నాసాగ్రం నుంచి జారుతున్న
కళ్ళద్దాలను నాసికతోనే ఎగదోస్తూ
పర్సీవరెన్స్ సాయంతో
పరిశీలిస్తున్నా!
అంగారకుని అవశేషాలలో
కళ్ళింతలు చేసుకుని
అన్వేషిస్తూన్నా!
తోకచుక్కల వల్లే
గ్రహాల్లో జీవవ్యాప్తి
జరిగి ఉంటుందన్న
గ్రీకు అనాక్సగోరస్1
పాన్స్పెర్మియా2
ఊహ కంటే ముందే….
భూమి పుత్రుడని వర్ణించిన
పురాణగాథలేవో
కళ్ళ ముందు కదిలి…
ఈ భౌమ గ్రహాన్ని
ఆశగా మరీ మరీ
పరికిస్తున్నా!
కదలికల్లో భూమితో
దగ్గరి పోలికలున్నా
కవళికల్లో
అంతులేని
చిక్కుముళ్ళు!
అయినా
ఇచ్చోట
మన ఆనవాళ్ళు
ఉండొచ్చని
పిరమిడంత పేరాశ నాకు!
బాహుబలి గరిటలు…
గులకరాళ్ళ దారులు…
నీరింకిన సరోవర తీరాన
‘నరముఖ’ విక్షేప శిలలు…
గోధూళి వర్ణపు ఇసక మేటలు…
నిట్టనిలువు కొండల వాలుల్లో
తమంత తామే కదిలే రాతిగుళ్ళు
శిలాజ తిమింగలాలు…
ఎగరని సాసర్లు…
రాళ్ళూ రప్పల్లో దాగిన
ఏవేవో వింత వింత
ఆకృతులు…
ఊరించి నమ్మించి
ఇగిరిపోతున్న ఆశల్లా
అడుగంటి పోతున్న
నీటిజాడలు!
ఈ గ్రహాంతర జీవ శకలాలు
ఈ శిలాశైథిల్య కళారూపాలు
గతించిన బుద్ధిజీవుల ఘన
నాగరికతా చిహ్నాలని
నా ప్రధాన ఊహ!
రెండు బృహన్నాగరికతల మధ్య
మిలియన్ వత్సరాలకు ముందు
ఏదో భీకర సంగ్రామం జరిగి
కుజగ్రహాన్ని మరో కురుక్షేత్రంగా
మార్చివుంటుందని
నా ఖచ్చితమైన
ఉపోహ!
ఈ నేల గ్రహాంతర జీవుల నిరంతర
ఆధిపత్యపోరులో నలిగిపోయిందా?
రక్తపుటేరుల రణస్థలిగా
కుమిలిపోయిందా?
కుజుని అరుణిమకు
కారణమేమై ఉంటుంది?
ఏ పరమాణు విస్ఫోటనమో
గురునికి కుజునికి
మధ్య మరో గ్రహాన్ని
తునాతునకలు చేసిందా!
ఏ ఒక్కటంటే. ఒక్క… క్లూ…
కోసం… తహతహలాడుతున్న…
నా మనస్సంచార విశృంఖల
యోచనా వీచికలకు
ఏ దిశానిర్దేశము
కుదరట్లేదు!
మదిలో సుళ్ళు తిరిగే
కాకిరిబీకిరి కథలు
ఏ కంచికీ చేరట్లేదు!
నా అంచనాల లంగరుకు
ఏ ధ్రువపుటంచులూ
అందట్లేదు!
గాలించి గాలించి
అలసిపోయి
కనులు మూతపడి
కలలోకి జారిపోయాను!
కలలో
నాలోనుంచి
ఇద్దరు విచిత్ర కవలలు
పుట్టుకొచ్చారు!
ఒకడు
సంక్లిష్ట చిత్రకారుడు
దలీ పోలికలతో ఉన్నాడు!
మరొకడు ఎవరో
పురావస్తు శకలాలలో
పూర్వగాథలు వెదికే
కాల్పనిక చరిత్రకారుడనుకుంటాను!
వాడి ముఖం
పోల్చుకోలేకపోయాను!
మంగళ గ్రహం మీది
దృశ్యాల్ని చిత్రరూపంలోకి
మలచే పనిలో ఇతడు
ఇక్కడి శకలాలకు
చారిత్రక నేపథ్యం
అల్లే పనిలో అతడు
తలమునకలై
ఉన్నారల్లే ఉంది!
ఇద్దరూ సారూప్య కవలలే!
అయినా ఎవడూ ఇంకొకడి మాట వినడు !
ఎవడి జ్ఞానం వాడికి
అహంలా అడ్డుపడి మాటా మాటా అనుకున్నారు!
వాదన చిలికి చిలికి లావాలా
సహించరానంత వేడెక్కింది!
నీవన్ని అధివాస్తవ విచిత్రాలు!
నీవి అభూత కల్పనలు!
నీవన్నీ అతిశయోక్తుల ఆకసం నుంచి
రాలిపడ్డ ఉత్ప్రేక్షల ఉల్కలే!
నీవి?
అవనీతలం అనుభవాలకు
అరుణ గ్రహంలో ఆనవాళ్ళు వెదికే
ఉన్మాదపుటుల్లేఖనాలు కావా?
లోపం
నీదంటే నీదని గట్టిగా
ఒకర్నొకరు
ఏదో తిట్టుకున్నారు!
ఓ పదాన్ని పదే పదే
అనుకున్నారు…
నేను సరిగ్గానే విన్నాను!
పెరడోలియా…
కానీ నేనది కొత్తగా విన్నాను!
‘పె. ర. డో. లి. యా’3
ఒకానొక సింప్టమేటిక్ డిజార్డర్…
లేనిది ఉన్నట్టు కనిపించే భ్రమాజనిత రుగ్మత…
నేను పదానికి
అర్థం వెదికే పనిలో
ఉన్నా!
ఇంతలో వాళ్ళు ఒకరిపై ఒకరు
విసురుకున్న రాళ్ళలో ఒకటి బలంగా
నా తలకు తగిలి ‘కల’ చెదిరిపోయింది…
అసలు సమస్య
ఎవరిలో ఉందో
నాకు అర్ధమయేలోపలే
నేను పైకి రాలేని
సంశయ బిలంలోకి
అప్పటికే లోతుగా జారిపోయాను!
పెరడోలియా…
నాలో ఆందోళనా తరంగాలు
సృష్టించింది! అది
వైఫైలా నన్ను తరుముతోంటే
నాలో ఏదో అలజడి మొదలైంది!
భయంతో చెమట తుడుచుకుంటూ
సెల్ఫీ మోడ్లో ముఖం
చూసుకున్నాను.
వికృతంగా
ఒకే దేహం -రెండు తలలతో
నన్ను నేను చూసుకుని
నిలువెల్లా వణికిపోయాను!
- The Greek philosopher Anaxagoras (500-428 BCE) asserted that the seeds of life are present everywhere in the universe (Nicholson, Trends Microbiol 17:243-250, 2009). He coined the term Panspermia to describe the concept as life travelling between planets as seed.
- గ్రహాంతర లేదా పాన్స్పెర్మియా సిద్ధాంతాలు జీవం బాహ్య అంతరిక్షంలో ఉందని మరియు ఉల్కలు, గ్రహశకలాలు లేదా తోకచుక్కల ద్వారా బీజరూపంలో గ్రహాలకు రవాణా చేయబడింది అని చెప్తాయి.
- Pareidolia: the tendency for perception to impose a meaningful interpretation on a nebulous stimulus, usually visual, so that one detects an object, pattern, or meaning where there is none.