పద్మవ్యూహం

వెలుగుతున్న ప్రమిద పట్టుకుని దాసి మెల్లగా తలుపు తీసుకుని లోపలికి వచ్చింది. దీపం కంటికి దగ్గరగా ఉండటంతో ఆమెకు గది మరింత చీకటిగా ఉన్నట్టు అనిపించిందేమో, మంచంకేసి నిశితంగా చూసింది. ఆమె గమనించేటట్టు మంచం మీద కదిలాను. చూరుకు వేలాడుతూ ఉన్న కన్యాదీపం కొండెక్కితే తిరిగి వెలిగించి ప్రమిదతో నా దగ్గరికి వచ్చింది. నా వైపుకి వంగి మృదువుగా, “వేళైంది, మహారాణీ” అంది.

“ఏమిటీ?” అన్నాను. నా స్వరపేటికకు మాట్లాడే అలవాటు తప్పినట్టు అనిపించింది.

నా మనసంతా అరుపుల ఆర్తనాదాల సముద్రంలా అల్లకల్లోలంగా ఉంది. ఆ కెరటాల్లోనుంచి ఒక్క చుక్కను తోడి పెదవుల పైకి తీసుకురావడానికి పెను ప్రయత్నమే చెయ్యాల్సివచ్చింది.

“తెల్లవారబోతోంది. బ్రహ్మ ముహూర్తంలోనే బయలుదేరాలని ఆదేశించారు” అంది దాసి.

“ఎక్కడికి?” అనడిగాను. ఏదీ ఆలోచించే పరిస్థితిలేదు. మనసంతా ఆందోళన.

దాసి జంకుతున్నట్టుగా నాలుకతో పెదాలను తడిచేసుకుంటూ “ఈ రోజు యువరాజుకు తిలోదక సంస్కరణ…” అంది.

చల్లటి కత్తితో నా పొత్తికడుపులో పొడిచినట్టు అనిపించింది. మనసు ఒక్క క్షణం మూగబోయింది. నిశ్శబ్దం నొప్పిలా మారి ఒళ్ళంతా పాకింది. వెక్కిళ్ళతోబాటే కడుపులో వణుకు మొదలై నొప్పి బుడగలా ఎగసి ఛాతీకి పాకి గొంతుకడ్డుపడింది. గట్టిగా పెదవులు కొరుక్కున్నాను.

దాసి వంగి, “మహారాణీ” అని పిల్చింది. అంతకంటే ఏం చెయ్యాలో ఆమెకు తెలియలేదు. నన్ను నేను తమాయించుకుని దుఃఖాన్ని దిగమింగుకున్నాను. కొన్ని క్షణాలు అలానే కూర్చున్నాను. తర్వాత గొంతు తగ్గించి “అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా?” అనడిగాను.

“శ్వేతవనం నుండి పట్టపురాణీ ఇతరులూ నేరుగా గంగానది ఒడ్డుకు వచ్చేస్తారట.”

లేచాను. నా ఒళ్ళు భారంగా ఉంది. నిలబడలేక తడబడ్డాను. నన్ను పట్టుకోవచ్చో పట్టుకోకూడదో అని ఆలోచిస్తూ దాసి ముందుకు అడుగేసింది. వద్దని చేత్తో సైగ చేశాను. నెమ్మదిగా నడిచాను. రాజభవనమంతా నిశ్శబ్దంగా ఉంది. నీటి మీద తేలుతున్న దీపాలు అసియాడుతున్నాయా అన్నట్టు దాసీజనం తిరుగాడుతున్నారు. బయట ఈలకోళ్ళ శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక పడుచు దాసి వచ్చి, “స్నానానికి ఏర్పాట్లు చేశాను” అని చెప్పింది.

గోరువెచ్చని నీరు నా ఒంటిని తడిపి కిందకి జారుతోంది. వెచ్చని నీరు మనసుకు ఊరటనివ్వడం ఆశ్చర్యం కలిగించింది. జుట్టు ఆరబెట్టుకుని తెల్లటి బట్టలు కట్టుకున్నాను. ఒకే ఒక్క వజ్రాల హారాన్ని మెడలో వేసుకున్నాను. చితి మీద కూడా నేను నగలు ధరించుకుని తీరాలి. నేను సుభద్రను! పాండువంశానికి కోడలిని, మహారాజుగారి తమ్ముడి భార్యని! యాదవవంశ తిలకుడికి చెల్లెల్ని. ఈ రెండు పాత్రలనుండీ నేను ఎప్పటికీ బయటకు రాకూడదు. లోహపు గద దెబ్బతో తల పగిలి, శరీరమంతా బాణాలు గుచ్చుకుపోయి నా బిడ్డ యుద్ధభూమిలో పడివున్న దృశ్యం కళ్ళల్లోనే కరడుగట్టింది. ఏడ్చి ఏడ్చి దాన్ని కన్నీళ్ళతో కరిగించుకుందామన్నా నాకందుకనుమతి లేదు. ఆ రోజు నాకు ఆ దుర్వార్త చెప్పడానికి అన్నే స్వయంగా వచ్చాడు. ఎప్పుడూ ఆత్మవిశ్వాసంతో తొణికిసలాడే ఆ చిరునవ్వు. నెమ్మదైన స్వరం. ‘సుభద్రా, నువ్వు యాదవ వంశపు యువరాణివి, పాండవవంశానికి రాణివి. నువ్వు ఆ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మరిచిపోవని నేనెఱుగుదును…’. భర్తో, బిడ్డలో రణరంగంలో మరణించారన్న వార్త తెలియగానే వీడిపోతున్న కొప్పు గురించో తొలగిపోతున్న వస్త్రం గురించో స్పృహలేకుండా ఒక మామూలు తల్లిలా గుండెలు బాదుకుంటూ యుద్ధభూమికి పరిగెత్తలేకపోయాను. నా ముద్దుల బిడ్డ అభిమన్యుడి మీద పడి మనసారా ఏడవలేకపోయాను. వాడు పాలు తాగిన ఈ రొమ్ములను గట్టిగా బాదుకుని ముక్కలు చేసుకుని ఉంటే బహుశా నేను నిద్రపోగలిగేదాన్ని. అన్న చూపులు ఎప్పుడూ నన్నంటిపెట్టుకునే ఉన్నాయి. ఆయన స్పష్టమైన మాటలు, సర్వమూ ఎఱిగిన నెమ్మది స్వభావం. ‘సుభద్రా, ఎవరికీ లొంగని మూపురాలున్న కోడెలనే ఆవులు గర్భంలో నిలుపుకుంటాయి. ఎవరూ అదుపు చేయలేని జవనాశ్వాలనే అశ్వాలు తమ కడుపున మోస్తాయి. అలానే క్షత్రియమాతలు వీరమరణం పొందే గొప్ప యోధులకే జన్మనిస్తారు!’ ఆ రోజు అన్నని ఎంతగా ద్వేషించాను! జీవితంలో మొట్ట మొదటిసారి అన్న మధురమైన స్వరం నన్ను నిప్పులా తాకింది. అన్న నెమ్మదితనంచూసి నాకు అసహ్యం వేసింది. అతను చేసే ధర్మోపదేశం, నీతి బోధ, సంయమనం కోల్పోని తర్కం. అన్న అసలు మనిషే కాడు, రాజనీతిజ్ఞుడు మాత్రమే. ఆయనకు బంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు ఉండవు. భావోద్వేగంతో చెంపలమీదకు జారే కన్నీళ్ళను ఆయన ఎఱుగడు. ఎంత దుర్భరమైన సందర్భంలోనైనా సమయోచితంగా మధురమైన సమాసాలతో ఒక అందమైన వాక్యాన్ని చెప్పగలడు.

“అన్నెక్కడున్నాడు?”

“ఖాండవవనంలో మహారాజుగారితో ఉన్నారని చెప్పారు.”

నేనడగబోయే తదుపరి ప్రశ్న కోసం దాసి ఎదురు చూస్తోంది.

“మరి అర్జునులవారు… ?”

“రాత్రి రెండో జామువరకు ఇక్కడే ఉన్నారని చెప్పారు. తర్వాత వారు రథమెక్కి…”

చెప్పింది చాలన్నట్టు, “సరే” అన్నాను. దాసి అడుగు వెనక్కువేసింది. అవును, ఆయన ఈ రాత్రికి ద్రౌపదిని సమీపించలేడు. ఆమె గాయపడ్డ పులిలా ఉంటుంది. ఎవరూ ఆమెను సమీపించలేరు. కృపాచార్యులు, అశ్వత్థామ పెట్టిన చిచ్చులో ఆమె ఐదుగురు కుమారులు సజీవంగా దహనమయ్యారు. ఆమెకు ఆ ఘోరాన్ని ప్రత్యక్షంగా కళ్ళతో చూడాల్సిన దుర్గతి పట్టింది. ఈ సమయంలో ఆమె ఏం చేస్తోందో! కత్తి తీసుకుని వెయ్యి మంది గుండెలను చీల్చి ఆ రక్తంలో స్నానం చేస్తే బహుశా ఆమె మనస్సు చల్లబడవచ్చు. ఆర్యావర్తాన్నంతా కాల్చి బూడిద చేస్తే ఆమె మనస్సు శాంతపడవచ్చు. ఈ పరిస్థితిలో కూడా ఆమె గురించి ఇలాంటి ఆలోచనలే వస్తున్నాయి. కుమారులు ఐదుగురినీ కోల్పోయిందన్న వార్త నా చెవినపడ్డప్పుడు కూడా అదే జరిగింది. వెంటనే నా మనసు శాంతించింది. ఆమె వెక్కి వెక్కి ఏడవాలి. ఆమె కడుపు మండిపోవాలి. ఆర్యావర్తంలో ముంచుకొచ్చిన ఈ పెనువిపత్తుకు బీజం వేసింది ఆమె అహంకారం కాదా? ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె ధగధగలాడే వజ్రాల కిరీటం ధరించి పట్టమహిషిగా సింహాసనం మీద నవ్వుతూ ఎలా కూర్చుంటుంది? అది ధర్మ సమ్మతమేనా? వజ్ర కిరీటకాంతి ముఖం మీద పడినప్పుడు ఆమె కళ్ళు కలతతో జ్వలించి కన్నీటి ధారలు కురిపించాలి. భరతవర్షం ఆమె పాదాక్రాంతం అయినప్పుడు ఆమె శరీరం నిలువునా దహించుకుపోవాలి. పువ్వులు పరచిన హంసతూలికాతల్పం మీద ఆమె ఒక్కరోజు కూడా ప్రశాంతంగా నిద్రపోకూడదు. నా బిడ్డ రణరంగంలో ఛిద్రమై పడి ఉండటం చూసినప్పుడు; ఒక్క క్షణం పాటు ఆ దృశ్యం నన్ను కుదిపేసి వికారం, విరక్తి పుట్టించి నా ఒళ్ళంతా గడ్డకట్టుకుపోయి కొయ్యబారిపోయినప్పుడు, ఆ కత్తిపోటు మంచు ముక్కలా నా పొత్తి కడుపుని చీల్చినప్పుడు; ఓసి పాపిష్టిదానా! నా బిడ్డను బలి తీసుకున్నావు కదే? అంటూ నేనేడ్చాను. ఆ స్వరం నా మనసులోనే ప్రతిధ్వనిస్తూ నెమ్మదిగా సద్దుమణిగింది. ఎర్ర మట్టి నేల మీద గడ్డకట్టిన రక్తం నల్లటి మడుగుకింద మారింది. ఆ మడుగులో పడున్న నా బిడ్డ శరీరం మీద నేనే నా స్వహస్తాలతో వేసిన పసుపు రంగు అంగవస్త్రం కనపడుతోంది. అయితే ఆ ముఖం! అది… అది నా బిడ్డది కాదు. లిప్తపాటున ఆ ఊహ ఎంత ఓదార్పునిచ్చింది? ఇక్కడ పడున్నది అభిమన్యుడు కాదు. వాడు ఇంకెక్కడో ఉన్నాడు. ఏ క్షణంలోనైనా నా ముందు కనిపించి నన్ను చూసి నవ్వి భయపడ్డావు కదా అని అడుగుతాడేమో?

చిన్నప్పటినుంచీ ఎంత చక్కటి నవ్వుండేది వాడి ముఖం మీద? పై పెదవిపైన ఆ నూనూగు మీసాలు లేకపోతే వాడింకా పసిపిల్లవాడే. నవ్వేప్పుడు తన చిన్న కళ్ళను సగం మూసుకునేవాడు. బలమైన విశాలమైన బాహువులను ఎగరవేసుకుంటూ తిరిగేవాడు. ఎప్పుడూ నవ్వుతూనే ఉండేవాడు. ఆ‍టపట్టిస్తూ నా భుజాలు పట్టుకుని కుదిపివేసేవాడు. వాడి సమక్షంలో నాకు తెలియకుండానే నేను భయస్తురాలిగా, పిరికిదానిగా నటించేదాన్ని. దిట్టమైన చేతులు వాడివి. మచ్చలు నిండిన మోచేతులు. తల పైకెత్తి చూడాల్సినంత ఎత్తు. విశాలమైన ఛాతీ. వాడిని చూడగానే నా హృదయం పులకించేది. మఱుక్షణమే అయ్యో ఎక్కడ దిష్టి తగులుతుందోనని మనసు చిన్నబొయ్యేది. ముందూ వెనుకలు ఆలోచించని తొందరబాటు స్వభావం వాడిది. తన దుందుడుకు ప్రవర్తనవల్ల ఈ తల్లిపడే వేదన వాడికి ఎప్పటికీ అర్థమయ్యేది కాదు. వాడు తప్పటడుగులు వేయడం మొదలుపెట్టిన రోజునుండి నాకలాంటి పాట్లు తప్పలేదు. వాడు కిటికీలెక్కి ఊచలు పట్టుకుని అటకకు వేలాడుతూ విన్యాసాలు చేసేవాడు. నిచ్చెనలెక్కి పైమెట్టుపై నిలబడి నవ్వేవాడు. పనస చెట్టు కొమ్మల కొనలు పట్టుకుని ఊగుతూ పక్క కొమ్మ మీదికి ఎగిరేవాడు. కొబ్బరి చెట్లెక్కి గంగానదిలోకి తల్లకిందులుగా దూకేవాడు. గుఱ్ఱపుస్వారీ చేస్తూ ప్రవాహాల మీదుగా ఎగిరి దాటేవాడు. కత్తిని గిరగిర తిప్పి పైకి విసిరి కింద పడేప్పుడు పట్టుకునేవాడు. మదపుటేనుగును మచ్చిక చేసుకుని దాని పైనెక్కి కూర్చునేవాడు. ‘అభిమన్యూ, అభిమన్యూ, జాగ్రత్త, జాగ్రత్తమ్మా… జాగ్రత్త నాన్నా!’ ఈ మాటలే నాకు జపంగా మారిపోయాయి. ఎప్పుడూ దూకుడేగానీ కుదురుగా ఉండడు. ఎప్పుడూ మూసి ఉన్న తలుపులను బద్దలుకొట్టి మరీ తెరిచేంత ఉత్సాహంతో ఉండేవాడు. ‘అభిమన్యూ! దుడుకు పనులొద్దురా’ అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఎన్ని సార్లు బతిమాలానో! పొద్దస్తమానం ఒంటిమీద ఏదో ఒక గాయం చేసుకుని రక్తం కార్చుకుంటూ వచ్చి నిలబడేవాడు. లేకపోతే ఒక ఎముకని విరగ్గొట్టుకుని పడుకునేవాడు. నా బిడ్డకు తెలిసే ఉంటుందా తన ఆయుష్షు ఎంత తక్కువో? అయ్యో! నా బిడ్డను నేను కళ్ళారా చూడలేదే? నా గుండెకు హత్తుకుని వాణ్ణి తనివితీరా ఏనాడూ ముద్దు పెట్టుకోలేదే? ఈ ఆభరణాలు, పట్టు వస్త్రాలు, మహారాణి హోదా అన్నిట్నీ వదిలేసి పది రోజులు నా బిడ్డతో ఎక్కడైనా ఉంటాను. దట్టమైన అడవిలో, ఒక గుడిసెలో! నేను వాడికి సపర్యలు చేసుకుంటాను. వాడు నిద్రపోతుంటే మేల్కొని వాణ్ణి కనులారా చూసుకుంటాను. అమ్మా అని పిలిచే వాడి పిలుపు మళ్ళీ ఒక్కసారి నా చెవిన పడితే అది చాలు. అలా వేయిసార్లు వాడితో పిలిపించుకుంటే చాలు. ఆ తర్వాత వాడిని తీసుకెళ్ళండి. లేదంటే వాడికి బదులుగా నేనొస్తాను – ఆ చావేదో నన్నే తీసుకెళ్ళనీ. నాక్కావల్సిందదే; ఆ ఒక్క కోరిక తప్ప ఇంకేం మిగిలి లేదు.

“రథం వచ్చేసింది, మహారాణీ!” దాసి వచ్చి చెప్పింది. లేచి నెమ్మదిగా బయటికి నడిచాను.


2
బయట చల్లగా ఉంది. ఆకాశమంతటా నక్షత్రాలు అలముకొని ఉన్నాయి. ఎనలేని ప్రేమతో ఈ భూమిని చూసే ఋషిపుంగవుల కళ్ళు అవి. అలా వాళ్ళంతా ఏం చూస్తున్నారు? భూమ్మీదున్న ఈ మానవుల దుఃఖాలు వాళ్ళకి అంత ఆనందాన్ని ఇస్తాయా ఏమిటి? వాళ్ళంటే ఋషులు. భవబంధాలను జయించినవాళ్ళు, సామాన్యుడి మనస్సు పడే యాతన వాళ్ళర్థం చేసుకోలేరు. అందుకే వాళ్ళు పైనుండి ధర్మాధర్మాలను నిర్ణయిస్తారు! అన్న కూడా ఋషే. చదరంగం ఆడే ఋషి. కేవలం విజయకాంక్ష మాత్రమే కలిగిన ఋషి. మనుషులూ సామ్రాజ్యాలే ఆ చదరంగంలో పావులు.

రథం నెమ్మదిగా ముందుకు సాగుతోంది. ప్రధాన రహదారి నిర్జనంగా ఉంది. మట్టి వాసనతో నిండిన చల్లని గాలి ఒంటి మీది బట్టలను చిన్నగా రెపరెపలాడిస్తోంది. రాత్రి తాలూకు సద్దులు సన్నగా ఇంకా వినిపిస్తున్నాయి. ఉండుండి దూరంగా కొన్ని పక్షుల కూతలు వినిపిస్తున్నాయి. ఇళ్ళల్లో వెలిగించిన దీపాలు అసియాడగా మనుషుల కదలికలు కనబడుతున్నాయి. కానీ మాటలేవీ వినిపించడం లేదు. బహుశా ఈ నగరమంతా ఈ రోజు ఉదక సంస్కరణకి సిద్ధమవుతుండవచ్చు. ఈ రోజు గంగ తనతో ఎన్ని ఆత్మలను తీసుకువెళుతుందో! వాటినన్నిటినీ సముద్రంలోకి మోసుకెళ్ళే శక్తి ఆమెకు ఉంటుందా? స్తన్యమిచ్చిన రొమ్ములమీదే శవాలను మోసుకువెళ్ళాల్సిన రాత రాసింది, విధి ఆమెకు.

గాలి వేగం పుంజుకున్నప్పుడల్లా ఆలోచనలు రథం నుండి దూరంగా ఎగిరి వెనక్కి వెళ్తున్నట్టు అనిపించింది. ముఖాన్ని తాకే గాలి విసురు వల్ల మాత్రమే రథం ఎంత వేగంగా వెళుతోందో తెలుస్తోంది. నేలమీద పాదాలు తాకని గుఱ్ఱంలా మనస్సు ఆ రథంతో పాటు పరిగెత్తింది. కాలమూ స్థలమూ మాయమైపోయి నేను ఎక్కడికైనా వెళ్ళగలనని అనిపించింది. శరీరం తేలికైంది. నా కండరాల బిగువు సడలింది. నా నవ్వులో కొద్ది వణుకు గొంతులో చిన్న లాలన వచ్చాయి. అప్పుడే నేను సుభద్రని అని గ్రహించాను. అవును, నేను ధరించింది ఒక వేషం. ఈ బరువైన శరీరం ఒక వస్త్రం, దీన్ని తీసి పడేస్తే నేను సెలయేళ్ళమీదుగా రథంతో ఎగిరే సుభద్రను. రెండు చేతుల్లోనూ కత్తులు పట్టుకుని ఇద్దరు మనుషులతో ఒకేసారి పోరాడగల యాదవ యువరాణిని. రైవతపర్వతపు గిరిపూజలో చెలికత్తెలతో సురను సేవించి నృత్యం చేసే స్వేచ్ఛాజీవిని. మత్తెక్కి గుఱ్ఱాన్ని దౌడు తీయిస్తూ బండరాళ్ళు దొర్లిపడే కొండలోయల్లో గాలిలా దిగే సెలయేరుని. కానీ ఇదంతా ఒట్టి కల. మెలుకువ రాగానే నేను ద్వారకలో నా గదిలో ఉండేదాన్ని. పక్క గది నుండి సుధర్మ, గిరిజలు వస్తారు. ఖడ్గయుద్ధం నేర్పించిన తాత అక్రూరులు, ప్రేమతో కథలు చెప్పే సాత్యకి మామ, క్రమశిక్షణ నేర్పే సాంబ మామ… ఎప్పుడూ నన్నే అంటిపెట్టుకుని స్నేహితుడిలా ఉండే అన్న. అల్లరి చేస్తూ బెట్టు చూపిస్తూ ఆప్యాయతను కురిపిస్తూ ఉండేవాడు, అన్న. ఏదైనా చేయగల శక్తి సామర్థ్యాలు గలవాడు. ‘అన్నా, నువ్వు ఎంతలా మారిపోయావు! నీ కళ్ళలో ఎప్పుడూ కనిపించే ఆ కొంటెతనం, అల్లరి ఎక్కడ?’

రథం చిన్నగా ఒక కుదుపుకు లోనై వేగం పుంజుకుంది. ఇదిగో సరిగ్గా ఇలాంటి మత్స్య రథంలోనే నేను ద్వారకను విడిచి వచ్చాను. ఆరోజున ఆ రథంమీద చేతిలో ఎక్కుపెట్టిన విల్లుతో నేను అబ్బురపడి వింతగా చూసిన మహావీరుడు నాకపరిచితుడు! వెనుక అక్రూరుల నాయకత్వంలో యాదవులు వెంబడించి రాగా, బాణాలు చిన్న పక్షుల గుంపుల్లా వచ్చి వాలాయి. రథంలో అల్లెత్రాటి టంకారం. అతడి గుఱితప్పని బాణాలు తగిలి అశ్వారూఢులైన యాదవులు బండరాళ్ళు నిండిన నేలపై పడి ఆక్రోశించారు. మనసులో ఉత్సాహం ఉరకలు వేస్తూనే ఉంది. గిరిపూజ సమయంలో మద్యం మత్తు పూర్తిగా ఎక్కేస్తుంది. ఆ మత్తు ఇంకా ఇంకా గుఱ్ఱాలను ఉసిగొల్పేట్టు చేస్తుంది. ఇప్పుడు మద్యం లేదు. కానీ మనసులో మాత్రం ఆ మత్తు పలురెట్లయింది. ఓర కంట విల్లుని ఎక్కుపెట్టిన ఆ చేతుల్లో కదులుతున్న కండరాలను చూశాను. దట్టమైన జుట్టుతో విశాలంగా ఉన్న ఛాతీ. జింక చర్మపు తాడుతో కట్టిన వంపులుతిరిగిన జటాజూటాలు. నడుమున చల్లడం బిగిసిన బిగువు కింద సన్నగా క్రిందికి దిగిన పొత్తి కడుపు. త్వరగా… త్వరగా అంటూ నా ప్రాణం ఊగిసలాడుతోంది. అంతులేని అంతరిక్షంలోకి అలా చొచ్చుకుపోతూనే ఉండాలనిపించింది.

యాదవదేశపు సరిహద్దును దాటాము. దూరానెక్కడో ఖాండవప్రస్థ పర్వతశ్రేణులు కనిపించాయి. వర్షం పడేలా ఉంది. మసక వెలుతురులో యాదవ దేశంలోని పచ్చిక బయళ్ళు చాలా దూరం విస్తరించి ఉన్నాయి. మేఘాల రాశులు ఆకాశంలో నెమ్మదిగా ఈదుతున్నాయి. పశువుల కాపరులు గుంపులు గుంపులుగా తమ ఆవులను తోలుకుపోతున్నారు. దూరంగా ఒకచోట మబ్బుల సందున దూరి వచ్చిన ఎర్రటి ఎండ మైదానం మీద ఒక పసిడి స్తంభంలా పడుతోంది. మరకతాలు పొదివిన చీర పరిచినట్టు ఆ ప్రాంతం అంతా ప్రకాశిస్తోంది. గుఱ్ఱాలు అలసిపోయాయి. అవి నురగలు కక్కుతున్న నోటితో తలలు వాల్చేశాయి. వాటి శరీరాల నుండి ముత్యాల్లా చెమట బిందువులు రాలుతున్నాయి. మదిని మైమరిపించే గుఱ్ఱపు చెమట వాసన. ద్వారాలు తెరుచుకుని కళ్ళ ముందు పరాయి దేశం సాక్షాత్కరించింది. దూరంగా అడవుల మధ్యన పర్వత శిఖరాలు. ధ్యానంలో కూర్చున్నట్టున్న పెద్ద పెద్ద బండరాళ్ళు. దట్టమైన ఆకుపచ్చని కొండ లోయలు. పర్వత శిఖరాలు ఆకాశం కలిసి ఏకమైన లేతనీలం రంగు. నలుదిక్కులా దిగంతందాకా వ్యాపించిన చదునైన పచ్చిక బయళ్ళతో కనిపించే యాదవ భూమిలో పెరిగిన నాకు చుట్టూ పర్వతశ్రేణులతో కంచ వేసినట్టుండే ఈ కొత్త భూమి చెరసాలలా అనిపించింది. ఇక్కడ గుఱ్ఱమెక్కి ఎక్కడికీ ఎగిరిపోలేను. తొలిసారిగా నా మనసులోకి భయం ప్రవేశించింది.

శరీరంపై చిన్న గాయాలతో రథం నుండి కిందికి దిగాడు అతను. రథాన్ని నిలిపి గుఱ్ఱాలను విప్పి పక్కన ఉన్న వాగులో వాటికి నీళ్ళు తాగించాను. పచ్చిక నేల మీద కూర్చుని నా పాదాలు నీటిలో ఆడిస్తున్నాను. ఆకాశంలో కారు మేఘాలు కమ్ముకోవడంతో నీళ్ళు చల్లగా ఉన్నాయి. అతను వచ్చి నా పక్కన కూర్చున్నాడు. గుఱ్ఱాల చెమట వాసనతో నా నాసికంతా నిండిపోయింది. అతను నా భుజాన్ని తాకాడు. అల్లెత్రాటి అభ్యాసంతో కాయగాసిపోయిన చూపుడు వేలు చేవదేరిన దుంగ ముక్కలా నన్ను తాకింది. నా శరీరం అంతటా వింతైన ఉత్సాహం వెచ్చగా వ్యాపించింది. “సుభద్రా, మన దేశపు సరిహద్దుల్లోకి ప్రవేశించాం. ఇదిక నీ దేశం.”

నేను తల వంచుకున్నాను. అతను నా చేతులు పట్టుకున్నాడు. “నువ్వు భయపడుతున్నావా?” అతని మీసాలు నాకు దగ్గరగా కనిపించాయి. అతని చూపు చురకత్తిలా గుచ్చుతోంది. “లేదు” అన్నాను. ఆ క్షణంలో నాకే వింతగా అనిపించింది. నేను ఈ నిర్ణయం ఎలా తీసుకున్నాను? ఇతను “నేను అర్జునుడిని” అని చెప్పినప్పుడు, నా మనస్సుకున్న అన్ని సంకెళ్ళూ ఎలా తెగిపోయాయో! ఇతను అన్నకు ప్రాణ స్నేహితుడు, మహాయోధుడు. నన్ను వెతుక్కుంటూ వచ్చినవాడు! కాదు, కాదు. వాటన్నిటికంటే నన్ను ఎక్కువగా ఆకర్షించినవి వేరే; అతని సాహస గాథలు. టక్కులు. మాయలు. వెళ్ళిన చోటల్లా అతను గెలుచుకున్న స్త్రీలు. గెలిచి వశంచేసుకోడానికి ఒక నల్లటి మొరటు గుఱ్ఱాన్ని దొరకబుచ్చుకున్న సంతోషం నాది. ప్రమాదకరమైన ఆకర్షణ అది. తెలియని ఆపదలు, ఆనందాలతో నిండిన తలుపుల్ని తోసి తెరిచే దుందుడుకుతనమది.

“నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా?” అంటూ తన చేత్తో నా నడుము వంచి నా భుజం వంపులో తన ముఖాన్ని అదుముకున్నాడు. నెమ్మదిగా కదిలిన అతని చేతులు వీపున నా చనుమఱువు ముడిని విప్పాయి. అతని పెదవులు వెచ్చగా అదుముతున్నాయి. శరీరమంతా పాకిన వేడితో నా ఒళ్ళు బిగిసింది. మఱుక్షణం అదుపులేని అతని చనువు నన్ను సన్నగా కాల్చేస్తోంది. నా చేతులు అతని ఛాతీమీద పెట్టి దూరంగా నెట్టాను. గింజుకున్నాను. గాజులు గలగలమన్నాయి. హారాలు మెలిబడ్డాయి. నవ్వుకునేందుకు ఓ ఆటబొమ్మలా అవి నన్ను మార్చినట్టనిపించింది. నేను అలా గింజుకోవడం అతనికి ఇంకా ఉత్సాహాన్నిచ్చింది. నవ్వుతూ, “నువ్వు అచ్చం ఒక గుఱ్ఱం పిల్లలా ఉన్నావు” అన్నాడు.

నా వేగం మందగించింది. కుంచించుకుపోయాను. నేను గెలుచుకున్నది మొరటు గుఱ్ఱాన్ని కాదు. నన్నే ఒక చిరుతపులి వేటాడింది. దాన్ని దూరంగా నెట్టడం ఓ వృధా ప్రయాస. నా శరీరాన్ని వివశం చేస్తున్న అతని ఒడుపు నా అవయవాలను స్తంభింపజేసింది. నా మనస్సు చురుకుదేఱింది. అది తోచగానే, ఆ ఆయుధం ఎంత పదునైనదో అన్న ఊహతో నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. “సరే, మీ మహారాణి దీనికి ఏమంటుంది?” అని అడిగాను.

అతని పట్టు సడలింది, ముఖం పాలిపోయింది. లేచి కూర్చున్నాడు. తల వంచుకుని, “నాకూ ఆమె గురించి తలచుకుంటే భయంగానే ఉంది” అన్నాడు. “ఒక క్షణం గంగానదిలా వెచ్చగా తన అక్కున చేర్చుకుంటుంది, మరుక్షణం పాములా బుస కొడుతుంది.”

నా మనస్సు బరువైంది. వెంటనే తేలికైంది. ఈ జగన్మాయలమారి లోపల దాగున్న పిరికి పిల్లవాడిని నేను కనుగొంటున్నాను. అతని తలను నా రొమ్ములకు పొదువుకొని, “కలత చెందకండి” అన్నాను. నా మనసున ఆ క్షణంలో జాలి ఉప్పొంగుతున్నప్పటికీ లోలోపల విజయ గర్వమే కలిగింది.

“నువ్వు గొల్లెత వేషంలో ద్రౌపది దగ్గరకు వెళ్ళు. నాకు ఎవరూ లేరు; మీరే నాకు ఆశ్రయం అని ఆమెకు చెప్పు. ఆమె ఆశ్రయం ఇచ్చాక జరిగిన విషయమంతా చెప్పవచ్చు. ఆమె ఇచ్చిన మాటను మీఱదు.”

“ఆమె అంగీకరించకపోతే?”

“తప్పకుండా అంగీకరిస్తుంది. ఆమె గర్వం ఒక కోట లాంటిది. దానిని ఛేదించుకుని లోపలికి వెళ్ళగలిగితే ఆమె ఒక చల్లని సరస్సు.”

మళ్ళీ నాలో గర్వం పడగెత్తింది. మనసులో చేదు మొదలైంది. ఆ తర్వాత అతను నన్ను తాకే ప్రయత్నం చెయ్యలేదు. మండుతున్న హృదయంతో నేను రథమెక్కాను. చినుకులు మొదలయ్యాయి. ఆకాశం చిరిగి కుండపోతగా కురుస్తోంది. గడ్డినేలమీద వర్షపు బిందువులు నేస్తున్న తెల్లటి పట్టుతెర దారినంతా కప్పేస్తోంది. రథం దాన్ని చీల్చుకుంటూ పరుగెత్తింది. ఖాండవప్రస్థ పర్వతాల మీద పడే వర్షపు హోరు పెనుసైన్యాల యుద్ధఘోషలా వినిపిస్తోంది. బయటున్న చలి కంటే భయం వల్ల పుట్టుకొచ్చిన లోపలి చలి నన్ను పూర్తిగా అలుముకుంది. దేని గురించి ఇంత భయపడుతున్నాను? నా కోసం కుట్రలు పన్నుతున్న సైన్యం ఏది? నేను ఒక్క క్షణంలో లోపలికి ప్రవేశించగలను. ఆ తదుపరి ఎదురయ్యే అనిశ్చితే నన్ను ఆకర్షించింది. రథం అడవిలోకి ప్రవేశించినప్పుడు నా శరీరం ఝల్లుమంది.


3
గంగ సుడులు తిరుగుతూ సాగుతూ మసక మసకగా కనపడుతోంది. ఒడ్డున దట్టంగా చెట్లు, పొదలు. పక్కనే అంగవస్త్రం పరిచినట్టు ఎర్రటి బాట. గుఱ్ఱాల గిట్టలు మట్టి నేల మీద శబ్దం లేకుండా నడుస్తున్నాయి. రథం నీటిపై తేలుతున్నట్లుగా ముందుకు సాగుతోంది. నేను తెర తొలగించి బయటకు చూస్తున్నాను. చీకట్లు తొలగనప్పటికీ అప్పటికే చాలా మంది వచ్చేసి ఉన్నారు. చెట్లకింద వృద్ధులు తమ మూటా ముల్లెతో కూర్చుని ఉన్నారు. కొంచెం దూరంగా గుంపులు గుంపులుగా ముసుగులు కప్పుకున్న స్త్రీలు. అక్కడక్కడే ఆడుకుంటున్న పిల్లలు. కాడి విప్పిన ఎద్దుల బండ్లు. ఎద్దులు పడుకుని గంటలను ఘల్లుమనిపిస్తూ తలలు ఊపుతున్నాయి. నీటి ప్రవాహం మీద వెలుతురు ఎక్కువగా ఉంది. దాని ఎర్రటి లోతుల్లో ఎక్కడి నుంచో ఏదో వెలుగు విరజిమ్ముతున్నట్టనిపిస్తోంది. రేవు మెట్లన్నీ పురోహితులతో నిండిపోయి ఉన్నాయి. పక్కనే కట్టలు కట్టలుగా దర్భ మోపులు పడి ఉన్నాయి. ప్రవహించే గంగానది కెరటాల కాంతిని మౌనంగా ప్రతిబింబిస్తూ కంచు పాత్రలు వేచి ఉన్నాయి. ఒడ్డున నీలం, ఎరుపు, తెలుపు పూల చెట్లు ఆకులతో పాటు ఊగుతున్నాయి.

రాజవంశీయుల రథం వస్తోందని తెలిసినా ఎవరూ కంగారుపడి కదలటం లేదు. కనీసం లేచి కూడా చూడటంలేదు. కొంతమంది అనాసక్తంగా వెనక్కి తిరిగి చూశారు. వాళ్ళ నిర్వికారమైన చూపులు నన్ను తాకి వెనుతిరిగాయి. చెట్ల కొమ్మల్లో అప్పుడప్పుడే చిగుర్చుతున్న లేత పచ్చని తలిరుటాకులు. మరో అర్ధజాములో స్పష్టంగా తెల్లవారిపోతుంది. ఇదేంటి? అంత జనసమూహం ఒక్క చోట పోగయ్యి ఉన్నప్పటికీ చప్పుడు లేదేంటి? మానవ శరీరాలు నెమ్మదిగా నీటిలో చేపల్లా నిశ్శబ్దంగా నోళ్ళు కదిలిస్తూ తిరుగాడుతున్నాయి. ఇదంతా వింతైన తోలుబొమ్మలాటలా ఉంది. ఉన్నట్టుండి స్ఫురించింది, ఆ గుంపుల్లో వృద్ధులు, స్త్రీలు, పిల్లలు మాత్రమే ఉన్నారని! యుక్తవయస్కులు మచ్చుకైనా లేరు. మళ్ళీ నా పొత్తికడుపులోకి కత్తి దూసుకుపోయింది. అంతమందా? అంతమందా? నా శరీరంలో వణుకు! కళ్ళు మూసుకుని నుదుటిని వేళ్ళతో నొక్కుకుంటూ బిగుసుకుని కూర్చున్నాను. రథం వేగమందుకున్నప్పుడు కలిగిన ఊరట పూర్తిగా మరుగునపడి జారిపోయింది, ఆనాటి ద్వారక లాగా గత జన్మ జ్ఞాపకంలా ఎక్కడికో వెళ్ళి అదృశ్యమైంది. అంతా ఒట్టి కల! ఇదే నేను. ఈ బరువైన శరీరం. ఈ బరువైన మనస్సు. ఈ భారమే నేను. ఈ శూన్యమే నేను.

రథం మెల్లగా ఆగింది. సైనికులు గుఱ్ఱాలపై నాకు ఎదురొచ్చారు. నా రథం ముందు దండెపు కర్ర పట్టుకుని నా వంశాన్ని నా ప్రశస్తినీ కీర్తిస్తూ నా రాకను ప్రకటించాడు.ఆ స్తోత్రపాఠం కంపరం పుట్టించింది. అవన్నీ బుకాయింపులు, వాటిలో ఏదీ నేను కాదని గట్టిగా అరవాలనిపించింది. వంశం గొప్పలు, బిరుదులు, పదవులు! గంగానది ఒడ్డున కుంగిపోయి ముసుగులు కప్పుకుని కూర్చొని ఉన్న వితంతువుల ఆకారాలు కళ్ళముందు నిలబడ్డాయి. ఉదక సంస్కరణకోసం కొత్తగా ఏర్పరచిన ఆ ఆవరణ లోపలికి రథం చేరుకుంది. పచ్చికలో వరుసగా పర్ణశాలలు నిర్మించారు. కెంపురంగు పట్టు వస్త్రంతో అలంకరించిన ఆవరణ. అది ద్రౌపది పర్ణశాల కావచ్చు. కొంచెం దూరంలో పెద్ద వృత్తాకార పర్ణశాల చుట్టూ దూసిన కత్తులతో కాపలా నిలబడ్డ సైనికులు. మహారాజులకు ఇంత రక్షణ ఎప్పుడూ లేదు. కానీ ఇక మరో మార్గం లేదు. చిరంజీవిగా అశ్వత్థామ అడవుల్లో తీరని ఆగ్రహంతో పగతో తిరుగుతున్నాడు. కురువంశంలో ఎవరూ ఇకపై ప్రశాంతంగా నిద్రపోలేరు. యుద్ధం వారినెప్పటికీ విడిచి పెట్టదు. విజయహారంలో ఏదో ఒక పువ్వులోపల విషనాగు ముడుచుకుని ఉంది. ఓడిపోయినవారు ప్రశాంతంగా నిద్రపోవచ్చు. వాళ్ళు కోల్పోవడానికి ఏమీ లేదు. కనడానికి కలలు మాత్రం మిగిలి ఉంటాయి.

నా పర్ణశాల ఎదురుగా రథం ఆగింది. దిగాను. నన్ను చూడగానే బిగ్గరగా ఏడుపులు వినిపించాయి. నా తలలో పెద్ద పెద్ద అలలు. నా మనసులో కంపనలు. కానీ నేను దృఢంగా అడుగులు వేస్తూ నడిచాను. పర్ణశాలల్లో రాజవంశ స్త్రీలు ఎవరెవరు ఉన్నారో చూడలేదు. వితంతువులకు పేర్లెందుకు? గుర్తింపులెందుకు? వాళ్ళు చితిమంటల నోళ్ళలో ఆహారం కావడానికోసం కాచుకునున్న ‘శవాలు’. వాళ్ళు బయటి ప్రపంచాన్ని చూడటం ఇదే చివరిసారి. పిల్లల్లారా, ఆకాశాన్నీ, చెట్లనూ, పువ్వులనూ నెమ్మదిగా చూడండి. సంతృప్తిగా గంగానదిలో స్నానాలు చేయండి.

“మహారాణీ” అంటూ దాసి ఒక నారచీర తెచ్చి ఇచ్చింది. నేను దాన్ని కట్టుకున్నాను. అది నా శరీరంపై బరువుగా ఉంది. తినేందుకు చేదుగా వగరుగా ఉన్న ఫలహారం తెచ్చారు. ఒక మండలంపాటు మహారాజు, వారి పరివారం ఈ ఆహారాన్ని తీసుకుంటూ ఈ దుస్తులు ధరించి ఉపవాస దీక్షలో ఉన్నారు. ఎవరి కోసం? ఏ అగ్నిని చల్లార్చడానికి? నా దాసీని చేయూపి పిలిచాను. “అన్న ఎక్కడ?” అని అడిగాను.

“రాజసభలో, మహారాణీ.”

“వ్యాస మహర్షి వచ్చారు” అని ఒక వృద్ధ దాసి చెప్పింది. “యదుకులేశులు మహర్షితో మాట్లాడుతూ పుష్పవనంలోకి వెళ్ళడం చూశాను.”

“నేను వ్యాసులవారిని వెంటనే కలవాలి” అన్నాను. “అర్జునులవారెక్కడ?”

దాసి మరో దాసి వైపు చూసింది. సంకోచిస్తూ, “ఆయన రాత్రి రథం ఎక్కి నగరానికి వె‌ళ్ళారు. ఇంకా తిరిగి రాలేదు” అంది.

బహుశా యుద్ధంలో తనవాళ్ళని కోల్పోని స్త్రీ ఎవరైనా దొరికి ఉండొచ్చు అని లోలోపల కుతకుతలాడిపోయాను. మనసంతా ఇంత చేదుగా ఎప్పుడు మారిపోయింది? ఏ క్షణంలో? దూసుకువెళ్తున్న రథం మీద జీను చేతబట్టుకు నిల్చుని నేను ఓరకంట చూసి ఆరాధించిన ఆ కండలు తిరిగిన మగవాడు ఇప్పటికీ నా మనస్సు లోతుల్లో అలాగే ఉన్నాడు. ఇప్పుడున్న ఈ మనిషి – ఇతని ముఖం, ఇతని స్వరం, చేసే పనులు, కదలికలు, ఇతరులు ఇతని గురించి చెప్పే ప్రతి మాటా – నన్ను చేదుతో నింపుతోంది. అతనికది తెలిసే ఉంటుంది. నా క‌ళ్ళల్లోకి చూసి మాట్లాడలేడు. నా ముందు నిలబడినప్పుడు అతని ఒళ్ళంతా ఏదో ఆందోళన కనపడుతూ ఉంటుంది. ఆ న్యూనతా భావమే కోపంగాను, మూర్ఖంగానూ వ్యక్తమవుతుందేమో. అయినా ఇప్పటికీ నేనెందుకు అతన్ని విస్మరించలేకపోతున్నాను? నేను ఎంత ప్రయత్నించినా అతని గురించి తలచుకోకుండా నాకు ఒక్క క్షణం కూడా గడవదెందుకు! అతని పట్ల నాలో ఇంకా ప్రేమ మిగిలే ఉందా? ప్రేమా? అది కేవలం ఒక సవాలు. అతని లోపలి భయం బయటపడిన క్షణమే ఆ ప్రేమ ఆరిపోయింది. అతను స్త్రీలను కేవలం ఆటబొమ్మలుగా భావించినప్పుడు మాత్రమే ఆత్మవిశ్వాసంతో మసులుకోగలడు. తన చేతిలో నిటారుగా నిలబడి బాణాల పరంపరను రువ్వే గాండీవం మాత్రమే అతను ఎంచుకున్న సహచరి కాబోలు. అతని ప్రతిభంతా లోపల ప్రవహించే శూన్యతయొక్క వేగం కావొచ్చు. స్త్రీల శరీరాల ద్వారా అతను అన్వేషించేది దేన్ని? గాండీవంగా మారిపోయి తన శరీరంలో భాగమయ్యే ఒక స్త్రీనా?

ఎవరితోనైనా మాట్లాడాలని ఉంది. మాట్లాడని మాటలన్నీ నా మనస్సులో పేరుకుపోయి పెల్లుబుకుతున్న వాటి వేగం నన్ను పిచ్చిదాన్ని చేసేస్తుందేమో అనిపించింది. ఈ మహారాణి బిరుదును త్యజించి, ఒక మామూలు స్త్రీగా, అబలగా, పసిపాపగా మారిపోయి ఏడ్చి తల్లడిల్లిపోవాలనుంది. తెల్లటి గడ్డంతో ఉన్న వ్యాసులవారి పసిపిల్లవాడివంటి ముఖం నా మనస్సులో కొంత ఓదార్పును కలిగించింది.

దాసి నన్ను పుష్పవనంలోకి తీసుకువెళ్ళింది. పచ్చని చెట్లు, పొదల గుండా సాగుతున్న మెలికల దారి. అన్న, వ్యాస మహర్షి ఒక బండరాయి మీద కూర్చున్నారు.

నన్ను చూసి వ్యాస మహర్షి చిరునవ్వుతో “రా అమ్మా!” అన్నారు. నన్ను కూర్చోమని సైగ చేశారు. మహర్షి పాదాలకు వందనం చేసి నేలమీద కూర్చున్నాను. అన్న ఆలోచనలు నిండిన ముఖంతో నన్ను చూశాడు. “తాతా, నువ్వు వస్తావని నాకు ఎవరూ చెప్పలేదు” అన్నాను.

“ఈరోజు తిలోదకాలివ్వాలి. నేను రావాలి కదా?”

నా కళ్ళు, మనసు తెరుచుకున్నాయి. చెట్టును ఊపి వెళ్ళిన సుడిగాలిలా నా కన్నీళ్ళు నానుంచి ఆవిరైపోయాయి.

వ్యాస మహర్షి నా నుదుటిపై ఉన్న వెంట్రుకలను సవరిస్తూ, “నేను చెప్పడానికేముంది అమ్మా! ఏడ్చి ఏడ్చి నీ మనసే మెల్లగా కుదుటపడాలి” అన్నాడు.

“తాతా, ఇదంతా దేనికోసం? ఎవరి ప్రయోజనం కోసం? ఈ గంగా తీరమంతటా…”

“అవును, చూశాను” అన్నారు వ్యాస మహర్షి. “ఎందుకు ఇలా జరుగుతోంది అని అడగకు. నువ్వు అలా అడగడం అంటూ మొదలుపెడితే దేవతలైనా సరే నోట మాట రాక నిశ్చేష్టులైపోతారు…”

“నా అభిమన్యుడు… నా బంగారం… వాడి తల పగిలి ముక్కలై… నేను మర్చిపోలేకపోతున్నాను, తాతా…”

ఏడుస్తున్న నన్ను చూస్తూ వ్యాస మహర్షి తల వంచుకుని కూర్చున్నారు. తర్వాత గద్గద స్వరంతో, “నేను ఏమి చెప్పగలనమ్మా నీకు? నీకు ఒకే ఒక్క బిడ్డ… నాకు? కురువంశమంతా నా బిడ్డలు కదా? విజయమందుకుందీ, నేల కూలిందీ నా రక్తమే కదా? ఇదిగో ఈ రోజు గంగానది మోసుకెళ్తున్న ఇందరి ఆత్మలకూ పితామహుణ్ణి నేనే కదా?”

నా మనసులో ఆవేశపు జ్వాలలు ఒక్క ఉదుటున ఎగిశాయి. “ఇదిగో ఇక్కడే ఉన్నాడుగా, అడుగు తాతా. అన్నిటికీ మూల కారణం ఈ మనిషే! ఇతని కుయుక్తులు, కుతంత్రాలు, తర్కాలు! అధికారం కోసం అన్నదమ్ములు ఒకరినొకరు గొంతు కోసుకోవచ్చు అని ఈయన ఒక ఉపదేశ గ్రంథం రాస్తే దాన్ని పౌరాణికులు యుద్ధభూమిలో ప్రతిరోజూ గానం చేశారు. ‘చంపు, చంపు’ అనే నినాదాన్ని రాత్రులంతా నిర్విరామంగా ఘోషించారు…”

“యుద్ధానికి కొలబద్ద విజయమొక్కటే, తల్లీ!”

“ఇప్పుడు ఇదిగో విజయం దక్కింది కదా! ఈయనగారికి సంతృప్తి కలిగిందికదా? నా బిడ్డ… నా సర్వస్వం… వాడి చావుకి ఎవరు కారణం? ఇదిగో ఈ మనిషి. నా బిడ్డను చంపింది ఇతడే. చదరంగంలో ఒక పావుగా వాడిని పెట్టి ఆడుకున్నాడు. ముందుకు సాగాల్సిన అవసరం వచ్చినప్పుడు తన చిటికెన వేలుతో వాణ్ణి గిల్లిపడేశాడు. ఇరావంతుడు, ఘటోత్కచుడు… చివరగా అభిమన్యు. రక్తం పంచుకుని పుట్టినవాళ్ళను చంపమని తాను ఉపదేశించిన ఉపదేశాన్ని తనకు కూడా ఆపాదించుకుని ఆచరణలో పెట్టిన మహానుభావుడు ఇతను…”

“సుభద్రా, నువ్వు బాధలో మాట్లాడుతున్నావు, తల్లీ!” అన్నారు వ్యాస మహర్షి.

“నా బిడ్డ ఎలా చనిపోయాడు? వా‍డు నా కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహంలోకి ప్రవేశించే మార్గాన్ని ఈయనే నేర్పించాడు. బయటకు వచ్చే మార్గం నేర్పించకుండానే విడిచిపెట్టాడు. దేనికీ జంకకుండా వెనకాడకుండా దేన్నైనా ఢీకొంటూ బయటికి వచ్చే మార్గం తెలియనివాడిగానే పెరిగాడు. వాడు పుట్టి పెరిగి విద్యనేర్చుకుని రణరంగంలో ప్రవేశించే చివరి రోజు వరకు కూడా ఈయన నా బిడ్డకు బయటకు వచ్చే మార్గాన్ని ఎందుకు నేర్పలేదు? అంతా కుట్ర కాకుంటే మరేమిటి? ఇతనికి బంధం లేదు, పాశం లేదు. అనురాగం లేదు. ధర్మం అని తాను నమ్మే దానిని నెరవేర్చడం తప్ప ఇతనికి మరో ధ్యేయం లేదు!”

“ఎవరు మాత్రం అలాంటివారు కారు?” అన్నారు వ్యాస మహర్షి. “నీ ధర్మం మాతృత్వం అని నువ్వు అనుకుంటున్నావు! అది తప్ప మరేమీ నీ కంటపడట్లేదు కదా…”

“నా బిడ్డకు పద్మవ్యూహం నుండి బయటపడే మార్గాన్ని ఈయనగారు ఎందుకు నేర్పించలేదో ముందుగా అది చెప్పమని చెప్పు తాతా…”

అన్న దీనస్వరంతో, “సుభద్రా, నేను నీకు చాలాసార్లు చెప్పాను. నీ చెవులు మూసుకుపోయి ఉన్నాయి. పద్మవ్యూహం అన్నది కొద్దిపాటి సైన్యాలతో జరిపే యుద్ధాల్లో వేసే వ్యూహం. నగరాలను రక్షించడానికి కూడా నగరం చుట్టూ పద్మవ్యూహం ఏర్పరుస్తూ ఉంటారు. ద్రోణుడు కురుక్షేత్రంలో అలాటి ఎత్తు వేస్తాడని నేనెలా పసిగట్టగలను? ఆ సమయంలో అర్జునుడు సంశప్తకులతో పోరు సాగించాల్సి వస్తుందని నేను ఎలా ఊహించగలను? అంత మంది యోధులున్నప్పుడు పద్మవ్యూహాన్ని విచ్ఛిన్నం చేయమని యుధిష్ఠిరుడు అభిమన్యుడిని అడుగుతాడని, వాణ్ణి అనుసరిస్తూ సాగిన భీముణ్ణి, ధర్మరాజు సైన్యాన్నీ జయధ్రథుడు ఒక్కడే నిరోధించగలుగుతాడని ఎలా ఊహించగలను?” అన్న చెప్పడం ఆపాడు. దుఃఖం కమ్ముకున్న స్వరంతో, “జ్ఞానము, వివేచన కలిగిన గురువు ద్రోణాచార్యుడు, పాండవుల సొంతరక్తమైన కర్ణుడు, గొప్ప ధార్మికుడైన శల్యుడు, మహా యోధుడైన దుర్యోధనుడు వీళ్ళంతా ఏకమయ్యి ఒక చిన్న పిల్లవాడిని చుట్టుముట్టి తుదముట్టించారంటే నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను.”

“యుద్ధంలో విజయమే ప్రమాణం! యుద్ధాన్ని ప్రారంభించడం మాత్రమే మనుషులు చెయ్యగలిగింది. ఆ తర్వాత ప్రతిదీ విధి ఆడే ఘోర తాండవం. మనుషులలో యుద్ధతాపత్రయం లేని ఒక స్వర్ణయుగం ముందు ముందు రావచ్చేమో!” అని వ్యాస మహర్షి నిట్టూర్చి తల వంచుకున్నారు.

అన్న నాతో, “అవును, అంతా నేను చెప్పిన తత్వాలే! కానీ నాకు సాంత్వన ఇచ్చే శక్తి వాటికి లేదు. అభిమన్యు నాకూ బిడ్డే. సగం రోజులు ద్వారకలో రుక్మిణి, సత్యభామలే వాణ్ణి పెంచారు. నా పితృవాత్సల్యాన్ని పంచుకోడానికి ఆ దేవుడిచ్చిన వరంగానే నేను వాణ్ణి భావించాను. నేను వాణ్ణి ఈ గుండెల మీదా భుజాల మీదా పెట్టుకుని పెంచాను. నేను వెళ్ళే ప్రతి చోటికీ వాణ్ణీ తీసుకెళ్ళాను, అడవులకు సైతం తీసుకెళ్ళి విద్యలు నేర్పించాను…”

వ్యాస మహర్షి “అవును. ఈ రోజు, భరతవర్షమంతా వాడు యుద్ధభూమిలో చూపించిన ధైర్యాన్ని, పరాక్రమాన్ని, యుద్ధవిన్యాసాన్నీ గానం చేస్తోంది” అన్నారు. మహర్షి అన్నను శాంతింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. “అభిమన్యు కోసలరాజు బృహద్బలుడ్ని చంపినదాన్ని గురించి కాసేపటి క్రితం కూడా ఒక సూతుడు అద్భుతమైన పాటగా పాడాడు.”

“కానీ నేను నేర్పించకుండా పోయిన ఆ ఒక్కటీ వాణ్ణి ఇలా బలి తీసుకుందే తాతా!”

“అది వాడి తలరాత” అని వ్యాస మహర్షి నావైపుకు తిరిగి, “అది వాణ్ణి జన్మ జన్మలనుండీ వెంటాడుతోంది. ఈ జన్మలో వాడు నీ గర్భంలో ఉన్నప్పుడే అది వాడిని చేరుకుంది.”

నా మనసు కలుక్కుమంది. “తాతా, అయితే నా బిడ్డకు వచ్చే జన్మలో కూడా ఆ విధి తాలూకు అవశేషం ఉందా?” అని అడిగాను.

“ఉండవచ్చు; ఎవరికి తెలుసు?”

భయాందోళనతో కూడిన స్వరంతో, కంగారుగా, “తాతా, వాడు తన విధిని తెలుసుకోలేదు కదా? నా బిడ్డకు దీనినుండి బయటపడే మార్గం తెలియదు కదా?” అని అడిగాను.

“అవేం మాటలు తల్లీ? మన బిడ్డగా వాడి విధి ముగిసింది. ఇప్పుడు మన ఏకైక కర్తవ్యం వాడి జ్ఞాపకాలను మన మనస్సులోనూ వంశగాథల్లోనూ నిలపుకోవడం మాత్రమే…”

“అది నీ పని, తాతా. నా బిడ్డకు ఇప్పటికీ బయటపడే మార్గం తెలియదు. దాని గురించి ఆలోచిస్తూ నేను ఒక్క రోజు కూడా ప్రశాంతంగా జీవించలేను. తాతా, నువ్వు భూతభవిష్యత్ వర్తమానాలు ఎఱిగిన త్రికాలజ్ఞానివి. నన్ను కరుణించు… నీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాను. నాకు ఈ ఒక్క సహాయం చెయ్యి…”

“తల్లీ, నువ్వు అవగాహన ఉండే మాట్లాడుతున్నావా?”

“బాగా తెలిసే అంటున్నాను! నా బిడ్డ తన విధిని అధిగమించే మార్గాన్ని నేను వాడికి నేర్పాలి. కనీసం వాడి తదుపరి జన్మలోనైనా వాడికి విముక్తి కలగాలి.”

“నువ్వు మానవులకు నిర్దేశించిన పరిమితులను దాటడానికి ప్రయత్నిస్తున్నావు, తల్లీ! అది సాధ్యం కాదు.”

నేను ఒక్క ఉదుటున పైకి లేచాను. “తాతా, ఈ జన్మలో నేను కోరుకునేది ఇదొక్కటే! ఇది తప్ప నిన్ను ఇంకేమీ అడగను. నువ్వు ఇప్పుడే నాకు ఈ సహాయం చెయ్యాలి. లేకపోతే నేను ఇక్కడే ఈ క్షణమే గంగలో దూకి చచ్చిపోతాను. నాకంటూ ఇంకేమీ మిగిలిలేదు…”

“అమ్మా…” అంటూ వ్యాస మహర్షి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను పట్టుకున్నారు. “ఆగు, చెప్తాను…” తాత చేయి నా భుజాన్ని గట్టిగా పట్టుకుంది. “అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఈ వృద్ధాప్యంలో ఇప్పటివరకు నేను అనుభవించిన బాధలన్ని సరిపోవా? ఆగు, ఏదో ఒక మార్గం చెప్తాను.”

అప్పుడు కూడా అన్న ఆలోచనల్లో నిమగ్నమైన ముఖంతో అక్కడే కూర్చుని ఉన్నాడు.

“నేను దండకారణ్యంలో ఒక ఋషిని కలిశాను. అతను ఇప్పుడు ఇక్కడే ఎక్కడో గంగానది ఒడ్డున ఉన్నాడు. అతను జన్మల అంతరాలను దాటి చూడగలడని అంటుంటారు. నేను అతన్ని తీసుకువస్తాను. నీ కోసం… ఇది ఒక ఋషి ఎప్పటికీ చేయకూడని పని. దీనివల్ల నా పూర్వీకుల శాపం నాపై పడుతుంది… పరవాలేదు.”

“నాకు వేరే మార్గం లేదు, తాతా. నన్ను క్షమించు. నేను నా బిడ్డతో మాట్లాడాలి. ఏమి జరిగినా పర్వాలేదు. నా బిడ్డకు బయటకొచ్చే మార్గం తెలియకుండా జన్మజన్మలకూ ఇలా… తాతా, దయచేసి నాకు ఆ సాయం చేసి పెట్టు…” నేను తాత పాదాలపై పడ్డాను. నన్ను లేపి ఛాతీకి హత్తుకున్నారు. నా కన్నీళ్ళు తాత గడ్డాన్ని తడిపేశాయి.


4

పర్ణశాలలోపలికి తొంగి చూసిన దాసి, “అర్జునులువారు మిమ్మల్ని పిలుస్తున్నారు” అని అన్నది. నేను లేచి బయటకు వచ్చాను. మధ్యాహ్నం అయింది. కానీ ఎండ మందంగా నీరెండలానే ఉంది. ఆకాశమంతా మేఘాలతో నిండిపోయుంది. ఆయన సాలవృక్షం నీడన నిలబడి ఉన్నాడు. ఆయన్ను సమీపించిన కొద్దీ మనసులోని చీకాకు పెరిగిపోయింది. కానీ నా మనస్సులో ఏదో తెలీని ఆరాటం, కుతూహలం. అది ఆయన్ను బాధపెట్టాలన్న ఉత్సాహం కావచ్చు. పొడిచి గాయపరిచి, ముడుచుకుపోవడాన్ని చూసి అపరాధ భావన కలిగినప్పుడు తగ్గవచ్చు. కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, “ఏమిటి?” అనడిగాను.

“పొద్దెక్కుతోంది. అభిమన్యుడికి తిలోదకాలివ్వలేదని అన్న అడుగుతున్నాడు” అన్నాడు.

“ఇరావంతుడుకి ఇవ్వడం అయిందా?” అడిగాను. జారిన అతని చుట్టల జుట్టు తడిగా ఊగుతోంది. చెవులకు పక్కన నెరిసిన జుట్టు. మీసాలు చెంపలకు అతుక్కుపోయున్నాయి. కళ్ళ కింద నల్లటి వలయాలు. ఆ కళ్ళలో ఎప్పుడూ తొణికిసలాడుతూ ఉండే చిన్నపిల్లాడి ఉత్సాహపు ఆనవాళ్ళే లేవనిపించింది. ఆ ఉత్సాహం ఇంకెప్పటికీ కనిపించదని అనిపించింది.

“అయింది” అన్నాడు.

అతని బలహీనత మీద నేను కొట్టిన దెబ్బ అది. అతని నుదిటిమీద ఒక నరం ఉబ్బి కదిలింది. కళ్ళు చిన్నవయ్యి అతను పడుతున్న బాధ కనిపించింది. నా మనసు లోలోపల నాట్యం చేసింది. ఇంకా ఇంకా కావాలన్నట్టు గంతులేసింది…

“శ్రుతకర్ముడికి కూడా అయిపోయిందా?” అని మామూలుగా అడిగాను.

అతని కళ్ళు కోపంగా మారాయి.

“అభిమన్యుడు మాత్రమే మిగిలి ఉన్నాడు!” అన్నాడు.

నేను తల ఊపాను.

“ఆలస్యం ఎందుకు?” అన్నాడు.

“కొంచెం ఆగి చేద్దాం అని…”

“ఎక్కడికో రథాన్ని పంపించావు అని విన్నాను.”

“అవును.”

“ఎందుకు?”

“ఏమీ లేదు,” అన్నాను. చెప్పాలని లేదు నాకు. అభిమన్యుడిని నా అంతరంగపు లోతుల్లో నిలుపుకున్నాను. దాన్ని ఈయనతో ఎప్పుడూ పంచుకోలేను. ఎవరితోనూ పంచుకోలేను. అభిమన్యుడికే ఎప్పుడూ చెప్పుకోలేదు. వాడు పుట్టినప్పుడు చూసిన వాళ్ళు తండ్రి పోలికలు అని చెప్పినప్పుడు, నా గుండె మండిపోయింది. వాడు పెద్దవుతున్న కొద్దీ వాడితోబాటు పెరుగుతూ వచ్చిన అల్లరి, విలువిద్య, ధైర్య సాహసాలు నాకు వాళ్ళ నాన్ననే గుర్తు చేశాయి. అవి నాకు కోపం తెప్పించాయి. అందుకే వాడిని నేను సగం రోజులు ద్వారకకు పంపాను. మిగిలిన సగం రోజులు వాళ్ళ నాన్న ఈ నగరంలోనే లేడు. కానీ వాడిలో నేను చూసుకుని సంతోషించిందివేనా?

“ఎందుకో చెప్పు” కోపంగా అడిగాడు. “ఈ రోజు తిలోదకాలు ఇవ్వదలుచుకోలేదా? ఎవరిని తీసుకురావడానికి రథం పంపావు?”

నేను అతని కళ్ళలోకి చూశాను. “అభిమన్యుడు నా కొడుకు. వాడికి తిలోదకాలు ఎప్పుడు ఎలా ఇవ్వాలో నాకు తెలుసు.”

అతని ముఖంలో కోపం హెచ్చింది. అతను గద్దించినట్టు, “వాడు నాకూ కొడుకే! నాకు లేదా బాధ?”

“బాధా… ఎందుకు?” నేను ఆశ్చర్యపోతున్నట్టు అడిగాను. అతనిని హింసించాలన్న కోరిక నాలో మరీ మరీ పదునెక్కుతోంది. సంయమనంతో లోపల మాటలు ఎంచుకుని కూడబలుక్కుని మాట్లాడుతున్నాను. “మీరు ప్రతీకారం తీర్చుకున్నారు కదా? మరుసటి రోజు సూర్యుడు అస్తమించేలోపు జయధ్రథుడి తల నరికి గాల్లో ఎగరవేసి వాడి తండ్రి చేతుల్లో పడేలా చేసి ఆ తండ్రి ప్రాణాన్ని కూడా తీసి… అదంతా సూతులు పారవశ్యంతో గానం చేసే పరాక్రమ గాథ కదా? వంశచరిత్రలో ఒక స్వర్ణ పుట కాదా అది! దానికి దుఃఖం ఎందుకు?”

“నువ్వు నన్ను పరిహసిస్తున్నావు. నీ ఒక్కదానికే పెద్ద నష్టం సంభవించినట్టు ఊహించుకుంటున్నావు. అందరికంటే పైఎత్తున ఉన్నదానిగా చూపించుకోవడానికి నీ దుఃఖాన్ని కొండంతలు చేసి ప్రకటించుకుంటున్నావు…”

నేను మళ్ళీ అతని కళ్ళలోకి సూటిగా చూశాను. “నిన్న రాత్రి ఎక్కడున్నారు?”

ఆయన తడబడ్డాడు, ముఖం పాలిపోయింది, “ఎందుకు?” అనడిగాడు.

“లేదు, తాత మీకోసం వెతికారు” అన్నాను.

“నేను తాతను కలిశాను.”

“ఓహ్” అన్నాను. నేను కళ్ళు తిప్పుకోకుండా అలా చూస్తూ నిలబడ్డాను.

“నేను వెళ్తున్నాను” అని చెప్పి వెళ్ళిపోయాడు. నా శరీరం సడలిపోయింది. సరస్వతీ కటాక్షం కోల్పోయిన జ్యోతిష్యుడిలా నా శక్తులన్నీ ఉడిగిపోయి నిలబడలేకపోయాను. విపరీతంగా దాహం వేసింది. కానీ నా పర్ణశాల లోపలికి వెళ్ళాలని అనిపించలేదు. మూసివున్న గదుల్లో దుఃఖం నిండిపోయుంది. ఆరుబయట మనసు తేలికపడి ఊపిరాడుతున్నట్టు అనిపించింది. నేను ఉద్యానవనంలోకి నడిచాను. మళ్ళీ అదే బండ దగ్గరకు చేరుకున్నాను. అన్న అక్కడ కూర్చుని ఉండటం చూశాను. అన్న అక్కడ ఉంటాడన్న ఆశతోనే నేను వచ్చానన్నది గ్రహించాను. నేను అన్నని తప్పించుకోలేను. అన్న లేకుండా నా ఉనికే లేదేమో అనిపించింది. అన్న తలపైనున్న పింఛంలోని నెమలి కన్ను నావైపు చూసింది. నా మనసు కుదుటపడింది. నేను ఎక్కడ నెమలి పింఛాన్ని చూసినా నా మనస్సు కొంచెం ఊరటపడుతూంటుంది. అన్న తోడున్నాడన్న భావాన్ని కలిగిస్తుంది. అభిమన్యు చిన్నప్పుడు ఒకసారి వాడిని అలంకరించి నుదుట నెమలి పింఛం పెట్టాను. అది చూడగానే వాళ్ళ నాన్న ముఖం ఎంతలా ఎర్రగా మారిపోయిందో! కోపంగా గద్దిస్తూ అది పీకి అవతల విసిరేశాడు. “ముద్దు చేస్తాను, అలంకరిస్తాను అని పిల్లాడ్ని నపుంసకుడిగా మారుస్తావా ఏంటి? పింఛము, పువ్వులు…” అని అరిచాడు. నేను నిరాశ, కోపం నిండిన గొంతుతో “పింఛం ధరించే వాళ్ళందరూ నపుంసకులంటారా?” అనడిగాను. చేయి పైకెత్తి నా మీదకు వచ్చాడు. “మంచిది. చేయెత్తడం దేనికి? గాండీవాన్ని అందుకోండి… అదే పురుష లక్షణం!” అన్నాను. తలుపును తన్ని అంతఃపురంనుండి బయటకు వెళ్ళిపోయాడు. బయట గుఱ్ఱం వీపు మీద గట్టిగా కొరడా చరిచిన శబ్దం వినిపించింది. రాతి నేలపై గిట్టల మోతతో అది పరుగు తీసింది.

అన్న, “ఋషి వచ్చాడా?” అని అడిగాడు.

“ఇంకా రాలేదు. వేచి చూస్తూ ఉన్నాను… నా ఓపిక నశిస్తోంది.”

“వస్తాడు.”

“మధ్యాహ్నం అయింది. ఉదక సంస్కరణ ఎప్పుడు ముగించగలమో ఏమో!” అన్నాను. అలసటతో వేళ్ళతో కళ్ళు నులుముకున్నాను.

“పార్థుడు ఏమన్నాడు?”

నేను నివ్వెఱబోయాను. ఎలా తెలుసుకున్నాడు? అతని ముఖం బొమ్మలా ఉంది. నేను కొంచెం తేరుకుని, “సమయం దాటిపోతోంది అన్నాడు!” అన్నాను.

“పాపం” అన్నాడు.

“ఎందుకు? అతను యుద్ధంలో గెలిచి సవ్యసాచి అయ్యాడు కదా! ఇక అశ్వమేధం, దిగ్విజయం… చరిత్రలో సింహాసనం వేయబడి ఉంది కదా మీ ఇద్దరికీ!”

“నీ దుఃఖం ద్వేషంగా మారిపోయింది, సుభద్రా! ప్రపంచమే నీకు శత్రువులా అనిపిస్తోంది. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఈ రోజు ఇక్కడ ఒక్కొక్కరూ ఏం ఆలోచిస్తున్నారో నీకు తెలుసా? ఈ క్షణంలో కాలచక్రమనే దేవుడు వచ్చి యుద్ధం మొదలవ్వక ముందున్న ఆ క్షణాన్ని తిరిగి ఇస్తాను అని చెప్పాడంటే, అందరూ తమ శత్రువులను కౌగిలించుకుని కన్నీళ్ళు పెట్టుకుంటారు! ఈ యుద్ధం ఒక మాయా సుడిగుండం. ప్రతి క్షణం దాని మాయా శక్తి అందరినీ ఆకర్షిస్తోంది. విధి అందరి మనసుల్లోనూ ఆవేశాన్నీ, అహంకారాన్నీ నింపేస్తుంది. ఇప్పుడు… ఎవరికీ దాన్నుండి బయటపడే మార్గం తెలియలేదు, సుభద్రా. నాకు కూడా తెలియడంలేదు…”

నేను నిట్టూర్చాను. అన్న మనసు ఇలా కలత చెందినప్పుడుగానీ తెలిసిరాలేదు నాకు అన్నని ఇలా చూడటానికి నేను ఇష్టపడలేదని! నా మనసులో అన్న ఎప్పుడూ అజేయడిగానే ఉన్నాడు. అన్న ముఖం మళ్ళీ నెమ్మదించింది. “నువ్వు భోంచేశావా?” అని అడిగాడు.

“లేదు”

“ఎందుకిలా నిన్ను నువ్వు హింసించుకుంటున్నావు?”

“నేను చెయ్యబోతున్నదాని గూర్చిన కలవరపాటుని తట్టుకోలేకపోతున్నాను అన్నా.”

“సుభద్రా, నువ్వు ఏం చేయబోతున్నావో నీకు అర్థం అవుతోందా?”

“నాకు మరో మార్గం తోచడంలేదన్నా!” నేను దృఢమైన స్వరంతో అన్నాను.

“సుభద్రా, విధి పోకడే సర్వ మానవాళిని విశ్వాన్ని ప్రకృతిలో జరిగే ప్రతి చర్యనీ కలిపి ఉంచేది. దాని పోకడని లేశమాత్రమైనా తెలుసుకోడానికి మానవ మాత్రులకు సాధ్యం కాదు. కొన్ని సందర్భాల్లో దాన్ని మార్చేయగలమని మన అహంకారంతో విర్రవీగుతుంటాము. ఆ అహంకారానికి అనుగుణంగా ప్రవర్తిస్తాము. అంతా అయిన తర్వాతగానీ మనకు అర్థం కాదు ఈ చర్యకూడా విధి ఆడుతున్న ఆటలో భాగం అని.”

“నేను ఇప్పుడు వేదాంతం వినే స్థితిలో లేను అన్నా…”

అన్న నెమ్మదిగా నవ్వుతూ, “అవును. ఈ భారతవర్షంలో ఇప్పుడు అది చవకైన వస్తువుగా మారిపోయింది” అన్నాడు.

నేను అన్నని బాధపెట్టానేమో అనిపించింది. “అన్నా, దయచేసి నా మనసును అర్థం చేసుకో. నేను నా బిడ్డకు… వాడు తన విధిని తెలుసుకోకుండా వెళ్ళకూడదు అన్నా.. దానివల్ల నాకు ఎటువంటి శాపం సంభవించినా పరవాలేదు…”

“సరే, రా. గంగ ఒడ్డుకు వెళ్దాం. ఎవరైనా మన కోసం వెతుకుతూ ఉండవచ్చు.”

చల్లగా ఉంది. వర్షఋతువు తెచ్చిపెట్టిన కొత్త సొగసుతో చెట్లు గాలికి ఊగుతున్నాయి. మెఱిసే చిఱు కాంతి, గంటల చప్పుడూ నదికి దగ్గరవుతున్నామని తెలిపాయి. పురోహితులు మెట్లపై కూర్చుని ఉన్నారు. దర్భక్రతువులు, పిండాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. అమాత్యుడు, శౌనకమునీ లేచి వచ్చి అన్నకు నమస్కరించారు. “ఇప్పుడే పూర్తయింది” అన్నారు.

“సరే” అని అన్న తల ఊపాడు. మేము నెమ్మదిగా నడిచాము. అంతటా అమంగళకరమైన నిశ్శబ్దమూ, నిదానమూ అలుముకొని ఉన్నాయి. గంగానది మీద నుండి చల్లగాలి వేగం హెచ్చింది.

పర్ణశాలకు వెళ్ళే దారిలో అకస్మాత్తుగా బాణం తగిలిన అడవి జంతువు అరుపులా ఏడుపు వినిపించింది. దాసీజనం వెంబడించగా ద్రౌపది జుట్టు విరబోసుకుని ఏడుస్తూ వస్తోంది. దాసీలు ఆమెను పట్టుకున్నారు. ఆమె గంగ వైపు చేతులు చాచి గట్టిగా విలపించింది. నారచీర జారిపోయుంది. సర్పంలాంటి శరీరం; అగ్ని జ్వాల ఎగసి పడుతున్నట్టుంది. విషాన్ని చిమ్ముతున్నట్టు ఉంది. వేడి విషం. ఆ నాడు కౌరవుల సభలో కూడా ఇలానే నిలబడింది. జుట్టు విరబోసుకుని ప్రతిజ్ఞ చేసింది! ఇప్పుడు జుట్టు ముడుచుకోవచ్చు కదా? నేనెందుకు ఇప్పుడు కూడా ఇలా ఆలోచిస్తున్నాను? ఆమె ఏమి చెయ్యగలదు పాపం? అన్న చెప్పినట్లు ఆమె కూడా ఇప్పుడు గుండె పగిలి ముక్కలై ఆరాటపడుతుండవచ్చు. ఇదంతా ఎంత సులువుగా మొదలైపోయింది? ఐదుగురు పిల్లలు. ప్రతివింద్యుడు, శ్రుతసోముడు, శ్రుతకర్ముడు, శతానీకుడు, శ్రుతసేనుడు. ఐదు సన్నని ముఖాలు. ఐదుగురు పసి బాలురు. తలిరుటాకుల్లాంటి ముఖాలు. బంగారంతో పోతబోసినట్టుండే భుజబలులు! ఆమె కడుపులో ఎంతటి అగ్ని మండుతూ ఉంటుందో! తలచుకోగానే నా మనసుని వేదన కమ్మేసింది. శ్రుతకర్ముడి ముఖం మాత్రమే స్పష్టంగా కళ్ళముందుకు వచ్చింది. వాడు ఆయన కొడుకు అని చెప్పేవారు. నేను వాణ్ణి ఛాతీకి హత్తి పట్టుకుని వాడి ముఖాన్ని నిశితంగా చూసేదాన్ని. వాణ్ణి అభిమన్యు పక్కన నిలబెట్టి పోల్చుకుని చూసేదాన్ని. అస్త్ర శిక్షణా పరీక్ష యుద్ధాల్లో అభిమన్యు వాడిని సునాయాసంగా ఓడించేప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయేది! అభిమన్యుడికి ఎల్లప్పుడూ వాడిమీదే గురి. “పిన్నమ్మా, అభిమన్యు నన్ను కొడుతున్నాడు… పిన్నమ్మా, అభిమన్యుని చూడు…” అంటూ ఎప్పుడూ పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చేవాడు. ముద్దు ముద్దు మాటలు చెప్పేవాళ్ళు… నా పిల్లల్లారా మీరు ఎక్కడ ఉన్నారు? ఆకాశంలో ఎక్కడో ఆడుకుంటున్నారా? గొడవలు పడుతున్నారా? మీరు ఈ భూమ్మీద ఉన్నన్నాళ్ళు మీపై మాకు ఎన్నెన్ని కోప తాపాలు, స్పర్ధలు, పోటాపోటీలు, అసూయలు? నేను ఎప్పుడూ చూడని వాడు ఇరావంతుడు! నాకు వాడిమీద ఎందుకంత కోపం ఉండేది? నా కళ్ళ నుండి కన్నీళ్ళు జలజలా కారుతున్నాయి. మెట్లపైనే కూర్చుండిపోయాను. అన్న నిట్టూర్చి కొంచెం దూరంగా కూర్చున్నాడు. గంగానదిలో రెండు చిన్న పడవలు విచారాన్ని మోసుకుంటూ కదులుతున్నాయి.


5
ఋషి వచ్చారన్న వార్త వచ్చింది. నేను లేచి వడివడిగా పరిగెత్తాను. నా పాదాలు ఇసుకలో కూరుకుపోయి అనుకున్నంత వేగంగా నడవలేకపోయాను. శరీరం బరువుగా అనిపించింది. ఋషి అష్టకలశ సోపానం మీద కూర్చుని ఉన్నారు. అయన ముందు నిలబడి ఉన్న స్థానికుడు నన్ను చూడగానే వంగి నమస్కరించి తప్పుకున్నాడు. నేను ముడుచుకుపోతున్నట్టు అనిపించింది. అర్థంకాని భయం ఏదో నా మనసును ఆవరించింది. పొట్టిగా ఉన్న నల్లటి ఆకృతి. గడ్డమూ తలలోని జుట్టూ జడలు కట్టేసి వేలాడుతున్నాయి. ఎర్రటి కళ్ళు, శరీరమంతటా విభూది. ఒక కన్ను మాంసపు ముద్దలా కదులుతోంది. కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న దంతాలు నల్లగా ఉన్నాయి. నేను సాగిలపడి నమస్కరించాను. ఋషివర్యులు నా తలను తాకి ఆశీర్వదించారు. నా కళ్ళు ఋషివర్యుల చేతుల వైపుకు చూడటాన్ని ఆపలేకపోయాను. చిందరవందరగా వికృతంగా ఉన్న గోళ్ళు.

“నీ అభ్యర్థనను కృష్ణద్వైపాయనుడు చెప్పాడు. అతను మహావ్యాసుడు. అతని కోసమే నేను దీనికి అంగీకరించాను. ఇది సాధారణ విషయం కాదు. ఇది దేవతల అధికారాన్ని సవాలు చేసే చర్య!”

“ఋషివర్యా, నన్ను కరుణించండి. నా బిడ్డా…” అంటూ చేతులు జోడించాను. కన్నీళ్ళు కారుతున్నాయి.

“ఏడవటంవంటివి నాకు ఇష్టం ఉండదు. స్పష్టంగా చెప్తాను విను. ఒకే ఒక్కసారి. నువ్వు నీ బిడ్డకు చెప్పదలచుకున్నదేదో ఒకేసారి చెప్పేయాలి. ఆ పైన ఇంకేమీ అడగటానికి వీల్లేదు.”

“చాలు, చాలు.”

అన్న వచ్చి కొంచెం దూరంలో కూర్చున్నాడు. ఋషి కళ్ళు మూసుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయారు. నేను పరితపిస్తూ కూర్చుని ఉన్నాను. ఋషి దీర్ఘశ్వాస విడుస్తూ కళ్ళు తెరిచారు. “నీ బిడ్డకు తిలోదకాలు ఇచ్చేశారు కదమ్మా! వాడు ఇప్పుడు భువర్లోకంలో లేడే…”

“ఋషివర్యా…” అని నేను భోరుమని ఏడ్చాను. “లేదు. తిలోదకాలు ఇంకా ఇవ్వలేదు…” క్షణంలో ఏం జరిగి ఉంటుందో నాకు అర్థమైంది. నన్ను ఓడించడానికి అతను జరిపించేసి ఉంటాడు. నా శరీరమంతా కంపించింది.

“ఆగు” అని ఋషి మళ్ళీ కళ్ళు మూసుకున్నారు. నేను బాధతో అన్న వైపు చూశాను. అతను విగ్రహంలా కూర్చుని గంగ ఒడ్డున వికసించిన కమలాలను, కలువలనూ చూస్తున్నాడు.

ఋషి కళ్ళు తెరిచారు. “మీ బిడ్డ గర్భపీఠం ఎక్కేశాడు.”

“ఎక్కడ? ఏ గర్భంలో?” నేను కలతపడుతూ చేతులు జోడించాను.

“అది తెలియదు. మనిషా, జంతువా, పక్షా, పురుగా అన్నది కూడా చెప్పలేము.”

“ఋషివర్యా, ఇప్పుడు ఏం చెయ్యాలి?”

“ఇంకా సమయం ఉంది. ఆత్మ మొదటి జీవకణమైన భౌతిక పరమాణువుని అంగీకరించి దానిలో విలీనం అయ్యే వరకు అవకాశం ఉంటుంది. అది కలిసిపోతే, ఈ జీవితంతో దాని సంబంధం పూర్తిగా తెగిపోతుంది. చూద్దాం.” ఋషి నీటిలోకి దిగి ఒక తామరపువ్వును కోశారు. దానిని పట్టుకొచ్చి, ధ్యానం చేసి, నాకు చూపించారు.

“ఇదిగో చూడు.”

రెండు చిన్న తెల్ల పురుగులు తామరపువ్వు పుప్పొడిమీద మెదులుతున్నాయి. సన్నటి పుప్పొడి కాండాలు కదులుతుంటే అవి మెల్లగా పాకుతూ కనిపించాయి.

“ఇది నేను సృష్టంచిన మాయా దృశ్యం. ఈ పువ్వు నీ పిల్లవాడు ఉన్న గర్భం. వీటిలో ఒక జీవి నీ కొడుకు. నువ్వు వాడితో మాట్లాడు. కానీ ఈ తామర ముడుచుకుపోతే ఆ తర్వాత ఏమీ చేయలేము.”

“వీరిలో నా బిడ్డ ఎవరు గురువర్యా?”

“ఇదిగో ఈ చిన్న తెల్ల పురుగు. వీళ్ళు కవలలు.”

నా మనసు వికసించింది. పారవశ్యమూ, కలవరమూ నా ఒళ్ళంతా వ్యాపించింది. నా మనసులో ఏ ఆలోచనలూ రాలేదు. ఆ పురుగును చూస్తుండగా నా చేతులు వణుకుతున్నాయి. దాని నాడి. అభిమన్యు చిన్న పిల్లవాడిలా పట్టు ఊయలలో తన్నుతూ, మెలికలు తిరుగుతున్నట్లు కనిపించింది. మాటలు రాలేదు. నా మనసు మాత్రమే అరిచింది. అభిమన్యు! ఇదిగో నీ తల్లిని. నన్ను మర్చిపోయావా, నా బంగారు తండ్రీ? నన్ను గుర్తుపట్టావా?

“మాట్లాడు, మాట్లాడు” అన్నారు రిషి.

“అభిమన్యూ” అన్నాను గొంతు పూడుకుపోతూ.

ఆ చిన్న పురుగు కదలకుండా నిలబడింది. అప్పుడు దాని తల నా వైపుకు తిరిగింది. దాని కళ్ళు ఎర్రటి చుక్కల్లాగా కనిపించాయి. వాడు నన్ను చూస్తా‍డా? నన్ను గుర్తుపడతాడా? నా మనసు సంతోషంతో ఉప్పొంగింది.

“మాట్లాడు, మాట్లాడు” అన్నారు ఋషి.

అప్పుడు అనుకోకుండా అందులో ఉన్న మఱొక పురుగును చూశాను. “ఋషివర్యా, ఇతను ఎవరు? వాడి కవల సోదరుడా?”

“అది నీకెందుకు? నీ బిడ్డకు నువ్వు ఏం చెప్పాలనుకున్నావో చెప్పు.”

“లేదు. నాకు తెలుసుకోవాలనుంది. అతను ఎవరు?”

ఋషి నుదురు చిట్లించారు, “అతని పేరు బృహద్బలుడు. అతను కోసల దేశాన్ని పాలించినవాడు.”

నా మనసు భయంతో స్తంభించిపోయింది. “కోసల రాజా? యుద్ధభూమిలో నా కొడుకు చేత చంపబడినవాడా?”

“అవును. జన్మజన్మలనుండి వాళ్ళిద్దరి మధ్య ఒక బంధం కొనసాగుతుంది. దానికి కారణం ఎవరూ తెలుసుకోడానికి వీలు లేదు. నువ్వు నీ బిడ్డకు చెప్పాలనుకున్నది చెప్పు.”

నా గొంతు బొంగురుపోయింది. వచ్చే జన్మలో ఏం జరగబోతుందో! “అభిమన్యు! వాడు కోసల దేశపు రాజు బృహద్బలుడు. వాడు నీ చేతిలో మరణించాడు. నీ కవల సోదరుడే నీ శత్రువు! తండ్రీ, జాగ్రత్తగా ఉండు…”

ఋషి కోపంగా అరిచారు. “ఏం మాట్లాడుతున్నావు నువ్వు?”

నేను అలసిపోయి రొప్పుతున్నాను. అయ్యో నేను పద్మవ్యూహం గురించి ఇంకా చెప్పలేదేనని గ్రహించాను. “అభిమన్యూ, ఇటు చూడు. పద్మవ్యూహం అనేది విధి నీకు వేసిన వేసిన చిక్కుముడి. దాన్నుండి బయటపడే మార్గం నేను చెప్తాను…” ఎవరో కిందకి చూస్తున్నట్లుగా నా మీద ఒక నీడ పడింది. నేను తల పైకెత్తి చూశాను. ఎవరూ లేరు. ఆకాశం నల్లగా కమ్ముకుంది. నేను ఆత్రుతగా పువ్వుకేసి చూశాను. అది ముడుచుకు పోయింది. “ఋషివర్యా” అని గట్టిగా కేకపెడుతూ పువ్వు రేకుల్ని విడదీయడానికి ప్రయత్నించాను.

“వృధా ప్రయత్నం, అమ్మాయీ! వాడు వెళ్ళిపోయాడు” అన్నారు ఋషి.

“ఋషివర్యా” అంటూ నేను వెక్కి వెక్కి ఏడుస్తూ ఋషి పాదాలపై పడ్డాను. “నాపై దయ చూపండి. నేను నా బిడ్డతో చివరిగా ఒక్క మాట మాట్లాడతాను…”

ఋషి పైకి లేచారు. నేను ఆయన పాదాలను పట్టుకున్నాను. విదిలించుకుని వెళ్ళిపోయారు. నేను అక్కడే ఆ మెట్ల మీద కూర్చుని, ముఖాన్ని మోకాళ్ళమీద దాచుకుని కుమిలి కుమిలి ఏడ్చాను.

ఒక చేయి నా భుజాన్ని తాకింది. అది అన్న చేయి అని తెలిసింది. నాకు ఇప్పుడు ఆ చేతి స్పర్శ కావాలనిపించింది. “అన్నా! అభిమన్యు… నా బిడ్డ…”

“రా, వెళ్దాం. వర్షం వచ్చేలా ఉంది.”

“నా బిడ్డకు ఇప్పుడు కూడా బయటకు వచ్చే మార్గం తెలియదు. వాడు తన విధి వేసిన చిక్కుముడిని మోసుకుని వెళ్తున్నాడు. నేను పాపిష్టిదాన్ని…”

అన్న నన్ను పైకి లేపాడు. “రా… ఏడ్చి ఏం లాభం?”

“నా బిడ్డకు తన విధి నుండి బయటపడే మార్గం తెలియదు…”

“అది ఎవరికి మాత్రం తెలుసని? నీకు తెలుసా? దారి తెలిసే నువ్వు లోపలికి వచ్చావా?”

నేను అలా స్తంభించిపోయాను. మెల్లగా, “అన్నా” అన్నాను.

“రా, వర్షం మొదలైంది.”

ఆకుల మీద పడుతున్న వర్షపు శబ్దం సమీపిస్తోంది. పొడవాటి వేళ్ళు నేలను తడుతున్నట్టు. అప్పుడు వాన ధారలుగా కురవసాగింది.

“అన్నా, నా బిడ్డ విధి ఏంటి? వాడి తదుపరి జన్మలో ఏం జరుగుతుంది?” అన్న గొంతు వర్షపు హోరులో సన్నగా వినిపించింది. “నాకు తెలియదు. కానీ దాని ప్రారంభం మాత్రం ఈరోజు తెలిసింది.”

“ఎలా?” అని నేను వెనకే పరిగెడుతూ అడిగాను. అన్న సమాధానం చెప్పకుండా నడిచాడు. ఒక మెఱుపు ఆకాశాన్నీ భూమిని కాంతితో నింపింది. అప్పుడు వరుసగా వచ్చిన ఉరుముల శబ్దానికి భూమంతా కంపించింది. దాని ప్రతిధ్వని నాలో చాలా సేపు వినిపించింది. వర్షం నా శరీరాన్ని కరిగించేటట్టుగా కురుస్తోంది. అన్న దట్టమైన వర్ష ధారల తెరలోకి అదృశ్యమయ్యాడు.

మూలం: పద్మవియూగం – కాలచ్చువడు, సంచిక-18, 1997లో ప్రచురితమయ్యింది.


అవినేని భాస్కర్

రచయిత అవినేని భాస్కర్ గురించి:

తమిళ తెలుగు అనువాదక రచయిత అవినేని భాస్కర్. ప్రధానంగా తమిళం వంటి ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేయడంలో ఆయన విశేష కృషి చేస్తున్నారు. అలాగే, తెలుగు కథలను తమిళంలోకి కూడా తన అనువాదం ద్వారా అందజేస్తూ, దక్షిణ భారతీయ భాషల మధ్య సాహిత్య వారధిగా నిలుస్తూ, అవినేని భాస్కర్ గారు తెలుగు-తమిళ సాహిత్య రంగాల్ని సుసంపన్నం చేస్తున్నాడు.

 ...


జయమోహన్

రచయిత జయమోహన్ గురించి:

జయమోహన్ 1962 ఏప్రిల్ 22న కేరళ-తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో కన్యాకుమారి జిల్లాలో జన్మించారు. ఆయన తల్లితండ్రులు మలయాళీలు. ఇరవై రెండో ఏట వామపక్ష, సామ్యవాద సాహిత్యం మీద ఆసక్తి కలిగింది. ఆ రోజుల్లోనే రాసిన ఖైది అనే కవిత; నది‌, బోధి, పడుగై వంటి కథలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. అప్పుడు రాసిన రబ్బర్‌ అనే నవల అకిలన్‌ స్మారక పురస్కారం అందుకుంది. ఈయన రచనలన్నీ మానసిక లోతులను వివిధ కోణాల్లో అద్దం పట్టేవిగా ఉంటాయి. 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని తన సిద్ధాంతానికి విరుద్ధమంటూ తిరస్కరించారు.

 ...