త్వరలోనే అతను గవర్నరుగారి పార్టీకి హాజరయ్యాడు. ఇందుకు తయారుకావడానికి అతనికి రెండు గంటలకన్నా ఎక్కువకాలం పట్టింది, ఈ సారి అతను మామూలు కన్న ఎక్కువ శ్రద్ధగా ముస్తాబయ్యాడు. భోజనానంతరం చిన్న కునుకు తీసి లేచి సబ్బూ, నీరూ కావాలన్నాడు. తన బుగ్గలను నాలుకతో లోపలి నుంచి పైకి తోస్తూ చాలాసేపు సబ్బువేసి రుద్దాడు; తరువాత వెయిటర్ భుజంమీదనుంచి తువాలు తీసుకుని, వాడి ముఖాన రెండుసార్లు గట్టిగా గాలి వదలి, చెవుల వెనుక ప్రారంభించి తన మొహాన్ని అన్ని వైపులకూ తుడుచుకున్నాడు; తరువాత అద్దంముందు నిలబడి రొమ్ము మీద షర్టు అమర్చుకుని, ముక్కులోనుండి బయటికి వచ్చే రెండు వెంట్రుకలను పీకేసి, ఎర్రరంగు డ్రెస్ కోటు, పొట్టిది ధరించాడు.
ఇలా ముస్తాబై అతను బండీలో ఎక్కి బయలుదేరాడు. వీథులు అతి వెడల్పుగా ఉన్నాయి. అక్కడక్కడా కిటికీలలో నుండి వచ్చే వెలుగు తప్ప రోడ్లపైన వెలుగు లేదు. గవర్నర్ గారి భవనం దేదీప్యమానంగా ఉన్నది. వెలిగించిన దీపాలతో ఎన్నో బళ్ళు వచ్చి వున్నాయి. వాకిట ఇద్దరు పోలీసులు గుర్రాలెక్కి ఉన్నారు, దూరాన కాసా వాళ్ళు కేకలు పెడుతున్నారు – ఇంతెందుకు, సమస్తమూ ఉండవలసిన తీరుగా ఉన్నది.
గదిలో ప్రవేశిస్తూనే చిచికవ్ కళ్ళు చిట్లించాడు. కొవ్వొత్తులు, దీపాలు, ఆడవాళ్ళ దుస్తులు కళ్ళు మిరిమిట్లు గొలిపాయి. ఆ ప్రదేశమంతా కాంతిమయంగా ఉన్నది. ఒకటొకటిగానూ, గుంపులు గుంపులుగానూ నల్లకోట్లు తచ్చాడుతున్నాయి. వేసవి రోజున ఇల్లు చూసుకునే ఆమె కిటికీ దగ్గర నిలబడి చక్కెరగడ్డ పగులగొట్టి, తళతళలాడే ముక్కలు చేసినప్పుడు ఈగలు దానిపైన ఇలాగే తచ్చాడుతాయి; పిల్లలు ఆవిడ చుట్టూ చేరి ఆమె తన మొరటు చేతులతో సుత్తె ఎత్తి గడ్డను పగులగొట్టటం చూస్తుంటే, ఈగల మందలు మందలుగా, ఇల్లు తందే నన్నట్లు ఎగురుతూ వచ్చి చక్కెర ముక్కర పైన వాలుతాయి; ఆమెకు అసలే చత్వారం, అందులోనూ ఎండకు కళ్ళు సగం మూసేస్తుంది, ఈగలు అది ఆసరా చేసుకుంటాయి; అవి కొన్ని చోట్ల విడివిడిగానూ, కొన్ని చోట్ల గుంపుగానూ చేరి, తినటం కంటే ఆత్మప్రదర్శనం ప్రధానంగా పెట్టుకుని చక్కెర మీద అటూ ఇటూ పచార్లు చేస్తూ, మధ్య మధ్య తమ వెనుక కాళ్ళను గాని, ముందు కాళ్ళనుగాని ఒకదానికొకటి పెట్టి రుద్దుకుంటాయి, లేదా ముందుకాళ్ళు చాచి తల అంతా తుడుచుకుంటాయి, అలా బయటికి ఎగిరిపోయినట్టు పోయి, ఇంకా అధిక సంఖ్యలో మళ్ళీ లోపలికి ఎగురుతూ వస్తాయి.
చిచీకవ్ చుట్టూ కలయ చూసే లోపునే గవర్నరుగారు వచ్చి చెయ్యి పట్టుకు తీసుకుపోయి తన భార్యకు పరిచయం చేశాడు. ఆగంతకుడు కలవరపడక, తన వయస్సుకూ అంత గొప్పదీ, అంత తక్కువదీ గాని తన హోదాకూ తగిన విధంగా ఆమెతో ప్రియవచనాలాడాడు.
డాన్సు చేయబోయే జంటలు తమతమ స్థానాలు ఆక్రమించుకొనేసరికి మిగిలిన వాళ్ళు గోడలకేసి ఒత్తుకోవలసి వచ్చింది. అతను చేతులు వెనక్కి పెట్టుకొని ఆ జంటలకేసి రెండు, మూడు నిమిషాలపాటు తదేక దీక్షగా చూశాడు. యువతులలో చాలామంది బాగున్నారు, ఫాషన్ గా డ్రెస్ చేసుకున్నారు. ఇతరులు ఈ మారుమూల బస్తీలో దైవికంగా ఎలాటి దుస్తులు దొరికితే అవే ధరించారు. అన్నిచోట్లలాగే ఇక్కడి మగవాళ్ళలో కూడా రెండు రకాలు: మొదటి రకం, బక్కపలుచగా వుండి ఆడవాళ్ళను పట్టుకు వేళాడే వాళ్ళు; వీరిలో కొందరు అచ్చు పీటర్స్‌బర్గ్ రాజధాని పౌరుల్లాగే ఉన్నారు, వారిలాగే ఎంతో శ్రద్ధాసక్తులతో దువ్విన పుస్తీలు ధరించారు, లేదా నున్నగా క్షౌరం చేసిన చూడముచ్చటైన కోలమొహాలు కలిగి ఉన్నారు; వీరు ఆడవారి పక్కనే ఆసీనులై, ఫ్రెంచీ భాష మాట్లాడుతూ, పీటర్స్‌బర్గ్ వారిలాగే స్త్రీలను వినోదపరిచారు.
రెండవ రకం వాళ్ళు లావుగానూ, చిచికవ్ లాగే అట్టే లావు, అట్టే సన్నగా ఉండకుండా ఉన్నారు. వీరు మటుకు స్త్రీలను కోరచూపులు చూసారే గానీ వారి చాయలకు రాలేదు. వారి దృష్టి అంతా, గవర్నర్ గారి నౌకర్లు చీట్లాడే బల్లసిద్ధం చేస్తున్నారా లేదా అని చుట్టూ కలియచూడటంలో నిమగ్నమై వుంది. వారి మొహాలు గుండ్రంగా, నిండుగా వున్నాయి. కొందరికి ఉలిపొర కాయలున్నాయి. కొంతమందికి స్ఫోటకం మచ్చలు కూడా ఉన్నాయి. వారు తమ జుట్టును పైకి లాగి ముడివెయ్యటంగాని, ఉంగరాలు తియ్యటంగాని చెయ్యక, అంటకత్తిరించడమో, అణచి దువ్వడమో చేశారు. వారి ముఖభాగాలు కూడా గుండ్రంగా నిండి ఉన్నాయి. వీరంతా నగరంలోని పెద్ద అధికారులు, లావుపాటి వాళ్ళు తాము వ్యవహారాలు చూసుకున్నంత బాగా పాపం సన్నవాళ్ళు చూసుకోలేరు. సన్నని వాళ్ళు ప్రత్యేకమైన పనులను వినియోగించడానికో అదనపు వ్యక్తులుగా పడిఉండడానికో పనికి వస్తారు, వారిని ఇక్కడికీ అక్కడికీ తోస్తూ ఉంటారు. వారి మనుగడే తేలికగా, గాలి వాగుగా వుండి పటుత్వం లేకుండా ఉంటుంది.
లావుపాటి వాళ్ళు పక్కదారులు పట్టక రాజమార్గానే వెళుతారు. వారెక్కడైనా తిష్ఠవేసినా వూతంగానూ నమ్మకంగానూ వేస్తారు. వారు కూచున్న ఆసనం విరిగితే విరుగుతుందేమో గాని వారు మాత్రం దానిని వదలరు. వారికి పటాటోపాలతో పని లేదు. వారి కోట్ల కత్తిరింపు సన్నవాళ్ళ కోట్ల కత్తిరింపు లాగా నాజూకుగా వుండదు, అయితే వాళ్ళకు బోలెడన్ని దుస్తులుంటాయి. సన్ననివాడు మూడేళ్ళలోపుగా తన కమతగాళ్ళందరినీ తాకట్టు పెట్టేస్తాడు. జాగ్రత్తగా పరిశీలించినట్టయితే లావుపాటి వాడికి ఊరిచివర భార్య పేర కొన్న ఇల్లొకటుంటుంది; మరికొన్నాళ్ళకి ఊరి రెండో చివర మరొక ఇల్లు కొంటాడు, తరువాత బస్తీకి దగ్గరగా ఒక చిన్న గ్రామం కొంటాడు, ఆ తరువాత సమస్త సౌకర్యాలు కలిగిన ఒక ఎస్టేటు కొనేస్తాడు. చిట్టచివరకు ఈ లావు మనిషి దేవుడి సేవా, జారు సేవా చేసి అందరి మన్ననలూ అందుకొని, పదవి విరమించి, ,ఎడంగా వెళ్ళిపోయి భూస్వామి అయి, సరదాగా అతిథి మర్యాదలలో మునిగితేలే రష్యను సంప్రదాయం పాటించి తండ్రి సంపాదించినదంతా అలాములూ, పలాములూ చేస్తారు. అక్కడ చేరిన వారిని పరీక్షిస్తున్నంత సేపూ చిచీకవ్ కు కలిగిన ఆలోచనలివే.
అతను చివరకు లావుపాటివాళ్ళ మధ్యకు చేరుకున్నాడు. అతనికి తెలిసిన వారందరూ వారిలోనే వున్నారు: నల్లగా దట్టంగా వున్న కనుబొమలుగల పబ్లిక్ ప్రాసిక్యూటరున్నడు. “నీకో సంగతి చెప్పాలి, అలా అవతలి గదిలోకి రావోయ్” అన్నట్టుగా ఎడమ కన్ను కొద్దిగా చికిలించే అలవాటున్నది ఆయనకు, కాని ఆయన స్వభావం గంభీరమైనది, మితభాషి; పోస్టుమాస్టరున్నాడు, ఆయన చమత్కారి, తాత్విక దృష్టి కలవాడు; న్యాయ స్థానాధ్యక్షుడు, సూక్ష్మదృష్టి గలవాడు, మర్యాదస్తుడు – అందరూ చిచీకవ్ పాత స్నేహితుడిలా పలకరించారు, అతను కూడా వారు చేసిన మర్యాదలకు జవాబుగా తలవంచాడు. కొంచెంగా ఒక పక్కకు వంచితేనేం గనక తరువాత అతను మానిలవ్ అనే మర్యాదస్తుడైన భూస్వామి తోనూ, సబాకివిచ్ అనే కంగారు మనిషితోనూ పరిచయం చేసుకున్నాడు. ఈ కంగారు మనిషి ఆదిలోనే అతని కాలు తొక్కి “క్షమించాలి”, అన్నాడు. తరువాత ఒకే పేకముక్క తీసుకోమన్నాడు. అతను దాన్ని తలవంచి స్వీకరించాడు. వారు ఒక ఆకుపచ్చని బల్ల వద్ద ఆటకు కూచుని భోజనాలదాకా లేవనేలేదు; అతి ముఖ్యమైన పనికి ఉపక్రమించేవారిలాగా వారు సంభాషణ్ కట్టిపెట్టివేశారు.
పోస్ట్ మాస్టర్ కబుర్లరాయడే అయినా తన ముక్కలు చేతిలోకి తీసుకోగానే ఆయన మొహం ఆలోచనా నిమగ్నమైపోయింది. ఆయన పై పెదవి కింది పెదవి మీదికి వాలి ఆయన ఆడుతున్నంత సేపు అలానే వుండిపోయింది. ఆయన బొమ్మ ముక్కలు వేసినప్పుడళ్ళ చేత్తో బల్లనుబాదుతూ, రాణిని వేస్తే “పోవే పూజారి పెళ్ళామా” అనీ, రాజును వేస్తే, “పోరా తంబోవు రైతూ!” అనేవాడు. అధ్యక్షుడేమో “వాడి పుస్తీలు పీకేస్తా, వాడి పుస్తీలు పీకేస్తా” అనేవాడు, ముక్కలను బల్లకేసి కొట్టేసినప్పుడు, ” ఏమయితే అయ్యింది, డైమను ఆడక తప్పేది లేదు!” ఇత్యాది వ్యాఖ్యానాలు కూడా నడిచేవి. కొందరు రంగులకు ముద్దుపేర్లు కూడా పెట్టుకొనే వారు. ఆట అయిపోయినప్పుడల్లా మామూలుకు భిన్నంలేకుండా తగువు జరిగేది. కథానాయకుడు కూడా విమర్శించేవాడు, కానీ ఎంతో చాకచక్యంగా తను చేసేది విమర్శ కాదని అవతల వాళ్ళకు అనిపించేలా మాట్లాడేవాడు. ” మీరు దిగి వచ్చారు” అనడానికి బదులుగా “తమరి వద్ద వరుస ప్రారంభమయింది. తమరు వేసిన రెండు పైన వేసేందుకు నా దగ్గర పెద్ద ముక్క ఉండిపోయింది” – ఈ ధోరణిలో మాట్లాడేవాడు. తన ప్రత్యర్థులను మంచి చేసుకోవటానికి అతను వారికి తన వెండి నస్యండబ్బీ అందిస్తూ వచ్చాడు. దాని అడుగున రెండు సువాసనా పుష్పాలుండటం గమనించారు. ఇంతకు ముందు చెప్పిన మానిలవ్, సబాకివిచ్ అనే భూస్వాములు అతన్ని ప్రత్యేకంగా ఆకర్షించారు. అతను ఆలస్యం చెయ్యకుండా అధ్యక్షుణ్ణీ, పోస్టుమాస్టరునూ ఎడంగా పిలిచి వాళ్ళను గురించి వాకబు చేశాడు. అతని ప్రశ్నలలో కేవలం జ్ఞానతృష్ణ మాత్రమే గాక ఇంగిత జ్ఞానం కూడా వ్యక్తమయ్యింది. ఎలాగంటే అతన ముందుగా వారికింద ఎంతెతమంది కమతగాళ్ళున్నారో, వారి భూములు ఎలటివో విచారించి, వారి పేర్లు వారి తండ్రుల పేర్లు ఆ తరువాత విచారించాడు. తరువాత కొద్ది సేపట్లోనే అతను వారి సద్భావాన్ని కూడా సంపాదించాడు. మానిలవ్ అతన్ని చూసి చాల ముచ్చట పడ్డాడు; చిచీకవ్ దయచేసి తమ గ్రామానికి తన అతిథిగా రావాలనీ, నగర ద్వారం నుంచి పది మైళ్ళు మాత్రమే ఉంటుదనీ అన్నాడు. దానికి చిచికవ్ తల వంచి, ఆయన చెయ్యి నొక్కి ఆలా చెయ్యటం తన అభిలాష మాత్రమే గాక తన విధిగా కూడా భావిస్తున్నాను అని చెప్పాడు. సబాచివ్ సంగ్రహంగా “నేనుకూడా అలగే ఆహ్వానిస్తున్నాను” అన్నాడు.
ఏతావాతా ఈ విందు భోజనం తరువాత అతను ఇంటివద్ద ఒక్క గంటకూడా గడుపవలసిన అగత్యం అతనికి కలుగలేదు. కేవలం నిద్ర పోవడానికి మాత్రమే అతను హోటలుకు తిరిగి వెళ్ళాడు. అతను ఏ సందర్భంలోనూ కొంచెం కూడా తడబాటు లేకుండా తన లౌకిక పరిజ్ఞానం ప్రదర్శించుకొనే వాడు. మెచ్చుకోదగిన సంగతేమిటంటే ఇవన్నీ మాట్లాడటంలో అతను ఎలాటి ఆర్భాటమూ లేక, ఎలా ప్రవర్తించాలో తనకు తెలుసునని రుజువు చేసుకున్నాడు. గొంతు ఎత్తడం కానీ గొణగడం కానీ లేకుండా ఎలా మాట్లాడాలో అలా మాట్లాడే వాడు. ఏ విధంగా చూసినా అతను నిఖార్సైన పెద్దమనిషి అని స్పష్టమైంది. అతని రాకను ప్రభుత్వాధికారులందరూ హర్షించారు. అతను పూర్తిగా నమ్మదగిన మనిషి అని గవర్నరు ఎన్నిక చేశాడు; దక్షత గలవాడని పబ్లిక్ ప్రాసిక్యూటరు అన్నాడు; మంచి సంస్కృతిగల వాడని స్పెషల్ పోలీస్ అధికారి చెప్పాడు; బాగా తెలివైన వాడు, గణనీయుడూ అని న్యాయస్థానాధ్యక్షుడన్నాడు; స్నేహపాత్రుడని పోలీస్ అధిపతి అన్నాడు. సబాకివిచ్ ఒకంతట ఎవరినీ మెచ్చుకునే ఘటం కాదు, అటువంటి వాడు సయితం బాగా పొద్దు పోయి బస్తీ నుంచి తిరిగివచ్చి ఎముకల గూడు లాటి తన భార్య ప్రక్కన పడుకుంటూ, “సాయంకాలం గవర్నరుగారింటికి వెళ్ళి, పోలీసు అధిపతి ఇంట భోంచేశానే, అక్కడ పావెల్ ఇవానోవిచ్ చిచీకవ్ అనే ఆయనను పరిచయం చేసుకున్నాను, భలేవాడు!” అన్నాడు. ఆయన భార్య “హుఁ,” అని భర్తను కాలితో తన్నింది.
ఈ పట్నానికి వచ్చిన ఆగంతకుణ్ణి గురించి నలుగురికీ ఇంత ఘనమైన అభిప్రాయం ఏర్పడింది. అతను తన వింత వ్యాపకంతో ఒక సంఘటన కల్పించినదాకా ఈ అభిప్రాయం మారలేదు. ఆ తరువాత నగరమంతా విస్తుపోయింది. ఈ సంఘటనలు ముందు ముందు మనకే తెలుస్తాయి.