దాదాపు పాతికేళ్ళ క్రితం.
నా మనస్సు చాలా ఉల్లాసంగా ఉండేది ఆ రోజులలో. నా కూతురు వెళ్ళిపోలేదు. పద్మరాజు మా ఇంట్లోనే కాపురం అప్పుడు.
నా కాటూరి బావ, శివశంకరులు అందరూ నన్ను వదలలేక నాతోనే ఉండేవారు, త్యాగరాజనగరం హబీబుల్లా రోడ్డులో సిమ్లా హౌసులో.
సిమ్లా హౌసు చాలా పెద్దది.
తెరిచి ఉన్న ఏ కిటికీలోనుంచో చల్లగాలి కెరటాలు వస్తూ – ప్రతి గాలి కెరటం మా కవి మిత్రులతో కలిసి ఏదో మాట్లాడేది. ఒకనాడు మాకు గాని, ఆ గాలులకు గాని తెలియకుండానే మరొక వింత గాలికెరటం చల్లగా లోపలికి పాతస్నేహితుడిలాగ వచ్చింది.
ఆ రావడం కూడా భోజనాల గదిలోకే, నేరుగా. అక్కడ సొంత ఇంట్లో లాగ కూర్చుని, “ఊఁ” అంది, పోనీ, అన్నాడు. “వడ్డించండి” అన్నట్లు! మాతో హాయిగా కబుర్లు చెప్తూ భోజనం చేశాడు.
అక్కడ ఉన్న మిత్రులందరూ పరమాప్తులు చిరకాలంనుంచీ. అయినా అతిథులు.
ఈ వచ్చిన గాలి కెరటం – ఈయన ఇంట్లో వాడాయెను – బైరాగి.
బైరాగి గాలి కెరటమున్నూ, మనిషిన్నీ.
బైరాగి మనిషిన్నీ, బైరాగిన్నీ,
బైరాగి అరేబియావాని ఒంటెన్నూ,
ఒక అరబ్బువాడు ఒక డేరా వేసుకుని దానిలో కాపురమున్నాడు. గడ్డు వేసంగి వచ్చింది. పాపం! ఒకనాడు ఒక ఒంటె వచ్చింది డేరా వద్దకు. మూతితో డేరా వాకిలి కదిపింది. వాడు ఇవతలికి వచ్చి, “ఏం? ఎందుకు?” అన్నాడు.
నా మూతి లోపలికి చొరనిమ్మంది.
“ఊఁ ” అన్నాడు.
మెల్లగా మెడ, ఆ వెనుక ముందుకాళ్ళు, తరువాత పూర్తిగా లోపలికి వచ్చేసింది.
వచ్చి, ఆ ఒంటె ఏమందీ – “నాకు ఇరుగ్గా ఉంది. నీవు బయటికి వెడతావా” అని.
బైరాగి అరేబియావాని ఒంటె. మన హృదయంలో మూతి పెట్టడంతో ప్రారంభించి, మనిషంతా దూరిపోయి నిండిపోతాడు – మనలో నుంచి మనల్నే బయటికి తోపేసి – అంటే ‘తనతనం’ అంతా తోసేసి.
ఆ రోజుల్లో చందమామలో పడేవి చిన్నపిల్లల కోసం వ్రాసిన అతని గేయకథలు; నన్ను ఎంతో ఆకర్షించాయి మొదట.
అవి ఎంత సులభసుందరంగా ఉండేవో, అంత గడుసుగా ప్రౌఢంగా ఉండేవి.
రచన పిల్లలకోసం; రచయిత చాలా గడుసరి, ప్రౌఢుడూ అనిపించింది.
ఇవి వ్రాసినవాడు ఎవడా అని ఎవరినైనా అడిగానో ఏమో! ఒకనాడు చల్లగా వచ్చి కూర్చున్నాడు నా ఇంట్లో బైరాగి. అతగాడే వ్రాశాడు ఆ గేయకథల్ని.
అలాగే కాస్సేపు కూర్చుని వెళ్ళిపోయాడు.
తరువాత, మరునాటి నుంచే పూర్తిగా నావాడు. నా ఇంట్లోవాడూ అయిపోయాడు. ఒక్కొక్కప్పుడు తిన్నగా భోజనాల బల్ల వద్దకు మాట్లాడకుండా వచ్చి “ఊఁ” అనేవాడు. “వడ్డించండి” అన్నట్లు. భోజనం చేసి పేకాడేవాడు. చనిపోయిన నా కూతురు చిన్నపిల్ల – దానితో కూడా.
తరువాత, అతని కంటబడింది ఒకనాడు. ఎవరో నా పద్యానికి హిందీలో చేసిన అనువాదం. “ఛస్! బాగాలేదు. మీ కవిత అనువాదం చేయడం చాలా కష్టం” అని తల పంకించి ఆలోచించాడు. తాను గాని చేస్తాడా ఆ పని అని నాకు ఆశ కలిగేటట్టు.
ఆ రోజులలోనే అచ్చయి వెలువడి వచ్చిన (1955 కాబోలు) “నూతిలో గొంతుకలు” చదివాను.
మానవుడి సహజ వేదనలో మథనపడి పూర్ణత్వాన్ని దాదాపు కవిగా బైరాగి అందుకున్నాడా అనిపించింది.
అమ్మ! బైరాగీ! ఎంత గొప్పగా అన్నాడు కవిత్వ తత్వవేదీ, అచ్చమైన గొప్పకవీ అయిన బైరాగి.
“శబ్దాల అసమర్థత ప్రతి కవికీ ఏదో ఒక సందర్భంలో తట్టే ఉంటుంది. కవితా కామిని చేలాంచలాల కొస విసురులు ఎప్పుడూ ఒక బారెడు దూరానే మాయమైనట్లు అగుపిస్తాయి” అని.
బైరాగికి మాత్రం ఆ కొస విసురులు దూరాన మాయమైనట్లుగాక, దగ్గరగా వచ్చినప్పుడు అతనిని నిలువునా నిమిరి, అంతరంగాన్ని పలకరించేవి.
బైరాగి మన కవులు వ్రేళ్ళ మీద లెక్కపెట్టదగిన బహు కొద్దిమందిలో ఒకడు.
అప్పుడు నా ఇంట్లోకి వచ్చీపోయే చల్లగాలి కెరటంలానే, ఈ లోకమూ విడిచి వెళ్ళిపోయావా!
వస్తానుండు.
ఇంకా ఎందరిని గూర్చో, ఎన్ని సంగతులో నిర్మొగమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి.