ఆకులు రాలిన అరణ్యంలో వర్షం పడుతున్న చప్పుడు
దిసమొలతో స్నానం చేస్తూ చెట్లు
తడిరెక్కల్ని రెపరెపలాడిస్తూ పక్షులజంట
రవీంద్రుని గీతమై ఎదలోయల్లో
హోరున కురుస్తున్న వాన!
తడిపాదాలతో మెలమెల్లగా నడిచొచ్చావు
చేతులతో కళ్ళు మూశావు
నుదుటిని ముద్దుపెట్టుకున్నావు
తడిసిన శరీరం నులివెచ్చని మంట
కోరికను వెలిగించుకుని ముఖం దీపమై నిల్చుంది
నా మీదకు వాలి అలవోకగా పెదాలనందుకున్నావు
వర్షం పడుతూనే ఉంది
గోరువెచ్చని పాలలోకి తేనెచుక్కవై జారిపోయావు
నువ్వు ఇచ్చిన ఏడురంగుల గాలిపటాన్ని
ఆకాశంలోకి ఎగరేశాను
వర్షం ఆగిపోయింది
నువ్వు వెళ్ళిపోయావు
తడికళ్ళల్లో నువ్వు
ఒంటరి అరణ్యాన్ని నేను