భైరప్ప నవలలు — భారతీయ దర్శనాలు

ఈ మధ్యకాలంలో‘ఫిలాసఫీ’ అనే మాటకు సమానార్థకంగా ‘తత్త్వశాస్త్రము’ అనే పదాన్ని ఆనవాయితీగా వాడుతున్నప్పటికీ, అచ్చంగా భారతీయవిద్యాపరంపరకు చెందినదీ, సార్వత్రికమైనదీ, సుపరిచితమైనదీ అయిన “దర్శనము” అనే మాటే సముచితమైన శబ్దమని భావించి దానినే ఈ వ్యాసం అంతటా ఉపయోగించబోతున్నాను.

“వృత్తిపరంగా నేను తత్త్వశాస్త్రవిద్యార్థిని. ప్రవృత్తిపరంగా సృజనాత్మకరచయితను. నా చిన్నప్పట్నుంచీ సాహిత్యం నన్ను ఆకర్షిస్తూ ఉండేది. నా యౌవనపు కష్టకాలంలో అది నాకు ఒకరకమైన ఊరటనిచ్చేది. ఒకరకమైన విమోచనా నాకు అందులో లభించేది. తత్త్వశాస్త్రం జీవితానికి మరింత బాగా మార్గదర్శనం చేయగలుగుతుందని అప్పటి నా అభిప్రాయం. కళాశాలలో దానినే నా అధ్యయనవిషయంగా ఎంచుకున్నాను. జీవనోపాధి కోసమూ దానినే ఎంచుకోవాల్సి వచ్చింది. అయితే, తత్త్వశాస్త్రం ఎంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, ఎంత గొప్పదైనప్పటికీ నేను వెదుక్కుంటున్న తృప్తి అది ఇవ్వలేదని త్వరలోనే గ్రహించి, సాహిత్యం వైపుకు మళ్ళాను. జీవితపు అనుభవాలలోని సంకీర్ణతను, పరమార్థాలను గ్రహించేందుకు సాహిత్యమే ఎక్కువగా సహాయపడుతుందని ఎరుక కలిగింది. అందువల్లనే నా అన్వేషణకు, జ్ఞానానికీ సృజనాత్మకరచననే సాధనంగా స్వీకరించాను.”
డా.ఎస్.ఎల్.భైరప్ప — ‘నానేకె బరెయుత్తేనె?’ (నేనెందుకు వ్రాస్తాను?) పు.18

స్వయంగా తత్త్వశాస్త్రవేత్త అయిన భైరప్ప నవలల్లో ఆయన అభిమానాస్పదమైన తత్త్వశాస్త్రము ఏ విధంగా ఇమిడిపోయిందన్నది చాలా కుతూహలాన్ని రేకెత్తించే అంశం. అత్యంతసహజమైన విషయం కూడా. ఇటువంటి అధ్యయనం, ముఖ్యంగా, ‘దర్శనము’ అంటే ‘సైద్ధాంతికభావజాలము (ideology)’ అని భావించే ఆధునికవిమర్శనపద్ధతికీ, నానా ‘ఇజాల’ పరిభాషలలో పరిభ్రమించే అసంఖ్యాకనవవిమర్శకులకూ – పలు కారణాల వల్ల – ఎంతో నచ్చుతుంది కూడా. అయితే, నవల అనేది ప్రధానంగా ఒక కళాకృతి; రసనిష్ఠమైన వాగర్థాల ద్వారా ఇతివృత్తాన్ని విస్తరించి చెప్పేది, విభావానుభావసామగ్రితో[1]విభావానుభావసామగ్రి: రసానుభూతిని కలిగించే కథనంలోని కారణాలు (విభావాలు), దానివల్ల కలిగే శారీరక, మానసిక ప్రతిస్పందనలు (అనుభావాలు), మరియు ఇతర భావాల (వ్యభిచారిభావాలు) సమాహారం. కూడి ఉండేది; అలాంటప్పుడు అందులో ఏ శాస్త్రమైనా, శిల్పమైనా (craft), విద్యయైనా తనదైన రూపంతో ఎట్లా సాక్షాత్కరిస్తుందన్న ప్రశ్న రాక మానదు. అందుకే, మొదటగా, భైరప్ప అభిప్రాయాన్నే సూత్రప్రాయంగా ప్రస్తావించాను, ఇక పైన నా చదువు-అనుభవాల ఆధారంగా సమకూర్చుకున్న ఆలోచనలను ‘వృత్తి’ (వ్యాఖ్యాన) రూపంలో నిరూపించే ప్రయత్నం చేస్తాను.

భారతీయసంప్రదాయం, “జగత్తు-జీవుడు-ఈశ్వరుడు-బంధము-మోక్షము అనే ఐదు తత్త్వాల యథార్థరూపాన్ని నిర్వచించే శాస్త్రమే ‘దర్శనము’” అని ఒప్పుకుంటుంది. ఇక్కడ, వివేచన కూడా ప్రమాణపురస్సరంగా ఉండితీరాలన్నది సుస్పష్టమే కదా. అదే విధంగా కళ అంటే రసస్ఫోరకమైన వక్రతావ్యాపారపరినిష్ఠసామగ్రి అని మన సంప్రదాయం గ్రహించింది. దర్శనం జీవనమీమాంస అయితే వ్యాకరణం భాషామీమాంస. అనుభవమూ,అభివ్యక్తీ ఈ రెండింటికీ ఆహార్యాద్వైతం[2]ఆహార్యాద్వైతము: బాహ్యమైన రూపానికి (అభివ్యక్తికి), అంతర్గతమైన అనుభవానికి మధ్య భేదం లేకపోవడం, రెండూ ఒకటేనన్న భావన. ఉన్నదని ఆ మాటకు అర్థము. ఈ కారణం చేతనే కళాకృతిలో కరిగిపోకుండా మిగిలిన ఏ శాస్త్రమైనా సరే, “కళంకం” అని అనిపిస్తుంది. భవభూతి మాట ఒకటి ఇక్కడ స్మరించుకోవాలి:

యద్వేదాధ్యయనం తథోపనిషదాం సాఙ్ఖ్యస్య యోగస్య చ
జ్ఞానం తత్కథనేన కిం, నహి తతః కశ్చిద్గుణో నాటకే ।
యత్ప్రౌఢిత్వముదారతా చ వచసాం యచ్చార్థతో గౌరవం
తచ్చేదస్తి తతస్తదేవ గమకం పాణ్డిత్యవైదగ్ధ్యయోః ॥ (మాలతీ మాధవం 1.8)

(వేదాలు చదివితేనేమి? ఉపనిషత్తులు, సాంఖ్య-యోగాది శాస్త్రాలు తెలిస్తేనేమి? ఆ జ్ఞానాన్ని నాటకాలలో చొప్పించడం వలన ఏమి ఫలము? వాటి వలన నాటకపు వాసి పెరగదు. మాటలలో లోతు, ఓజస్సు, పరిపక్వత, అర్థగాంభీర్యము ఉంటే చాలు; అవే ప్రతిభకూ పాండిత్యానికీ గీటురాయిగా నిలుస్తాయి.)

కాళిదాసు, భవభూతి, విశాఖదత్తుడు వంటి కవుల పాండిత్యపరిణతి వారి కృతుల ఆత్మసౌందర్యంలో అంతర్భాగమై ఉండడాన్ని మనం గమనిస్తాము. శ్రీహర్షుడు, మురారి, సోమదేవసూరి వంటి కవుల విషయంలో అది కనబడదు. అదే విధంగా, కన్నడసాహిత్యంలో నవోదయ[3]నవోదయ: కన్నడ సాహిత్యంలో రొమాంటిసిజం (భావకవిత్వం) మరియు జాతీయవాద భావనలతో వచ్చిన ఒక ఆధునిక సాహిత్యోద్యమం. రచయితల విద్వత్తు వారి కృతులలో సహజపరిమళంలాగా లీలగా తెలిసిపోతూ ఉంటుంది, కానీ నవ్య-నవ్యోత్తర[4]నవ్య: నవోదయ ఉద్యమం తర్వాత వచ్చిన ఆధునికవాద (Modernist) సాహిత్యోద్యమం. ఇది వాస్తవికత, వ్యక్తిగత అనుభూతులు, మరియు మేధోపరమైన అన్వేషణకు ప్రాధాన్యత ఇచ్చింది.

నవ్యోత్తర: నవ్య ఉద్యమం తర్వాతి కాలంలో వచ్చిన సాహిత్యధోరణులు. తెలుగునాట ఆధునికోత్తర (Post-Modernist) సాహిత్యం అని పిలుస్తాము.
రచయితల వ్యాసంగవిభ్రమాలు వారి రచనల లోవెలుగుగా పరిణమించలేకపోయాయి. కువెంపు[5]కువెంపు: కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప – 1904-94; కన్నడభాషకు తొలి జ్ఞానపీఠపురస్కారాన్ని సంపాదించిపెట్టిన రచయిత; రామాయణదర్శనం ఈయన రచించిన ఉద్గ్రంథం, దీనికే జ్ఞానపీఠం వచ్చింది.; ‘జయభారతజననియ తనుజాతే…’ అని మొదలయ్యే కర్ణాటక రాష్ట్రగీతం ఈయన వ్రాసిందే., బేంద్రె[6]బేంద్రె: దత్తాత్రేయ రామచంద్ర బేంద్రె – 1896-1981; కవి, జ్ఞానపీఠాధిష్ఠితులలో ఒకరు., పు.తి.న.[7]పు.తి.న.: (పురోహిత తిరునారాయణయ్యంగార్ నరసింహాచార్ – 1905-98); కవి, నాటకకర్త, మాస్తి[8]మాస్తి: మాస్తి వెంకటేశ అయ్యంగార్ 1891-1986; కథకుడు, నవలాకారుడు, నాటకకర్త కూడా; జ్ఞానపీఠపురస్కృతుడు; “మాస్తి కన్నడద ఆస్తి” అని చెప్పుతారు ఈయన గురించి; ఈయన రచించిన ‘చిక్కవీరరాజేంద్ర’ అనే నవల తెలుగు అనువాదం నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచేత ప్రచురించబడింది., కారంత[9]కారంత: శివరామ కారంత – 1902-98; నవలాకారుడు, నాటకకర్త, పర్యావరణపరిరక్షణోద్యమకారుడు కూడా; జ్ఞానపీఠబహుమానితుడు; ఈయన వ్రాసిన ‘మరలి మన్నిగె’ పుస్తకాన్ని తిరుమల రామచంద్రగారు తెలుగులోనికి అనువదించారు., దేవుడు నరసింహశాస్త్రి[10]దేవుడు నరసింహశాస్త్రి – 1886-1962; నవలాకారుడు, సంస్కృతవిద్వాంసుడు, నటుడు, పాత్రికేయుడు కూడా; మహాబ్రాహ్మణ, మహాక్షత్రియ అనే నవలలు వ్రాసారు; సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందారు. మొదలైన వారి కవితలను, నవలలను, ఇటీవలి కాలంలో ఖ్యాతి వహించిన రామచంద్రశర్మ[11]రామచంద్రశర్మ (1925-2005): kaవి, విమర్శకుడు, అనువాదకుడు, విద్యావేత్త; సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత., అనంతమూర్తి[12]యూ.ఆర్.అనంతమూర్తి (1932-2014): నవలారచయిత, విమర్శకుడు; జ్ఞానపీఠ బహుమతి గ్రహీత; సంస్కార, భారతీపుర, ఘటశ్రాద్ధ ఈయన రచనల్లో సుప్రసిద్ధమైనవి., కార్నాడ్[13]గిరీశ్ కార్నాడ్ (1938-2019): నాటకరచయిత, నటుడు, నిర్దేశకుడు; జ్ఞానపీఠపురస్కారాన్ని పొందారు., లంకేశ్[14]లంకేశ్ (1935-2000): కవి, కథకుడు, అనువాదకుడు, పాత్రికేయుడు; చలనచిత్రనిర్దేశకుడు కూడా.లంకేశ్ పత్రికె అనే పత్రికను నడిపారు. మొదలైన వారి గద్యపద్యరచనలతో పోల్చిచూసి తెలుసుకోవచ్చును.

కన్నడ రచయితలలో డి.వి.జి.[15]దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్ప ((1887-1975); కవి, తత్త్వవేత్త, పాత్రికేయుడు; ఈయన “మంకు తిమ్మన కగ్గ” పద్యాలు మన వేమన పద్యాలలా అత్యంత ప్రసిద్ధాలు; జీవిత సత్యాలను, తత్వాన్ని సులభమైన పద్యాలలో వివరించే ఈ గ్రంథాన్ని కన్నడ భగవద్గీత అని వ్యవహరిస్తారు., దేవుడు నరసింహశాస్త్రి, బేంద్రె, కువెంపు, పు.తి.న. మొదలైనవారి వ్రాతల్లో చాలావరకు వేదాంతపు అన్ని కోణాలూ వచ్చిచేరాయని చెప్పితీరాలి. ఆదిశంకరాచార్యుల దర్శనగాఢత డి.వి.జి. రచనలలో కనబడితే, రామకృష్ణ-వివేకానందుల మూలంగా వ్యాప్తికెక్కిన ఇదే దర్శనపు మెరుపు కువెంపు రచనల్లో ప్రస్ఫుటంగా కానవస్తుంది. బేంద్రె-గోకాక్[16]గోకాక్: వినాయక కృష్ణ గోకాక్ (1909-92); బేంద్రె స్థాపించిన ‘గెళెయర గుంపు’లో (మిత్రబృందం) ఒకరు; నవోదయ కవితా మార్గదర్శకులలో ఒకరు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత. గార్ల రచనల్లో అరవిందుని తత్త్వప్రణాళిక వెలుగుతూ ఉంటుంది. మధురచెన్నని[17]మధురచెన్న: చెన్నమల్లప్ప హలసంగి (1903-53); ఆధ్యాత్మికకవి, జానపదసాహిత్యపరిశోధకుడు; బేంద్రె మిత్రబృందంలో ఒకరు; కన్నడ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖపాత్ర పోషించినవారిలో ఒకరు. కృతులలో వచనకారుల అనుభావము[18]అనుభావము: ఒక తాత్త్విక లేదా ఆధ్యాత్మిక విషయాన్ని కేవలం మేధోపరంగా కాకుండా స్వయంగా అనుభవించి తెలుసుకోవడం. అరవిందుని విచారధారతో చెట్టపట్టాలేసుకొని నడుస్తుంది. మాస్తి, పు.తి.న. గ్రంథాలలో రామనుజదర్శనాంతర్భాగమైన ప్రపత్తితత్త్వము[19]ప్రపత్తితత్త్వము: భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి చేయడమే మోక్షానికి మార్గమనే విశిష్టాద్వైత సిద్ధాంతంలోని ముఖ్య భావన. ఉపనిషత్తుల సామరస్యభావనతో చేరిపోయింది. దేవుడు నరసింహశాస్త్రి గ్రంథాలలో తంత్ర-యోగ-పూర్వమీమాంసలు[20]తంత్ర-యోగ-పూర్వమీమాంసలు: భారతీయ దర్శనంలోని వివిధ శాఖలు. తంత్రము (శక్తి ఆరాధన), యోగము (చిత్తవృత్తిని – మనస్సులో కలిగే ఆలోచనల, భావోద్వేగాల, ఇతర మానసికప్రవృత్తులను – కట్టడి చేసే సాధన), పూర్వమీమాంస (వైదికకర్మకాండకు సంబంధించిన దర్శనం; యజ్ఞయాగాదుల విధులను, వాటి ఫలాలను విశ్లేషిస్తుంది.) వేదాంతానికి దన్నుగా నిలవడం స్పష్టంగా తెలుస్తుంది. కారంత అజ్ఞేయవాదంలో (agnosticism)[21]అజ్ఞేయవాదం: దేవుని అస్తిత్వం లేదా విశ్వం యొక్క అంతిమ స్వభావం వంటివి తెలియవని, మానవ మేధస్సుకు అతీతమైనవని భావించే వాదం. ఒక విధమైన నిరీశ్వరవేదాంతమే కనబడుతుంది. వి.సీ.[22]వి.సీ.: వి.సీతారామయ్య, కన్నడ సాహిత్యంలో మానవతావాదంతో కూడిన రచనలు చేసిన ప్రముఖ రచయిత. రచనల్లో సందేహవాదంతో మిళితమైన మానవతావాదపు స్థూలవేదాంతం భాసిస్తుంది. గోవింద పై[23]ఎమ్. గోవింద పై: కన్నడ సాహిత్యంలో భాగవతదర్శనాన్ని తన రచనల్లో ప్రతిబింబించిన రచయిత. రచనల్లోని భాగవతదర్శనము అవిస్మరణీయము. నరసింహస్వామి[24]నరసింహస్వామి: కె.ఎస్.నరసింహస్వామి, కన్నడ సాహిత్యంలో ప్రేమ కవిగా ప్రసిద్ధుడు. కవితలలో తొంగిచూసే మానవతావాదపు సామాన్యభారతీయసంవేదన చాలా ప్రీతికరంగా ఉంటుంది. ప్రగతిశీల, నవ్య, బండాయ[25]ప్రగతిశీల, నవ్య, బండాయ: కన్నడ సాహిత్యంలో వివిధ కాలాల్లో వచ్చిన సాహిత్య ఉద్యమాలు. ప్రగతిశీల (ప్రోగ్రెసివ్), నవ్య (మోడర్నిస్ట్), బండాయ (తిరుగుబాటు/విప్లవ). రచయితల్లో కనబడే మార్క్స్ వాదము, వాస్తవికతావాదము, అంబేద్కర్ వాదము మొదలైనవన్నీ ప్రాయశః పాశ్చాత్యప్రపంచపు మనస్తత్త్వశాస్త్రం, సమాజశాస్త్రం, మానవశాస్త్రం, ఆర్థికశాస్త్రాల వివిధరూపాలే అవుతాయి. వీటి ధ్వనులను వచనకారులలో, బౌద్ధ గ్రంథాలలో, నాథ-సిద్ధ-అవధూతాది మతాల[26]నాథ-సిద్ధ-అవధూతాది మతాలు: మధ్యయుగ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన యోగ, తంత్ర సంప్రదాయాలు. అనుభావసాహిత్యంలో కనిపెట్టే ప్రయత్నాలూ చేసారు; తద్వారా, “వైదికేతర” దర్శనాన్ని ఒక భిన్నధ్రువంగా స్థాపించేంతగా ఈ రచనల రాశి పెరిగింది. మొత్తం మీద, వీటన్నింటినీ గమనించి చెప్పాలంటే – ఆధ్యాత్మికము, అనాధ్యాత్మికము అనే రెండు పంథాలలో ఆదర్శవాదులూ, వాస్తవవాదులూ తమ ప్రయాణాన్ని కొనసాగించారని చెప్పవచ్చును. అయితే, అనాధ్యాత్మికమైన దర్శనం ఒకటుంటుందన్న మాటే అసంబద్ధము. ఎందుకంటే – అధ్యాత్మయే[27]అధ్యాత్మ: ఆత్మ/మనస్సుకు ఆశ్రయము దర్శనాలన్నింటికీ ఆధారము. కాదంటే, వాటికీ మనస్తత్త్వ, నీతి, సమాజ, మానవాది శాస్త్రాలకు తేడాయే ఉండదు. అందుచేతనే, వాస్తవికవాదమనే పేరే అనాధ్యాత్మికదర్శనము అనే విరోధాభాస కన్నా మేలు. మొత్తం మీద, కన్నడసాహిత్యంతో సహా భారతీయసాహిత్యలోకంలో అధ్యాత్మ-అనధ్యాత్మప్రేరితమైన సాహిత్యము వాచ్య-వ్యంగ్య ప్రక్రియలన్నింటిలోకీ విస్తరించి ఉన్నది. ఈ నేపథ్యంలో, భైరప్ప కృతులలో కేవలం పాండిత్యాన్ని సూచించడమే కాక ఆ కృతియొక్క సహజశిల్పంలో ప్రకాశించే భారతీయదార్శనికాంశాలను సంక్షిప్తంగా పరిశీలించుదాము.

భైరప్ప ‘భిత్తి’[28]భిత్తి: భైరప్ప ఆత్మకథ; 57 ఏళ్ళ వయస్సులో “దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే”, జ్ఞాపకాలు వెలిసిపోకముందే ప్రారంభించి 5 ఏళ్ళలో పూర్తిచేసారు. ఒకచోట, తాను గుజరాత్‌లోని వల్లభనగర్‌‌లో నివసిస్తూ ఉన్న కాలంలో ‘సత్య మత్తు సౌందర్య (సత్యం-సౌందర్యం)’ అనే పరిశోధనావ్యాసాన్ని ముగించాక ‘సత్య మత్తు నీతి (సత్యం-నీతి) అనే పరిశోధనలో నిమగ్నమయ్యానని అందులో రసస్పర్శ అట్టే లేనందున ఇబ్బందిని అనుభవిస్తున్న కాలంలో – అతఃపూర్వం రచించిన ‘వంశవృక్ష’[29]వంశవృక్ష:1965లో ప్రచురితమైన ఈ నవల, వ్యక్తిగత కాంక్షలకు, సామాజిక-పారంపరిక విలువల చట్రానికీ నడుమన సంఘర్షణను చిత్రీకరిస్తుంది. కర్ణాటక సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకున్న ఈ నవలను కన్నడంలో బి.వి.కారంత, తెలుగు, హిందీలలో బాపు-రమణలు చలనచిత్రీకరించారు. నవల తాలూకు రాత ప్రతిని చదివినప్పుడు తన రచన తనకే మార్మికంగా, ఆస్వాదయోగ్యంగా తోచిందని, తన అంతరంగానికి సహజమైన అభివ్యక్తి ఏమై ఉంటుందనే ప్రశ్నను తనలో రేకెత్తించిందని చెప్పుకున్నారు (పు.444-445). మరొక దృష్టినుంచి చూసినప్పుడు కూడా ఈ సందర్బం అర్థవంతమైనదే. అది మన ప్రస్తుతచర్చకూ ఉపయోగపడుతుంది. ‘సత్యం-నీతి’ అనే విషయం గురించి పరిశోధనకు పూనుకున్న భైరప్ప అంతకు మునుపే యాదృచ్ఛికంగా ‘వంశవృక్ష’ నవలలో చాలా మటుకు ఈ విషయాన్నే ఆ రచనయొక్క తాత్త్వికతంతువులలో ఒకటిగా ఇతివృత్తరూపంలో విస్తరించి చెప్పారు. శ్రీనివాసశ్రోత్రియ అన్న పేరుగల ప్రధానపాత్ర తాను నమ్మిన సత్యాన్ని, నీతిని ఆచరించే తీరు, అవే విలువలపై ఇతర పాత్రలైన కాత్యాయని, సదాశివరాయల స్పందన మొదలైన విషయాలన్నీ భారతీయదర్శనశాస్త్రాల అన్వయభాగమైన[30]అన్వయభాగము: సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే భాగం; ఆచరణాత్మకమైన పార్శ్వం. మౌల్యమీమాంసలో[31]మౌల్యమీమాంస (Axiology): విలువల గురించి, వాటి స్వభావం గురించి తాత్వికంగా విశ్లేషించే శాస్త్రం. అంతర్గతంగా ఉన్నాయి. అయితే ఇవేవీ ఇతివృత్తానికి వెలుపల, వక్రోక్తికి[32]వక్రోక్తి: విషయాన్ని నేరుగా చెప్పకుండా, ఒక చమత్కారమైన, అలంకారయుక్తమైన రీతిలో చెప్పడం. దూరంగా, ధ్వనిరహితంగా ఉండిపోలేదు. అందుకే ఇవి కేవలం తాత్త్వికచర్చలుగా మిగిలిపోకుండా విభావానుభావసామగ్రిగా రూపుదిద్దుకున్న రసశిల్పాలయ్యాయి, అనుభవద్రవ్యంగా రూపొందినందున నిత్యనూతనత్వాన్ని సంతరించుకున్నాయి. ధ్వననశీలత[33]ధ్వననశీలత: ఒక రచనలో వాచ్యార్థానికి మించి, అనేక సూచితార్థాలను (ధ్వని) స్ఫురింపజేసే లక్షణం. కారణంగా చింతనసామగ్రికి, జీవనసాధ్యతల వైవిధ్యవిస్తారాలకు దిక్సూచిగా నిలిచాయి. నిజానికి, ఇటువంటి సందర్భాలను స్వీకరించి నిరూపించడమే ఈ వ్యాసపు ఉద్దేశ్యం అయినప్పటికీ నా విద్యానుభవపు అలవాటు చొప్పున అక్కడక్కడ కొన్ని శుష్కసమీకరణాలు వచ్చితీరుతాయి. అందుకు నన్ను మన్నించమని సహృదయులకు నా విజ్ఞప్తి.

భారతీయదర్శనాలలో, సామాన్యంగా సాంప్రదాయికదర్శనసంగ్రహాలలో పూర్వపక్షరూపంలో[34]పూర్వపక్షం: ఒక సిద్ధాంతాన్ని నిరూపించే ముందు, దానికి వ్యతిరేకమైన వాదనలను ముందుగా ప్రస్తావించి, ఆ తర్వాత వాటిని ఖండించడం. మొట్టమొదట వచ్చేది చార్వాక/లోకాయత దర్శనము[35]లోకాయతదర్శనం: చార్వాక దర్శనానికి మరో పేరు. ఇది భౌతికవాదానికి ప్రాధాన్యత ఇస్తుంది.. అందునా, ధూర్తచార్వాకవిభాగం[36]ధూర్తచార్వాకతత్త్వం: చార్వాక దర్శనంలో ఒక శాఖ. వీరు నైతిక నియమాలను పూర్తిగా తిరస్కరించి, కేవలం ఇంద్రియ సుఖాలకే ప్రాధాన్యత ఇస్తారు. “ఋణం కృత్వా ఘృతం పిబేత్” (అప్పు చేసైనా సరే, నెయ్యి తాగాలి) అనే ఈసడింపు ఈ ధూర్తచార్వాకుల గురించే. గురించి మన విద్వాంసులకు ఆసక్తి హెచ్చు. ఇలాంటి ఒక జీవితవిధానపు నాలుగు పార్శ్వాలను భైరప్ప, ‘గృహభంగ’[37]గృహభంగ: 1970లో వెలువడ్డ ఈ నవల 1930-40ల మధ్యకాలంలోని మైసూరు రాజ్యపు గ్రామీణనేపథ్యంలో నంజమ్మ అనే ధీరురాలి కుటుంబకథను చెబుతుంది. భైరప్ప బాల్యజీవితానుభవాల దర్పణం ఈ నవల. దీని తెలుగు అనువాదం శంఖవరం సంపద్రాఘవాచార్య (సంపత్) చేసారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు వేసారు., ‘సాక్షి’[38]సాక్షి: పరమేశ్వరయ్య అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకొన్నాక ప్రేతమై యముడి పురమాయింపు మేరకు మీద భూమ్మీదికి తిరిగివచ్చి కొద్దికాలం పాటు తన జీవితంలో భాగమైనవారి జీవితాల్లో ఏమవుతుందో సాక్షిమాత్రుడిగా గమనిస్తూ ఉంటాడు. ఈ ఊహతో మొదలై సత్యాసత్యాల గురించి, ధర్మార్థకామాల గురించి వివేచిస్తూ సాగే నవల ఇది., ‘తంతు’[39]తంతు: స్వాతంత్ర్యానంతరభారతదేశంలో విలువల పతనాన్ని చిత్రీకరించిన నవల. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో విగ్రహాల చోరీతో మొదలై 1975 ఎమర్జెన్సీ విధింపు దగ్గర ముగిసే ఈ బృహన్నవలకు కథారంగం మన దేశమంత విశాలంగా ఉంటుంది. కళ, విద్య, నిబద్ధత, వైవాహిక అసంతృప్తి, భోగాసక్తి, వ్యాపారాత్మకత, లంచగొండితనం, ఆధ్యాత్మికశూన్యత్వం – అన్నీ తంతువులే ఈ నవలలో. 1993లో వెలువడింది. నవలలలో చెన్నిగరాయ, మంజయ్య, అనూప్, హరిశంకర్ పాత్రలలో చూడవచ్చు. కామార్థాల లాంపట్యానికి, విలువల తిరస్కరణకు చెన్నిగరాయడు, మంజయ్యా గ్రామీణనేపథ్యం ఉన్న ప్రతినిధి పాత్రలు; అనూప్, హరిశంకరులు నాగరికనేపథ్యపు ఉన్న ప్రతినిధి పాత్రలు. చెన్నిగరాయుడూ, అనూప్ చెడిపోవడానికి వాళ్ళ అమ్మల అతిగారాబం కారణమైతే, మంజయ్యా, హరిశంకర్ స్వయంప్రేరణతో చెడిపోయారు. తమ ధూర్తత్వం విషయమై ఏ మాత్రం సిగ్గు పడరు సరికదా, గర్విస్తారు ఈ నీచులు. హరిశంకర్ అయితే భారతీయసంస్కృతి ముసుగులో తన చారువాక్కును లోకాయతీకరించుకుంటాడు. విలువలను జారవిడుచుకోవడమే ఒక దర్శనంగా ఎదగడం అసాధ్యం. ఒకవేళ అదే సాధ్యపడితే, అది సాంప్రదాయికులు పూర్వపక్షం చేసిన ధూర్తచార్వాకతత్త్వమే అయితే ఆ తత్త్వానికి ఈ కొన్ని పాత్రలు అపూర్వమైన రీతిలో ప్రాతినిధ్యం వహిస్తాయి.

(‘తంతు’లో పరశురామగౌడ, కాంతి, శీతల్, మంత్రివర్గము, అనూప్ యొక్క పంజాబీ స్నేహితులు, ‘అంచు’[40]అంచు: భార్యను కోల్పోయిన ఒక యువకుడు, విడాకుల తరువాతి మానసికసంక్షోభంతో సతమతమవుతున్న ఇద్దరు పిల్లల తల్లితో ప్రేమలో పడడం, ఆ ప్రేమ పర్యవసానపు కథ; 1990లో వచ్చిన నవల.లో అమృత వాళ్ళ పిన్ని, భర్త, ‘మతదాన’[41]మతదాన: ఎన్నికల, గ్రామీణరాజకీయాల సంరంభంలో తలదూర్చి వెనక్కి తగ్గిన ఒక ఆదర్శవైద్యుడి కథ; సినిమాగా వచ్చి మంచి పేరే తెచ్చుకున్నది. నవలలోని రాజకీయనాయకులు, ‘దాటు’[42]దాటు: 1973లో ప్రచురితమైన ఈ నవలకు సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. కథాకాలం: స్వాతంత్ర్యానికి అటూ ఇటూ ఒకటి రెండు దశాబ్దాల కాలం. ఇతివృత్తం: కులసమస్య; పరిమి రామనరసింహం తెలుగు చేయగా సాహిత్య అకాడెమీ ప్రచురించింది. నవలలోని వెంకటేశ, మేలగిరిగౌడ వంటి అసంఖ్యాకులు ఈ కోవకు చెందినవారే అన్నది ఒక విషాదవాస్తవం..)

మన పూర్వశాస్త్రకారులు, లోకాయతదర్శనంలో, సుశిక్షితచార్వాకమనే[43]సుశిక్షితచార్వాకం: చార్వాక దర్శనంలో మరొక శాఖ. వీరు దేవుడు, స్వర్గం వంటి వాటిని నిరాకరించినప్పటికీ, లోకంలో ఆచరణయోగ్యమైన నైతిక విలువలను పాటిస్తారు. మరొక శాఖను విస్తరింపజేసారు. ఇది దేవుడిని, ఈశ్వరవాణిని, స్వర్గ-నరకాది పరలోకాలను, కర్మఫలితమైన పునర్జన్మను, మతాచారతంత్రాదులను నిరాకరించినప్పటికీ నైతికనియమాలకు విలువనిచ్చి త్రివర్గసాధనను[44]త్రివర్గసాధన: ధర్మ, అర్థ, కామ అనే మూడు పురుషార్థాలను సాధించడం. (ధర్మం అంటే కేవలము లోకసామాన్యమైన నీతి; అర్థకామాలు ధర్మానికి అనుగుణంగా ఉండాలనే ఇంగితం ఆధారంగా ఏర్పడ్డ జీవితవిధానం) ఆచరిస్తుంది. ఆధునికులైన మానవతావాదులలో, ఆలోచనాపరులలో అనేకులు ఈ దారిలో నడిచేవారే. ఇది మంచి విషయమే అయినప్పటికీ ఇందులో జీవితం-సంస్కృతి-సంవేదనల సమగ్రత్వాన్ని చూడని, చూపించని ఒక క్రమశిక్షణ ఉన్నదనే చెప్పాలి. దీనికి ఒక మంచి ఉదాహరణను ‘ధర్మశ్రీ’[45]ధర్మశ్రీ: ప్రియురాలి కోసం క్రైస్తవం పుచ్చుకున్న ఒక సనాతనధార్మికుడి ఆత్మసంఘర్షణల కథ ఇది. 1961లో వచ్చింది. లోని దేవప్రసాద్ పాత్రలో చూడగలము. ‘నెలె’[46]నెలె: జీవితం, అనుబంధాలు, మృత్యువు గురించిన తలపోతల చిన్న నవల.లోని కాళప్పదీ ఈ మార్గమే. ఇలాంటి పాత్రలు భైరప్ప వేర్వేరు నవలల్లో మళ్ళీ మళ్ళీ – పదుల సంఖ్యలో – కనబడుతూ ఉంటాయి. నిజంగా చూస్తే, లోకంలో అధికసంఖ్యాకులు ఇలాంటివారే.

జైనదర్శనంలో స్యాద్వాదాన్ని[47]స్యాద్వాదం: ఏకైకసత్యాన్ని కాకుండా, ఒక వస్తువుకు లేదా భావనకు అనేక కోణాలు ఉంటాయని, వాటిని సాపేక్షికంగానే చెప్పగలమని వాదించే జైనమత సిద్ధాంతం. పోలిన మనోధర్మాన్నీ, సల్లేఖనం[48]సల్లేఖనం: జైనమతంలో ఆహారాన్ని క్రమంగా త్యజించి, ప్రాయోపవేశం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టే ఒక వ్రతం. వంటి ఆచరణనూ ‘పర్వ’[49]పర్వ: భైరప్ప గారి సర్వోత్కృష్టరచనగా పేర్కొనవచ్చేమో దీనిని. మహాభారతంలోని అసంభావ్యమైన అంశాలను వదిలేసి కొన్ని ప్రధానపాత్రల ఆలోచనల, నెమరువేతల ఆధారంగా చేసిన విలక్షణపునఃకథనం. చదివాక ఒక పట్టాన మరిచిపోలేని పుస్తకం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ తెలుగులోకి అనువదించగా సాహిత్య అకాడెమీ అచ్చువేసింది. నవలలోని భీష్ముడిలో చూడవచ్చు. పిదపకాలపు బౌద్ధపు అనేకాంశాలను ‘సార్థ’[50]సార్థ: భైరప్ప వ్రాసిన రెండు చారిత్రికనవలలలో ఇది మొదటిది. 8వ శతాబ్దపు భారతదేశంలో నెలకొని ఉన్న మతపరిస్థితుల, ముంచుకొస్తున్న ఇస్లామిక్ దండయాత్రల నేపథ్యం; కుమారిలభట్టు-ఆదిశంకరుడు-మండనమిశ్రుడు ఈ నవలలో పాత్రలుగా ఇమిడిపోయారు.లో ఆలోచనలరూపంలో, నాగభట్టు జీవితమార్గంలో చూడగలుగుతాము. ముఖ్యంగా, క్షణికవాదము, శూన్యవాదము, వజ్రయానము, సహజయానము, మహాయానము[51]క్షణికవాదము, శూన్యవాదము, వజ్రయానము, సహజయానము, మహాయానము: బౌద్ధమతంలోని వివిధ తాత్విక సిద్ధాంతాలు మరియు శాఖలు. వంటి అనేకసంగతులు ఇందులో ఉన్నాయి. ‘అన్వేషణ’[52]అన్వేషణ: ‘గృహభంగ’ నవలకు కొనసాగింపు ఈ నవల. ‘గృహభంగ’ చివరలో ఊరు వదిలివెళ్ళిపోయిన మనవడి కోసం నంజమ్మ తండ్రి చేసిన అన్వేషణ ఈ నవల ఇతివృత్తం; ఇందులోనూ భైరప్ప ఆత్మకథాంశాలు ఉన్నాయి. మొత్తం నవలలో ఆ మనవడు ఎక్కడా ప్రత్యక్షంగా కనబడకపోవడం ఒక విశేషం!లో విశ్వ, ‘అంచు’ లో అమృత, ‘తంతు’లో హొన్నత్తి, ‘మంద్ర’[53]మంద్ర: శాస్త్రీయసంగీతం నేపథ్యంగా వ్రాయబడ్డ నవల. నైతికంగా భ్రష్టుడైన గొప్ప సంగీతకళాకారుడు, అతడి దుష్ప్రభావం నుంచి అతడు చేసిన మోసం నుంచి బయటపడి శాస్త్రీయసంగీతాకాశంలో నవతారగా ఉదయించిన అతడి శిష్యురాలు ఇందులో ప్రధానపాత్రలు; ఈ నవలకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం లభించింది.లో విక్రమ్ మొదలైన అసంఖ్యాకపాత్రలలో మళ్ళీ మళ్ళీ దర్శనమిచ్చే శూన్యత కూడా ఈ సందర్భంలో గమనించదగ్గది.

భైరప్ప నవలల్లోని అసంఖ్యాక పాత్రల-సందర్భాల వాదనలు, ఆలోచనలు పలుమార్లు న్యాయదర్శనానికి చెందిన వాదము, జల్పము, వితండము[54]వాదము, జల్పము, వితండము: న్యాయశాస్త్రంలో చెప్పబడిన మూడు రకాలైన తార్కిక చర్చా పద్ధతులు.
జల్పము = గెలుపు లక్ష్యంగా చేసే వాదము; ఇందులో కొంత మోసం ఉండే అవకాశం ఉంటుంది. అసంగతమైన తర్కమూ ఉండవచు;
వితండము = అవునన్నది కాదని మొండిగా వాదించడం, తన వాదానికి ఏ ఆధారం లేకపోయినా సరే.
వంటి చర్చారూపాలుగా విస్తరించడం మనకు స్పష్టంగా గోచరిస్తుంది. ‘వంశవృక్ష’లో శ్రీనివాసశ్రోత్రియ-సదాశివరాయల సంభాషణ కానివ్వండి, రాజా-కాత్యాయనీల మధ్య, కాత్యాయనీ-శ్రోత్రియల మధ్య సాగే చర్చలు కానివ్వండి; ‘దాటు’లో సత్యభామ, మోహనదాస; ‘ధర్మశ్రీ’లో సత్య, శంకర; ‘తబ్బలియు నీనాదె మగనె’[55]తబ్బలియు నీనాదె మగనె: “నీవు అనాథవయ్యావు, బిడ్డా” అని ఆ మాటకు అర్థం. అమెరికాలో వ్యవసాయశాస్త్రం చదివి తన ఊరికి తిరిగొచ్చిన నవయువకుడి మనస్సులో సంప్రదాయానికీ, ఆధునికదృక్పథానికీ మధ్యన చెలరేగిన సంఘర్షణ ఈ పుస్తకపు ఇతివృత్తం. కన్నడ, హిందీ భాషల్లో సినిమాగా కూడా వచ్చింది.లో వెంకటరమణ, హిల్డా మొదలైనవారు చేసే వాదనల నుంచి మనం విస్తృతంగా ఉదాహరించుకోవచ్చును. ముఖ్యంగా భైరప్ప, తమ తొలి రచనలైన ‘ధర్మశ్రీ’, ‘దూరసరిదరు’[56]దూరసరిదరు: “దూరం జరిగారు” అని ఆ మాటకు అర్థం. కళాశాలలో చదువుకునే రెండు ప్రేమ జంటల కథ ఇది. ప్రేమ/జీవితం గురించి పలు చర్చలతో నిండి ఉంటుందట ఈ పుస్తకం., ‘వంశవృక్ష’, ‘జలపాత’[57] జలపాత: శ్రీపతి అనే చిత్రకారుడు-అతడి భార్య, నాడగౌడ అనే పశువైద్యుడు-అతడి భార్య ఇందులో పాత్రలు; వివాహం, సంతానం, నైతికత, కళ కథాంశాలు; శ్రీపతి చిత్రించదలచుకున్న జలపాతం – జీవశక్తికి, సృజనాత్మకతకు, ఆశలకు, ఆశయాలకు ప్రతీక., ‘తబ్బలియు నీనాదె మగనె’, ‘గ్రహణ’[58]గ్రహణ: సూర్యగ్రహణసమయంలో భార్య పాటించే మూఢనమ్మకాలని ప్రశ్నించిన హేతువాది ప్రొఫెసర్, తన భార్య సవాలునందుకొని తన స్వగ్రామంలోని ఆచారాలను ప్రశ్నించిన వైనం. వంటి నవలల్లో నేరుగా తార్కికపద్ధతిలో చర్చలను నిర్వహించడమనే విలక్షణపద్ధతి నుంచి, ఆ తరువాతి కాలంలో వచ్చిన ‘పర్వ’, ‘సాక్షి’, ‘తంతు’, ‘సార్థ’, ‘మంద్ర’ వంటి నవలలలో పాత్రల మనఃస్వభావచిత్రణలో భాగంగా ఆలోచనలను విస్తరింపజేసే తీరునూ గమనిస్తే, ఆరంభవాదతార్కికదర్శనం[59]ఆరంభవాదతార్కికదర్శనం: పరమాణువుల కలయిక ద్వారా కొత్త పదార్థాలు ఏర్పడతాయని చెప్పే న్యాయ-వైశేషిక దర్శనాల వాదం. పరిణామవాదసాంఖ్యానికి[60]పరిణామవాదసాంఖ్యం: ఒక వస్తువు లేదా కారణం నుండే మరొకటి రూపాంతరం (పరిణామం) చెందుతుందని చెప్పే సాంఖ్య దర్శన సిద్ధాంతం., అక్కణ్ణుంచి ముందుకెళ్ళి వివర్తవాద వేదాంతానికి[61]వివర్తవాద వేదాంతం: ప్రపంచం అనేది బ్రహ్మం యొక్క నిజమైన పరిణామం కాదని, కేవలం ఒక ఆభాస (మిథ్య) అని చెప్పే అద్వైత వేదాంత సిద్ధాంతం. చేరువవుతూ ఉండడాన్ని మెచ్చుకోకుండా ఉండలేము. అయితే, ఈ సందర్భంలో ఆయన తొలి రచనలలో భాగమైన ‘మతదాన’, ‘గృహభంగ’, ‘నాయి నెరళు’[62]నాయి నెరళు: కర్మ-పునర్జన్మ సిద్ధాంతాల ఆధారంగా అల్లిన నవలిక ఇది.’కుక్క-నీడ’ అని ఆ పేరుకు అర్థం. కుక్క యజమానిని అనుసరించినట్లు కర్మ జీవిని అనుసరిస్తుందని సూచన ఉన్నది ఆ పేరులో. వంటి నవలలు తార్కికచర్చాభూములు కాకుండా ఉండడం గమనార్హమైన విషయం. మొత్తం మీద న్యాయపద్ధతి తాలూకు విచారణ ప్రక్రియ భైరప్ప నవలల్లో ఆలోచనల రూపంలో సముచితరీతిలోనే విజృంభించిందని మనం గమనిస్తాము. వైశేషికదర్శనపు[63]వైశేషికదర్శనం: పదార్థాల గుణగణాలను, వాటి వర్గీకరణను విశ్లేషించే ఒక భారతీయ దర్శనం. పదార్థమీమాంస[64]పదార్థమీమాంస: ప్రపంచంలోని మూలపదార్థాల గురించి విశ్లేషించే తత్త్వశాస్త్ర విభాగం. తాలూకు ప్రస్తావనలు భైరప్ప నవలల్లో నేరుగా కనిపించవు, కానీ కార్యకారణభావపు వాస్తవస్పృహ తాలూకు మెరుపులు, దాని పదార్థవాదదృష్టి కనబడుతాయనేందుకు ‘తంతు’లోని అనూప్, ‘జలపాత’లోని నాడగౌడ అనే పశువైద్యుడు, ‘తబ్బలియు నీనాదె మగనె’లోని హిల్డా వంటి పలు పాత్రలే సాక్షి.

భైరప్ప నవలల్లో సాంఖ్యదర్శనపు పరిణామవాదపద్ధతీ, ప్రకృతిపురుషవివేకమూ చాలా విస్తృతంగా కనబడుతాయి. ‘వంశవృక్ష’లో రాజా-కాత్యాయని నేరుగా సాంఖ్యదర్శనపు ప్రకృతి-పురుష పరిభాషలోనే సంభాషించుకుంటారు. ‘తంతు’లో కాంతి-హేమంత హొన్నత్తి సంభాషణలూ ఇదే మాదిరిగా ఉంటాయి. ‘దూరసరిదరు’లో కనబడే రకరకాల ప్రేమికుల నడవడీ, ఆలోచనలూ చాలామట్టుకు ఈ విధంగానే ఉంటాయి. మొత్తానికి, భైరప్ప తమ అనేక నవలల్లో, ఆకర్షణనే దాంపత్యమని, నిజమైన ప్రేమ అనీ భావించే ప్రేమికులు వ్యక్తంగా, అవ్యక్తంగా తమను తము సమర్థించుకునేందుకు సాంఖ్యదర్శనపు ప్రకృతి-పురుషవాదాన్నేతెలిసో తెలియకో నమ్మినట్లు, చిత్రీకరిస్తారు. అంతే కాదు. ఈ అన్ని రకాల ప్రేమల వైఫల్యాన్ని ఆయన మార్మికంగా నిరూపిస్తారు. అలాగే, సాంఖ్యదర్శనపు పరిణామవాదపద్ధతిని అనేక వ్యావహారికసంఘటనలలో అంతర్వాహినిగా చూపిస్తారు. ఇది సముచితమే, ఎందుకంటే, ఉత్కృష్టమైన వేదాంతదర్శనం కూడా తన ఆన్వయికవిధానపు కార్యకారణసంబంధంలోనున్న దేశకాలాలకు లోబడి ఉండే లౌకిక సందర్భాలను వివరించేందుకు సాంఖ్యప్రక్రియనే ఆశ్రయిస్తుంది. వివర్తవాదంపై ఆధారపడిన వేదాంతంలో ప్రపంచంలోని కార్యకారణ అంతరువులోనివ్యవహారాలు అనిర్వచనీయం అవుతాయి. అయితే, దీనికి హేతువాదాయామాన్ని ఇవ్వకపోతే లౌకికమైన అంతరువులో పనులు జరగవు. అందుచేత, పరిణామవాదపు పారమ్యాన్ని లౌకికమైన అంతరువులో ఒప్పుకోక తప్పదు. అంతే కాక, వేదాంతదర్శనానికి చెందిన వివిధశాఖలలో ప్రసిద్ధమైన భేదవాదము, భేదాభేదవాదము, అచింత్యభేదాభేదవాదము మొదలైనవన్నీ విచారప్రక్రియలో ఆద్యంతమూ పరిణామవాదాన్నే ఆశ్రయిస్తాయి. ఈ కారణం చేతనే అనేకవిమర్శకులు భైరప్ప నవలల్లో యాంత్రికత హెచ్చుగా ఉంటుందని, ఆయన పాత్రల నడవడిని అతిగా నియంత్రిస్తారని ఆక్షేపిస్తూ ఉంటారు. అయితే, వివర్తవాదం ద్వారా వ్యవహారాలలో ఉండే అనేకస్తరాలను నిర్వహించలేము. నిజానికి, వివర్తవాదమే పారమార్థికస్తరంలో యుక్తమైనప్పటికీ, ఆ సూక్ష్మత స్థూలవ్యవహారాల కన్నా పై స్తరంలో ఉంటుంది. అంతే కాదు, అలాంటి సర్దుబాటు లేనిదే ఏ వాస్తవ-కళావ్యాపారమూ సాధ్యపడదు. పరిణామవాదం నిర్మాణకాలంలో, వివర్తవాదం అనుభవకాలంలో మనకు ఉపకరిస్తాయి. పరిణామవాదం సగుణమూ, వివర్తవాదం నిర్గుణస్వరూపమూ కావడమే ఇందుకు ముఖ్యకారణము. అందుచేత ఈ విమర్శకుల ఆక్షేపణలు నిలువవు.

సాంఖ్యదర్శనంలో మరొక ముఖ్యమైన తత్త్వము – త్రిగుణవివేకము. ఇదైతే భైరప్ప నవలలలో విశ్వరూపం దాల్చిందని అనడం అతిశయోక్తి కాదు. ఆయన రచనలలోని పాత్రలను సత్త్వరజస్తమోగుణాల నేపథ్యంలో పరిశీలించడం ఆసక్తికరమైన, విజ్ఞానదాయకమైన వ్యాసంగం అవుతుంది. ఈ కారణం చేతనే, ఈ విషయమై ఈ చిన్నవ్యాసంలో విస్తరించి చెప్పడం అసాధ్యము. దిఙ్మాత్రంగా సూచించడం కోసం ‘మంద్ర’ నవలలోని సాత్త్విక-రాజసిక-తామసిక పాత్రలకు ప్రతీకగా గోరె, మనోహరీ దాస్, మోహనలాల్ పాత్రలను ఉదాహరిస్తాను. ఇక్కడా మళ్ళీ అసంఖ్యాకమైన సూక్ష్మభేదాలకు అవకాశం ఉన్నది. ఎందుకంటే లోకంలో, ఒక్కో గుణము విడివిడిగా ఉండవు, ఒకదానితో ఒకటి కలిసిపోయి పలువన్నెల మిశ్రమంగా ఉంటాయి. అందుకే, గుణబాహుళ్యమే దిశానిర్దేశకం అవుతుంది.

యోగదర్శనము భైరప్ప జీవితాన్ని, రచనలను అంటిపెట్టుకొని, అనేకసందర్భాలలో తనను తాను విస్తరించుకుంటూ ఉండిందని అనిపిస్తుంది. అయితే ఇది కేవలం పతంజలి చెప్పిన యోగం[65]పతంజలి చెప్పిన యోగం: పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో క్రోడీకరించిన అష్టాంగ యోగ మార్గం. ఈ సూత్రాలు – సమాధి, ధారణ, సాధన, విభూతి అనే నాలుగు పాదాలుగా వర్గీకరించబడి ఉంటాయి. మాత్రమే కాదు. వేదాంతాది సకలదర్శనాలూ సాధనాదృష్టితో అంగీకరించిన యోగమిది. భగవద్గీత విశేషంగా ప్రతిపాదించిన ఔపనైషదికయోగమని పిలువవచ్చును దీనిని. ముఖ్యంగా, యోగము అన్వయదర్శనము; కేవలతాత్త్వికచర్చ కాదు. ఆ మాటకొస్తే, భారతీయదర్శనాలన్నింటిలోనూ ఆన్వయికవాదం[66]ఆన్వయికవాదం: సిద్ధాంతాలను కేవలం మేధోపరంగా కాకుండా, జీవితంలో ఆచరించి, అన్వయించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే దృక్పథం. అపారంగా ఉన్నది. అందునా, యోగము ఆద్యంతమూ ఆన్వయికము. అందుకే తాత్త్వికవైరుద్ధ్యాలు ఎన్ని ఉన్నప్పటికీ వాటన్నింటినీ పక్కనబెట్టి, అన్ని భారతీయదర్శనాలూ యోగాన్ని సముచితరీతిలో ఆదరించాయి.

యోగశాస్త్రానికి చెందిన అనేకాంశాలు ‘సార్థ’లో ఆలోచనల రూపంలోనే స్ఫటికాకృతి దాల్చాయి. చిత్తవృత్తియే దీని వివేచనాసామగ్రి అయినందున పాత్రల మనోలహరి రూపంలో యోగము నవలల్లో గడ్డకట్టి ఉండడాన్ని గమనించవచ్చు. యోగపు అనేక పార్శ్వాల సుందరగంభీరచిత్రణను ‘తంతు’లోని రామచంద్ర మాస్టారు, ‘మంద్ర’లోని చిత్తర్పూర్ మహారాజు, మథురావాసి అయిన ఒక యోగి, ‘నిరాకరణె’[67]సంసారసాగరాన్ని ఈదలేని ఒక దిగువ మధ్యతరగతి వ్యక్తి తన ఐదుగురు పిల్లలను వేర్వేరు కుటుంబాలకు దత్తు ఇచ్చి సన్న్యాసం స్వీకరించి, ఆ తరహా జీవితమూ తన వల్ల కాదని తెలుసుకొని తిరిగొచ్చి తన పిల్లలను కలుసుకోవడం దీని ఇతివృత్తం. 1997 జనవరి నెలలో ఈ పుస్తకపు సంక్షిప్తానువాదం ప్రచురించబడింది. అనువాదకురాలి పేరు ఉమాదేవి.లోని బారామాసి మహారాజ, ‘నాయినెరళు’లోని సన్న్యాసి, ‘గ్రహణ’లోని సన్న్యాసి మొదలైన పాత్రలలో ప్రత్యక్షంగా చూడవచ్చును.హఠయోగమూ, రాజయోగమూ – ఈ రెండింటిలోని అంశాలు అనేకము ‘సార్థ’, ‘నిరాకరణె’, ‘దూరసరిదరు’, ‘సాక్షి’, ‘గ్రహణ’, ‘దాటు’, ‘వంశవృక్ష’, ‘పర్వ’, ‘నెలె’, ‘మతదాన’ మొదలైన నవలలలో విరివిగా కనబడుతాయి. ఇంతకు ముందే చెప్పినట్లు, యోగం ఒక అద్భుతసాధనాదర్శనం కాబట్టి పతంజలి సూత్రాలలోని సమాధి, సాధన పాదాలకు చెందిన పలు విశేషాలను భైరప్ప నవలలలోనో ఏ ఉత్తమపాత్రలోనైనా చూడవచ్చు. అంతే కాదు, విభూతి, కైవల్య పాదాలకు సంబంధించిన ఎన్నో అంశాలు సూక్ష్మంగా చూపబడ్డాయి. ముఖ్యంగా, భైరప్ప అభిరుచి యోగసాధనాతత్త్వంలో వేళ్ళూని నిలిచినందున ఆయన కృతులన్నీ అదే దిశలో చేసిన కళాత్మకసాధనయే అని చెప్పవచ్చును.

భైరప్ప యోగభ్రష్టతనూ[68]భగవద్గీతలో చెప్పబడ్డ యోగభ్రష్టత: యోగ మార్గం నుండి మధ్యలో పక్కకు తప్పిపోయిన వారి గతి గురించి భగవద్గీతలో చేసిన వివరణ. తన నవలలలో చాలా సొగసుగా చిత్రీకరించారు. (ఈ యోగభ్రష్టత భగవద్గీతలో చెప్పబడ్డ యోగభ్రష్టతతో పోల్చదగ్గదే. అయితే, భైరప్ప యోగభ్రష్టుల శీఘ్రపతనాన్ని, వికృతులను చిత్రించారు కానీ వారి పునర్జన్మలోని ఉత్తమాంశాలను సహజంగా వివరించే ప్రయత్నం చేయలేదు. దీనిని భగవద్గీత వివరించింది. అయినప్పటికీ, శివప్ప, హొన్నత్తి, నాగభట్ట, చంద్రిక, మధుమిత, సావిత్రి మొదలైన అసంఖ్యాక పాత్రలలో యోగభ్రష్టత, తదనంతర పునరుజ్జీవనాలను చూడవచ్చు). ఇక్కడ, సాత్త్విక రాజసిక పాత్రల పునరుజ్జీవనము, పతనము కళాత్మకంగా ప్రదర్శింపబడ్డాయి. ఇదేవిధంగా కర్మ, భక్తి, యోగాదుల మెరుపులు చాలా మార్మికంగా చిత్రీకరించబడ్డాయి. ముఖ్యంగా, జ్ఞానయోగసమన్వితమైన కర్మయోగం మీదనే భైరప్ప శ్రద్ధ! అందువల్లనే, ‘దాటు’లోని సత్యభామ, ‘మంద్ర’లోని మధుమిత, ‘సార్థ’లోని చంద్రిక వంటి కోమలమైన నేపథ్యం నుంచి వచ్చిన స్త్రీలు కూడా కఠినమైనప్పటికీ మోక్షకారకమైన ఈ విధమైన జీవితానికే తమను తాము స్వయంప్రేరణతో సమర్పించుకుంటారు. ‘గృహభంగ’లోని నంజమ్మ అయితే ఈ రకమైన సత్త్వోన్నతికి పరాకాష్ఠ అని చెప్పాలి. ఇక్కడ, అత్యంతప్రతికూలపరిస్థితులు అడుగడుగునా ఎదురవుతున్నప్పటికీ మానవప్రయత్నంలో నమ్మకం ఉంచి, కష్టపడి, అమరత్వాన్ని అందుకొన్న ఆ సాధ్వి ఒక మహాకావ్యపాత్రగా (epic character) మలచబడింది. ‘వంశవృక్ష’లోని శ్రోత్రియుని పాత్రలోనూ ఇలాంటి ఎదుగుదల చాలానే ఉన్నది. ‘మతదాన’లోని రంగలక్ష్మిలోనూ ఈ తరహా వికాసం ఉన్నది.

పూర్వమీమాంసాదర్శనం ప్రధానంగా విధియుక్తమైనది (ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో కూడా చెప్పేది). ఇక్కడ, అంగీకారానికి, ఆచరణకు ఉండే ప్రాశస్త్యం సమగ్రసంవేదనకు ఉండదు. వాస్తవవాది దర్శనమైన ఈ చింతనాక్రమం భావోద్వేగాలకు విలువనిచ్చినప్పటికీ, అది అపూర్వము లేదా అదృష్టము మీద ఆధారపడుతుంది కనుక కనుక అనుభవం కన్నా సంప్రదాయానికే పెద్ద పీట వేస్తుంది. సహజంగానే, ఇది భైరప్ప రచనలలో అంతర్ధ్వనిగా వినిపించదు. అయినప్పటికీ, వివిధపాత్రల చిత్రణలో ఇలాంటి వైవిధ్యాలు ఎంతో అవసరం. అందుకే చాలా సహజమైన, సముచితమైన రీతిలో ‘సార్థ’లోని కుమారిలభట్టు, మండనమిశ్రుడివంటి మీమాంసాదర్శనదురంధరులే ఆవిర్భవించారు. ఇతివృత్తానుసారం, ‘సార్థ’ లో ఇలాంటి పాత్రలు ఉండడం ఊహకు అందే విషయమే. అయితే ‘వంశవృక్ష’లోని శ్రీనివాసశ్రోత్రియలోనూ ఈ దర్శనపు చాయలు లేకపోలేదు. అదే నవలలోని సదాశివరాయ పాత్రలోనూ ఈ స్పర్శ స్పష్టంగా కనబడుతుంది. అతడి భార్య నాగరత్నమ్మ అతనికన్నా ఎక్కువగా మీమాంస విలువలను అప్రయత్నంగానే ఒంటబట్టించుకొన్నది. ‘దాటు’లో వెంకటరమణభట్ట కూడా చాలామట్టుకు పూర్వమీమాంసాప్రతిపాదితమైన కర్మపారమ్యంపై నిష్ఠ ఉన్నవాడే. ‘సాక్షి’లో రామకృష్ణయ్య కూడా కొన్నిసార్లు ఈ విధంగానే ప్రవర్తించేవాడు. ‘పర్వ’లోని యుధిష్ఠిరవ్యాసభీష్ములలో కూడా ఈ వాసన దట్టంగానే ఉన్నదే. మొత్తానికి, అక్షరసత్యంలో అంతస్సత్యాన్ని వెదకడం పూర్వమీమాంస యొక్క ప్రధానాధికరణం[69]ప్రధానాధికరణం: ఒక శాస్త్రంలో లేదా వాదంలో చర్చించబడే ముఖ్యమైన విషయం లేదా సూత్రం.. ఇందుకు భైరప్ప అనేక ముఖ్యాముఖ్యపాత్రల అసంఖ్యాక ప్రవర్తనలే చక్కని నిదర్శనము.

చివరగా, వేదాంతదర్శనం గురించి మాట్లాడుకోవాలి. వేదాంతం భారతీయదర్శనాలలో ఒక విభాగం మాత్రమే కాదు. అది అన్ని దర్శనాల పరిణతస్వరూపం, అంతిమవిశ్రాంతిస్థానం అని భైరప్ప పరమగురువులైన ఎం.హిరియణ్ణ[70]ఎం.హిరియణ్ణ: భారతీయ తత్త్వశాస్త్రంపై విశేషమైన కృషి చేసిన 20వ శతాబ్దపు ప్రముఖ పండితుడు. భైరప్ప గారి తత్త్వశాస్త్రగురువైన యామునాచార్యులకు గురువు ఈయన. హిరియణ్ణ తత్త్వశాస్త్రపాఠాలను – డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సూచన మేరకు సంకలనం చేసి Allen & Unwin ముద్రాపకులు ‘Outlines of Indian Philosophy’ అనే పుస్తకాన్ని అచ్చు వేయగా అది ఎంతో ప్రాచుర్యాన్ని గడించిందట. చెప్పిన మాటను స్మరించుకోవాలి. భారతీయదర్శనాలన్నీ పరస్పరపూరకాలు, జీవతారకాలు. వీటన్నింటిలో ఏకాత్మతను దర్శించితే సాధకుడికి అధికప్రయోజనం కలుగుతుంది. సమన్వయం అంటే ఆయా దర్శనాల తత్త్వస్వాతంత్ర్యాన్ని, వైవిధ్యాన్ని, ఔచిత్యాన్ని అపహరించే శుష్కసమీకరణం కాదు. అది సమగ్రానుభవం యొక్క ప్రత్యభిజ్ఞావికాసము[71]ప్రత్యభిజ్ఞావికాసము: వివిధ విషయాలను చూసినప్పుడు, వాటి వెనుక ఉన్న ఏకత్వాన్ని తిరిగి గుర్తించగలగడం అనే జ్ఞానం వికసించడం. ఆసక్తి ఉన్నవారు, ఈ దృష్టికోణం ఆధారంగా ఈ రచయితే – శతావధాని గణేశ్ – వ్రాసిన ‘షడ్దర్శనసంగ్రహ’ అనే వ్యాసపరంపరలో చివరి భాగాన్ని గమనించగలరు; అలాగే హిరియణ్ణ Quest after Perfection, Popular essays in Indian philosophy, Mission of Philosophy అనే రచనలను కూడా పరిశీలించగలరు..
భైరప్ప అభిప్రాయమూ ఇదే. ముఖ్యంగా, ఉపనిషత్తుల జ్ఞాననిష్ఠ, లోకసంగ్రహరూపంలో భగవద్గీత బోధించే కర్మనిష్ఠ [72]లోకసంగ్రహరూపంలో భగవద్గీత బోధించే కర్మనిష్ఠ: సమాజ శ్రేయస్సు (లోకసంగ్రహం) కోసం ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించాలని భగవద్గీత చెప్పే సిద్ధాంతం. — ఈ రెండింటిపై ఆయనకు అత్యంతశ్రద్ధా, సంవేదనా ఉన్నాయి. అందుకే, ఆయన రచించిన ప్రతి నవలలోనూ ఇటువంటి జీవనాదర్శతత్పరతను ఎంతో కొంత అనుష్ఠించని ముఖ్యపాత్ర లేనే లేదు. వస్తుతః, ఇటువంటి దర్శనం, పుస్తకపఠనం వల్లనో, గురూపదేశం వల్లనో, ఏ విశ్వాసపు కట్టుబాట్లవల్లనో కాక పూర్ణానుభవపు వెలుగులో జీవితపు ఎగుడుదిగుళ్ళను, మంచిచెడ్డలను చూసి స్వధర్మ-కర్మలను నిర్ధారించుకున్న నిర్మలానందపు నిగమనము[73]నిగమనము (Deduction): ఒక చర్చ లేదా పరిశీలన నుండి చివరగా తేల్చిన సారాంశం, ముగింపు.. వేదాంతదర్శనంలో సత్యకామజాబాలి అనే శూద్రబాలకుడున్నాడు. తండ్రికే గురువయిన నచికేతుడూ ఉన్నాడు. “బుద్ధిమంతుడు” అయిన తనయుడికి జ్ఞానాన్నొసగిన ఉద్దాలకుడున్నాడు. తల్లి గర్భాన ఉన్నప్పుడే జ్ఞాని అయిన వామదేవుడూ ఉన్నాడు. అష్టావక్రుడు, దీర్ఘతముడు వంటి వికలాంగులు ఉన్నారు. అశ్వపతి, జనకుడు, జైవలి వంటి రాజులు ఉన్నారు. జూదరీ, శూద్రుడూ అయిన కవష ఐలూషుడు ఉన్నాడు. సాత్త్వికశూద్రులైన విదుర-ధర్మవ్యాధులూ ఉన్నారు. భర్తనుంచి జ్ఞానాన్ని పొందిన మైత్రేయి ఉన్నట్లే భర్తకే జ్ఞానాన్ని ప్రసాదించిన చూడాల కూడా ఉన్నది. అవివాహితగా మిగిలిన గార్గి కూడా ఉన్నది. ఇట్లా, సమాజపు సకలస్తరాల సమస్తప్రజలకూ జ్ఞానాధికారం ఉన్నది, జీవన్ముక్తి[74]జీవన్ముక్తి: బ్రతికి ఉండగానే మోక్షస్థితిని పొంది, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం. యొక్క నిర్లేపకర్మసిద్ధి[75]నిర్లేపకర్మసిద్ధి: ఏ కర్మ చేసినా దాని ఫలితాలకు అంటకుండా, నిస్సంగుడై ఉండగలగడం. ఉన్నది, సచ్చిదానందపు సహజస్థితి ఉన్నది.

ఇటువంటి ఔన్నత్యాన్ని స్ఫురింపజేసే నంజమ్మ, శ్రోత్రియ, ‘ధర్మశ్రీ’లోని శంకర, ‘తబ్బలియు నీనాదె మగనె’లోని తాయమ్మ, కాళింగ తాత, ‘తంతు’లోని రవీంద్ర, ‘అంచు’లోని సోమశేఖర, ‘నెలె’లోని కాళప్ప, ‘మతదాన’లోని శివప్ప, ‘దాటు’లోని సత్యభామ, ‘సార్థ’లోని చంద్రిక, నాగభట్టు, యోగ గురువు, ‘మంద్ర’లోని గోరె, రామకుమారి, మధుమిత, ‘సాక్షి’లోని సావిత్రి, రామకృష్ణయ్య మొదలైన ఎందరో [సహాయక పాత్రలైన ‘గృహభంగ’లోని మాదేవయ్యగారు, ‘తంతు’లోని రామచంద్ర మాస్టారు, ‘మంద్ర’లోని మిత్తల్ మొదలైనవారూ గమనార్హులే] ఈ దారిలో అక్కడక్కడ నిలబడీ, ముందుకు సాగి దారిదీపాలుగా నిలిచారు, లక్ష్యాన్ని చేరుకున్నారు కూడా. ముఖ్యంగా, సాహిత్యకృతిలో, రససహజమైన రీతిలో – కళకు అన్యాయం చేయకుండా – ఇటువంటి పాత్రలను మన అనుభవంలోనికి తీసుకొనిరాకపోతే దానికి సార్థకత ఉండదు. ఈ కోణం నుంచి చూసినప్పుడు, భైరప్ప రచనల సాఫల్యతా, సౌందర్యమూ ఏ ఇతరభాషకూ దక్కని మహాభాగ్యం. పైన పేర్కొన్న పాత్రలన్నీ పరిపూర్ణమైనవి కావు. ఆదర్శపు మూసలో పోత పోయబడ్డ అపరంజి బొమ్మలూ కావు. వీళ్ళందరికీ తమ తమ “ఇతీ-మితీ” ఏమిటన్న ఎరుక ఉన్నది. ఆ పరిమితులను అధిగమించి జీవించాలన్న ప్రామాణికప్రయత్నం ఇది. ఇది కదా జీవితరీతి, ఇది కదా దర్శనరీతి!

ఉదాహరణార్థం, ఒకే పాత్ర గురించి మాట్లాడాలంటే ‘పర్వ’లోని శ్రీకృష్ణుడి వ్యక్తిత్వాన్ని భైరప్ప – చైతన్యస్రవంతి శిల్పంలో మిగతా అన్ని పాత్రలను చిత్రించినట్లు కాకుండా – యుయుధానసాత్యకి ద్వారా ఆవిష్కరించడం అతడి మనోలయ (నాశ) శక్తికి నిదర్శనం. ఇదే వేదాంతపు పరమోద్దేశ్యము. దీనిని ఇంత కళాత్మకంగా ధ్వనింపజేయడం నవల యొక్క సదుద్దేశము. “శ్రీకృష్ణుడు భగవద్గీతను స్వయంగా జీవించకుండా బోధించలేదు” అని చూపించేందుకు ‘పర్వ’లో గీతోపదేశపు “వివరం” లేదు. ‘వరం’ ఉన్నది, అంతే. ఇదీ, భైరప్ప భారతీయదర్శనాన్ని కళగా మార్చిన విధానం! ‘పర్వ’లో శ్రీకృష్ణుడి వ్యక్తిత్వాన్ని నిరూపించేప్పుడల్లా యుయుధానుడిని వెన్నాడే వేదన, అతడి దృష్టికోణమూ – ఈవిధంగా తత్త్వాన్ని రసంగా మార్చే ప్రక్రియకు సువర్ణసూత్రము.

తంత్ర-యోగ-న్యాయ-సాంఖ్య-ఆగమ-మీమాంస-అర్చన-గీత-నృత్యాదులన్నీ… అంతెందుకు, ఈ ప్రపంచమంతా… మనం వాటిని కట్టి ఉంచితే, అవి వాటిలాగా మిగలవు, వదిలిపెట్టితే మాత్రమే ఉంటాయి. వాటిని బంధించి ఉంచడమే మరణం. అవి మనను బంధించి ఉంచడమే జీవితము. వ్రాస్తే అది శాస్త్రమవుతుంది. జీవిస్తే కావ్యమవుతుంది. ఇదే జీవనం, అదే దర్శనం.

రసము అనే మాట దానంతట అదే అర్థస్ఫురణను ఇవ్వదు. వాక్యంలో ప్రయోగించకుండా ఈ శబ్దాన్ని పరిశీలించితే అది అర్థం లేని ప్రాతిపదికగా ఉంటుంది. దర్శనమూ అటువంటిదే. బతుకు అన్నా అంతే కదా. ఇవన్నీ సదా నేతి మార్గంలో[76]సదా నేతి మార్గం: “ఇది కాదు, ఇది కాదు” (నేతి, నేతి) అని చెప్పుకుంటూ, తెలిసిన వాటిని నిరాకరిస్తూ, తెలియని పరమసత్యాన్ని అన్వేషించే ఉపనిషన్మార్గం. నిరూపితమయ్యే వ్యంజనావ్యాపారసిద్ధులు[77]వ్యంజనావ్యాపారసిద్ధి: మాటకున్న సూచ్యార్థం (ధ్వని) ద్వారా అదనపు అర్థాన్ని స్ఫురింపజేయగలగడం.. దీనిని స్ఫురింపించే విభావానుభవసామగ్రి[78]విభావానుభావసామగ్రి: రసానుభూతిని కలిగించే కథనంలోని కారణాలు (విభావాలు), దానివల్ల కలిగే శారీరక, మానసిక ప్రతిస్పందనలు (అనుభావాలు), మరియు ఇతర భావాల (వ్యభిచారిభావాలు) సమాహారం. అయిన ఇతివృత్త-వర్ణనలను పట్టుకొని అందించడమే భైరప్ప నవలల రచనోద్దేశము.

కళగా సఫలమైన కృతిలో దార్శనికదీప్తి తప్పనిసరిగా ఉంటుంది. అది ఆత్మైకదర్శనపు భూమానుభూతియే కానీ వేరొకటి కాదు. ఇక్కడ, నీతి-కళల నడుమ అనుబంధమో, విచ్ఛిత్తియో పరాకాష్ఠకు చేరినందువలన సంగీతానికి, సంతోషానికి దూరమైన విక్రమ్, మోహన్ లాల్, మధుమితా, హొన్నత్తి లాగా ఎదురీది గట్టెక్కినవాళ్ళూ మనకెదురవుతారు. తనను నిరాకరించిన కొడుకుకే పుత్రవ్యామోహంతో ఆస్తినంతా వ్రాసి మరణించిన ‘విమోచిత మహిళ’ (liberated woman) కాంతి వంటి నవనాగరికతాతర్కవిదుషీమణికి పూర్తి విరుద్ధంగా తన కుమారుడిని కాదని గోదానం చేసి మరణించిన పుట్టుమూగ-గ్రామీణురాలు-శ్రద్ధాళువు అయిన తాయవ్వ ఉంటుంది. ‘సార్థ’లో యోగ గురువు నివసించే గుహలోని పాము పూలదండలా నిరపాయకరంగా ఉంటుంది. అతడు తన దేహాన్ని యథేచ్ఛగా విడిచిపెట్టగలడు; శరీరం లేకపోయినా సరే, ప్రపంచంతో సంబంధం పెట్టుకోగలడు. కానీ ఇది కుమారిలభట్టుకు సాధ్యం కాదు. ఆయన దేహత్యాగంలో ఎంతో యాతన ఉంటుంది. కళ ద్వంద్వాలను చిత్రించినప్పటికీ ద్వంద్వాలలో కలిసిపోదు. ఈ మాటే శ్రోత్రియ సదాశివరాయతో అంటాడు: ద్వంద్వాలు ఉంటాయని కేవలం బౌద్ధికంగా తర్కించి ఏదో ఒక రకమైన నిర్ణయానికి వచ్చేదాకా జీవించను అని అనుకోవడంలో అర్థం లేదు. యోగగురువు, చంద్రికా, నాగభట్టులతో చెప్పిన మాట కానీ, ‘నిరాకరణె’లో నరహరితో చివరలో కూతురు భవాని చెప్పిన మాట కానీ భైరప్ప దర్శనదీప్తికి సూత్రవాక్యాలు.

లక్ష్యతప్పదె చరిసు సామాన్యధర్మగళ ।
మోక్ష స్వతస్సిద్ధ – మ౦కుతిమ్మ ॥ (డి.వి.గుండప్ప ‘మంకుతిమ్మన కగ్గ’)

అయ౦ హి పరమో ధర్మో యద్యోగేనాత్మదర్శనమ్ ॥ (యాజ్ఞవల్క్య స్మృతి)
(యోగముతో ఆత్మను దర్శించడమే పరమధర్మము)

యయా యయా భవేత్పు౦సాం వ్యుత్పత్తిః: ప్రత్యగాత్మని ।
సాసైవ ప్రక్రియేహ స్యాత్ సాధ్వీ సా చానవస్థితా ॥
(సురేశ్వరాచార్యుల బృహదారణ్యభాష్యవార్త్తికమ్)
(ఏ ప్రక్రియ ద్వారా మానవులకు తమ అంతరాత్మ గురించిన జ్ఞానం కలుగుతుందో అదే సరి అయినది. అది అందరికీ ఒక్కలా ఉండదు).

అధస్సూచికలు

అధస్సూచికలు
1, 78 విభావానుభావసామగ్రి: రసానుభూతిని కలిగించే కథనంలోని కారణాలు (విభావాలు), దానివల్ల కలిగే శారీరక, మానసిక ప్రతిస్పందనలు (అనుభావాలు), మరియు ఇతర భావాల (వ్యభిచారిభావాలు) సమాహారం.
2 ఆహార్యాద్వైతము: బాహ్యమైన రూపానికి (అభివ్యక్తికి), అంతర్గతమైన అనుభవానికి మధ్య భేదం లేకపోవడం, రెండూ ఒకటేనన్న భావన.
3 నవోదయ: కన్నడ సాహిత్యంలో రొమాంటిసిజం (భావకవిత్వం) మరియు జాతీయవాద భావనలతో వచ్చిన ఒక ఆధునిక సాహిత్యోద్యమం.
4 నవ్య: నవోదయ ఉద్యమం తర్వాత వచ్చిన ఆధునికవాద (Modernist) సాహిత్యోద్యమం. ఇది వాస్తవికత, వ్యక్తిగత అనుభూతులు, మరియు మేధోపరమైన అన్వేషణకు ప్రాధాన్యత ఇచ్చింది.

నవ్యోత్తర: నవ్య ఉద్యమం తర్వాతి కాలంలో వచ్చిన సాహిత్యధోరణులు. తెలుగునాట ఆధునికోత్తర (Post-Modernist) సాహిత్యం అని పిలుస్తాము.

5 కువెంపు: కుప్పళ్ళి వెంకటప్ప పుట్టప్ప – 1904-94; కన్నడభాషకు తొలి జ్ఞానపీఠపురస్కారాన్ని సంపాదించిపెట్టిన రచయిత; రామాయణదర్శనం ఈయన రచించిన ఉద్గ్రంథం, దీనికే జ్ఞానపీఠం వచ్చింది.; ‘జయభారతజననియ తనుజాతే…’ అని మొదలయ్యే కర్ణాటక రాష్ట్రగీతం ఈయన వ్రాసిందే.
6 బేంద్రె: దత్తాత్రేయ రామచంద్ర బేంద్రె – 1896-1981; కవి, జ్ఞానపీఠాధిష్ఠితులలో ఒకరు.
7 పు.తి.న.: (పురోహిత తిరునారాయణయ్యంగార్ నరసింహాచార్ – 1905-98); కవి, నాటకకర్త
8 మాస్తి: మాస్తి వెంకటేశ అయ్యంగార్ 1891-1986; కథకుడు, నవలాకారుడు, నాటకకర్త కూడా; జ్ఞానపీఠపురస్కృతుడు; “మాస్తి కన్నడద ఆస్తి” అని చెప్పుతారు ఈయన గురించి; ఈయన రచించిన ‘చిక్కవీరరాజేంద్ర’ అనే నవల తెలుగు అనువాదం నేషనల్ బుక్ ట్రస్ట్ వారిచేత ప్రచురించబడింది.
9 కారంత: శివరామ కారంత – 1902-98; నవలాకారుడు, నాటకకర్త, పర్యావరణపరిరక్షణోద్యమకారుడు కూడా; జ్ఞానపీఠబహుమానితుడు; ఈయన వ్రాసిన ‘మరలి మన్నిగె’ పుస్తకాన్ని తిరుమల రామచంద్రగారు తెలుగులోనికి అనువదించారు.
10 దేవుడు నరసింహశాస్త్రి – 1886-1962; నవలాకారుడు, సంస్కృతవిద్వాంసుడు, నటుడు, పాత్రికేయుడు కూడా; మహాబ్రాహ్మణ, మహాక్షత్రియ అనే నవలలు వ్రాసారు; సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందారు.
11 రామచంద్రశర్మ (1925-2005): kaవి, విమర్శకుడు, అనువాదకుడు, విద్యావేత్త; సాహిత్య అకాడెమీ పురస్కారగ్రహీత.
12 యూ.ఆర్.అనంతమూర్తి (1932-2014): నవలారచయిత, విమర్శకుడు; జ్ఞానపీఠ బహుమతి గ్రహీత; సంస్కార, భారతీపుర, ఘటశ్రాద్ధ ఈయన రచనల్లో సుప్రసిద్ధమైనవి.
13 గిరీశ్ కార్నాడ్ (1938-2019): నాటకరచయిత, నటుడు, నిర్దేశకుడు; జ్ఞానపీఠపురస్కారాన్ని పొందారు.
14 లంకేశ్ (1935-2000): కవి, కథకుడు, అనువాదకుడు, పాత్రికేయుడు; చలనచిత్రనిర్దేశకుడు కూడా.లంకేశ్ పత్రికె అనే పత్రికను నడిపారు.
15 దేవనహళ్ళి వేంకటరమణయ్య గుండప్ప ((1887-1975); కవి, తత్త్వవేత్త, పాత్రికేయుడు; ఈయన “మంకు తిమ్మన కగ్గ” పద్యాలు మన వేమన పద్యాలలా అత్యంత ప్రసిద్ధాలు; జీవిత సత్యాలను, తత్వాన్ని సులభమైన పద్యాలలో వివరించే ఈ గ్రంథాన్ని కన్నడ భగవద్గీత అని వ్యవహరిస్తారు.
16 గోకాక్: వినాయక కృష్ణ గోకాక్ (1909-92); బేంద్రె స్థాపించిన ‘గెళెయర గుంపు’లో (మిత్రబృందం) ఒకరు; నవోదయ కవితా మార్గదర్శకులలో ఒకరు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత.
17 మధురచెన్న: చెన్నమల్లప్ప హలసంగి (1903-53); ఆధ్యాత్మికకవి, జానపదసాహిత్యపరిశోధకుడు; బేంద్రె మిత్రబృందంలో ఒకరు; కన్నడ సాంస్కృతిక పునరుజ్జీవనంలో ప్రముఖపాత్ర పోషించినవారిలో ఒకరు.
18 అనుభావము: ఒక తాత్త్విక లేదా ఆధ్యాత్మిక విషయాన్ని కేవలం మేధోపరంగా కాకుండా స్వయంగా అనుభవించి తెలుసుకోవడం.
19 ప్రపత్తితత్త్వము: భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతి చేయడమే మోక్షానికి మార్గమనే విశిష్టాద్వైత సిద్ధాంతంలోని ముఖ్య భావన.
20 తంత్ర-యోగ-పూర్వమీమాంసలు: భారతీయ దర్శనంలోని వివిధ శాఖలు. తంత్రము (శక్తి ఆరాధన), యోగము (చిత్తవృత్తిని – మనస్సులో కలిగే ఆలోచనల, భావోద్వేగాల, ఇతర మానసికప్రవృత్తులను – కట్టడి చేసే సాధన), పూర్వమీమాంస (వైదికకర్మకాండకు సంబంధించిన దర్శనం; యజ్ఞయాగాదుల విధులను, వాటి ఫలాలను విశ్లేషిస్తుంది.)
21 అజ్ఞేయవాదం: దేవుని అస్తిత్వం లేదా విశ్వం యొక్క అంతిమ స్వభావం వంటివి తెలియవని, మానవ మేధస్సుకు అతీతమైనవని భావించే వాదం.
22 వి.సీ.: వి.సీతారామయ్య, కన్నడ సాహిత్యంలో మానవతావాదంతో కూడిన రచనలు చేసిన ప్రముఖ రచయిత.
23 ఎమ్. గోవింద పై: కన్నడ సాహిత్యంలో భాగవతదర్శనాన్ని తన రచనల్లో ప్రతిబింబించిన రచయిత.
24 నరసింహస్వామి: కె.ఎస్.నరసింహస్వామి, కన్నడ సాహిత్యంలో ప్రేమ కవిగా ప్రసిద్ధుడు.
25 ప్రగతిశీల, నవ్య, బండాయ: కన్నడ సాహిత్యంలో వివిధ కాలాల్లో వచ్చిన సాహిత్య ఉద్యమాలు. ప్రగతిశీల (ప్రోగ్రెసివ్), నవ్య (మోడర్నిస్ట్), బండాయ (తిరుగుబాటు/విప్లవ).
26 నాథ-సిద్ధ-అవధూతాది మతాలు: మధ్యయుగ భారతదేశంలో ప్రాచుర్యం పొందిన యోగ, తంత్ర సంప్రదాయాలు.
27 అధ్యాత్మ: ఆత్మ/మనస్సుకు ఆశ్రయము
28 భిత్తి: భైరప్ప ఆత్మకథ; 57 ఏళ్ళ వయస్సులో “దంతంబు ల్పడనప్పుడే తనువునందారూఢి యున్నప్పుడే”, జ్ఞాపకాలు వెలిసిపోకముందే ప్రారంభించి 5 ఏళ్ళలో పూర్తిచేసారు.
29 వంశవృక్ష:1965లో ప్రచురితమైన ఈ నవల, వ్యక్తిగత కాంక్షలకు, సామాజిక-పారంపరిక విలువల చట్రానికీ నడుమన సంఘర్షణను చిత్రీకరిస్తుంది. కర్ణాటక సాహిత్య అకాడెమీ బహుమతిని అందుకున్న ఈ నవలను కన్నడంలో బి.వి.కారంత, తెలుగు, హిందీలలో బాపు-రమణలు చలనచిత్రీకరించారు.
30 అన్వయభాగము: సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టే భాగం; ఆచరణాత్మకమైన పార్శ్వం.
31 మౌల్యమీమాంస (Axiology): విలువల గురించి, వాటి స్వభావం గురించి తాత్వికంగా విశ్లేషించే శాస్త్రం.
32 వక్రోక్తి: విషయాన్ని నేరుగా చెప్పకుండా, ఒక చమత్కారమైన, అలంకారయుక్తమైన రీతిలో చెప్పడం.
33 ధ్వననశీలత: ఒక రచనలో వాచ్యార్థానికి మించి, అనేక సూచితార్థాలను (ధ్వని) స్ఫురింపజేసే లక్షణం.
34 పూర్వపక్షం: ఒక సిద్ధాంతాన్ని నిరూపించే ముందు, దానికి వ్యతిరేకమైన వాదనలను ముందుగా ప్రస్తావించి, ఆ తర్వాత వాటిని ఖండించడం.
35 లోకాయతదర్శనం: చార్వాక దర్శనానికి మరో పేరు. ఇది భౌతికవాదానికి ప్రాధాన్యత ఇస్తుంది.
36 ధూర్తచార్వాకతత్త్వం: చార్వాక దర్శనంలో ఒక శాఖ. వీరు నైతిక నియమాలను పూర్తిగా తిరస్కరించి, కేవలం ఇంద్రియ సుఖాలకే ప్రాధాన్యత ఇస్తారు. “ఋణం కృత్వా ఘృతం పిబేత్” (అప్పు చేసైనా సరే, నెయ్యి తాగాలి) అనే ఈసడింపు ఈ ధూర్తచార్వాకుల గురించే.
37 గృహభంగ: 1970లో వెలువడ్డ ఈ నవల 1930-40ల మధ్యకాలంలోని మైసూరు రాజ్యపు గ్రామీణనేపథ్యంలో నంజమ్మ అనే ధీరురాలి కుటుంబకథను చెబుతుంది. భైరప్ప బాల్యజీవితానుభవాల దర్పణం ఈ నవల. దీని తెలుగు అనువాదం శంఖవరం సంపద్రాఘవాచార్య (సంపత్) చేసారు. నేషనల్ బుక్ ట్రస్ట్ వారు వేసారు.
38 సాక్షి: పరమేశ్వరయ్య అనే వృద్ధుడు ఆత్మహత్య చేసుకొన్నాక ప్రేతమై యముడి పురమాయింపు మేరకు మీద భూమ్మీదికి తిరిగివచ్చి కొద్దికాలం పాటు తన జీవితంలో భాగమైనవారి జీవితాల్లో ఏమవుతుందో సాక్షిమాత్రుడిగా గమనిస్తూ ఉంటాడు. ఈ ఊహతో మొదలై సత్యాసత్యాల గురించి, ధర్మార్థకామాల గురించి వివేచిస్తూ సాగే నవల ఇది.
39 తంతు: స్వాతంత్ర్యానంతరభారతదేశంలో విలువల పతనాన్ని చిత్రీకరించిన నవల. కర్ణాటకలోని ఒక మారుమూల గ్రామంలో విగ్రహాల చోరీతో మొదలై 1975 ఎమర్జెన్సీ విధింపు దగ్గర ముగిసే ఈ బృహన్నవలకు కథారంగం మన దేశమంత విశాలంగా ఉంటుంది. కళ, విద్య, నిబద్ధత, వైవాహిక అసంతృప్తి, భోగాసక్తి, వ్యాపారాత్మకత, లంచగొండితనం, ఆధ్యాత్మికశూన్యత్వం – అన్నీ తంతువులే ఈ నవలలో. 1993లో వెలువడింది.
40 అంచు: భార్యను కోల్పోయిన ఒక యువకుడు, విడాకుల తరువాతి మానసికసంక్షోభంతో సతమతమవుతున్న ఇద్దరు పిల్లల తల్లితో ప్రేమలో పడడం, ఆ ప్రేమ పర్యవసానపు కథ; 1990లో వచ్చిన నవల.
41 మతదాన: ఎన్నికల, గ్రామీణరాజకీయాల సంరంభంలో తలదూర్చి వెనక్కి తగ్గిన ఒక ఆదర్శవైద్యుడి కథ; సినిమాగా వచ్చి మంచి పేరే తెచ్చుకున్నది.
42 దాటు: 1973లో ప్రచురితమైన ఈ నవలకు సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది. కథాకాలం: స్వాతంత్ర్యానికి అటూ ఇటూ ఒకటి రెండు దశాబ్దాల కాలం. ఇతివృత్తం: కులసమస్య; పరిమి రామనరసింహం తెలుగు చేయగా సాహిత్య అకాడెమీ ప్రచురించింది.
43 సుశిక్షితచార్వాకం: చార్వాక దర్శనంలో మరొక శాఖ. వీరు దేవుడు, స్వర్గం వంటి వాటిని నిరాకరించినప్పటికీ, లోకంలో ఆచరణయోగ్యమైన నైతిక విలువలను పాటిస్తారు.
44 త్రివర్గసాధన: ధర్మ, అర్థ, కామ అనే మూడు పురుషార్థాలను సాధించడం.
45 ధర్మశ్రీ: ప్రియురాలి కోసం క్రైస్తవం పుచ్చుకున్న ఒక సనాతనధార్మికుడి ఆత్మసంఘర్షణల కథ ఇది. 1961లో వచ్చింది.
46 నెలె: జీవితం, అనుబంధాలు, మృత్యువు గురించిన తలపోతల చిన్న నవల.
47 స్యాద్వాదం: ఏకైకసత్యాన్ని కాకుండా, ఒక వస్తువుకు లేదా భావనకు అనేక కోణాలు ఉంటాయని, వాటిని సాపేక్షికంగానే చెప్పగలమని వాదించే జైనమత సిద్ధాంతం.
48 సల్లేఖనం: జైనమతంలో ఆహారాన్ని క్రమంగా త్యజించి, ప్రాయోపవేశం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టే ఒక వ్రతం.
49 పర్వ: భైరప్ప గారి సర్వోత్కృష్టరచనగా పేర్కొనవచ్చేమో దీనిని. మహాభారతంలోని అసంభావ్యమైన అంశాలను వదిలేసి కొన్ని ప్రధానపాత్రల ఆలోచనల, నెమరువేతల ఆధారంగా చేసిన విలక్షణపునఃకథనం. చదివాక ఒక పట్టాన మరిచిపోలేని పుస్తకం. గంగిశెట్టి లక్ష్మీనారాయణ తెలుగులోకి అనువదించగా సాహిత్య అకాడెమీ అచ్చువేసింది.
50 సార్థ: భైరప్ప వ్రాసిన రెండు చారిత్రికనవలలలో ఇది మొదటిది. 8వ శతాబ్దపు భారతదేశంలో నెలకొని ఉన్న మతపరిస్థితుల, ముంచుకొస్తున్న ఇస్లామిక్ దండయాత్రల నేపథ్యం; కుమారిలభట్టు-ఆదిశంకరుడు-మండనమిశ్రుడు ఈ నవలలో పాత్రలుగా ఇమిడిపోయారు.
51 క్షణికవాదము, శూన్యవాదము, వజ్రయానము, సహజయానము, మహాయానము: బౌద్ధమతంలోని వివిధ తాత్విక సిద్ధాంతాలు మరియు శాఖలు.
52 అన్వేషణ: ‘గృహభంగ’ నవలకు కొనసాగింపు ఈ నవల. ‘గృహభంగ’ చివరలో ఊరు వదిలివెళ్ళిపోయిన మనవడి కోసం నంజమ్మ తండ్రి చేసిన అన్వేషణ ఈ నవల ఇతివృత్తం; ఇందులోనూ భైరప్ప ఆత్మకథాంశాలు ఉన్నాయి. మొత్తం నవలలో ఆ మనవడు ఎక్కడా ప్రత్యక్షంగా కనబడకపోవడం ఒక విశేషం!
53 మంద్ర: శాస్త్రీయసంగీతం నేపథ్యంగా వ్రాయబడ్డ నవల. నైతికంగా భ్రష్టుడైన గొప్ప సంగీతకళాకారుడు, అతడి దుష్ప్రభావం నుంచి అతడు చేసిన మోసం నుంచి బయటపడి శాస్త్రీయసంగీతాకాశంలో నవతారగా ఉదయించిన అతడి శిష్యురాలు ఇందులో ప్రధానపాత్రలు; ఈ నవలకు సరస్వతీ సమ్మాన్ పురస్కారం లభించింది.
54 వాదము, జల్పము, వితండము: న్యాయశాస్త్రంలో చెప్పబడిన మూడు రకాలైన తార్కిక చర్చా పద్ధతులు.
జల్పము = గెలుపు లక్ష్యంగా చేసే వాదము; ఇందులో కొంత మోసం ఉండే అవకాశం ఉంటుంది. అసంగతమైన తర్కమూ ఉండవచు;
వితండము = అవునన్నది కాదని మొండిగా వాదించడం, తన వాదానికి ఏ ఆధారం లేకపోయినా సరే.
55 తబ్బలియు నీనాదె మగనె: “నీవు అనాథవయ్యావు, బిడ్డా” అని ఆ మాటకు అర్థం. అమెరికాలో వ్యవసాయశాస్త్రం చదివి తన ఊరికి తిరిగొచ్చిన నవయువకుడి మనస్సులో సంప్రదాయానికీ, ఆధునికదృక్పథానికీ మధ్యన చెలరేగిన సంఘర్షణ ఈ పుస్తకపు ఇతివృత్తం. కన్నడ, హిందీ భాషల్లో సినిమాగా కూడా వచ్చింది.
56 దూరసరిదరు: “దూరం జరిగారు” అని ఆ మాటకు అర్థం. కళాశాలలో చదువుకునే రెండు ప్రేమ జంటల కథ ఇది. ప్రేమ/జీవితం గురించి పలు చర్చలతో నిండి ఉంటుందట ఈ పుస్తకం.
57 జలపాత: శ్రీపతి అనే చిత్రకారుడు-అతడి భార్య, నాడగౌడ అనే పశువైద్యుడు-అతడి భార్య ఇందులో పాత్రలు; వివాహం, సంతానం, నైతికత, కళ కథాంశాలు; శ్రీపతి చిత్రించదలచుకున్న జలపాతం – జీవశక్తికి, సృజనాత్మకతకు, ఆశలకు, ఆశయాలకు ప్రతీక.
58 గ్రహణ: సూర్యగ్రహణసమయంలో భార్య పాటించే మూఢనమ్మకాలని ప్రశ్నించిన హేతువాది ప్రొఫెసర్, తన భార్య సవాలునందుకొని తన స్వగ్రామంలోని ఆచారాలను ప్రశ్నించిన వైనం.
59 ఆరంభవాదతార్కికదర్శనం: పరమాణువుల కలయిక ద్వారా కొత్త పదార్థాలు ఏర్పడతాయని చెప్పే న్యాయ-వైశేషిక దర్శనాల వాదం.
60 పరిణామవాదసాంఖ్యం: ఒక వస్తువు లేదా కారణం నుండే మరొకటి రూపాంతరం (పరిణామం) చెందుతుందని చెప్పే సాంఖ్య దర్శన సిద్ధాంతం.
61 వివర్తవాద వేదాంతం: ప్రపంచం అనేది బ్రహ్మం యొక్క నిజమైన పరిణామం కాదని, కేవలం ఒక ఆభాస (మిథ్య) అని చెప్పే అద్వైత వేదాంత సిద్ధాంతం.
62 నాయి నెరళు: కర్మ-పునర్జన్మ సిద్ధాంతాల ఆధారంగా అల్లిన నవలిక ఇది.’కుక్క-నీడ’ అని ఆ పేరుకు అర్థం. కుక్క యజమానిని అనుసరించినట్లు కర్మ జీవిని అనుసరిస్తుందని సూచన ఉన్నది ఆ పేరులో.
63 వైశేషికదర్శనం: పదార్థాల గుణగణాలను, వాటి వర్గీకరణను విశ్లేషించే ఒక భారతీయ దర్శనం.
64 పదార్థమీమాంస: ప్రపంచంలోని మూలపదార్థాల గురించి విశ్లేషించే తత్త్వశాస్త్ర విభాగం.
65 పతంజలి చెప్పిన యోగం: పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో క్రోడీకరించిన అష్టాంగ యోగ మార్గం. ఈ సూత్రాలు – సమాధి, ధారణ, సాధన, విభూతి అనే నాలుగు పాదాలుగా వర్గీకరించబడి ఉంటాయి.
66 ఆన్వయికవాదం: సిద్ధాంతాలను కేవలం మేధోపరంగా కాకుండా, జీవితంలో ఆచరించి, అన్వయించుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చే దృక్పథం.
67 సంసారసాగరాన్ని ఈదలేని ఒక దిగువ మధ్యతరగతి వ్యక్తి తన ఐదుగురు పిల్లలను వేర్వేరు కుటుంబాలకు దత్తు ఇచ్చి సన్న్యాసం స్వీకరించి, ఆ తరహా జీవితమూ తన వల్ల కాదని తెలుసుకొని తిరిగొచ్చి తన పిల్లలను కలుసుకోవడం దీని ఇతివృత్తం. 1997 జనవరి నెలలో ఈ పుస్తకపు సంక్షిప్తానువాదం ప్రచురించబడింది. అనువాదకురాలి పేరు ఉమాదేవి.
68 భగవద్గీతలో చెప్పబడ్డ యోగభ్రష్టత: యోగ మార్గం నుండి మధ్యలో పక్కకు తప్పిపోయిన వారి గతి గురించి భగవద్గీతలో చేసిన వివరణ.
69 ప్రధానాధికరణం: ఒక శాస్త్రంలో లేదా వాదంలో చర్చించబడే ముఖ్యమైన విషయం లేదా సూత్రం.
70 ఎం.హిరియణ్ణ: భారతీయ తత్త్వశాస్త్రంపై విశేషమైన కృషి చేసిన 20వ శతాబ్దపు ప్రముఖ పండితుడు. భైరప్ప గారి తత్త్వశాస్త్రగురువైన యామునాచార్యులకు గురువు ఈయన. హిరియణ్ణ తత్త్వశాస్త్రపాఠాలను – డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ సూచన మేరకు సంకలనం చేసి Allen & Unwin ముద్రాపకులు ‘Outlines of Indian Philosophy’ అనే పుస్తకాన్ని అచ్చు వేయగా అది ఎంతో ప్రాచుర్యాన్ని గడించిందట.
71 ప్రత్యభిజ్ఞావికాసము: వివిధ విషయాలను చూసినప్పుడు, వాటి వెనుక ఉన్న ఏకత్వాన్ని తిరిగి గుర్తించగలగడం అనే జ్ఞానం వికసించడం. ఆసక్తి ఉన్నవారు, ఈ దృష్టికోణం ఆధారంగా ఈ రచయితే – శతావధాని గణేశ్ – వ్రాసిన ‘షడ్దర్శనసంగ్రహ’ అనే వ్యాసపరంపరలో చివరి భాగాన్ని గమనించగలరు; అలాగే హిరియణ్ణ Quest after Perfection, Popular essays in Indian philosophy, Mission of Philosophy అనే రచనలను కూడా పరిశీలించగలరు.
72 లోకసంగ్రహరూపంలో భగవద్గీత బోధించే కర్మనిష్ఠ: సమాజ శ్రేయస్సు (లోకసంగ్రహం) కోసం ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించాలని భగవద్గీత చెప్పే సిద్ధాంతం.
73 నిగమనము (Deduction): ఒక చర్చ లేదా పరిశీలన నుండి చివరగా తేల్చిన సారాంశం, ముగింపు.
74 జీవన్ముక్తి: బ్రతికి ఉండగానే మోక్షస్థితిని పొంది, జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం.
75 నిర్లేపకర్మసిద్ధి: ఏ కర్మ చేసినా దాని ఫలితాలకు అంటకుండా, నిస్సంగుడై ఉండగలగడం.
76 సదా నేతి మార్గం: “ఇది కాదు, ఇది కాదు” (నేతి, నేతి) అని చెప్పుకుంటూ, తెలిసిన వాటిని నిరాకరిస్తూ, తెలియని పరమసత్యాన్ని అన్వేషించే ఉపనిషన్మార్గం.
77 వ్యంజనావ్యాపారసిద్ధి: మాటకున్న సూచ్యార్థం (ధ్వని) ద్వారా అదనపు అర్థాన్ని స్ఫురింపజేయగలగడం.

శతావధాని రా. గణేశ్

రచయిత శతావధాని రా. గణేశ్ గురించి:

భారతదేశంలోని అగ్రగణ్యులైన సంస్కృత కవులు, పండితులలో ఒకరైన శతావధాని రా. గణేశ్‌గారు కర్ణాటక రాష్ట్రానికి చెందిన కోలార్‌లో జన్మించారు. కన్నడ, సంస్కృతం, ఇంగ్లీషు, తెలుగు భాషలలో రచనలు చేసిన వీరు యూవీసీఈ (UVCE) నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీఈ; ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుండి మెటలర్జీ మరియు మెటీరియల్ సైన్స్‌లో ఎమ్మెస్సీ పట్టాలు పొందారు. అలాగే ఆయనకు సంస్కృతంలో ఎంఏ పట్టా కూడా ఉంది. భారతీయ ప్రాచీన సాహిత్యం, తాత్త్విక, ఆలంకారిక శాస్త్రాలకు సంబంధించిన వివిధ అంశాలపై విస్తృతంగా రచనలు, ఉపన్యాసాలు చేసారు. ప్రాచీన అవధాన కళలో నిష్ణాతులైన ఈయన, కన్నడంలో ఈ కళకు పునరుజ్జీవనం కలిగించిన ఘనతను పొందారు. సంస్కృతభాషకు ఆయన చేసిన సేవకుగాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ‘బాదరాయణ-వ్యాస’ పురస్కారాన్ని అందుకున్నారు.

 ...