ఆలూరి బైరాగికవి

సాహిత్య సముద్రంలోకి అనేక దిక్కులనుంచి నదులు వచ్చి చేరుతాయి. దాని విజృంభణకు సూర్య చంద్రులూ, వాయువూ, ఇతర భూతాలలాగా అనేక శక్తులు తోడ్పడతాయి. జీవితం అనేక రంగాలతో కూడుకున్నది. ప్రతి రంగం నుంచీ సాహితీపరులు రావటం మనకు తెలుసు. రచయితల రచనల వాతావరణంలో పెరిగి, సాహిత్యపు గాలులు పీల్చినవారు సాహితీపరులు కావటంలో ఏమంత వింతలేదు. కానీ సంస్కరణాభిలాషులూ, రాజకీయ వాదులూ, వైద్యులూ, లాయర్లూ, ఒక్కొక్కసారి నటులూ, కార్మిక రంగంలో పనిచేసేవారూ మొదలైనవారిని వారికి సన్నిహితంగా గల జీవితం రచనలకు పురికొల్పుతుంది. వారు తమ వృత్తి జీవితాల నుంచి జీవిత సత్యాలను తెలుసుకుంటారు. అలాంటి వారికి రచన చేసే ఉత్సాహమూ, శక్తి తోడయ్యేసరికి సాహిత్యం పుట్టుకొస్తుంది. ఇలాంటి ప్రేరణ ఏదీ లేకుండా బతుకుతెరువు కోసం సాహిత్యరచన చేసి, “కమర్షియల్” సాహితీపరులు అయ్యే అవకాశం ఇప్పుడిప్పుడు కలుగుతున్నదేమోగాని లోగడ లేదు.

బైరాగి నాకు దగ్గరయినది చక్రపాణిగారి ద్వారా. నేను మొదట చూసినప్పుడు బైరాగి “టీనేజర్.” ఆయన రచయితల వెంట తిరుగుతున్నట్టు తెలిసింది, కానీ అప్పటికే కవిత్వం రాసే ధోరణి ఉన్నట్టు నాకు చక్రపాణిగారు చెప్పేదాకా తెలియదు.

నా ఉద్దేశంలో అచ్చంగా సాహిత్యసంప్రదాయం ప్రేరేపించి కవులూ, కథకులూ అయినవారికన్నా, జీవితాన్ని విశ్లేషించే సాధనం ఏదో ఒకటి — రాజకీయ సిద్ధాంతమో, మనోవిజ్ఞానమో, న్యాయ జ్ఞానమో, గాఢమైన జీవితానుభవమో — కొలబద్దగా పెట్టుకొని తమ కళ్ళెదుట ఉన్న జీవితానికి భాష్యం చెప్పే రచనలు చేయగలవారు సార్థకమైన రచనలు చేస్తారు, వాటితో పాఠక లోకంలో ఒక భాగాన్ని కదిలిస్తారు.

బైరాగి జీవితాన్ని విశ్లేషించటానికి తోడ్పడిన ప్రధానాయుధం “రాయిజం (Roy-ism)” అనుకుంటాను. దాని సహాయంతో బైరాగి కవి తన భావాలను ఆవిష్కరించుకునే శిల్ప సంపదను తెలుగు, హిందీ కవితల నుంచి నేర్చుకుని, వాటిని అలాగే కాపీ చెయ్యకుండా, సొంత బాణీ ఒకటి సృష్టించుకుని, తన కవితలతో పాఠకులలో చైతన్యం కలిగించగలిగాడని నేను అర్థంచేసుకున్నాను.

మంచి రచనకు కొన్ని ప్రమాణాలున్నాయి. ప్రతి రచనకూ ఒక లక్ష్యం ఉంటుంది. అది ఎంత సూక్ష్మమైనదైతే దాని గురి అంత నిర్దుష్టంగా ఉండాలి. వెనకటికి ఒక వేటగాణ్ని, “ఆ పక్షి కంటిని కొట్టగలవా?” అంటే, “కుడి కన్నా, ఎడమ కన్నా?” అని అడిగాడు! రచయితకు కూడా “గురి” ఉండాలి. అది ఎంత బాగా ఉంటే, రచన యొక్క ప్రభావం పాఠకుడిమీద అంత బలంగా ఉంటుంది.

గొప్ప రచనలకు మరొక లక్షణం ప్రజలలో సాహిత్యాభిలాషను విస్తరించగలగటం. దాదాపు అర్ధ శతాబ్దం క్రితం కపిలవాయి రామనాథశాస్త్రి గ్రామఫోను రికార్డులిస్తే ఎన్నడూ పాటలు వినడానికి ఉత్సాహపడనివాళ్ళు గ్రామఫోన్లు కొన్నారు. దేవులపల్లివారూ, శ్రీశ్రీ, ఆరుద్ర లాంటివారు, ఎన్నడూ పద్యాలను లక్ష్యపెట్టని వారిలో పద్య పఠనాసక్తి కలిగించారు. ఇంకా పూర్వం తిరుపతి వేంకట కవులు దాదాపు ప్రతి విద్యార్థిచేతా కవిత్వం రాయించారని చెబుతారు!

బైరాగి కవితలద్వారా కవిత్వ శక్తిని గ్రహించినవారు ఉన్నారని నాకు తెలుసు.

నాకు తెలిసినంతవరకు బైరాగికిగల సామాజిక విశ్వాసాలు — నా దృష్టిలో నిర్దిష్టం కానట్టు కనబడినా — చాలా స్పష్టంగా, అయోమయమూ, పులమడమూ అనేవి లేకుండా ఉండేవి. ఆ విశ్వాసాలు కాలగమనంతో, బైరాగి జీవితానుభవంతో, మారటంకూడా నాకు తెలుసు. ఏ దశలోనైనా బైరాగి సామాజిక భావాలు స్ఫటికంలాగా విస్పష్టంగానూ, నిర్మలంగానూ ఉండేవి. అందుచేత అతని కవితలు చదివి ఆనందించటానికి అతని భావాలతో ఏకీభవించనవసరం లేకపోయేది. ఇది కవిలో చాలా అపూర్వమైన గుణం అనుకుంటాను. కొందరు ప్రయోజనాత్మకమైన రచనలు ఘాటుగానే చేస్తారు. అయితే ఆ ప్రయోజనంతో ఏకీభవించనివారిచేత తమ రచనను చదివించలేరు. అలా చదివించగలిగిన ఆధునిక తెలుగు కవులను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఆ వేళ్ళలో ఒకటి నిస్సందేహంగా బైరాగిది!

ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక – 1979