గోపిని: ఎర్రమట్టి గోడ

తూరుపోనలో
ఎర్రమట్టి గోడ వొంటిగా తడస్తా వుండాది
చూర్లో నుంచి రాలిపడిన కలలు
నీటిమింద పగిలిపోతా వుండాయి
వొక్కటిగూడ చేతికందడం లేదు
మోడం తునిగి పడింది
దొడ్లోని గొర్రెలు బెదిరి
వొకదాని యెనక వొకటిగా దడిమింద నుంచి ఎగిరిదూకినాయి
బాయిలోకి దొరువిల్లి పూడిసింది
చేనంతా గొర్రెల తాత మట్టిపాదాలు
వాన ఇంగా పెవలమైంది!
ఎద పొంగి ఏరైంది!!
ఎర్రమట్టి గోడ పెళ్ళలు పెళ్ళలుగా రాలిపడతా వుండాది
కొత్తచెరువులో పిల్లాగుంతలేసిన గూడను
అటకమింద చెదులు తినేసింది
అండ చెక్కిన పారకు చిలుం పట్టింది
గిరగిరా తిరగతా
కిలకిలా నగతా వుండేటి కపిలచెక్రం
చీకటి మూలన పాణమిడిసినిద్
ఊయలూపిన మంచం వొంటిదైంది
వొగ పాటలేదు
వొగ మాటలేదు
నేలను పెళ్ళగించిన మడక నుడుములిరిగి
వొరిగి పూడిసింది
మేడిపట్టిన చేతులు
అండతీసిన చేతులు
ఇత్తనాలు చల్లిన చేతులు
పైరును తడిమిన చేతులు
కట్టిపుల్లలయినాయి
మట్టోళ్ళు మట్టిలోనే కలిసి పూడిసింది
పచ్చని చేనుకు పిడికెడు సత్తువయింది
ఢమఢమ వురుములు
తళతళా మెరుపులు
ఇంగా ఇంగా వాన పెవలమైంది!
రాత్రంతా ఎర్రమట్టి గోడ తడిసీ తడిసీ
కుప్పగా కూలిపూడిసింది


పొద్దున్నే లేచి చూస్తే
పచ్చికలో గొర్రెలు మేస్తా వుండాయి
ఒగ గొర్రె
పిల్లను ఈని మాయపొరను నాకతా వుండాది