చీకటి నీడలలో బైరాగి జాడ

“అనంతసాగరంలో విలయఝంఝ, చిల్లి పడవ
కాళరాత్రి జీవితయాత్ర
ప్రొద్దు పొడవదు, కూచునేందుకు వీలులేదు.
ఒంటరిగా ఒంటరిగా మంటల్లో మంటల్లో
పయనిస్తున్నాడు నరుడు
తానెరుగని దిక్కుకేసి”

జీవితం పట్ల ఈ అసంతృప్తి బైరాగి కావ్యశరీరానికి ప్రాణదానం చేసింది. కాని అది మమత్వవిరహితమూ, సార్వజనీనమూ అయిన భావచ్ఛాయ కావడం చేత వైయక్తికపరిధిని దాటి సమస్తభావంగా రూపొంది ఆయన మనోభివ్యక్తి కవితాత్మకతను సంతరించికొన్నది. స్థూలంగా పరిశీలిస్తే ఆయన జీవిత సత్యానికి, కావ్యప్రగతమైన సత్యస్వరూపానికి అస్తినాస్తిమధ్యస్థంగా ఉన్న విభేదాన్ని తార్కికంగా గ్రహించినట్లే కనబడుతుంది కాని, ఈ గ్రహణం ఆయనకు లౌకిక సత్యజిగ్రహిషతో అలవడినది కాదు. నిత్యకల్లోలితమనస్కతతో ఆయన అణువు నుంచి బ్రహ్మాండందాకా చీకటి కూకటి వేళ్ళ వాటికలను చూశాడు:

“జీవితమిట కటుమృత్యువు
జీవితమిట అకృత్యం
జీవితమిట ఒక దుస్తర ప్రస్తర హస్తపు సత్యం …”

జీవితం నగుమోముతో వినిపించిన అభేరి కాదు; ప్రశాంతసాగరంలో నిరతాశాంతరాగమాల. విరాడ్విశ్వమందిరాల కవాటాలు మూసిన ధ్వని. ఆ అనుభవాల పరిష్కరణలో విషాదమే కావ్యాత్మ.

బైరాగి జీవితాన్ని ప్రేమించలేదనడం నిగ్రహస్థానంగానే కనబడుతుంది. అయినా, ఆవేదనల అనంతంలో అంతమైన జీవితాల విషాద స్వానుభవం ఆయనకు ఆధిభౌతికంగా కలిగే ఉండాలి. “అంధాత్మల అధినివేశపు లోతుల్లో పాతుకపోయి, పగటి చుక్కలు చూచాక మూగగొంతులు విన్నాక, ఆశల పాఠం నేర్పుతుంది నీ నిరాశ …” అన్నప్పుడు స్పష్టాస్పష్టంగా ప్రదర్శితమయ్యే అనుభవానుభూతి మనను చకితం చేస్తుంది. ఆయనే ముందు నిలిచి — “కూకటి వేళ్ళ రహస్యాలు తెలిసిన తరువాతనే, తెలిపూవుల తొలిపలుకులు వినవస్తాయ్ నీ చెవులకు …” అని స్వాత్మసాక్షాత్కారం చేసినప్పుడు ఈ విషయం ప్రద్యోతమౌతుంది.

ఈ విషాదానుభూతి బైరాగి కవిత్వంలో తీవ్రమైన అభినివేశంతో కూడివుంటుంది. అది కాల్పనికోద్యమం కాదు. స్వచ్ఛమైన అనుభూతి. ఆయన చిత్రించిన ‘నేను’ — స్వార్థతాపరిధిని అతిగమించి తదాత్మభావయోగ్యంగా పరిణమించింది. ఇది ఉద్దేశిత సుజ్ఞాతం కావడం చేత లోతైన ఎరుకతో ఆయన తన రచనాశిల్పాన్ని ప్రయత్నపూర్వకంగా నిర్ఛేద్యం చేశాడు. బైరాగిలో ప్రతిబింబించిన ఈ ‘నేను’- ఆగాధపు అంచున నించున్న ప్రతిజీవీ కొలువుతీరిన సింహాసనం. “నిశాచ్ఛన్న కూహాపన్న కజ్జలాసిత తిమిరకూపం”లో సర్వసభ్య సమావేశం. ఆయన మాటల్లో “మానవుని అనుభూతిలో కవి తాదాత్మ్యం” అది.

పర్యాయపదాల్లో చెప్పాలంటే ప్రపంచం బాధ అంతా ఈ “నేను” పడే బాధే.

వేదనా నివేదనం బైరాగి కవితలో జీవిత విషాదానుభవానికి ఉత్తర రంగ సంఘటన కాగా, దాని పూర్వభాగానికి బైరాగి జీవితంలోని అవ్యవస్థే కారణమని అనిపించక మానదు. అవ్యవస్థ ఆయన మనోభావనలో ఉన్నది కాదు, వ్యవస్థలో ఉన్నది. అది ఆయన అంతరంగంలో నుంచి బహిరంగం కాలేదు: బహిరంగం నుంచి అంతరంగంలోకి అలముకొన్నది. అది వాస్తవ చిత్రణ. పరివర్తిత విశ్వం కాదు. అందుకే ఆయన పుంఖానుపుంఖ శంఖాల మంటలు ఘంటలా పలుకగల మానవ గీత ఆలపించే కంఠం కావాలని కోరుకొన్నాడు. ఈ విషాదానుభవం సహజగతం కాక వ్యక్తినిష్ఠం అయివుంటే బైరాగి ఏమి వ్రాసేవాడో ప్రస్తుతం అప్రస్తుతం.

బైరాగి రచనలను అర్థం చేసుకొన్నప్పుడు ఆయన నిజజీవితంలో లాగానే కావ్యజీవితంలో కూడా నిర్మలినమూ, నిష్కలుషమూ అయిన సరళమూర్తి సాక్షాత్కరిస్తుంది. ఆయన శబ్దసందర్భం ప్రశాంత రమణీయంగా ఉంటుంది. ఆవేశపు కొసమెరుపులలో కూడా ఆది జాజ్వల్యమానంగా ఉండదు. ఆముదపు వత్తిలా మెత్తగా వెలుగుతుంది. ఆయన ఎక్కడ ఉన్నా వివాదాలకు లోనై కూర్చున్న కొమ్మను నరికేవాడని అంటారు. ఆయన ఆశించిన ఆదర్శ శిఖరాల వెదుకులాటలో ఆయనకు అస్తిత్వనాశం కూడా ద్వితీయాంశంగానే కనిపించేదనుకుంటాను. ఈ లక్షణం ఆయన కవితలలో కూడా సర్వాత్మగతంగా గోచరిస్తుంది. భావపు కుదుళ్ళలో నుంచి మొలక వెయ్యనప్పుడు ఆయన కవితలలో నిర్జీవచిత్రాలకు నీరుపోయడం చేయడు. భావావేశం అతివేలమైనప్పుడు శబ్దసంఘటనను శిథిలం చేయడానికి వెనుకాడడు. పటిష్ఠమైన సంస్కృతసమాసాన్ని నిర్మించినప్పుడు, జానుచక్కటి తెలుగు పదాన్ని చేసినప్పుడూ ఆయన ఏకభావంతో నిర్మలంగా కూర్చడం కనుపిస్తుంది. ఈ స్వానుభవయుక్తి ఆయన కవిత్వానికి ప్రగాఢతను, సహజగాంభీర్యాన్ని సమకూర్చిపెట్టింది.

జీవితంలో సుఖదుఃఖాల ద్వైతభావన కల్పితం అని నిర్ణయించుకొన్నాక, ‘ఎరిగిన సుఖమే దుఃఖ’మని తెలిసి, “తప్పొప్పుల నిర్ణయమిట దుస్సాధ్యం, మానవునకు క్రియ ఒకటే ఆరాధ్యం” అని నిర్వచింపగలిగిన బైరాగి, ‘మనస్సాక్షి గుసగుసలో ప్రేతపు ‘వెక్కిరింత’లకు భమపడి వెనుకంజ వేయడం ఆశ్చర్యంగానే ఉంటుంది. ఆయన కవితలలో పూర్వాపర విరోధాలకు కాలానుగుణమైన మార్పు కారణం కాబోలు. అంతేకాక ఆయనకు ఆయా సమస్యల బహిరంతస్స్వరూప తత్త్వదర్శనంలో ఉన్నంత అభినివేశం వాటి పరిష్కారమార్గాలను అన్వేషించడం పట్ల ఉండేది కాదనుకుంటాను. భావకవులలాగా సుఖదుఃఖాల కలుపుగోరుతనాన్ని అభిమానించినా, విషాదానుభూతి ఆయనకు వరణీయం కాలేదు. అభ్యుదయ కవులలాగా ప్రజాస్వామ్యాన్ని అభిలషించినా, దాని ఆవాహన క్రమపరిగతి ఆయనకు సూచనీయం కాలేదు.

అవ్యవస్థావిజిగీష బైరాగి కావ్యజీవితానికి ఊపిరి పోసింది. జీవితంలోని ద్వంద్వభావాల వాస్తవత్వజిజ్ఞాసతో అంతర్ముఖుడై ఆయన మౌనసరస్సులో అఘమర్షణ స్నానం చేశాడు: “దేవర లేని దేవళంలో రేవులులేని సంజవేళ, చివికిన మోజు బూజు నడుమ, విడువని జ్ఞాపకాల గబ్బిలాల, రెక్కల రెపరెపలో, కీచురాళ్ళ రొదల సొదలో, వగపుల నల్లమందు మత్తులోంచి, ఎండుటాకులు నలిగే సడి వెనుక, దూరమయే అడుగుల సవ్వడి వెనుక” ప్రతిధ్వనిస్తున్న సత్యానికై అన్వేషించాడు. అయినా, గమ్యం ఆయనకు మృగ్యంగానే మిగిలిపోయింది. ఆ రోజులలో వ్రాసిన పద్యాలలో ఆయన స్వాత్మ సాక్షాత్కారం చేసుకొన్నాడు:

“నిద్రామంత్ర విమూఢ విశ్వహృదిలో నిర్ణిద్ర గూఢవ్యధా
గ్న్యద్రిక్షోభము, జీవిత జ్వరచిరా ర్తాంతః ప్రలాపస్వన
మ్ముద్రేకావిల భావనా తటిని, నృత్తోన్మత్తరేఖాకృతుల్
రుద్రస్థానచరన్నిశాచరములై రోదించు దుశ్చింతనల్.

నిద్రానీలనభోంగణాన విచలన్నిస్తంద్ర తేజోనట
న్ముద్రాలంకృత దిగ్దిగంచములై మూర్తీభవన్మోద సం
పద్రాజద్బహువర్ణఘూర్ణితములై పక్షానిలావేగ జా
గ్రద్రాగారుణ హృద్రహః పథములై కన్పట్టు స్వప్నావళుల్.”

ఈ విధంగా నైరాశ్యభావనను తెనిగించినప్పుడు గోచరించే బైరాగి జీవలక్షణం, “ఆశాంతాల ఊహాంతాల ప్రాంతంలో, అగణిత గ్రహాల ఉపగ్రహాల అంతరాళధ్వాంతంలో, అనంతాంతరిక్షంలో జీవన పరమావధుల సమక్షంలో, గర్వంగా నిలిచిన నరుడు సుపర్వులపై సవాలు చేస్తున్నాడు, అమరుల కోటలోన పాగావేస్తున్నాడు. సోదరా! చింతలేదు ఏ మాత్రం వింతకాదు, మానవ మేధా విజయ పరంపరల కంతం లేదు” అని సమాశ్వాసించినప్పుడు కాలవాహినిలో చిరపథ్యాగతుడుగా ఆయన పయనించిన దూరాన్ని విచిత్రంగా ప్రతిస్పందిస్తుంది. అసంప్రజ్ఞాతమైన ఆయన కావ్యగౌరవాన్ని ఇమ్మడి ముమ్మడి చేస్తుంది.

బైరాగి రచనాశిల్పం చాలా పరిమితంగానే, నిబిడమై ఉంటుంది. ఆధునిక కవులలో ఉక్తివైచిత్రిని ఆశ్రయించని అతిస్వల్పసంఖ్యాక కవులలో ఈయన కూడా ఒకడు. శబ్దసౌభాగ్యానికి ఆయన ఆద్యంతమైన తావు చూపడు. శిథిలబంధం భావాభివ్యక్తిలో ముఖ్యాంగంగా వ్యవహరించడం కూడా ఆయన కవిత్వంలోని ఒక విశిష్టాంశం.

నైరాశ్యసంస్కృతమైన బైరాగి అనుభవాభివ్యంజనం భావానురూపమైన సందర్భంతో పొదిగి ఉంటుంది. అతీవగాఢమైన భావం కూడా అతిసహజమైన, స్పష్టమైన ఆయన శైలిబంధంలో రమణీయతరంగా భాసిస్తుంది. ఉత్తరోత్తరాన్వయంతో గేయానికి చిత్రిక పట్టడం ఆయన ఆత్మప్రగాఢంగా అభ్యసించాడు. ఒక్కొక్కసారి ఆయన కల్పనలోని పూర్వపరపదగుంఫనం ఆశ్చర్యావహంగా ఉంటుంది:

“ప్రతిమనిషీ ఒక గదిలో, చెదపురుగులు ప్రతి మదిలో,
ప్రతి మనిషీ ఒక నదిలో, సుడిగుండం ప్రతి ఎదలో,
ప్రతిమనిషీ ఒక చెరలో, ఉరికంబం ప్రతి హృదిలో,
ప్రతిమనిషీ ఒక మరలో, మరమేకులు ప్రతి ఎదలో,
ప్రతి మనిషీ ఒక సెగలో, పొగగొట్టం ప్రతి మదిలో,
ప్రతి మనిషీ ఒక పొదలో, బెబ్బులి రొద ప్రతి హృదిలో…”

ఇందులోని భావతీవ్రత, కల్పనలోని పెరిమె, గమనించదగిన అంశాలు. ఆయన కవితలలోని నిర్వచనాభ వాక్యనిర్మాణం చెప్పుకొనదగిన మరొక ధనధ్రువం. “ఒకటి, వెలుగు కొరకు వేచియుండి విజయఫలసాధన; రెండు, కటికి చీకటిలో దూరదృష్టి సంపాదన, ఒకటి నీలి ఆకసంలో ఎగిరే పులుగుల త్రోవ, రెండవది మురికిమంటిని మింగే పురుగుల త్రోవ” ఇందులోని వాక్యాదిపదశిల్పం చూడదగింది. ఆధునిక కవులకు అపరిగ్రాహ్యతరమైన తెలుగు వాక్యనిర్మాణం బైరాగి కవితలలో కనిపించే ప్రముఖాంశం. లయాత్మకతను ఆయన అంతగా ఆశింపడు కాని, “గహనమానసకాననంలో చిక్కుతీవెల తలపు గుబురులు, సూర్యరశ్ములు సోకవిచ్చట సడులు ఆకుల గాలికబురులు, ఎప్పుడూ నడిరేయి చీకటి జడలు విచ్చిన కాననంలో, భీతి తప్పక ప్రతిఫలించదు హరిత ప్రకృత్యాసనంలో…” వంటివి ఉద్దేశిత సుజ్ఞాతాలని ముందే వ్రాశాను.

బైరాగిది కవితాశిల్పం కాదు. రచనాశిల్పం, కవితాశిల్పం ఏకదేశపర్యాప్తమైన ఉక్తివైచిత్రిలో అంతర్లయిస్తుంది. రచనాశిల్పం ఆద్యంతహేలగా ఉండే కూర్పు. వాగర్థసంపృక్త భావబంధురమైన తీర్పు. దానికి కడలికెరటంలా ఆటుపోటులుండవు; అవిచ్ఛిన తైలధారగా ప్రవహించే సమతానిర్ఝరి అది. ఇందుకు ఆయన రచనలన్నీ ప్రత్యక్షరసాక్ష్యాలే. “ఏడ్చేవాళ్ళను పూడ్చేయండీ, నవ్వే లతలను త్రవ్వేయండి” ఇది అవతారిక. “వినాశసుందర రూపం, వీక్షించినవాడెవడూ, వికాస జడస్తూపం, రక్షింపబూనడెవడూ” ఇది ఉద్దేశం. “జుగుప్స మన ఆదర్శం, ప్రేయసి మన విధ్వంసం” ఇది మంగళమహాశ్రీ. ఆ మధ్యనున్నది భావబంధురమైన కవితాబంధం. దానికితోడు అన్యభారతీయ భాషాపరిచయం ఆయన వాక్యనిర్మాణం, సమాస కల్పన భావధోరణులను ప్రభావితం చేయడం కనుపిస్తుంది. “ప్రభాపూత పరమ ప్రాతశ్శాంతి గాని, రాకేందు సుధానందపు నిర్ద్వంద్వ కాంచన కుందకాంతి గాని.” ఇది దేశీయ సమానం కాదు. ఈ గ్రథనంలో లక్షణజ్ఞానం కంటె లక్ష్యవేతృత్వప్రభావం ఎక్కువ. పాఠకులను మధ్యమపురుష బహువచనంలో సంబోధిస్తూ నడుమ నడుమ ఆ సంబోధనను పునరావృత్తం చేయడం, వర్ణనీయాంశాన్ని పేర్కొని దాన్ని పలుచోట్ల ద్విరుక్తం చేయడం, అనుభయతాద్రూప్య రూపకంతో విశ్వాన్ని, విషాదాన్ని జతకట్టి వర్ణించడం — ఇవన్నీ బైరాగి కవితాశిల్పంలోని బహుముఖాలు. సాధారణంగా ఈ కల్పనలో పూర్వాపరవిరోధం ఉండదు. కొన్నిచోట్ల ఆయన వాక్యాలు ఉక్తివైచిత్రిమూలకాలై హృద్యంగా ఉంటాయి: “నిదరబోతున్నాయి వాడిన పువ్వుల్లో ఆశలు, మొగ్గలో నిరాశలు”; “దస్తావేజే లేదే, దస్తూరెలా స్వహస్తం” వంటివి ఉదాహరణీయాలు. “కొన్నిచోట్ల ఆయన రెండు విభిన్నాంశలను ఒక్కచోటికి తెచ్చే తీరు చూడాలి: “అంధకారసాగరాన పయనించిన ఓడల గురుతులుండవు, వల్లకాటి మునివాకిట నాటిన మొక్కలు పండవు” అని.

తాత్కాలికమైన ఆవేశంలో బైరాగి రకరకాలుగా ఆలోచించేవాడనుకుంటాను. కమిట్‌మెంట్ — నిబద్ధత అన్నది స్థిరంగా ఉండేది కాదేమో. “నాకు చాలునొక కిరణం, ఒక దుర్బల కాంతి కణం, ఈ మృణ్మయదీపంలో, ఒక నిముసపు ప్రజ్వలనం” అనే ఆలోచించేవాడేమో. అయినా రాను రాను ఆయన ఆశావాది అయ్యాడనడానికి ఆధారం తరువాతి రచనల్లో ప్రస్ఫుటమౌతుంది.

స్వానుభూతమైన విషాదమేఘాల బహుముఖీన కాంతులను గాఢంగా పరిశీంచి, పదసంఘటనను పరిపుష్టం చేసుకొని ఆయన ఒక ప్రత్యేకమైన శైలిని సంతరించుకొన్నాడు. తెలుగు సాహిత్యంలో ఆయన స్థానం దీనివల్లనే సుస్థిరం అయింది.

జీవితాన్ని, కవిత్వాన్ని ఆద్వైతంగా పండించుకొన్న మహాదృష్టశాలి ఆయన.

అర్ధాయుష్కుడైన మూడేళ్ళకే శ్రీ ఆలూరి బైరాగి నిజంగా అర్ధాయుష్కుడు కావడం శోచనీయం. నిత్యప్రత్యగ్రమైన సంస్మృతితో తెలుగుదేశం ఆయన ఋణాన్ని తీర్చుకోవలసి ఉంది. మరి కాలం ఎంత నిరవధికమో, పృథ్వి ఎంత విపులమో వేచి చూడ వలసిన విషయం.


ఏల్చూరి మురళీధరరావు

రచయిత ఏల్చూరి మురళీధరరావు గురించి:

ఎనిమిదో తరగతిలోనే ఆశువుగా పద్యం చెప్పి బాలకవి అనిపించుకున్న మురళీధరరావు ‘నయాగరా’ కవుల్లో ఒకరైన ఏల్చూరి సుబ్రహ్మణ్యంగారి పుత్రులు. మద్రాసులో పి.యు.సి. పూర్తయ్యాక విజయవాడ ఎస్‌. ఆర్. ఆర్ కళాశాలలో డిగ్రీ చేశారు. భీమవరం డి.ఎన్.ఆర్. కళాశాలలో ఎం.ఎ. తెలుగు పూర్తి చేసి, ఆపైన మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ద్రోణపర్వం మీద ఎం.ఫిల్ పట్టా తీసుకున్నారు. గణపవరపు వేంకట కవి ప్రబంధ రాజ వేంకటేశ్వర విజయ విలాసంలోని సాహిత్య లక్షణ చిత్రకవిత్వాలపై పరిశోధించి కొర్లపాటి శ్రీరామమూర్తి వంటి గురువుల నుంచి “తెలుగులో వెలువడిన ఉత్తమోత్తమ పరిశోధనా గ్రంథాలలో తలమానికం” అన్న ప్రశంస పొందారు. విజయవాడ ఆకాశవాణిలో నాలుగేళ్ళు, ఢిల్లీ శ్రీ వేంకటేశ్వర కళాశాలలో 38 సం॥లు పనిచేశారు. ‘వాఙ్మయచరిత్రలో కొన్ని వ్యాసఘట్టాలు – మరికొన్ని విశేషాంశాలు’ వ్యాస సంపుటి ఇటీవలి రచన.

 ...