వేలుపిళ్ళై నిజం, సెందామరై కల్పితం! –సి. రామచంద్ర రావుగారితో ఒక మధ్యాహ్నం

ఆ కథలు చల్లని నీలగిరి కొండల వాలుల్లో ప్రయాణాలు చేయిస్తాయి. ప్రతి మలుపులోనూ తేనీటి ఆకుల పరిమళాలు కమ్మేస్తాయి. ఆకాశం మెట్లు దిగి వచ్చే మేఘాల దొంతర్లు మనల్ని తడిపేస్తాయి. ఆకుపచ్చ నుంచి ఊదారంగుకు మారే కాఫీపళ్ళ గుత్తులు మనం నడుస్తుంటే కాళ్ళకు అడ్డం పడతాయి. అంతలోనే చెట్టియారో, పేట్ రావో, చేయి పుచ్చుకు కథలోకి లాక్కు పోతారు! ఏ డంకనో వచ్చి సగటు పాఠకుడు పేరైనా వినని విదేశీ డ్రింకేదో ఆఫర్ చేస్తాడు! ముసలి మాంకూ వచ్చి గాళిదేవరు గురించి ఏ కట్టుకథో చెపుతాడు!


వేలుపిళ్ళై (విశాలాంధ్ర, 2011)

సి. రామచంద్ర రావుగారి కథలు చేసే మాజిక్ అది! తెలుగు పాఠకుడికి కాస్మోపాలిటన్ ప్లాంటేషన్ లైఫ్‌స్టయిల్‌తో పాటు, అక్కడ పని చేసే కూలీల్ని వాళ్ళ జీవితాల్ని సైతం అంతే అందంగా పరిచయం చేస్తాయి. పట్టుమని పది కథలు కూడా లేవు కానీ అవి అరవయ్యేళ్ళుగా తెలుగు పాఠకుల్ని మళ్ళీ మళ్ళీ పలకరిస్తూనే ఉన్నాయి. కథలోని పాత్రలతోనే కాక, వాతావరణం తోటి కూడా ప్రేమలో పడేసే నిత్య నూతనాలు ఈ కథలు!

కథలన్నీ ఆంధ్ర పత్రికలో మొదట ప్రచురితమైనా, ఆ తర్వాత యువ, జ్యోతి మాసపత్రికలలో ఎన్నోసార్లు పునర్ముద్రణ పొందాయి. తెలుగునాట పుంఖానుపుంఖాలుగా వెలువడుతున్న కథాసంకలనాలు ఆయన కథలని ఎంతగా విస్మరించినా, పాఠకులు వాటిని ఇంకా ఇష్టంగా చదువుతూనే ఉన్నారు. అవి గొప్పకథలనే భావిస్తున్నారు. ఏ ఇతర తెలుగు రచయితా పరిచయం చేయని లోకాన్ని మనుషుల్ని ఆయన తెలుగు పాఠకుడికి పరిచయం చేశారు. కథతో పాటు, కథావరణాన్ని సమర్థంగా చిత్రించడం ద్వారా కథనాన్ని ఎలా పరిపుష్టం చేయవచ్చో చేసి చూపించారు ఆయన.

అలాటి అపురూపమైన కథలు రాసిన ఆయన తరచూ ఎందుకు రాయరు? ఆ కొద్ది కథలతోనే ఎందుకు ఆపారు? మళ్ళీ రాస్తారా లేదా? ఆయన సృష్టించిన పాత్రల గురించి ఆయనేమంటారు? ఎన్ని సార్లు చదివినా కొత్తగా అనిపించే ఆ కథలని మళ్ళీ చదివినపుడు ఇవన్నీ ఆయన్నే అడిగితే ఎలా ఉంటుంది అని ఎప్పుడూ అనుకునేదాన్ని. మొన్న జూన్‌లో ఇండియా వెళ్ళినపుడు అనుకోకుండా వారి ఫోన్ నంబర్ దొరికింది. ఆయన్ని చూసి మాట్లాడాలని ఫోన్ చేస్తే ఎంతో మామూలుగా, “అవునా? ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండున్నరకు రండి,” అన్నారు ఏ భేషజమూ లేకుండా.

నా అభిమాన రచయిత గొంతు ఫోన్లో వింటున్నానన్న సంబరం నుంచే తేరుకోలేదింకా, వచ్చేయమని ఆహ్వానం!

రావుగారికి 85 ఏళ్ళు! ఆయన ఆరోగ్యం అంతగా బాగాలేదు. ఎక్కువ మాట్లాడలేరు… ఇలా ఎన్నో విన్నాను. వీలైనంత త్వరగా తిరిగి వచ్చేయాలని, ఆయనను ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని ముందే చాలాసార్లు నన్ను నేను హెచ్చరించుకున్నాను. ఇల్లు కనుక్కోవడం అంత కష్టమైన పని కాలేదు. వారి ఇంటికి చేరి కారు దిగే సరికి, రిసీవ్ చేసుకోడానికి ఇంటి గుమ్మం ముందే నిలబడున్నారు రామచంద్ర రావుగారు! ఆరడుగుల పైగా ఎత్తు, స్ఫురద్రూపి. వేలుపిళ్ళై పుస్తకం వెనుక పేజీ మీద ఫొటోకి కొంచెం వయసు మీద పడిందంతే. ఆ ఠీవి మాయనే లేదు. ఆయనను అలా చూసి ఆనందం, ఆశ్చర్యం, గౌరవం ముప్పిరిగొన్నాయి. నన్ను ఒక్క క్షణం పాటు మాట లేకుండా మౌనంగా నిలబెట్టాయి.

హలో! అంటూ చేతులు కలిపి లోపలికి ఆహ్వానించారు. చకచకా రెండంతస్తుల మెట్లు ఎక్కుతూ (లిఫ్ట్ ఉన్నప్పటికీ) తన గదిలోకి దారి తీసి నిజంగానే షాక్ ఇచ్చారు. వయసు మళ్ళిన వాళ్ళెపుడూ వృద్ధాప్యానికి మనమిచ్చే నిర్వచనం ప్రకారం నడవాలని ఆశిస్తూ, ఆదేశిస్తూ ఉంటామేమో!

ఆరోజు ఎండ మరీ ఎక్కువగా ఉంది. మర్యాదగా కూర్చోబెట్టి, నాకొక ఆరంజ్ జ్యూస్ తెచ్చి ఇచ్చి ఆయనొక డ్రింక్ కలుపుకుని తెచ్చుకున్నారు. టీషర్ట్, స్లాక్స్, షూస్‌లో ఉన్న ఆయన వంక కొంచెం పరిశీలనగా చూస్తుంటే నాకోసం ఆయన ఇంకో ప్రోగ్రామ్ మానుకున్నారేమో అని అనుమానం వచ్చింది.

“ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీ అయ్యారా?” అడిగాను.

సున్నితంగా నవ్వారు. “నో, మీరు వచ్చే ముందే గాల్ఫ్ కోర్స్ నుంచి వచ్చాను.”

తెల్లబోయాను, గాల్ఫ్ ఆడతారని తెలిసినా! ఇంత ఎండలోనా? మళ్ళీ తనే అన్నారు.

“ఆదివారం తప్ప ప్రతి రోజూ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకూ గాల్ఫ్‌కి వెళ్తాను.”

నిజంగానా? ఆరు గంటల పాటా?!

“అవును, గాల్ఫ్‌లో నాకసలు టైము, శ్రమ రెండూ తెలీవు. ఆరు రోజులూ ఆడతాను. ఎన్నో ఏళ్ళ నుంచీ ఆడుతున్నాను ఇలా.”

ఆ పాషనేట్ స్పోర్ట్స్‌మన్‌తో ఏం మాట్లాడాలో, ఎలా మొదలు పెట్టాలో ఆలోచిస్తూ గదిలో చుట్టూ చూశాను. ఆ గది ఇంతకు ముందెక్కడో చూసినట్టు, పుస్తకాలు, పెయింటింగ్స్‌తో ఒక పురాపరిమళంతో నిండినట్లు, మేమొక ప్లాంటేషన్ హౌస్‌లో ఉన్నట్లూ తోచింది.

ఇంటర్వ్యూ అని ఫార్మల్‌గా అనుకుని ప్రశ్నలేవీ రాసుకు రాలేదు గానీ, ఆయన కథలన్నీ మనసులో అచ్చొత్తినట్టు ఉండి పోవడం వల్ల, కొన్ని విశేషాలు అప్పటికే చదివి ఉండటం వల్ల చాలా మామూలుగా, ఎలాటి ఉపోద్ఘాతాలూ లేకుండా జారిపోయాం సంభాషణ లోకి. ప్రతి విషయం మీదా స్పష్టమైన అభిప్రాయాలతో వివరంగా మాట్లాడిన రామచంద్ర రావుగారు చక్కని బ్రిటిష్ ఇంగ్లీష్ లోనే చాలా వరకూ మాట్లాడినా, తెలుగుని కూడా అంతే చక్కగా, చాలా హాయిగా, నవ్వుతూ సరదాగా మాట్లాడారు. చక్కని ఆంధ్ర తెలుగు! ఆయన తెలుగు టెలుగూలా వినిపిస్తుందన్న ముళ్ళపూడి మాటతో ఏకీభవించలేక పోయాను.


మీరు చదివింది లా కదా! మరి అసలు ఏ రకంగానూ సంబంధం లేని ప్లాంటేషన్స్ వైపు ఎలా మళ్ళారు? మీకు అటు వైపు పాషన్ లాంటిదేదైనా ఉందా?

“ఆ రోజుల్లో చదువు పూర్తి కాగానే ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించడం ముఖ్యంగా ఉండేది. నా ధ్యేయమూ అదే! ప్లాంటేషన్స్‌లో మంచి ఉద్యోగం దొరికింది. అందుకే వెంటనే చేరిపోయాను. లా చదివాను కానీ అడ్వకేట్‌గా ఎప్పుడూ ప్రాక్టీస్ చెయ్యలేదు. నా భార్య సరోజవల్లి కూడా నాతో పాటే మద్రాస్‌లో చదివింది.”

మీ కథల్లో కూడా మొత్తం ప్లాంటేషన్ లైఫే ఉంటుంది. వేరే అర్బన్ నేపథ్యం గానీ మరో విధమైన నేపథ్యాలు గానీ కనిపించవెంచేత?

సింపుల్! ఏ రచయిత అయినా తనకు పరిచయం ఉన్న, తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని, మనుషుల్నే సమర్థవంతంగా చూపించగలుగుతాడు. కథలు రాసిన రోజుల్లో నా చుట్టూ టీ తోటలు, అందులో పని చేసే వాళ్ళు, ప్లాంటర్స్ క్లబ్, అక్కడి ఫారిన్ కల్చర్, పార్టీలు, టెన్నిస్ ఇవే ఉండేవి. నాకు పరిచయం లేని, నేను స్టడీ చెయ్యని వాటి జోలికి వెళ్ళడం కంటే నాకు పరిచయం ఉన్న కేన్వాస్ మేలు కదూ!

రచన, ఆలోచన, పాత్ర చిత్రణ, అటునుంచి కథనం – ఈ ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుంది మీ విషయంలో?

ఏదైనా ఒక సంఘటనో వ్యక్తో ఆసక్తికరంగా కనిపించినపుడు దాన్ని కథగా రూపొందించాలనే ఆలోచన వస్తుంది. అలా రాయాలన్నది పూర్తిగా మెదడులో రూపు దిద్దుకుంటుంది. అపుడే కథ రచన సులభంగా సాగుతుంది. నా కథలన్నీ అలా రాసినవే.

{సరిగ్గా ఇదే విషయాన్ని వేలుపిళ్ళై కథా సంకలనానికి 1964లో ముందు మాట రాసిన నండూరి రామ మోహనరావుగారు కూడా ప్రస్తావించారు. ఒకసారి అడిగితే, ఆయన చెప్పిన జ్ఞాపకం – కథ ఎత్తుగడ నుంచి ముగింపు వరకు మనసులో సంవిధానమంతా రూపు కట్టేవరకు కథ రాయలేను, అన్నారని.}

మొట్టమొదట రాసిన కథ ఏది? ఎక్కడ పబ్లిష్ అయింది?

1958లో పబ్లిష్ అయిన ఫాన్సీ డ్రెస్ పార్టీ మొదటి కథగా చెప్తాను.

అంటే అంతకు ముందే కథలు రాశారా మీరు? ఏ వయసులో మొదలు పెట్టారు రాయడం?

నిజానికి నేను పదహారేళ్ళ వయసులోనే కథలు రాశాను. ఆంధ్రజ్యోతిlO చక్రపాణి సారధ్యంలో నడుస్తున్నదప్పుడు. ఆంధ్ర పత్రిక ఉగాది సంచికని సమీక్షిస్తూ 1948లో శ్రీ వాత్సవ నారాయణ రావుగారు — ఈయన సాహిత్య సింహావలోకనం అనే శీర్షిక నిర్వహిస్తుండేవారు అప్పట్లో — తెలుగు సాహితీ ప్రపంచంలో ఒక కొత్త రచయిత పుట్టాడని రాశారు. బహుశా నేను అంత చిన్నవాడినని ఆయనకు తెలిసి ఉండదు.

అప్పుడు ఆ వయసులో ఏమేం కథలు రాశారో గుర్తున్నాయా? వాటి పేర్లు?

అన్నీ గుర్తున్నాయి. రాళ్ళు రప్పలు, మనోభావాలు, ఫాదర్స్ అండ్ సన్స్. ఈ మూడు కథలూ రాశాను.

జగన్నాథ్ అనే కలం పేరు గురించి చెప్పండి! మీరే కదా అది?

(ఆ పేరు ఎత్తగానే చాలా హాయిగా నవ్వారు.) అవును, నేనే! దాని వెనుక ఒక చిన్న సరదా కథ ఉంది. నా తమ్ముడు జగన్నాథ్ భూపతి నాకంటే నాలుగేళ్ళు చిన్నవాడు. నాకు పదహారు, జగన్నాథ్‌కి పన్నెండేళ్ళు. ఆ వయసులో అన్నదమ్ముల మధ్య ఉండే సరదా కీచులాటలే మా మధ్య కూడా ఉండేవనుకోండి. జగన్నాథ్ దస్తూరీ చాలా బావుండేది. నేను రాసిన కథ ఫెయిర్ చెయ్యమని అడిగితే మొండికేసే వాడు. ఫెయిర్ చేసి పెడితే ఆ కథ నీ పేరుతోనే పంపిస్తాను. నీ పేరుతోనే పత్రికలో అచ్చవుతుంది, అని ఆశ పెట్టేవాడిని. జగన్నాథ్ ఫెయిర్ చేసిన కథల్ని ఆ పేరుతోనే పంపేవాడిని.

సరే, ఫాన్సీ డ్రెస్ కథ మీ కథలన్నిటికీ భిన్నంగా నాటకీయత ఎక్కువైనట్లు అనిపిస్తుంది. ఎంత మేకప్ చేసుకుంటే మాత్రం భార్యను క్లోజప్‌లో చూసిన భర్త గుర్తు పట్టలేడా?

హహహ… డోంట్ టేక్ దట్ స్టోరీ దట్ సీరియస్‌లీ! అది నిజానికి ప్లాంటేషన్స్ లైఫ్‌స్టయిల్‌ని పాఠకులకు పరిచయం చేయడానికి రాసిన కథ. అందులో ప్లాంటేషన్స్‌లో దూరదూరంగా ఉండే ఇళ్ళ నుంచి, క్లబ్‌లో జరిగే పార్టీలు, ఆ సరదాలు, ఈ వివరాలన్నీ కథలో ఉంటాయి. కాబట్టి దాన్ని ప్లాంటేషన్స్ జీవితం గురించి రాసిన పరిచయంగా అనుకోండి.

మరి అప్పుడెప్పుడో ఆంధ్ర పత్రికలో పడిన సత్యనారాయణ వ్రతం కథ గురించి చెప్పండి! అదెప్పుడు రాశారు?

ఆ కథ కూడా చదివారా మీరు? నిజానికి ఆ కథను నేను 1948లోనే రాశాను. కుటుంబరావు దాన్ని 1951లో వేశారు. అది ఊహ బాగా తెలీక ముందు రాసిన కథ. అందుకే వేలుపిళ్ళై పుస్తకంలో కూడా అదుండదు చూశారా?

{ఇదిగో చూడండి. నా దగ్గరుంది ఆ కథ – అని నేను తీసుకెళ్ళిన ప్రింటవుట్ చూపించాను. “ఇవన్నీ చదివింది కాక, ప్రింట్స్ తీసుకున్నారు కూడానా!” కొద్దిగా ఆశ్చర్యంతో నవ్వారు. నిజానికి ఆయన రచనలు పడిన పత్రికలన్నీ, ఆ నాటి ఆంధ్రపత్రిక, యువ లతో సహా ఆయన దగ్గరున్నాయి. పాత పత్రికల ప్రసక్తి రాగానే, నేను చూపిస్తాను రండి, అని లేచెళ్ళి సొరుగులలో శ్రద్ధగా పేర్చిన పత్రికలన్నీ చూపించారు. అందులో ఆ ఏడు కథలే మళ్ళీ మళ్ళీ పునర్ముద్రితమైన పత్రికల కాపీలన్నీ ఉన్నాయి.}

మీ మీద ఏ రచయితలైనా ప్రభావం ఉందా? మీ కథలు చదివితే అలా అనిపించదు మరి…

ఏ రచయిత మీదైనా ఒక దశలో ఎవరిదో ఒకరిది కొంత ప్రభావం ఉంటుంది. రాస్తూ ఉంటే కొన్నాళ్ళకి అది మాయమై పోతుంది. నా మీద కూడా మొదట్లో కుటుంబరావు ప్రభావం ఉండేది. ఆ ప్రభావంతో రాసిందే సత్యనారాయణ వ్రతం కథ. ఆ తర్వాత నా మీద ఎవరి ప్రభావమూ లేదు.