2024-25 బైరాగి శతజయంతి సంవత్సరమే కాదు, మా నాన్నగారి శత జయంతి సంవత్సరం కూడా. మా నాన్నగారు నాకు ఎట్లా జన్మనిచ్చారో, బైరాగి కూడా నాకు అట్లా ఒక ఆత్మిక జన్మనిచ్చాడని చెప్పాలి. నా భావనలో, నా అంతరంగంలో, నాకు ఒక పునర్జన్మ ఇచ్చినవాడిగా ఆయన్ని నేను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది.
యథార్థానికి కిందటి సంవత్సరం సెప్టెంబర్‌లోనే, సెప్టెంబర్ ఐదవ తారీఖునే, ఈ శత జయంతి, బైరాగి గురించిన ప్రసంగ పరంపర మొదలు పెట్టాలి అనుకున్నాను. చేయలేకపోయాను. మరి ముఖ్యంగా, ఆ మధ్య ఒక మిత్రుడు ఏదో ఒక వ్యాసం రాస్తూ, బైరాగి రాసిన ‘హ్యామ్లెట్ సమస్య’ అనే దీర్ఘ కవితలోని మొదటి మూడు నాలుగు వాక్యాలు పేర్కొంటూ, ‘ఇది చాలా అస్పష్టంగా ఉంది. దీనిలో అర్థం ఏముంది?’ అని ఇట్లాంటిది ఏదో ఒక అభిప్రాయం వెలిబుచ్చాడు. అక్కడ నేనేదో నా స్పందన రాశాను. కానీ, బైరాగిని తెలుగువాళ్ళు పట్టించుకోలేదనో, చదవలేదనో, మరొకరి మీద నెపం పెట్టక, ‘నేనేం చేయగలిగాను?’ అని నాకనిపించింది. ఈ సంవత్సరం 2025 జనవరి నుండి వరుసగా బైరాగి గురించి కొన్ని ప్రసంగాలు నా యూట్యూబు ఛానలు ద్వారా వెలువరించాను. ఈ వ్యాసంలోని చాలా భాగాలు ఆ ప్రసంగాలలో ప్రస్తావించిన అంశాలే.
నా ఆధునిక కవిత్రయం
తెలుగు సాహిత్యానికి ఒక కవిత్రయం ఉంది. నన్నయ్య, తిక్కన, ఎర్రన అనే ముగ్గురు కవులు తెలుగు కవిత్వాన్ని నిర్మించిన కవిత్రయంగా తెలుగు సాహిత్య చరిత్రలో సుస్థిరులయ్యారు. ఒకప్పుడు శ్రీశ్రీ తనకు కూడా కవిత్రయం ఉందని చెప్తూ, తిక్కన, వేమన, గురజాడ తన కవిత్రయం అని చెప్పాడు. ఆయన ఎందుకలా చెప్పుకున్నాడో కూడా వివరించాడు. నేను కూడా 30 ఏళ్ల కిందట బైరాగి మీద ఒక వ్యాసం రాస్తూ, గురజాడ, శ్రీశ్రీ, బైరాగి నా ఆధునిక కవిత్రయం అని పేర్కొన్నాను. అప్పటినుంచి నా మిత్రుడు వాసు — బెంగళూరులో ఉంటాడు, న్యాయపతి శ్రీనివాసు, కవి, సాహిత్య పరిశీలకుడు, గాఢమైన సౌందర్యస్పృహ ఉన్నవాడు, జీవితస్పృహ ఉన్నవాడు — నాకు ఎప్పుడూ గుర్తు చేస్తూ ఉంటాడు, ‘మీ ఆధునిక కవిత్రయం పుస్తకం ఇంకా రాలేదు, ఇంకా రాలేదు’ అని. ఈ ‘ఆధునిక కవిత్రయం’ అనే పుస్తకం రాయటాన్ని, స్వర్గానికి నిచ్చెనలు కడదాం అన్నట్లుగా, అట్లాగే వాయిదా వేస్తూ ఉన్నాను.
‘నువ్వు ఆధునిక కవిత్రయంగా గురజాడ, శ్రీశ్రీ, బైరాగి అనే ముగ్గురిని ఎందుకు ఎంచుకున్నావు?’ అని అడిగితే, స్థూలంగా చెప్పడానికి ఒక మాట చెప్పగలను. అదేమిటంటే, చలంగారు మహాప్రస్థానంకు ముందు మాట రాస్తూ, యోగ్యతాపత్రంలో ఒక మాట అన్నారు: ‘తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరేదాకా కవి చేసే అంతర్ బహిర్ యుద్ధారావమే కవిత్వం’ అని. నేననుకుంటాను, తెలుగు కవిత్వంలో, అసలు ఏ కవిత్వంలో అయినా కూడా అంతస్సంగ్రామం, బాహ్య సంగ్రామం ఉండాలి. అంతస్సంగ్రామం లేకుండా కేవలం బాహ్య సంగ్రామాన్ని మాత్రమే వర్ణిస్తే, చిరకాలం నిలబడగలిగే శక్తి దానిలో ఉండదు. అది ఆ తక్షణ కాలమాన పరిశీలన దాటిపోగానే, ఒక చారిత్రక విశేషంగా మారిపోతుంది. అలా కాక, కేవలం అంతస్సంగ్రామం మాత్రమే ఉంటే, అంతః సంఘర్షణ మాత్రమే ఉంటే, అది కూడా పూర్తిగా తత్త్వశాస్త్రంగా మారిపోయి లేదా ఒక మోనోలాగుగా మారిపోయి, దానిలో కూడా పాఠకుడికి చోటు దొరకదు. నిజమైన కవి ఏం చేస్తాడంటే, తన కవిత్వంలో అంతస్సంగ్రామాన్ని, బాహ్య సంగ్రామాన్నీ కూడా తీసుకువస్తాడు. మనం గొప్ప ఇతిహాసాలుగా చెప్పుకునేటువంటివి, అవి హోమరు రాసిన ‘ఇలియడు’ కానీ, ‘ఒడెస్సీ’ కానీ, ‘మహాభారతం’ కానీ, ‘రామాయణం’ కానీ, ‘షానామా’ కానీ, ‘గిల్గమేషు’ కానీ, ఒకప్పుడు కాంస్య యుగంలో పుట్టిన ఇతిహాసాలు ఏమున్నాయో, ఆ ఇతిహాసాలన్నీ కూడా మనిషి తాలూకు అంతర్, బాహ్య సంగ్రామాలు రెండిటినీ కూడా సమానంగా చిత్రించినటువంటివి. అంటే, ఆ లోపల ఒక అంతస్సంగ్రామం జరుగుతూ ఉంటుంది, బయట సంగ్రామం జరుగుతూ ఉంటుంది. ఆ వీరుడు అంతస్సంగ్రామంలో నెగ్గిన తర్వాతనే బయట సంగ్రామంలో నెగ్గడం మనకు కనిపిస్తుంది.
గురజాడ అప్పారావుగారి కవిత్వంలో అపారమైన అంతస్సంగ్రామం చేసుకున్న మనిషి కనబడతాడు. ఋషి అంటాం మనం ఆయన్ని. అంటే, ఆయన లోపల, తన గది లోపల, తన అంతరంగం లోపల అపారమైన అంతస్సంగ్రామం చేసుకుని, బయటికి వచ్చిన తర్వాత, ‘శత్రుమిత్రులకిచ్చి నెనరులు, స్నేహవార్ధులు కొల్లగొంటిని’ అంటాడు. శత్రుమిత్రులు ఇద్దరికీ కూడా నెనర్లు ఇవ్వగలగడం అనేది మాట కాదు, అది మంత్రం. ‘మాటలనియెడు మంత్రమహిమ అన్నమాట’ అది. ఆ స్థితికి ఆయన చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడన్నది మనం ఆయన సాహిత్యం, డైరీలు, ఉత్తరాలు మొత్తం అంతా చదివితే ఆనవాళ్ళు దొరుకుతాయి.
ఇక శ్రీశ్రీ గురించి ప్రత్యేకంగా మనం చెప్పవలసిందేముంటుంది? 20వ శతాబ్దం పొడుగునా ఆయన ఉన్నాడు. 1910 నుంచి 83 దాకా గత శతాబ్దమంతా పరుచుకొని ఉన్నాడు. ఆయన కవిత్వంలో మనకి ఏకకాలంలో అంతస్సంగ్రామం, బాహ్య సంగ్రామం రెండూ కూడా సమంగా చిత్రీకరణకు వచ్చినట్టు కనబడుతుంది. మహాప్రస్థానంలో బాహ్య సంగ్రామం కనిపిస్తుంది. మహాప్రస్థానంలో కూడా పొరలు ఉన్నాయి. ప్రధానంగా వినబడే గొంతు ఒక బాహ్య సంగ్రామానికి సంబంధించిన గొంతు. ‘పదండి ముందుకు’ అని అనడమే, తనని తాను అతిక్రమించిన తర్వాత, తనని తాను అదుపులోకి తెచ్చుకున్న తర్వాత మనిషి చెప్పగలిగే మాట అది. అయితే, ఆయనలో ఉన్న అంతస్సంగ్రామం, సదసత్సంశయం మనకి ఖడ్గసృష్టి కవితల్లో కనిపిస్తుంది. ఆయన జీవితంలో నడి వయసు అంతా కూడా అంతస్సంగ్రామం చాలా విస్తారంగా పరుచుకుని కనిపిస్తుంది. తిరిగి మళ్ళా మరోప్రస్థానం దగ్గరికి వచ్చేటప్పటికి, ఆయన ‘ఊగరా ఊగరా ఉరికొయ్యనందుకొని ఊగరా’ అనేటప్పటికి, మళ్ళా ఆయన తన అంతస్సంగ్రామంలో తనను తాను జయించుకుని, బయటికి వచ్చి బాహ్య సంగ్రామంలో పాల్గొన్నాడని మనకు అర్థమవుతుంది. అందువల్ల మనం ఆయనను యుగకవి అంటాం.
ఆధునిక కవిత్రయంలో బైరాగి
1950 తర్వాత ప్రపంచమంతా కూడా ఒక కొత్త సంఘర్షణకు లోనైంది. ‘మొదటి ప్రపంచ యుద్ధంతో దేవుడి మీద నమ్మకం పోయింది; రెండవ ప్రపంచ యుద్ధంతో సైన్సు మీద నమ్మకం పోయింది,’ అంటూ ఆ సంఘర్షణను చలంగారు చక్కగా సంగ్రహిస్తారు తన మ్యూజింగ్సులో. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత, అసలు మానవాళి మనుగడనే ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితిలో, మనిషి ‘ఎటు పోతే పూల తోట, ఎటు పోతే వల్లకాడు’ అనే ఒక చీలుబాట తాలూకు కూడలి దగ్గర నిలబడిన పరిస్థితిలో, మనిషిలో ఉత్పన్నమయ్యే అనేకానేక సందేహాలకీ, అనేక అనేక సంశయాలకీ, ‘ఇది మాత్రమే త్రోవ, నాన్యః పంథా విద్యతేఽయనాయ’ (ఇంకొక దారి లేదు) అని చెప్పగలిగే పరిస్థితిలో, 1950 తర్వాత, రెండవప్రపంచ యుద్ధం తరువాత, ఏ మానవమాత్రుడు లేడు. ఆ పరిస్థితిలో, ‘ఇది మాత్రమే త్రోవ, ఇదొక్కటే త్రోవ’ అని చెప్పగలిగే పరిస్థితి లేని కాలంలో బైరాగి కవిత్వం వచ్చింది.
ప్రధానంగా 1950-75 కాలంలో వచ్చిన కవిత్వం అది. ఆ పాతికేళ్ళ కాలంలో ప్రపంచమంతా కూడా చాలా చాలా ఆటుపోటులకు లోనైంది. ‘మనిషి ఎటు నడవాలి?’ మనం విప్లవ మార్గం వైపు నడవాలా? లేదా పెట్టుబడిదారీ విధానమా? తర్కమా, విశ్వాసమా? సంప్రదాయమా, ఆధునికతా? వ్యక్తి స్వేచ్ఛకు విలువివ్వాలా, సామూహిక ప్రయోజనానికి పెద్దపీట వేయాలా? అస్తిత్వవాదమా, మార్క్సిజమా? భౌతిక సుఖాలా, ఆధ్యాత్మిక విలువలా? ఇలాంటి ఎన్నో ద్వైదీభావాల నడుమ మనిషి సంశయానికి, విచికిత్సకు లోను కావడం సహజం. ఈ సంశయానికి లోను కావడం అనేది బలహీనత కాదు. అల్ప మానవులకు చిన్నచిన్న సంశయాలు వస్తాయి. చిన్న చిన్న పోరాటాలు చేస్తారు, చిన్న చిన్న విజయాలతో సంతృప్తిపడిపోతారు. కానీ, ఒక మహామానవుడికి మాత్రమే కలిగే మహావేదనలో, సంవేదనలోనుండి పుట్టేదే సదసత్సంశయం. ఈ సంశయం అతని సంశయం మాత్రమే కాదు; అది సమస్త మానవాళి తాలూకు ప్రతినిధిగా అతను ఆ సంశయాన్ని ప్రకటిస్తున్నాడు. తక్కిన మానవులు ఆ సంశయాన్ని బయటకు చెప్పడంలేదు; ఆయన చెప్తున్నాడు, అంతే తేడా. తెలుగు సాహిత్యంలో ఆ సంశయాన్ని ప్రకటించడంలో, ఆ సంశయానికి అభివ్యక్తి ఇవ్వడంలో బైరాగి నెరవేర్చినటువంటి పాత్ర అనితరసాధ్యమైన పాత్ర.
అయితే, నాకు చాలా కష్టం కలిగించే అంశం ఏమిటంటే, ఆయన 1978లో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళితే, ఆయన జీవితకాలంలో ఆయనను ఒక శక్తిమంతుడైన కవిగా ఎవరూ గుర్తించలేదు. ఇంకా దురదృష్టం ఏంటంటే, ఆయన మొదట రాసినటువంటి ‘చీకటి నీడలు’ అన్న పుస్తకాన్ని బట్టి, ఆయనను ఒక ధిక్కార కవి (iconoclast poet) అని మాత్రమే చూశారు. ఇక, ‘నూతిలో గొంతుకులు’ అనే కావ్యం 1955లో ‘తెలుగు స్వతంత్ర’లో వచ్చినా, ఆయన అందులో టి. ఎస్. ఎలియటు వాక్యాలు పేర్కొన్నందువల్ల, తనది సంశయకావ్యం అని రాసినందువల్ల, మనవాళ్ళు వెంటనే ఆ పుస్తకాన్ని లోతుగా చదవకుండానే ఈయన ఒక సంశయవాది; ఈయన మీద ఎలియటు ప్రభావం ఉంది; ఇది ‘వేస్ట్ల్యాండ్’ తాలూకు తరహా కవిత్వం అని, ఆయనను పూర్తిగా చదివి అర్థం చేసుకోకుండానే, ఆయన మీద ముద్ర వేసేశారు.
ఈ పరిస్థితి 1980లలో కొంత మారింది. మా తరంలో, మేము కవులుగా మా గొంతు మేము సవరించుకుంటున్న 1980వ దశకంలో, ‘మా తాలూకు ప్రశ్నలకి మా తరఫున ప్రశ్నలు అడిగినవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆ ప్రశ్నలకు జవాబులు ఇచ్చినవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఈ మానవుని అస్తిత్వాన్ని, మానవ స్వభావాన్ని చాలా లోతుగా పరిశోధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా?’ అని చూసుకున్నప్పుడు మాకు బైరాగి కనిపించాడు. అందుకని, నేను 1986లో నా ‘నిర్వికల్ప సంగీతం’ పుస్తకం మొదలు పెడుతూనే, మొట్టమొదటి పేజీ మీదనే బైరాగి తాలూకు కవితతో మొదలుపెట్టాను. అప్పటికే మా తరం కవులు చాలా మంది బైరాగిని కోట్ చేయడమో, బైరాగి మీద రాయడమో మొదలుపెట్టారు. 1983లో ‘ఆగమగీతి’ రావటం అనేది బైరాగి తాలూకు కవిత్వానికి ఒక పరిపూర్ణతను ఇచ్చింది. ఆ కావ్యం రావడంతో బైరాగి కవిత్వప్రయాణం ఒక పరిపూర్ణతను చేరుకుంది. 1984లో దానికి సాహిత్య అకాడమీ పురస్కారం కూడా లభించడంతో, బైరాగికి రికగ్నిషన్ లభించడం అక్కడికి పూర్తి అయింది.
కానీ నాకు ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, ఆ తర్వాత 1990లలో కానీ, గత పాతికేళ్ళుగా గాని, బైరాగి గురించి మాట్లాడే కవులు నాకు ఏమంత ఎక్కువ కనిపించడం లేదు. ముఖ్యంగా ఇప్పటితరం, 20-30 ఏళ్ళ మధ్య ఉన్నటువంటి యువతీ యువకులు ఎవరైతే కవితలు రాస్తున్నారో, వారు బైరాగి గురించి మాట్లాడటం కానీ, బైరాగి కవిత్వాన్ని పేర్కొనడం కానీ నేను ఎక్కువ చూడలేదు. అసలు వాళ్ళు బైరాగి కవిత్వాన్ని చదివారా అని కూడా నాకు అనుమానం కలుగుతుంది. అంతేకాక, వాళ్ళకి ఈ ప్రశ్నలు లేవా? కాబట్టి వాళ్ళకి బైరాగి ప్రాసంగికంగా అనిపించడం లేదా? ఒకప్పుడు మేము సతమతమైన ప్రశ్నలు ఈరోజు వాళ్ళను బాధించడం లేదా?
ఇటువంటి ప్రశ్నలు మనకు ఇప్పుడు కూడా ఉన్నాయి. స్వేచ్ఛ (liberty) గురించి ఎంగెల్స్ చెప్పిన ఒక సుప్రసిద్ధమైన వాక్యం ఉంది: స్వేచ్ఛ (liberty) అంటే ఏమిటంటే, ‘ఇటువంటి ఆవశ్యకత ఉంది అని గుర్తుపట్టడమే స్వేచ్ఛ’ (liberty is a recognition of necessity) అని చెప్పాడు. ‘నాకు ఇలాంటి సమస్య ఉంది.’ అని నేను నా సమస్యను నిర్ధారణ చేసుకోగలగడమే పెద్ద విమోచన అవుతుంది. అసలు నాకు సమస్య ఉందా? నాకు సందేహాలు కలుగుతున్నాయా? ‘లేదు, నేను నా తోటి యువతీ యువకులు రాసుకున్న కవితలు చదువుకుంటూ, లేదా ఈ యువతరం రాస్తున్న కవితల్నే మరొక విమర్శకుడు ఎవరో చాలా గొప్ప కవిత్వంగా కాలమ్సు రాస్తూ ఉంటే, లేదా వ్యాసాలు రాస్తూ ఉంటే, లేదా ప్రసంగాలు చేస్తూ ఉంటే, ‘మేము ఇంతకన్నా వెనక కవిత్వాలు చదవాల్సిన అవసరం లేదు’ అని వాళ్ళు అనుకున్నట్లయితే మంచిది. కానీ, మానవ అవస్థలో అయితే ఏ విధమైన మార్పులు రాలేదు కదా.
నామీద బైరాగి ప్రభావం
20-25 ఏళ్ళ మధ్య వయసులో, ఒక యువకుడిగా జీవితం పట్ల ఎన్నో కలలతో, ఆశలతో, ఆదర్శాలతో జీవితంలోకి అడుగు పెట్టిన నేను, నా చుట్టూ భయానకమైనటువంటి, దారుణమైన వాస్తవాలు ఆవరించి ఉన్నప్పుడు, ఆ నిష్ఠుర సత్యాలను ఎదుర్కుంటూ ముందుకు సాగాలంటే, ఏమిటి నా మార్గం? ఏమిటి? నేను ఒక నక్సలైటుని కావడమే నా జీవితాదర్శమా? శ్రీశ్రీ అప్పటికి మరోప్రస్థానం గీతాలు వచ్చాయి. ఈ మరోప్రస్థానం గీతాల్లో ఆయన ‘ఊగరా ఊగరా’ అంటే, నేను కూడా ఉరికొయ్యకు ఊగడం ఒకటేనా జీవిత పరమార్థమా? కానీ, ఎందుకనో, ఆ ఆదర్శం నన్ను పూర్తిగా ముందుకు నడపలేదు. ఇంకేదో ఉంది, ఇంకేదో ఉంది, ఇది కాదు, ఇది కాదు అనే ఒక తపన, ఆ సంఘర్షణలో నన్ను చెయ్యి పట్టుకొని నాకు దారి చూపించిన కవి బైరాగి. ఎన్నో రాత్రులు ఆ ఒక్కడినీ రాజమండ్రిలో రూములో, తిండి ఉండేది కాదు, తిండి తినో తినకనో, ఒంట్లో బాగున్నా బాలేకపోయినా, మిత్రులు ఉన్నా లేకపోయినా, ఒక ప్రేమ హస్తం ఏదీ నా పక్కన నన్ను ఓదార్చడానికో, లాలించడానికో సిద్ధంగా లేకపోయినా- ఒక నవయువకుడికి జీవితంలో కోరుకునేది ఏమిటి? ఒక ప్రేమించే హస్తం కోరుకుంటాడు, సన్నిధి కోరుకుంటాడు- అటువంటిది ఉన్నా లేకపోయినా, ఏదున్నా లేకపోయినా కూడా, ఆ చీకట్లో, ఆ రాత్రుల్లో, ఆ నది ఒడ్డున, ఈ కవిత్వం ఒకటే, బైరాగి కవిత్వం ఒకటి, ముఖ్యంగా ‘ఆగమగీతి’. ఆ పుస్తకం నాకు పారాయణ గ్రంథంగా నిలబడింది.
ఇప్పుడు కొందరికి ‘భగవద్గీత’ పారాయణ గ్రంథం. కొందరికి గాస్పెల్సు పారాయణ గ్రంథాలు. కొంతమందికి ‘కమ్యూనిస్ట్ మేనిఫెస్టో’ పారాయణ గ్రంథం. ‘ఆగమగీతి’ నా పారాయణ గ్రంథం. అది నా ఫౌండేషనల్ టెక్స్ట్. నన్ను నిర్మించింది. నా జీవ ధాతువుని, the fiber of my spirit, ఆ పుస్తకం రూపొందించింది. కాబట్టి, నేను ఆ కవి గురించి మాట్లాడుతున్నప్పుడు, నన్ను నేను ఎలా నిర్మించుకున్నానో, నా నా ప్రతి పోగు పోగునా కూడా ఆ బైరాగి తాలూకు మాటలు, ఆయన తాలూకు భావన నాలో ఇంకిపోయాయి. ఇప్పుడు శ్రీశ్రీని మనం ఎందుకు యుగకవి అని అంటామంటే, శ్రీశ్రీ ద్వారా మనకి ప్రపంచం పరిచయం అయింది. శ్రీశ్రీ చెప్పకపోయి ఉంటే, ప్రపంచం మనకు అర్థమై ఉండేది కాదు. అయితే, ప్రపంచం తాలూకు ఒక పార్శ్వం శ్రీశ్రీ పరిచయం చేశాడు. ఆ ప్రచండమైన పార్శ్వం, ‘లోహవిహంగాల’ పార్శ్వాన్ని పరిచయం చేశాడు. కానీ, లోపల ఉన్నటువంటి ‘దనుజ హస్తపు దీర్ఘరేఖల వలె పరచిన రాచబాటలు, సందుగొందుల మారుమోగే తాగుబోతుల వెకిలి పాటలు’. ఇది, ఈ ఇన్నర్, ఇంకా చెప్పాలంటే ఈ డౌన్‌ట్రాడెన్, ఈ చీకటి దారులు, ఈ చీకటి నీడలు, ఒక దాస్తోవ్‌స్కీ, ఒక కాఫ్కా, ఒక కీర్క్గార్డ్, వీళ్ళని బైరాగి పరిచయం చేశాడు. అంటే, వాళ్ళ గురించి రాశాడా? అనువాదం చేశాడా? కాదు. వాళ్ళ స్పిరిట్‌ని మనకు పరిచయం చేశాడు. ఒక నీషేని పరిచయం చేశాడు. బైరాగిని చదువుకున్న తర్వాత, మీకు పాశ్చాత్య తత్త్వశాస్త్రం చదువుకోవడం చాలా సులభం అన్నమాట.
నేను తత్త్వశాస్త్రంలో ఎం.ఏ. చేశాను. నాకు గురువు లేడు. ఒక్క క్లాస్ అటెండ్ కాలేదు. నేను ఫిలాసఫీలో డిగ్రీ తెచ్చుకున్నాను అంటే, ఏం చదివి తెచ్చుకున్నాను? ‘నూతిలో గొంతుకులు’, ‘ఆగమగీతి’ చదివి నేను ఫిలాసఫీలో ఎం.ఏ. చేశాను. అందరూ పోస్ట్-మోడర్న్ తత్త్వశాస్త్రం చాలా జటిలంగా ఉంటుందనీ, అర్థం కాదనీ అంటారు. కానీ నేను ఒకరోజు డెరిడాని తీసి చూస్తే, ఆయనను చదవడం చాలా సులభం అనిపించింది. కారణం ఏంటంటే, అప్పటికే నేను బైరాగిని చదివి ఉన్నాను కాబట్టి.
ఈరోజు ‘నో ఫియర్ షేక్స్పియర్’ పుస్తకాలు వచ్చాయి. ఎందుకంటే, ఆయన తాలూకు ఆ 16, 17వ శతాబ్దాల తాలూకు ఇంగ్లీషు పదజాలం తాలూకు స్ఫురణల్ని మనకు పరిచయం చేయడం కోసం, మళ్ళా కొత్తగా ఎన్నో వ్యాఖ్యానాలు వచ్చాయి. కానీ, నాకు ఆ వ్యాఖ్యానాలతో పని లేకుండానే, నేను తెరిచి చదవగానే, నాకు ఒక కింగ్ లియరో, ఒక మ్యాక్బెత్తో, హ్యామ్లెట్టో అర్థం అవుతున్నాడు అంటే, దానికి కారణం ఎవరు? బైరాగి. ఎలా అయితే శ్రీశ్రీ వల్ల నాకు యూరపు చరిత్ర, సామ్రాజ్యవాద చరిత్ర, విమోచనోద్యమాలు, ప్రపంచమంతటా, ముఖ్యంగా మూడో ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్నటువంటి పోరాటాలు… ఆ విముక్తి, విమోచన, స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, ఈ పదాలకు అర్థమంతా కూడా శ్రీశ్రీ వల్ల అర్థమైంది నాకు. అదే పరిస్థితిలో మనిషి అంతరంగం, మనిషి తనను తాను చూసుకోవడం, అంతర్ముఖుడు కాగలగడం, తనలో ఉన్నటువంటి ఆ దొంగ, ఆ పెట్టుబడిదారుడు, ఆ సామ్రాజ్యవాది, ఆ మోసగాడు, వాడిని తనలో పట్టుకోవడం, తనలో లొకేట్ చేయగలగడం… ఇవన్నీ బైరాగి వల్ల అర్థమైంది.
నేను రాజమండ్రిలో ఉండే రోజుల్లో విస్తారంగా ఉత్తరాలు రాసేవాడిని. ఉత్తరాలు రాయటమే జీవితంగా జీవించిన కాలం అది. ఎవరికి ఉత్తరం రాసినా కూడా, బైరాగి కవితలతో మొదలుపెట్టేవాడిని. ఉదాహరణకు, ఈ వాక్యాలు చూడండి:
నరుడు జీవిస్తున్నాడిచట
త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత కష్ట భోగం వల్ల.
ఈ ‘స్వేచ్ఛిత కష్ట భోగం’ అనే మాట, ఆ మాట నన్ను కట్టిపడేసింది. ‘స్వేచ్ఛిత కష్ట భోగం’ అంటే ఏంటి? నీ అంతట నువ్వు ఇష్టపడి చేసే కష్టం వల్ల కలిగే సుఖం. మన సమస్య ఏమిటంటే, మన కష్టం ‘స్వేచ్ఛిత కష్టం’ కాదు. మన కష్టం తాలూకు ఫలం ‘స్వేచ్ఛిత కష్ట భోగం’ కాదు. దాన్నే మార్క్సు ఏలియనేషన్ (alienation) అన్నాడు. ఏలియనేషన్ అంటే ఏంటంటే, ఆ పనిలో మనకు ఆసక్తి ఉండదు. ఆ పనిలో మనం హృదయపూర్వకంగా లగ్నం కాము. అది ‘స్వేచ్ఛిత కష్ట భోగం’ కాదు. అదొక ఫోర్స్డ్ లేబర్, మన మీద విధించబడ్డ ఒక శ్రమ. కాబట్టి అందులో మనకు ఆనందం లభించదు. అందుకనే మార్క్సు పొలిటికల్ అండ్ ఎకనామిక్ మాన్యుస్క్రిప్ట్స్‌లో ఒక చోట అంటాడు, మనిషి యథార్థానికి పని చేసేటప్పుడు మనిషిగా ఉండాలి అని. ఎందుకంటే పని sanity. పని వల్ల మనిషికి ఒక ఎక్స్ప్రెషన్ లభిస్తుంది, అతను క్రియేటివ్ అవుతాడు, అతని జీవితానికి ఒక అర్థం నిర్మించుకుంటాడు పని వల్ల. కానీ, పనిలో ఏలియనేషన్ వల్ల జరిగింది ఏమిటంటే, మనిషి పనిచేస్తున్నప్పుడేమో తనను తాను జంతువుతో పోల్చుకుంటాడు. ‘అబ్బా, నేను గాడిదలాగా పనిచేస్తాను, ఎద్దులాగా పని చేస్తాను’ అంటాడు. తీరా పని చేయకుండా, తాగినప్పుడు మాత్రం మనిషిగా తను జీవిస్తున్న భావనకు లోనవుతాడు అంటాడు ఆయన. అందుకని, ఆ ఎలినేషన్ లేనటువంటి, unalienated labor అంటూ ఏదైనా లైఫ్‌లో ఉండాలి అంటే, దానికి అద్భుతమైన పదబంధం బైరాగి పెట్టాడు. ‘మనిషి జీవిస్తున్నాడట త్యాగం వల్ల.’ ఫస్ట్ మాట అది, త్యాగం వల్ల. ‘త్యాగేనైకే అమృతత్వమానశుః’ అని ఉపనిషత్తులు చెప్పాయి. మనిషి జీవించేది త్యాగం వల్ల మాత్రమే. ‘త్యాగేనైకే అమృతత్వమానశుః’. త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత కష్ట భోగం వల్ల. ఇట్లాంటి పదాలు!
మనిషి గురించి ఇంకో చోట రాస్తాడు:
జ్ఞానం ఒక రంపం వలె చీల్చి కోసి
మానవుని తుత్తునియలు చేస్తుంది, జ్ఞానం ఎరుకపరుస్తుంది.
ఈ వాక్యాలు కూడా నా ఉత్తరాల్లో ఉండేవి. ఎందుకంటే, ఈ విధమైన బైరాగి వాక్యాలు నాకు జీవన స్ఫూర్తి. ‘నా ఆకాశాలను లోకానికి చేరువగా, నా ఆదర్శాలను నా సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా’ అన్నాడే శ్రీశ్రీ, అది ఏ కవైనా కోరుకుంటాడు. బైరాగి కవిత్వం నా వరకు అట్లాగా ఒక వెలుగుల రవ్వల జడిగా, ఒక మంత్రంగా ఉండేది అన్నమాట.
బైరాగి ప్రాసంగికత
నేను 1980ల ప్రారంభంలో బైరాగిని చదివినప్పుడు నాకు ఆయన ఎంత రెలవెంట్‌గా అనిపించాడో, ఇప్పుడు, దాదాపుగా 40 ఏళ్ల తర్వాత, మరింత రెలవెంట్‌గా అనిపిస్తూ ఉన్నాడు. కానీ, దురదృష్టం ఏమిటంటే, ఈ శత జయంతి సంవత్సరంలో ఎక్కడా నేను ఆయన తాలూకు శత జయంతి ఎవరు జరిపినట్టు చూడలేదు. ఒక్క ఫోటో మాత్రం తెనాలిలో ఒక పుస్తకావిష్కరణ జరిగినట్టు ఎవరో ఫేస్బుక్లో షేర్ చేస్తే చూశాను. కానీ, బైరాగి గురించి, ఆయన కవిత్వాన్ని గురించి ఒక వ్యాసం కూడా నేను చూడలేదు. పుస్తకప్రదర్శనలు చేస్తారు, అక్కడ ప్రాంగణాలకు పేర్లు పెడతారు. అక్కడ బైరాగి పేరు పెట్టడం ఇక్కడ హైదరాబాద్ బుక్ ఫెస్టివల్లో చూడలేదు. విజయవాడ బుక్ ఫెస్టివల్లో కూడా నేను చూడలేదు. విజయవాడ పుస్తక ప్రదర్శనలో సాధారణంగా ఈ మహనీయుల తాలూకు శత జయంతి సందర్భంగా ఒక రోజైనా ఆయన కవిత్వం మీదనో, సాహిత్యం మీదనో గోష్ఠి పెట్టే సంప్రదాయం ఉంది. అక్కడ వారు కూడా ఏడాది మీద ఒక గోష్ఠి పెట్టినట్లుగా నా దృష్టికి అయితే రాలేదు.
నాకు ఇప్పటికీ అంతే శక్తిమంతంగా, అంతే ప్రాసంగికంగా కనపడుతున్న ఈ కవిని, తెలుగు సాహిత్యప్రపంచం ఎందుకు దూరంగానే పెట్టి దగ్గరగా సమీపించట్లేదు? ‘ఈయన భాష చాలా గహనంగా ఉంది’, ‘ఈయన భావాలు మాకు చాలా కఠినంగా ఉన్నాయి’ అన్న మాటలు వినిపిస్తాయి. భాష గహనంగా ఉంది అంటే, బైరాగి తాలూకు అన్ని కవితల్లోనూ భాష గహనంగా ఉందని నేను చెప్పలేను. చాలా సులభంగా బోధపడేటువంటి, ఒక మెట్రిక్యులేట్ కూడా చదివి అర్థం చేసుకోగలిగినటువంటి కవితలు ఉన్నాయి. అది కాక, ఆయన కవితా పదజాలం, కవితా సామగ్రి, ఒకసారి మనం ఒకటి రెండు సార్లు ఆ పుస్తకాలు చదివితే మనకి సుపరిచితమైపోతాయి. ఏ కవిదైనా కూడా అంతే. కవితా పదజాలం, కవితా సామగ్రి ఎప్పుడూ కూడా పరిమితంగానే ఉంటుంది.
ఉదాహరణకు, ‘గీతాంజలి’ ఉందనుకోండి, గీతాంజలిలో కవితా సామగ్రి ఎంత? చాలా ఒక చిన్న బుట్టలో పట్టేంత సామగ్రి అది. అందులో ఏమిటి? ఒక నది, ఒక రేవు, రెల్లు పొదలు, ఒక నవ్య పురుషుడు, ఒక వీణ వాయించుకోవడం. అర్ధరాత్రి వచ్చే అతిథి. మొత్తం అంతా కలిపి ఎంత ఉంటుంది? కానీ, ఒకసారి మనకి ఆ కావ్యసామగ్రి, ఆ కవిత్వ సంగీత పదజాలం, ఆ శబ్దజాలం మనకి బోధపడ్డ తర్వాత, ఇక అదే మనకు కష్టంగా అనిపించదు. బైరాగి కవిత్వంలో కూడా మొత్తం పదజాలం, ఆ key vocabulary, అది ఏమంత పెద్ద పదజాలం కాదు. ఎంతమంది ‘మహా ప్రస్థానం’ గీతాల్ని అర్థం చేసుకోగలిగి చదువుతున్నారు అని మనం భావించగలం? ఇప్పటికీ కూడా చాలామంది ‘అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం’ అనే చదువుతారు. ‘అస్ర నైవేద్యం’ అనాలి, ‘అస్త్రనైవేద్యం’ అనకూడదు అని చాలా మందికి తెలియదు. అంటే ‘మహా ప్రస్థానం’లో ఎన్నో గీతాలు, నిజంగా అవి బోధపడి చదువుతున్నామా? అంటే కాదనే చెప్పాలి. ఆ కవితల్లో భాష తాలూకు శక్తే మనల్ని నడిపిస్తుంది, ముందుగా. తర్వాత నెమ్మదిగా అర్థం అవుతుంది. అట్లానే, బైరాగి కవిత్వంలో కూడా భాష దానికి అదే ఒక మెసేజ్. చాలావరకు బైరాగి కవిత్వం, గీతాలు ఇలాగే నన్ను నడిపించుకుంటూ పోయాయి.
గహన మానస కాననంలో
చిక్కుతీవెల తలపు గుబురులు,
సూర్యరశ్ములు సోకవిచ్చట
సడలు ఆకుల గాలి కబురులు
ఎప్పుడూ నడిరేయి చీకటి
జడలు విచ్చిన కాననంలో
భీతి తప్పక ప్రతిఫలించదు
హరిత ప్రకృత్యాననంలో,
అంతరం ఒక అంతకంధర
మంధమేధ భ్రమద్దివాంధం
వలచినది కస్తూరి మృగమై
స్వీయనాభ్యుద్గమద్గంధం.
ఇలా చదువుతూ ఉంటే, ఆ అర్థం తెలిసి చదువుతామా? చదువుకుంటూ పోతాం. చదువుకుంటూ పోయిన తర్వాత నెమ్మదిగా ఒకటి ఒకటి ఒకటి అర్థాలు మనకి బోధపడుతూ ఉంటాయి. లేదు, కొన్ని చాలా సులభ సాధ్యంగా ఉంటాయి. ఇదివరకు ప్రస్తావించిన వాక్యాలు:
నెచ్చెలులారా! నరుని జీవన స్రోతమేది?
నరుడు జీవిస్తున్నాడట, త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత కష్ట భోగం వల్ల.’
ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది?
ఇక బైరాగి తాలూకు ప్రాసంగికత. బైరాగి లేకపోతే, ఎంతసేపూ మనం జీవితమంతా ఒక పెట్టుబడిదారుణ్ణి నిందిస్తూ, ఒక సామ్రాజ్యవాదిని నిందిస్తూ, ఒక కులాన్ని నిందిస్తూ, ఒక లింగాన్ని నిందిస్తూ, ఒక ప్రాంతాన్ని నిందిస్తూ మాత్రమే ఉంటాము. కానీ మనకు తెలియంది ఏమిటంటే, ఈ నిందించే క్రమంలో, ఈ పోరాడే క్రమంలో, ఈ విమోచన క్రమంలో, మనమే మరొక సామ్రాజ్యవాదిగా మారుతున్నామని, మరొక పెట్టుబడిదారుడిగా మారుతున్నామని, మరొక పితృస్వామిగా మారుతున్నామని, మరొక బ్రాహ్మణీయ భావజాలం కలిగిన వాడిగా మారుతున్నామని, లేదా మరొక ఆధిపత్య ప్రాంత భావజాలాన్ని మనలో నింపుకుంటున్నామని ఎవరు చెప్తారు మనకి? బైరాగి చెబితే తెలుస్తుంది.
నేను హంతకుని కత్తిని కాదు
కనుల క్రౌర్యాన్ని చూసి జంకుతున్నాను
అన్నాడు ఆయన. ఎందుకంటే, మనవాళ్ళకి చాలా మందికి రాజ్యం అంటే పోలీసులు, చట్టాలు, జైళ్లు, తుపాకులు స్ఫురిస్తాయి. అది కాదు, అది హంతకుడి చేతుల్లో కత్తి. దాన్ని కాదు. బైరాగి ఆ హంతకుడి కనుల క్రౌర్యాన్ని చూడమన్నాడు. ఆ హంతకుడు నువ్వు నిందిస్తున్నవాడిలో లేడు, నీలో ఉన్నాడేమో చూసుకో అని చెప్పాడు. అందుకని, బైరాగి మొట్టమొదటిసారి ఏం చేసాడంటే, నాలోకి చూపు తిప్పాడు. నేను ‘నిర్వికల్ప సంగీతం’లో ఒక మాట రాశాను, ‘నేను మరొకరి మీద ఆరోపించే స్వేచ్ఛ కోల్పోతాను’ అని. మరొకరి మీద ఆరోపించే స్వేచ్ఛ లేదు నాకు. నేను ఈ 40 ఏళ్లుగా, నా ‘నిర్వికల్ప సంగీతం’ రాసిన రోజు నుంచి ఇప్పటి దాకా కూడా, నా జీవిత ప్రయాణం అంతా కూడా మరొకరి మీద ఆరోపించే స్వేచ్ఛ లేదు నాకు. నువ్వు ఎవరి మీద ఆరోపిస్తావు? నువ్వే అలా ప్రవర్తిస్తున్నావు. నీకు బయట తెలియకపోవచ్చు గాక, నువ్వు ఒక సామ్రాజ్యవాదివి, నువ్వు ఒక పెట్టుబడిదారుడివి, నువ్వు ఒక పితృస్వామివి, పురుష ప్రభువువి. నువ్వు ఒక బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలం మూర్తీభవించిన రూపాన్ని నువ్వు. నువ్వు ఇది దాచవచ్చు గాక, పైకి చెప్పకపోవచ్చు గాక, నీలో ఉన్న ఈ చీకటి నీడల్ని, చీకటి కోణాల్ని నీకు నువ్వే అట్టే పెట్టుకొని, ఎంతసేపు దొంగ బయట ఉన్నాడు, వాడిని పట్టుకోండి, వాడిని పట్టుకోండి అని చెప్పొచ్చు గాక, కానీ లోకం కనిపెడుతుంది కదా. ఇది చాలా సున్నితంగా- ఆ రోజుల్లో కనిపెట్టకపోవచ్చు, కొద్దిగా కాలం గడిచాక కనిపెట్టవచ్చు.
ఉదాహరణకి, మూడో ప్రపంచ దేశాల్లో యాంటీ-కలోనియల్ మూవ్మెంట్స్ ముమ్మరంగా జరిగినప్పుడు, ఎంతో మంది స్వాతంత్ర్య వీరులు పుట్టుకొచ్చారు. వాటిల్లో ఘనా కూడా ఒక దేశం. గోల్డ్ కోస్ట్ అంటారు దాన్ని. బంగారం ప్రవహించిన దేశం అది. ఆ ఘనాలో క్వామే ఎంక్రుమా అని ఆయన నేషనలిస్ట్ లీడర్, ఘనాకి ఆయన జాతిపిత అంటారు. ఆయన గురించి ఒక సోషియాలజిస్ట్ రాశాడు. అదంతా, ఘనా స్వాతంత్ర్యం పొంది, క్వామే ఎంక్రుమా దేశాధ్యక్షుడై ఓ పదేళ్లో, ఇరవై ఏళ్ళో పరిపాలన చేసిన తర్వాత, ఒక సోషియాలజిస్ట్ క్వామే ఎంక్రుమాని ఒక ‘లెనినిస్ట్ జార్’ అన్నాడు. అంటే ఏమిటంటే, ఈయన లెనినిస్టూ, జార్ చక్రవర్తీ కూడా అని చెప్పడం. అంటే, ‘లెనినిస్ట్ భావజాలం మాట్లాడే జార్ చక్రవర్తి’ అని. అంటే, నువ్వు నీ శాస్త్రీయ వివేచన వల్ల, నీ ప్రసంగ కౌశల్యం వల్ల, నీ తాలూకా ఆర్గనైజేషన్ కెపాసిటీ వల్ల, నువ్వు ఒక లెనినిస్ట్ పంథా గురించి మాట్లాడతావు, లెనినిస్ట్ నాయకుడిగా నిన్ను నిరూపించుకుంటావు, చూపించుకుంటావు, నిలబడతావు, అధికారం సంపాదిస్తావు, పరిపాలన చేస్తావు. కానీ, వాస్తవ ఆచరణలో నువ్వు ఒక జార్కి ఏ మాత్రం తీసిపోవు అని.
దాదాపుగా మూడో ప్రపంచ దేశాల్లో యాంటీ-కలోనియల్ మూవ్మెంట్స్ నిర్వహించి, దేశాలకు స్వాతంత్ర్యం తెచ్చినటువంటి నాయకులు, దాదాపుగా ఎక్కడో ఒక గాంధీ, ఒక మండేలా తప్ప, దాదాపుగా 99 శాతం మంది నాయకులు ‘లెనినిస్ట్ జార్లు’గానే మారారు. ఇలా ‘లెనినిస్ట్ జార్’గా మారే ప్రమాదం ఉంది చూడు అని మనకి ఏ సోషలిస్ట్ కవి కవిత్వంలోనూ కనిపించదు. సోషలిస్ట్ కవుల కవిత్వంలో విప్లవాన్ని ఆహ్వానించే రొమాంటిసిజం కనబడుతుంది. తిరగబడమనే ఒక స్ఫూర్తి కనబడుతుంది. ఉద్రేకపరిచేఒక వాగ్ధాటి కనబడుతుంది. కానీ, ‘ఒరేయ్ నాయనా, దీని వెనకాతల నీలో ఉన్న నీ రహస్య ఉద్రేకాన్ని పసిగట్టు. నీలో ఒక దొంగ ఉన్నాడు, ఒక మోసగాడు ఉన్నాడు. వాడు అవకాశం దొరికిందా, వాడు నీ స్వజనం పట్ల, నీ స్వదేశం పట్ల, తిరిగి మళ్ళా ఒక సామ్రాజ్యవాదిగా, ఒక పెట్టుబడిదారుడిగా, ఒక పురుష ప్రభువుగా, ఒక పితృ ప్రభువుగా ప్రవర్తించి తీరతాడు’ అని చెప్పేటటువంటి, హెచ్చరించేటువంటి గళం మనకు లేదు.
ఇది 1950లో ఇటువంటి గళం ఎంత అవసరమో, నా దృష్టిలో 2025లో అంతకన్నా ఎక్కువ అవసరం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ తిరుగుబాటుదారులే, ప్రతి ఒక్కళ్ళూ విమోచన కోరుకునే వాళ్లే, ప్రతి ఒక్కళ్ళూ వేరే వాడిని వేలెత్తి చూపే వారే, నిందించే వారే. ప్రతి ఒక్కరూ కూడా ఒక శత్రువు అన్వేషణలోనూ, శత్రువుని రూపొందించే క్రమంలో ఉన్నటువంటి వాళ్లే. కానీ, ఈ లోపల, ఈ నీ అంతరంగంలో ఉన్నటువంటి, నీ అంతరాంతరాళంలో ఉన్నటువంటి ఆ అపరాధి ఎవరో, ఆ అపరాధ పరిశోధన చేయమని చెప్పే కవి ఎవరూ లేరు. అందుకని, బైరాగి ప్రాసంగికం ఈరోజు. ఏ కవి అయినా కూడా, తన కాలంలో సమకాలికులు అతని తాలూకు మొత్తం ప్రాశస్త్యాన్ని గుర్తుపట్టడం కష్టం అవుతుంది. కానీ, కాలం గడిచే కొద్దీ ప్రజలు దాన్ని గుర్తించగలుగుతారు. ‘ఇక్కడ ఒక కవి ఉన్నాడు, మనల్ని హెచ్చరించాడు’, ‘ఇదిగో, మన నాయకుడిని గురించి ముందే హెచ్చరించాడు’, ‘ఇదిగో, మన విమోచనకారుడి గురించి ముందే చెప్పాడు’, ‘ఇదిగో, మన పత్రికా సంపాదకుడి గురించి ముందే చెప్పాడు’, ‘ఇదిగో, అనర్గళంగా మాట్లాడే మన వక్త ఉన్నాడే, ఆ వక్త పట్ల జాగ్రత్త వహించాలని మనకన్నా ముందే ఈ కవి చెప్పాడు చూడండి’ అని మనకు అర్థమవుతుంది అన్నమాట. అందుకని, అటువంటి కవి గురించి మాట్లాడుకోవడం అంటే, బైరాగి గురించి మాట్లాడుకోవడం అని అంటే, మనల్ని మనం జాగరూకులుగా ఉంచుకోవడం అన్నమాట.
అది ఒక మేనిఫెస్టో ఆఫ్ అలర్ట్‌నెస్, మనల్ని మనం సదా నిత్య జాగరూకులుగా ఉంచుకోవడం. మామూలుగా రాజకీయ శాస్త్రజ్ఞులు ఏం చెప్తారు అంటే, ‘ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ’ అని చెప్తారు. ప్రజాస్వామ్యం బతకాలంటే, నిత్య నిరంతరం మనుషులు జాగరూకులుగా ఉండాలి, పౌరులు జాగరూకులుగా ఉండాలి. ‘ఎటర్నల్ విజిలెన్స్ ఇస్ ద ప్రైస్ ఆఫ్ డెమోక్రసీ.’ డెమోక్రసీ కావాలంటే నువ్వు చెల్లించవలసిన మూల్యం ఏమిటయ్యా అంటే, నిత్య జాగరూకుడిగా ఉండడం అని చెప్తారు. ఆ నిత్య జాగరూకుడిగా ఉండడం ఎలాగో నేర్పే విద్య ఏదైనా ఉంది అంటే, అది బైరాగి కవిత్వంలో మనకు కనిపిస్తుంది.
‘నేను మీ కవిని కాను’
ఈ తెలుగు సాహిత్య ప్రపంచంలో, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో, ప్రపంచమంతా దాదాపుగా 160 దేశాల్లో, 11 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉన్న ప్రపంచంలో, బైరాగి అనే కవి గురించి మాట్లాడుకోవడానికి ఒక్క సంస్థకు కానీ, ఒక్క సాహిత్య ఉద్యమకారుడికి కానీ, ఆ ఒక్క కవికి కానీ, నాతో సహా ఎవరికీ కూడా సమయం చిక్కలేదు అంటే, దాని అర్థం ఏమిటంటే, 1950 కన్నా కూడా మనం మరింత దారుణమైన ఆత్మ వంచనలోకి ప్రవేశించాము. ఒక ఆత్మ వంచన యుగంలోకి ప్రవేశించాం. మనల్ని ఆ యుగం నుంచి బయట పెట్టగలిగిన వాడు, బయటకు నెట్టగలిగిన వాడు ఎవరంటే, ఎవరు ఆత్మవంచనకు లోను కాడో, ఎవరు ట్రూలీ హానెస్ట్‌గా ఉండగలడో, అటువంటి కవి, అటువంటి రచయిత మాత్రమే మనల్ని ఈ ఆత్మవంచన నుంచి కాపాడగలుగుతాడు. మనకు తెలుగు సాహిత్యంలో అటువంటి రచయిత ఎవరైనా ఉన్నారు అంటే, చలం గారు ఒక్కరు కనిపిస్తారు. తరువాత అట్లాంటి రచయిత బైరాగి.
బైరాగి ఎంత నిజాయితీపరుడైన కవి కాకపోతే, ఈరోజు ఆయన్ని ఒక్కళ్ళు కూడా ‘ఈయన నా కవి’ అని చెప్పుకోవడానికి ముందుకు రాలేదంటే, మీరు అర్థం చేసుకోండి.
‘నేను మీ కవిని కాను’, ఇది ఆయన రాసిన కవిత. చాలా చక్కగా రాశాడు. నిజం, ఆయన మన కవి అయ్యి ఉంటే, లేదా ఈ సాహిత్య సంఘాల కవి అయి ఉంటే, ఈ సాహిత్యోద్యమాల కవి అయి ఉంటే, ఈ రకరకాల పేర్ల మీద చలామణి అవుతున్న ఉద్యమాల కవి అయి ఉంటే, ఈ పాటికి ఊరూరా ఆయన పేరు మీద మీటింగులు జరిగి ఉండేవి, ఊరూరా ఆయన శత సభలు జరిగి ఉండేవి. కాబట్టి, ఆయన మన కవి కాడు, మనలో ఎవరి కవి కాడు. ఆయన ఏమంటున్నాడు:
నేను మీ కవిని కాను
పొండి పొండి వెడలి పొండి నేను మీ కవిని కాను
వాస్తవం చెప్తున్నాను ముమ్మాటికి నేను మీ కవిని కాను
నా చుట్టూ నీడల్లా ముసిరి ముసిరి మూగకండి
లే ఎండల పొడల జడిల నా రుధిరం తాగకండి
మీకు మళ్ళీ చెప్తున్నాను నేను మీ కవిని కాను
పొండి పొండి వెడలిపోండి
తేప తేపకు వేలెత్తి చూపకండి
మాటిమాటికి చేతులు చాపకండి
నేను మీకు ఇవ్వగలది ఏమీ లేదు
అయినా ఇది సమయం కాదు మీకు వేళాపాళా లేదు
పొండి పొండి వెడలిపోండి
నాదాల నినాదాల వివాదాల బాణసంచాలు పేల్చడానికి
అదట! ‘నాదాల, నినాదాల, వివాదాల…’ అన్న మాట గుర్తుపెట్టుకోండి. సోషల్ మీడియా యుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. వివాదాల బాణసంచాలు పేల్చడానికి ఆయన కాదట.
నాదాల నినాదాల వివాదాల బాణసంచాలు పేల్చడానికి
రంగు రంగుల మతాబాలు కాల్చడానికి
చిలకలాగు సూక్తులు పలకడానికి
శాక్రిన్ తేనె సోనలొలకడానికి
మహామహులకు అభినందన తెలపడానికి అభినందన వందనలు తెలపడానికి
ఇష్టం లేని కృప ప్రశంసల తీయని విషం కలపడానికి
నేను మీ కవిని కాను
మూగిన మహాజనం మధ్య దయ తలచిన ధనం మధ్య
పొత్తాల పత్తనాల నాగరికుల శాస్త్రీయ భ్రమల సఘన వనం మధ్య
నిధనం వంటి ధనం చేసే సత్కారాలు, సన్మానాలు
జరీ అంచుల శాలువాలు, చందన తాంబూలాలు, పూల గుత్తులు, హారాలు
కవితా సతి శవ సంస్కృతిలోన తీరని అవమానాలు
నే వలచిన ఈ మృణాల దేహానికి
ఆయన వలచిన మృణాల దేహం ఆయన కవిత్వం. ఏమిటది? మృణాల దేహం. తామర తూడులాంటిది అన్నమాట ‘బిసతంతు తనీయసీ’ అన్నాడు అమ్మవారిని కవి. ఆ బిసతంతు తనీయసీ- ఉన్నదా లేదా అన్నంత సున్నితమైనది, అంత మసృణమైనది.
నే వలచిన ఈ మృణాల దేహానికిచేజేతుల నిప్పు పెట్టలేను
నేను నేను మీ కవిని కాను వెడలిపోండి
లోకం చూశాను నేను శోకం చూశాను నేను
లోకంలోన శోకంలోన నాకం కూడా చూడకపోలేను నేను
నాకం అంటే స్వర్గం. ‘లోకం చూశాను నేను, శోకం చూశాను నేను, లోకంలోన, శోకంలోన నాకం కూడా చూడకపోలేను నేను.’ అది బైరాగి.
ఈ కవిని సంశయ కవి, నిహిలిస్ట్ పోయెట్ అని ముద్ర వేసిన ఒక్కడైనా ఈ కవిత చదివాడా? ఒక్క సాహిత్య చరిత్రకారుడైనా ఈ కవిత చదివాడా? ఈ వాక్యాలు చదివాడా? నువ్వు నాకం చూసానని నేను ఎప్పుడు నమ్ముతాను అంటే, నువ్వు లోకం చూసి ఉండాలి, శోకం చూసి ఉండాలి. ఎందుకంటే, నన్నయ్య మహాభారతం మొదలు పెడుతూ, తను తాను లోకజ్ఞుడు అని చెప్పుకున్నాడు. కవి లోకజ్ఞుడై ఉండాలి, లోకం తెలిసి ఉండాలి. శోకం తెలిసి ఉండాలి. వాల్మీకి మొదలు పెట్టడమే శోకం శ్లోకంగా మారింది. నువ్వు లోకం చూసి ఉండాలి, శోకం చూసి ఉండాలి. లోకంలోన, శోకంలోన, అప్పుడు నాకం కూడా చూడకుండా ఉండలేడు తాను.
తక్కిన స్వర్గాలు నిజమైన స్వర్గాలు కావు. అవి మిథ్యా స్వర్గాలు, కల్పిత స్వర్గాలు, ఊహా స్వర్గాలు. ఇది నిజమైన స్వర్గం, ఎందుకంటే నువ్వు లోకం చూసావు, శోకం చూసావు.
జీవిత మహిత జనక విహిత స్వయంవర సమరంలోన
పినాకాన్ని తృణంలాగా తుంచిన నేను
మైనాకుని రెక్కలు ఉత్తరించి
గర్వోన్నత సర్వ పర్వత శీర్ష శృంగాలను వంచిన నేను
నిరస్త్ర నిరస్తుడనై లజ్జావనతమస్తుడనై
దీనంగా మౌనంగా నేడు వేడుకుంటున్నాను
నేను మీ కవిని కాను దయచేసి వెడలిపోండి
జనన జీవన మరణాలు మసకలాడే ఇసుక తరగల కలిసిపోయి
రాగాల విరాగాల సరాగాల
సరస మసృణ కుసుమ విసర పరాగాల ఛాయలు వెలిసిపోయి
చెలరేగిన గోధూళి ధూళిలోన కలిసిపోయి
ఇచ్చట మసక చీకటిలోన నా నిస్వన శిథిల వికటకుటిలోన
తోచక నేనేదైనా పొరపడి తొందరపడి వ్రాసినా అది మీకోసం కాదు
ఏదైనా చేదైనా నాదే, అది మోసం కాదు, అది మీ కోసం కాదు
ఇది మోసం కాదు. నా కవిత మోసం కాదు అని చెప్పుకున్న కవి. తక్కిన కవులు, మోసమే కవిత్వం, కవిత్వమే మోసంగా, వాళ్ళు చెప్పే మాటలంతా మోసమే. వాళ్ళు చూపించే స్వర్గాలు మోసం, వాళ్ళు చూపించే సౌందర్యాలు మోసం. కానీ, ఈయన చెప్తున్నాడు, ఒకవేళ పొరపాటున ఏదైనా ఒకటి రాసినా కూడా, తొందరపడి, మీరు నేను మీ కవిని అనుకుంటారేమో, కాదు, అది తొందరపడి రాశాను. ఏదైనా చేదైనా, ఆ బిట్టర్నెస్ కూడా నాదే.
నేను సోక్రటీసు గురించి ఒకచోట రాశాను, జీవితం అంటే సోక్రటీసు చేసిన తిక్త విషపానం అంటూ. ఆ చేదు విషపానం, ఆ చేదు నాది అంటున్నాడు బైరాగి. ఏదైనా చేదైనా నాదే, అది మోసం కాదు, అది మీ కోసం కాదు.
మీ కోసం నేనిక రాయలేను నేను మీ కవిని కాను
సూక్ష్మ గ్రాహ్య పారిజాత పరిమళాలు
దూర గ్రాహ్య సాగర నీర గభీర కలకలాలు
దుర్గ్రాహ్య దురూహ్య విపిన జటిల విటప పర్ణార్ణవ మర్మరాలు
యామినీ కోమల గర్భవాంఛా వహ్ని స్నాత ధూప దీపితాఘ్రాణాలు
ఏడు కడలుల కావలున్న దీవిలోన పంచవన్నెల రామచిలుక ప్రాణాలు
మూసిన దిక్కవాటాలు ఛేదించి దూసుకపోయే వన్నె వన్నెల కిరణాల బాణాలు
సుషమా విషమ వారధిలోన దీవి వెదకే నావికుడను
తెల్లని కాగితాలకు మసిపూసే గారడి ఇక చేయలేను
నేను మీ కవిని కాను
నికానోర్ పార్రా, ఒక యాంటీ-పోయెట్, చిలీకి సంబంధించిన ప్రసిద్ధ కవి. ఆయన తనను తాను యాంటీ-పోయెట్ అని చెప్పుకున్నాడు. ఆయన ఏం రాసాడంటే, ‘ఒరేయ్ బాబూ, మీరు ఏదైనా ఒక తెల్ల కాగితం మీద ఒకటి రాయదలుచుకుంటే, దాన్ని నలుపు చేయదలుచుకుంటే, అది నల్లగా అయిన తర్వాత ఆ తెల్ల కాగితం కన్నా విలువైనది అయితేనే కవిత రాయండి, లేకపోతే రాయకండి’ అని చెప్పాడు. ‘తెల్లని తెల్లకాగితంగా ఉంచండి. మీరు దానికి నలుపు పూసిన తర్వాత దాని విలువ పెరగాలి. అది ఒక సత్యాన్ని తీసుకురావాలి, అది మరింత అందంగా మారాలి, అది నాలో ఒక స్ఫూర్తిని నింపాలి. లేకపోతే వద్దు. తెల్లని తెల్లకాగితంగా ఉంచండి’ అన్నాడు ఆయన. ఈయన అంటున్నాడు, ‘సుషమా విషమ వారధిలోన దీవి వెతికే నావికుడను, తెల్లని కాగితాలకు మసిపూసే గారడి ఇక చేయలేను నేను’. మీ కవిని కాను. ఇట్లాంటి కవిని ఎవరు నెత్తి మీద పెట్టుకుంటారు? ఎవరు పల్లకీలు పడతారు? ఎవరు గజారోహణాలు చేయిస్తారు? ఎవరు గండపెండేరాలు తొడుగుతారు?
మీరు వెతికే కవి ఇక్కడ లేడు
అసలు ఇతడు అతడు కాడు
మరలి వచ్చిన ప్రేతం గాని మరిచిపోయిన గీతం గాని
చెరిగిపోయిన సుదూర వినీల ప్రియాతీతం గాని
భావనలో నవజీవం పోసుకోవు
పగిలిన పలక పైన ఓ,న,మ లు రాసుకోవు
కొండవీటి బురుజుపైన పెరిగిన పాచి
కోనేటి పసరులలోన ఎదిగిన నాచు
రావి ఆకుల అంచుల మంచు బొట్ల మిలమిల మెరిసి మాయమయ్యే పేల వెన్నెల
వేకువలో కరిగిపోయే చీకటి కల
ఏదీ తిరిగి రాదు కానీ ఏదీ చెరగిపోదు
కరకర పొద్దు పొడచి చండకరుడు మండిపడుతూ బిరబిర పరుగులిడే వేళ
జీవిత రుధిర స్నాత కృపాణాల శోణధారల
మధ్యందిన మహాజ్వాల మరిమరి మెరుగులిడే వేళ
వేయితలల వాసుకి కసితో బుస్సలు కొట్టి కస్సున లేచి ఆడే వేళ
మరో కవిత, ఇతర కవులు, వారు సుకృతులు,
వారికి నా నమస్కృతులు
అటువంటి కాలంలో. ఎటువంటి సమయంలో? ‘కరకర పొద్దు పొడిచి చండకరుడు మండిపడుతూ బిరబిర పరుగులిడే వేళ’ సరిగ్గా ఏ వాక్యం దగ్గర హృదయంలో ఏమవుతుందో అక్కడే గొంతు కూడా మూగబోతుంది.
పరాజితుడను మౌనవ్రతుడను
మీ శ్రేయైషిని, హితుడను
కానీ నేను కాచుకున్న రాత్రికే సన్నిహితుడను
మళ్ళీ మీకు చెప్తున్నాను
నేను మీ కవిని కాను ఇంక నన్ను వదలండి
దయచేసి వెడలిపొండి
‘మీ శ్రేయైషిని, హితుడను’. ఇది చాలా చాలా గొప్ప మాట. శ్రేయైషి అంటే శ్రేయం కోరుకునేవాడు. ఈ ‘శ్రేయం’ చిన్న మాట కాదు. ఇది కఠోపనిషత్తు నుంచి భారతదేశాన్ని వెంటాడుతున్న మాట. కఠోపనిషత్తు రెండు మాటలు చెప్పింది, ప్రేయము, శ్రేయం అని చెప్పింది. ప్రేయం అంటే ప్లీజ్ చేసేది అన్నమాట. హాయిగా ఉంటుంది వినడానికి, హాయిగా ఉంటుంది చెప్పుకోవడానికి, హాయిగా ఉంటుంది తలుచుకోవడానికి, హాయిగా ఉంటుంది సమీక్ష రాయడానికి, హాయిగా ఉంటుంది ముందుమాట రాయడానికి, హాయిగా ఉంటుంది పుస్తకాల సభలో ప్రశంసించడానికి, హాయిగా ఉంటుంది ఒక అవార్డు ఇవ్వడానికి. అది ప్రేయోదాయకం.
శ్రేయోదాయకం అట్లా ఉండదు. చేదుగా ఉంటుంది, మందులా ఉంటుంది. మింగలేము, తాగలేము. తల్లి తాగించిన ఉగ్గుపాలు లాగా చాలా కఠినం. అది తెలియని వయసులో తల్లి తాగిస్తుంది, తెలిసిన తర్వాత ఎవరు తాగిస్తారు? ఎవరు ఆ మందు మనకు తినిపిస్తారు? అటువంటి మనిషిని నేను, ‘మీ శ్రేయోభిలాషిని నేను’ అన్నాడు ఆయన. ‘మీ శ్రేయస్సు కోరుకునేవాడిని నేను, కాబట్టి ఇంత చేదు మాటలు చెప్తున్నాను నేను’. ఈ చేదు మాటలు చెప్పడానికి ఏ కవీ సిద్ధంగా లేడు.
1950 నుంచి 2025 దాకా, 75 ఏళ్లుగా చూస్తున్నాను నేను, ఏ కవీ చేదు మాటలు చెప్పడానికి సిద్ధంగా లేడు. ‘నేను మీ కవిని కాను’ అని చెప్పిన కవి నాకు కనబడలేదు. ‘నేను మీ కవిని మాత్రమే’, ‘అయ్యో మీరు నా దగ్గర రండి’, ‘ఈ శిబిరానికి, మీ శిబిరానికి నేనే కవిని’, ‘ఇదిగో ఈ ప్రాంతానికి నేనే కవిని’, ‘ఈ జిల్లాకి నేనే కవిని’, ‘ఈ మాండలికానికి నేనే కవిని’, ‘ఇదిగో ఈ గుంపుకు నేనే కవిని’, ‘ఇదిగో ఈ అన్నార్త, అణగారిన, ఈ మార్జినలైజ్డ్, ఈ డెస్టిట్యూట్ కమ్యూనిటీకి నేనే కవిని’, ఏదో ఒక ఇలా రాసుకుని చెప్పుకునే కవులే ఉన్నారు కానీ, ‘నేను మీ కవిని కాను’ అని నిర్ద్వంద్వంగా, నిజాయితీగా చెప్పిన కవి నాకు ఈ 75 ఏళ్లలో కనబడలేదు.
మరి ఇటువంటి కవిని ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరు ఈ కవి తాలూకు శతజయంతి సభలు చేస్తారు? ఎవరు ఈ కవి కోసం, ఈ కవి పేరు మీద ప్రాంగణాలకు పేర్లు పెట్టుకుంటారు? పెట్టుకుంటే ఎవరు సంతోషిస్తారు? ఏ కులం వాళ్ళు సంతోషిస్తారు? ఏ గోత్రం వాళ్ళు సంతోషిస్తారు? ఏ ప్రాంతం వాళ్ళు సంతోషిస్తారు? ఏ లింగం వాళ్ళు సంతోషిస్తారు? ఇతను ఎవరి కవి కాడు. ఇలాంటి కవిని ఇలా వదిలివేయవలసిందేనా మనం? ఇలాంటి కవి ఒకడు ఉన్నాడన్న కనీసం మనకు తెలియదా? ఇటువంటి ఒక కవి మనకు ఉన్నాడు. ‘హితుడను’ అన్నాడు ఆయన. హితుడు, మన హితుడైన కవి. నిజంగా మనం మేలు కోరేవాడు. సాహిత్యం అంటే ఏమిటి? హితంతో కూడుకున్న భావం, అదే సాహిత్యం. ఇది సాహిత్యం, ఎందుకంటే హితం ఉంది. హితం నోటికి హితవుగా ఉండదు, చేదుగా ఉంటుంది. అది హితం.
మనలో ఎప్పుడూ రెండు రకాల అంతఃస్ఫురణలు కలుగుతూ ఉంటాయి. ఒక అంతఃస్ఫురణ ‘ఇది చెయ్యి’ అంటుంది. ఒక అంతఃస్ఫురణ ‘ఇది చేయొద్దు’ అంటుంది. ఈ రెండు అంతఃస్ఫురణల్లో ఏది నా అంతఃస్ఫురణ అని ఎలా తెలుసుకోవడం? ఇదొక సమస్య, మీ అందరికీ కూడా అనుభవంలో వచ్చిన విషయమే ఇది. ఒకటి ఈ పని చేయొద్దు, చేయొద్దు అంటుంది. దీనికి ఏమిటి పరీక్ష అంటే, నేను ఒక రోజు ఇగ్నేషియస్ లయోలా అనే ఒక క్రైస్తవసాధువు రచనలు చదువుతూ ఉంటే, ఆయన ఒక చాలా చక్కటి మాట రాశాడు. నా జీవిత కాలానికి సరిపడా ఒక తాళం చెవి ఇచ్చాడు ఆయన. ఏమన్నాడంటే, ‘నాన్నా, గుర్తుపెట్టుకో, రెండు మాటలు నీకు వినబడుతున్నప్పుడు, ఏ మాట పాటించడం నీకు కొద్దిగా కష్టం అనిపిస్తుందో, అది నీ హితంగా గుర్తుపెట్టుకో’ అని చెప్పాడు ఆయన. ‘ఏది పాటించడం నీకు సుఖంగా అనిపిస్తుందో, అది నీ హితం కోరే మాట కాదని గుర్తుపెట్టుకో. తెల్లవారు జామున లేవడం కష్టం. కాబట్టి పడుకో ఇంకో గంట, అంటే అది నీ హితం కాదు. అది నీ వాక్యం కాదు, అది నీ గొంతు కాదు. అది సైతాన్ గొంతు. కష్టమైనా సరే, చలి అయినా సరే, పొద్దున్నే లే’ అని చెప్తుంది చూడు, అది నీ గొంతు.
నిజమైన హితమైన గొంతు ఏది? నిజమైన కవి ఎవరు? మన కవి ఎవరు? ఈయన మన కవి. ‘నేను మీ కవిని కాను’ అంటున్నాడే, ఈయన మన కవి. ఎందుకంటే ఈయన మన హితం చెప్తున్నాడు, మన మేలు చెప్తున్నాడు, నిజాయితీగా చెప్తున్నాడు. ‘నన్ను కాచుకున్న రాత్రికే సన్నిహితుడిని’ అంటున్నాడు. తక్కిన వాళ్ళందరూ పగటిపూట కవులు. ‘పూటకూళ్ళ కవిత్వం నాకు వద్దు, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి’ అంటున్నాడు ఆయన. అది పగలు కాదు, అది భ్రమ. అది ఇందాక అన్నాడే, ‘వాదాల, నినాదాల, వివాదాల బాణసంచాల’ వెలుగు. దాన్ని మనం పట్టపగలు అనుకుంటున్నాం. కాదు, కానీ అది నిజం కాదు. ఏదైనా సరే మరిపించేది, మురిపించేది సత్యం కాదు. నిన్ను రెచ్చగొట్టేది, నిద్రపోకుండా చేసేది, నిన్ను డిస్టర్బ్ చేసేది, అది మాత్రమే సత్యం. ఆ సత్యం మాట్లాడేవాడు ఎలా ఉంటాడు? చేదుగా ఉంటాడు, కటువుగా ఉంటాడు.
ఆ తిక్తత, ఆ వాక్యంలో తిక్తత వల్ల, నేను ఈ కవిత చదవక ముందే బైరాగి నా కవి అనుకున్నాను. కానీ ఈ కవిత చదవగానే నాకు అర్థమైంది, ‘ఈయన నా కవి. అయ్యా, మీరు ఏమన్నా అనండి, నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళను నేను’. ‘పొండి పొండి, వెళ్ళిపోండి’ అంటున్నాడు. ‘వెళ్ళిపోండి’ అన్నా సరే, మీరు తలుపు వేసుకున్నా సరే, మీ గుమ్మం ముందు ఆ మెట్ల మీదనే పడి ఉంటాను కానీ, నేను మరో చోటకు పోను అని నిర్ణయించుకున్నాను.
నిర్ణయించుకోవడం అనేది నాకు ఎంత నా రక్తంలో భాగం అయిపోయింది అంటే, ఆ బైరాగి తాలూకు ఆత్మ స్వభావం, ఏదో ఒక కీటకం చుట్టూ భ్రమరం తిరగగా తిరగగా, కీటకం కూడా నెమ్మదిగా కొన్నాళ్ళకి భ్రమరంగా మారినట్టు, నాలో ఉన్న కీటకం ఈ బైరాగి కవిత్వం చుట్టూ ఈ 40 ఏళ్లుగా పరిభ్రమిస్తూ, తిరుగుతూ, గీ-పెడుతూ, వింటూ, నన్ను కూడా ఎక్కడో అది తనలాగా ఒక భ్రమరంగా మార్చుకుంటూ ఉందా, నాకు కూడా ఒక సున్నితమైన రెక్కల్ని పొదుగుతోందా అనే భావన కలుగుతుంది అన్నమాట నాకు.
అటువంటి ఆ మహనీయుడైన కవి గురించి, నేను ఈ ఎన్ని చెప్పినా తక్కువే. ఎందుకంటే, బైరాగి వంటి కవి గురించి ఎంత చెప్పినా, ఎంత వర్ణించినా, ఆయన ప్రభావాన్ని పూర్తిగా ఆవిష్కరించలేను. నిజమైన కవి అంటే, మనల్ని ప్రశ్నించే వాడు, మనలోని చీకటి మూలలను వెలికి తీసేవాడు, మన హితం కోసం నిరంతరం హెచ్చరికలు చేసేవాడు. బైరాగి అలాంటి కవి. ఆయన కవిత్వం తెలుగు జాతికి ఇంకా పూర్తిగా పట్టుబడనే లేదు. ఒక భాష ఏళ్ళ తరబడి, శతాబ్దాల తరబడి చేసిన తపస్సు వల్ల బైరాగి వంటి కవి పుడతాడు. ఈ మాట మా మాష్టారు పోతన్న గురించి అన్నారు. నేను బైరాగి గురించి అంటున్నాను. బహుశా బమ్మెర పోతన ఇరవై శతాబ్దంలో పుట్టి ఉంటే బైరాగి లాగా కవిత్వం రాసి ఉండేవాడు.