తానా బహుమతి కథల మరో విశ్లేషణ

(ఈ వ్యాసం కొద్దిరోజుల క్రితం “నీహార్‌ఆన్‌లైన్‌”లో అభిప్రాయవేదికలో ప్రచురితమైంది. ఐతే, ఈ వ్యాసంలో పరిశీలించిన కథలు ఇక్కడ “ఈమాట” లో ప్రచురించినందువల్లనూ, “నీహార్‌ఆన్‌లైన్‌”లో జరిగిన ఎడిటోరియల్‌ మార్పుల వల్ల క్రమం కొంత దెబ్బ తినటం వల్లనూ, “ఈమాట” పాఠకులకు కూడా ఈ పరిశీలనని అందించాలనే ఉద్దేశం తోనూ ఇక్కడ ప్రచురిస్తున్నాం.)

కొద్దిరోజుల క్రితం తానా 2001 కథానికల పోటీలో గెలిచిన కథల గురించి మృణాళిని ఓ చిన్న సమీక్ష రాశారు. ఐతే ఏకారణాల వల్లనో వారు ఆ వ్యాసంలో లోతుకు వెళ్ళలేకపోయారు. అలాగే తానా వారు ఒక “సమీక్షాపత్రాన్ని” విడుదల చేశారు (దాన్ని http://eemaata.lekha.org/issue16/taanaa.html అనే చోట చదవొచ్చు). అది కూడా కేవలం పైపైనే స్పృశించింది. ఈకథల్ని ఇంకా లోతుగా విశ్లేషించి పరిశీలించవలసిన అవసరం ఉందని భావించి అలాటి ప్రయత్నాన్ని చేస్తున్నానిప్పుడు. ఐతే స్థలాభావం వల్ల పొగడ్తల కన్నా విమర్శలు ఎక్కువగా ఉండబోతున్నాయని ముందుగానే హెచ్చరిక.

మృణాళిని గారు వస్తుపరంగా ఈ మూడు కథలూ “జీవనభీభత్సాన్ని” చిత్రిస్తున్నాయన్నారు. ఇది చాలా విశాలమైన (general) అబ్సర్వేషన్‌. ఎందుకంటే బహుశ కొంచెం ఓపిగ్గా వెదికితే సమకాలీనకథ దేన్లోనైనా ఏదో ఓ కోణంలో జీవనభీభత్సాన్ని కనిపెట్టొచ్చునని నా విశ్వాసం.

తొలికథ “అస్తిత్వానికి అటూ ఇటూ..” చాలా తాపీగా ఓపిగ్గా రాసిన కథ. ఒక సంఘటన చుట్టూ అల్లిన కథ. ఆ సంఘటన ప్రభావం ఇద్దరు వ్యక్తుల మీద ఎలా ఉందో వివరించే కథ. సంజీవి తన తల్లి అస్థికల్ని త్రివేణీసంగమంలో నిమజ్జనానికి తీసుకెళ్తే అక్కడ అతనికి ఎదురయ్యే అనుభవాల్ని చాలా విపులంగా వివరిస్తుంది. చివర్లో చావుబతుకుల సందిగ్ధంలో అతనికీ అతని మిత్రుడు జానీకి కలిగిన “జ్ఞానోదయమే” ఈకథకీ దీని పేరుకీ ప్రాణం.

ఈ కథలో ఆకర్షణీయమైన అంశాలు వాస్తవికత (కథ మొత్తంలో కాదుగాని, చాలా భాగం), పరిసరాల గురించి లోతైన పరిశీలన, చక్కటి నుడికారాల్తో కూడిన తెలుగు.

ఐతే ముగింపుకి మూలమైన సంఘటన, దాన్నుంచి కథలోని రెండు ముఖ్యపాత్రలూ పరస్పర విరుద్ధమైన పాఠాలు నేర్చుకోవటం అన్న కొసమెరుపు, కృత్రిమంగా అనిపిస్తాయి. ఇలాంటి ముగింపు కూడా కొత్తది కాదనీ, ఎప్పుడో “తులసిదళం” కాలంలోనే యండమూరి ఈ టెక్నిక్‌ ని విస్తృతంగా వాడారనీ ఎవరికీ గుర్తుచెయ్యక్కర్లేదు.
అలాగే, పాత్రచిత్రణ కూడ అవకతవగ్గా అనిపిస్తుంది. ఉదాహరణకి, చిన్న విషయమైనా పాఠకుల్ని కొంత తికమకపెట్టేది “జానీ” అనేది ముస్లిం పేరు కావటం, ఆ విషయం మనకు కథ చివరివరకూ తెలియకపోవటం. కథ చివరివరకు అతని ప్రవర్తనలో గాని భాషలో గాని భావనల్లో గాని ఈ విషయాన్ని పట్టిచ్చే హింట్‌ కూడ కనిపించదు. అలా అప్పటివరకు కథకి ఏమాత్రం అవసరం లేని అతని మతం చివర్లో హఠాత్తుగా ఎందుకు అవసరమైందో అర్థం కాదు.

అలాగే, ముఖ్యపాత్రలైన సంజీవి, జానీల గురించి మనకు తెలిసేది చాలా కొద్ది. తెలిసిన ఆ కొద్ది దాన్ని బట్టి సంజీవి పాత్ర పాఠకుల సానుభూతి పొందగలిగేట్టు కనపడదు. స్థూలంగా అతని ప్రవర్తన రెండు విధాలుగా కనిపిస్తుంది తనకెంతో సహాయం చేస్తున్న స్నేహితుణ్ణి చీటికీ మాటికీ విసుక్కోవటం, ఏమాత్రం తన అదుపులో లేకుండా జరిగిపోయే సంఘటనల గాలికి కొట్టుకుపోవటం. జానీ ఎందుకు అలాటి “మిత్రుణ్ణి” అంతగా అంటిపెట్టుకుని తిరుగుతాడో మనకి కారణం కనిపించదు.

నిజానికి ఈ ముఖ్య పాత్రల గురించి కన్నా పురోహితుడు, ఫలహారాలకి ఆర్డర్‌ తీసుకునే పాపల గురించి మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.

మరోలోపం ఏమిటంటే కథ చివర్లో సంజీవిలో కలిగిన పరిణామానికి ఎంతో విశాలమైన నేపథ్యం (కథ మొదలైన దగ్గర్నుంచి కథ చివరి ఘట్టంలో జరిగే ముఖ్యసంఘటన ముందు వరకు)కనిపిస్తే, జానీ విషయంలో అలాటిదేమీ కనిపించదు. సంజీవితో పాటు జానీ కూడా ఈ అన్ని సంఘటనల్ని చూసినా, అతను కేవలం ప్రేక్షకుడు; పైగా సంజీవిని కలవరపరిచిన సంఘటనలు ఏవీ జానీని అంటినట్టు మనకు కనీసం ఓ హింట్‌ కూడ దొరకదు. దీనివల్ల అతని పరివర్తన హఠాత్తుగా, కేవలం ముగింపు కోసమే కలిగినట్టు కనిపిస్తుంది.

ముఖ్యంగా ఈ కథ గురించి నాకున్న అసంతృప్తి ఏమిటంటే, ఈ కథలో మనం చూసే “జీవనభీభత్సానికి” కారణాలు “ఐతే డబ్బు, కాకుంటే దైవం” అని కథ చివర్లో తీర్మానించటం. అంటే ఈకథ మనకు చెప్పేది “ఐతే మెటీరియలిస్టువి అవ్వు, లేకుంటే కర్మసిద్ధాంతాన్ని నమ్ము” అనేది.

శిల్పరీత్యా ఇది సరళరేఖలో సాగే కథనం. ఐతే నాకు నచ్చిన ఒక శిల్పప్రక్రియ ఏమిటంటే ఈ కథ దాదాపు చివరివరకు బాగా జనసమ్మర్దం ఉండే సన్నివేశాల్తో నిండి (రైల్వే స్టేషన్‌ నుంచి గంగ ఒడ్డు దాకా) చివర్లో ముఖ్యపాత్రలకి ఏకాంతం కలిగించటం. ఇది “జీవనయానంలో ఎవరిదారి వారే వెదుక్కోవాలి, ఎవరి హృదయం వారే చదువుకోవాలి” అనటానికి ప్రతీకలా అనిపించింది నాకు.

ఇక రెండవ కథ “టైటానిక్‌”. దీన్లో కొట్టొచ్చినట్టు కనిపించేది టెక్నిక్‌. హాలీవుడ్‌ సినిమాల్లో, ముఖ్యంగా సైన్స్‌ ఫిక్షన్‌ (12 Monkeys ఓ మంచి ఉదాహరణ), సైకలాజికల్‌ త్రిల్లర్స్‌లో వాడే కథనపద్ధతి కనిపిస్తుంది. అంటే కథనం కాలానికి కాకుండా సన్నిహిత సంబంధం ఉన్న దృశ్యాలకి ప్రాధాన్యత ఇస్తుంది. అందువల్ల కాలంలో ఒకేదిశలో సాగదు. అంతేకాకుండా ఒకే వ్యక్తి అనుభవాల గురించి కూడా కాదు. ఇలా రెండు దిశల్లో (dimensions) ప్రతిసరళం (non-linear) గా వెళ్ళే కథనం నాకు తెలిసినంతవరకు తెలుగు కథల్లో ఇదివరకు రాలేదు. ఈకథ చదివేప్పుడు ఒక సినిమాని చూస్తున్నట్టు ఊహించుకుంటే బాగుండేట్టు అనిపించింది.

టూకీగా చెప్తే, ఈకథ ఒక ప్రభుత్వ సంస్థ ఎందుకు, ఎలా, ఎవరి మూలాన మూలబడిందో, దాని ప్రభావం అక్కడ పనిచేసిన కొందరి మీద ఎలా పడిందో చూపిస్తుంది.

ఐతే టెక్నిక్‌ని కొంచెం పక్కన ఉంచితే, మిగతా కథనంలో అపరిపక్వత, వేర్వేరు విషయాలకు ఇచ్చే తూకంలో అసమతుల్యత, పాత్రల చిత్రణలో అస్పష్టత దీన్లో ఉన్న కొన్ని లోపాలు. ఉదాహరణకి, ఈ కథలో ముఖ్యపాత్ర ఎవరో కూడ స్పష్టంగా అర్థం కాదు. స్థూలస్థాయి (macroscopic level) లో బాగున్న టెక్నిక్‌ సూక్ష్మస్థాయి (microscopic level) లో వీగిపోతుంది. అంటే, సంఘటనల్ని చూపించటంలో ఏది ముఖ్యమో ఏది కాదో అన్న విభజన స్పష్టంగా కనిపించదు. చాలాచోట్ల “సంఘటన” రూపం ఓ వస్తువునో స్థలాన్నో వర్ణించటం, అక్కడి వ్యక్తుల మధ్య జరిగే (కథకి సంబంధం లేని) సంభాషణని వినిపించటం.

ముందు కథలాగే ఇది కూడా జీవనభీభత్సాన్ని చిత్రిస్తూ, దానికి కారణాలు రాజకీయ నాయకులు, కేపిటలిస్ట్‌ వ్యాపారరంగం, వాణిజ్య ప్రపంచీకరణ అని తేలుస్తుంది. ఐతే వీటిలో చివరి దాన్ని గురించి మాత్రం పెద్దగా సమర్థన కనిపించదు హఠాత్తుగా వచ్చే చైనా ప్రసక్తి తప్ప.

దీన్లో కూడ ముఖ్యపాత్రలు అశక్తులు. పరిసరాల చేతిలో కీలుబొమ్మలు. ఈ పాత్రల సమస్యలకి ఎవరు కారకులో చెప్పి వాళ్ళ మీద కోపమూ ఈ పాత్రల మీద జాలీ కలిగించటం కథ ప్రధానోద్దేశమైతే అది నెరవేరినట్టే. కాని ఒకరినొకరు చూసుకుని జాలిపడటం వల్ల ఎవరికీ ఏమీ ప్రయోజనం ఉండదు కదా! దీనికి పరాకాష్ట కథ చివర్లో శ్రీహరి “మీకే కాదు మాకూ ఉద్యోగాలు పోయాయి” (direct quote కాదు, సారాంశం మాత్రమే) అని రాజారావుని ఊరడించబోవటం. వాణిజ్యప్రపంచీకరణ ద్వారా ఇండియాకి నష్టం కలుగుతోందని బాధపడే కథకులు అదే కారణం వల్ల సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఇండియా ఎంతో అభివృద్ధి సాధించిందని, దానివల్ల భారతీయులెందరికో ఎంతో ఉపయోగం కలిగిందని, గుర్తించటం అవసరం. అలాగే కథలు రాసి ప్రపంచీకరణని ఆపలేం గనుక, ఆ పరిధికి లోబడి, అత్యధిక సంఖ్యాకులకి ప్రయోజనం కలిగే దారిలో వెళ్ళాలంటే దానికి మార్గాలేవిటో ఆలోచించటం, ఆలోచించి ఆ మార్గాల్ని పరిశీలించే రచనలు చెయ్యటం, కూడా అవసరం అనుకుంటాను.

పై దాని లాగే ఇది కూడా చాలా విశాలమైన కథ. చాలా విపులంగా ఇచ్చిన ఎన్నో వివరణలు కథాగమనాన్ని అక్కడక్కడ అడ్డుకుంటాయి కూడ. అంతేకాకుండా అనేక సంఘటనల మీదికి వెళ్ళటం వల్ల కథలో తీక్షణత (focus / intensity) లోపించింది.

చివరగా మూడో కథ “నీడ” కూడా సమాజంలో విపరీతంగా విస్తరిస్తున్న వినియోగదృక్పధం (consumerism) తరాల దారుల్ని ఎలా దూరం చేస్తుందో చూపిస్తుంది. కొత్తతరాలు న్యాయాన్యాయాల్ని పక్కన పెట్టి డబ్బు వెంట ఎలా పరుగెత్తుతున్నాయో ఒక రాయలసీమ కర్షక కుటుంబ నేపథ్యంలో చూపిస్తుంది. ఐతే ఈకథ మూలాంశం ఇప్పటికి ఎన్నో సార్లు చదివిందే, ఎన్నో సినిమాల్లో కూడా చూసిందే. కాని ఈకథలో సంభాషణలు, కనీసం కొన్ని పాత్రలు, సహజంగా ఉన్నయ్‌. కథనశిల్పంలో ఏమీ ప్రత్యేకతలు లేకున్నా ఎక్కడా కుంటుపడకుండా తాపీగా, సరళంగా సాగింది. చక్కటి భాష.

ఐతే మిగిలిన వాటి లాగే ఈకథలో కూడ పాత్రలు గాలివాటం మీద వెళ్ళేవే. పరిస్థితులకి ఎదురు తిరక్కుండా చేతులెత్తేసేవే (లేకుంటే దుఃఖంతో చచ్చేవే).

మొత్తం మీద అన్ని కథలూ ఇచ్చే సందేశం “మన చేతుల్లో ఏమీ లేదు, మనకి అతీతమైన శక్తులు మన జీవితాల్ని నడిపిస్తున్నాయి. అవెటు తీసుకెళ్తే అటు పోవటమే మన పని” అనేది. నా దృష్టిలో,ఇది హర్షదాయకం కాదు. అలాగే, పోటీలకు వచ్చిన వందల కథల్లో ఇవే ఉత్తమమైనవి కావటం తెలుగు కథకి ఆనందకరమూ కాదు.