నేల మీద కాదు, మేజాబల్ల మీద నిలబడి, పుస్తకంలోని ఒక్కొక్క కాగితాన్నీ చింపిపారేస్తూ, గొంతు చించుకుంటూ, ‘sucking the marrow out of life’ – కవితాపఠనం చేయమంటాడు కదా జాన్ కీటింగ్ (‘Dead Poets Society’- 1989 సినిమా); ‘I sound my barbaric yawp over the roofs of the world…’ అంటున్న వాల్ట్ విట్మన్ స్ఫూర్తితో తన స్టూడెంట్స్‌ని రెచ్చగొడతాడు కదా ఆ ఆదర్శ ఉపాధ్యాయుడు! – ఆ దృశ్యాన్ని చూసినప్పుడు ఒక స్వకీయమైన déjà vu స్ఫురించింది నాకు — బైరాగిని ఆవాహన చేసుకోవడానికి ఆయన కవిత్వాన్ని నేను తరచూ ఎలుగెత్తి చదవడం!
“… ఘూర్ణితార్ణవ తాడితం ఈ మనుజ హృదయపు చిన్ని ద్వీపం
నిశాచ్ఛన్నం కుహాపన్నం కట్టలాసిత తిమిరకూపం
దిక్కు దోచదు, ఎక్కడున్నది స్పర్శమణి జీవిత మహాఘృణి
ఈత్గమీవైతరణిపారం చేరగల వరతరణి తారణి
వెలుగు లెక్కడ సోనియా!”
“ఆరతి వెలిగించే దెవరు? కుష్ఠురోగి కౌగిలి నాదనగల వారెవ్వరు?
ఆమ్రపాలి ప్రేమికులెవరు? చుంబించిన హస్తానికి ద్రోహులు కాని వారెవ్వరు?
శిలువ మోయగల వారెవరు?
శూలాగ్రాన్నధిష్ఠించి ‘ఆనలహక్’ అని ఖంగున మ్రోయగల వారెవ్వరు?
…
ఏడీ, అపరాజేయ మానవేయుడు?
జితేంద్రియుడు, వీతభయుడు, మృత్యుంజయుడు;
…
జగతీవిషసారపాయి, సంతత శూలాగ్రశాయి…”
నా అనువాదం, నా అనుశీలన
బైరాగి కవిత్వోపాసకుల్లో బహుశా anthropophagic సహదేవుని అంశ ఉంటుందేమో అనిపిస్తుంటుంది. మరొక పోలిక చెప్పాలంటే, Ray Bradbury నవల ‘Fahrenheit 451’ లో ‘బుక్ పీపుల్’ ఉంటారు, తమని తాము పుస్తకాలుగా మార్చేసుకునే ఒక రహస్య కూటమి. ఆ రాజ్యంలోని ప్రజల్లో ఆలోచనలు పుట్టకుండా అణిచేయడానికి పుస్తకాల్ని తగలబెట్తుంటారు. దానికి వ్యతిరేకంగా పోరాడే ఆ రహస్య సంస్థ తిరుగుబాటుదారులు – ‘బుక్ పీపుల్’- తామే పుస్తకాలుగా మారిపోతుంటారు. అంటే, ఆయా పుస్తకాల్లోని ప్రతి అక్షరం, పాదం, పద్యం, కథ, ఫిలాసఫీ అంతర్నిహితం చేసుకొని, ఆ గ్రంథాల్నే తమ ఉనికిగా చేసుకుంటారు. ఆ గ్రంథాల ఆత్మ, ఆ భావాల్ని కాపాడటానికి వాటిని బయటికి చదువుతూ ఉంటారు. తనని ‘Book of Ecclesiastes’, ‘Book of Revelation’ మార్చుకున్న ఒక వ్యక్తిని కలుస్తాడు ఆ నవల హీరో Guy Montag. “ఆ పదాలు, ఆ వాక్యాలు నా రక్తంలోనూ, ఎముకల్లోనూ ఇమిడి ఉన్నాయి. నేనే ఆ గ్రంథం!”- అని చెబుతాడతను గై మాంటాగ్తో.
అలా పదాలు, పాదాలు, కవితలు, కథలు, కావ్యాల రూపసారాల్ని రక్తమాంసాల్లో, రాగద్వేషాల్లో కలిపేసుకొని, తమను తాము ఆ రచనలుగా, గ్రంథాలుగా రూపాంతరించుకోవల్సినవి బైరాగి రచనలని నా అభిప్రాయం. ఆత్మని ఉద్వేగించి, ఉద్దీపించేలా, పైకప్పు మీద పెంకులు పగిలిపోయేలా, hormonal frenzy తో కవితాగానం చేయడం ఒక పద్ధతి అయితే, దాని కంటే ఆ కవిత్వాన్ని అనువాదం చేయడం ద్వారా కవిని మరింత నిండుగా నింపుకోవచ్చని నా అనుభవం.
నా అనువాద అనుశీలనకై ఎంచుకున్నది, ఇటీవల నేను అనువాదం చేసుకున్న బైరాగి కవిత ‘శాంతిపథం’. నా అనువాదం శీర్షిక – ‘The Trail of Peace’.
దుర్గ మాంధ మృత్యు దుర్గ శిఖరం మీద ప్రాణోదయ విజయ కేతువు
నెగరేదాము!
భ్రాతల్లార’ ! భగినుల్లార : రండి : రండి; నాతో రండి!
సంశయ కీకారణ్యపు అజగరోదరదరుల్లోంచి
ముక్తానిల ఝరులురికే మరకతాంచలాలలోకి
త్రోవ చూపుతాను నేను; నాతో రండి!
ఉదితాశార్క సత్వర శుష్క సంతాపాశ్రుసాగరాలు
భాగీరథ తపః ఫలామృత సరితామల జీవన కలకలాలు
మానవి మార్కండేయా బల గళాన యమపాశం
ప్రేమ తామరసదామాద్భుత లాసం.
మృత్యుంజయుల నృత్యసీమకు తోడ్కొనిపోతాను రండి: నాతో రండి!
నెచ్చెలులార! నరుని జీవ స్రోతమేది; ఎలా జీవిస్తున్నాడతడు?
కడుపుకు మెక్కినందువల్లా? చక్కని పట్టుబట్టలు కట్టి నీల్గి నిక్కినందువల్లా?
వీటివల్ల కాదు నరుడు జీవించేది!
నరుడు జీవిస్తున్నాడిచట త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత
కష్ట భోగంవల్ల.
నరునికి మూలమంత్రం ప్రేమ! నరునికి గుహ్యతంత్రం కరుణ!
శిలువ మోయలేనివాడు, నవ్య జీవనార్హుడు కాడు,
సర్వసంగత్యాగికి తప్ప బోధితరువు నీడ నీదు.
ఊషర ధరణీతలాన అంధకారమాపరించిన ప్రతిమూలను
మన గుండెల నెత్తురు చింది వెలుగుపూలు పూయించాలి.
కర్కశ శిలాహృదుల పైన ఆశయాల శాసనాలు వ్రాయించాలి.
ప్రతి హృదయం శివ నిలయం, ప్రతి మానవుడొక తీర్థం,
ఇదే సకల జ్ఞాన సూన పరిమళాల పరమార్థం,
భ్రాతల్లార! భగినుల్లార! సంకేతం మనకు క్షాంతి.
గమ్యం జగదేక శాంతి.
ఇదే సత్యమైన క్రాంతి.
The Trail of Peace
Let us unfurl the victorious banner of vibrant dawn
Upon the summit of the labyrinthine, ominous fortress!
My cherished brethren and sisters, heed my call, come forth,
I shall lead the way
Through serpentine alleyways of densely wooded uncertainty,
To emerald peaks that overflow with streams of liberation,
Come, accompany me.Haste, oh arid seas, born from lands of gravel and tears,
The vivacious ripples of Ganges, born from Sage Bhagiratha’s penance,
The noose of Yama, ever-present at humanity’s eternal neck of Markandeya,
An astonishing aqueous ballet of love.I shall guide you to the dancing realms of death conquerors
Come, come with me.Dear companions! What, pray tell, sustains man’s life?
Is it gluttonous indulgence or ostentatious attire?
Nay, it is neither of those.
Man lives through sacrifice, through affection, through the deliberate hardships of joy.
The fundamental mantra of mankind is love, his clandestine stratagem is compassion.One cannot truly embrace modern life without shouldering the Cross,
The Bodhi tree does not offer its shade unless one forsakes all attachments.
With our life’s blood as nourishment,
We must nurture the blossoms of illumination
In every obscure corner of this desolate earth.The ideals must be etched upon hearts as unyielding as stone,
For within every heart resides Lord Shiva, and every human is a sacred pilgrimage.
Indeed, it encapsulates the quintessence of the fragrance of all wisdom blossoms.My beloved brethren and sisters!
Patience is our rendezvous point.
World peace is our ultimate destination.
This, my friends, is the truest revolution.
ఈ అనువాదాన్ని నా ఫేసుబుక్కులో పోస్టు చేసినప్పుడు బహుభాషా కోవిదురాలు, కవి, రచయిత, అనువాదకులు బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ఇలా అన్నారు:
- స్రోతమును pray అని అనువదించారు. అది జీవన స్రోతము కదా! స్తోత్రము కాదుగా లేదా ఈ ప్రతిలో అచ్చు తప్పుందా?
- ‘ఉదితాశార్క’ అనే పంక్తిలో రావాల్సిన భావం ఇంకొంచెం ఏదో మిగిలినట్టు అనిపిస్తున్నది. ఉదిత+ఆశ+అర్క గా నేను చదువుకున్నాను. ఆశ అనే వెలుగు ఉదయించగానే త్వరితంగా శుష్కించిపోయే సంతాపాల అశ్రుసాగరాలు వంటివి బుద్బుదప్రాయమైన కలకలాలు. ఇవన్నీ (మానవజీవనమనే మార్కండేయునికి) యమపాశాలవంటివే, మార్కండేయునిలా వీటిని జయించేందుకు మృత్యుంజయుల నృత్యసీమకు (ఈ శోకానందాల్ని దాటి అల్టిమేట్ గా క్షమ, తద్వారా శాంతి గల స్థాయికి) తోడ్కొని పోతానంటున్నాడు రచయిత. ఈ పంక్తులు( ఉదితాశార్క.., భాగీరథ…) పైన ఉన్న ‘సంశయ, ముక్తానిల ‘ తో మొదలయ్యే పంక్తులకు వ్యాఖ్యానములు.
- నవ్యజీవనము అనే పంక్తిలో అది modern life కాక, వైరులను, ఘాతకులను క్షమించడం ద్వారా మరి యింతగా వికసన గుణాన్ని కలిగి ఉండే నిరంతరమైన నవ్యత కలిగిన జీవనమని అనిపించింది.”
నా అనువాద లోపాలను అంగీకరిస్తూ, అక్కడ నా సంజాయిషీ ఇది:
- నరుని జీవ స్రోతమేది?
– నేను యథాతథంగా అనువదించలేదు. ‘What’s life stream of man?’ or ‘What’s lifeline of man?’ అని సులువుగా రాసేయవచ్చు.
అయితే, మీరు అనుకుంటున్నట్టు ‘స్రోత’ ని నేను ‘స్తోత్ర’ – అని పొరబడలేదు.
‘దయచేసి చెప్పండి’- అనే అర్థం వచ్చేలా, ‘pray tell’ అనే వ్యక్తీకరణను వాడాను అంతే. - మీరు అన్నట్టు, ‘ఉదితాశార్క సత్వర శుష్క సంతాపాశ్రుసాగరాలు’ – అనువదించడానికి ఇబ్బంది పడ్డాను. సరిగా చేయలేకపోయానని కూడా అనవచ్చు.
- ‘శిలువ’ – అనే allusion ద్వారా ‘వైరులను, ఘాతుకులను క్షమించడం ద్వారా మరి యింతగా వికసన గుణాన్ని కలిగి ఉండే నిరంతరమైన నవ్యత కలిగిన జీవనం’గా నవ్యజీవనము ని మీరు అర్థం చేసుకున్న తీరుకి పులకించాను. ఆ ప్రకారం చూస్తూ, నవ్యజీవనముని ‘modern life’ అని చప్పగా అనువదించడం కచ్చితంగా నా చేతకానితనమే అనిపించింది.”
బైరాగి కవిత్వాన్ని సాధికారంగా వ్యాఖ్యానించే సాహితీకారుడు, విమర్శకుడు ఆదిత్య కొర్రపాటి ప్రకారం – “నవ్య జీవనం ever-renewing life తో పాటు resurrection గా కూడా చదవవచ్చు. అలాగే Dante తొలి నాళ్ళ కావ్యం Vita Nuova (New Life) కూడా ఇక్కడ స్ఫురణకి వస్తుంది….. నవ్య జీవనాన్ని సాధారణ అర్థం లో వాడలేదు బైరాగి. బిబ్లికల్ అల్యూషన్స్ చేసినప్పుడు బైరాగి, పదాలని చాలా సాభిప్రాయంగా వాడటం చూస్తాం.”
“శివ, తీర్థ శబ్దాలను దైవ, మతపరంగా కవి బైరాగి వాడి ఉంటాడని నాకు అనిపించలేదు. శివ=మంగళం, శుభం అనే అర్థంలో తీసుకోవాలనుకుంటాను,” అన్నారు ప్రముఖ సాహితీవేత్త కల్లూరి భాస్కరం.
పేర్లు ఉటంకించడానికి ఇష్టపడని ఒకరిద్దరు సాహితీవేత్తలు నాకు వ్యక్తిగతంగా పంపిన విశ్లేషణల ప్రకారం, నా అనువాదం లోపబూయిష్టం, “it sometimes sacrificed the unique linguistic and cultural DNA of Bairagi’s Telugu”!
‘దుర్గ మాంధ మృత్యు దుర్గ శిఖరం’ ని ‘labyrinthine, ominous fortress’ అని అనువదించడం ద్వారా బైరాగి పదంలోని భీతావహం పలుచనయ్యింది.
“భాగీరథ తపః ఫలామృత సరితామల జీవన కలకలాలు” కి నేను చేసిన అనువాదం – “The vivacious ripples of Ganges, born from Sage Bhagiratha’s penance”. కానీ, మూలంలో గంగ గలగల భగీరథుని తపఃఫలితంతో నేరుగా అనుసంధానమయ్యింది, అనువాదంలో అది లోపించింది.
“కడుపుకు మెక్కినందువల్లా? చక్కని పట్టుబట్టలు కట్టి నీల్గి నిక్కినందువల్లా?” లో వినిపించిన విసురు, వ్యంగ్యం – “Is it gluttonous indulgence or ostentatious attire?” లో కొరవడింది. ఇంకా, “నరుడు జీవిస్తున్నాడిచట త్యాగం వల్ల, జీవితానురాగం వల్ల, స్వేచ్ఛిత కష్ట భోగంవల్ల”కి నేను చేసిన అనువాదం కూడా ఆక్షేపణకి గురయ్యింది.
‘Haste, oh arid seas, born from lands of gravel and tears’, అన్నాను కదా-
సత్వర శుష్క సంతాపాశ్రుసాగరాలు – ‘barrenly quick teary oceans’ అనొచ్చా అని గింజుకున్నాను. ‘ఉదితాశార్క’ -‘శర్కర ఉదితం’గా చదువుకొని, ‘from lands of gravel and tears’ గా సరిపుచ్చాను.
కానీ, మీరు ఇచ్చిన interpretation – ఉదిత+ఆశ+అర్క – గొప్పగా ఉంది.
“మానవ మార్కండేయా బల గళాన యమపాశం
ప్రేమ తామరసదామాద్భుత లాసం”- అనే పాదాల్ని కలుపుకొని చదివి –
– ‘The noose of Yama, ever-present at humanity’s eternal neck
An astonishing aqueous ballet of love.’ గా అనువదించాను.
“Noose of Yama at the eternal Markandeya neck of Humans
Wonderful lotic dance of love.”- అని కూడా అనువదించొచ్చా అని ఆలోచించాను.
ఆచార్య ఆదేశ్వరరావు అనుసృజనలు
బైరాగిని అనువాదం చేసుకోవడమే కాకుండా, ఇతరుల అనువాదాల్ని తరిచి చూడటం కూడా బైరాగిని own చేసుకునే ప్రక్రియలో భాగమే నాకు. బైరాగి కవిత్వానువాదం ప్రసక్తితో ముందు స్ఫురించే పేరు ఆచార్య పురుగుళ్ళ ఆదేశ్వరరావు. ఆంధ్ర యూనివర్శిటీలో హిందీ ప్రొఫెసర్ గా పనిచేసిన డా. ఆదేశ్వరరావు – 1946లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు హైస్కూలులో 8వ తరగతి చదువుతున్నప్పుడు హిందీ టీచర్ బైరాగి. ఆ హైస్కూలులో సీనియర్ హిందీ పండిట్ బైరాగి ప్రత్యక్ష ప్రభావంతో ఆదేశ్వరరావు హిందీ సాహిత్యం వైపు మళ్ళారు. వారిద్దరి బాంధవ్యం- లౌకికంగా, సాహిత్యపరంగా అప్పటి నుంచి బైరాగి చివరి క్షణాల వరకూ 3 దశాబ్దాల పైనే కొనసాగింది. బైరాగి ‘నూతిలో గొంతుకలు’- ‘Voices from Empty Well’గా, ‘చీకటి నీడలు’, ‘ఆగమగీతి’ కవితాసంపుటుల నుంచి ఎంపిక చేసిన కవితల అనువాదం – ‘The Broken Mirror’ పేరిట ఆదేశ్వరరావు ఇంగ్లీషులోకి చేశారని పలు సందర్భాల్లో ప్రస్తావించారు ప్రముఖ సాహితీవేత్త వాడ్రేవు వీరభద్రుడు. వాటిని అనువాదాలు అని కాకుండా, అనుసృజనలు (Transcreation)గా పేర్కొన్నారు ఆదేశ్వరరావు. బైరాగి కవిత్వానికి ఆ సంకలనాలు అత్యుత్తమ ప్రామాణిక అనువాదాలని వాడ్రేవు అంటారు. కానీ, వాటిని చదివే అవకాశం నాకు కలగలేదు. అయితే, ఆదేశ్వరరావు తాను సంకలనకర్తగా, అనువాదకుడిగా ఆలూరి బైరాగి కవితల్ని కొన్నింటిని ఎంపిక చేసి ‘ప్రేమ కవితలు’ పేరిట ప్రచురించారు. అలా ప్రచురించడానికి నేపథ్యాన్ని కూడా ఆచార్య ఆదేశ్వరరావు ఆ సంకలనం ముందుమాటలో రాసుకొచ్చారు. మద్రాసు హిందీ ప్రచారసభలో హిందీ అధ్యాపకుడిగా ఆదేశ్వరరావు చేసేటప్పుడు బైరాగి గదిలోనే ఆయన మకాం అట. ఓ సాయంత్రం తాను, బైరాగి మౌంట్ రోడ్డులో నడుస్తున్నప్పుడు, “తన కవిత్వం గురించి ఎప్పుడూ మాట్లాడని బైరాగి గారు – ‘నాకు తెలిసిన భాషలలో ప్రేమ కవిత్వాన్ని ఎంతగానో చదివాను. కాని షేక్ స్పియర్ సానెట్స్ లో ఉన్న ప్రేమ లోతులు, ప్రేమ వైవిధ్యం నాకెక్కడా కనిపించలేదురా! షేక్ స్పియర్ ప్రేమ కవితల తరువాత నా ప్రేమ కవితలు నిలుస్తాయి రా!” అన్నారట. తెలుగు, హిందీ, ఇంగ్లీషుల్లో కవిత్వం రాసిన బైరాగి- ఏ భాషలో రాసిన ప్రేమ కవితలని ఉద్దేశించారో ఆదేశ్వరరావు అడగలేదట. ఆ తర్వాత 50 ఏళ్లకి తన శిష్యుడైన యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆంధ్ర యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన బైరాగి 90వ జయంతి సభలో ‘ప్రేమకవితలు’ సంకలనాన్ని ఆవిష్కరించారు. ఆదేశ్వరరావు బావమరిది, ప్రవాసాంధ్రులు గింజుపల్లి పూర్ణచంద్రరావుకి అంకితం చేయబడ్డ ఆ సంకలనంలో బైరాగి హిందీ కవితాసంపుటి ‘పలాయన్’ నుంచి 11 ప్రేమకవితలకి తాను చేసిన అనువాదాల్ని చేర్చారు ఆదేశ్వరరావు. ‘ఆగమగీతి’లో ఉత్తమ ప్రేమకవితలుగా తనకి తోచిన 9 కవితల్ని జోడించారు. ఆ తొమ్మిదింటిలో ఉత్తమ ప్రేమకవితలుగా అనిపించిన 5 కవితల్ని ఇంగ్లీషులోకి అనువాదం చేసి, మొత్తం పాతిక కవితలతో ‘ప్రేమకవితలు’ సంకలనం తెచ్చారు ఆదేశ్వరరావు.
హిందీ నాకు బొత్తిగా రాకపోవడం చేత, హిందీ ‘పలాయన్’ నుంచి ఆదేశ్వరరావు చేసిన తెలుగు అనువాదాలు మరీ పలుచగా అనిపించడం వల్ల వాటి జోలికి నేను పోలేదు. ఇంగ్లీషు అనువాదానికి (లేదా అనుసృజనకి) ఆదేశ్వరరావు ఎంపిక చేసుకున్న 5 కవితలు – ‘ఆగమగీతి’లో ‘ఎందుకు మాసిపోతుందో ప్రేమ?’, ఇంకా ప్రేమకవితలు – 1, 2, 3, 4. ఆదేశ్వరరావుతో 4 దశాబ్దాల అనుబంధం ఉన్న వాడ్రేవు మాటల్లో చెప్పాలంటే, తెలుగు, హిందీ, సంస్కృత భాషల్లోనే కాకుండా, ఇంగ్లీషు మీద కూడా సాధికారత ఉన్న పండితుడు, అమృతలాల్ నాగర్ రచించిన ‘అమృత్ ఔర్ విష్’ ని ‘అమృతం విషం’గా తెలుగులోకి చేసిన అనువాదానికి సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం పొందిన సాహితీవేత్త ఆదేశ్వరరావు! అటువంటి స్కాలర్ చేసిన బైరాగి కవితల అనువాదం – కవిని నాలోకి invocate చేసుకునే అనుభవాన్ని నాకు ఇవ్వలేదు. దీర్ఘమై, శబ్దశ్రావ్య పదబంధాల పునరావృత్తులతో, syntactical breathlessness తో సాగే బైరాగి పద్యపాదాలు ఇచ్చే aural experience ని ఆదేశ్వరరావు అనువాదం చిన్న చిన్న ఇంగ్లీష్ వాక్యాలుగా విడగొట్టి, బైరాగి వర్తుల మార్గాన్ని, మర్యాదస్తుల సరళరేఖగా మార్చిందని నా పరిశీలన.
“… వేన వేల వత్సరాలనంగ/ పరిమళ వికల విదిశా నిశాకుంతలాల/ పాటల నగరాంతఃపుర వర సుందరుల విసృమరకర కుట్మలాల…” (ప్రేమకవితలు -1) అంటూ సాగే బైరాగి వాక్యం – “… For the past thousands of years,/ Love that has grown/ As perfumed rose water/ On the fragrant scattered dark locks of night,/ Love that has grown/ On the flower-like palms of choicest beauties….” గా తర్జుమా అయ్యింది ఆదేశ్వరరావు రచనలో.
“ఇదట జీవనది అట! పుణ్యనది అట! దేవనది అట! ఛీ!” అంటాడు బైరాగి. “It is said: it is a life-giving river, / A pious river, a divine river!” అని అనువదించారు ఆదేశ్వరరావు. ‘ఛీ!’ – అనే కీలకమైన onomatopoeic వ్యక్తీకరణకి ఇంగ్లీషు అనువాదంలో చోటు లేకుండాపోయింది. ‘తేలి తేలి క్రుళ్ళిన దేహ దుర్గంధాలు’- “stink of decayed bodies’ గా తేలిపోయింది. ‘ఎన్ని వెలుగులు మ్రింగినా ఆకలితీరని రేజీకటిలా వెన్నంటిన ప్రేమ ఏమంటున్నది?’కి “Love that chases / Like hungry darkness / Unsatiated despite swallowing many a light – … What does it say?” అంటూ ఆదేశ్వరరావు చేసిన అనువాదం విధేయంగానే ఉంది. ‘ఆకలితీరని’కి ‘unsatiated’ వంటి తగిన విశేషణాన్నే వాడారు అనువాదకులు. కానీ, బైరాగిలోని hypnotic sound-play ని ఇంగ్లీషులోకి తీసుకురాలేకపోయారాయన.
‘ప్రేమకవితలు -2’ లో “నీ ఈ దేహం లోంచి – … ఇంకా దేనికొరకో వెదుకుతూనే ఉన్నాను. ఈ దేహం దేనికి గేహం?”ని ఇలా అనువదించారు ఆదేశ్వరరావు: “Till now I am searching / For something through your body, … / Still, I am searching for something else. / For what this body is an abode?”. గేహంని ‘abode’ గా అనువదించడం బాగానే ఉన్నప్పటికీ, ‘for something… for something else’ అంటూ పునరావృతం చేయడం పదాల లేమిని సూచిస్తుంది. అదే కవితలో మరో చోట, “చెక్కిళ్లల్లోంచి మక్కువ కెంపులు పోయి / మోవిని దాచిన ముద్దుల మురిపాలు కావిపోయి…” అంటూ యవ్వనవనంలో పోగొట్టుకున్న అందాల గురించి బైరాగి రాస్తే, “Losing rosy love in the cheeks; / Losing the redness of passionate kisses ….” అంటూ ఏకరువ పెట్టారు ఆదేశ్వరరావు. ‘పోయి’ అని తెలుగులో బైరాగి వాడిన అన్యాదేశం (anaphora)- ఇంగ్లీషులో ‘losing’ అనే participial phrase గా మారిపోయి, మూలం నుంచి దారితప్పింది.
ఇవిలా ఉంటే, “జనకజ కాదు; యజ్ఞ కనక జనక దుహిత / ప్రాణహీన ప్రతిమను ప్రేమించటం మెలాగ!” (ప్రేమకవితలు 3) వంటి పౌరాణిక, ఇతిహాస పాదాలని అనువదించడంలో మరో విధమైన తప్పిదాలు చేశారు ఆదేశ్వరరావు. “It is not the daughter of Janaka, / But golden Sita at the royal ritual. / How can anyone love a lifeless image?” అని ఆయన చేసిన అనువాదంలో భాషాపరమైన తప్పులు లేవు. కానీ, ఆ ‘royal ritual’ ఏమిటో, ‘బంగారు సీత’ ఎవరో తెలియని ఇంగ్లీషు పాఠకుడి కోసం కనీసం అధోజ్ఞాపికలు కూడా ఇవ్వలేదు అనువాదకుడు. “బుద్ధుడు క్రీస్తు, వారు వేరు, గాలిలాగు, వెలుగులాగు, జాలిలాగు వారి ప్రేమ!”, “వారల అడుగుజాడలు వెలిగినచోట, అవిరళ వర పరిమళాల దివ్యసీమ”- వంటి వాక్యాల అనువాదాల్లో ఏ తప్పిదాలూ లేకపోవచ్చు. కానీ, అవి అనువాదాలు కాదు, తేలికపాటి అర్థవివరణలు మాత్రమే.
అనువాదం విధేయంగానే ఉంది, కానీ, మాతృకలోని epic sweep, alliterative grandeur ఆదేశ్వరరావు ఇంగ్లీషు అనువాదంలోకి బట్వాడా కాలేదనిపించింది చాలా చోట్ల. ఉదాహరణకి, ప్రేమకవితలు 4 లో “.. చరమయాత్రాతుర చరణాల కల్మష కలుషధూళివోలె…” అనే పాదం – “Love got glued like dust to your feet / Eager to make the last journey” అంటూ పలుచని వాక్యాల దొంతర అయిపోయింది. “నిరత హరిత సుషమా’ -“an eternal ever changing beauty” గా ఎందుకు అనువదించబడింది? ‘నిరత హరిత’ అంటే – ever-fresh / ever-green కదా.
వాక్యాన్ని శకలాలుగా విడగొట్టే ఆదేశ్వరరావు నిర్మాణ పద్ధతి బైరాగి కవితలు కొన్నింటికి మంచి స్పష్టత ఇచ్చేందుకు దోహదపడిందనవచ్చు. ప్రతి పదచిత్రం తనకంటూ దన్నుగా నిలిచే పాదాన్ని సంతరించుకుంది కూడా. కానీ, దాని ఫలితం – మూలంలో పరవళ్లు తొక్కే ఉపమాన, ఉత్ప్రేక్షల్ని వదులుకోవలసి రావడం! ఆ పరిమితిని – “కంచుక నిర్ముక్త విశ్వయౌవన ఫణి వివృత విభతో దీపిస్తుంది…”- అనే వ్యక్తీకరణ “The youthful world serpent / Will shine in its naked radiance, / Casting its slough”- గా అనువాదం కావడంలో గమనించవచ్చు. “సృజన రుధిర బీజ ప్రజ ప్రళయ పరశువుకు సవాలు” అనే పాదం – “The offspring of bloody creation / Is a challenge / To the axe of doom”- గా అనువాదమయినప్పుడు, ‘రుధిర’ శబ్దంతో బైరాగి సాధించిన శ్రేష్ఠత – bloody – అనే అపక్వమైన, అభిశప్తమైన పదం వల్ల వచ్చే అవకాశం ఉండదు. “జనన మరణ వనధి గగన మధ్యమ నీల జ్యోతిస్స్నాత శూన్యంలో / నీవూ నేనూ తప్ప ఎవరులేరు” – దానికి ఆదేశ్వరరావు అదనంగా “sea and sky” చేర్చి- “No one is there except you and I / In the void bathed in blue light / Between the sea and the sky, / Birth and death” అని ఎందుకలా అనువదించారో తెలియదు.
వెల్చేరు అనువాదాలలో మౌలికాంశాల వక్రీకరణ
ఈ సందర్భంగా అతి ముఖ్యమైన అనువాదాల గురించి కచ్చితంగా ప్రస్తావించుకోవాలి; ఆ అనువాదాలు చేసింది సుప్రసిద్ధ సాహితీవేత్త డా. వేల్చేరు నారాయణరావు. ‘Hibiscus on the lake : twentieth-century Telugu poetry from India’ పేరిట University of Wisconsin Press 2003లో ప్రచురించిన ఈ గ్రంథం, 20వ శతాబ్దపు తెలుగు కవిత్వంలోని అన్ని మలుపులనూ, ప్రభావాలనూ, మార్పులనూ ప్రతిఫలించేలా ప్రచురితమైంది. గురజాడ అప్పారావు నుంచి, రాయప్రోలు, నండూరి, దేవులపల్లి, విశ్వనాథ, జాషువా, శ్రీశ్రీ నుంచి, ఆధునిక, ఆధునికోత్తర కవులు సతీష్ చందర్, ఖాదర్, అఫ్సర్, కొండేపూడి నిర్మల, మహె జబీన్, మద్దూరి నగేష్ బాబు వరకూ 20వ శతాబ్దపు కవిత్వం తిరిగిన మలుపులు, తీసుకున్న ప్రభావాలు, తెచ్చిన మార్పులు – ప్రతిఫలించేలా ఈ పుస్తకం పబ్లిష్ అయ్యింది. కవితల ఎంపిక, ఎడిటింగ్, వాటి అనువాద బాధ్యతలు అన్నీ వేల్చేరువే. ‘Languages of Poetry’, ‘Husbands, Lovers, Wives and Women’ , ‘God and His Meanings’, ‘Surrealist Detours’ ..వగైరా కేటగిరీల కింద విభజించబడిన ఈ పుస్తకం గొప్ప ప్రామాణిక గ్రంథంగా కీర్తించబడింది. “Entirely original, ironic, sensuous but never sexist. A small masterpiece and a precious piece of the record of good writing on this planet,” అని ప్రస్తుతించాడు ప్రముఖ రచయిత, Wendy Doniger. “A unique work. There is no similar or comparable anthology for any Indian literature, let alone Telugu. All of the translations are exquisite and learned, a rare combination indeed,” అని అనువాద గరిమ గురించి ప్రత్యేకంగా పేర్కొన్నారు McMaster విశ్వవిద్యాలయ విద్యాధికురాలు Phyllis Granoff. 20వ తెలుగు కవిత్వ రూపసారాల్ని పరాయి ఆంగ్ల పాఠకుల హృదయాలకి చేరువ చేసిన అపురూప గ్రంథంగా ‘Hibiscus on the lake’ గొప్ప గుర్తింపు పొందింది.
అయితే, ఇంతటి ప్రామాణిక గ్రంథంలో, బైరాగికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెచ్చిపెట్టిన ‘ఆగమగీతి’ సంకలనం నుంచి వేల్చేరు అనువాదానికి ఎంచుకున్న ‘మేలుకొన్నవాడు’, ‘నాక్కొంచెం నమ్మకమివ్వు’ కవితల అనువాదాలు తీవ్ర అసంతృప్తిని మిగులుస్తాయి. ముఖ్యంగా అనువాదకుడు చేసిన కత్తిరింపులు, మినహాయింపులు ఆశ్చర్యపరుస్తాయి.
‘నాక్కొంచెం నమ్మకమివ్వు’ – రూపకాల విధ్వంసం
బైరాగి రాసిన అసలు కవిత ఇలా ముగుస్తుంది:
“నాక్కొంచెం నమ్మకమివ్వు.
నమ్మకంలేని బొంది ఖాళీ సిగరెట్టు టిన్ను
నమ్మకంలేని ఆత్మ పుల్లలులేని అగ్గిపెట్టె
నమ్మకంలేని బ్రతుకు కాలిన సిగరెట్టు బూది
అన్నీ ఉన్నాయి కాని, నమ్మకమొకటే లేదు
నాక్కొంచెం నమ్మకమివ్వు!
నమ్మకమివ్వు!
నమ్మకమివ్వు!”
దానికి వేల్చేరు అనువాదం ఇది:
“I can do anything.
But give me confidence.
Confidence.”
– అనువాదంలో గొప్ప సంక్షిప్తతని సాధించారు సరే, “కవిత్వంలోనూ జీవితంలోనూ, Economy of words and thoughts లేకపోవటం దేశభక్తి కన్న హీనమైన పాపం, ఆత్మలోకంలో దివాలా..” అనేసిన చలం గారి స్ఫూర్తిని గ్రహించారు బాగానే ఉంది; కానీ, economy of words – అంటే కవితలో కీలకమైన కవితాపంక్తుల్ని అడ్డగోలుగా కత్తిరించి పారేయడం కాదేమో. “సిగరెట్టు టిన్ను,” “అగ్గిపెట్టె,” “సిగరెట్టు బూది” వంటి కీలకమైన కవితా చిత్రాలను తొలగించడం ద్వారా అనువాదం మూలానికి తీరని ద్రోహం చేసింది.
“అన్నీ ఉన్నాయి కాని, నమ్మకమొకటే లేదు
నాక్కొంచెం నమ్మకమివ్వు!
నమ్మకమివ్వు!
నమ్మకమివ్వు!”
– అని నొక్కి చెబుతూ, కవి చేసిన పునరుక్తిని ఏ కారణాల చేతనో సైడుకాలువల్లోకి తోసేయడం కానే కాదేమో.
‘మేలుకొన్నవాడు’ – మౌలికాంశాల వక్రీకరణ
శీర్షిక మార్పు: ఈ కవిత శీర్షిక తెలుగులో ‘మేలుకొన్నవాడు’; అంటే, ‘The One Who Is Awake’గా బోధపడింది నాకు. అస్తిత్వకేంద్రక ఏకాకితనంలో చేసే ధ్యానం, పూర్ణచేతన కలిగించే భారం – ‘మేలుకొన్నవాడు’ సృజనకి మూలం కావొచ్చు. ‘మేలుకొన్నవాడు’ అనే శీర్షికని ఒక participle తీసుకుంటే, “I am the one who is awake” గా వినిపించింది నాకు. అంటే, ఆ ప్రకటన స్వయానా కవి బైరాగిదే అని నా అనుకోలు. అయితే, నా వైయక్తికతని పక్కన పెట్టి, ‘Who Is Awake in the Dead of Night?’ అనే శీర్షిక – అనువాద కవితకు ఏ విధంగా సరిపోతుందో ఎవరైనా వివరిస్తే వినాలనిఉంది.
ప్రధాన రూపకం మినహాయింపు: “ఒకే ఒక్క తెల్లనిచుక్క ఈ మసిలో” అనే అద్భుతమైన వాక్యాన్ని అనువాదం నుంచి తొలగించారు. ఏమిటా తెల్లని చుక్క? జగత్తంతా నిదురిస్తోంది, కానీ, ఒక్కడు మేలుకొనివున్నాడు – అతనే ఆ ‘తెల్లని చుక్క’! ఆ వాక్యం లేనిదే కవిత అసంపూర్ణం. దానిని ఇంగ్లీషు అనువాదంలోంచి మినహాయించారు వేల్చేరు. ఎందుకు? ఏమో తెలియదు.
గీతావాక్యపు అనవసరమైన అనువాదం: ఇంకా – “యా నిశాసర్వ భూతానాం, తస్యాం జాగర్తి సంయమీ” అనే గీతావాక్యాన్ని ఓ పాఠాంతర ఉల్లేఖన (intertextual reference)గా, ఒక గాఢ తాత్విక సూచనగా బైరాగి వాడాడు. ఆధునిక అస్తిత్వవేదనని వేల సంవత్సరాల నాటి ఆధ్యాత్మికాంశంతో ముడివేసిన కవి ప్రయత్నం అది. పాశ్చాత్య పాఠకులకు కూడా తెలిసిన, తెలియజెప్పాల్సిన గీతావాక్యాన్ని యథాతథంగా ఉంచకుండా, దాని ఇంగ్లీషు అర్థాన్ని (“When it is night for everyone/ the sage stays awake.”) ఇరికించడం ద్వారా మూలంలోని intertextual గాఢతను నాశనం చేశారు.
నైరూప్యనామవాచకాల క్రియారూపాలు
“నడిరేతిరి మేలుకొన్న వాడెవ్వడు?
దివ్వెల నమ్మిక లేమి, నీడల కుట్ర
చీకటుల మెతకబుద్ధి, ఎవ్వరి కెరుక?”
దీనికి వీరు చేసిన ఇంగ్లీషు అనువాదం:
“Who is awake in the dead of night?
Who knows that lamps deceive
shadows conspire
and darkness has a feeble mind?
Who knows?”
తెలుగు కవి — ‘నమ్మికలేమి (Distrust), నీడల కుట్ర Conspiracy), మెతకబుద్ధి (Feeble mind) — అనే abstract nouns ని ఉద్దేశిస్తే, ఆ నైరూప్యనామవాచకాలని క్రియారూపాల్లోకి (Who knows that lamps deceive) అని మార్చేశారు వేల్చేరు. అలాగే, బైరాగి- ‘జాగారపు చిల్లిపడవ’ని ఉద్దేశిస్తే, ‘చిల్లిపడవ వంటి జాగారాన్ని’ (The vigil, a leaky boat…”) గా అనువదించారాయన. ఈ అనువాదంలో తప్పులేకపోవచ్చు, సంక్షిప్తతతో కవిసాధించిన సొగసుని అనువాదంలో చెడగొట్టడముంది! మరుసటి పాదంలో ‘భీషణశ్రమ’ — కేవలం ‘Pain’ గా సరిపెట్టుకుంది. ‘ప్రతిక్షణం ఎవరో తలుపుతట్టిన భ్రమ’ కలిగించే ఉద్వేగం — “A constant thought that someone’s at the door” — నాకైతే ఇవ్వలేదు.
మాయమైన మౌనపు దుప్పటి
మేలుకొన్నవాడు కవితలో ఒక అద్భుతమైన కవితావాక్యం, అనువాదంలో దారుణమైన వక్రతకి లోనయ్యింది-
“కుక్కల మొరుగు
రాత్రి మౌనపు దుప్పటి చిరుగు”
ఇది కేవలం ప్రాసతో కూడిన లయ (మొరుగు-చిరుగు) ఎంతమాత్రం కాదు. బైరాగి ఒక అసాధారణ ఊహాశీలతకి చిన్న నిదర్శనం. ఒక సాధారణమైన శబ్దాన్ని(‘కుక్కల మొరుగు’ని) మరో శాబ్దిక అనుభవంతో పోల్చడంలేదు కవి. దృశ్యమానమైన ‘చిరుగు’తో పోల్చాడు. అంటే, అగోచరమైన దాన్ని ‘దుప్పటి చిరుగు’గా tangible చేశాడని అనుకోవచ్చు. కానీ, ఆ దుప్పటి గ్రాహ్యమైనది కాదు, అది ‘మౌనపు దుప్పటి’. దాన్ని ‘రాత్రి’ కప్పుకుంది. ‘రాత్రి’ — personify అయ్యింది, sensory సరిహద్దుల్ని బైరాగి కవిత్వం పూర్తిగా చెరిపేసి, పఠనానుభవాన్ని ఔన్నత్యతలాలకి తీసుకుపోయింది. “రాత్రి కప్పుకున్న మౌనమనే దుప్పటికి చిరుగు వంటిది, కుక్కల మొరుగు!” అన్నది దాని తెలుగు అర్థం.
అయితే, అది “barking dogs, holes in the blanket.” — అని తర్జుమాల పాతాళంలోకి నెట్టివేయబడింది.
ముగింపు: అనువాదం వెనుక మిగిలిన అసంతృప్తి
“నిర్భాగ్యుని రెప్పల జేబుల్లోంచి నిద్దుర పర్సు కాజేసేది”
(వెల్చేరు అనువాదం: What steals the cash of sleep from his eyelid wallet?)“ఈ తమసా సంకటయాత్ర వారికొరకు నల్లకలువల తూగుటూయల”
(వెల్చేరు అనువాదం: …this dark hard road is a bed of black lilies)“అవమానం, అభిమానం, జ్ఞాపకాల కంటకాల ఉపధానం”
(వెల్చేరు అనువాదం: Humiliation, pride, thorny memories?)“లజ్జాకర జీవితాల కలుష మలిన పరిధానం!”
(వెల్చేరు అనువాదం: Dark turns of a shameful life?)“నిద్రానీలమానసంలో స్వప్న నౌకల అభియానం”
(వెల్చేరు అనువాదం: a boat ride of dreams in the dark lake of sleep)“తరంగాల కోమల పర్యంకంపై శ్వాసల పతనోత్థానం”
(వెల్చేరు అనువాదం: the sway of steady breathing on the soft lap of waves)
ఇలాంటి మరెన్నో అద్భుతమైన పదచిత్రాలు అనువాదంలో తమ సహజ సౌందర్యాన్ని, లయను, ధ్వనిని కోల్పోయాయి. కవిత ముగింపులో “శాంతి ఉండబోదు సదా!” అనే కీలకమైన పాదాన్ని పూర్తిగా తొలగించారు. సాంకేతికంగా తర్జుమా సరైనదే అనిపించినా, బైరాగి కవిత్వమంటే కేవలం అర్థమేనా? ఆయనకే సొంతమైన లయ, సాంస్కృతిక జాడలు, రూపకాల విస్ఫోటక చిత్రాల బలం – వీటన్నింటినీ అనువాదంలోకి తీసుకురాలేకపోవడం ఒక చారిత్రక తప్పిదం కాదా? వేల్చేరు అంతటి సాహితీమూర్తి తన అనువాదకలం నుంచి ఇంతటి అలక్ష్యాన్ని ఎందుకు జాలువారనిచ్చారు?
బైరాగి స్వీయానువాదం: ఒక విలోమం
ఏ అనువాదాల సంగతి ఎలా ఉన్నా, కవి తాను స్వయంగా చేసిన అనువాదం మీద సహజంగానే ఎక్కువ ఆసక్తి ఉంటుంది. ఆ కవి బైరాగి అయితే మాత్రం ఆ ఉత్కంఠ – ఒక మెట్టు పైనే. కానీ, నాకు దొరికిన ఒకే ఒక బైరాగి స్వీయానువాదం – నన్ను తీవ్ర నిరాశకి గురిచేసింది. నాకు అమితంగా ఇష్టమైన బైరాగి కవితల్లో ‘ప్రేమ – మృత్యువు’ ఒకటి. ‘Pain of Being’ శీర్షికన సంకలనం చేయబడ్డ బైరాగి ఇంగ్లీషు కవితల్లో ‘THE DEATH AND LOVE’ ఉంది. ఆ కవితల రచనాకాలం తెలియకపోవడం వల్ల ఏది మాతృక, ఏది అనువాదమో తేల్చుకోలేకపోయాను. బైరాగి తెలుగు కవి కనుక, ‘ప్రేమ – మృత్యువు’ కవితే మాతృకగా తీసుకున్నాను.
ప్రేమ – మృత్యువు
ప్రాకరాని చోట తాను ప్రాకరాదు
తాకరానివారిని తాను తాకరాదు
కాటందవలసినవారిని కాటందక వీలులేదు
జడలు విరియు నడిరేయి అడవి దారి-
పాపం, ముదిసిన మిత్తవనాగు దారి కానలేదు-
కాని దాని మూర్ధంపైన
దీపిస్తోంది దివానర్ఘ మహామణి
శివుని మౌళి చంద్రుని కరణి
అదే ప్రేమ!
దానిని చూచి చేరువకు చేరుతారు
మిత్తవ కాటందవలసిన వారు
వెలుగును కన్న శలభాల్లా.
తీరికగా వారిని కాటందుతుంది మిత్తవ నాగు-
ప్రేమన్నది
మరణ మహాఫణి
ఫణాగ్ర దివ్యమణి’…”
THE DEATH AND LOVE
She should not go there
Where it is forbidden to go,
She should not touch those
Whom it is forbidden to touch
And she must bite those
Whom it is ordained that it should bite.
In the great forest of life’s night
Dense and crooked like matted hairThe poor serpent of death
Cannot see its path.But for the priceless and matchless
Jewel shining on its head
Like the moon on god Shankar’s head
Which those live call love.And bewitched by the unearthly light
Of which like moths around a lamp
All the would-be victims of the serpent of death
Come near drawn irresistibly
And gain the boon of immortality.That which is called Love in the world
Is the jewel shining on the head of
The serpent of Death.
‘ప్రేమ – మృత్యువు’ అనే శీర్షికని, ‘The Death and Love’ అని తిరగరాయడంలోనే బైరాగి మాతృకని అనువాదానికి ఎడం చేశాడని అనిపించింది. ఇంగ్లీషు టైటిల్ ప్రకారం ఆ కవిత మృత్యుప్రధానం!
“ప్రేమన్నది
మరణ మహాఫణి
ఫణాగ్ర దివ్యమణి…”
అనే అభాసని ‘ప్రేమ-మృత్యువు’ కవిత అర్థంచేయిస్తుంది. ‘ప్రేమ’ అనే దివ్యమణి కోసం ప్రాణాలను సైతం ఒడ్డి వెదుకులాడటమే జీవిత పరమార్థమని చెప్పకనే చెబుతాడు బైరాగి. అదే ప్రేమాన్వేషణ మహాసాధనాదర్శాన్ని కథ అనే పెద్ద కాన్వాసు మీద కూడా చెప్పాడు బైరాగి. ‘నాగమణి’ కథలోని రచయిత పాత్రధారి ఇలా అంటాడు:
“… ఉత్తమ జాతికి చెందిన మహా సర్పాల శిరస్సులపైన ఒక వయస్సు వచ్చాక మణి ఆవిర్భవిస్తుందట. స్వీయకాంతితో తెజరిల్లే ఆ అనర్ఘమహామణిలో ఎన్నో అద్భుతశక్తులుంటాయట. అలాంటి మణికోసం వెదుకుతూ ఎంతోమంది తమ ప్రాణాలు కోల్పోయారు. కాని కట్టుకథలో తప్ప అది ఎవరికి కనిపించదు. ప్రతి ఒక్కని జీవితంలోనూ ఒక నాగమణి వుంటుంది. అతను దానికోసం వెతుకుతూనే ఉంటాడు. ఆ వెదుకులాట లేకపోతే అతని జీవితానికి అర్ధం లేదు. అది అతని కెన్నడూ లభించకపోవచ్చు. కానీ ఆ వెతుకటంలోనే అతని జీవితం సార్థకం అవుతుంది. అదే అతని జీవితానికర్థం”
‘ప్రేమ – మృత్యువు’ కవితలో జీవితానికి అర్థాన్నిచ్చే ప్రేమ అంటే ఏమిటో చెబుతాడు బైరాగి:
[మిత్తవ నాగు] మూర్ధంపైన
దీపిస్తోంది దివానర్ఘ మహామణి
శివుని మౌళి చంద్రుని కరణి
అదే ప్రేమ!
కానీ, బైరాగి ‘THE DEATH AND LOVE’ పేరిట ప్రకటించిన కవిత (అనువాదం) – తాత్వికంగా విలోమం, భావపరంగా నిస్సారం, కవితానిర్మాణరీత్యా సామాన్యం!
తెలుగులో సర్వనామం కవళికలు మార్చుకొని ఇంగ్లీషులో ‘She’ గా అవతరించడంతో ఇంగ్లీషు కవిత కలకబారిపోయింది. ‘ముదిసిన మిత్తవనాగు’ ని ‘serpent of death’ అని అనువాదం చేసుకున్నాడు బైరాగి; మరి ముదిసిన – aged అనే ముఖ్యమైన విశేషణం సంగతేంటి? ‘శివుని మౌళి చంద్రుని కరణి’ ని ‘the moon on god Shankar’s head’ అన్నాడు. కరణి (ray) కానరాదు అనువాదంలో; అంతేకాదు, అది moon కాదు, ‘Śiva’s crescent-moon’.
ప్రాకరాని చోట తాను ప్రాకరాదు / తాకరానివారిని తాను తాకరాదు / కాటందవలసినవారిని కాటందక వీలులేదు’ – ఇందులో moral injunctions లేవు. కానీ, ఇంగ్లీషు అనువాదం ‘She should not go…’, ‘She should not touch’ తరహా సూచనలు, సలహాలుగా మార్చి, మూల కవితలోని మౌలికతని రద్దుచేసేసింది.
“… దానిని చూచి చేరువకు చేరుతారు
మిత్తవ కాటందవలసిన వారు
వెలుగును కన్న శలభాల్లా.
తీరికగా వారిని కాటందుతుంది మిత్తవ నాగు-“
దీనికి సమాంతరంగా ఇంగ్లీషులో ఏమిటి:
“And bewitched by the unearthly light
Of which like moths around a lamp
All the would-be victims of the serpent of death
Come near drawn irresistibly
And gain the boon of immortality.”
“… gain the boon of immortality”
– అనే అసందర్భ వాక్యపు ఇంగ్లీషు అనువాదంతో మాతృకలోని మూలతత్వాన్నే తలకిందులు చేశాడు బైరాగి.