతిలో వున్న పుస్తకంకేసి చూసి తలతిప్పుకున్నాడు. ఇదే మంచి సమయం అనుకుంటూ గొంతు సరిచేసుకుంటూన్నానో లేదో… అప్పుడే సముద్రపు ఒడ్డుకేసి వెళ్తున్న ఓ గళ్ళచొక్కా వ్యక్తి ఎందుకో చటుక్కున ఆగి నాకేసి నడిచి రాసాగాడు. లోన్ పనిమీద ఉదయం బ్యాంక్‌కి వచ్చి నాతో మాట్లాడిన వ్యక్తి. వచ్చి వచ్చి నా వైపైనా చూడకుండా ఆయన ముందు వినయంగా చేతులు కట్టుకుని నిలబడి అడిగాడు.

“మీరు ప్రముఖ రచయిత మహంతి కదా!”

నేను అంతెత్తున ఉలిక్కిపడ్డాను. నెలల తరబడి నేను అడగలేనిది – అడగలేక తర్జనభర్జనలు పడుతున్నది – సుళువుగా అడిగేశాడు. తెలిసి తెలిసీ ఈయన అజ్ఞాతవాసానికి పహారా కాస్తున్న నన్ను దాటుకుని అంత సాహసం చేసేశాడు.

“మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, పొరపాటు పడినట్లున్నారు.” ఇంగ్లీష్‌లో చాలా ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడీయన.

“మహంతిగారి రచనలు నాకు చాలా ఇష్టం. మీరచ్చు అలాగే వుంటేనూ…” అంటూ ఆ వ్యక్తి నీళ్ళు నమిలాడు.

“మీరనవసరంగా మా ఏకాంతం భంగం చేస్తున్నారు.” ఈసారి మరింత ప్రశాంతంగా వచ్చింది సమాధానం.

గళ్ళచొక్కా నాకేసి ఓమారు చూసి కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఛ! అంతా తలక్రిందులైపోయింది. కంటిచూపుతో ఆమడ దూరంలోను – మాటతో మైళ్ళ దూరంలోను నిలబెట్టే ఈ వ్యక్తిని నేను మాత్రం ఏమడగగలను? తేరుకుని పక్కకి తిరిగి చూసేటప్పటికి ఈయన లేడు. చకచకా నడుస్తూ దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఇందాక ఆయన ఇచ్చిన సమాధానాలు ఇక్కడే ఇంకా మారుమ్రోగుతూ – నిజంగా ఈ వ్యక్తి నేననుకుంటున్న సదాశివరావ్ మహంతేనా అన్నంతగా అనుమానంలో పడేస్తున్నాయి.

సరిసరి ఇంతటితో సరి అని సరిపెట్టుకుని నేను లేచి ఇంటికి వచ్చేశాను.


మనసు నిలకడగానే వుంది. మూడు వారాలైంది సముద్రం వైపుగా వెళ్ళి. ఆదివారం పొద్దున్నే పది గంటలకు ఎవరో తలుపులు బాదుతున్నారు. తీసి చూస్తే చేతిలో హెల్మెట్‌తో నవ్వుతూ నిల్చునివున్నాడు సూర్య.

“విశాఖ వరకూ ఎటూ వచ్చాను కదా, అలాగే నిన్ను చూసిపోదామని…” అంటూ నన్ను తోసుకుని లోపలికి వచ్చేశాడు. వాడు వంగి షూ విప్పుకునేలోగా మహంతి పుస్తకాలు చటుక్కున తీసి అల్మారాలో దాచాను.

కలిసి లంచ్ చేస్తుండగా సడన్‌గా అడిగాడు “మహంతి ఎక్కడైనా కనిపించారా?” అని.

ఉలికిపాటు కనిపించకుండా జాగ్రత్త పడుతూ “లేదే! ఒకవేళ కనిపిస్తే గుర్తుపడతాను లేదో కూడా!” అన్నాను.

“ఈ మధ్య మన వాసుగాడిని కలిసినప్పుడు అసలు వివరాలు తెలిశాయి. నిన్ను కలిసినప్పుడు వివరంగా చెపుదామనే ఆగాను. అసలేమైందంటే…” అంటూ మొదలు పెట్టాడు.

“ఆ రోజు యువకవుల సమ్మేళనానికి వాసుగాడు ఆయనని దగ్గరుండి తీసుకువెళ్ళాడట. కార్యకర్త మహంతిని స్టేజ్ పైకి ఆహ్వానించి ఓ మూడు నిమిషాల పాటు ఆయన గురించి మాట్లాడారుట. ఆ తరువాత ప్రతి కవి తమ కవిత చదివే ముందు – అంతటి మహారచయిత సమక్షంలో కవిత చదవటం తన భాగ్యమని ఒకరు, మీలాంటి పెద్దలు మాకు మార్గనిర్దేశకం చెయ్యాలని మరొకరు అలా కొంతసేపు సాగిందట. మన వాసుగాడు మొదటి సంకలనానికి ముందుమాట వ్రాయమని ఆయనకి ఇచ్చి అప్పటికే నాలుగు నెలలు దాటిందట. వీడు మొదలు పెట్టడమే ‘మీరు నా దేవుడు, మీ ముందుమాట కోసం నేను ఎంతకాలమైనా ఎదురు చూడగలను. మీరు తప్ప ఇంకోరు రాయడం నేను ఊహించలేను’ అంటూ ప్రారంభించాడుట. అంతే ఆయన పక్కన కూర్చున్నాయనతో ‘తలనొప్పిగా ఉంది’ అని చెప్పి చటుక్కున లేచి వెళ్ళిపోయాడుట.”

“తరువాత…”

“అటు తరువాత ఆయన కనిపించలేదు, వినిపించలేదు. సాహిత్య రాడార్ నుండి పూర్తిగా మాయమైపోయాడు. ఎందుకు దూరంగా వెళ్ళడం అని వారి అమ్మాయి అడిగితే – రాను రాను తెలుగు సాహిత్యం పాఠకులను పోగొట్టుకుంటోంది. ఒకప్పుడు పత్రికలు, ప్రచురణకర్తలే రచయితకి పాఠకులకి మధ్య వారధులు. నాకు తెలియని ఆ పాఠకులు నిర్మొహమాటస్తులు. నా కవితలలో అస్పష్టతని, కథలలో అర్థంకానితనాన్ని వివరిస్తూ వారినుంచి వచ్చే విమర్శలో నిజాయితీ వినిపించేది. ఎప్పుడైతే పాఠకులు దూరం అవుతారో, సెల్ఫ్ ప్రమోషన్, ఒకరినుండి ఇంకొకరు మెప్పు ఆశించడం, మొహమాటపు పొగడ్తలు, ఇవన్నీ రచయితలకి అదనపు బరువులు. అందుకే ఇకపైన ఈ రకమైన జీవితానికి దూరంగా వుండదలిచాను – అని అన్నారుట.”

“సోషల్ మీడియా రాకముందే ఆయన ఆ మాటలన్నారా?! మరి అప్పటితో పోలిస్తే ఇప్పుడు రీడర్స్‌ మరింత తగ్గిపోయారు కదా! వారిని ఆకట్టుకోడానికి పబ్లిషర్స్, రచయితలు ఎవరికి వారు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోవడం తప్పనిసరి అయిపోయింది కదా!”

సూర్య నవ్వాడు. “సాహిత్యం ఇష్టంగా చదివేవాళ్ళందరూ సోషల్ మీడియాలో ఉండాలని లేదు. అక్కడొచ్చే లైకులన్నీ రీడర్స్‌‌వి అనుకోవడం మన భ్రమ. కొత్త తరం పాఠకులను ఆకట్టుకోవాలంటే వారి అనుభూతులకి, వారుంటున్న కాలానికి సరిపడే రచనలు రావాలి. ఓ సామాన్య పాఠకుడిగా నేనైతే సీరియస్ కథనాలతో పాటు జీవితంలో సౌందర్యాన్ని, ప్రేమని, ఉత్సవాన్ని, ఆశావాదాన్ని ప్రకటించే రచనలు కూడా విరివిగా రావాలని కోరుకుంటాను.”

మహంతి గురించి విన్న విషయాలు ఇచ్చిన షాక్ నుండి నేను ఇంకా తేరుకోలేదు. అందుకే అడిగాను. “కీర్తి ప్రతిష్ఠలు తనివితీరని దాహం లాంటివే – అలా ఎలా వదులుకుని వెళ్ళిపోయాడు?”

“హార్పర్ లీ, శాలింజర్‌ల గురించి విన్నావా? అలా జనాలనుండి దూరంగా ఉన్నవాళ్ళు, ఊరూ పేరూ మార్చుకున్న వాళ్ళు, అరుదుగానే కావొచ్చు, కానీ వున్నారు. తమ రచనలను అగ్నిపాలు చేసినవాళ్ళూ వున్నారు. అందుకు ఎవరి కారణాలు వారికి ఉన్నాయి…” అంటూ వెళ్ళడానికి లేచాడు సూర్య.

“వెళ్ళి ఆయనని కలుస్తావా?”

“ఛ! ఇంకా నయం. ‘నేను’ అన్న అహాన్ని జయించి అంతర్ముఖుడైన ఆ వ్యక్తిని తెలిసి తెలిసీ కదపడం తప్పుకదా! నేనిక్కడికి నీకోసమే వచ్చాను” అన్నాడు తన చేతిలో ఉన్న నా చేతిని నొక్కి ఒదిలేస్తూ.