ఇంక నువ్వు తెల్లవార్లూ
సణుగుతావు చూడూ…
తను నిద్రకు మెలకువకు
నేటికి రేపటికి మధ్య

కాలం శూలానికి
దృశ్యరహిత రక్తమోడుతుంది

ఈ లోగా నేనూ అనేక అవతారాలెత్తి
పని భూగోళాన్నంతా అట్లాసై మోసేసి
పై వాడిని మెప్పించో వప్పించో
కావలిసినంత అలసటనో ఆవేగాన్నో నింపుకుని
మనిషితనానికి తావీయకుండా
ఈసురోమని ఇల్లు చేరతాను.

శుభ్రజ్యోత్న నీలాకాశం కింద
గుసగుసల ముచ్చెమటల ముచ్చట
ఇరువురికి తెలియని
ఒక ఆపతి ఇరువురి సోపతి
ఫెళ ఫెళ ఆర్భాటాల
ఉరుములు మెరుపులు

రోజూ
లేగదూడ కన్నుల్లోని
నల్లని మూగతనం ముందు
తల్లి ఆవు పాలు పితుకుతున్నట్టు–
అతనేదో కూనిరాగం తీస్తున్నాడు
ఆమె చుక్కల ముగ్గు వేస్తోంది

యుద్ధానికీ దుఃఖానికీ
ఒక్క అల్మరా చాలు
ప్రేమకు
ఇంకొంచం పెద్ద గదిని కేటాయిద్దాం

పిల్లల ముందూ
స్త్రీల ముందూ ఎక్కువ ఓడిపోదాం

అంకెల లెక్క కాదు
అస్తి నాస్తి విచికిత్స

ప్రమాణాలు తెలుసుకున్నాక
ప్రణామం చెయ్యి
ప్రాణాయామం ఎప్పుడైనా
చెయ్యచ్చు

మిణుగురు పాదాలు చిట్లి,
నెత్తుటి దారి ఏర్పడిన చోటు నుంచి
ప్రారంభమైంది నడక!

మొలకంత ప్రాణి
సమస్త భూమండలాన్ని
కాంతిమయం చేస్తుందని
నమ్మిక!

గుడ్లగూబకో బొటనవేలు ఉంటుందనీ
ఐతే అదలా తిరిగి ఉండదని
శరీర శాస్త్రం చెప్తుంది.
పక్షిశాస్త్రం బోధిస్తుంది!
ఎన్నో ఏళ్ళు తెల్ల గుడ్లగూబని అధ్యయనం చేశాను
ఈ డొల్ల పనితనాన్ని చూసి బాధ పడుతున్నాను.