దివ్యభవనంలో బీజాక్షరి

ఆలూరి బైరాగి కథలు

కవిగా లబ్ధప్రతిష్టుడైన ఆలూరి బైరాగి కథకుడుగా ఎక్కువమందికి తెలీదు. దీనికి అనేక కారణాలున్నాయి. ఆయన వ్రాసిన కథలు బహు తక్కువ. వాటిలో చాలావరకూ 1950-51 ప్రాంతంలోనే ప్రచురింపబడినట్లున్నాయి. ఆ తరువాత ఆయన కథలు వ్రాశాడో లేదో తెలీదు. ఒక కథాసంపుటం – దివ్య భవనం – మాత్రం 1951లో వెలువడింది. దీనిలో ఏడు కథలు ఉన్నాయట. తెలుగు కథాసంకలనాల్లో ఆయన కథలు కనిపించిన గుర్తు లేదు (ఒక్క విస్మృత కథ లో తప్ప). ఆయన కవిత్వాన్ని పరిచయం చేసే, విశ్లేషించే వ్యాసాలు చాలా ఉన్నా, ఆయన కథల గురించి, ఆయన నవల (పాప పోయింది) గురించి బ్లాగుల్లో పదిహేనేళ్ళ క్రితం మెహర్, కల్పన రెంటాల వ్రాసిన పరిచయ వ్యాసాలు తప్ప విమర్శకులు ఎవరూ మాట్లాడిన గుర్తు లేదు.

నేను మొదటిసారి చదివిన బైరాగి కథ – ఒక గంట జీవితం. అది 1995లో పల్లవి వారు ప్రచురించిన విస్మృత కథ సంకలనంలో వచ్చింది. ఆ తరువాత 2006లో మిలింద్ ప్రకాశన్ (హైదరాబాదు) ప్రచురించిన దివ్యభవనం అనే కథాసంపుటంలో మరికొన్ని కథలను చదివాను. బహుశా ఆయన 80వ జన్మదిన సందర్భంగానేమో బైరాగి కవితాసంకలనాలతో పాటు ఈ కథాసంకలనాన్ని కూడా వారు పునర్ముద్రించారు.

దివ్యభవనం పుస్తకం మొదటి ముద్రణ 1951లో అని కథానిలయం సమాచారం. దివ్యభవనం రెండవ ముద్రణలో మొత్తం 11 కథలు ఉన్నాయి. దివ్యభవనం మొదటి ముద్రణ తరువాత లభించిన మరో నాలుగు కథలను ఈ రెండవ ముద్రణలో చేర్చామని, ఈ పుస్తకం మొదట్లో ఉంది. కథానిలయం వెబ్‌సైటు ఏడు కథలను చూపిస్తుంది – వాటిలో రెండు కథలు మాత్రమే ఈ రెండవ ముద్రణలో ఉన్నాయి. మిగిలిన ఐదింటిలో ఒకటి కవిత (కలలు పగులగొడుతున్నాను); ఇంకొకటి రేడియోకోసం వ్రాసిన గేయరూపకం (అసురసంధ్య). అగాధపుటంచున అనేది ఒక తాత్విక వ్యాసం. పనికాని ప్రయాణం అనే కథ స్కాన్ చేయబడలేదు – అది కథో కాదో కూడా మనం ఇప్పుడు చెప్పలేము. ఒక కట్టు కథ అనే ఒక్కటి మాత్రం దివ్యభవనం సంకలనంలో లేని కథ. మొత్తానికి మనకు ఇప్పుడు బైరాగి రాసిన 12 కథలు మాత్రమే దొరుకుతున్నాయి. వీటిలో సింహభాగం 1951 ముందే రాయబడి ఉండాలి. బైరాగి ఇంకా వేరే కథలు వ్రాశాడో లేదో తెలీదు (వ్రాసి ఉండవచ్చని అని ఒక కట్టు కథ చదివాక నా అనుమానం).

ఈ వ్యాసంకోసం చేసిన వెతుకులాటలో తెలిసిన ఒక ఆశ్చర్యకరమైన విషయం: 1951లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ వారి ప్రపంచ కథానికల పోటీని తెలుగులో ఆంధ్రపత్రిక నిర్వహించింది. ఆ పోటీలో నెగ్గిన నాలుగు తెలుగు కథలలో ఆలూరి బైరాగి చౌదరి ‘తండ్రి- కొడుకు’ ఒకటి (దివ్యభవనం సంకలనంలో ఈ కథ పేరు తండ్రులూ – కొడుకులూ అని ఉంది). ఈ పోటీలోనే పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథ భారతదేశ స్థాయిలో ఎంపికై, ప్రపంచ స్థాయిలో రెండవ బహుమతి గెల్చుకొంది.

కవిగా బైరాగిది ఒక నిర్దుష్టమైన గొంతుక. ఈ సంచికలో బైరాగి కవిత్వాన్ని చర్చించే ఇతర వ్యాసాలు ఉన్నందున నేను ఆ కవిత్వం గురించి ఇక్కడ మాట్లాడటం లేదు. కథకుడిగా కూడా బైరాగికి ఆ ప్రత్యేకత ఉందా అన్న ప్రశ్న ఉదయించటం సహజం.

దివ్యభవనం సంపుటిలో ఉన్న బైరాగి కథల్లో చాలా విలక్షణత ఉంది. చాలాసార్లు ఆయన వచనం ఆపకుండా పరుగులు తీస్తూ మనల్ని బలవంతంగా ఆయన వెంట పరుగెత్తిస్తుంది. ఆయన కవితల్లో లాగానే విలక్షణమైన పదప్రయోగం మనల్ని ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. అక్కడక్కడా ఆయన పోలికలు అబ్బురపరుస్తాయి. కథల్లో వాతావరణ చిత్రణ – పనిగట్టుకుని చేసినట్టు లేకపోయినా – మనల్ని కథలో భాగస్వాముల్ని చేస్తుంది. బైరాగి కవిత్వంలో కనిపించే ఆశావాదం నిరాశావాదం మధ్య ఊగిసలాట, అస్తిత్వవ్యధ కొన్ని కథలలో ముఖ్యవస్తువులు.

ఈ కథలన్నిటినీ ఒక్కగాట కట్టిపడేయడానికి కుదరవు. కొన్ని కథలు మామూలుగా ఉండే కథానిర్మాణంలో ఒదిగితే, మరికొన్ని అమూర్తమైన కథలు. కొన్ని కథలు ప్రతీకాత్మకమైనవి. అన్ని కథలకూ ఉన్న సామాన్యగుణం – చదివింపజేయడం.

ఒక గంట చాలు, స్వప్నసీమ, జేబుదొంగ, దీపస్తంభం కథల్లో నాయకులు కథాప్రారంభంలో జీవితపు భారంవల్ల నలిగిపోయిన మనుషుల్లా, నాగరికజీవితపు అనామీకరణ బాధితుల్లా అనిపిస్తారు . కానీ ఈ కథలన్నీ ముగిసేటప్పటికి వారి దృక్పథంలో కలిగే మార్పుని చూస్తే రచయిత ఆశావాదం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథలన్నిటికీ ఉన్న పోలిక ఏమిటంటే ఒక మామూలు సంఘటనవల్ల కథానాయకుడికి కలిగే అలౌకికానాందం, జీవనసత్య సాక్షాత్కారం. వయొలిన్ నాదమో, ఒక సాయంత్రపు అసంపూర్ణ ప్రణయమో, ఒక కరుణాపూరిత వాక్యమో, ఒక పసివాని కంటి వెలుగో ఈ కథానాయకులకు సుఖదుఖాలకతీతమైన ఒక పరిపూర్ణ స్థితి కలుగుతుంది. జీవితం పైన ప్రేమ చిగురిస్తుంది. మృతనగరం సైతం పునర్జీవనం పొందుతుంది. ప్రపంచాన్ని క్షమిస్తుంది. బైరాగి వాగ్ఝరి మనల్నీ ఆ ‘జీవితపు రక్తోజ్జ్వల ముక్తి క్షణం’ లోకి వడిగా బలవంతంగా తీసుకువెళుతుంది.

ఈ కథలన్నిటిలో కనిపించే అంతస్సూత్రం – పాప పోయింది నవల ముందు మాటలో ఆవుల సాంబశివరావుగారు చెప్పినట్లు – పునరుజ్జీవనం పై బైరాగికి కల నమ్మకం. ఆ నవల చివర్లో బైరాగి చెప్పిన మాటలు ఈ కథలకు కొనసాగింపుగా అనుకోవచ్చు. “జీవితచక్రం సుఖదుఃఖాల, ఆశానిరాశల, ఏషణల, వాసనల ఆకులతో జనన మరణాలనేమి చుట్టూ అనితరంగా, అనంతంగా పరిభ్రమిస్తూ ఉంటుంది. రక్తాశ్రుపిచ్ఛలమైన మార్గాన మానవుడు తనను తాను మించి, అధిగమించిపోతూ ఉంటాడు”. పునరుజ్జీవనాన్ని “నమ్మినాతడు, చనిపోయినప్పటికీ మళ్ళీ జీవిస్తాడు. … ఎన్నటికీ చనిపోడు”.

బైరాగి ఆశావాదం, ప్రతీకాత్మకత స్పష్టంగా కనిపించే కథ బీజాక్షరి. కథ ప్రారంభం విలక్షణంగా ఉంటుంది. తాను తెలుసుకున్న జీవితసత్యాన్ని పదిమందికీ ఒక కథ ద్వారా తెలియచేద్దామనుకుని కూర్చున్న ఆ అబ్బాయి మొదటి వాక్యం దాటి ముందుకు వెళ్ళలేడు. అలా ఇబ్బంది పడుతుండగా తన గదిలోకి వచ్చిన ఒక చిన్నపిల్లవాడి చేతి మీద జీవిత రహస్యం తెలిపే రెండు అక్షరాలు వ్రాసి అతను తన హృదయభారం దించుకొంటాడు. ఆ రెండు అక్షరాలు – ‘ఆశ’. ఈ కథ చాలావరకూ ప్రథమ పురుషలో ఉంది మధ్యలో కొన్నిసార్లు ఉత్తమ పురుషలోకి ఎందుకు మారిందో అర్థం కాలేదు.

ఈ సంపుటిలో మొదటి కథ దివ్యభవనం. ఈ దివ్యభవనం దేనికి ప్రతీక అన్నది మొదట్లో అస్పష్టంగా ఉన్నా, నెమ్మదిగా విశదమౌతుంది. దివ్యభవనంలోకి వెళ్ళినవారు బయటవారికి కనిపించకుండా ఏమీ దాచుకోలేరు. అందులో నివసించడానికి అంతటి మూల్యం అవసరమా అన్న ప్రశ్నను రేపుతుంది ఈ కథ.

నాగమణి ఇంకోవిధమైన ప్రతీకాత్మక కథ. ఒక లబ్ధప్రతిష్టుడైన రచయిత తుపానులో సముద్రప్రమాదంలో మరణించడం గురించిన కథ. జీవన విరామసంధ్యలో ఉన్న ఆ రచయిత జడపదార్ధాలలోనూ జీవాన్ని చూడగలడు. మద్యం ఆయనకు జీవితంలో మిగిలిన వినోదసాధనం. ప్రేమలేని జీవితం లేదని చెప్పే ఆయన తన ప్రేమ విషయాన్ని, కథకుడు అడిగినా కూడా, చెప్పడు. జానపద కథల్లో నాయకుడు మహాసర్పం తలపై ఉండే అద్భుతశక్తులు ఉన్న మణి కోసం కష్టపడి వెదుకుతున్నట్టుగానే, ప్రతి మనిషికీ అటువంటి ఎప్పటికీ లభించని ఒక నాగమణికై వెతుకులాటే జీవితలక్ష్యం అని ఆయన అభిప్రాయం. అలాంటి నాగమణి ఆయన జీవితంలోనూ ఉంది. ఆ నాగమణికి ఆయనకూ ఉన్న సంబంధం గురించి ఈ కథ.

దరబాను ఒక ప్రేమ కథ. స్వంతదేశం నుంచి వలస వచ్చి పరాయిదేశం మద్రాసులో ఒంటరిజీవితం గడుపుతున్న ఒక గూర్ఖా హృదయంలో చిగిర్చి వడలిపోయిన ప్రేమ కథ. వలసజీవితంలోని అనామీకరణను హృద్యంగా చిత్రించిన కథ ఇది.

స్వప్నసీమ ఇంకోరకం ప్రేమకథ. దైనందిన జీవితంలో అలసి సొలసి విసిగిన వ్యక్తికి అనుకోకుండా ఆ సాయంత్రం ఒక రాజకుమారితో సన్నిహితంగా విహరించే అవకాశం కలుగుతుంది. ఆ సాన్నిహిత్యాన్ని కొనసాగించటానికి ఆ రాజకుమారి ఉత్సాహం చూపిస్తుంది కానీ అతను సమ్మతించడు. ఆ అనుభూతిని ఒక సుందరస్వప్నంగా మిగుల్చుకుంటాడు. (మద్రాసులో మిలిటరీ టేటూలు ఉండేవని ఈ కథలో నేను మొదటిసారి చదివాను. అదేమిటంటారా – గూగులమ్మను అడగండి).

కన్నతల్లి కథలో భర్తతో విడిపోయి తన పిల్లవాడిని ప్రయోజకుడిగా పెంచుకొన్న ఒక స్త్రీ ఆ కొడుకు తనను వదలి తండ్రితో చేరిపోతే పొందిన వ్యధను చిత్రిస్తుంది. కిమాని ఇంకో రకం ప్రేమకథ -– ఒక నావికుడు సముద్రప్రమాదంలో మూలజనులుండే ఒక దీవిలో తేలుతాడు. అతన్ని రక్షించిన వ్యక్తి ప్రేమ విషాదాంతమవటానికి కారణమౌతాడు. ఒక కట్టు కథ (దివ్యభవనం సంకలనంలో లేదు కానీ, కథానిలయంలో దొరికింది. 1979లో బైరాగి మరణం తర్వాత యువ పత్రికలో ప్రచురింపబడింది; పునర్ముద్రణ అని నా నమ్మకం) రాజుల కాలం నాటి ఒక విఫల ప్రేమకథ. ఈ మూడుకథలకూ చదివించే గుణం ఉన్నా వస్తురీత్యా పేలవమైన కథలు.

తండ్రి-కొడుకు కథలో కూడా వస్తువు బలమైనది కాదు కాని కథానాయకుని పాత్ర చిత్రణ బాగుంది. కానీ ఇది గాలివానతో సరితూగగల కథ కాదు.

ఇంతకుముందే చెప్పినట్టుగా బైరాగి కథ చెప్పే తీరు విలక్షణంగా ఉంటుంది. ఎత్తుగడ ఎటు దారి తీస్తుందో చెప్పలేము. కథాలోకంలోకి, నాయకుడి మనసులోకి మనల్ని తొందరగా తీసుకువెళతాడు. చిన్న చిన్న వాక్యాలతో కథ వడిగా నడుస్తుంది. కీలక సన్నివేశాలలో అతని అద్భుత పదవిన్యాసం మనల్ని మైకంలా కమ్మేస్తుంది. కొన్నిచోట్ల చైతన్యస్రవంతి స్ఫూర్తి కనిపిస్తుంది. టి.ఎస్.ఎలియట్ తరచుగానే కనిపిస్తాడు. అక్కడక్కడా శ్రీశ్రీ కూడా.

మచ్చుకు కొన్ని వాక్యాలు:

“అతడొక పిల్ల రచయిత, చాలారోజుల వరకు ఆ మహాసాగరపుటంచుల్ని పట్టుకుని నురగలాగా వేళ్ళాడాడు.” — దివ్యభవనం

“అనేక విషయాల మీదనుంచి తప్పించుకొని వాడి మనస్సు ఒకే విషయం మీద పరిగెత్తుతోంది. కాని ఆ ఒక్క విషయమూ వాడు మాట్లాడలేనిది.” — దరబాను

“వాయొలిన్ మ్రోగుతున్నది. లోపలినుంచి, బయట నుంచి, అటునుంచి, అన్నివైపుల నుంచి. ఆత్మనీ దేహాన్నీ కబళించి సౌందర్యపు అదృశ్యాస్పృశ్య జ్వాలాకీలల్లో బ్రహ్మాండాన్ని చుట్టుముట్టిన మహోత్తుంగ స్వరతరంగాలు. ఎక్కడున్నావు ప్రేయసీ! … నీవిప్పుడు నాలో ఉన్నావు. నేను తుపానులో ఉన్నాను. తుపాను మన అందరిలో ఉంది. అందరం ఎక్కడా లేము. దేశ కాలావధులు దాటి నిరాధారంగా, విచారంగా, దూరంగా పోతున్నాం … ఎక్కడికో? ఎక్కడికి వెళ్తున్నాం మనం ప్రేయసీ! మహీయసీ!” — ఒక గంట జీవితం.

“నేను మగతగా కూర్చొని ఉన్నాను. కాని ఆ మగత నిదురమగత కాదు. అది మెలుకువకు పదునుపెట్టే మగత. అకస్మాత్తుగా జనసమూహంలోనో లేక నిర్జనమైన ఎడారిలోనో నీకేదో మహత్తరమైన విషయం జ్ఞాపకం వచ్చినట్లుగా, చీకటిలో పట్టపగలై పోయినట్టుగా, ఇంతవరకూ దాక్కొని ఉన్న ఒక క్రొత్త ఆనందాన్ని కనుక్కొన్నట్టుగా, ఏదో ఒక మంత్రానికి అర్థం తెలిసినట్టుగా అదోరకమైన మగత అది. నీకు బాగా దప్పికవేసి, ఇకముందు అడుగు పడని వేళలో నీకు రాయిక్రిందనుంచి పారుతున్న స్వచ్ఛమైన సెలయేరు కనిపించినట్లుగా ఉంటుంది.” — స్వప్నసీమ.

“జాలిగల సంగీతం, ప్రణయ ప్రభంజనంలో ప్రపంచ పర్వతాగ్రంపై పసిపాపల పకపకలు. ఆటంబాంబుల సన్నజాజులు. అగ్నిపర్వతాల రోజాపూలు. ఈ భూమి చంటిబిడ్డ తూగుటుయ్యెల, యువకుని పల్లకీ, ముసలివాని తెల్లని పక్క, వెంబడిస్తున్న స్వప్నంలోని సత్యం. అహో, జీవితపు రక్తోజ్వల ముక్తి క్షణమా!” — (జేబుదొంగ).

బైరాగి కథలన్నీ ఒక్కస్థాయిలో లేవు. కొన్ని కథల్లో వస్తువు, వాతావరణ చిత్రణ, మానసిక విశ్లేషణ బలంగా ఉన్నాయి. కొన్ని కథలు పేలవంగా ఉన్నాయి. అన్ని కథల్లోనూ కనిపించే కవితాత్మకమైన వచన ఝరి బైరాగి అభిమానుల్నే కాక అందర్నీ ఆనందపరుస్తుంది. ఈ ఒక్కకారణం చాలు బైరాగి కథల్ని చదవడానికి, గుర్తుంచుకోవడానికి.


జంపాల చౌదరి

రచయిత జంపాల చౌదరి గురించి:

డా. జంపాల చౌదరి వృత్తిరీత్యా మానసిక విద్యానిపుణులు. తెలుగు, సాహిత్యం, కళలు, సినిమాలు అంటే అభిమానం. తెలుగు సాహిత్య చర్చల్లో ఉత్సాహంగా పాల్గొంటుంటారు. తానా పత్రిక, తెలుగు నాడి పత్రికలకు, మూడు తానా సమావేశపు సావెనీర్లకు, రెండు దశాబ్దాలు, కథ-నేపథ్యం కథాసంపుటాలకు సంపాదకత్వం వహించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)కు అధ్యక్షుడిగా పనిచేశారు. గత మూడున్నర దశాబ్దాలుగా తానా సంఘం, తానా ప్రచురణలు తెలుగు భాషకు, సాహిత్యానికి చేస్తున్న అనేక సేవల వెనుక ప్రధానపాత్ర వహిస్తున్నారు.

 ...