బాగుంటుంది కదా
పాత ముచ్చటను తీరుబడిగా తిరిగేసుకోవడం.
*
గుర్తుందా,
చలికాలపు సూర్యుడు సర్దుకునే సమయం?
పొగలు కక్కే కప్పుల్లోకి
చెరోపక్క నుండి మునకేయడం!
మనదైన మక్మల్ రహస్యంలా
సగం నానిన మస్కాబిస్కెట్
గొంతు కిందికి మెత్తగా జారిపోవడం.
*
అదే ఆఖరు కదూ!
అలాంటి మరొక సమయం కోసం
ఒకరికొకరం మాటిచ్చుకున్నాం
ఆ సంధ్య మళ్ళీ రాలేదు
ఆశ మాత్రం
కప్పులో కరగని చెక్కరలా,
యిప్పటికీ…
