నడిజాము సీకట్లో సనసన్నని మంచుతుంపర
వొణకతా
తడస్తానే ఉండాది వొంటి చింతచెట్టునిద్దర కొమ్మల్లో ఒదిగిన కొంగలు ఉలికులికి పడతా ఉండాయి
ఆకాశం కండ్లల్లో మెరస్తా మిలమిలా మిణగరబూసులు
దీగూట్లో తెగిన దీపం రెప్పలు
ఆకరిచూపు కొనపాణంతో కొట్టకలాడతా ఉండాది
తలతెగిన ఉడత తడి ఇసికలో పొర్లాడతా ఉండాది
రెక్కల్ని రెపరెపలాడించింది ఉత్తీత!
“ఉడత తలతెగింది ఉత్తీతా! ఊరు నెత్తురు మడుగైంది ఉత్తీతా!!
సద్ద కంకులకు బదులు ఉత్తీతా!
వేటకొడవండ్లు మొలిసినాయి ఉత్తీతా!
చెండుమల్లెపూలకు బదులు ఉత్తీతా!
నాటుబాంబులే పూసినాయి ఉత్తీతా!!
ఉడత తలతెగిద్ని ఉత్తీతా! ఊరు వల్లకాడైంది ఉత్తీతా!!”గువ్వ గొంతులో సనసన్నని దుక్కం తుంపర
తడస్తా ఒణకతా వుండాది పాట!
పలుపుతాడు తెంపుకుని
కట్టుగూటాన దేసిపుగిత్త రంకెలేసింది
తడిసిన చుక్కలు పలపలా రాలిపడినాయి
తోక పైకెత్తి పరుగు పెట్టింది
గిట్టలకు మంటలంటుకున్నాయి!గణగణా గంటలమోత!!
బుసపెడతా
కొమ్ముల్ని ఇదిలించి పాముపుట్టను కుళ్ళగిస్తా వుండాది
కోటిపుంజు కంటిలో కరకరా పొద్దు మొలిచింది
“పొలోపొలి… పొలోపొలి!ఇలలిల్లారే… ఇలలిల్లారే పొలోపొలి”
పొడిసిన పొద్దును
వేటకొడవలితో ఒక్కవేటుకు తెగనరికింది నాగమ్మవ్వ
తెగిన మొండెం ఆకాశెంలో గిలగిలా తన్నుకుంటా వుండాది
పచ్చని పంటచేనుల్లో నెత్తుటి కూడు పొలి చల్లి కురుల్ని ముడేసింది
తెల్లవారుఝామున
సీలికలు పేలికలైన చీకట్లో సనసన్నని నెత్తురు తుంపర
తడస్తా
వొణకతానే ఉండాది రాళ్ళగూటిలో ఉత్తీతపాట!
(ఉత్తీత ఎడారిగువ్వ. గులకరాళ్ళతో గూడును నేలపై అల్లుకుంటుంది)