మరొకసారి గంగ నేలకు దిగింది

తన సుప్రసిద్ధ రచన The Gospel of Ramakrishnaలో (1942) మహేంద్రనాథ్ గుప్త మొదటి పేజీల్లోనే ఆసక్తికరమైన ఒక సంభాషణ నమోదు చేస్తాడు. అది తాను రెండవసారి పరమహంసని చూడటానికి వెళ్ళినప్పటి సంభాషణ. 1882లో ఇంకా చలి వీడని ఒక ప్రభాతవేళ, ఎనిమిదిగంటలప్పుడు. కొంతసేపు మాటలు నడిచాక, ‘ఎటువంటి పరిస్థితుల్లో సాధకుడికి దేవుడు కనిపిస్తాడు?’ అని అడిగాడు మహేంద్రనాథ్ రామకృష్ణుల్ని. అప్పుడు సంభాషణ ఇలా నడిచింది:

పరమహంస: నీ పరితప్త హృదయమంతటితోటీ భగవంతుడికోసం మొరపెట్టుకో, అప్పుడు కచ్చితంగా ఆయన్ని చూడగలుగుతావు. మనుషులు తమ భార్యాబిడ్డలకోసం కుండలకొద్దీ కన్నీళ్ళు కారుస్తారు. డబ్బు కోసం కన్నీటి ప్రవాహంలో ఈదులాడతారు. కాని దేవుడి కోసం కన్నీళ్ళు పెట్టుకునేదేవరు? ఆయన కోసం నిజంగా విలపించేదెవరు?

ఆ మాటలు చెప్తోనే పరమహంస ఒక గీతం గానం చెయ్యడం మొదలుపెట్టారు.

మనసా, నీ తల్లి శ్యామాకోసం విలపించు. నువ్వు నిజంగా ఎలుగెత్తి విలపిస్తే ఆమె నీకు కనిపించకుండా ఎట్లా ఉండగలదు? నీనుంచి దూరంగా ఎలా ఉండగలదు? నీ తల్లి కాళీమాత తనని తాను ఎట్లా ఆపుకోగలదు? మనసా, నీకు నిజంగా ఆతృత ఉంటే ఆమెకోసం బిల్వదళాలూ, మందారాలూ తీసుకురా, ఆమె చరణాల ముందు అర్పించు, వాటిమీద నీ ప్రేమచందన సుగంధం చిలకరించు.

గీతం గానం చేస్తూనే ఆయన “అట్లా అనుతాపం చెందడం ఒక ఉషోదయం లాంటిది. ఆ గులాబిరంగు ఉష ఉదయించాక, ఇక సూర్యుడు రాక తప్పదు. ప్రేమానుతాపం వెంటనే ఈశ్వర సాక్షాత్కారం తప్పనిసరి. ఒక లౌకికమానవుడికి సంపదలపట్ల ఉండే ఆకర్షణ, బిడ్డకి తల్లిపట్ల ఉండే అనురాగం, తనకి హృదయాన్నర్పించిన భార్యపట్ల భర్తకుండే ప్రేమాతిశయం, ఈ మూడు ఆకర్షణల్నీ ఒక్కచోట పోగేసి అంత గాఢంగా ఎవరు భగవంతుడికోసం పరితపిస్తారో అతడికి భగవంతుడు తప్పక కనిపిస్తాడు.”

“చూడవలసిందేమంటే, తల్లి బిడ్డని ప్రేమించినట్టుగా, భార్య భర్తని ప్రేమించినట్టుగా, ప్రాపంచిక మానవుడు సిరిసంపదల్ని ప్రేమించినట్టుగా భగవంతుణ్ణి ప్రేమించడం, ఈ మూడు ఆకర్షణల్నీ కలిపి ఆ సమస్తశక్తి తోటీ భగవంతుడి కోసం బెంగపెట్టుకున్నావా, అతణ్ణి తప్పక పొందగలుగుతావు. బెంగపెట్టుకోవడం, అదీ షరతు. ప్రేమపరితప్త హృదయంతో ఈశ్వరుడికోసం విలపించడం. పిల్లిపిల్లని చూడు. దానికి తెలిసిందల్లా, మ్యావు మంటూ తల్లిని పిలవడమొక్కటే. తన తల్లి తనని ఎక్కడ ఉంచినా దానికి సంతోషమే. ఒక్కొక్కసారి ఆమె దాన్ని వంటగదిలో దాస్తుంది. ఇంకోసారి నేలమీద వదిలేస్తుంది. మరోసారి పక్క మీద పడుకోబెడుతుంది. ఆ పిల్లిపిల్లకి బాగాలేకపోతే ‘మ్యావు’ అంటూ అరుస్తుంది. దానికి తెలిసిందదొక్కటే. కాని ఆ ఏడుపు వినగానే ఆ తల్లి ఎక్కడున్నా పరుగున వచ్చి దాన్ని తన అక్కున చేర్చుకుంటుంది.”

భారతీయ భక్తి సాహిత్యంలో శివుణ్ణి, విష్ణువుని స్తుతిస్తోనో, ప్రేమిస్తోనో కవిత్వం చెప్పడం మొదలైన ఎంతో కాలానికిగాని శక్తిని ఆరాధిస్తూ చెప్పే కవిత్వం రాలేదు. శ్రీమద్భాగవతం, నారద భక్తిసూత్రాలూ, నాయనార్లూ, అళ్వార్లూ, కన్నడ వచన కవులు, మహారాష్ట్ర సంత్ కవులు, ఉత్తరాది భక్తి కవులు దేవుడి పట్ల దాస్య, సఖ్య, శాంత, వాత్సల్య, మధురభక్తి భావాలతో కవిత్వం చెప్పిన చాలాకాలం తర్వాత, ఆయన్ను ఒక తల్లిగా భావించి ఆయన కోసం మొరపెట్టుకునే కవిత్వం ప్రభవించింది.

వేదాల్లోని వాగ్దేవి సూక్తం, ఉపనిషత్తుల్లోని ఉమా హైమవతి, ఇతిహాస, పురాణాల్లోని దేవి, బౌద్దుల తార, తాంత్రిక దశమహావిద్యల్లో కాళి ఒక ఉపాస్య దేవీమూర్తిగా భక్తికవుల హృదయాల్ని కొల్లగొట్టుకోడానికి పద్దెనిమిదో శతాబ్దిదాకా ఆగవలసి వచ్చింది.

అది కూడా బెంగాల్లో.

అందుకు ముందు 8-12 శతాబ్దాల్లో బెంగాల్లో వజ్రయాన బౌద్ధులు, సహజీయ భక్తిమార్గంలో కూర్చిన చర్యాగీతాలు ఉన్నాయి. ఆ గీతాలే బెంగాలీ, ఒడియా, అస్సామీ భాషా సాహిత్యాలకు ఆదికావ్యాలు. ఆ గీతాలు ప్రభవించిన వెయ్యేళ్ళకు కాళీభక్తి బెంగాల్లో సుస్పష్ట రూపంతో వికసించింది. బెంగాల్లో మహ్మదీయ పరిపాలనలోనూ, తదనంతరం ఈస్టిండియా కంపెనీ పాలనలోనూ, ఆధునిక బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవన కాలంలోనూ, కాళీభక్తి బెంగాల్‌ని ఏ విధంగా ప్రభావితం చేసిందో రేచల్ మెక్‌డెర్మాట్ అనే విదుషి Singing to the Goddess: Poems to Kali and Uma from Bengalలో (ఆక్స్‌ఫర్డ్, 2001) వివరించింది.

బెంగాల్లో వికసించిన శాక్తభక్తి గీతాల్ని ఆమె శ్యామ-సంగీత్, ఉమా-సంగీత్ అనే రెండు శాఖలుగా గుర్తిస్తూ, అందులో శ్యామ-సంగీత్ కాళీ భక్తికి సంబంధించిందని చెప్తూ, మొత్తం 37 మంది కవుల రచనలనుంచి 164 గీతాల ఇంగ్లీషు అనువాదాల్ని సంకలనం చేసింది. చర్యాగీతాలనుంచి శాక్తగీతాలదాకా నడిచిన ప్రయాణంలో, నవ్యశాక్తగీతాల మీద మధ్యయుగాల కృష్ణభక్తి గీతాల వైష్ణవ పదావళి ప్రభావం పడిందని కూడా ఆమె గుర్తు చేస్తుంది.

గ్రామీణ బెంగాల్ క్షామంలో, ఎడతెరిపిలేని యుద్ధాల్లో, కరవుల్లో, మహమ్మారుల కోరల్లో చిక్కుకుపోయినప్పుడు, బెంగాలీ భక్తికవికి కాళీమాత ఒక్కతే నిజమైన ముక్తిదాయినిగా ఎలా కనిపించిందో కూడా ఆమె సోదాహరణంగా వివరించింది. గ్రామీణ బెంగాల్ ఆధునీకరణ చెందుతున్న క్రమంలో కూడా కవి తన మాతను ఎక్కడికక్కడ కనుగొంటూనే ఉన్నాడు. చివరికి బెంగాల్లో రైలుమార్గం పడి, రైల్లో ప్రయాణించినప్పుడు కూడా, కల్యాణకుమార్ ముఖోపాధ్యాయ అనే శాక్తభక్తి కవి, తన రైలు ప్రయాణాన్ని కూడా కాళీభక్తితో పోల్చుకోకుండా ఉండలేకపోయాడు. పందొమ్మిదో శతాబ్దికి చెందిన రామ్‌ప్రసాద్ సేన్, కమలాకాంత్ భట్టాచార్య, ఇరవయ్యవ శతాబ్దికి చెందిన నజ్రుల్ ఇస్లాం, మహేంద్రనాథ భట్టాచార్య, దీనారామ్‌ వంటి కాళీభక్తి కవులు లేకపోతే ఆధునిక బెంగాల్ సభ్యత, సంస్కృతి ఎలా ఉండేవో మనం ఊహించలేం.

తక్కిన భారతీయ భక్తి కవిత్వంలో, తమిళ, కన్నడ, తెలుగు, మరాఠీ, హిందీ కవిత్వాల్లో ప్రముఖంగా కనిపించని కాళీ భక్తి బెంగాల్లోనే ఎందుకు విస్పష్టంగా వికసించింది? ఒక కారణం, అక్కడ మొదటనుంచీ, మాతృదేవతారాధన ప్రముఖంగా ఉండటమూ, వజ్రయాన బౌద్ధం ప్రభావమూ అని చెప్పవచ్చు. కానీ, మధ్యయుగాల్లో కాకుండా ఆధునిక యుగంలో, గత రెండున్నర శతాబ్దాల కాలంలోనే బెంగాలీలో అంతమంది శాక్త కవులు ఎందుకు ప్రభవించారు?

ఈ రెండవ ప్రశ్నకు సమాధానమివ్వాలంటే, మాతృదేవతారాధన గురించిన ఇటీవలి పరిశోధనల వైపు మనం చూడాలి. Fierce Feminine Divinities of Euracia and Latin America (2015) అనే ఒక ఇటీవలి పరిశోధనలో ఆ గ్రంథ రచయిత్రి మాల్గొర్సాతా ఓలెష్కొయీవిచ్-పెరాల్బా కాళితో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాలుగు దేవతారాధనల్ని పోలుస్తూ కొన్ని కొత్త కోణాల మీద వెలుతురు ప్రసరింపచేసింది.

అందులో కాళీమాతను ఆమె సమాజంలో నిర్లక్ష్యానికీ, నిరాదరణకీ గురైనవారికి ఆశ్రయమిచ్చే దేవతగా గుర్తించింది. భారతీయ దేవతల్లో శివుడు నిర్వహించింది కూడా ఈ పాత్రనే. వైదిక రుద్రుడు, పురాణాల్లోని శివుడూ కూడా ప్రధానంగా peripheryకి చెందిన దేవతలు. అప్రధానీకరణకు లోనై, సమాజ కేంద్రానికీ, సాధికారికతకూ దూరమైనవారికి శివుడు అభయప్రదాత. ఆయన స్మశానాల్లో సంచరించడం, ఆయన్ని తస్కరుల అధిపతి అని వేదం కీర్తించడం కూడా ఇందుకే. శివుడు నిర్వహించిన పాత్రనే స్త్రీరూపంలో కాళి నిర్వహిస్తూ ఉంది. శివుడు కాలుడు, కాళి కాలి.

మరొక పార్శ్వంలో, జీవితంలో ఒక ప్రధానమైన దశ దాటి మరొక ప్రధానమైన దశలోకి అడుగుపెట్టే ముందు, ఒక సంధిదశలో ప్రయాణించేవారికి కూడా కాళి ఆరాధ్యదేవతగా మారుతుందని పై పరిశోధన చెప్తున్నది. ఈ భావనను ఆమె liminality అనే పదం ద్వారా పరిచయం చేస్తుంది. అంటే ఒక విధమైన in-betweenness అన్నమాట. జీవితవైరుధ్యాల మధ్య, జీవన్మరణాల మధ్య, జయాపజయాల మధ్య చిక్కుబడ్డ మనుషులకి అభయప్రదాతగా కాళి సాక్షాత్కరిస్తుంది. ఆ వైరుధ్యాల సంఘర్షణ ఎంత తీవ్రంగా ఉంటే కాళి సాక్షాత్కారం కూడా అంత ప్రకాశమానంగా ఉంటుంది. పద్దెనిమిది, పందొమ్మిది శతాబ్దాల్లో భారతదేశంలో బెంగాల్ అటువంటి తీవ్ర వైరుధ్యాల మధ్య నలిగిపోయింది కాబట్టే, అక్కడ కాళీ భక్తి గీతాలు అంత ఎలుగెత్తి వినబడ్డాయని మనం అనుకోవచ్చు.

ఇప్పుడు, ఇంద్రాణి వెలువరించిన ఈ ‘కాళీ పదములు’ చూస్తే నాకిదే అనిపించింది. అన్నిటికన్నా ముందు ఇందులో రామకృష్ణులు చెప్పిన ప్రగాఢమైన అనుతాపం కనిపిస్తున్నది. తల్లికోసం బిడ్డ ఎంత తపిస్తుందో, బిడ్డకోసం తల్లి ఎంత ఆరాటపడుతుందో అంతా ఇందులో ఉంది. పుస్తకం తెరుస్తూనే మొదటి వాక్యం:

నల్లని గంగ
గొంతుకలో ఊగే
నాలిక

ఇక్కడ గొంతు, నాలుకా ఉన్నా, అవి మాటలకోసం పెనగులాడటంలేదు, మాటల్ని మించిన దర్శనాన్ని చూపిస్తున్నాయి. కాళీదేహమంతా నల్లని గంగ అనడంలోనే ఇది మామూలు కవిత్వం కాదనీ, ఈమెకి కాళి ఛాయామాత్రంగానైనా, సుదూరంగానైనా, అస్పష్టంగానైనా గోచరిస్తున్నదని నమ్మకం కలుగుతున్నది.

నల్లని గంగ

ఏమి పదబంధం! ఆమె దేహం ఒక స్థిరరూపం కాదు. ఆమె కాలి కాబట్టి ప్రవాహ సదృశం. ఆ దేహం తనకై తాను పునీతం. గంగ, కాని తనను చేరవచ్చిన ప్రతి ఒక్కరినీ పునీతమొనర్చేదే. మరి నల్లని అనే విశేషణం ఏమిటి? నల్లని గంగ అంటే సంధ్యవేళ గంగ, ఆ నలుపు గంగది కాదు. కవయిత్రి ఆమెని చూస్తున్న వేళది. కవయిత్రి ఒక సంధి దశలో ఉన్నది కాబట్టి ఆమెకి గంగ నల్లని గంగగా కనిపిస్తున్నది. కాని ఆ నాలుక ఎర్రనిది. ఎర్రనిది కాబట్టే, ఆ నల్లని వేళ కూడా అది కనిపిస్తున్నది. నాలుక ఎర్రగా ఎందుకుంది? రక్త దాహం వల్లననేది పురాణాలు చెప్పే విశేషం. కాదు, ఆ రక్తిమ, రక్తి రక్తిమ, ప్రేమ రక్తిమ, జీవనరక్తదాన రక్తిమ.

మీరు పుస్తకం తెరవగానే ఎదురయ్యే మొదటి కవితలోనే ప్రతి ఒక్క దృశ్యం ఇంత ప్రగాఢంగానూ, ఇంత రసజ్వలితంగానూ, ఇంత రసోద్దీప్తంగాను ఉంది.

రెండవ కవిత చూడండి:

లోకపు పచ్చి వాసనలని
కప్పిపెడుతున్న
రాత్రి

వాసన దృగ్విషయం కాదు, ఆఘ్రాణవస్తువు. అటువంటిదాన్ని రాత్రి ఎలా కప్పిపుచ్చగలుగుతుంది? వాసన అణచవలసింది. కప్పిపుచ్చేది కాదు. కాని అది పచ్చి వాసన. ఆ పచ్చి అన్న మాటలో ఉంది కవిత్వమంతా. రాత్రి కప్పిపుచ్చుతున్నది ఆ పచ్చితనాన్ని.

ఇలా ప్రతి ఒక్క కవితకీ, ప్రతి ఒక్క వాక్యానికీ, ప్రతి ఒక్క పదబంధానికీ పలవరిస్తూ ఏమేమో రాయాలని ఉంది. కాని ఈ పుస్తకానికి పరిచయకర్తగా నాకు ఇంతకన్నా ఎక్కువ అధికారం లేదు.

తెలుగులో, అందునా వచనకవిత్వంలో మనకి భక్తి కవిత్వం దాదాపుగా లేదు. చలంగారి ‘విన్నపాలు’, ‘యశోదా గీతాలు’, ‘సుధ’, తర్వాత అంత ఆర్తితో, అంత ఆరాటంతో భగవంతుణ్ణి పిలిచిన పిలుపు లేదు. శాక్తకవిత్వం ఒక వరదలాగా పొంగిన బెంగాల్లో కూడా కవులు కనిపించినంతగా కవయిత్రులు లేరు. కాళీగీతాల్ని ఇంగ్లీషులోకి అనువదించి సంకలనం చేసిన పుస్తకంలో కూడా 37 మంది కవుల్లో నలుగురు మాత్రమే కవయిత్రులు.

అటువంటిది, ఇప్పుడు ఈ 21వ శతాబ్దంలో, అది కూడా అమెరికాలో ఉంటున్న ఒక తెలుగు కవయిత్రి ఈ ‘కాళీపదములు’ ద్వారా గంగాజలంతో తెలుగు కవిత్వాన్ని పరిశుద్ధం చేసింది.

ఈమె జీవితంలో ఏ ఉత్పాతాల్ని, ఏ సంక్షోభాల్ని, ఏ వైక్లబ్యాల్ని ఎదుర్కొన్నదోగాని హృదయాన్ని గొంతుగా మార్చి తల్లిని పిలిచింది. ఆమె తల్లినెట్లా ఆవాహన చేసిందో ‘ఆవాహన’ కవితలో ప్రతి ఒక్క వాక్యం ఒక ప్రకంపనగా సాక్ష్యమిస్తుంది. వట్టి ఆవాహనా, వట్టి పిలుపూ, వట్టి ఆరాటమే కాదు, ఆమెని తల్లి ఎట్లా కరుణించిందో కూడా ఈ కవిత్వం మనకి ఆనవాలు పట్టిస్తున్నది. ఈ కవిత చూడండి:

ఒక్కసారి
బురదలో పడితే
కడుక్కునే వీలే లేదా?
అడిగాను దిగులుగా.

మెరుపులా నవ్వి
ఆ బురదా నేనే
అన్నది తల్లి
నల్లమబ్బుల్లోంచి
జలజలవర్షం
కురిపిస్తూ.

మరొకసారి గంగ నేలకు దిగింది. అమ్మా ఇంద్రాణీ! నువ్వు ధన్యురాలివి. నీ కవిత మాపై ప్రవహించి మేము కూడా ధన్యులమవుతున్నాం.

(విజయవాడ, ఏప్రిల్ 2019)

[పాలపర్తి ఇంద్రాణి కవితాసంపుటి కాళీపదములు ప్రచురణ సందర్భంగా ఆ పుస్తకం నుంచి ముందుమాట – సం.]