జోలపాట

“అక్కడ చాలా తమాషాగా వుంటుందని మాటిమాటికీ వూరించకపోతే అదేమిటో యిప్పుడే చెప్పెయ్యరాదూ?” అన్నాడు కిరణ్‌ విసుగ్గా.
అరగంట నుంచి ప్రసాద్‌ “అదిగో, యిదిగో” నంటూ గడపటమే గాని అసలు విషయం తేల్చడు. బిపాషా సిన్మా “జిస్మ్‌”కి కూడా వెళ్ళనివ్వకుండా ఆపి అంతకన్నా రసవత్తరమైన ప్రోగ్రాం ఫ్రీగా చూపిస్తానని యిటు తీసుకొచ్చాడు.

మోటర్‌బైక్‌ ఆగింది. ఎదురుగా బంగారు రంగు అక్షరాల్లో “మబ్బులపాలెం పెద్దరాజా కళాకేంద్రం” అన్న పెద్ద బోర్డ్‌!
ప్రాంగణం అంతా తాత్కాలికంగా తెచ్చిపెట్టిన అరటిచెట్లతో నిండిపోయి వుంది. ఎక్కడ చూసినా రకరకాల రంగులపూలు.కలగాపులగంగా వాసనలు. ఎంతో పరిశుభ్రంగా ఉన్న పరిసరాలు.

ఐతే, ఆ ప్రదేశం అంతా నిర్మానుష్యంగా వుంది. ఓ వింత నిశ్శబ్దం.

ఆశ్చర్యంగా మిత్రుడి వంక చూశాడు కిరణ్‌. “ఇప్పుడే ఏవైంది, అసలు కథ ముందుంది” అన్నట్టు కళ్ళెగరేసి చిన్న చిరునవ్వుతో ఆ భవనం వెనక వైపుకు దారితీశాడు ప్రసాద్‌.
“మెయిన్‌ ఎంట్రెన్స్‌ ఎదురుగానే వుందిగా?” అన్నాడు కిరణ్‌ తికమకపడుతూ.
“మనం ముందుగా  వెళ్ళాల్సిన చోటు అటుంది” అంటూ నడిచాడు ప్రసాద్‌.

హఠాత్తుగా కలకలం, హడావుడి మాటలు, ఆడవాళ్ళ ఆభరణాల గలగలలు, పట్టుబట్టల పరపరలు. నవ్వులు, కిలకిలలు.

చటుక్కుమని ఆగిపోయాడు కిరణ్‌
ఎవరో హఠాత్తుగా తన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్న ఫీలింగ్‌!
చూస్తూండగానే ఎవరో ఆగంతకుడు తన ముందునుంచి గభాల్న లేచి నిలబడి ఓ వెర్రినవ్వు నవ్వి చకచక వెళ్ళిపోయాడు. మిలమిలలాడే  సిల్కు లాల్చీ, రెపరెపలాడుతున్న పట్టు పంచె, పైన తెలుపు ఎరుపు రంగుల జరీ కండువా!
ఎవరా అని ఆశ్చర్యంగా చూసే లోగానే మళ్ళీ ధడేల్‌ మని శబ్దం!
అప్రయత్నంగానే ప్రసాద్‌ వంక చూశాడు వింతగా.
“పంచె అలవాటు లేదు పాపం! దానికి తోడు అంత కంగారుగా నడవటం ఎందుకో?” అన్నాడు ప్రసాద్‌ సానుభూతిగా.
అంతకుముందు తనకొచ్చిన ఆలోచనకి తనే నవ్వుకున్నాడు కిరణ్‌.

చూస్తూండగానే ఓ పదిమంది మగవాళ్ళు, ఐదారుగురు ఆడవాళ్ళు గలగలమని మాట్లాడుతూ బయటికొచ్చారు.
మగవాళ్ళంతా పట్టుపంచెల్లో తళతళలాడుతోంటే ఆడవాళ్ళంతా పట్టుచీరల్లో ధగధగమంటున్నారు!
అందరూ చాలా జాగ్రత్తగా అంచులు ఎత్తిపట్టుకుని అడుగులో అడుగేసుకుంటూ నడుస్తున్న ఆ దృశ్యం చూట్టానికి గమ్మత్తుగానే వుంది.
“ఏమిటి, ఇక్కడేమైనా సిన్మా షూటింగా?” గుసగుసగా అడిగాడు కిరణ్‌ ఉత్సాహపడిపోతూ.
మాట్లాడకుండా వాళ్ళంతా బయటికి వచ్చిన గదిలోకి నడిచాడు ప్రసాద్‌.

ఎడం వైపు ఓ బల్ల, దాని వెనకో కుర్చీ. దాన్లో ఓ పేంటూ చొక్కా వ్యక్తి.
కుడి వైపు కూడ అదే ఫర్నిచరు. ఐతే ఆ కుర్చీలో ఓ పంజాబీ డ్రెస్‌ యువతి.
పేంటు వ్యక్తి దగ్గరికెళ్ళాడు ప్రసాద్‌. “రెండు ఫుల్‌” అన్నాడు.
“పైకా కిందకా?”
“కిందకి”
“ఐతే రెండు వేలు” అన్నాడా వ్యక్తి, వాళ్ళిద్దర్నీ ఒక్క క్షణం పాటు ఎగాదిగా చూసి.
అతనికి డబ్బిచ్చాడు ప్రసాద్‌.
ఓ చిన్న గది వంక వేలు చూపిస్తూ, “వెళ్ళి ఊడదియ్యండి, నేనిప్పుడే వస్తా” గర్జించాడతను, లేచి హడావుడిగా మరో గదిలోకి వెళ్తూ.
ఇద్దరూ ఆ చిన్న గదిలోకి వెళ్ళారు. ప్రసాద్‌ చేసినట్లే తనూ చేశాడు కిరణ్‌.
“మీరు మాట్లాడుకున్నది ఏ భాషలోరా? నాకు ఏవీ అర్థం కాలేదు!” అడిగాడు కిరణ్‌.
ఆ పేంటు వ్యక్తి లోపలికి వస్తూనే అందుకున్నాడు “కొత్త అనుకుంటాను మీకు. నేను పైకా కిందకా అన్నది మీరు స్టేజి మీదికి ఎక్కుతారా లేకపోతే ఆడియన్సులో కూర్చుంటారా అని. స్టేజీ ఎక్కేవాళ్ళకి కొన్ని ఎక్స్ర్టాలుంటాయి కదా, అందుకన్న మాట. ఇక ఫుల్‌ టికెట్‌ సంగతంటారా ఇప్పుడు మీరే చూస్తారు” అంటూనే
అరనిముషంలో ఇద్దరికీ పట్టుపంచెలు కట్టేసి, జరీకండువాలు కుట్టేసి వున్న సిల్కు లాల్చీలు తొడిగేసి, మధ్యపాపిడితో జుట్లు దువ్వేసి, వాళ్ళ అవతారాలు పూర్తిగా మార్చేసి బయటికి తీసుకొచ్చాడతను. “మీకు సరిపోయినవి వేసుకోండి” అని అక్కడున్న తోలుచెప్పుల గుట్ట వంక చూపించాడు.
“జంధ్యాలు వేసుకోనక్కర్లేదా?” వెటకారంగా అడిగాడు కిరణ్‌, ప్రసాద్‌ని.
“మీరు వెళ్తున్నది ఇక్కడి సభకే కదా? ఐతే అక్కర్లేదు. వెనక వీధి విజ్ఞానభవనం సభకైతే కావాలి” అన్నాడా పేంటు వ్యక్తి నిమ్మకు నీరెత్తినట్టు. ఖంగుతిని తమాయించుకున్నాడు కిరణ్‌.
“మరి ఈ పంచెలు మధ్యలో ఊడి మా పరువుతియ్యవు కదా?”
“అలాటి అనుమానమే వద్దు. మీరొచ్చేటప్పుడు పడుతూ లేస్తూ గునగున నడిచే ఓ కవిగార్ని చూసే వుంటారు.  అన్నిసార్లు బొక్కబోర్లా పడి మోకాలి చిప్పలు పగలగొట్టుకున్నా ఆయన పంచేమైనా ఊడిందా?”
“నిజమే!” ఒప్పుకున్నాడు కిరణ్‌.

ఇద్దరూ బయటకు వచ్చి మెయిన్‌ ఎంట్రెన్స్‌ వైపు నడిచారు.
అక్కడ ఓ యాభై మంది దాకా బయటే నిలబడి వున్నారు. కొందరి చేతుల్లో వీధికుళాయిల్లో పట్టిన నీళ్ళతో బిందెలు, మరికొందరి చేతుల్లో ఏదో తెలియని ద్రవం నింపిన పన్నీరుబుడ్లు!
ఓ ఇద్దరు మాత్రం కాషాయం రంగు శాలువలు కప్పుకునివున్నారు.

ఇంతలో ఓ నాలుగైదు కార్లు వచ్చి ఆగాయి. అంతే! కాషాయం వారు కయ్యిమని ఏదో ఉచ్చారణ ప్రారంభించేశారు. అది ఏ భాషో వాళ్ళు ఏమంటున్నారో కిరణ్‌కి ఏ మాత్రం బోధపళ్ళేదు. ఏమైనా, అందరూ గుంపుగా ఆ కార్ల దగ్గరకు వెళ్ళారు. బిందెల వాళ్ళు ముందుంటే వాళ్ళ వెనకనే కాషాయం వారు, ఆ వెనక మిగిలిన వాళ్ళు.

మొదటి కార్లోంచి ఓ వ్యక్తి దిగాడు.
తలపైన ఎ్తౖతెన కిరీటం!
మెళ్ళో రకరకాల హారాలు, ఆభరణాలు!
కాళ్ళకు వింతైన పాదుకల్లాంటి చెప్పులు! వాటికి ఎన్నెన్నో అలంకారాలు!!
“ఒరేయ్‌, కృష్ణపాండవీయం సిన్మాలో దుర్యోధనుడి గెటప్‌లా వుందే!” అన్నాడు కిరణ్‌ ప్రసాద్‌తో.
“ఛుప్‌” అంటూ అతని నోరు టక్కుమని మూశాడు ప్రసాద్‌.
“పెద్దరాజా వారు హృషీకేశం నుంచి వచ్చిన గంగా పవిత్రోదకం పుచ్చుకోవాలి” అంటూ ఓ బిందెలోంచి కొన్ని నీళ్ళు తీసి వారి చేతిలో పోశాడో కాషాయం వ్యక్తి. దాన్ని వినమ్రంగా అందుకొని తాగారు రాజా వారు.

అంతలో ఎక్కడ్నుంచి ఎలా వచ్చాయో పెద్ద పెద్ద పూలమాలలు ప్రత్యక్షమయ్యేయి.
ఒక్కో దాన్ని ఇద్దరు వస్తాదులు మోసుకొచ్చి కార్లలోంచి దిగుతున్న వారి మెడలో ఒక్క క్షణం వేసి(నట్లు నటించి) ఫోటోలు, విడియోలు కావటం తోనే తీసి పక్కన దాస్తున్నారు.
కాషాయం వారి భాషాతీత (భాషారహిత?) మంత్రోచ్చారణ అలాగే సాగుతుండగా అందరూ ద్వారం దగ్గరకు నడిచారు.

లోపల ఓ ఇంద్రభవనంలా అలంకరించబడి వుంది. స్టేజి మీద తొమ్మిది ఆసనాలు. వాటిలో మధ్య వున్నది సింహాసనంలా వుంది.రాజా వారు ముందుగా వెళ్ళి ఆ సింహాసనానికి నమస్కరించి దాన్లో కూర్చున్నారు. అప్పటిదాకా మిగిలిన వారెవరూ లోపలికి వెళ్ళటానికి వీల్లేదని ద్వారం దగ్గరే ఆపేశారందర్నీ.ద్వారం దగ్గర ఇద్దరు వ్యక్తులు చెరో పక్క నిలబడ్డారు. వాళ్ళ చేతుల్లో నోటు పుస్తకాలు.
“పేరు?” లోపలికి వెళ్ళనిచ్చే ముందు ఒక్కొకర్నే అడిగి రాసుకుంటున్నాడు వాళ్ళలో ఒకతను.
ఎగాదిగా పైకీ కిందికీ చూసి ఓ అంకె చెప్తున్నాడు రెండో అతను. మొదటి అతను అదీ రాస్తున్నాడు.

ముందుగా ప్రసాద్‌ లోపలికి నడిచాడు.
“యాభై” అన్నాడు ద్వారం దగ్గరతను.
“నేను ఓ కొత్త సభ్యుణ్ణి కూడా తీసుకొచ్చాను” అన్నాడు ప్రసాద్‌.
“ఐతే వంద” అన్నాడతను మళ్ళీ. ఆనందంగా లోపలికి నడిచాడు ప్రసాద్‌.
అవేమిటో తెలీదు గాని కిరణ్‌కి “యాభై” పాయింట్లు పడ్డాయి.

లోపలికి వెళ్ళి నాలుగో వరసలో కూర్చున్నారిద్దరూ.

రాజుగారు ఒక్కసారి సభనంతట్నీ పరికించేరు.
చిరు దరహాసంతో మీసం దువ్వుకున్నారు.
వారికి క్షణం పాటు గతం గుర్తుకొచ్చింది

మబ్బులపాడు పెద్దరాజు గారి సంగీత సన్మాన సభాభంగం గురించి ఇదివరకే మనవి చేసేను. అప్పుడు వారు తాత్కాలికంగా ఖిన్నులై తమ ధనాగారంలో విశ్రమించేరని కూడా చెప్పేను.

అప్పుడు వారి మస్తిష్కంలో ఓ మహత్తరమైన ఆలోచన రూపుదిద్దుకొంది.
అంతే కార్యశూరులు గనుక వెంటనే దాన్ని అమలు చేసేరు.
అప్పటినుంచి నెల నెల పెద్దపాలెం వెళ్ళి అక్కడే ఒక్కో నెలకు ఒక్కో వూరి పెద్దకు భారీ సన్మానం చేసే పద్ధతి ప్రవేశపెట్టేరు.
ఊరికే సన్మానం అంటే మళ్ళీ గొడవలొచ్చే అవకాశాలున్నాయని గ్రహించి ఈ సన్మానాలు ఓ ఉన్నతలక్ష్యాన్ని సాధించే సోపానాలని ఉద్ఘాటించేరు, ఉద్బోధించేరు.
ఇప్పటి తరాల వారు మన సంస్కృతినీ సంప్రదాయాల్నీ మంటగలిపేరనీ, మన విలువల వలువల్ని ఊడ్చేసేరనీ, ఈ అరాచకం ఇలాగే సాగనిస్తే మన అస్తిత్వానికి తిలోదకాలేననీ వారు గాఢంగా విశ్వసించేమని వక్కాణించేరు; అది తల్చుకుని పదేపదే నిశ్వసించేరు; ఎలాగైనా సరే ఈ పరిస్థితిని రూపుమాపాలని భీష్మించేరు.
అలాగే తమ సంగీత కౌశలాన్ని ఏ పెద్దపాలెం వీధుల్లో తిరస్కరించేరో ఆ వీధుల్లోనే ఎలాగేనా వినిపించి తీరాల్సిందేనని కూడ సంకల్పించేరు. (ఐతే ఈ విషయాన్ని మాత్రం గుంభనంగా తమలోనే దాచేసుకున్నారు వారు.)

ఉభయతారకంగా ఓ ప్రణాళికకు పునాది వేసేరు.
ఈ మాసికాల్ని ప్రారంభించేరు.
ఊరి పెద్ద తలకాయల్ని  ఒక్కొకర్నే సన్మానించసాగేరు.
ఆ సన్మానసభల్ని తమ చిత్తానికి నచ్చే విధంగా తీర్చిదిద్దేరు.

రాజుగారికి చిన్నప్పట్నుంచి పౌరాణిక నాటకాలన్నా పద్యాలన్నా ఎంతో అభిమానంగా వుండేవి. ఐతే అప్పట్లో వారి గాత్రం ఆ పద్యాలు పాడటానికి సహకరించక పోవటంతో పోనీ దుర్యోధనుడి ఏకపాత్రాభినయమేనా చేద్దామని కుతూహలపడ్డారు.మబ్బులపాలెంలో మకుటంలేని మహారాజుగా చలామణీ అయే రోజుల్లో ఒకటి రెండు సార్లు అందుకు ఒడిగట్టేరు కూడ. ఐతే మబ్బులపాడులో కళాహృదయం మృగ్యం కనుక ఎవరూ రాజుగారి అభినయసామర్య్థానికి పరవశులైనట్లు నటించకపోయేరు. పోగా, చప్పట్లు చరిచి మరీ వారిని వెక్కిరించటానికి కూడ సాహసించేరు.
దాంతో మనసు విరిగి ఆ అరసికుల ముందు తమ ప్రతిభ బూడిదలో పన్నీరౌతోందని గ్రహించి అప్పటికి నివురుగప్పిన నిప్పులా వుండిపోయేరు. ఇప్పుడు ఈ సన్మానమాసికాల సందర్భంగా ఆ దుర్యోధనవేషంలో మళ్ళీ ప్రకాశించసాగేరు వారు.

మరి తామొక్కరే రాజాలంకారాల్తో వుంటే అదేదో పగటివేషమని పామరులు భ్రమపడి బిచ్చం వేసే అవకాశం వుంది గనుక తమ సన్మానసభలో అగ్రాసనాల్ని అధిష్టించాలంటే ఎవరైనా సరే (తమ కంటే కొంచెం తక్కువ హోదాలో) రాజోచిత వేషాల్లో వుండాల్సిందేనని ప్రకటించేరు. అలా వేషాల్లో వచ్చిన వారికి పారితోషికంగా వరహాల సంచులు వేలాడదీయించేరు!

ఐతే అగ్రాసన వర్గం మాత్రమే అలా ప్రత్యేక వేషాల్లో వుంటే మిగిలిన వాళ్ళు చాటుగానేనా వాళ్ళనీ తమనీ కూడ హేళన చేసే సావకాశం వున్నదని సూక్ష్మబుద్ధితో గ్రహించి సభకు వచ్చేవారంతా సంప్రదాయ వేషభాషల్నే వాడాలని విధించేరు. ఎవరు ఎంత సంప్రదాయబద్ధులై వుంటే వారికి అంతగా పారితోషికాలిస్తామని వివరించి అందుకుగాను ఓ పద్ధతిని ప్రవేశపెట్టేరు.
సభకు వచ్చిన ప్రతివారు అక్కడ తమ వేషభాషలు, ప్రవర్తనల బట్టి మార్కులు సంపాయించుకుంటారు. సభ ఐపోయి వెళ్ళేటప్పుడు వారి వారి  మార్కులను బట్టి వారికి పారితోషికాలు అందుతాయి.

రాజుగారి ఈ పథకం కొంతకాలం పాటు దిగ్విజయంగా సాగింది.
ఊరి పెద్దలు సన్మానాలని పొందుతూ పారితోషికాలని అందుతూ వింతవింత వేషాల్లో వెలుగొందుతూ  హాయిగా వున్నారు.
రాజుగారు తమ లక్ష్యం ప్రకారం పౌరాణిక పాత్రాభినయాలు ప్రదర్శించటమే కాకుండా అడపా దడపా పాటల్లో మాట్లాడుతూ మాటల్లో పాటలు జోడిస్తూ తమ సంగీత పాటవాన్ని కూడ పెద్దపాలెం ప్రజల మీద ఒలికిస్తున్నారు. అక్కడి పత్రికల్లో తమ కీర్తికుసుమాల్ని విరబూయిస్తున్నారు.

ఐతే, వారి కూనిరాగం సందర్భంలో లాగానే సన్మానసభా కార్యక్రమంలో కూడ ఓ అవాంతరం వచ్చిపడింది
మబ్బులపాడు వలసవీరులు ఎవరికి వారే యమునాతీరే గాళ్ళనీ, ఎవరూ మరొకర్ని కించిత్తు లక్ష్యపెట్టరని ఇదివరకే మనవి చేసేను.
ఐతే, ఎవరేనా ఏదేనా చేసి పేరు కొట్టేస్తోంటే ఊరికే చూస్తూ ఊరుకునేంత చేతకానివారు కారు వారు.
“ఆ ఫలానా వారి పాటి మేము తినలేమా ఏమిటి? మాకన్నా వారేం ఎక్కువుష?” అని పోటీ వేసుకొని తామూ కీర్తి తెచ్చుకోవటమో లేక అందరూ కలిసి ఉమ్మడిగా అపకీర్తి తెచ్చేసుకోవటమో చేసేదాక మద్యం ముట్టరు వారు.

అంచేత
ముచ్చటగా మూడో మాసికం తర్వాత రాజుగారికి మళ్ళీ కష్టాలు ప్రారంభమయ్యేయి.
మబ్బులపాడులో కాస్తో కూస్తో ధనం వెనకేసిన ప్రతివారూ ఏదో ఒక వంకతో పెద్దపాలెంలో సన్మానసభలు పెట్టటం మొదలెట్టేరు!
కుల, మత, ప్రాంత, ఇంకా అనేకానేక భేదాలని బట్టి వడగట్టి కొత్త కొత్త పెద్ద తలకాయల్ని వెదికి పట్టి రోజుకో సన్మానం చేసెయ్యసాగేరు.
రాజుగారి సభాభవనానికి వెనక వీధిలోనే మరో భవనం కట్టించి మరీ ఈ అఘాయిత్యానికి ఒడిగట్టేరు వారు!
రాజుగారు ఒక్కో సన్మానితుడికీ వెయ్యి వరహాలు సమర్పిస్తోంటే రెండు వేలనీ మూడు వేలనీ వేలం వెర్రిగా విర్రవీగసాగేరు వీరు.

ఈ కోలాహలంతో పెద్దపాలెంలో సన్మానం జరగని పెద్దతలకాయలకి పెద్ద కరువొచ్చిపడింది.
పెద్దతలకాయలని పట్టుకు కూర్చుంటే పని జరగదని తలలకి పెద్ద పెద్ద తలగుడ్డలు చుట్టుకొని కనపడ్డ చిన్నతలకాయల వారికీ సన్మానాలు చేసేసేరు.
దాంతో పెద్దపాలెంలో తలగుడ్డలకు కరువొచ్చి పడింది.
పెద్దపెద్ద తలగుడ్డల్ని మోసీ మోసీ ఉన్న చిన్న తలకాయలూ ఇంకా బక్కచిక్కిపోయేయి.

ఇంక ఇలాకాదని ఎవార్డులు తెచ్చుకున్న వారికి తలకాయతో నిమిత్తం లేకుండా సన్మానం చేస్తామని ప్రకటించి కొంతకాలం పాటు  సుఖంగానే గడిపేరు.
కాని అలాటివాళ్ళు మాత్రం ఎంతకాలం దొరుకుతారు?
అప్పటికీ, ఎవరో సంస్థల వారే ఎవార్డులివ్వాలని పట్టింపు ఏమీ లేదనీ, తమకి తాము కాకుండా మరెవరిచ్చినా చాలుననీ తమ తొలినియమాన్ని కించిత్తు సడలించి చూసేరు.
దాంతో ఉత్సాహంగా ఒకరికి ఒకరు ఎవార్డులిచ్చుకుని కొన్నాళ్ళపాటు సన్మానకార్యక్రమాల్ని సజావుగానే నడిపించేరు.
కాని మన కుల మత ప్రాంత ఇంకా అనేకానేక విభేదాలు ఎవరుబడితే వారు ఎవరికిబడితే వారికి ఎవార్డులివ్వనివ్వవు గదా!
కనుక ఈ మార్గం కూడ కొన్నాళ్ళకి మూసుకుపోయింది.
అలా రాజుగారి లక్ష్యానికి మళ్ళీ ఓ అవాంతరం ఏర్పడే పరిస్థితి కలిగింది.

ఐతే ధీరగంభీరులూ దృఢచిత్తులూ కనుక వారు వెంటనే నిరాశ చెందలేదు.
సుదీర్ఘంగా ఆలోచించేరు.
ఓ పథకం వేసేరు.
“ఈసారి సన్మానం చెయ్యటానికి పెద్దపాలెంలో పెద్దతల లెవరూ మిగలలేదు గనుక మబ్బులపాలెంలో వుండే శ్రీ రో చమారా గారికి చెయ్యబోతున్నా”మని ప్రకటించేరు.

దాంతో ఓ వంక పెద్దపాలెంలోనూ మరో వంక మబ్బులపాడులోనూ కూడ అల్లర్లు చెలరేగేయి.
పెద్దపాలెంలో పెద్దతలలు లేవని అందరికీ తెలిసిన విషయమే ఐనా ఆ మాట మబ్బులపాలెం వారంటే చూస్తూ సహించటమా అని పెద్దపాలెం వారు ఆగ్రహిస్తే
మబ్బులపాడులో ప్రతితలా పెద్దతలే ఐతే ఈ రో గారికున్న గోరోజనం ఏవిట్టా? పెద్దపాలెం దాకా వెళ్ళి ఈ రో జీ ని హీరోగా పొగడాల్సిన అగత్యం ఎందుకటా? అంటూ మబ్బులపాడు వారు మబ్బుల్దాకా ఎగిరేరు.
“సన్మానానిక్కూడా పనికిరాని వారు పెద్దపాలెం వారు” అని మబ్బులపాడు వారు చంకలు గుద్దుకుంటే
“తలలసైజు చూట్టం కూడ చేతకాని వారు మబ్బులపాలెం వారు” అని పెద్దపాలెం వారు పళ్ళికిలించేరు.
ఈ స్వాభిమాన, పరస్పరావమాన కళాకౌశల ప్రదర్శనల నేపథ్యంలో
ఇప్పుడిలా ప్రారంభమౌతోంది రో గారి సన్మానసభ!

సభికులందరూ ఆశీనులు కావటం తోనే ఠంచనుగా సభాకార్యక్రమాలు మొదలయ్యాయి.
తళతళలాడే పట్టుచీరలో ప్రేక్షకుల కళ్ళు మిరుమిట్లు గొలిపే ఒక మాజీ సినీతార మదనమోహిని కార్యక్రమ నిర్వాహకత్వం వహిస్తున్నారు.
“అకిలాంద్ర పేక్సక లోకానికి అంటే ఇక్కడి  సబికులకి మా స్వాగతం, సుస్వాగతం, వృదయపూరక స్వాగతం” అంటూ సభను ప్రారంభించారావిడ.
“కిరీటాలు పెట్టుకు వచ్చిన వారందర్నీ వేదిక మీదికి వచ్చి ఆసనాల్ని ఆక్రమించ వలసిందిగా కోరుతున్నాం” అని ప్రకటించేరు.
బిలబిలమంటూ పైకి పరిగెత్తేరు కిరీటాల వారు. ఆరుగురు మగవాళ్ళూ, నలుగురు ఆడవాళ్ళూ.

“మనం ఆహ్వానించింది ఎనిమిది మందినేగా, పదిమంది వచ్చారేం?” రాజుగారు గుట్టుగా అడిగేరు మదనమోహినిని.
“ఇద్దరు లంబూ జంబూలని, ఇక్కడ ఏ సబ జరిగినా పిలవకుండానే వచ్చేస్తారు. ఐతే ఇవాల వెనక వీది సబకి పోతారనుకుని వాల్లని లెక్కయ్యలేదు” అన్నారావిడ మొహమాటపడుతూ.
“ఐతే వాళ్ళని అక్కడికే పొమ్మనండి” అని ఆదేశించేరు రాజుగారు.
“రాజుగారూ, మీరు గుసగుసలాడుతున్న విషయం మాకు తెల్సు. మాకు ఇక్కడ కూర్చునే అవకాశం ఇవ్వకపోతే వెనకవీధి సభలో మాకు స్పెషల్‌ సన్మానాలు చేస్తామని వాళ్ళు వెంటబడుతున్నారు. అక్కడికెళ్ళి వాళ్ళందరి ముందు మీ అవకతవకల్ని చించిచెండాడతాం. ఆలోచించుకోండి” ఆయన చెవిలో ఊదేరు లంబు.
గత్యంతరం లేక, “ఐతే, వెయ్యండి వీరిద్దరికీ వీరతాళ్ళు” అని ఆజ్ఞాపించేరు రాజుగారు. అంతలోనే నాలిక్కర్చుకుని, “అంటే, ఉచితాసనాలు” అని వివరించేరు.

ఆ ప్రహసనం ముగిసేక, రాజుగారు “యదా యదాహి ధర్మస్య, గ్లానిర్భవతి భారత! అభ్యుత్థాన మధర్మశ్చ, తదాత్మానాం సృజామ్యహం” అని గంభీరంగా పాడిన ప్రార్థనా(?)గీతంతో కార్యక్రమాలు మొదలయ్యేయి.
అందరూ లేచి చప్పట్లు చరిచేరు. కొందరు ఈలలు వేసేరు.
ప్రతి వరస కుర్చీలకి పక్కనే నిలబడి వున్న సభానిర్వాహకులు ఎవరు చప్పట్లు కొట్టేరో, ఎవరు ఈలలు వేసేరో రాసుకున్నారు.

తొలివక్త లేచి ముందుగా ముప్ఫై నిముషాల పాటు రాజుగారి ఔదార్యాన్ని, నిర్జీవమై పోతున్న మన సంస్కృతీ సంప్రదాయాల్ని పునరుద్ధరించటానికి వారు ఒంటిచేత్తో చేస్తోన్న సేవనీ వేయినోళ్ళతో వక్కాణించేరు. ఆ తర్వాత పది నిముషాల పాటు రాజుగారితో తమ తొలిపరిచయం ఎలా జరిగిందో (ఒకసారి మబ్బులపాడు వెళ్ళినప్పుడు వారు రాజుగారి ఇంట బసచేసేరు) అప్పటినుంచి తామిద్దరు ఎలా ప్రాణమిత్రులయేరో (రాజుగారు పెద్దపాలెం వచ్చినప్పుడల్లా వారి దర్శనం చేసి వారి గుణగణాల్ని భక్తితో కీర్తించి సంభావనలు పుచ్చుకుంటారు) వివరించేరు. చివరికి పులకించి రాజుగారి పాదాలపై పుష్పాక్షతలుంచి పూజించేరు ఓ కంటితో తమ ఈ భక్తిప్రదర్శనకు ఎన్ని పాయింట్లు వేస్తున్నారో గమనిస్తూ.

కిరణ్‌కి లేచి వెళ్ళిపోవాలని వుంది గాని ఆ హాలులో క్రిక్కిరిసి వున్న రెండు వందల మందిలోనూ ఒక్కరంటే ఒక్కరు కూడ అలాటి ఆలోచనలో వున్నట్టు కనిపించకపోవటంతో కొంత తటపటాయించాడు. ప్రసాద్‌ కూడ అలాటి అఘాయిత్యాలేం చెయ్యొద్దని కళ్ళతోనే హెచ్చరించాడు. కనుక, ఎలాగూ కూర్చోవటం తప్పదు కాబట్టి ఇక్కడ జరుగుతున్న తంతుని సరదా కాలక్షేపంలా, ఓ సిన్మాలా చూసి ఆనందించడం మంచిదని గ్రహించాడు. ఒకసారి అలా అనుకున్నాక నిజంగానే చాలా తమాషాగా అనిపించి అందర్తో పాటే తనూ ఉత్సాహంగా చప్పట్లు చరుస్తూ ఈలలేస్తూ కేకలు పెడుతూ చెలరేగిపోయాడు.

స్టేజి మీద వక్తలు ఒకరినిమించి మరొకరు రాజుగారి మీద తమకున్న భక్తివిశ్వాసాల్ని ప్రదర్శిస్తోన్నారు. మాజీ సుందరి మదన మోహిని గారు తమ కంటిగిలుపుల్తో పైటబిగింపుల్తో అంగవిన్యాసాల్తో రాజుగార్ని అలరించటానికి ఆయాసపడుతున్నారు. పాయింట్లు వేసేవారు చాలా హడావుడిగా పద్దులు రాసుకుంటున్నారు. సభికులు ఆనందపారవశ్యాలతో ఎదురుగా వేలాడుతున్న వరహాల సంచుల వంక చూస్తూ రెచ్చిపోతున్నారు. సభంతా ఓ మైకంలో వుంది. పైకం చేస్తోన్న ఇంద్రజాలానికి  తలలూపుతూ మంత్రముగ్ధమై వుంది. మనసులు దూదిపింజల్లా తేలిపోతోంటే మత్తులో జోగుతూ వూగుతూ వుంది.

అప్పటివరకు కేవలం మధ్యమధ్యలో వక్తల్ని తమ చమత్కార గాన ధోరణిలో ప్రశంసించటం తప్ప ఎక్కువగా మాట్లాడే అవకాశం కలగని రాజుగారు ఉపన్యసించటానికి లేచేరు. సభ ఒక్కసారిగా చప్పట్ల సముద్రమైంది. ఎడతెగని అలలు అలా ఐదు నిమిషాల పాటు సాగేక రాజుగారు చిరుదరహాసంతో తమ వామహస్తాన్ని కించిత్తు కదిలిస్తూ సభవారిని వారించేరు. అందరూ ఠపీమని ఆపేసి చటుక్కున ఆశీనులయ్యేరు. రాజుగారు ప్రారంభించేరు.

వారేం మాట్లాడుతున్నారో కిరణ్‌కి ఒక్క ముక్క అర్థం కాలేదు. మెల్లగా మిత్రుడి చెవులో “ఏరా, ఆయన మాట్లాడేది ఏ భాషలోరా ? నాకు ఏవీ బోధపట్టం లేదు” అని వూదితే, ప్రసాద్‌ ఆదరంగా “ఎవరికి మాత్రం ఏం అర్థవై ఏడుస్తుంది? అదేదో వందేళ్ళ నాటి భాషట. మన ముత్తాతలో వాళ్ళ తాతలో అలా మాట్లాడుకునే వారని ఎవరో అంటుంటే విన్నా. నోర్మూసుకుని కూర్చో, ఇంక అసలైన తమాషా రాబోతోంది” అని గుసగుసమన్నాడు, పాయింట్లు వేసే వాళ్ళని జాగ్రత్తగా పరికిస్తూ.

మాటలో పాటలో పదాలో జానపదాలో మూరపదాలో ఏవోవో గుప్పించి తమ ఉపన్యాసంలో చొప్పించి ఉద్రేకంతో ఉద్వేగంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఊగిపోగూ ప్రసంగించేరు రాజుగారు ఏమన్నారో ఎవరికీ (బహుశా శ్రీవారితో సహా) తెలియకపోయినా. చివరికి గంట తర్వాత వారిి ఉపన్యాసం ముగిసింది. మళ్ళీ పది నిముషాల చప్పట్ల హోరు తర్వాత శ్రీ రో గారికి సన్మానం మొదలైంది. హఠాత్తుగా ఎక్కడినుంచి వచ్చేరో ఓ ఐదారుగురు ఆడవాళ్ళు ఏవో పాటలు పాడటం మొదలెట్టేరు. అవి ఐదు శతాబ్దాల క్రితం అలా పాడేవారట! మరుగున పడిపోయిన వాటిని రాజుగారే వెలుగులోకి తీసుకొచ్చి ప్రచారం చేస్తోన్నారట. ఆ దుర్భర గానం నేపథ్యంలో సాగుతూండగా రో గారిని టన్ను బరువున్న ఓ పుష్పమాలాలంకృతుల్ని చేసేరు రాజుగారు. ఆ తర్వాత కిరీటాల వారందరూ  పోటీలు పడి చెయ్యి చేసుకుని రో గారికి తలో మాలా వేసేరు.

అసలే అర్భకులైన రో గారు వాటి బరువుకి ఒరిగి ఓ కుర్చీలో కూలబడ్డారు. వారి ఆకారం ఎవరికీ కనిపించకుండా పూలమాలలు నింపేసేయి. అప్పుడు వారి మీద పన్నీరు పోసేరు. గంధాలు పూసేరు. కస్తూరి వాసన చూపించేరు. తలకి తైలమర్దనం చేసేరు. అక్షింతలు పైన ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన యాంత్రిక పళ్ళేల నుంచి పోయించేరు. మంగళవాద్యాలు వాయించేరు. కాషాయాల వారు మళ్ళీ విజృంభించి వారి గాత్రప్రతాపం చూపించేరు. కడవల్తో నీళ్ళు రో గారి నెత్తిన కుమ్మరించేరు. “ఇక రో గారు ప్రసంగిస్తా”రని ప్రకటించేరు. తీరా వస్తాదులు వచ్చి మాలలన్నీ తొలగించి చూస్తే వారు మూర్ఛలో వున్నారని తేలి ఆ పని విరమించి వారి మూర్ఛ తేర్చే పనిలో పడ్డారు. సభ ముగిసిందని హడావుడిగా సంక్షిప్తీకరించేరు. వచ్చిన వారందరికీ లెక్కలు చూసి పారితోషికాలు పంచేరు.

రో గారికి ఎందుకు సన్మానానికి ఒడిగట్టేరో మాత్రం ఎవరూ చెప్పలేకపోయేరు.రాజుగారికీ రో గారికీ ఏవో పురాతన కక్షలున్నాయని, అవి ప్రత్యక్షంగా తీర్చుకునే అవకాశం లేదని యిలా రాజుగారే సన్మానహత్య (అంటే సన్మానం ద్వారా హత్య అన్నమాట) కి పూనుకున్నారని కొందరు తుంటరులు దుష్ప్రచారం లేవనెత్తేరు గాని కేవలం వాళ్ళకి సన్మానాలు చెయ్యలేదనే కోపంతో వాళ్ళలా పుకార్లు రేపుతున్నారని సన్మానాలు చేయించుకున్న వాళ్ళు కరపత్రాలు పంచిపెట్టటం జరిగింది. కనుక నిజం ఏవిటో స్టేజి పైవారికే తెలియాలి.

కిరణ్‌కి పారితోషికంగా పదివేల వరహాలు వచ్చేయి పాయింట్ల వ్యవహారం పూర్తిగా తెలియక పోయినా పదేపదే ఈలలు వేసి వీరవిహారం చెయ్యటం మూలాన. ప్రసాద్‌కి మాత్రం రెండు వేలే వచ్చేయి ఈల రానందువల్ల. “ముందొచ్చిన చెవుల కన్న వెనకొచ్చిన కొమ్ములే వాడిలే” అని సరదాగా అతన్ని సర్దిపుచ్చాడు కిరణ్‌.

బట్టలు మార్చుకుని బరువు జేబుల్తో వస్తోంటే కిరణ్‌ మిత్రుడితో “ఇన్నాళ్ళూ నాకు ఈ సభల గురించి చెప్పలేదేం? ఇంత మంచి తేలికైన మార్గం వుండగా ఇంక మనకి ఉద్యోగాలు కూడ అక్కర్లేదు” అన్నాడు. “నీకు అంతగా నచ్చితే ఇంక చూడు రోజుకో సభకి వెళ్ళొచ్చు మనం” అన్నాడు ప్రసాద్‌ భరోసాగ.
“ఇలాటి చాదస్తులు అంతమందున్నారా?” అని ఆశ్చర్యపడ్డాడు కిరణ్‌.
“ఉండటమే కాదు, రోజు రోజుకూ పెరుగుతున్నారు కూడ ఎలాగైనా మబ్బులపాడు వాళ్ళు కదా!” అన్నాడు ప్రసాద్‌ అతన్ని పైకి లేవదీస్తూ.